Friday, May 1, 2026

The conflict between Ganga and Saraswati - గంగా సరస్వతుల కలహం

శ్రీ దేవీ భాగవతం నవమ స్కంధము - గంగా సరస్వతుల కలహం

నారాయణమహర్షీ! సరస్వతీదేవి గంగాశాపంవల్ల భారతదేశంలో నదిగా అవతరించింది అన్నావు. వారిద్దరికీ కలహమేమిటి? ఎలా వచ్చింది? తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది. వేదసారాలైన కథల్ని వినడం ఎవరికైనా కుతూహలాన్ని కలిగిస్తుందిగదా! కథామృతాస్వాదన ఎంత చేసినా నాకు తృప్తి కలగడం లేదు. ఇక చాలు అనిపించడం లేదు. శ్రేయస్సులవిషయంలో ఎవరైనా అసలు తృప్తిచెందుతారా! అది అంతే. ఆ శాపవృత్తాంతం తెలియజెయ్యి - అని అభ్యర్థించాడు. నారాయణుడూ సరే అని ఆరంభించాడు.

బ్రహ్మకుమారా! అతిపురాతనమూ అత్యంత పుణ్యప్రదమూ గంగా సరస్వతీ కలహగాథను వివరిస్తున్నాను. శ్రద్ధగా ఆలకించు. లక్ష్మి - సరస్వతి - గంగ ఈ ముగ్గురూ శ్రీమహావిష్ణువుకి ఇల్లాండ్రు. ముగ్గురినీ సమానంగా ఆతడు చూసుకుంటున్నాడు. ముగ్గురూ సమానంగా అతడిని ప్రేమించి సేవిస్తున్నారు.

ఒకరోజున చల్లబాటువేళ గంగాదేవి విష్ణుమూర్తి ముఖంలోకి పదేపదే ఒయ్యారంగా సాకూతంగా క్రీగంటిచూపులు విసురుతోంది. ప్రభువు గమనించాడు. స్పందించాడు. తానూ చూపులు కలిపాడు. 

వీరిద్దరి వ్యవహారాన్నీ లక్ష్మీ సరస్వతులు గమనించారు. లక్ష్మీదేవి మనకెందుకులే అని ఓరిమితో మిన్నకుంది. సరస్వతి అలా ఉండలేకపోయింది. అదేదో అవమానమని గుంజుకుంది. సత్త్వస్వరూపిణి లక్ష్మీదేవి చిరునవ్వులు చిందిస్తూ ఓదార్చింది. ఓరిమి వహించమని సర్ది చెప్పింది. అయినా సరస్వతి వినలేదు. ఊరుకోలేదు. కళ్లూ ముఖమూ ఎర్రబడ్డాయి. పెదవులు వొణికాయి. కోపంతో ఊగిపోయింది. నోరు చేసుకుంది.

మగడు ధర్మాత్ముడూ ఉత్తమోత్తముడూ అయితే భార్యలందరి పట్లా సమతాబుద్ది ఉంటుంది. ఖలుడిది అంతా పక్షపాతబుద్ది. తెలిసిందిలే. నాథా! నీకు గంగాదేవిపట్ల సౌభాగ్యం అధికం. లక్ష్మీదేవి అన్నా నీకు ప్రేమ అధికమే. నేనంటేనే అలుసు. నీకు బొత్తిగా పనికిరానిదాన్ని నేనే. అందుకే లక్ష్మీదేవికి నీపట్ల విపరీతమైన ఓరిమి. ఎన్ని నాటకాలాడినా నువ్వు తనవాడివేనని ఆవిడ ధీమా. అందుకే నన్ను ఊరుకో ఊరుకో అని ఓదారుస్తోంది. ఎందుకులే ఈ ఓదార్పులూ అవసరం లేదు, నీ అవమానాలూ అవసరంలేదు. నా దౌర్భాగ్యం ఇలా ఉంటే ఎవరిని అని ఏమి ప్రయోజనం! అనురాగంలో భర్తృవంచిత జీవితం నిష్ఫలం. నిన్ను అందరూ సత్త్వస్వరూపుడవని కీర్తిస్తుంటారు. వాళ్ళు ఎంత మూర్ఖులు! ఎంత అజ్ఞానులు! వాళ్ళకి శ్రుతీ తెలియదు, నీ మతీ తెలియదు - అంటూ దులిపేసింది.

ఇప్పుడు ఏమి మాట్లాడినా విపరీతార్థాలు వస్తాయనీ సరస్వతి మరింతగా రెచ్చిపోతుందని భావించిన శ్రీమన్నారాయణుడు మౌనంగా అక్కడినుంచి నిష్క్రమించాడు. అతడు వెళ్ళగా చూసి మరింత నిర్భయంగా సరస్వతీదేవి విజృంభించింది. కర్ణకఠోరంగా మాట్లాడింది.

సిగ్గులేనిదానా! కామం కళ్ళకెక్కినదానా! మాకన్నా ఎక్కువగా భర్తను లాంగదీసుకున్నానని గర్వపడుతున్నట్టున్నావ్‌! విర్రవీగుతున్నట్టున్నావ్‌! అధిక సౌభాగ్యవతిని నేను అని పెద్ద ప్రదర్శన చేస్తున్నావా? నీ గర్వాన్ని అణుస్తాను. నీ మగడు చూస్తుండగానే కొమ్ములు విరుస్తాను. ఏం చేస్తాడో చూస్తాను.

ఇలా నోరుపారేసుకుంటూ గబగబావచ్చి గంగాదేవిని జుట్టు పట్టుకోబోయింది. లక్ష్మీదేవి మధ్యలో నిలబడి గట్టిగా మందలించి వారించింది. సరస్వతికి అప్పుడు లక్ష్మీదేవిమీదకూడా కోపంవచ్చింది.

లక్ష్మీ! ఇది దారుణం. కళ్ళ ఎదుట విపరీతం జరుగుతూంటే నోరుమెదపకపోగా నన్ను వారిస్తున్నావా! ఒక చెట్టులాగా ఒక నదిలాగా అడ్డునిలుస్తున్నావా? సరే - ఒక చెట్టువీ ఒక నదివీ అయిపో, ఇది నా శాపం - అనేసింది.

లక్ష్మీదేవికి కోపమూ దుఃఖమూ పొంగివచ్చాయి. అయినా నిభాయించుకుంది. ప్రతి శాపం ఇవ్వలేదు. తన చేతిలో ఉన్న సరస్వతి చెయ్యిని వదలనైనా వదలలేదు. మృదువుగా నొక్కుతూ ఆలాగే నిలబడింది.

