విశాల వక్షఃస్థలము కలవాడు, తామరలవంటి కన్నులుగలవాడు, పసుపుపచ్చని వస్త్రాన్ని కప్పుకున్నవాడు, స్వచ్చమైన ప్రశంసా వాక్యాలు కలవాడు; సంసారాదులను ఛేదించినవాడు, లక్ష్మీప్రదుడు, భక్తిలతలచే కప్పబడిన శ్రీహరి పాదాలు కలవాడు, దుఃఖం లేనివాడు, జ్ఞానవిద్యయందు వినోదం కలవాడు అయిన ప్రహ్లాదుని ఆ బలిచక్రవర్తి సంతోషంతో తన ఎదుట చూచినాడు.
ఇట్లా వచ్చిన తమ తాతను చూచిన బలిచక్రవర్తి వరుణపాశాలతో కట్టివేయబడి ఉండటంవలన నమస్కారం చేసేందుకు వీలులేకపోయింది. బలికి కన్నులలో నీళ్ళువచ్చినవి. సిగ్గుతో తలవంచుకొని తాతకు నమస్కారం చేసినాడు. యజ్ఞమండపం(మొగసాల)లో సనందుడు మొదలయిన పరిచరులతోకూడి కూర్చొని ఉన్న వామనునికి ప్రహ్లాదుడు ఆనందబాష్పాలు గగుర్పాట్లు ఒప్పారగా సాష్టాంగనమస్కారాన్ని చేసి ఇలా అన్నాడు.
(బలి దుఃఖపడింది తన ఐశ్వర్యం పోయిందనో, తాను బంధితుడ నైనా ననోకాదు. పెద్దలకు (తన తాత ప్రహ్లాదునికి) నమస్కరించే అవకాశం లేకపోయిందని మాత్రమే దుఃఖించినాడు. ఇలాంటి ధర్మసూక్ష్మాలు భాగవతంలో అనేకం.)
ఈ బలికి మునుపు నీవు ఇంద్రపదవిని ఇచ్చి ఇప్పుడు మరల తీసుకోవటం చాలా మేలైనది. ఆ పదవి అజ్ఞానానికి అహంకారానికి మూలకారణమైనది. గర్వం అనే కారుచీకటిని కలిగించేది. అలాంటి దానిని పోగొట్టడమంటే దయతో రక్షించటమేగానీ బంధించటంకాదు. జ్ఞానవంతునికి మహేంద్రత్వం ఎందుకు? అది నీ పాదసేవనానికి సమానం అవుతుందా? ఆ పదవితో గర్వం ఎక్కువై కన్నులు కనిపించవు, చెవులు వినపడవు, మనస్సు మైకం కమ్ముతుంది, నీ సేవా విధానాల నన్నింటినీ మరచిపోతాడు. అలాంటి పదవిని విడిపించి బలికి గొప్ప ఉపకారమే చేసినావు.
ఈ విధంగా ప్రహ్లాదుడు జగత్ప్రభువూ జగత్సాక్షి అయిన విష్ణుమూర్తికి నమస్కరించి పలుకుతున్న సమయాన
బలిచక్రవర్తి భార్య వింధ్యావలి మందగమనంతో పాలిండ్లమీద రవిక, ఉత్తరీయం సవరించుకొన్నదై, కన్నీళ్లు కారుస్తూ, రెండు చేతులను నొసటిపై జోడించి, మృదువైన మనస్సు కలవాడైన రమాపతిని, తనకు పతిభిక్ష పెట్టమని ప్రార్థిస్తూ ముల్లోకాలను కాపాడే వామనమూర్తి చెంతకు వచ్చింది.
లోకాలచే కొనియాడబడినవాడా! లోకాలు నీవు సంచరించే క్రీడాస్థలాలు. అలాంటిలోకాలకు కుత్సితబుద్ధులైనవారు తామే అధిపతులమని భావిస్తారు. లోకాలకు రాజువు నీవే.
