ప్రహ్లాదుండు నరసింహ మూర్తిని స్తుతించుట
నిన్ను దేవతలు, మునీంద్రులు, బ్రహ్మమొదలైన ప్రముఖులు ఏకాగ్రచిత్తులై బహుధా ఆలోచనలు చేసికూడ సాంతం స్తుతించ జాలరట! ఇక నేనేమో రాక్షసకుమారుణ్ణి, గర్వాద్రిక్తుణ్ణి, మందమతిని అయిన బాలుడిని కనుక నిన్ను ఏమని ఎట్లు స్తుతించగలను?
ఈశ్వరా! నీవు తృప్తిచెందాలంటే, నరుని తపస్సు, జాతి, చదువు, అందచందాలు, నేర్పు, ప్రతాప పరాక్రమాలు, నియమ నిష్ఠలు, ప్రజ్ఞా పాటవాలు, జప హోమాలు ఇవేవీ చాలవు. నిన్ను సంతుష్టుని చేయాలంటే, ఆ గజరాజువలె, కేవలంభక్తిపరవశత్వంతోడి శరణువేడడ మొక్కటే మార్గం.
నిర్మలమైన జ్ఞానం, మంచి దానం, ధర్మాసక్తి, సత్యం, సహనం, మాత్సర్యం లేకపోవడం, యజ్ఞం, తపస్సు, అసూయ లేకుండుట ఇవన్నీ ఉండి మిక్కిలి గర్వించే బ్రాహ్మణునికంటె మనస్సు, అర్ధం, ప్రాణం, మాట, కర్మలు వీటన్నిటితో సమతా బుద్ధితో నిన్ను సేవించే చెండాలుడైనా గొప్పవాడై తన వంశం మొత్తానికి శోభ కూరుస్తాడు.
(భగవంతుడు పాండిత్యం, సంపదలు, కులం మున్నగునవికాక అహంకార మమకారాలులేని సమతాదృష్టినే స్వీకరిస్తాడు. అందుకే కులంకన్నా గుణంమిన్న అనే నానుడి ఏర్పడింది.)
భగవంతుడు అజ్ఞాని చేసిన పూజలు స్వీకరించడు. దయామయుడవడంచేత స్వీకరించినా స్వీకరిస్తాడు. భగవంతుడు పరిపూర్ణుడవటంచేత మానవుడు చేసే పూజలవల్ల అతనికెట్టి ప్రయోజనమూ లేదు. ఇది సత్యం. అయినా మనం ఈశ్వరార్పణ బుద్ధితో పూజలు చేయడం ధర్మం. అలా ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తే అద్దంలో మన నుదుటిబొట్టు కనిపించునట్లుగా వాని ఫలితం మనకే వస్తుంది. కాబట్టి గొప్పబుద్ధితో భగవదర్చన చేయాలి. భక్తికి బంధువైన శ్రీమహావిష్ణువు భక్తినే కాని, తక్కిన వానిని మెచ్చుకోరు. మనకు ఫలితాలివ్వడంలో భగవంతుడు పరమ దయామయుడు.
("చిత్తశుద్ధిలేని భక్తి" వట్టి శాస్త్రజ్ఞానం వంటిది. భక్తితో కూడిన చదువే 'మంచి చదువు'అన్నాడు ప్రహ్లాదుడు. అటువంటి చదువే “పుట్టని చావనిత్రోవ” యైన ముక్తికి దారితీస్తుంది అని ప్రహ్లాదుడు ముందే చెప్పి ఉన్నాడు.
దేవా! నేను అల్పజ్ఞుణ్ణయినా, నా నేర్పు కొలది నీ స్తుతి చేస్తాను; నీ స్తుతివల్ల నరుడు అజ్ఞానాన్ని గెలిచి ముక్తిని పొందగలడు.
