నారదా! ఇప్పుడింక దుర్గాదేవీ ఆరాధన విను. దుర్గను స్మరిస్తే చాలు ఆపదలు పారిపోతాయి. అందరూ హాయిగా ఉపాసించవచ్చు. జగన్మాత శైవి, శక్తి, మహాద్భుతశక్తి, సర్వబుద్ధి అధిదేవి, సర్వాంతర్యామిస్వరూపిణి, కఠిన సంకట విమోచని. అందుకే దుర్గ అయ్యింది. వైష్ణవులూ శైవులూ ఉపాసించదగిన పరాదేవత. మూలప్రకృతిరూప. సృష్టిస్థితిలయకారిణి. నవాక్షరమంత్రం చెప్పనా!
వాగ్భవం శంభువనితా కామబీజం తతఃపరమ్ ।
చాముండాయై పదం పశ్చాద్విచ్చే ఇత్యక్షరద్వయమ్ ॥
ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్చే - అనే నవాక్షరమంత్రం భక్తులపాలిటి కల్పవృక్షం. దీనికి బ్రహ్మవిష్ణుమహేశ్వరులు ఋషులు. గాయత్రి ఉష్ణిక్కు అనుష్టుప్పులు ఛందస్సులు. మహాకాళీ మహాలక్షీ మహాసరస్వతులు దేవతలు. భ్రామరీ దుర్గా రక్తదంతికలు బీజాలు. నందా శాకంభరీ భీమాదేవీత్రయం శక్తులు. ధర్మార్థకామమోక్షాలలో వినియోగం.
ఋషులను మౌళియందు, ఛందస్సులను వదనంలోనూ దైవతాలను హృదయంలోనూ శక్తి బీజాలను స్తనాలలోనూ - ఇత్యాదిగా అంగన్యాస కరన్యాసాలతో మంత్రశాస్త్రంలో చెప్పబడిన విధానాలను అక్షరాలా పాటిస్తూ దుర్గాదేవిని అర్చించాలి. ఇలా ధ్యానించాలి -
ఖడ్గ చక్ర గదా బాణచాపాని పరిఘం తథా ।
శూలం భుశుండీం చ శిరః శంఖం సందధతీం కరైః ॥
మహాకాళీం త్రినయనాం నానాభూషణభూషితాం ।
నీలాంజన సమప్రఖ్యాం దశపాదాననాం భజే ॥
మధుకైటభనాశార్థం యాం తుష్టావాంబుజాసనః ।
ఏవం ధ్యాయేన్మహాకాళీం కామబీజస్వరూపిణీమ్ ॥
అక్షమాలాం చ పరశుం గదేషు కులిశాని చ ॥
పద్మం ధనుష్కుండికాం చ దడం శక్తిమసిం తథా ॥
చర్మాంబుజం తథా ఘంటా సురాపాత్రం చ శూలకమ్ ।
పాశం సుదర్శనం చైవ దధతీమరుణప్రభామ్ ॥
రక్తాంబుజాసవగతాం మాయాబీజస్వరూపిణీమ్ ।
మహాలక్ష్మీం భజేదేవం మహిషాసురమర్దినీమ్ ॥
ఘంటా శూలే హలం శంఖం ముసలం చ సుదర్శనమ్ ।
ధనుర్బాణాన్ హస్తపద్మైర్దధానాం కుందసన్నిభామ్ ॥
శుంభాది దైత్యసంహర్త్రీం వాణీబీజస్వరూపిణీమ్ ।
మహాసరస్వతీం ధ్యాయేత్ సచ్చిదానందవిగ్రవామ్ ॥
కామబీజస్వరూపిణిగా మహాకాళి, మాయాబీజస్వరూపిణిగా మహాలక్ష్మి, వాణీబీజస్వరూపిణిగా మహాసరస్వతి అయిన దుర్గాదేవిని ఇలా ధ్యానించి షట్కోణసంయుక్త - అష్టదళపద్మ - చతుర్వింశతి పత్రక - భూగృహసమాయుక్త - యంత్ర విచింతన చెయ్యాలి.
