Monday, March 23, 2026

Matsya Avatar Story - మత్స్యావతార కథా ప్రారంభము

మత్స్యావతార కథా ప్రారంభము

పై విధంగా శుకుడు పరీక్షిత్తుకు వామనావతారకథను చెప్పినాడని సూతుడు శౌనకాది మునులకు తెలిపినాడు. అప్పుడు శౌనకాది మునులు సూతునితో ఇలా అన్నారు.

పుణ్యాత్మా! పూర్వం విష్ణువు మత్స్యావతారం ధరించిన విషయం వినాలని మాకు కుతూహలంగా ఉంది. భగవంతుడు కర్మకు కట్టుబడినవానివలె లోకంలో గౌరవమూ, జ్ఞానమూ లేని చేపరూపాన్ని ఎందుకు ధరించాడు? ఎక్కడుండి ఏమి చేశాడు? మొదటిదైన ఆ అవతారానికి కారణమేమిటి? ఆ అవతార అవసరమేమిటి? ఆ విషయాలన్నీ మాకు తెలియజేయ గలిగినవాడవు నీవే. వాటిని గురించి మాకు తెలియజెప్పు. దేవదేవుడైన విష్ణుదేవుని కథ అఖిలలోకాలకూ మంగళాన్ని కలిగించేది కదా! కాబట్టి, ఆ విషయాలను క్రమా న్ననుసరించి విశదంగా తెలుపు.

ఇలా అడిగిన మునులతో సూతుడు ఇట్లా చెపుతున్నాడు. మీరు అడిగినట్లే పరీక్షిత్తురాజు శుకమహర్షిని అడిగినాడు. అందుకు ఆ మహాముని ఇట్లా చెప్పినాడు.

పరీక్షిన్మహారాజా! విను. లోకాలకు అధిపతి, ఈశ్వరుడు అయిన విష్ణుమూర్తి వేదాలనూ బ్రాహ్మణులనూ గోవులనూ దేవతలనూ సజ్జనులనూ ధర్మాన్నీ అర్థాన్నీ కాపాడటం కోసం మాత్రమే అవతారాలు ధరిస్తాడు. వాయువు వలె గొప్పరూపాలలోను అల్ప రూపాలలోనూ చేరి ఉంటాడు. ఆయన ఎప్పుడూ ఎక్కువ తక్కువలులేని నిర్గుణుడైనప్పటికీ ఎక్కువ తక్కువభావాలు లేక గుణాలకలయికను పొందుతుంటాడు. అలాంటి విష్ణువు మత్స్యావతారం ధరించటంలో ఆశ్చర్యం ఏమీలేదు. పోయిన కల్పం చివర ద్రవిళదేశానికి రాజయిన సత్యవ్రతుడు నీటినిమాత్రమే ఆహారంగా గ్రహిస్తూ ఒకనదిగట్టున విష్ణువును గురించి తపస్సు చేశాడు.

సత్యవ్రతుడు ఒకనాడు కృతమాలిక అనేపేరుగల నదిఒడ్డున హరిసమర్పణంగా జలతర్పణం చేస్తుండగా అతని దోసిలితో ఒక చేపపిల్ల కనిపించింది. అతడు ఉలిక్కిపడి ఆ చేపపిల్లను నదిలో వదలినాడు. నీటిలోనుండి చేపపిల్ల ఆ రాజుతో ఇలా అన్నది.

దయానిలయుడా! ఈ ఏటిలో దాయాదులను చంపే పాపిష్టి చేపలున్నాయి. అవి చిన్న చేపలనుపట్టి మింగుతాయి. అందువల్ల నేను ఇక్కడ ఉండలేక నీ దోసిటిలోనికి వచ్చినాను. దయలేకుండా నన్ను నట్టేటిలో తోయటం న్యాయం కాదు.

