Saturday, March 7, 2026

Sree Maha Bhagavathamu Part 6 - శ్రీ మహా భాగవతము షష్టస్కంధము

శ్రీరస్తు శీమహాభాగవతము షష్టస్కంధము

శ్రీ వత్సాంకితకౌస్తుభస్ఫురితలక్ష్మీచారువక్షస్థ్సల
శ్రీవిభ్రాజితు నీలవర్ణు శుభరాజీవాక్షుఁ గంజాత భూ
దేవేంద్రాదిసమస్తదేవమకుటోద్దీప్తోరురత్నప్రభా
వ్యావిద్ధాంఘ్రిసరోజు నచ్యుతుం గృపావాసుం బ్రశంసించెదన్‌.


శ్రీవత్సమనే పేరుగల పుట్టుమచ్చ, కౌస్తుభమనే రత్నం, లక్ష్మీదేవికి నివాసస్థానం అయిన వక్షస్థలం, శోభాకరమైన దేహకాంతి, నల్లని శరీరచ్చాయ, శుభప్రదమైన తామరలవంటి కన్నులు, పద్మంనుండి పుట్టిన బ్రహ్మ మహేంద్రుడు మొదలైన సర్వదేవతల కిరీటాల్లోని రత్నకాంతులచే ప్రకాశించే పాదపద్మాలు కలవానిని, నిత్యుడు త్రికాలాలలో ఎల్లప్పుడూ ఉండువాడు, దయాసముద్రుడు అయిన విష్ణుమూర్తిని స్తుతిస్తాను.

విష్ణు పాదారవింద మననం వలన ఆనందం పొందిన శౌనకాది ముని బృందాలతో, పురాణ, ఇతిహాసాల సారాన్ని వివరించడంలో సమర్ధుడైన సూతమహర్షి ఇలా చెప్పసాగాడు.

విష్ణుకథలను వినడంలో ఆసక్తికలిగిన పరీక్షిన్మహారాజు పండితులకు ఆనందం కల్గించడంలో సమర్దుడైన శుకయోగీంద్రుని కథను వినాలనే ఆసక్తితో ఇలా ప్రార్థించాడు.

విశిష్టమైన ఆరుగుణాలు కలిగిన ఓ శుకమునీంద్రా! జీవుడు పరమపదాన్ని పొందే మార్గాన్ని నాకు వివరించి చెప్పావు. నివృత్తి మార్గాన్ని అనుసరించిన జీవుడు ఊర్ధ్వగతిని పొందే మార్గం తేటతెల్లంగా చెప్పావు. జీవుడు స్వతహాగా త్రిగుణాలచే బద్దుడై దుష్కర్మలు ఆచరిస్తూ దాని ఫలితంగా పలురకాలైన దేహాలను ధరిస్తూ జనన మరణ రూపమైన సంసారచక్రంలో బంధింపబడి కొట్టుమిట్టాడుతూ ఉంటాడు. ఆ ప్రవృత్తి మార్గాన్ని నాకు చక్కగా వివరించావు.

(షడ్గుణైశ్వర్యాలు: ఐశ్వర్యం, ధైర్యం, కీర్తి, తేజస్సు, జ్ఞానం, వైరాగ్యం. ఇవి భగవదంశ కలిగిన వారికే శోభిస్తాయి. శుకయోగిని 'ష
డ్గుణైశ్వర్య శాశ్వతమూర్తి' అనే సార్ధక విశేషణంతో సూచించడంవల్ల శుకునిలో భగవతత్త్వం నిండి ఉందని తెలుస్తూంది.)

ఇవేకాక పలురకాలైన నరకాలగురించి; స్వాయంభువుడు, అతనికుమారులైన ప్రియవ్రత, ఉత్తానపాదుల వంశచరితలు; ఈ భూమండలంలో ఉన్న అనేకద్వీపాలు, భూభాగాలు, సముద్రాలు, నదులు, అడవులు మొదలైన సమస్తవిషయాలయొక్క ఆవిర్భావవైశాల్యాలు; జ్యోతిషపరమైన గతుల విశేషాలూ; వీటన్నింటిని పరమాత్మ ఏ విధంగా సృష్టించాడో నాకు తెలియజేశావు. ఇక ప్రస్తుతం

మహానుభావా! శుకదేవా! ఇప్పుడు నాకు ఈ విషయం వివరించి చెప్పు. ఈ ప్రపంచంలోని మానవుడు భరింపరాని బాధలతో నిండిన నానావిధ నరకకూపాలలో పడిపోకుండా సుఖంగా జీవించే మార్గం ఏదైనా ఉందా! ఉంటే దాన్ని నాకు విశదీకరించు.

ఈ విధంగా అడిగిన మహారాజుతో శుకుడు ఇలా చెప్పాడు.