ఎరుపెక్కిన కన్నులతో వొణుకుతున్న పెదవులతో దుఃఖిస్తూ నిలబడిన లక్ష్మీదేవి గంగాదేవి కన్నులకి మహోన్నతంగా కనపడింది. పద్మా! సరస్వతిని వారించకు. విడిచిపెట్టు, రానీ. ఎమి చేస్తుందో చూద్దాం. చెయ్యని. పరమదుఃశ్శీల, అందరిమీదా నోరుపారేసుకోవడం ఆవిడ నైజం. వాగధిష్ఠాత్రికదా! ఆవిడ ఇష్టం. ఎది పడితే అది ఎలా పడితే అలా మాట్లాడగలదు, కనక మాట్లాడుతుంది. కలహప్రియ. వాదవివాదాలు లేనిదే రోజు గడవదు. ఎవరికి తెలియదు ఈవిడ సంగతి! యోగ్యత ఉన్నమేరకు శక్తి ఉన్న మేరకు వాదులాడనీ . తనబలాన్నీ నా బలాన్నీకూడా లోకానికి తెలియజెబుదామనుకుంటోందేమో, అలాగే చెయ్యని. మా ఇద్దరి ప్రభావాన్నీ ప్రతాపాన్నీ లోకం తెలుసుకుంటుంది. తెలుసుకోనీ. మంచిదే - అంటూ గంభీరంగా మాట్లాడుతున్న గంగాదేవి హఠాత్తుగా కోపావిష్టురాలై సరస్వతిని శపించింది.

సరస్వతీ! లక్ష్మీదేవిని శపించావు కనక నువ్వు నదీరూపం పొంది భూలోకంలో పాపాత్ములమధ్యన ప్రవహించు. వారి అందరి పాపాలూ కలియుగంలో నువ్వే గ్రహించు - అనేసింది. సరస్వతికి ఇది అగ్నిలో ఆజ్యం పోసినట్టయ్యింది. వెంటనే తడుముకోకుండా ప్రతిశాపం ఇచ్చింది - నువ్వే భూలోకానికి పోతావ్. నదిగా ప్రవహిస్తావ్‌. పాపాలు గ్రహిస్తావ్‌! పాపాత్మురాలా! - అనేసింది.

అంతలోకీ చతుర్భుజ నారాయణుడు మరో నలుగురు చ
తుర్భుజ పార్షదులతో లోపలికోచ్చాడు. వస్తూనే సరస్వతిని చేతుల్లోకి తీసుకున్నాడు. గుండెలకు హత్తుకున్నాడు. మెల్లగా పురాతనజ్ఞానాన్ని ఉపదేశించాడు. కలహానికీ శాపానికీగల రహస్య కారణాన్ని వివరించాడు.

లక్ష్మీ! నువ్వు భూలోకంలో ధర్మధ్వజుడి గృహంలో కళాంశరూపంతో అయోనిజగా ఆవతరించు. అతడికి కూతురుగా ఉండు. అక్కడే నీకు దైవదోషంవల్ల వృక్షత్వం ప్రాప్తిస్తుంది. నా అంశతో అవతరించే శంఖచూడుడు అనే అసురుడికి భార్యవై అటుపైని కొంత కాలానికి మళ్ళీ నన్ను చేరుకుందువుగాని. అలాగే తులసి పేరుతో పరమపావనమూర్తివై మరొక కళాంశరూపాన భారతదేశంలో అవతరించు. హే గంగే! నువ్వు సరస్వతి శాపం కారణంగా భారతదేశంలో నదిగా అవతరించు. అది నీ అంశావతారం. పాపాత్ములను పవిత్రీకరించు. భగీరథుడు తపస్సు చేసి నిన్ను తనవెంట తీసుకువెడతాడు. అప్పటినుంచి భాగీరథి అనే పేరుతో విఖ్యాతి వహిస్తావు. నా అంశమైన సముద్రుడికి భార్యవవుతావు. అలాగే నా అంశతో అవతరించే శంతనుడికీ ఇల్లాలివవుతావు.

సరస్వతీ! గంగాశాపం వల్ల నువ్వుకూడా కళాంశగా భారతభూమిలో నదిగా అవతరించు. సవతులతో కలహాలను అనుభవించు. సత్యలోకంలో బ్రహ్మకు ఇల్లాలివై ఆనందించు.

గంగా! నువ్వు ఈ వైకుంఠంలో పద్మగానూ, శివస్థానమైన కైలాసంలో గంగగానూ కీర్తింప బడతావు. క్రోధరహితవై శాంత సత్త్వస్వరూపిణివై మహాసాధ్వివై ధర్మచారిణివై సుశీలవై పరమపావనివై అందరి ప్రశంసలూ అందుకుంటావు. పూజలు అందుకుంటావు. మీరు ముగ్గురూ ఇలాగే ప్రతి విశ్వంలోనూ ప్రతి కల్పంలోనూ కీర్తింపబడతారు. స్తుతింపబడతారు. పూజింపబడతారు. మీరు
మంగళప్రదలు. పనిలో పనిగా లోకంలో అందరికీ పనికివచ్చే ఒక ఉపదేశం చేస్తున్నాను, మీరు ఆలకించండి -

ఏ ఇంటిలో ఇల్లాలు మగరాయుడిలా ప్రవర్తిన్తుందో ఆ ఇంటిలో అన్నీ ఆశుభాలే. ఆ పురుషుడి జన్మ నిష్ఫలం. జగడాలమారి భార్యతో కాపురం చేసేకన్నా అడవులకు పోవడం ఉత్తమం. కడుపునిండా తినడానికీ తాగడానికీ పళ్ళూ నీళ్ళూ దొరుకుతాయి. మనశ్శాంతిగా బతకవచ్చు. గయ్యాళి భార్యతో వేగడంకన్నా నిప్పుల్లో దూకడం నయం. పులులూ సింహాలమధ్య బతకడం తేలిక. వ్యాధిజ్వాల కన్నా విషజ్వాలకన్నా దుష్టస్త్రీల ముఖజ్వాల మరణాంతకం. ఆ పురుషుడి బతుకు నవ్వులపాలవుతుంది. ఇహపరాలకు చెడతాడు. జీవన్మృతుడికింద లెక్క. ఒక పురుషుడికి ఒక ఇల్లాలు ఉండటం ఉత్తమోత్తమం.

ఆవిడ గుణవతి శీలవతి అయితే చాలు ఆ పురుషుడి జన్మ ధన్యమైనట్టె. అంతటి సుఖి ఉండడు. బహుభార్యలు ఉండటం ఎంతటివాడికైనా నరకమే. అది ధర్మవిరుద్దమూ వేదవిరుద్దము కూడా. అందులోనూ సవతులు ఒకేచోట ఉండటం మరింత నరకం. నేనే ఉదాహరణ. అందుచేత గంగా! నువ్వు శివస్థానానికి వెళ్ళు. సరస్వతీ! నువ్వు బ్రహ్మస్థానానికి వెళ్ళు. లక్ష్మీదేవి ఒక్కతే ఇక్కడ ఉంటుంది. అందరికీ సుఖంగా ఉండేందుకు ఈ ఏర్పాటు చేస్తున్నాను. 

శ్రీహరి మాటలు విని ముగ్గురూ పశ్చాత్తాపంతో కుమిలిపోయారు. ఒకరినొకరు కౌగిలించుకుని విలపించారు. శాపాలూ భూలోకనివాసమూ నదీరూపాలూ తలుచుకుని గజగజలాడిపోయారు. క్రమంగా తేరుకుని జగన్నాథుణ్డి బతిమిలాడుకున్నారు. ముందుగా సరస్వతీదేవి నోరు విప్పింది.