పుణ్యాత్ముడా! ఇక మీదట చేపలుపట్టే జాలరులు వలలు తీసుకుని వస్తారు. నదిని కలతపెట్టి బంధించి, ఎగిరిపోనీకుండా నా మెడ పట్టుకుంటారు. అప్పుడు ఎక్కడ దాగుకోగలను?

దీనవత్సలా! నన్ను పెద్దచేపలయినా తింటాయి. అలా కాని పక్షంలో ధూర్తులగు వేటకాండ్రయినా పట్టుకొంటారు. ఆ విధంగా చచ్చిపోకుండా నన్ను రక్షించు. బలహీనులను కాపాడటం కన్నా మరొక పుణ్యం ఉందా?

చేపపిల్ల మాటలువిని జాలిపడి దయకు నిలయమైనవాడగు సత్యవ్రతుడు, ఆ చేపపిల్లను నెమ్మదిగా కమండలంలోని నీటిలో ఉంచి తన నివాసానికి తీసికొని వెళ్లినాడు. ఒక్కరాత్రిలోనే ఆ చేపపిల్ల పెరిగి పెద్దదై కమండలమంతా నిండిపోయింది. కదలటానికి తావులేక ఆ చేపపిల్ల రాజుతో ఇలా అంది.

'ఓ రాజేంద్రా! నేను ఉండడానికి ఈ కమండలం చాలా చిన్నది. చాలటంలేదు. ఇంకొకదానిని తీసుకురా' అని చేపపిల్ల అడుగగా సత్యవ్రతుడు ఒక నీళ్ళకడవలో దానిని విడిచినాడు.

ఆ చేప క్షణకాలంలోనే మూడుచేతులపొడవై ఆ పాత్ర అంతా నిండిపోయింది. ఆ చోటు దానికి చాలక ఇంకొక దానిని తెమ్మన్నది. దయానిధి అయిన సత్యవ్రతుడు ఆ చేపను ఒక చిన్న మడుగులో విడిచినాడు. అది ఆ మడుగుకంటే పెద్దదై 'నేను తిరగడానికి ఇది చాలదు' అని చెప్పింది. ఉత్తముడైన రాజు ఆ చేపను ఎక్కువ నీళ్లుండే పెద్ద చెరువులో విడచినాడు. ఆ చేప ఆ చెరువుకన్నా పెద్దదిగా పెరిగింది. 'చోటుచాలదని చెప్పుకున్నది' చేప. ఆ పుణ్యాత్ముడు ఆ పెద్ద చేపను పెనుకడలిలో విడచినాడు. సముద్రంలో చేరిన తర్వాత 'పెద్దమొసళ్లు నన్ను పట్టుకొని చంపి మింగుతాయి. ఇంత కాలమూ కాపాడి ఇప్పుడు నన్ను విడవవద్దు, బయటకు ఎత్తు అని ఆ చేప రాజుతో మొరపెట్టుకొన్నది. అప్పుడు నేర్పరియైన చేపతో రాజు ఇట్లా అన్నాడు.

పురుషోత్తమా! ఒక్కదినంలోనే నీవు నూరుయోజనాలదూరం వ్యాపించినావు. ఇలాంటి చేపలను మేము ఎప్పుడూ కనీ వినీ ఎరుగము. చేపజాతులకు ఇంతటి శరీరం ఉండదు. నీవెవరు? ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు? నీవు దీనులను కాపాడటం కోసం చేపరూపం ధరించిన విష్ణుదేవుడవని తెలుసుకొన్నాను. అచ్యుతా! నారాయణా! లోకాలను సృష్టించి, పోషించి లయించే మహానుభావుడవు నీవు. దిక్కులేని భక్తులమైన మాకు నీవే దిక్కు మహిమతోకూడిన నీ అవతారాలు అన్ని ప్రాణులకూ మేలు కలిగిస్తాయి. అలాంటి నీకు నమస్కారం చేస్తున్నాను.