(ఈ పద్యం వింధ్యావలి మనో నిశ్చయాన్ని తెలుపుతున్నది. లోకాలకన్నిటికి ప్రభువు భగవంతుడే అనే విశ్వాసం ఆమె ప్రతి ఊహలోనూ ఉంది. అందుకే ఆమె 'కుమతుల్ లోకాధీశులమందురు లోకములకు రాజవీవ' అంటూ నిర్ధారణగా, నిశ్చయంగా చెప్పింది.)
లక్ష్మీదేవి మనస్సును దోచినవాడా! ఆశ్రితమందారా! 'కాదు - లేదు - పొమ్ము - ఇవ్వను' అని నా భర్త నిరాకరించకుండా ముల్లోకాల పర్యంతమైన రాజ్యాన్ని నీకు ధారపోసినాడు. అలాంటి నా పతిని ఎందుకు బంధించినావు?
అలా ప్రహ్లాదుడు వింధ్యావళి విన్నవించిన పిమ్మట విధాత వచ్చి వామనమూర్తితో ఇలా అన్నాడు.
దేవదేవా! దేవవంద్యా! జగన్నాథా! నీవు పరమాత్ముడవు. సకలప్రాణులను సంరక్షించి అభివృద్ధి చేసేవాడివి. బలిచక్రవర్తి గొప్ప దాత. ఈయన నీకు తన సంపదనంతా సమర్పించినాడు. ఈయన శిక్షింపతగినవాడు కాడు. కరుణింపదగినవాడు. ఈయనకు అభయ మొసగి బంధవిముక్తుణ్ణి చెయ్యి. ఇతడు ఉదకముతో అభిషేకించి గరికపోచలతో నీ పాదాలను అర్చించిన భక్తుడు. లోకాధిపతివైన నీవు స్వయంగా దరిచేరి అడగడాన్ని తెలిసికూడా తన రాజ్యాన్నంతా ఇచ్చినాడు. ఇలాంటి వాడిని తాళ్లతో కట్టివేయడం న్యాయమా?
అలా చెప్పిన బ్రహ్మదేవుని మాటలు విని భగవంతుడు ఇలా చెప్పినాడు.
నేను దయచూపాలనుకొన్నవాని సంపదనంతా అపపహరిస్తాను. సంసార మత్తతచే అణగి ఎవ్వడు నన్ను దూషిస్తాడోవాడు ఎల్లకాలం సకలయోనులందు పుట్టుతుంటాడు. ఆ తర్వాత ఎవడైతే ధనానికీ వయస్సుకూ రూపానికీ విద్యకూ బలానికీ ఐశ్వర్యానికీ వృత్తికీ జన్మకు సంబంధించిన గర్వాన్ని విడిచిపెట్టి ఎప్పుడూ నిర్మలంగా ఉంటాడో వాడు నాచే రక్షించదగినవాడు. నా యందు భక్తికలవాడు అజ్ఞానంతో దురాశతో గర్వంతో సంసారవైభవాలచే మత్తుడై చెడిపోవాలని కోరుకోడు.
ఈ పుణ్యాత్ముడు బంధించబడినాడు. గురుశాపంవల్ల చలించినవాడయినాడు. చుట్టాలచే విడువబడినాడు. సంపదను అధికారాన్నీ పోగొట్టుకొని బీదవాడయినాడు. ఐనా శుచిత్వంతో ఉన్నాడు. సత్యాన్నీ దయను ప్రసన్నతను ఏమాత్రం విడువలేదు. జ్జానియై గెలిచేందుకు వీలుకాని మాయను గెలిచినాడు. ఈ పుణ్యాత్ముడు అల్పుడు కాడు.
రాక్షసరాజుకదా, ఈ పుణ్యాత్ముని నియమం ఎంతవరకో చూతమని నేను పరీక్షించగా ఇతడు సత్యానికే కట్టుబడినాడు. నిర్మలమైన ఈతని ప్రవర్తనను నేనెంతో మెచ్చుకొంటున్నాను.
