Monday, July 27, 2026

Description of the Pit of Hell - నరకకూప వర్ణన

శ్రీ దేవీ భాగవతం నవమ స్కంధము - నరకకూప వర్ణన

నరకకూపాలగురించి ఆడిగావుకదూ! విను. ప్రతికుండమూ వర్తులాకారంలో పూర్ణచంద్రమండలం లాగా ఉంటుంది. లోతుగా ఉంటుంది. రకరకాల కఠినశిలలు గోడలకు తాపడం చేసి ఉంటాయి, ప్రళయందాకా శిధిలంకావు. ఈశ్వరుడు ఇచ్చామాత్రంగా విటిని సృష్టించాడు. పాతకులను క్లేశపెట్టడానికే ఇవి ఆవిర్భవించాయి. మండుతున్న అగ్నిగోళంలాగా పదిబారల మంటలతో క్రోశవిస్తీర్ణంగా ఉంటుంది వహ్నికుండం. పాపాత్ముల హాహాకారాలు వినిపిస్తుంటాయి. కానీ కంటికి మంటలు తప్ప ఏమీ కనిపించదు. యమదూతలు కావలి తిరుగుతూ మధ్యమధ్య పాపులను పొడుస్తూ విధినిర్వహణ చేన్తుంటారు. మరుగుతున్న నీళ్ళతో క్రూరజల జంతువులతో భీకర కాకారవాలతో క్రోశార్థ విస్తీర్ణమై తప్తక్షారోదకకుండం పాపిజన సంకులమై ఉంటుంది. త్రాహి త్రాహి అనే రోదనలూ మారుమోగుతుంటాయి.

యమకింకరులు నిర్దాక్షిణ్యంగా దండాలతో శూలాలతో పాడుస్తుంటారు. పైకి తేలినవాడినల్లా లోపలికి కుక్కుతుంటారు. క్రోశ వైశాల్యంగా రకరకాల విట్కుండాలు ఉన్నాయి. అన్నీ మలపిచ్చిలాలు. పురుగులు లుకలుకలాడుతుంటాయి. మహాపాతకులు వాటిలో పార్లుతూ మలభక్షణ చేస్తూ క్రిమిదష్టులై హాహాకారాలు చేస్తుంటారు. తపతపా కొట్టుకుంటుంటారు. రక్షమాం - రక్షమాం అనే అరుపులు గుండెలు పిండేస్తుంటాయి. కానీ మా దూతలకు జాలి అనేదే తెలియదు. అరిచినకొద్దీ పాడుస్తుంటారు.

శ్లేష్మకుండాలు శ్లేష్మ - శ్లేష్మకీటక పరిపుష్టాలు. క్రోశార్థ వైశాల్యంతో గరకుండం. గరకీటాలు కిటకిటలాడుతుంటాయి. వాటికోరలు వజ్రకఠినాలు. వాటి కన్నులు మలపూరితాలు. అవి కుడుతూంటే పాపాత్ములకు దుష్కర్మల ఫలం తెలిసివస్తుంది. ఇటువంటివే వసాకుండాలు. శుక్లకుండం వీటన్నింటికన్నా లోతులో కైవారంలో పెద్దది. శుక్ల - శుక్ల కీటక పరిపూర్ణం. రక్తవర్ణంలో ఉంటుంది. దుర్గంధభూయిష్ఠం. దీనికి పాపాత్ముల రద్దీ ఎక్కువ. వలవలా ఏడుస్తూ భరించలేక భగవంతుణ్ణి తలుచుకుంటూ ఉంటారు. దుష్కర్మఫలభోగం పూర్తి అయ్యేదాకా మా దూతలు ఊరుకోరు. బాదుతూనే ఉంటారు. గాత్రమలకూపం నాల్గింతలు పెద్దది. నిత్యం పాతకిసంకులంగా ఉంటుంది. మజ్జాకుండం ఇలాంటిదే. వీటిలో కన్యావిక్రయ మహాపాపిష్టులు పాహి పాహి నినాదాలు చేస్తుంటారు. పరుషభాషణులూ నిందాపరాయణులూ చాడీలకోర్లూ శికలు అనుభవించే కర్ణవిట్కూపాలు ఇంకా పెద్దవి. నఖాదికూపాలలో చీరుకుపోతున్న శరీరాలతో నెత్తురులోడుతూ హాహాకారాలు చేస్తూ పాపాత్ములు కనపడుతుంటారు. దీనంగా కన్నీరుకారుస్తూ రక్ష - రక్ష ఆని పెడబొబ్బలు పెడుతుంటారు. ప్రతప్త లోహకూపాలన్నీ గవ్యూతివిస్తీర్ణాలు. వాటిలో ప్రతప్తలోహ ప్రతిమలుంటాయి. పాపాత్ములు వాటిని కౌగిలించుకోవాలి. యమదూతలు తన్ని ఆ పని చేయిస్తుంటారు. చుర్రున కాలుతూంటే మలమల మాడిపోతారు. ఆయాలోహాలు కరిగి ద్రవరూపంలో ఎర్రగా జాలువారుతుంటాయి. ఆ చుక్కలు మీదపడుతుంటే హాహాకారాలు మిన్నుముడతాయి.