శక్తికి స్థానమైన స్వామీ! బ్రహ్మాదిదేవతలు నీ యాజ్ఞలను శిరసావహించే నీ సేవకులు; వారు నీ యీ భయంకరరూపం చూచి భీతిపొందుతున్నారు. క్రోధం మాను. నీ స్వరూపాలు సుందర శుభకరాలే, తప్ప భయంకరాలు గావు. పాములు, తేళ్లవలె భయాన్ని కలిగించే రాక్షసుణ్ణి సంహరించావు. సజ్జనులందరూ సంతోషిస్తున్నారు నీ అవతార కార్యం తీరింది. ఇక కోపమెందుకు? దోషాలను పోగొట్టి సంతోషాన్ని కలిగించే నిర్మలమూర్తివని లోకులు నిన్ను స్మరిస్తున్నారు.
నీ నరసింహస్వరూపం వాడిఅయిన కోరలతో, కనుబొమలతో, జూలుతో, గోళ్ళతో, భయంకర గర్జనలతో, ఎర్రని కేసరాలతో, పొడవైన పేగుల దండలతో, వెలిగే కన్నులతో చూచేవారికి భయంకరమే. కాని, నేను దానికి భయపడను. సంపూర్ణంగా క్రూరము, అడ్డగించటానికి భరించటానికి వీలుగానిది అయిన సంసారమనే దావాగ్నికి భయపడుతున్నాను. కావున నన్ను దీనినుండి రక్షించి నీ కాళ్ళవద్ద ఆశ్రయ మివ్వు
('హిరణ్యకశిపుడు యుద్ధవీరుడైతే, ప్రహ్లాదుడు ఆధ్యాత్మికధీరుడు. చిన్నతనం నుండే మదిలో వైరాగ్యాన్ని పెంపొందించుకొన్న వైరాగ్యనిధి ఆయన నృసింహస్వామి భయంకరాకృతిని చూచి భయపడలేదు. కాని, 'పూర్ణక్రూర దుర్వార దుర్భర సంసారదవాగ్నికి భయపడుతాడట! ఎంత పరిపక్వమైన సంసార విరక్తి! ఆధ్యాత్మిక చైతన్యం!)
నృసింహా! నేను సృష్టిలోని సకల యోనులలో పుట్టి, సుఖం నశించి దుఃఖం లభించి శోకాగ్నిలో కాలిపోతున్నాను. నా యీ దేహాభిమానం దుఃఖాన్ని నివారించ జాలదు. అయినా నేను మోహంలో పడి తిరుగుతున్నాను. ఇట్టి నాకు నీవు ఇష్టుడవు, మిత్రుడవు, పరమదేవతవు. బ్రహ్మ గానంచేసిన నీ లీలావతార కథలను నేను చుదువుతూ కోరికలనుండి ముక్తుడనై, దుఃఖాలు దాటి నీ పాదపద్మ స్మరణ చేసే పరమభక్తులతో కలిసి జీవిస్తాను. బాలుణ్ణి తల్లిదండ్రులూ, రోగిని మందూ, కడలిలో మునిగిపోయేవానిని నౌకా, తప్ప మిగతావి రక్షింపలేనట్లు, సంసారంలో కాలిపోయే నరుడు, నీచేత ఉపేక్షితుడైతే, ఇకవాడిని ఉద్ధరించేవారు నీవు తప్ప ఇతరులు లేరు. లోకంలో, ఎవడు ఏ పనిని ఎవరి ప్రేరణతో, ఏ ఇంద్రియాలతో, ఏ కాలాన, ఏ స్థలాన ఏ రూపాన ఏ గుణాన చేయాలో నిర్ణయించేవాడివి నీవు. ఉత్తమంకాని, తండ్రి లోనైన రూపాలలో మొదట సృజించి, జీవిని పిదప ఉత్తమమైన బ్రహ్మాదిరూపాలలోనికి మార్చే శక్తి నీదే. ఈ వివిధ ప్రక్రియల సమాహార రూపుడవే నీవు. నీ అంశయైన మానవునికి నీ దయవల్ల కాలంచేత ప్రేరేపింపబడినది, కర్మమయమైనది, మిక్కిలి బలిష్ఠమైనది, ప్రధాన కారణమైనది అయిన మనస్సును నీ మాయ సృష్టిస్తుంది. వేదాలచే చెప్పబడిన కర్మంవలె ప్రధానంగాగల ఈ సంసారచక్రం వంటి మనస్సు నిన్ను సేవింపకుండా సంసారమును దాటుటకు ఏ ఒక్కడునూ సమర్థుడు కాడు. నీవు బ్రహ్మజ్ఞానంతో బుద్దిని గుణాన్ని జయించినవాడివి. నీ కారణంగానే, సకలశక్తి కలిగిన కాలం, మాయతో పదహారు వికృతులతో కూడిన సంసారచక్రాన్ని నిర్మిస్తున్నది. నేను ఈ సంసారపు అడవినిప్పులో కాలిపోతున్నాను. నన్ను కాపాడు.