నాథా! నాకు శాపవిమోచనం అనుగహించు. నిన్ను విడిచిపెట్టి నేను వెళ్ళలేను. నీలాంటి ఊన్నతులే శాపాన్ని మళ్ళించడానికి సమర్ధులు. నువ్వు కాదంటే నిప్పుల్లో దూకి ప్రాణాలు వదులుతాను - ఆంది.

వెంటనే గంగాదేవి ఆందుకుంది. జగన్నాథా! నేను ఏమి తప్పు చేశానని నన్ను వదిలిపెడు తున్నావు? నేనూ ప్రాణత్యాగం చేస్తాను. నిర్దోషను సంహరించిన పాపం కట్టుకుందువుగాని. ఏ తప్పూ చెయ్యని ఇల్లాలిని వెళ్ళగొట్టిన పురుషుడు సర్వేశ్వరుడైనా సరే నరకానికి పోతాడు.

ఆటుపైని లక్ష్మీదేవి ప్రసంగించింది. హృదయేశ్వరా! నువ్వు సత్త్వస్వరూపుడివి. నీకు కోపమా? చాలా ఆశ్చర్యంగా ఉందే ! దయచేసి ప్రనన్నుడివికా. ఈ ఇద్దరిపట్లా దయచూపించు. చాలు. మంచి మగడికి ఓర్పేకదా గొప్పగుణం.

భారతీశాపంవల్లా నీ నిర్ణయంవల్లానేను భారతదేశంలో అవతరించబోతున్నాను. సరే. అవతరిస్తాను. అయితే ఎంతకాలం ఉండాలి అక్కడ నేను. మళ్ళీ నీ సన్నిధిని నేను ఎప్పటికి నోచుకుంటాను. నదీరూపం ధరించానంటే మహాపావులు అందరూ వచ్చి మునకలు వేస్తుంటారు. వారి పాపమంతా నాకు చుట్టుకుంటుంది. మరి ఆ మహాపాపాలనుంచి నాకు విముక్తి ఎలాగ? నీ సన్నిధికి తిరిగి చేరుకోవడమెలాగ? అలాగే ధర్మధ్వజుడి ఇంట కూతురిగా తులసీరూపాన్సి ధరించమన్నావు. ధరిస్తాను, ఆ జన్మనూ అనుభవిస్తాను. అచ్యుతా! మళ్ళీ నీ పాదపద్మాల చెంతకు చేరుకునేదెప్పుడు?

ప్రభూ! నువ్వు అధిష్టానదేవతగా తులసీ వృక్షరూపాన్ని ధరిస్తాను. ఎప్పుడు నన్ను ఉద్ధరిస్తావో దయచేసి ఆ ఒక్కముక్కా చెప్పు. నువ్వు కృపానిధివి. కనక నాకూ గంగా సరస్వతులకూ శాపవిమోచనం ఎప్పుడో నీ సన్నిధికి తిరిగి రావడం ఎప్పుడో చెప్పి మమ్మల్ని అనుగ్రహించు. సరస్వతిని బ్రహ్మ పదనానికీ గంగను శివమందిరానికీ పొమ్మన్నావు. ఈ ఒక్కమాటనూ ఉపసంహరించుకో - అంటూ లక్ష్మీదేవి శ్రీహరి పాదాలమోద పడి ఓలుఓలున విలపించింది. తన జడతో పాదాలను చుట్టి పట్టుకుంది.

భక్తానుగ్రహకాతరుడైన అచ్యుతుడు ప్రసన్నుడయ్యాడు. మందహాససుందరవదనారవిందుడై లక్ష్మీదేవిని బుజాలుపట్టి పైకి ఎత్తి గుచ్చి కౌగిలించుకున్నాడు. మృదువుగా బదులు పలికాడు.

సురేశ్వరీ! నా హృదయేశ్వరీ! నీ అభ్యర్థనను మన్నిస్తున్నాను. నా మాటకూ నీ కోరికకూ ఒక సమత కూరుస్తున్నాను. సరస్వతీదేవి కేవలం కళాంశరూపంతో భారతదేశాన నదిగా అవతరిస్తుంది. ఆర్థభాగంతో బ్రహ్మ సదనంలో నివసిస్తుంది. స్వయంగా ఇక్కడే మన ఇంటిలోనే ఉంటుంది. ఆలాగే గంగాదేవి భగీరథుడివెంట కళాంశరూపంతో నదిగా భారతదేశానికి వెడుతుంది. ముల్లోకాలనూ పవిత్రీకరించడానికి స్వయంగా తానూ ఇక్కడే ఉంటుంది. భూలోకానికి వెళ్ళే దారిలోనే కైలాసంలో అన్యదుర్లభమైన శివుడి జటాజూటాన్ని ఆలంకరిస్తుంది. నువ్వుకూడా ఇలాగే కళాంశాంశరూపంలో పద్మావతీనదిగా తులసీవృక్షంగా భారతభూభాగంలో అవతరిస్తావు. కలియుగంలో అయిదువేల సంవత్సరాలు గడిచాక మీరు ముగ్గురూ తిరిగి పరిపూర్ణ రూపాలతో నా ఈ వైకుంఠానికి చేరుకుంటారు. చింతించకండి. సంపదలు వచ్చినప్పుడే ఆపదలూ వస్తాయి. నిజానికి సంపదలకు ఆపదలే హేతువులు. ఆపదలు వచ్చినప్పుడే కదా.ఎవరి మహిమ అయినా బయటపడేది.

అంచేత మీ మహిమలు లోకానికి తెలియడంకోసమే ఈ ఆపదలు వచ్చాయనుకోండ్షి, నారాయణ మంత్రోపాసకులైన సజ్జనుల దర్శన స్పర్శన స్నానావగాహనలతో మీరు పాపవిముక్తలు అవుతారు. ఎందరు పాపాత్ములు మీలో స్నానాలు చేసినా ఒక సజ్జనుడు స్నానమాడితే చాలు ఆ కిల్బిషాలన్నీ పటాపంచలయిపోతాయి. మీ పవిత్రత మీకు మిగులుతుంది. నా భక్తుల దర్శన స్పర్శనాలతో మీరే కాదు భూలోకంలో ఉన్న అసంఖ్యాక నదీతీర్థాలన్నీ పరిపూతాలు అవుతున్నాయి.

ఆసలు నా భక్తులు భారతదేశంలో సంచరించేదే ఇందుకోసం. భూమినీ నదులనూ పవిత్రీక రించడానికే. వారు ఎక్కడ కాళ్ళు కడిగితే అక్కడ అదొక మహాతీర్థమవుతుంది. పంచమహాపాతకాలు చేసినవాడైనా సరే (స్తీ హత్య - గో హత్య - బ్రాహ్మణ హత్య - కృతఘ్నత - గురుపత్నీ సంభోగం - ఇవి పంచమహాపాతకాలు) నా భక్తులను దర్శించినా స్పృశించినా పవిత్రుడై జీవన్ముక్తుడవుతాడు. మిగతా పాపులను గురించి చెప్పాలా! అందుచేత లక్ష్మీదేవీ! నదీరూపాలు ధరిస్తున్నామనీ పాపాత్ములు వచ్చి మునుగుతారని భయపడకండి. నా భక్తుల దర్శన స్పర్శనాలు మిమ్మల్ని పావనం చేస్తాయి - అని శ్రీహరి ఊరడించాడు.

