స్వారోచిష మన్వంతరకాలంలో చైత్రవంశంలో సురభుడు అనే మహారాజు ఉండేవాడు. సుప్రసిద్దుడు. బలపరాక్రమశాలి, గుణగ్రాహి, ధనుర్ధారి. స్వయంగా కవి. ధనం సంపాదించడం, సంపాదించినదాన్ని యాచకులకు పంచి పెట్టడం రెండూ తెలిసినవాడు. సర్వశస్త్రాస్త్రకుశలుడు.
ఒకనాడు శత్రువులంతా కూడబలుక్కుని దండెత్తి వచ్చి ఇతడి రాజధానిని చుట్టుముట్టారు. అభిమానధనుడు సురథుడు సైన్యసమేతుడై ప్రాకారం దాటివచ్చి యుద్దానికి తలపడ్డాడు. భీషణంగా జరిగిన యుద్ధంలో కట్టకడపటికి సురథుడు ఓడిపోయాడు. సకలసంపదలూ మిత్రులకూ శత్రువులకూ హస్తగతమైపోయాయి. దిక్కుతోచని సురథుడు ఒక గుర్రాన్ని అధిరోహించి రహస్యమార్గాన అడవులకు వెళ్ళిపోయాడు. వికలమైన మనస్సుతో అడవిలో ఒంటరిగా తిరుగుతూంటే ఒక మునీశ్వరుడు చూసి ఓదార్చి ఆశ్రమానికి తీసుకువెళ్ళాడు. ఆ ప్రశాంత వాతావరణంలో మునిశిష్యులతో చాలాకాలం గడిపాడు. ఒకరోజున ఆ మునీశ్వరుడు పూజ ముగించే సమయానికి సురథుడు వెళ్ళి నమస్కరించాడు.
మునీశ్వరా! ఎంతకీ దుఃఖం వదలడంలేదు. మనస్సుని బాధిస్తూనే ఉంది. తత్త్వం తెలిసినా దుఃఖాన్ని జయించే ప్రజ్ఞ కరువయ్యింది. శత్రువులు ఓడించారు. రాజ్యం అపహరించారు. ఐనా ఎందుకనో వాళ్ళపట్ల ద్వేషం కలగడంలేదు. కోపం రావడంలేదు. స్ఫుటంగా మమకారమే కలుగుతోంది. అలాగని దుఃఖం తొలిగిపోతోందా అంటే అదీ లేదు. ఇదంతా విచిత్రంగా ఉంది. ఏమి చెయ్యను? ఎక్కడికి వెళ్ళను? మనశ్శాంతి లభించే మార్గం ఏమిటి? నువ్వు వేదవేదాంగవేత్తవు. అనుగ్రహించి ఏదైనా దారిచూపించు.
సురథా! దేవీమాహాత్మ్యం చాలా అశ్చర్యకరంసుమా! ప్రాణికోటి మనస్సులను బలవంతంగా మోహానికి గురిచేన్తూ ఉంటుంది. ఈ జగత్తును సృష్టించేదీ పాలించేదీమాత్రమేకాదు నాశనం చేసేదికూడా ఆ మహాదేవియే. కామదాత్రి, మహామాయ, కాళరాత్రి, దురత్యయ, విశ్వసంహారిణి, కాళి, కమల, కమలాలయ. జగత్తు అంతా ఆవిడలోనే లీనమై ఉంటుంది. ఆవిడ నుంచే ఆవిర్భవిస్తుంది. ఆవిడలోనే లయమవుతుంది. అందుకే పరాత్పర ఆన్నారు. ఆ తల్లి అనుగ్రహం ఉంటేనేగానీ ఎవ్వరూ మోహాన్ని జయంచలేరు. మోహాన్ని జయిస్తేనేగానీ మనశ్శాంతి ఉండదు.
మునివరా! ఆ దేవి ఎవరు? ఎలా ఉంటుంది? ఎక్కడ ఉంటుంది? ఎందుకని జీవకోటిని సమ్మోహపరుస్తోంది? ఆవిడ దయకు పాత్రుడనవ్వాలంటే ఏమి చెయ్యాలి? సురథుడు ఆత్రంగా ప్రశ్నలవర్షం కురిపించాడు. మునీశ్వరుడు స్థిమితంగా బదులు పలికాడు.