(అనంత సంసార దుఃఖసాగర ప్రయాణంలో దిక్సూచిని పట్టుకొనుమని తన జీవిత నౌకాకర్ణధారిని, ఆ పరాత్పరుని ఉద్దేశించి ప్రార్థిస్తూ సర్వజీవుల ప్రతినిధిగా ప్రహ్లాదుడు చేసిన ప్రార్ధనమే ఈ విశిష్ట వచనం!)
లోకులు, ఎదో ఒరుగుతుందని, దేవతలను, సంపదలు, ఆయుస్సులు, వైభవాలు కోరుకుంటారు. అవి అన్నీ మా తండ్రి క్రోధంతోనో, నవ్వుతోనో, కనుబొమలు ముడిచి చూస్తే చాలు నశించిపోయేవి. అటువంటి వీరుడూ నేడు నీ చేత క్షణకాలంలో చనిపోయాడు. కాబట్టి, బ్రహ్మ మొదలు అందరి సిరిసంపదలు, వైభవాలు, బ్రదుకులు, శాశ్వతాలు కావు. అవి అన్నీ కాలస్వరూపుడైన ఉరుక్రముని చేత(అన్ని లోకాలు ఆక్రమించేవానిచేత) ధ్వస్తమై పోయేవే! నిలిచేవి గావు; వేయిమాటలేల? నేను నీ పాదసేవ తప్ప వేరేవి కోరను. నీ గురించిన జ్ఞానం కొంత నాలో కలిగింది. నీకు బంటునై నిన్ను సేవిస్తాను.
నరుడు ఎండమావులవంటి శుభాలన్నీ సత్యాలని భ్రమించి, రోగాలపుట్ట అయిన శరీరంతో ఉండికూడా విరాగికాకుండా, తీవ్ర కామాగ్నితో కాలిపోతుంటాడు. చెడు సుఖాల దొంతరలు తనను లోగొన్నకారణంగా. ఏనాటికీ అతడు సంసారపు ఒడ్డును చేరజాలడు.
స్వామీ! లక్ష్మీదేవికి, శివునికి, బ్రహ్మదేవునికైనా నీ గొప్ప హస్తమునెత్తి అభయ దానం చేయవు. కాని, నేను బాలుడను; రాక్షసవంశమున పుట్టినవాడిని, గొప్ప రాక్షసుడిని, రజోగుణం కలవాడిని అయినా నా తలపై నీ చేయిని ఉంచి అభయ మొసగుట ఎంత అద్భుతమో కదా.