అకటా! మనోవాక్కాయ కర్మల ఫలితంగా కలిగే పాపాలను, పరిహారం చేసుకొనక పోయినందువల్ల జీవుడు దేహం వదలిన తర్వాత భయంకరమైన నరకాలలో శిక్షలు అనుభవించాలి.

కాబట్టి జీవుడు యమభటుల దర్శనం కాకముందే, చావునుగురించి మనసు కలతపడక ముందే, శరీరంలో ప్రాణం చైతన్యవంతమై ఉండి, బలం తగ్గకముందే, చేసినపాపాలను నిష్కల్మషమైన మనసుతో పోగొట్టుకోవడానికి ప్రయత్నించడం మంచిది.

రోగకారణాన్ని తెలుసుకొని వైద్యుడు ఔషధమిచ్చి రోగాన్ని నివారించే విధంగా, మానవుడు తాను చేసే పాపాల మూలకారణాన్ని తెలుసుకొని కాలం మించిపోకుండా వాటికి నివారణోపాయాలు గుర్తించి పోగొట్టుకోవాలి.

అని పలికిన శుక మహర్షితో పరీక్షిత్తు, “ఓ స్వామీ! మానవుడు ఎటువంటి పాపాలను చూస్తాడో, వింటాడో వాటిని చేయకూడదని అనుకుంటూనే, పరితాపం పొందికూడా తిరిగి అవే పాపాలను చేస్తాడు. అటువంటి వాడికి పాప పరిహారం ఉంటుందా? జీవుడు సందర్భాన్ని అనుసరించి ఒకసారి పాపం చేయడం, మరొకసారి మానివేయడం చేస్తాడు. ఇటువంటి బురదతో నిండిన ఏనుగు నీళ్ళలో మునిగినా ఆ బురద ఏ విధంగా వదలదో అదే విధంగా చంచలమైన మనసు కలిగిన మానవుడు చేసిన పుణ్యాలు సత్ఫలితాన్ని ఇవ్వవని భావిస్తాను. ఈ విషయాలను గురించి సమగ్రంగా తెలియజేయవలసింది.

ఈ విధంగా పలికిన మహారాజుతో శుకమహర్షి ఇలా చెప్పాడు.

ఓ రాజా! ఒక పని వలన కలిగిన ఫలితం మరొక పని వలన తొలగదు. మానవుడు తెలిసిగాని, తెలియకగాని ఏ చెడు కార్యం చేసినా దానిని పరిహరించుకోవడంకోసం ఒక సత్కర్మ చేయాలి.

ఆరోగ్యకరమైన ఆహారం తిన్న కారణంగా మనిషి తన వ్యాధుల్ని ఎలా పోగొట్టుకుంటాడో, అదే విధంగా సత్కర్మలు ఆచరించేవాడు తన నిర్మలమైన మనసుతో తన పాపపురాశి నంతటినీ నశింప జేసుకుంటాడు.

తపస్సు, బ్రహ్మచర్యదీక్ష దానశీలత, ఇంద్రియనిగ్రహం, నామస్మరణం, సత్యవాక్యపాలన వంటి నియమాలతో పవిత్రజీవనం సాగిస్తున్న ధర్మవర్తనులైన దయాసముద్రులు మనోవాక్కాయకర్మల చేత ఏర్పడిన పాపాలగుదిని, అగ్ని వెదురు పొదలను భస్మం చేసినట్లుగా దహించివేస్తారు.

(సత్పురుషునికి ఉండవలసిన లక్షణాలన్నీ ఇక్కడ చెప్పబడ్డాయి. అవి - తపం = అనగా మనస్సును, ఇంద్రియాలను ఏకాగ్రతతో ఉంచడం.

బ్రహ్మచర్యం = స్త్రీలను గురించి ఆలోచించడం, వారిని పొగడడం, వారితో సల్లాపం, కామబుద్ధితో చూడటం, మర్మంగా మాట్లాడటం, స్త్రీలతో పొందుగురించి తపించడం, వారి మీద ధ్యాసతో పనులు చేయకపోవడం మొదలైన వీటన్నిటికీ దూరంగా ఉండటమే బ్రహ్మచర్యం.

దానం = తన సర్వస్వాన్ని ఇతరుల హితం కోసం నిస్వార్థంగా త్యాగం చేయడం.
శమం = మనసు, బుద్ది, చిత్తం, అహంకారం అనే అంతరీంద్రియాలను నియంత్రించడం.
దమం = కన్ను, ముక్కు, చెవి, నోరు, చర్మం అనే బాహ్యేంద్రియాలను నిగ్రహించడం.
జపం = పరమాత్మను గురించి నిరంతర ధ్యానం.
సత్యం = ధర్మాన్ని, ధర్మసూక్ష్మాన్ని అనుసరించి యథార్థంగా మాట్లాడటం.
శౌచం = బాహ్యేంద్రియాలను దోషరహితంగా ఉంచడం.
నియమం = జప తపాదులు పాటించడం.
యమం = అహింస, పరుషంగా మాట్లాడకపోవడం వంటివి.