సురథా! అంతా చెబుతాను. విను. కల్పాంతంలో శ్రీమన్నారాయణుడు సృష్టిని ఉపసంహరించి ఆదిశేషుడిమీద యోగనిద్రకు ఉపక్రమించాడు. అతడి చెవులనుంచి గులుగు జారిపడింది. ఆ కర్ణమలంనుంచి మధు-కెటభులనే దానవులు ఆవిర్భవించారు. భీకరభీషణాకారులు. మహాకాయులు. క్రూరాతిక్రూరులు. పుడుతూనే బ్రహ్మదేవుడిని సంహరించబోయారు. బ్రహ్మ భయపడిపోయాడు, శ్రీమన్నారాయణుడు నిద్రపోతున్నాడు. ఇప్పుడు ఎవరిని శరణువేడాలి - అని బాగా ఆలోచించాడు. బుద్ధిలో మెరుపు మెరిసింది. నారాయణుడిని వశపరుచుకున్న నిద్రాదేవిని శరణువేడదామనుకున్నాడు.
నిద్రాదేవి! నువ్వు ఆనందస్వరూపిణివి. సర్వజంతు సమ్మోహకశక్తివి, కాళరాత్రివి, మహారాత్రివి, మోహరాత్రివి, వ్యాపినివి, మహనీయవు, మహారాధ్యవు, మహామాయవు, లజ్జ, పుష్టి, క్షమ, కీర్తి, కాంతి అన్నీ నువ్వే. కారుణ్యస్వరూపిణివి. జగద్వంద్యవు. నువ్వే జాగ్రత్స్వరూపిణివి.
ఏకాత్మవు, ఏకరూపవు, జీవాత్మపరమాత్మలు ప్రకృతిపురుషులూ నువ్వే కనక ద్వయాత్మవు, త్రివర్గ నిలయవు, తురీయ మోక్షస్వరూపవు, పంచభూతేశ్వరివి, షష్ఠేశ్వరివి, సప్తవారాధినేత్రివి అష్ట వసువులకు అధినాయికవు, నవగ్రహమయివి, నవరాగకళారూపవు, దశదిక్పూజ్యవు. ఏకాదశరుద్ర నిషేవితవు, ఏకాదశీతిథిప్రియవు, ద్వాదశభుజవు, ద్వాదశాదిత్యులకు కన్నతల్లివి. త్రయోదశగణ ప్రియవు, విశ్వేదేవులకు అగ్రణివి, చతుర్దశేంద్రులకు వరప్రదవు, చతుర్దశ మనువులకు జనయిత్రివి, పంచాధికదశీవేద్యవు, షోడశభుజవు, షోడశేందుకళామయివి, షోడశాత్మక చంద్రాంశువ్యాప్త దివ్యశరీరవు, పాడ్యమి మొదలు పూర్ణిమవరకూ అన్ని తిథులూ నువ్వే. గుణత్రయస్వరూపిణీ! నారాయణుడిని ఇప్పుడు వశపరుచుకున్నావు. ఈ రాక్షసులిద్దరూ నన్ను సంహరించబోతున్నారు. అమ్మా! నిద్రాదేవీ! కరుణించు. శ్రీమన్నారాయణుడిని విడిచిపెట్టు. మెలకువ రప్పించు.
బ్రహ్మదేవుడి ప్రార్థనను ఆలకించిన నిద్రాదేవి శ్రీమన్నారాయణుడిని విడిచిపెట్టి మధుకైటభులను ఆవహించింది. విష్ణుమూర్తి నిద్రలేచాడు. మధుకైటభులను చూశాడు. అయిదువేల సంవత్సరాలు యుద్దం చేశాడు. అయినా జయించలేకపోయాడు. అప్పుడు నిద్రాదేవి వారిని సమ్మోహపరిచింది. వారు ఆ మోహంలోపడి శ్రీహరిని వరం కోరుకోమన్నారు. శ్రీహరి వెంటనే వారి వధను వరంగా కోరాడు. నీళ్ళు లేనిచోట మమ్మల్ని సంహరించగలవు అన్నారు. శ్రీహరి తొడలు విస్తరించి చక్రం ధరించి సంహరించాడు. వారి మేదస్సుతో(కొవ్వు) కలిసింది కనక భూమికి మేదిని అనే పేరు వచ్చింది.
సురథా! మధుకైటభ సంహారంకోసం బ్రహ్మదేవుడు స్తుతిస్తే శ్రీమన్మహాదేవి ఇలా స్పందించి సహకరించింది. ఇంక ఆ దేవి సముత్పత్తి గురించి చెబుతాను. విను.