మహానుభావా! సుజన దుర్జనభేదం లేక సేవానురూపంగ నిష్పక్షపాతంగా కల్పతరువువలె ఫలాన్ని ఇస్తావు. మన్మథ ప్రేరితమైన సంసారమనే నూతిలో కూలిపడే మూఢజనులలో ఒకడినైన నేను; నీ భక్తుడయిన నారదముని కృపవల్ల నీ దయకు పాత్రుడినయ్యాను; నన్ను రక్షించడం, నా తండ్రిని చంపడం - ఈ క్రియలు, నీవు నాపై పక్షపాతంతో చేయలేదు; దుష్టరాక్షస సంహారం శిష్టపరిరక్షణం నీకు సహజలక్షణాలు; ఈ ప్రపంచం నీవే. గుణస్వరూపమైన విశ్వాన్ని పుట్టించి, అందు ప్రవేశించి, దానికి హేతుభూతములైన గుణాలతో కూడినవాడవై, రక్షకునిగా సంహారకునిగా నానా ఆకారాలతో విశ్వంలో నిలిచావు. ఈ విశ్వం ఉనికి కారణం, కార్యం అనే స్వరూపం గలది; అంతటికి పరమకారణం మాత్రం నీవే. లోకానగల భేదభావ సర్వస్వం నీ మాయావిలాసమే. నిజానికి నీవు తప్ప అన్యమేదీ లేదు. విత్తనంలో అతిసూక్ష్మవస్తువైన వృక్షం పెక్కురంగులతో పెరిగినట్లుగా, ఈ విశ్వం వెలుగుతున్నది. దీనికి పుట్టుక ఉనికి, పెరుగుదల, నాశం - ఈ క్రియలన్నీ నీయందే. నీ సృష్టిఅయిన విశ్వం నీయందే ధరించి ప్రళయవేళ సముద్రంపై శేషతల్పంపై క్రియలు ఉడిగి, నిజసహజసుఖానుభూతిలో మునిగి యోగనిమీలిత నేత్రుండవై యుండి, ప్రకృతికి సంబంధించిన సత్త్వం మొదలైన గుణాలను అంగీకరించి సమాధి స్థితిని చాలించావు. నీ నాభిలో మర్రి విత్తనంనుండి పుట్టిన మర్రిచెట్టులాగా ఒక పద్మం పుట్టింది. దానినుండి నాల్గుమోములదేవుడు బ్రహ్మ ఉదయించాడు. అతడు దిక్కులు చూచి, తన జన్మస్థానమైన పద్మంతప్ప, ఇతరవస్తువు ఏదీ కనబడక నీటి లోపలి భాగాన దూరి, నూరు దేవసంవత్సరాలు వెదకి, తన జన్మస్థాన స్థావరమైన నిన్ను చూడజాలక, తిరిగి పద్మం వద్దకు వచ్చి పెక్కుకాలం తపస్సుచేసి భూమిలో గంధలక్షణాన్ని గుర్తించినట్టు, తనయందే వేలకొలది మొఖాలు, తలలు, కన్నులు, ముక్కులు, చెవులు, నోళ్ళు, భుజాలు, చేతులు కాళ్ళు గలవాడిని, అనేక ఆభరణాలతో ఒప్పేవానిని, మాయతో కూడినవాడిని, గొప్ప లక్షణాలతో గుర్తింపదగినవాడిని తన కాంతితో చీకటినంతా తొలగించేవాడిని పురుషులలో ఉత్తముడైన వాడిని నిన్ను చూచాడు. ఆ సమయంలో.
పండితులచేత నమస్కరింపబడేవాడా! దేవా! మధుకైటభులు అనే రాక్షసులు వేదాపహరణం చేయగా నీవు హయగ్రీవుడవై వచ్చి వారిని పట్టి వధించి, ఆ వేదాలను తిరిగి బ్రహ్మకర్పించిన వాడవు గదా! పరమాత్ముడవు నీవు.
దేవా! ఈ విధంగా కృత త్రేతా ద్వాపరయుగాలలో యథాక్రమంగా పశువుగా, మానవునిగా జలచరంగా అవతరించి లోకుల నుద్ధరిస్తూ, తుదకు సంహరిస్తూ యుగానురూప ధర్మసంస్థాపనం చేస్తున్నావు. శ్రద్ధగా ఆలకించు స్వామీ!
దేవా! మనస్సు కోరికలు సంతోషాలలో మునిగి నీ చింతనకు యత్నించదు; నాలుక తియ్యనైన రుచికరమైనవాటికి మరగి, నీ కీర్తనకు పాల్పడదు; కన్ను సుందరాంగుల ముఖమును జూస్తుందేకాని, నీ స్వరూపాలను చూడటానికి ఇష్టపడదు; చెవులు చెడుమాటలు వినగోరుతుంది తప్ప నీ కథలను గాదు; ముక్కు దుర్వాసనలకై పరుగెడుతుందేకాని; వైష్ణవధర్మ సుగంధాలకు (ప్రాణాయామాది క్రియలకు) పాల్పడదు. ఈ విధంగా ఈ కర్మేంద్రియాలన్నీ సవతులు గృహస్థుని వేధించినట్లు వేధిస్తాయే తప్ప, అతనికి (నరునికి) లొంగి ఉండవు.