ధ్వాంతకుండం ద్విగవ్యూతి విస్తృతం. చర్మకుండ తప్తసురాకుండాలు కైవారంలో కొంచెం చిన్నవి. శాల్మలీకుండంనిండా వృక్షకంటకాలే. యమభటులు పాపులను పట్టి వీటిలోకి విసురుతుంటారు. ముళ్ళు గుచ్చుకుని ఆర్తనాదాలు ముల్లోకాలకీ వినిపిస్తాయి. దాహం దాహం అనే అరుపులు మంట మంట అనే అరుపులు అయ్యో అమ్మో కుయ్యో మొర్రోలు ఎటుచూసినా ఇవే మారుమ్రోగుతుంటాయి. కీటకాల ఆనందనృత్యాలూ కాకుల కోలాహలాలూ సర్పజాతుల హిస్సాకారాలు క్రూరజంతువుల భీషణ ధ్వనులూ - యమలోకం అతిభయంకరం సుమా! ఒకవైపున శస్త్రతల్పాలు. మరోవైపున శరతల్పాలు. వాటిమధ్య పూయకుండాలు. తాడిచెట్టంత పాడుగుండే సర్పాలతో నిండిన సర్పకుండాలు. ఆపైని మశాదికుండత్రయం. ఇవన్నీ క్రోశార్థవిస్తీర్ణాలే. కాళ్ళూ చేతులూ బంధింపబడి సర్పదష్టులై వృశ్చిక కుండంలో వృ
శ్చికదష్టులై శరకుండంలో శరక్షతగాత్రులై గోళకుండంలో కీటకభక్షితులై దారుణంగా విలపించి గిలగిలా తన్నుకుంటున్న మహాపాపులు కాపాడండి కాపాడండి అని ఆరుస్తుంటారు. నక్రకుండ మూత్రకుండ మంథానకుండాలు అర్ధక్రోశ విస్తృతాలు. బీజకుండం నూరుధనుస్సుల లోతు. ధ్వాంత కుండమూ అంతే లోతు. పాషాణకుండం లోతు రెండింతలు ఎక్కువ. వైశాల్యమూ ఎక్కువే. చూర్ణకుండం క్రోశమాత్ర విస్తీర్ణం. ధనుశ్శతం లోతు. చక్రకుండంలో అన్నివైపులా పళ్ళచక్రాలు పదహారు పూటిలతో వేగంగా నిరంతరాయంగా తిరుగుతుంటాయి. వాటిమధ్య పడి చెరుకుగడల్లాగా నలిగి పిప్పి పిప్పి అయిపోతున్న జీవుల సూక్ష్మదేహాలు చేసే హాహాకారాలకు సకలవిశ్వాలూ కంపిస్తాయి.

అసిపత్ర సూచీకుండాలు విస్తీర్ణంలో సమానాలు. ధగధగలాడే కత్తులతో వాడిగా మొనదేలి ఉన్న లోహకంటకాలతో ఇవి నిండిఉంటాయి. చూసేవారికి ఇవి రక్తకుండాలుగా కనిపిస్తాయి. పాపులరక్తం గట్టులకి ఎగజిందుతుంటుంది. ఇవి పంచాశద్ధనురాయామాలు. గోకము అనే ఒక జంతువు ఉంది. దాని ముఖాకృతిలో ఉండే కూపాన్ని గోకకుండం అంటారు. ఇది ఇరవై ధనుస్సుల లోతూ వెడల్పూను. దీనినిండా ఆ భయంకర జంతువులే తెళ్ళుతుంటాయి. పాతకుల్ని కుళ్ళబొడుస్తుంటాయి. కొంచెంకొంచెంగా భక్షిస్తుంటాయి. ఇవి ఎప్పుడూ తలలు పైకి ఎత్తవు.

