మహర్షీ అంటూ మళ్ళీ అందుకున్నాడు నారదుడు. ఇంద్రుడు చేసిన మానసా స్తోత్రం పూజాక్రమం తెలియజెప్పమన్నాడు. నారాయణమహర్షి అలాగే అని చెప్పనారంభించాడు.
ఇంద్రుడు సుస్నాతుడై ధౌతవస్త్రాలు ధరించి శుచిగా నానావిధ పూజాద్రవ్యాలతో వచ్చాడు. వస్తూనే మనసాదేవికి సాష్టాంగ నమస్కారం చేశాడు. రత్నసింహాసనంమీద కూర్చుండబెట్టాడు. రత్నకుంభాలతో తెచ్చిన గంగాజలంతో వేదమంత్రపూర్వకంగా స్నానం చేయించాడు. అగ్నిజ్వాలల్లాంటి వస్త్రాలను సమర్పించాడు. చందనం అందించాడు. అర్ఘ్యపాద్యాలు ఇచ్చాడు. గణేశ దినేశ వహ్ని విష్ణు పార్వతీ పరమేశ్వరులను(దేవషట్కం) ముందుగా అర్చించాడు.
ఓం హ్రీం శ్రీం క్లీం ఐం మానసాదేవ్యై స్వాహా అనే మూలమంత్రాన్ని జపిస్తూ పారిజాత పుష్పాలతో పాదపూజ చేశాడు. ఇతరులకు ఎవ్వరికీ అందనంతటి విలువైన వస్తువులతో శ్రద్దగా షోడశోపచారాలూ జరిపాడు. నృత్యవాద్యసంగీతాలతో ఆనందపరిచాడు. ఈ పూజను చూడటానికి త్రిమూర్తులూ సతీసమేతులై వచ్చారు. పులకాంకితగాత్రుడై సాశ్రునేత్రుడై మనసాదేవిని స్తుతించాడు.
దేవీ! పతివ్రతా శిరోమణీ! నిన్ను స్తుతించాలి అనుకొంటున్నానుగానీ నాకు శక్తి సరిపోవడం లేదు. స్వభావాన్ని వర్ణించడమే స్తోత్రలక్షణమని వేదం చెబుతోంది. (స్తోత్రాణాం లక్షణం వేదే స్వభావాఖ్యానతత్పరమ్) నువ్వు పరాత్పరవు. ప్రకృతి స్వరూపిణివి. నీ గుణగణాలను వర్ణించడం నా తరమా! శుద్దసత్త్వస్వరూపవు. కోపక్రోధవివర్జితవు. శంకర ప్రియశిష్యవు. నాకు సోదరివి. నిన్ను విడిచిపెట్టి వెళ్ళడానికి అశక్తుడై మా బావగారు జరత్కారుడంతటివాడు నీ అనుమతినే యాచించాడు. అదితిలాగా నువ్వు నా తల్లివి, సోదరివిగా దయారూపవు. కన్నతల్లిలాగా క్షమారూపవు. నా ప్రాణాలను కాపాడావు. కుటుంబాన్ని రక్షించావు. బంధుమిత్ర పరివారాన్ని ఆపదలో ఆదుకున్నావు. నువ్వు సురేశ్వరివి. జగదంబికవు. నిన్ను నిత్యమూ పూజించాలి. ఇప్పుడు చేస్తున్న ఈ పూజతో ఆనందించి ఇంకా మాపట్ల దయామయివి అవుతావని ఆకాంక్షిస్తున్నాను.
ఆషాఢంలో సంక్రమణంనాడుగానీ నెలనెలా పంచమీనవముల్లోగానీ మాసాంతంలోగాని (పూర్ణిమ - అమావాస్య) ఇంతెందుకు నిత్యమూ నిన్ను అర్చించినవారికి పుత్రపౌత్రాభివృద్ధిగా ధనధాన్య సమృద్ధి కలుగుతుంది. కీర్తిమంతులూ విద్యావంతులూ గుణవంతులూ అవుతారు. అజ్ఞానంతో నిన్ను నిందించినవారికి సర్పభయం తప్పదు. దరిద్రులవుతారు. నువ్వు స్వయంగా సర్వలక్ష్మివి. వైకుంఠంలో మహాలక్ష్మివి. జరత్కారుడు నారాయణాంశ సంభూతుడు కనక నిన్ను చేపట్టాడు. బ్రహ్మదేవుడు నిన్ను తన తేజస్సునంతా ఉపయోగించి మనస్సుతో సృష్టించాడు. కనకనే మనసాదేవివయ్యావు. పరమపావనమూర్తివి. మమ్మల్ని రక్షించడానికే నువ్వు అవతరించావు. నీ అంతట నువ్వు సిద్దయోగినివి. సత్యస్వరూపవు. సత్యాన్ని ఉపాసిస్తే నిన్ను ఉపాసించినట్టే. నేటినుంచీ దేవతలూ త్రిలోకవాసులూ భక్తితో నిన్ను అర్చిస్తారు. అభీష్టవరాలు పొందుతారు.
దేవేంద్రుడు మనసాదేవిని మనసారా స్తుతించి భగినీపతి జరత్కారువును వెంటదీసుకుని స్వర్గలోకానికి వెళ్ళిపోయాడు. సుతుడు అస్తీకుడితో మనసాదేవి కశ్యవుడి ఆశ్రమంలో సుఖంగా నివసించింది. సోదరుల పూజలు అందుకుంటోంది. అందరూ అర్చనలు చేస్తున్నారు.
గోలోకంనుంచి(కామధేనువు) సురభివచ్చి మనసాదేవికి క్షీరాభిషేకం జరిపింది. ఆత్యంత గోప్యమూ సర్వజన దుర్లభమూ అయిన జ్ఞానాన్ని ఉపదేశించింది. ఇంద్రలోకానికి తిరిగివెళ్ళింది.
ఇంద్రుడు చేసిన మనసాస్తోత్రాన్ని పఠించినవారికి నాగభయం ఉండదు. విషంకూడా అమృతోపమం అవుతుంది. వంశవృద్ధి జరుగుతుంది. అయిదులక్షలసార్లు పఠిస్తే స్తోత్రసిద్ది కలుగుతుంది. అతడు సర్పాలపై సవారీ చెయ్యగలడు. సర్పాలపై విశ్రమించగలడు.
No comments:
Post a Comment