(వామనమూర్తిచేత ఇంతగా వాచ్యంగా మెప్పుపొందిన బలిచక్రవర్తి ధన్యుడు.)
సావర్ణి మనువుకాలంలో ఇతడు (బలి) దేవతలకు ప్రభువై దేవేంద్రుడవుతాడు. ఎవరూ భావించలేని దుర్లభమైన నాచోటికి నేనే పిలిపిస్తాను. దయతో రక్షిస్తాను.
రోగాలు, దాహాలు, శ్రమలు, కష్టాలు మొదలయినవి లేకుండా విశ్వకర్మచే భావింపబడి రాక్షసులచే పూజింపబడుతున్న పాతాళలోకంలో అంతవరకు (సావర్ణిమనువుకాలం వచ్చేవరకు)బలి వైభవంగా ఉంటాడు.
ఇంద్రసేన మహారాజా! నీకు క్షేమం. భయపడకు. నీ దాతృత్వం మెచ్చదగింది. పాతాళంలో ఉండి దేవతలుకూడా సంతోషపడుతూ ఉంటారు. ఆ లోకంలోనివారికి దుఃఖాలూ, కష్టాలూ, బాధలూ, దుర్మరణాలూ ఉండవు. అలాంటి లోకంలో నీవు ఉండు. అక్కడ నీ మాట వినని వారిని నా చక్రం నరకుతుంది. అక్కడ దిక్పాలకులకు కూడా నీపై అధికారం ఉండదు. ఇక ఇతరులు ఏమి లెక్క? ఎల్లప్పుడూ నిన్ను నేను రక్షిస్తుంటాను. కనికరంతో నీకు కనిపిస్తుంటాను.
దానవదైత్యులవల్ల నీకు కలిగిన రాక్షసత్వం నన్ను ధ్యానించడంవల్ల తొలగిపోతుంది. మా ఆజ్ఞ ప్రకారంగా సుతలంలో సుఖంగా ఉండు.
ఈ విధంగా భగవానుడు పలికిన మధురవాక్కులు బలిచక్రవర్తి చెవులలో చెరకురసపు జల్లులవలె ప్రవేశించినాయి. సంతోషబాష్పాలు కనురెప్పలను తొలగత్రోసుకుంటూ కాలువలుగా పారివెలువడినవి. వక్షస్థ్సలమంతా పులకాంకురాలతో నిండిపోయింది. అప్పుడు బలిచక్రవర్తి మిక్కిలి వేడుకతో చేతులు జోడించినాడు. స్థిరమైన చిత్తంతో మెల్లగా ఇలా అన్నాడు.
ఓ పన్నగరాజతల్పా! నీవు దిక్పతులనుకూడా ఏనాడూ ఇంతటి దయతో చూడలేదు. ఈనాడు నన్ను గొప్పవానిని చేసి నా బ్రతుకుతెరువును చూపి రక్షించినావు. ఈ గౌరవం, ఈ దయ, ఈ మాటలగొప్పతనం నాకు చాలు! నిన్ను తెలుసుకొని ఆశ్రయించిన వారికి ఎప్పుడూ ఆపదలు కలుగవు.
అలా పలికి బలిచక్రవర్తి విష్ణుమూర్తికీ విధాతకూ శివునికీ నమస్కరించినాడు. బంధవిముక్తుడై తనవారితో చేరి పాతాళానికి వెళ్లినాడు. విష్ణుదేవుని కృపతో కులాన్ని సముద్ధరించిన మనుమడగు బలిని చూచి ప్రహ్లాదుడు సంతోషించి భగవంతునితో ఇలా అన్నాడు.