మేము నీకు పరాయివాళ్లం కాము. నిర్మలమైన జ్ఞానం కలవాళ్లం. మా రక్షణకు నీవున్నావు. ఎల్లప్పుడూ భక్తులు ఎక్కడ ఉంటే నీవూ అక్కడనే ఉంటావు. నిన్ను స్తుతించినవారికి ఎప్పటికీ కీడు జరగదు.

“శ్రీహరీ! నీవు లక్ష్మీదేవి వక్షస్థ్సలంమీద క్రీడిస్తూ సంతోషంతో విహరించే ఆనందస్వరూపుడవు. అజ్ఞానంతో కూడిన చేపరూపాన్ని ఎందుకు ధరించినావో చెప్పు”.

ఈ విధంగా సత్యవ్రతమహారాజు అడుగగా ఆ యుగం చివర ప్రళయకాలంలో ఒంటరిగా సాగరంలో సంచరించడానికి చేపరూపాన్ని ధరించిన విష్ణుమూర్తి సత్యవ్రతునితో ఇలా అన్నాడు.

ఓ నృపవర్యా! ఈ రేయి గడచిన తరువాత రాబోయే ఏడవ దినంతో బ్రహ్మకు ఒక పగలు పూర్తి అవుతుంది. భూలోకాది ముల్లోకాలూ ప్రళయసాగరంలో మునిగిపోతాయి. అప్పుడు నా ఆనతి మేరకు ఒక పెద్ద ఓడ నీ చెంతకు వస్తుంది. అప్పుడు నీవు సమస్త ఓషధీసమూహాలనూ విత్తనాలరాసులనూ ఆ నౌకపై ఉంచుకొని ప్రళయసముద్ర జలాలలో విహరిస్తావు. నీతో కలిసి సప్తర్షులుకూడా ఆ ఓడలో ఉంటారు. మీ ముందుభాగంలో పెనుచీకటి ఆవరిస్తుంది. మునుల శరీరకాంతులు మిణుకు మిణుకుమంటూ మెరుస్తుంటాయి. సాగరంలో నౌక ఊగుతూ తేలుతూ సాగిపోతూ ఉంటుంది.

ఆ నౌక కడలి అలలకు దెబ్బతినకుండా మత్స్యరూపం ధరించిన నేను అన్నివైపులా పెద్ద ఈకలుకలిగిన నారెక్కలను కదలిస్తూ ఉంటాను. నా ఆనతి మేరకు ఒక పెద్దపాము అక్కడ కనిపిస్తుంది. సుడి గాలులకు నావ తిరుగబడకుండా ఆ పాముతో నా కొమ్ముకొనకు ఆ నౌకను కట్టివేసి. నీకూ మునులకూ కీడు కలుగకుండా ఆ ప్రళయరాత్రి గడిచేవరకు నేను కాపాడుతుంటాను. ఇందుకోసమే నేను ఇలాంటి మత్స్యరూపాన్ని ధరించినాను. ఇంకా విశేషమేమంటే నేను నిన్ను అనుగ్రహిస్తాను. పరబ్రహ్మస్వరూపమైన నా మహిమను తెలుసుకో. ఈ విధంగా పలికి శ్రీహరి సత్యవ్రతుడు చూస్తుండగానే అదృశ్యమైనాడు.

చేపరూపంతో మాధవుడు పలికిన మాటలను తలచుకొంటూ తాపసియైన సత్యవ్రతుడు దర్భలశయ్యపై తూర్పువైపు తలగడగా పరుండి ప్రళయసమయంకోసం ఎదురుచూస్తున్నాడు.

No comments:

Post a Comment

History of Emperor Sagara - సగర చక్రవర్తి కథాప్రారంభము

సగర చక్రవర్తి కథాప్రారంభము బాహుకుడు తన శత్రువులు తననోడించి రాజ్యం ఆక్రమించగా తన స్త్రీలతో అడవికి వెళ్ళి వృద్దాప్యం కారణంగా మరణించాడు. అతనిభా...