Monday, July 27, 2026

Durvasa's curse on Indra - ఇంద్రుడికి దూర్వాసుడి శాపం

శ్రీ దేవీ భాగవతం నవమ స్కంధము - ఇంద్రుడికి దూర్వాసుడి శాపం

నారదా ! మధుపానప్రమత్తుడై దేవేంద్రుడు - త్రిలోకాధిపతి - రంభతో రహఃక్రీడాపరవశుడై ఒక మహారణ్యంలో విహరిస్తున్నాడు. వైకుంఠంనుంచి కైలాసానికి వెడుతూ దుర్వాసుడు వీరి కంటబడ్డాడు. బ్రహ్మతేజస్సుతో గ్రీష్మమార్తాండుడిలాగా వెలిగిపోతున్నాడు మహర్షి. కరిగిపోసిన బంగారు రంగులో ఉన్నాడు. జడలుగట్టిన జుట్టు తలచుట్టూ వేలాడుతూ ఊగుతోంది. తెల్లని యజ్ఞోపవీతం. దండకమండలువులు. నొసట బాలచంద్ర బింబంలాంటి కుంకుమబొట్టు. లక్షల శిష్యులు వేదాలు వల్లిస్తూ వెంటనడుస్తున్నారు.

చూడగా దేవేంద్రుడు ఎదురువెళ్ళి భక్తిగా నమస్కరించాడు. శిష్యవర్గం ఇంద్రుణ్ణి అభినుతించారు. ఆందరూ అతడికి ఆశీస్సులు అందించారు. విష్ణుమూర్తి ఇచ్చిన పారిజాత పుష్పాన్ని దుర్వాసుడు ప్రేమగా అతడికి కానుక చేశాడు. అది జరామృత్యుహరమూ శోకవినాశకమూ మోక్షకారకమూ అయిన పవిత్ర పారిజాత పుష్పం. పైగా విష్ణుదత్తం. దాన్ని స్వీకరించి దేవేంద్రుడు కళ్ళకు అద్దుకుని శిరస్పుమీద పెట్టుకోవలసింది పోయి నిర్లక్ష్యంగా మదమత్తంగా తన ఐరావతం శిరస్పుమీదకు విసిరాడు. ఆ పుష్పస్పర్శతో అది రూపగుణతేజోవయస్సులలో విష్ణుతుల్యమై ఘోరారణ్యంలోకి వెళ్ళిపోయింది. ఆ ఏనుగును ఎంత ప్రయత్నించినా ఇంద్రుడు ఆపలేకపోయాడు.

ఈ సంఘటనతో దుర్వాసుడికి మహాకోపం వచ్చింది. అరే ఇంద్రా! కన్నూ మిన్నూ కానకండా ఉన్నావు. సంపన్మదమత్తుడివై ఇలా నన్ను అవమానిస్తావా? నేనిచ్చిన పారిజాతాన్ని ఏనుగుమీదకు విసిరేస్తావా? విష్ణుమూర్తికి నివేదన చేసి ప్రసాధంగా పొందిన పువ్వూ పండూ నీరూ దేనినైనా చేతికందినంతనే కన్నులకి అద్దుకుని స్వీకరించాలి. అలా స్వీకరించకపోతే బ్రహ్మహత్యా మహాపాతకం చుట్టుకుంటుంది.

శ్రీభ్రష్టుడూ బుద్దిభ్రష్టుడూ రాజ్యభ్రష్టుడూ అవుతాడు. పూర్వజన్మ సుకృతవిశేషంవల్ల మహాభాగ్యంగా లభించిందని వెంటనే స్వీకరించినవాడు మాత్రమే విష్ణుభక్తుడు. అతడు స్వయంగా జీవన్ముక్తుడవుతాడు, నైవెద్యం స్వీకరించి నిరంతరం విష్ణుమూర్తికి నుతులూ నతులూ చేస్తే సాక్షాద్విష్ణుతుల్యుడవుతాడు. అతడి స్పర్శతోగాని అతడి గాలిసోకినాగానీ సకలతీర్థాలూ పరిపూతాలవుతాయి. అతడి పాదరజస్సుతో వసుంధర అంతా పావనమవుతుంది. పుంశ్చల్యన్న - అవీరాన్న భోజనాదిక దోషాలన్నీ తొలగిపోతాయి. సర్వవిధ ఆభక్ష్యభక్షణ దోషాలు నశిస్తాయి.

ఇంద్రా! శ్వపచుడైనా (కుక్కమాంసం తినేవాడు) విష్ణుసేవి అయితే తనవంశంలో కోటితరాలను ఉద్ధరించినవాడవుతాడు. హరిభక్తి లేనివాడు తనను తానే రక్షించుకోలేడు. ఇది విష్ణుప్రసాదము అనేమాట తెలియకుండానే స్వీకరించినప్పటికీ ఏడుజన్మల పాపాలు తొలగిపోతాయి. తెలిసి స్వీకరిస్తే కోటిజన్మల కిల్బిషాలు అంతరిస్తాయి. ఇది నిశ్చయం.