ఓ మంగళాకారా! బ్రహ్మదేవుడుకూడా నీ అనుగ్రహాన్ని ఇంతగా పొందలేడు. ఇంక ఇతరులెంత? బ్రహ్మాదులచేత నీవు అర్చించబడినావు. నీ దరి చేరటం దుర్లభం. అలాంటినీవు రాక్షసులకు దుర్గరక్షకుడ వైనావు. బ్రహ్మమొదలయినవారు నీ పాదపద్మమకరందాన్ని సేవించటంచే కలిగిన మహిమవలన ఐశ్వర్యవంతులయినారు. మేము అల్పులము, పాడుజన్మలు కలవారము, కపట చిత్తులము. నీ దయను పొందటానికి మేము ఎట్టి తపస్సు చేసినామో! మమ్ములను నీవు రక్షించటం చిత్రం.
నీవు అన్నింటియందూ ఉంటావు. అందరినీ సమానంగా చూస్తావు. అయినా కూడా నీవు ఒక విషయంలో విషమంగా ఉంటావు. భక్తిలేనివారి కోరికలు తీర్చవు. కల్పవృక్షంలా భక్తుల కోర్కెలు తీర్చుతావు.
ఈ విధంగా మనవి చేస్తున్న ప్రహ్లాదునితో పరమాత్ముడు ఇలా అన్నాడు.
కుమారా! ప్రహ్లాదా! మంచిది. నీ చుట్టాలూ నీవూ బలిని వెంటపెట్టుకొని పాతాళానికి వెళ్లు. నేను గదాధరుడనై సమీపించి మిమ్ములను కాపాడుతాను. అక్కడ మీకు ఏ పాపమూ అంటదు.
ఈ విధంగా ఆనతిచ్చిన పరమాత్మునికి ప్రహ్లాదుడు మొక్కి ప్రదక్షిణం చేసినాడు. నొసటిపై చేతులు జోడించి సెలవు తీసుకున్నాడు. ఆ తర్వాత ఆయన బలినీ రాక్షససమూహాన్నీ వెంట పెట్టుకొని ఒక గొప్ప గుహాద్వారంగుండా పాతాళలోకానికి చేరినాడు. అటుపిమ్మట మహావిష్ణువు బ్రహ్మవేత్తలయిన ఋత్విజులనడుమ సభలో కూర్చున్న శుక్రుని చూచి ఇలా అన్నాడు.
శుక్రాచార్యవర్యా! బలిచక్రవర్తి యాగానికి లోపమెమీ రాలేదుకదా! ఈ యజ్ఞంలో మిగిలిన కార్యాన్ని నీవు నెరవేర్చు. ఆగిపోయిన యజ్ఞకార్యాలు విప్రులు చూచినంతనే సఫలమౌతాయి.
'అన్ని కర్మలకు నీవే అధిపతివి. యజ్ఞాలకు నీవే అధిపతివి. నీవు స్వయంగా వచ్చి సంతుష్టిపొందితే ఏ కొరతకూడా ఉండదు. నిన్ను తలచినట్లయితే ధన, దేశ, కాల, మంత్ర, తంత్రాలకు కలిగిన దోషాలు తొలగిపోతాయి. నీ ఆనతి ప్రకారమె చేస్తాను. నీ ఆజ్ఞ ప్రకారం నడవటం జనాలకు మంచిదికదా! ఇంతకన్నా నాకు భాగ్యమేముంది?' అని పలికి శుక్రుడు విష్ణుమూర్తి ఆజ్ఞను తలదాల్చి బలిచక్రవర్తి యాగాన్ని పూర్తిచేసినాడు. ఆయనకు మునులు విప్రులు తోడ్పడినారు.