పూర్వకాలంలో మహిషుడనే మహారాక్షసుడున్నాడు. మహాబలశాలి, మహిషరూపుడు దేవతల లోకపాలకులనూ నానాహింసలూ పెట్టేవాడు. ఇంద్రాదులు రాజ్యభ్రష్టులై పారిపోయారు. బ్రహ్మదేవుణ్ణి అగ్రభాగాన నిలుపుకుని శంకరుడిని విష్ణుమూర్తినీ శరణువేడారు. మహిషాసురుడి దురాగతాలు వింటున్న శ్రీహరికి పట్టరాని కోపం వచ్చింది. ఆ క్షణంలో అతడి నోటినుంచి ఒక మహాతేజస్సు ఆవిర్భవించింది. అలాగే బ్రహ్మరుద్రమహేంద్రాది సకలదేవతల శరీరాలనుంచీ తేజఃపుంజాలు వెలువడ్డాయి. అన్నీ వెళ్ళి ఆ మహాతేజస్సులో కలిసి ఒక ఆకారం రూపుగట్టింది. శంభుతేజస్సు ముఖంగా, యముడి తేజస్సు జుట్టుగా, శ్రీహరితేజస్సు బాహువులుగా, చంద్రతేజస్సు కుచాలుగా, ఇంద్రతేజస్సు నడుముగా, వరుణతేజస్సు తొడలుగా, భూదేవి తేజస్సు నితంబంగా(కటిప్రదేశం), బ్రహ్మతేజస్సు పాదాలుగా, వాసవతేజస్సు వేళ్ళుగా, కుబేరుడి తేజస్సు నాసికగా, ప్రజాపతి తేజస్సు దంతాలుగా, పావకతేజస్సు మూడు కన్నులుగా, సాధ్వుల తేజస్సు కన్బొమలుగా, వాయవ్య తేజస్సు చెవులుగా - ఒక స్త్రీమూర్తి సర్వతేజస్స్వరూపిణి అవతరించింది. శివుడు శూలాన్నీ, విష్ణువు చక్రాన్నీ, వరుణుడు శంఖాన్ని, అగ్నిదేవుడు శక్తినీ, వాయువు ధనుర్భాణాలనూ, ఇంద్రుడు వజ్రాయుధాన్నీ, ఐరావతం ఘంటనూ, యముడు కాలదండాన్నీ, బ్రహ్మదేవుడు అక్షమాలాకమండలువులనూ, సూర్యుడు రశ్మిమాలనూ. కాలుడు కవచఖడ్గాలనూ, సముద్రుడు వస్త్రహారాలనూ చూడామణి కుండల కటక భుజాంగ నూపుర, గ్రైవేయకాది ఆభరణాలనూ, విశ్వకర్మ ఉంగరాలనూ, హిమవంతుడు సింహవాహనాన్నీ, కుబేరుడు సురాభాండాన్నీ పానపాత్రనూ, ఆదిశేషుడు నాగహారాన్నీ - భక్తితో సమర్పించారు. ఇంకా అశేష దేవతలు అశేషాయుధాలనూ ఆభరణాలనూ బహూకరించారు. రకరకాల స్తుతులతో స్తోత్రాలతో పొగడ్తలతో ఆ మహాదేవిని ఉత్తేజపరిచారు. ఉత్సాహపరిచారు.
మహిషాసురవధను సంకల్పించి మహాదేవి భీషణనినాదం చేసింది. మహిషుడు ఆశ్చర్యచకితుడై యుద్దానికి వచ్చాడు. శస్త్రాస్త్రాలతో ఆకాశం నింపేశాడు. చిక్షురుడు సేనాపతి. ఇంకా దుర్ధర - దుర్ముఖ - బాష్కల - తామ్రక - బిడాలవదన ప్రభృతులు అసంఖ్యాకరాక్షస మహావీరులు రణరంగానికి దుమికారు. అందరినీ అవలీలగా సంహరించి మహాదేవి మహిషాసురుడిని ఎదుర్కొంది. వాడు మహామాయా, రకరకాల రూపాలతో వచ్చి యుద్ధం చేస్తోంటే ఒక్కొక్క రూపాన్నీ తునుమాడుతూ వచ్చింది. చిట్టచివరికి మహిషరూపంలో వచ్చాడు. వెంటనే పాశంతో బంధించి ఖడ్గంతో శిరస్సు నరికేసింది. మహిషాసురమర్దిని అయ్యింది. సింహనాదం చేసింది. బతికున్న రాక్షస సైనికులు హాహాకారాలు చేస్తూ పలాయనం చిత్తగించారు. దేవతలు జయజయధ్వానాలు చేశారు. శ్రీమన్మహాదేవిని బహుధా స్తుతించారు. సురథా! మహిషమర్షినిగా ఇది మహాలక్ష్మి అవతారం. ఇక మహాసరన్వతి అవతారగాథ ఏమిటంటే -
ఒకప్పుడు శుంభనిశుంభులనే రాక్షససోదరులు ఉండేవారు. మహాబలపరాక్రమ సంపన్నులు. మాయావులు. దేవతలను పారద్రోలి స్వర్గాన్ని ఆక్రమించుకున్నారు. ఇంద్రాదులు జగన్మాతను శరణువేడారు. స్తుతించారు. ప్రసన్నురాలయ్యింది. వరం కోరుకోమంది. శుంభనిశుంభులను సంహరించి మా భోగభాగ్యాలను మాకు అందించమన్నారు దేవతలు. మహాదేవి అంగీకరించింది.