ఈ మాటలకు లక్ష్మీదేవి కలతదేరింది. అయితే నాథా! హరిభక్తుల లక్షణాలూ గుణగణాలూ చెప్పు. ఎవరు నిజమైన హరిభక్తులో ఎవరు కాదో గుర్తించడం మాకూ ప్రజలకూ సులువవుతుంది - అని అడిగింది. శ్రీహరి ఆరంభించాడు.

లక్ష్మీ! హరిభక్తుల లక్షణం ఆతి నిగూఢమైనది. వేధపురాణాలలో నిక్షిప్తమై ఉంది. అది తెలునుకోవడమే పుణ్యప్రదం. మీకు చెబుతాను. విని మనస్సులో దాచుకోండి. ఖలులకు చెప్పకండి. నువ్వు నాకు ప్రాణతుల్యవు. పవిత్రురాలివి. కనక చెబుతున్నాను విను. గురువు ముఖంనుంచి విష్ణుమంత్రం చెవిలో పడగానే మానవుడు పవిత్రుడవుతున్నాడు, సర్వోత్తముడు అవుతున్నాడు అని వేదాలు చెబుతున్నాయి. అటువంటి పురుషుడి వంశంలో నూరు తరాలు తక్షణం విముక్తి పొందుతాయి. ఏ రూపంలో పుట్టినవారైనా పరిపూతులు అవుతారు. నా భక్తుడు నా గుణాలను పొంది కడపటికి ముక్తుడవుతాడు. నా గుణాలను ఉపాసిస్తూ నా కథలను ఆలకిస్తూ విన్నంతమాత్రాననే పులకితగాత్రుడై ఆనందపరవశుడై బాష్పవారి పరిపూర్ణలోచనుడై గద్గదకంఠుడై మైమరిచిపోతాడు. నా భక్తుడు నన్ను సేవించడంకన్నా సుఖాన్నిగానీ ముక్తినిగానీ సాలోక్యాది చతుష్టయాన్నిగానీ బ్రహ్మత్వామరత్వాలనుగాని ఏమో కోరుకోడు. ఇంద్రత్వ బ్రహ్మత్వ మనుత్వాలూ స్వర్గరాజ్యాలూ అతడికి తృణపాయాలు. నన్ను సేవించడమే కోరుకుంటాడు తప్ప వీటిని కలలోకూడా వాంఛించడు. ఇటువంటి నా భక్తులు భారతదేశంలో సంచరిస్తున్నారు. శ్రావ్యంగా నా గుణగణాలను గానంచేస్తూ ఆనందంగా జీవయాత్ర సాగిస్తున్నారు. మెట్టిన ప్రతిచోటునీ పావనంచేస్తూ మహీమండలాన్ని ఒక తీర్థంగా నా ఆలయంగా మారుస్తున్నారు. 

నారదా! శ్రీహరి ఇలా వివరించి చెప్పేసరికి గంగా లక్ష్మీ సరస్వతులు కుదుటపడ్డారు. ముందుగా భారతీదేవి కళాంశరూపంతో భూభాగానికి వచ్చింది. నదిగా అవతరించి నేలలో ఇంకిపోయింది. వాపీకూపతటాకాలన్నింటా తన అంశంతో ప్రకాశించింది. అందుకనే సరస్వతి (సరస్సు) అయ్యింది. శ్రీహరి సరస్వతుడు అయ్యాడు. మరొక కళాంశరూపంతో సత్యలోకానికి వెళ్ళి బ్రహ్మదేవుడికి ప్రియురాలు అయ్యింది. బ్రాహ్మి అనే పేరు పొందింది. వాగధిష్ఠానదేవతయై వాణిగా కీర్తింపబడింది. స్వయంగా తాను విష్ణుసన్నిధిలోనే మిగిలింది.

అటుపైని భగీరథుని వెంట గంగానది కళాంశరూపంతో భారతభూమికి అవతరించింది. అలా అవతరిస్తున్న సమయంలోనే ఆ వేగాన్ని భరించలేనని భూదేవి ప్రార్థిస్తే శివుడు తన జటాభారాన్ని విస్తరించి బంధించాడు, శిరసా ధరించాడు. పాయగా విడిచిపెట్టాడు. ఇలా గంగాకళాంశకు శివస్థానం అభించింది. న్వయంగా తానూ విష్ణు సన్నిధిలోనే మిగిలింది.

లక్ష్మీదేవి (పద్మ) ఒక కళాంశరూపంతో పద్మావతీనదిగా భారత భూమికి దిగింది. స్వయంగా హరిసన్నిధిలోనే నిలిచింది. మరొక కళాంశరూపంతో ధర్మధ్వజుడి కూతురుగా జన్మించింది. తులసీ నామధేయంతో విఖ్యాతి వహించింది. మొదట సరస్వతి శాపంవల్లా తరవాత హరిశాపంవల్లా వృక్షరూపాన్ని పొందింది. కలియుగంలో అయిదువేల సంవత్సరాలు ఇలా వీరు ముగ్గురూ ఈ నదీరూపాలతో ఉండి తిరిగి విష్ణులోకానికి వెళ్ళిపోతారు. కాశీ బృందావనాలు తప్ప తక్కిన సకల తీర్జాలూ పుణ్యక్తేత్రాలూ వారితోపాటు వైకుంఠానికి వెళ్ళిపోతాయి. ఇది హరి ఆజ్ఞ.



Saraswati Puja - సరస్వతీ పూజ

శ్రీ దేవీ భాగవతం నవమ స్కంధము - సరస్వతీ పూజ

నారాయణమహర్షీ ! నా జన్మ ధన్యమయ్యింది. వినవలసింది అంతా విన్నాను. ఒక్క సందేహం మాత్రం ఉండిపోయింది. పరాప్రకృతి అయిదురూపాలు ధరించిందికదా! వారిలో ఏ రూపానికి ఏ పూజ ఎలా చెయ్యాలి? లోగడ ఎవరు చేశారు ? ఏ వరాలు పొందారు? సోత్రం ధ్యానం ప్రభావం -
ఇత్యాదులన్నీ తెలుసుకోవాలని ఉంది. అనుగ్రహించు - అని నారదుడు అభ్యర్థించాడు. నారాయణమహర్షి ఆరంభించాడు.

నారదా! దుర్గ - రాధ - లక్ష్మి - సరస్వతి - సావిత్రి అని సృష్టికి ఆదిలో పరాప్రకృతి అయిదు రూపాలు ధరించింది. వీరి పూజావిధానం సుప్రసిద్ధం. వీరి ప్రభావం పరమాద్భుతం. వీరి చరితం అమృత ప్రాయం - సర్వమంగళప్రదం. వీరు ప్రకృతికి అంశకళలు. సవిస్తరంగా చెబుతాను సావధానుడవై ఆలకించు. వీరితోపాటు కాళి - వనుంధర - గంగ - షష్ఠి - మంగళచండిక - తులసి - మానస - నిద్ర - స్వధా - స్వాహా - దక్షిణాదేవుల చరితలూ చెబుతాను. సంగ్రహంగా కొందరివీ విస్తరంగా కొందరివీ తెలియజేస్తాను. దుర్గా రాధలది విస్తీర్ణమైన చరిత.