ఆ విధంగా విష్ణుమూర్తి వామనమూర్తియై బలిచక్రవర్తి దగ్గర భూదానం గ్రహించినాడు. ఆయన తన అన్నయైన ఇంద్రునికి దయతో స్వర్గలోకాన్ని ఇచ్చినాడు. బ్రహ్మదేవుడు ఆ సమయంలో దక్షుడు భృగువు మొదలయిన ప్రజాపతులతో శివునితో కుమారస్వామితో నారదునితో పితృదేవతలతో నృపాలురతో కలుసుకున్నాడు. కశ్యపునికి అదితికీ ఆనందం కలిగేవిధంగా లోకాలకూ దిక్పతులకు 'వామనుడు ప్రభువు' అని కట్టడి చేసినాడు. అంతేకాక ధర్మానికీ, కీర్తిక, సంపదలకు, శుభాలకు, దేవతలకు, స్వర్గానికి, మోక్షానికి 'వామనుడే అధికారి' అని నిర్ణయించినాడు.
పరీక్షిన్మహారాజా! బ్రహ్మ, దిక్పాలకులు, దేవేంద్రుడూ విమానం మీద వామనుని అమరావతికి తీసుకొని వెళ్ళినారు. ఆ తర్వాత
బలవంతుడయిన తోడబుట్టినవాని సహాయంతో ఈ విధంగా ఇంద్రునికి ఇంద్రపదము లభించింది. సమర్థుడయిన తమ్ముడుగల అన్నకు కోర్కెలు ఎందుకు కొరతపడతాయి? (పడవు).
భాగం ఇమ్మనడు, మంచిచేయమనడు, పరిపాలించడు, ముల్లోకాలను యాచనవల్ల స్వీకరించి అన్నయగు ఇంద్రునకు ఇచ్చినాడు. వేలుపులతల్లిఅయిన అదితి చిన్నకొడుకు వామనునివంటి తమ్ముడు ఏ అన్నలకు ఉన్నాడు? (వామనునికి సాటియైన తమ్ముడు లేడు)
కడుపు బ్రద్దలయ్యేటట్లు చాలామంది కొడుకులను కనటం కంటె, దేవతా సమూహాన్ని కన్న అదితి ఘనుడగు వామన వటుని కన్నట్లు తల్లికి బలవంతుడైన ఒక కొడుకు చాలు.
ఈ విధంగా వామనమూర్తి సంపాదించి ఇచ్చిన త్రిలోకసామ్రాజ్యసంపదను దేవేంద్రుడు తిరిగి తీసుకున్నాడు. ఆ తర్వాత బ్రహ్మ, శివుడు, కుమారుడు, భృగువూ మొదలయిన మునులు, పితృదేవతలు, దక్షుడు మొదలయిన ప్రజాపతులు, సిద్ధులు, కశోచరులు, ఇంకా తక్మినవారు ఆశ్చర్యం కలిగించే విష్ణుమూర్తి లీలావిలాసాలకు అబ్బురపడుతూ పొగడుతూ ఆడుతూ, పాడుతూ తమ తమ నివాసాలకు వెళ్లినారు - అని శుకుడు ఇలా అన్నాడు.
రాజా! త్రివిక్రముని మహిమయొక్క గొప్పతనాన్ని తెలుసుకోవటానికిగాని అది ఇలాంటిదని చెప్పటానికికాని ఎవ్వరికీ శక్యంకాదు. భూపరాగ లేశాలను లెక్కపెట్టేవాడు కూడా తెలుసుకొనలేడంటే ఇక ఇతరులకు తరమవుతుందా? (కాదు అని)
అద్భుతమైన లీలలతోకూడి, విష్ణుమూర్తిని గురించి తెలిపే ఈ పుణ్యచరిత్రను వినేవాడు ఘనమైన పరాక్రమం కలవాడై చివరకు ప్రకాశించే విలాసంతో ఉత్తమగతులను పొందుతాడు. రాజేంద్ర! మనుష్యసంబంధమైన, పితృసంబంధమైన, దేవసంబంధమైన కార్యాలుచేసే సమయాలలో త్రివిక్రముని పవిత్రచరిత్రను కీర్తిస్తే వారు నిత్యసౌఖ్యాలను పొందుతారు.
No comments:
Post a Comment