“అయ్యా! పుట్టుకకు కారణమైన కర్మ అనే రోగం తొలగిపోవడానికి కారణమైన దివ్యమైన మందు కాబట్టి శ్రీమన్నారాయణునికి సంబంధించిన కథలనే అమృతం తాగు” మని ఇలా అన్నాడు.
శ్రీకృష్ణుడు గొప్ప భుజబలం కలవాడై బలవంతమైన సేనతో గొప్ప రాక్షసవీరులందరిని యుద్ధంలో అనతికాలంలోనే సంహరించాడు. భూభారం ఇంకా ఎక్కువగా ఉండడంచేత జూదం అనే క్రీడ కారణంగా యుద్ధంలో చావడానికి కౌరవ పాండవసేనలు భూమండలం కంపించే విధంగా నడిచాయి.
అప్పుడు తనయందు (శ్రీకృష్ణుని) సహజమైన భక్తి గల యాదవవీరులు(యుద్ధంలో నశింపక) ఎంతగానో సంతసించారు. (వీరిని చూచిన) మహర్షులు, నందుడు మొదలైన వారికి కూడా ఎంతో సంతోషమైంది.
దేవతలందరిచేత సేవింపబడి ప్రసిద్ధుడైన శ్రీకృష్ణుడు దుర్మదాంధులైన భూపాలకులను అణచివేసి, కంసుడు మొదలైన వాళ్లను సమూలంగా సంహరించి, భూభారం తగ్గించి ఎంతో సంతోషంతో ఉండగా యాదవసేనలు విజృంభించి, నేల దద్దరిల్లేటట్లు అతి భయంకరంగా దుస్సహంగా నడిచాయి (దీనివల్ల భూభారం అధికమైంది).
శ్రీకృష్ణుడీవిధంగా పూతన, శకటాసురుడు, తృణావర్తుడు, వత్సాసురుడు, ధేనుకాసురుడు, ప్రలంబకాసురుడు, అఘాసురుడు మొదలైన రాక్షసులను; చాణూర ముష్టికులనూ; సాల్వ, శిశుపాల, దంతవక్త్ర, కంస, పౌండ్రకాదులను సంహరించి, ఆపైన కురుబలాన్ని అణచివేసి, ధర్మరాజును చక్రవర్తిగా అభిషేకించాడు. ధర్మరాజు రాజ్యపాలన చేస్తుండగా సంతోషపడినాడు. తన భక్తులైన యాదవులను పరిశీలనగా చూచి “వీళ్లు ఇతరుల వల్ల పరాభవం(అవమానం) పొందరు. వీళ్లను సంహరించడానికి నేను తప్ప ముల్లోకాలలోనూ మరొక దైవం లేదు” అని భావించాడు.
యాదవులను పరిమార్చడానికి తాను తప్ప మరొక దైవం లేదని లోకప్రభువైన శ్రీకృష్ణుడు బాగా ఆలోచించాడు. ఎంతో పెద్దదైన వెదురుగుబురును (పొదను) లోపలి బొంగులు ఒకదానిని మరొకటి రాసుకోవడంవల్ల పుట్టిన అగ్ని దహించే విధంగా యాదవసేనలలో పరస్పర శత్రుత్వాలు కలిగించి ఆ సేనలను నాశనం చేస్తానని నిశ్చయించాడు. దానికి బ్రాహ్మణశాపాన్ని మూలకారణంగా తలచాడు. అనుకొన్నవిధంగా యాదవులను నశింపజేశాడని చెప్పిన శుకమహర్షితో రాజశ్రేష్ఠుడైన పరీక్షిత్తు ఇలా అన్నాడు.
ఓ మునిసత్తమా! ఆలోచించి చూస్తే శ్రీహరి పాదకమలాలను ఆసక్తితో సేవించే యాదవులకు బ్రాహ్మణశాపం ఎలా కలిగిందో ననిపిస్తున్నది. ఆ కారణాన్ని తలియజేయండి.
అలా అడిగిన రాజుకు మునిశ్రేష్ఠుడైన శుకుడు గొప్పవైన, గంభీరాలైన వాక్ప్రవాహస్ఫూర్తితో వినుమని ఇలా చెప్పడం ఆరంభించాడు.