బ్రహ్మనందనా! తొట్టతొలిగా శ్రీకృష్ణుడే సరస్వతీపూజను రూపొందించాడు. ఆ తల్లి అనుగ్రహం ఉన్నట్టయితే మూర్ఖుడుసైతం పండితుడవుతాడు.

కృష్ణాదేవి ముఖంనుంచి ఆవిర్భవించిన వెంటనే సరస్వతీదేవి కామపరవశయై కృష్ణుణ్ణి సమీపించింది. ఆవిడ భావాన్ని గ్రహించిన శ్రీకృష్ణుడు పరిణామంలో సుఖావహమైన హితాన్నీ సత్యాన్నీ మృదువుగా ఉపదేశించాడు.

సాధ్వీ! దేవీ! సరస్వతీ! నా అంశతో అవతరించిన ఈ చతుర్భుజనారాయణుడిని సేవించు. అతడు యువకుడు, సుందరుడు, సర్వసద్గుణ సంపన్నుడు. అన్నింటా నాకు తుల్యుడు. కామినీమణుల కామాన్ని గుర్తించగలిగినవాడు తీర్చగలిగినవాడు శతకోటి మన్మథాకారుడు అతడిని సేవించు. అలాకాక నన్నే కాంతుడుగా వరించి ఇక్కడ ఉండదలిస్తే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. నీకన్నా బలవంతురాలూ శక్తిమంతురాలూ రాధ ఉంది. నీకు క్షేమం కాదు. నేనూ కాపాడలేను. ఇతరులకన్నా బలవంతుడుకదా మరొకరిని కాపాడగలడు. నేను అశక్తుడిని అనీశ్వరుడిని పరులను ఎలా కాపాడగలను? లోకం దృష్టిలో నేను సర్వేశ్వరుడినే, సర్వశాసకుడినే, కానీ రాధను బాధించడానికి మాత్రం నేను చాలను. తేజస్సులో ఆ రాధ నాకు సమానురాలు. నా ప్రాణాధిష్ఠాన దేవత. అందుచేత రాధను హింసించడమంటే నేను ప్రాణాలను విడిచిపెట్టడమే. ఆ పని చెయ్యలేను. ప్రాణాలకన్నా తీపి మరొకటి ఉంటుందా! కాబట్టి ఓ కల్యాణీ! నువ్వు వెంటనే వైకుంఠానికి వెళ్ళు. చతుర్భుజుడిని సేవించు. నీకూ నాకూ క్షేమం. అతడిని పతిగా స్వీకరించి చిరకాలం సుఖాలు అనుభవించు. అక్కడ ఆరిషడ్వర్గవిరహిత లక్ష్మీదేవి ఉంటుంది. తేజోరూపగుణాలలో నీకు సరిసమానురాలు. ఆమెతో నీకు కాలం హాయిగా గడుస్తుంది. లోభమోహాలు లేనిది కనక నిన్ను బాధించదు. ఆ చతుర్భుజనారాయణుడు కూడా మీ ఇద్దరిపట్లా సమానమైన గౌరవాదరాలను చూపిస్తాడు.

సరస్వతీ! నీకు మరొక వరం ఇస్తున్నాను. ప్రతి విశ్వంలోనూ ప్రతి యుగంలోనూ దేవమానవజాతుల వారందరూ నిన్ను పూజిస్తారు. మాఘమాసంలో శుక్ల పంచమినాడూ, విద్యారంభం(అక్షరాభ్యాసం) లోనూ భక్తిప్రపత్తులతో నిన్ను అర్చిస్తారు. మహాప్రళయంతో సృష్టి అంతమయ్యేదాకా నీ పూజలు నిరంతరాయంగా సాగుతాయి. షోడశోపచారాలతో కణ్వశాఖోక్త పద్ధతిలో ధ్యానావాహనస్తవాలతో జితేంద్రియులై నిన్ను కొలుస్తారు. నీ రూపంతో సువర్ణ గుటికను(ప్రతిమ) తయారుచేసి కుండలో (కలశం)
గాని పుస్తకంలోగానీ నిక్షేపించి గంధచందనాదులతో అర్చించి. అటుపైని దానిని కవచంగా కంఠసీమలోనో కుడిబుజానికో ధరించినవారు నీ అనుగ్రహానికి పాత్రులవుతారు.

నారదా! ఇలా నియమించి శ్రీకృష్ణుడు ముందుగా తానే ఆ పూజను చేశాడు. అటుపైని బ్రహ్మవిష్ణు శివాదులూ అనంతుడూ ధర్ముడూ సనకాదిమునీంద్రులూ సకలదేవతలూ రాజులూ మానవులూ అందరూ చేశారు. ఈనాటికీ సకలలోకాలలోనూ సరస్వతీదేవి అర్చింపబడుతోంది - అని క్షుప్తంగా ముగించాడు నారాయణమహర్షి. నారదుడికి సంతృప్తి కలగలేదు. కణ్వశాఖోక్త పద్ధతి ఎమిటో వివరించమని అడిగాడు. పూజాద్రవ్యాలూ నైవేద్యాలూ ధ్యానకవచాదులూ తెలియజెయ్యమని కుతూహలం ప్రకటించాడు. మహర్షి వివరంగా తెలియజేశాడు.

విరించిసుతా! మాఘశుక్షపంచమినాడుగాని అక్షరాభ్యాసంనాడుగాని తెల్లవారుజామునే లేచి శుచియై సంయతుడై నిత్యక్రియలు పూర్తి చేసుకుని కలశాన్ని స్థాపించాలి. ముందుగా వినాయక పూజ జరపాలి. అటుపైని సరస్వతిని ధ్యానించి కలశంలోకి ఆవాహన చెయ్యాలి. మళ్ళీ ధ్యానించాలి. షోడశోపచారపూజలు చెయ్యాలి. పాలు పెరుగు వెన్న పేలాలు చిమ్మిలి చెరకు పటికబెల్లం తేనె - ఇత్యాదులు నైవేద్యం పెట్టాలి. తెల్లని బియ్యంతో అక్షతలు తయారుచెయ్యాలి. అటుకులు, వరి అన్నం, ఘృత సైంధవ సమ్మిశ్రితమైన హవిష్యాన్నం, యవగోధూమచూర్ణంలో నెయ్యి పాలూ పంచదారా కలిపి చేసిన ప్రసాదం, అరటిపండ్లు, క్షీరాన్నం, నారికేళం, కొబ్బరినీళ్ళు, బదరీఫలం - ఏవైనాసరే ఆయా ఋతువుల్లో ఆయా దేశాలలో దొరికే పళ్ళూ ఫలాలూ నైవేద్యానికి పనికివస్తాయి. అలాగే పువ్వులన్నీ పూజకు పనికివస్తాయి. సుగంధభరితమైన చందనంతో పూజించాలి. తెల్లని నూతనవస్త్రం కావాలి. అందమైన శంఖం కావాలి. తెల్లని పూవులతో దండకట్టి సమర్పించాలి. వేదసమ్మతమైన సరస్వతీధ్యానం తెలియజేస్తున్నాను. ఇది సకలభ్రమభంజకం. శ్రద్ధగా గ్రహించు -