అంతమాత్రమేగాక, మరికొంతమంది శ్రీకృష్ణుని పాదాలు అనే పద్మాలయందలి తేనెను తాగే తుమ్మెద వంటి మనసు నిర్మల వేషధారులై, గోవిందుని భక్తులై, కలిగినవారై, ఆ భక్తి కారణంగా, సూర్యుడు మంచును కరిగించిన విధంగా తమశక్తిచేత పాపాలను సంపూర్ణంగా అంతం చేసుకుంటారు.

సూర్యుడు తన తీక్ష్ణమైన కిరణాలచే దట్టమైన మంచును తొలగించినట్లుగా, ఇంకా కొందరు తమ భక్తి ప్రభావంచేత వారి పాపాలనుకూడ సంపూర్ణంగా నశింపజేసుకుంటారు.

హస్తినాపురాధినాథుడవైన పరీక్షిన్మహారాజా! ఒక రహస్యం చెబుతాను విను. శ్రీహరిభక్తి పాపాత్ముడి పాపాలను పటాపంచలు చేసి అతడికి మోక్షాన్ని ప్రసాదిస్తుంది. శమదమాది సద్గుణాలు కూడ హరి భక్తివలె పాపాత్ముణ్ణి పుణ్యాత్మునిగా మార్చలేవు.

విష్ణుభక్తి పరిపూరితులైన వారికీ; ధన, మాన, ప్రాణాలను స్వామికి అర్చించినవారికీ; శ్రీహరి సేవాపరాయణులైన వారికీ; విష్ణుకథాశ్రవణమందు అత్యంతఆసక్తి కలగినవారికీ; లభించే శాశ్వతమైన ఆనందంతో కూడిన కైవల్యం; తపస్సులు, బ్రహ్మచర్యం, శమ దమాది నియమాలు, సత్యపాలనాదులవలన, శుచిత్వంవలన, దానధర్మాలవలన లభించదు.

(హరిభక్తి ఎంత గొప్పదో చెప్పటానికే ఇదంతా. తపస్సు, బ్రహ్మచర్యం, శమదమాదులు కొరగానివని భావించరాదు. అవన్నీ భక్తితో కూడి ఉన్నప్పుడే సత్ఫలితాన్నిస్తాయని శుకమహర్షి ప్రబోధంలోని సారాంశంగా గుర్తించాలి. ఈ భావానికి వివరణే తరువాత కనిపిస్తుంది.)

సాధు జీవనం కలిగి, పుణ్యస్వభావులై చరిస్తూ, సత్పరాయణులై, విష్ణుభక్తి తత్పరులైన వారికి తప్ప ఇతరులకు శాశ్వతమైన విష్ణులోకం ప్రాప్తించదు.

మానవులు సహజంగా పాపపుణ్యాలు చేస్తుంటారు. కల్లుకుండను ఎన్నినదులలో ముంచినా దాన్ని పవిత్రం చేయలేనట్లు హరిభక్తిని ఆచరించకుండా ఎన్ని పుణ్యసమూహాలైనా నరుణ్ణి పవిత్రుణ్ణి చేయలేవు.

ఓ మహారాజా! నిత్యం విష్ణుపాదపద్మాలను ధ్యానిస్తూ, విష్ణుగుణకీర్తనయందు ఆసక్తి కలిగి ఉండేవారు యముణ్ణిగాని, యమపాశాలు ధరించిన యమభటులనుగాని కలలో కూడా చూడరు. అట్టివారు తెలియక చేసిన పాపాలు ఏవైనా ఉన్నా అవి వారిని సమీపించలేవు.

ఈ భక్తివిశేషాన్ని వివరించే ఒక ప్రాచీనమైన కథ ప్రాచుర్యంలో ఉంది. దాన్ని విష్ణుసేవకుల యమకింకరుల సంవాదం అంటారు. ఆ కథ నీకు చెపుతాను శ్రద్ధగా విను.


అజామిళోపాఖ్యానము

విష్ణుదూత యమదూతల సంవాదము








శ్రీమన్నారాయణ కవచ ప్రారంభము








No comments:

Post a Comment

The vows and worships of the Goddess as prescribed by the Goddess - దేవిచెప్పిన దేవీవ్రతాలు, పూజలు

శ్రీ దేవీ భాగవతం సప్తమ స్కంధము - దేవిచెప్పిన దేవీవ్రతాలు, పూజలు ఓ సువ్రతా! ఇపుడు నీకు దేవీ వ్రతములగూర్చి తెల్పుదును వినము. ఈ దేవీవ్రతముల నెల...