సాలగ్రామంలోగానీ మంగళకలశంలోగానీ యంత్రంలోగానీ ప్రతిమలలోగానీ బాణచిహ్నంలోగానీ సూర్యడిలోగానీ ఏకాగ్రచిత్తంతో దేవిని ఆవాహనచేసి ఉపాసించాలి. జయాదిశక్తియుతమైన పీఠంలో నిలిపి పూజించాలి. తూర్పుకోణంలో సరస్వతీసహితుడైన బ్రహ్మను, నైఋతికోణంలో శ్రీసహితుడైన హరిని, వాయుకోణంలో పార్వతీపరమేశ్వరులనూ, దేవికి ఉత్తరంగా సింహాన్నీ, వామభాగంలో మహిషాసురుణ్ణీ నిలిపి అర్చించాలి. నందజ - రక్తదంత - శాకంభరి - దుర్గ - భీమ - భ్రామరి - శక్తులను షట్కోణాలలో కొలవాలి. బ్రాహ్మి - మాహేశ్వరి - కౌమారి - వైష్ణవి - వారాహి - నారసింహి - ఐంద్రి - చాముండక - రూపాలను అష్టదళాలలో యజించాలి. అటు పైని చతుర్వింశతి తత్త్వపత్రాలలో విష్ణుమాయ - చేతన - బుద్ధి - నిద్ర - క్షుధ - ఛాయ - తృష్ణ - శాంతి - జాతి - లజ్జ - క్రాంతి - శ్రద్ధ - కీర్తి - లక్ష్మి - ధృతి - వృత్తి - శ్రుతి - స్మృతి - దయ - తుష్టి - పుష్టి - మాతృ - భ్రాంతి - పరలను అర్చించాలి. ఆ తరవాత భూపురకోణాలలో గణేశ క్షేత్రపాలక వటుక యోగినులను పూజించాలి. ఇంద్రాదిదేవతలనూ వజ్రాద్యాయుధాలనూ ఇలాగే వెలుపల ఆవాహనచేసి అర్చించాలి. సావరణంగా ఇలా అర్చించి రాజోపచారాలు చెయ్యాలి. నవార్ణమంత్రాన్ని జపించాలి. సప్తశతీస్తోత్రం పఠించాలి. ఇటువంటి స్తోత్రం ముల్లోకాలలోనూ లేదు. ఇలా నిత్యం చేసిన భక్తుడు చతుర్విధపురుషార్ధాలకూ ఆలయమవుతాడు.
నారదా! శ్రీదుర్గాపూజావిధానం సమగ్రంగా వివరించాను. చెప్పినందుకు నేనూ విన్నందుకు నువ్వూ కృతార్థులమయ్యాము. సకలదేవతలూ త్రిమూర్తులూ మనువులూ మునులూ జ్ఞానులూ యోగులూ ఆశ్రమవాసులూ లక్ష్మీసరస్వతులూ అందరూ దుర్గాదేవిని ధ్యానిస్తారు. అది కారణంగానే వారందరూ ఆయా పదవులలో నిలిచి కర్తవ్యాలు నిర్వహించడానికి సమర్థులు అవుతున్నారు. పంచప్రకృతులూ తదంశమూర్తుల గురించి రహస్యాతిరహస్యమైన ఆఖ్యానాలను నీకు వివరంగా తెలియజెప్పాను. దీన్ని విన్నవారికి చతుర్విధపురుషార్థాలూ సిద్ధిస్తాయి అనడంలో సందేహం లేదు. ఇది ముమ్మాటికీ సత్యం. తొమ్మిదిరాత్రుల పాటు దేవీసన్నిధిలో ఈ ఆఖ్యానాలను పఠించినవారికి తీరనికోరికలంటూ ఉండవు. రోజుకి ఒక అధ్యాయంగా పారాయణచేస్తే దుర్గాదేవి వశవర్తిని అవుతుంది. అతడు దేవీ ప్రియకరుడవుతాడు. మనోరథాన్ని సంకల్పించుకొని దేవీభాగవత గ్రంథపూజచేసి కుమారి చేతికిచ్చి లేదా వటువు చేతికిచ్చి తెరవమని - వచ్చిన అధ్యాయాన్ని చదివితే శభాశుభ శకునాలూ ఫలాలూ తెలిసిపోతాయి. ఉదాసీనుడికి ఉదాసీనంగానే ఉంటుందినుమా! అని చెప్పి నారాయణమహర్షి ముగించాడు.
No comments:
Post a Comment