సరస్వతీం శుక్లవర్ణాం సస్మితాం సుమనోహరాం ।
కోటిచంద్రప్రభాముష్ట పుష్టశ్రీయుక్త విగ్రహాం ॥

వహ్నిశుద్ధాంశుకాధానాం వీణాపుస్తకధారిణీం ।
రత్నసారేంద్ర నిర్మాణ నవభూషణ భూషితాం ॥

సుపూజితాం సురగణైః బ్రహ్మ విష్ణుశివాదిభిః ।
వందే భక్త్యా వందితాం చ మునీంద్రమనుమానవైః ॥

ఇలా ధ్యానించి, సమస్తమూ అర్పణచేసి, స్తుతించి, కవచం ధరించి సాష్టాంగనమస్కారం చెయ్యాలి. చేసినవారికి సరస్వతీదేవి కులదైవమై సకలశుభాలూ కలిగిస్తుంది. విద్యారంభంలోగాని, సంవత్సరాదినాడుగానీ, ఏ పంచమిరోజునగానీ ఈ పూజ చెయ్యవచ్చు. ఓం - ఐం - హ్రీం - క్లీం - శ్రీం అనే బీజాక్షారాలతో రెండేసితో కలిసి సరస్వత్యై స్వాహా అనేది వైదికాష్టాక్షరీ మూలమంత్రం. ఇది కల్పవృక్షం లాంటి మంత్రం.

(ఐం హ్రీం క్లీం = బీజత్రయం = తారత్రయం = సరస్వతీ లక్ష్మీ మాయా బీజాక్షరాలు)

ఈ సరస్వతీ మూలమంత్రాన్ని ఆదిలో నారాయణుడు గంగాతీరాన వాల్మీకి మహర్షికి ఉపదేశించాడు. బదరికాశ్రమంలో బ్రహ్మదేవుడు భృగువుకి ఉపదేశించాడు. పుష్కరక్షేత్రంలో సూర్యగ్రహణంనాడు భృగుమహర్షి శుక్రుడికి ఉపదేశించాడు. చంద్రగ్రహణంరోజున మరీచిమహర్షి వాక్పతికి (బృహస్పతి) అనుగ్రహించాడు. క్షీరసముద్రతీరంలో ఆస్తీకుడికి జరత్కారువూ, మేరుశిఖరంమీద విభాండకుడు ఋష్యశృంగుడికీ, శివుడు కణాదగౌతములకూ, సూర్యుడు కాత్యాయన యాజ్ఞవల్క్యులకూ, ఆదిశేషుడు పాతాళంలో పాణినికీ, భారద్వాజుడికీ, శాకటాయనుడికీ ఉపదేశించారు. నారదా! మూలమంత్రాన్ని నాలుగులక్షలు నిష్ఠతో జపించినట్టయితే మంత్రసిద్ధి కలుగుతుంది. మంత్రసిద్ధి కలిగిందంటే అతడు బృహస్పతి సమానుడయినబ్దే.

నారదా! గంధమాదన పర్వతంమిద బ్రహ్మదేవుడు భృగుమహర్షికి విశ్వజయ సంపాదకమైన సరస్వతీకవచాన్ని అనుగ్రహించాడు. ఆ సందర్భంగా జరిగిన వారిద్దరి సంభాషణనూ యథాతథంగా చెబుతున్నాను - ఆలకించు. 

భృగుమహర్షి: హే బ్రహ్మన్‌! బ్రహ్మవిదాంశ్రేష్ఠ! బ్రహ్మజ్ఞానవిశారదా! సర్వజ్ఞా! సర్వజనకా! సర్వేశా! సర్వపూజితా! విశ్వజయావహమైన సరన్వతీకవచాన్ని అనుగ్రహించు. 

వత్సా! భృగూ! సర్వవాంఛాప్రదమైన సరస్వతీకవచాన్ని ఉపదేశిన్తున్నాను గ్రహించు. ఇది శ్రుతిసారం, శ్రుతిసుఖం, శ్రుత్యుక్తం, శ్రుతిపూజితం. గోలోకబ్బంచావనంలో రాసక్రీడారతుడైన రాసేశ్వరుడు శ్రీకృష్ణుడు నాకు ఉపదేశించాడు. ఇది కల్పవృక్షసమం. అత్యంతగోపనియం. కనీవినీ ఎరుగని మంత్రాక్షరాలున్నాయి ఇందులో. ఈ కవచాన్ని ధరించిన శుక్రాచార్యుడు సర్వదైత్యగురువయ్యాడు, బృహస్పతి బుద్దిమంతుడయ్యాడు. దేవగురువు అయ్యాడు. వాల్మీకి కవీంద్రుడయ్యాడు. స్వాయంభువ మనువు సర్వపూజితుడు అయ్యాడు. దీన్ని పఠించినందువల్లా ధరించినందువల్లా విశేషఫలితాలు లభిస్తాయి. కణాద గౌతమ కణ్వ పాణిని శాకటాయన కాత్యాయన ప్రభృతులు దక్షులైన శాస్త్రకర్తలయ్యారు. వ్యాసుడు వేదాలను విభజించగలిగాడు. పురాణాలు రచించగలిగాడు. శాతాతప - సంవర్త - వసిష్ఠ - పరాశర - యాజ్ఞవల్క్య - ఋష్యశృంగ - భరద్వాజ - ఆస్తీక - దేవల - జైగీషవ్య - యయాతి ప్రముఖులు సర్వదా సర్వధా గౌరవమర్యాదలు అందుకున్నారంటే దీని మహిమవల్లనే. ఈ కవచానికి ప్రజాపతియే స్వయంగా ఋషి. బృహతీ ఛందస్సు. శారదాంబికయే దేవత. సర్వ తత్త్వపరిజ్ఞాన - సర్వార్థసాధన - కవితారచనలయందు దీని వినియోగం. బీజాక్షరాలతో సహా ఉపదేశిస్తున్నాను, గ్రహించు.

ఓం శ్రీం హ్రీం సరస్వ త్త్యై స్వాహా -శిరో మే పాతు సర్వతః
ఓం శ్రీం వాగ్దేవతాయై స్వాహా -ఫాలం మే సర్వదాఽవతు.

