నారదా! షష్ఠీదేవి - మంగళచండికల ఉపాఖ్యానాలు అయ్యాయి. మానసాదేవి వృత్తాంతం ఇక చెబుతున్నాను. ఆలకించు. ఆవిడ కశ్యపప్రజాపతి కూతురు. మానసపుత్రిక. అందుకే మానసాదేవి అన్నారు. మహాయోగీశ్వరి. పరాత్పరుణ్ణి నిరంతరం తన మనస్సులో నిలుపుకుంటుంది. అలాకూడా సార్థకనామధేయ. ఆత్మారామ, వైష్ణవి, సిద్ధయోగిని.
మూడు యుగాలపాటు శ్రీకృష్ణుడికోసం తపస్సు చేసింది. తపోనియమనిష్ఠలు కారణంగా ఆవిడ శరీరంలో శైథిల్యం వర్ణవైక్లబ్యం సంభవించాయి. అది గమనించి శ్రీకృష్ణుడు చమత్కారంగా “జరత్కారు” అని పేరుపెట్టాడు.
జరత్కారు శరీరం చ దృష్ట్వా యత్‌క్షీణమీశ్వరః ।
గోపీపతిర్నామ చక్రే జరత్కారురితి ప్రభుః ॥
కృపానిధి శ్రీహరి మానసాదేవి అభీష్టం తీర్చాడు. తాను స్వయంగా పూజచేసి తక్కినవారితో చేయించాడు. స్వర్గాదిలోకాలన్నింటా పూజలు జరిగాయి. ఆ సుందరీమణిని అందరూ గౌరిగా (గౌరవర్ణంలో ఉంటుంది కనక) ఆరాధించారు. జగద్గౌరి అనే పేరు స్థిరపడింది. కొంతకాలానికి శివుడికి శిష్యురాలయ్యింది. అప్పటినుంచి శైవి అనేపేరు వచ్చింది. మొదటినుంచీ విష్ణుభక్తురాలు కనక వైష్ణవి అయ్యింది. పరీక్షిన్మహారాజు కొడుకు జనమేజయుడు సర్పయాగం చేసినప్పుడు పాముల ప్రాణాలను కాపాడింది కనక నాగేశ్వరి నాగభగిని అనేపేర్లు సిద్దించాయి. ఎంతటి విషాన్నయినా విరిచివెయ్యగలిగిన సామర్ధ్యం ఉంది కనక విషహర అనే బిరుదును పొందింది. హరుడినుంచి సిద్దయోగం పొందింది కనక సిద్దయోగిని, మరణించినవారిని బతికించకలదు కనక మృతసంజీవని. ఆస్తీకుడనే మునీంద్రుణ్ణి కన్నతల్లి. ఆస్తీకమాత, మహాతపస్విని. మహాజ్ఞాని. జరత్కారుడనే మహామునీంద్రుడికి ఇల్లాలయ్యింది కనక జరత్కారుప్రియ. ఇలా మొత్తం పన్నెండు పేర్లున్నాయి ఈ మానసాదేవికి.
జరత్కారుర్జగద్గౌరీ మానసా సిద్దయోగిని ।
వైష్ణవీ నాగభగినీ శైవీ నాగేశ్వరీ తధా ॥
జరత్కారుప్రియాస్తీకమాతా విషహారేతి చ ।
మహాజ్ఞానయుతా చైవ సా దేవీ విశ్వపూజితా ॥
ఈ పన్నెండు నామాలనూ పూజాకాలంలో పఠించినవారికీ వారి వంశోద్భవులకూ పాములపుట్టమీద పడుకున్నా సర్పభయం ఉండదు. పదిలక్షలసార్లు పఠిస్తే స్తోత్ర సిద్ధి కలుగుతుంది. అది కలిగిందంటే అతడు మహావిషాన్ని తిని జీర్ణించుకోగలడు. పాములను అలంకరించుకోగలడు. నాగేంద్రుడిమీద నడుంవాల్చగలడు. నాగవాహనుడూ నాగాసనుడూ నాగతల్పుడూ కాగలడు. జన్మ ముగిసిన తరవాత సరాసరి వైకుంఠానికి వెళ్ళి విష్ణువుతో రేయింబవళ్ళు విందువినోదాలతో క్రీడించగలడు.
ఈ మనసాదేవి ధ్యానశ్లోకాలు సామవేదోక్తాలు. పూజావిధానమూ మూలమంత్రమూ ఉన్నాయి.
శ్వేతచంపకవర్ణాభాం రత్నభూషణభూషితామ్ ।
వహ్నిశుద్దాంశుకాధానాం నాగయజ్ఞోపవితినీమ్ ॥
మహాజ్ఞానయుతాం తాం చ ప్రవరజ్ఞానినాం వరామ్ ।
సిద్దాధిష్ఠాతృ దేవీం చ సిద్దాం సిద్దిప్రదాం భజే ॥
ఇలా ధ్యానించి పుష్పచందనాదులతో పూజించాలి. ఓం హ్రీం శ్రీం క్లీం ఐం మానసాదేవ్యై స్వాహా ఆనే మూలమంత్రాన్ని ఏకాగ్రచిత్తంతో జపించాలి. ఆయిదులక్షలు జపంచేస్తే మంత్రసిద్ధి కలుగుతుంది. కలిగిందంటే అతడు సిద్దుడయినట్టే. అతడికి మహావిషంకూడా అమృత ప్రాయమే. సాక్షాత్తు ధన్వంతరిగా లెక్క. సంక్రమణం రోజునగానీ ప్రతినెలా పంచమినాడుగానీ గూఢమందిరాల్లో కూర్చుని ధ్యానావాహనషోడశోపచార పూర్వకంగా మనసాదేవిని అర్చించి ఈ మూలమహామంత్రం జపించాలి. అటుపైని బలిప్రదానం జరగాలి. ఆలా చేసినవారికి ధనధాన్య పుత్రపౌత్రాభివృద్ది కలుగుతుంది. సత్కీర్తి లభిస్తుంది.
No comments:
Post a Comment