ఈ కుండాలన్నింటిలోనూ కలిపి ఎంతమంది ఉంటారో దానికి నాలుగురెట్లు ఎక్కువమంది పాపాత్ములుంటారు కుంభీపాకనరకంలో. ఇది సర్వకుండప్రధానం. ఇక్కడ శిక్షలూ అంతే - అన్నింటికన్నా తీవ్రంగా ఉంటాయి. అకస్మాత్తుగా వచ్చి పడుతున్న పాతకులతో అన్ని కుండాలూ రేయింబవళ్ళు దభీదభీమని మోగుతుంటాయి. తప్తపాంసుకుండంలో కాలిన ఇనపరజనులాంటి ధూళి సుడిగుండాలు తిరుగుతుంటుంది. కమిచీదెబ్బల్లా పాపుల దేహాలకు వాతలు పడుతుంటాయి. కాలిన ఇటుకలతో జ్వాలాముఖకుండం. తప్తవాలుకాకుండం. వీటిలో పడటమేమిటి పాపాత్ములు మూర్చిల్లుతారు. ధనుశ్శత విస్తీర్ణమైన నాగకుండం, అశ్వకుండం - ఇత్యాదుల్లో ఆయా జంతువులు పాపులతో హింసాక్రీడలు జరుపుతాయి. ఎనభయ్యారు కుండాలూ ఒకదానికన్న ఒకటి భయంకరంగా ఉంటాయి. ఫాపాత్ములతో కిటకిటలాడుతుంటాయి. అంతటా భరించరాని దుర్గంధం. అంతటా భరించరాని హాహాకారాలూ ఆర్తనాదాలూ. సావిత్రీ! ఇదీ నరకకూప లక్షణం. ఇంకా ఏమి తెలుసుకోదలిచావో, అడుగు.

యమధర్మరాజా! నరకకూపాల భయానకచరిత్ర తెలిసింది. వాటినుంచి తప్పించుకునేందుకు ఏకైకమార్గం దేవీమంత్రోపాసన. కనక దయచేసి దేవీభక్తిని నాకు ప్రబోధించు. స్త్రీజాతి తత్త్వజ్ఞానవిహీనం కదా! అందుచేత తత్త్వజ్ఞానసారమైన దేవీభక్తిని ఉపదేశించి పుణ్యంకట్టుకో.

యజ్ఞ దాన తీర్థస్నాన తపోవ్రతాచరణల వల్ల లభించేపుణ్యం, ఒకరికి జ్ఞానాన్ని ఉపదేశించడంవల్ల కలిగే పుణ్యంలో పదహారవవంతుకి సాటిరాదని పెద్దలు చెబుతుంటారు. గౌరవార్హతలో తండ్రికన్నా తల్లి నూరురెట్లు గొప్పది. జ్ఞానదాత గురువు - తల్లికన్నా నూరురెట్లు ఎక్కువ గౌరవార్హుడు.

సావిత్రి అభ్యర్థనకు యమధర్మరాజు సంబరపడ్డాడు. పుత్రీ! ఇంతకుముందే నువ్వు కోరిన వరాలు ఇచ్చాను. ఇప్పుడు దేవీభక్తిని వరంగా ప్రసాదిస్తున్నాను. ఇది నేనై ఇస్తున్నవరం. దేవీగుణకీర్తనం అడిగినవారికీ చెప్పినవారికీ విన్నవారికీ అందరికీ శుభప్రదం. తారణకారణం.

యముడు చెప్పిన దేవీమహిమ


No comments:

Post a Comment

Grishneshwar Jyotirlinga, Verul Village, Chhatrapati Sambhajinagar (Aurangabad) District, Maharashtra - ఘృష్ణేశ్వర జ్యోతిర్లింగం, వెరుల్ గ్రామం, ఛత్రపతి శంభాజీనగర్ (ఔరంగాబాద్) జిల్లా, మహారాష్ట్ర

ఘృష్ణేశ్వర జ్యోతిర్లింగం, వెరుల్ గ్రామం, ఛత్రపతి శంభాజీనగర్ (ఔరంగాబాద్) జిల్లా, మహారాష్ట్ర ఘృష్ణేశ్వర జ్యోతిర్లింగం భారతదేశంలోని పన్నెండు జ...