శక్రా! అటువంటి పరమపావనమైన విష్ణుప్రసాదాన్ని గర్వంతో కరి మస్తకంమీదకి విసిరేశావు కనక స్వర్గలక్ష్మి నిన్ను విడిచిపెట్టి హరిసన్నిధికి వెళ్ళిపోవుగాక! నేను హరిభక్తుణ్ణి. బ్రహ్మదేవుడే కాదు యమధర్మరాజునైనా లక్ష్యపెట్టను. నువ్వొక లెక్కా? నీ తాతముత్తాతలే నన్ను పూజిస్తారు. నువ్వు ఆవమావిస్తావా? నీకంటే ఆ ఏనుగు నయం - పారిజాతాన్ని శిరసున ధరించింది కనక - అంటూ దుర్వానుడు చిందులుతొక్కాడు.

దేవేంద్రుడు గజగజలాడాడు. దుర్వాసుడి పాదాలమీద పడ్డాడు. సిగ్గువిడిచి బిగ్గరగా రోదించాడు. మునీశ్వరా! నా అపరాధానికి తగిన శాపమే ఇచ్చావు. ఇది నాకు తగిన శిక్షయే. కళ్ళకు కమ్మిన మాయ తొలగిపోయింది. రాజసంపదని తిరిగి ఇవ్వమని కోరను. దయచేసి కొంచెం జ్ఞానం ప్రసాదించు. ఐశ్వేర్యమనేది ఆపదలకు బీజం. అది జ్ఞానాన్ని కప్పివేస్తుంది. ముక్తిమార్గాన్ని ఛేదిస్తుంది. భక్తిని ఆటంక పరుస్తుంది. అంచేత ఐశ్వర్యం వద్దు. జ్ఞానం కలిగించు.

ఇంద్రుడు ఇలా ప్రాధేయపడేసరికి మునీంద్రుడు కాస్త మెత్తబడ్డాడు. ఇంద్రా! సంపత్తిమిరాంధుడికి ముక్తిమార్గం కనపడదు. అది జన్మమృత్యుజరాశోకరాగాలకు బీజాంకురం. సంపన్మత్తుడికన్నా మూఢుడూ సురామత్తుడూ ఉండడు. బంధుగణం అతడిని చుట్టుముడతారుగానీ బంధుత్వాలూ ఆప్యాయతలూ ఉండవు. విషయాంధుడూ విహ్వలుడూ మహాకాముకుడూ రాజసికుడూ అవుతాడే తప్ప ఐశ్వర్యమదమత్తుడికి సాత్త్వికమార్గం కనిపించదు. విషయాంధులు రెండు రకాలుగా ఉంటారు. రాజసుడూ తామసుడూ. శాస్త్రజ్ఞానంలేని ధనవంతుడు తామసుడు, శాస్త్రజ్ఞానం ఉన్న ధనవంతుడు రాజసుడు. శాస్త్రంకూడా రెండురకాల మార్గాలు చూపిస్తుంది. ప్రవృత్తిమార్గం ఒకటి, నివృత్తిమార్గం ఒకటి. జీవులందరూ మున్ముందుగా ప్రవృత్తిమార్గంలోనే ప్రయాణిస్తారు. దుఃఖాలనే సుఖాలనుకుంటూ పరిణామంలో వినాశదాయకమై జన్మ మృత్యుజరాకరమైన ఈ మార్గంలో అనేకజన్మల పర్యంతం పరిభ్రమిస్తారు. ఆనందిస్తున్నాం అనుకుంటూ గడుపుతారు. కర్మానుసారం పశుపక్ష్యాది జన్మలు ఎత్తి ఎత్తి కట్టకడపటికి ఎవరో ఒక సాధుపురుషుడు తత్త్వదీపంతో ముక్తిమార్గం చూపిస్తే అప్పుడు భవబంధవిచ్చేదనానికి ప్రయత్నం చేస్తారు. తపస్సులు చేసీ నిరాహారంగా వ్రతదీక్షలు పూనీ అనేక జన్మల్లో ప్రయత్నించి నిర్విఘ్నమూ సుఖప్రదమూ అయిన ముక్తిపథాన్ని చేరుకుంటారు.

నారదా! దుర్వాసుడు చేసిన ఈ ఉపదేశం శ్రద్ధగా ఆలకించిన దేవేంద్రుడికి వైరాగ్యం అంకురించింది. క్రమక్రమంగా స్థిరపడింది. కొంతకాలంపాటు దుర్వాసుడి ఆశ్రమంలోనే గడిపి, తనరాజధాని అమరావతికి బయలుదేరాడు.

ఇంద్రుడికి బృహస్పతి ఉపదేశం


No comments:

Post a Comment

The Story of Svaha - స్వాహా వృత్తాంతం

శ్రీ దేవీ భాగవతం నవమ స్కంధము - స్వాహా వృత్తాంతం నారదా ! సృష్టి ఆరంభంలో దేవతలు ఆహారంకోసం అలమటించి బ్రహ్మదేవుణ్ణి శరణువేడారు. బ్రాహ్మణక్షత్రియ...