ఓం హ్రీం సరస్వత్త్యె స్వాహా - ఇతి శ్రోత్రే పాతు నిరంతరమ్
ఓం శ్రీం హ్రీం భగవత్త్యె సరస్వత్త్య స్వాహా - నేత్రయుగ్మం సదాఽవతు

ఓం ఐం హ్రీం వాగ్వాదిన్యై స్వాహా - నాసాం మే సర్వదాఽవతు
ఓం హ్రీం విద్యాదిష్ఠాతృదేవ్యై స్వాహా - చోష్ఠం సదాఽవతు

ఓం శ్రీం హ్రీం బ్రాహ్మ్యై స్వాహేతి - దంతపంక్తిం సదాఽవతు
ఓం ఐం మిత్యేకాక్షరో మంత్రో మమ కంఠం సదాఽవతు

ఓం శ్రీం హ్రీం పాతు మే గ్రీవాం స్కంధౌ మే శ్రీం సదాఽవతు
ఓం హ్రీం విద్యాధిష్ఠాతృదేవ్యై స్వాహా - వక్షః సదాఽవతు

ఓం హ్రీం విద్యాధిస్వరూపాయై స్వాహా - మే పాతు నాభికామ్
ఓం హ్రీం క్లీం వాణ్యై స్వాహేతి - మమ హస్తౌ సదాఽవతు

ఓం సర్వవర్ణాత్మికాయై స్వాహా - పాదయుగ్మం సదాఽవతు
ఓం హ్రీం వాగధిష్ఠాతృదేవ్యై స్వాహా - సర్వాంగ సదాఽవతు

ఓం సర్వకంఠవాసిన్యై స్వాహా - ప్రాచ్యాం సదాఽవతు
ఓం సర్వజిహ్వాగ్రవాసిన్యై స్వాహా - అగ్నిదిశి రక్షతు

ఓం ఐం హ్రీం శ్రీం క్లీం సరస్వత్త్యె బుధజనన్యై స్వాహా
సతతం మంత్రరాజోఽయం దక్షిణే మాం సదాఽవతు

ఓం ఐం హ్రీం శ్రీం క్లీం త్య్రక్షరో మంత్రో నైరృత్యాం సర్వదాఽవతు
ఓం ఐం జిహ్వాగ్రవాసిన్యై స్వాహా మాం - వారుణోఽవతు

ఓం సర్వాంబికాయై స్వాహా వాయవ్యే మాం సదాఽవతు
ఓం ఐం శ్రీం క్లీం గద్యవాసిన్యై స్వాహా మాముత్తరేఽవతు

ఓం ఐం సర్వశాస్త్రావాసిన్యై స్వాహా - ఈశాన్యాం సదాఽవతు
ఓం హ్రీం సర్వపూజితాయై స్వాహా చోర్థ్వం సదాఽవతు

ఓం హ్రీం పుస్తకావాసిన్యై స్వాహా - అధో మాం సదాఽవతు
ఓం గ్రంథబీజస్వరూపాయై స్వాహా మాం సర్వతోఽవతు  (4 - 85)

భృగుమహర్షీ! ఇది బ్రహ్మ మంత్రౌఘరూపం. బ్రహ్మరూపకం. ఈ సరస్వతీకవచానికే 'విశ్వజయము' అని మరొక పేరు. ఒకప్పుడు గంధమాదన పర్వతంమీద సూర్యుడి ముఖతః నేనిది విన్నాను. ఇప్పుడు నీమీద ప్రేమతో ఉపదేశించాను. ఇది అత్యంత గోప్యం. ఎవరికిబడితేవారికి ఉపదేశించకూడదుసుమా!

దీన్ని ఉపదేశించిన గురువును శాస్త్రీయంగా వస్త్రాలంకార చందనాదులతో అర్చించి సాష్టాంగపడి లేచి కవచధారణ చెయ్యాలి. అయిదులక్షలు జపిస్తే ఈ కవచం సిద్ధిస్తుంది. సిద్ధకవచుడు బృహస్పతి సమానుడవుతాడు. మహావాగ్గ్మి మహాకవి త్రైలోక్యవిజయి అవుతాడు. అతడికి అంతటా జయమే. కణ్వశాఖోక్తమైన కవచమిది. ఇంక స్తోత్రమూ పూజావిధానమూ ధ్యానమూ ఇత్యాదులున్నాయి. వాటినికూడా తెలుసుకోవడం మంచిది. చెబుతాను. ఆలకించు.

నారదా! బ్రహ్మదేవుడు భృగుమహర్షికి ఇలా సరన్వతీకవచాన్ని మూలమంత్ర సహితంగా ఉపదేశించి స్తోత్రాన్ని అనుగ్రహించాడు. అదికూడా నీకు తెలియజేస్తాను. తెలుసుకో.

వాగ్దేవీస్తుతి సర్వకామప్రదం. ఒకప్పుడు యాజ్ఞవల్క్యుడు ఈ స్తుతి చేశాడు. శాపవిముక్తి పొందాడు. గురుశాపంవల్ల ఆ మహాముని ఆవిద్యుడు అయ్యాడు. (నేర్చిన విద్యలన్నీ మరిచిపోయాడు). దుఃఖార్తుడై సూర్యుడి దగ్గరికి వెళ్ళాడు. అతడిని స్తుతించాడు. తన గోడు వెళ్లబోసుకుని విలపించాడు. సూర్యుడు అనుగ్రహించి వేదవేదాంగాలను చదివించాడు. వాగ్దేవిని స్తుతిస్తే పూర్వస్మృతి కలుగుతుందని సలహాచెప్పాడు. ఆమాటమీద యాజ్ఞవల్క్యుడు నదిలో స్నానం చేసి శుచియై భక్తితో శిరసువంచి సరస్వతిని స్తుతించాడు.

ఓ వాగ్దేవీ! జగన్మాతా! నన్ను దయజూడు. నా తెలివీ నా చదువూ గురుశాపంవల్ల నశించాయి. చదువులన్నీ మరుపున పడ్డాయి. ఇప్పుడు విద్యావిహీనుడిని అయ్యాను. నాకు జ్ఞానాన్ని ప్రసాదించు. స్మృతిని అనుగ్రహించు. విద్యనూ శక్తినీ కలిగించు. గ్రంథరచనాశక్తిని దయచెయ్యి. ఉత్తమశిష్యుడిని సమకూర్చు. ప్రతిభనూ సభాసత్కారాన్నీ అనుగ్రహించు. గురుశాపంవల్ల కోల్పోయిన విద్యలనన్నింటినీ తిరిగి వినూతనంగా ప్రసాదించు. కాలిపోయిన విత్తనాన్ని మొలకెత్తించే శక్తి దేవతలకు మాత్రమే ఉంటుందిట. నువ్వు బ్రహ్మస్వరూపవు. జ్యోతిస్స్వరూపవు. సనాతనివి. సర్వవిద్యాధిదేవివి. హే వాణి! నమోనమః నన్ను మళ్ళీ మొలకెత్తించు. విసర్గ బిందు మాత్రలకు అధిష్ఠాత్రివి నువ్వు. నీతివి నువ్వు, వ్యాఖ్యారూపవు, వ్యాఖ్యాధిష్ఠాత్రివి. నీ దయలేనిదే ఎంతటి పండితుడైనా నోరుమెదపలేడు. కాలసంఖ్యా స్వరూపిణీ! నమోనమః. భ్రమసిద్ధాంతరూపవు. స్మృతిశక్తి - జ్ఞానశక్తి - బుద్ధిశక్తి నువ్వే. ప్రతిభాకల్పనా శక్తులుకూడా నువ్వే.