శుంభనిశుంభులకు చండముండులని ఇద్దరు భృత్యులున్నారు. వారు మేరుపర్వతగుహలో దాక్కొని ఈ దృశ్యాన్ని చూశారు. దేవీ సౌందర్యానికి ఆశ్చర్యచకితులయ్యారు. పరుగుపరుగున వెళ్ళి శుంభుడికి వర్ణించి చెప్పారు. మహాప్రభూ! అత్యద్భుత సౌందర్యరాశిని చూసి వచ్చాం. సురాసురగంధర్వ నాగయక్షమానవ జాతులలో అటువంటి అందగత్తె లేదు. ఇకముందు ఉండదు. ఆవిడను అనుభవించడానికి నువ్వు ఒక్కడివే యోగ్యుడివి. అర్హుడివి. ఆవిడను తెచ్చుకో, ఏలుకో - అని ప్రబోధించారు.
శుంభుడికి మనసయ్యింది. మహాదేవి సన్నిధికి దూతను పంపించాడు. వాడు తన ప్రభువు గుణగణాలనూ శక్తిసామర్థ్యాలనూ భోగభాగ్యాలనూ వర్ణించి చెప్పి శుంభుడిని చేపట్టి సుఖించమని ఉపదేశించాడు. అప్పుడు అమ్మవారు అందికదా -
దూతా! నువ్వు చెప్పినది అంతా బాగుంది. కానీ నాకు ఒక ప్రతిజ్ఞ ఉంది. నా బలాన్ని అపహరించి నా దర్పాన్ని ఎగరగొట్టగలిగినవాడినే నేను పెళ్ళాడతాను. అల్పుల్ని నేను అంగీకరించను. ఇది నా ప్రతిజ్ఞ. మీ ప్రభువుతో చెప్పు. ఇది నెరవేర్చి నన్ను స్వీకరించమను. వెళ్ళు.
దూతవెళ్ళి శుంభుడికి యథాతథంగా నివేదించాడు. దానవప్రభువుకు కోపం వచ్చింది. ఆ దుష్టురాలిని జుట్టుపట్టుకుని లాక్కురా - అని గర్జించి ధూమ్రాశనుడిని పంపించాడు. అరవైవేల సైన్యంతో వాడు వెళ్ళి భస్మమైపోయాడు. వర్తమానం అందింది. శుంభుడు మండిపడ్డాడు. చండ - ముండ - రక్తబీజులను వరుసగా పంపించాడు. మహాదేవి చేతిలోని త్రిశూలానికి వాళ్ళు ముగ్గురూ బలిఅయిపోయారు. ఈసారి శుంభ నిశుంభలే స్వయంగా రణరంగానికి దిగారు. భయంకరంగా పోరాడి నిహతులయ్యారు. విబుధులు సంతోషంతో మహాదేవిని వాగీశ్వరిగా కొనియాడారు.
సురథా! సృష్టిస్టితిలయకారిణి ఆ పరమేశ్వరిని నువ్వుకూడా ఆరాధించు. అంతర్బహిశ్శత్రువులు అంతరిస్తారు. మనశ్శాంతీ భోగభాగ్యాలూ లభిస్తాయి - అని మునీశ్వరుడు ఉపదేశించాడు.
నారదా! సురథుడు అప్పటినుంచీ దేవిభక్తి తత్పరుడు అయ్యాడు. జితేంద్రియుడై నిరాహారుడై ఏకాగ్రచిత్తంతో దేవేశిని ఉపాసించాడు. మృణ్మయమూర్తిని ఎట్టయెదుట నిలుపుకొని భక్తిప్రపత్తులతో పూజలు చేశాడు. తన శరీరంలోని రక్తమాంసాలను నైవేద్యం పెట్టాడు. జగన్మాతకు దయ కలిగింది. ప్రసన్నురాలై సాక్షాత్కరించింది. నీ రాజ్యం నీకు లభిస్తుందనీ నిష్కంటకంగా ఏలుకొమ్మనీ మోహం నశించి జ్ఞానం కలుగుతుందనీ వరాలు కురిపించింది. వచ్చే జన్మలో మనుసావర్ణివవుతావు. ఒక మన్వంతరాని అధిపతి వవుతావు. మంచి సంతానం కలుగుతుంది - అనికూడా ఆశీర్వదించి ఆంతర్ధానం చెందింది.
అమ్మవారు ఆదేశించినట్టే సురథుడు సావర్ణిగా జన్మించాడు. ఎనిమిదవ మన్వంతరానికి అధిపతి అయ్యాడు. ఈ ఉపాఖ్యానం చదివినవారూ విన్నవారూ దేవి అనుగ్రహానికి పాత్రులవుతారు.
వైవస్వతమనుసంతతి
No comments:
Post a Comment