Tuesday, July 14, 2026

The month of Ashadha - ఆషాఢ మాసం

ఆషాఢ మాసం

పంచాంగం ప్రకారం నాలుగవ నెల ఆషాఢ మాసం. ఈ నెలలో పౌర్ణమినాడు చంద్రుడు ఉత్తరాషాఢ లేదా పూర్వాషాఢ నక్షత్రాలతో ఉన్న నెలను ఆషాఢ మాసం అని అంటారు. ఈ మాసాన్ని శూన్య మాసం అని కూడా అంటారు. వర్ష ఋతువు ఆషాఢ మాసం నుంచి మొదలవుతుంది. 

సూర్యుడు మిథునరాశి నుంచి కర్కాటకరాశి లోనికి ప్రవేశిస్తాడు. దీంతో ఉత్తరాయణ పుణ్యకాలం పూర్తి అయి దక్షిణాయనం మొదలవుతుంది. దక్షిణాయనం పితృదేవతలకు ప్రీతికరమని అంటారు. ఈ మాసం లో చేసే స్నానం, దానం, జపం, పారాయణలు, విశేష ఫలితాన్నిస్తాయి. ఆషాఢ మాసంలో చేసే సముద్ర నదీ స్నానాలు ముక్తిదాయకం అని చెప్పుతారు.

ఈ మాసంలోనే త్రిమూర్తి స్వరూపుడైన గురువుని ఆరాధించే పర్వదినం గురు పూర్ణిమ. దీనినే వ్యాస పూర్ణిమ అని కూడా అంటారు. మహాభాగవతాన్ని రచించిన వేద వ్యాసుడు జన్మించిన రోజు. అంతేకాదు వ్యాసుడు వేదాల్ని నాలుగు భాగాలుగా విభజించిన రోజు కూడా ఇదేనంటారు.

ఆషాఢ శుద్ద విదియ రోజున పూరీ జగన్నాదుడు, బలభద్ర, సుభద్ర రథయాత్ర కన్నుల పండుగ గా జరుగుతుంది.

ఆషాఢ సప్తమిని భాను సప్తమి అంటారు. ఉత్తరం నుంచి దక్షిణ దిశకు పయనిస్తున్న సూర్యుడు మూడు నెలలు తర్వాత మధ్యకు చేరుకుంటాడు. ఆ రోజున పగలు, రాత్రి, నిమిషం ఘడియ విఘడియల తేడా లేకుండా సరిమనానంగా ఉంటాయి.

ఆషాఢ శుద్ధ ఏకాదశి తిధిన విష్ణువు పాలకడలిపై యోగనిద్రలోకి వెళ్ళే సందర్భాన్ని తొలిఏకాదశిగా పరిగణిస్తారు. 
దీన్నేమహా ఏకాదశి మరియు  ప్రథమైకాదశి అని కూడా అంటుంటారు. ఈ నెలల్లోని ఏకాదశిని తొలి ఏకాదశి అని శయన ఏకాదశి అని అంటారు. ఈ రోజు నుంచి చాతుర్మాస వ్రత దీక్ష మొదలవుతుంది.

ఆషాఢ మాసంలోనే తెలంగాణాలో బోనాల ఉత్సవాలను భక్తి శ్రద్దలతో జరుపుకొంటారు. మహంకాళి అమ్మవారికి భోజనాన్ని బోనంగా నివేదన చేస్తారు.

ఈ నెలలో కొత్తగా పెళ్లి అయిన జంట అత్తా గారి ఇంట్లో అడుగు పెట్టకూడదు అనే సంప్రదాయం ఉంది.ఆడవారు ఒక్కసారైనా ఈ మాసంలో గోరింటాకు పెట్టుకుంటారు.ఆహారంలో మునగకాయను విరివిగా వాడాలంటారు.
పేలపిండి తింటారు.

ఈ మాసంలో ఇంద్రియ నిగ్రహంతో ఆహార విహారాలలో తగిన జాగ్రత్తను తీసుకుంటూ జీవితాన్ని గడపటం కోసం పూజలు, వ్రతాలుతో, నవ దంపతులకు ఆషాఢ నియమం పాటించమని చెబుతారు.ఆషాఢమాసంలో నవదంపతులు కలవకూడదనే ఆచారాన్ని మనదేశంలోని హైందవేతర మతస్తులు కూడా కొన్నిచోట్ల పాటిస్తుంటారు.

అధిక ఆషాఢమాసము వచ్చిన సంవత్సరం పూరీ జగన్నాధ ఆలయంలోని మూలవిరాట్టుల్ని ఖననం చేసి కొత్త దారు విగ్రహాలు చేయిస్తారు. దీన్ని 'నవకళేబర ఉత్సవం' అంటారు.

No comments:

Post a Comment

The Soul's 13-Day Journey - ఆత్మ 13 రోజుల ప్రయాణం

ఆత్మ 13 రోజులు ప్రయాణం మరణం తర్వాత 13 రోజుల్లో ఆత్మ ఎక్కడికి వెళ్తుంది?   ఈ 13 రోజుల క్రియలు ఎందుకు చేస్తారు? ఇప్పుడు తెలుసుకుందాం  మరణం జరి...