ఒకప్పుడు సనత్కుమారుడు బ్రహ్మదేవుణ్ణి జ్ఞానోపదేశం చెయ్యమని అడిగాడు. అంతటి బ్రహ్మదేవుడూ సిద్ధాంతం చెయ్యలేక మూగవోయాడు. ఆప్పుడు అక్కడికి శ్రీకృష్ణపరమాత్మ వచ్చాడు. వాణిని స్తుతించమని బ్రహ్మకు సలహా చెప్పాడు. అతడు ఆలా స్తుతించి నీ అనుగ్రహంతో ఉత్తమోత్తమ సిద్ధాంతం చేసి సనత్కుమారుడికి జ్ఞానం ఉపదేశించాడు.

ఇలాగే ఒకప్పుడు వసుంధరాదేవి జ్ఞానోపదేశం చెయ్యమని ఆనంతుణి అభ్యర్థించింది. అతడు నోరు మెదపలేకపోయాడు. ఇదేమిటి విచిత్రమని బెంబేలుపడ్డాడు. అంతలోకీ కశ్యపుడు వచ్చి ధైర్యం చెప్పి సరస్వతిని ప్రార్థించమన్నాడు. అనంతుడు అలాగే స్తుతించాడు. సరస్వతీ! నువ్వు కరుణించావు. అప్పుడు అతడు గొప్ప సిద్ధాంతాలు చేసి వసుంధరకు జ్ఞానభిక్ష పెట్టాడు. ఆమెకు మనస్సులో ఉన్న భ్రమప్రమాదాలను తొలగించాడు.

వ్యాసుడు ఒకనాడు పురాణసూత్రం తెలియజెప్పమని వాల్మికిని అడిగాడు. ఆదికవి మౌనిగా మారి క్షణకాలం వాగ్దేవిని నిన్ను స్మరించాడు. నీ అనుగ్రహంతో వ్యాసుడికి జ్ఞానోపదేశం చేశాడు. భ్రమాంధకారాన్ని పారద్రోలే దీపంలాంటి నిర్మలజ్ఞానాన్నీ పురాణసూత్రాన్నీ వాల్మీకి వ్యాసుడికి తెలియజెప్పగలిగాడు. అటుపైని వ్యాసుడు పుష్కరక్షేత్రంలో నూరేళ్ళు సరస్వతీ మంత్రజపం చేసి నీ అనుగ్రహానికి పాత్రుడై వరం పొంది మహాకవీశ్వరుడయ్యాడు. వేదాలను విభజించగలిగాడు. మహాపురాణాలనూ ఉపపురాణాలనూ రచించగలిగాడు.

వాణీ ! తత్త్వజ్ఞానం ఉపదేశించమని ఇంద్రుడు శివుణ్ణి అడిగినప్పుడుకూడా శివుడు నిన్నే ధ్యానించాడు. ఉపదేశించగలిగాడు. అలాగే బృహస్పతి దగ్గరికి వెళ్ళి శబ్దశాస్త్రం బోధించమని ఇంద్రుడు అడిగినప్పుడు ఆ దేవగురువు వాఙ్మాతా! నిన్నే తలుచుకున్నాడు. నీ అనుగ్రహంతోనే బోధించగలిగాడు. ఇంద్రుడితోపాటు మరికొందరు శిష్యులుకూడా అప్పుడు శబ్దశాస్త్రం నేర్చుకున్నారు. అప్పటి నుంచీ వారంతా వాగ్దేవిని నిన్నే ఉపాసిస్తూ ఆ శాస్త్రాన్ని ప్రబోధిస్తున్నారు.

పలుకులతల్లి! నీ గుణగణాలను కొనియాడటానికి సహస్రముఖ - పంచముఖ - చతుర్ముఖులే (ఆదిశేషుడు, శివుడు, బ్రహ్మ) చాలరంటే ఎకముఖుణ్ణి మానవమాత్రుణ్ణి నేను ఎలా స్తుతించగలను?

యాజ్ఞవల్క్యుడు భక్తిభావనమ్రుడై శిరసువంచి సరస్వతీదేవిని ఇలా స్తుతించాడు. సాష్టాంగపడ్డాడు.
దుఃఖభారంతో రోదించాడు. జ్యోతిస్స్వరూపిణి మహామాయ ఆ సరస్వతీదేవి కటాక్షించింది. 'సుకవీంద్రుడవు కమ్ము' అని ఆశీర్వదించి వైకుంఠానికి వెళ్ళిపోయింది.

నారదా! యాజ్ఞవల్క్యుడు చేసిన ఈ వాణీస్తోత్రాన్ని పఠించినవారు కవీంద్రులవుతారు. సంభాషణచతురులవుతారు. బృహస్పతి సమానులవుతారు. మూర్ఖుడుకానీ బుద్ధిహీనుడుకానీ ఒక సంవత్సరంపాటు ఈ స్తోత్రాన్ని పారాయణచేస్తే ఆతడు పండితుడవుతాడు. కవీంద్రుడవుతాడు. మేధావి అవుతాడు. ఇది ముమ్మాటికీ నిశ్చయం.

నారదమహర్షి! వైకుంఠంలో నారాయణుడి చేరికలో ఉంటున్న సరస్వతికి ఒకనాడు గంగాదేవితో కలహమయ్యింది. గంగ ఇచ్చిన శాపంవల్ల భారతదేశంలో సరస్వతీ కళ ఒక నదిగా అవతరించింది.
పుణ్యరూప పుణ్యతీర్థ స్వరూపిణి పుణ్యాత్ములతో సేవలందుకొన్న తపోరూపిణి. తపఃఫలస్వరూపిణి  పాపాలు అనే ఎండుకట్టెలను తగులబెట్టడానికి జలరూపంలో ఉన్న జ్వలదగ్ని స్వరూపిణి. సరస్వతీనదిలో మునిగి మరణించినవారికి వైకుంఠంలో స్థిరనివాసమే. ఎంతటి పాపాత్ముడైనా ఏ రోజునగానీ ఏ సమయానగానీ తెలిసిగానీ తెలియకగానీ విలాసంగాగానీ ఆ నదిలో స్నానం చేస్తే చాలు అతడి పాపాలు అన్నీ పటాపంచలై విష్ణులోకంలో హరిసన్నిధిలో నివాసం పొందుతాడు. హరితో సారూప్యం పొందుతాడు. సరస్వతీమంత్రాన్ని ఈ నదీతీరంలో ఒకనెలపాటు జపించినవాడు మహామూర్ఖుడైనా కవీంద్రుడవుతాడు. నిరంతరం ఈ నదిలో స్నానం చేసినవారికి మరింక పునర్జన్మ ఉండదు. గర్భవాసదుఃఖం ఉండదు.

నారదా! నాకు తెలిసినంతమటుకు సరస్వతీగుణకీర్తన చేశాను. ఇంకా ఏమి తెలుసుకోవాలను కుంటున్నావో అడుగు - అని ముగించాడు నారాయణమహర్షి అప్పుడు మళ్ళీ నారదుడు అడిగాడు.

గంగా సరస్వతుల కలహం


The conflict between Ganga and Saraswati - గంగా సరస్వతుల కలహం

శ్రీ దేవీ భాగవతం నవమ స్కంధము -  గంగా సరస్వతుల కలహం నారాయణమహర్షీ! సరస్వతీదేవి గంగాశాపంవల్ల భారతదేశంలో నదిగా అవతరించింది అన్నావు. వారిద్దరికీ ...