నరుడు ఈ విధంగా తన ఇంద్రియాల వల్ల చిక్కులు పొందుతూ తన శరీరాన్ని అభిమానిస్తూ పరశరీరాలతో పగపెట్టుకొని, పుడుతూ, చస్తూ, సంసారమనే వైతరణిలో మునిగి ఉన్నాడు. ఈ లోకాల పుట్టుక, ఉనికి, లయాలకు హేతుభూతువైన నీవే రక్షకుడవు కావలసి ఉన్నది. ఈ సంసారమనే వైతరణినుండి నీ సేవకులమైన మాలో నీకు ప్రియభక్తులను ఉద్ధరించు.
(వైతరణి నరకలోక ద్వారాలముందు జుగుప్పాకరంగా రక్తంతో పొంగి పొరలే నది.)
దేవా! భగవంతుని దివ్యనామ సంకీర్తనమనే అమృతపుధారలతో మనసు పండిన నేను, ఘోరమైన వైతరణికి భయపడను; కాని, లోకంలో మూఢులు అబద్ధపు, అశాశ్వత సుఖాలకు లొంగి, నీ సంకీర్తనకూ, ముక్తిమార్గానికీ దూరంగా ఉన్నారు. వారికోసం నా మనస్సు శోకిస్తున్నది!
(లోకంలో అందరూ తమకోసం తాము లోలోపల దుఃఖిస్తూ బాధపడుతారుగాని, అందరూ బాగుపడలేదే అనే ఉదార, విశాలహృదయంతో ప్రవర్తించడం లేదు. ప్రహ్లాదుడు ఇటువంటి 'ఉదారచరితానాం తు వసుధైవ కుటుంబకమ్' అనే విశ్వజనీన హృదయం కలవాడు కనుకనే పరమ భాగవతుల్లో మొట్టమొదటివాడుగా పరిగణింపబడ్డాడు.)
శ్రీహరీ! తమ ముక్తి కోరి, మునీశ్వరులు కొందరు ఏకాంతస్థలాలలో తపస్సులు చేస్తారు. అయితే కోరికలే లేనివారికి నీవే శరణం. కొందరు నరులు కామప్రకోపంతో, చేతిదురదలు గోకే కొద్దీ పెరిగినట్లు, తుచ్చమైన పశువుల్లాగా, పక్షుల్లాగా, క్రిముల్లాగా, కీటకాల్లాగా తమ మైథునక్రీడలతో గృహస్థ మాత్రజీవనంతో తృప్తిచెందక, కామేచ్చ పెరిగి పెరిగి చివరకు అతి దుఃఖభాజనమైన జీవనాన్ని సాగిస్తారు. నీ దయగల సజ్జనుడు కామపీడకు లోనుగాక జీవిస్తాడు. మౌనం, బ్రహ్మచర్యవ్రతం, జపం, తపం, శాస్త్రశ్రవణం, వేదాధ్యయనం, స్వధర్మానుష్ఠానం, శాస్త్రాన్ని మననంచేయడం, ఏకాంతవాసం, సమాధిస్థితి అనే ఈ పదీ మోక్షకారణాలు. అయితే ఇవే ఇంద్రియజయం లేనివారికి భోగంకోసమే విశ్రమించేవారికి కేవలం జీవనోపాయాలు కాగలవు. ఇవే డాంబికులకు ప్రసిద్ధి హేతువులూ అవుతాయి. వారికి అవి నిష్ఫలాలే! భక్తిలేక భగవద్‌జ్ఞానం గలుగదు. ఆకారం లేని నీకు విత్తనం, మొలకవలె కారణం, కార్యం అయిన సదసద్రూపాలు రెండూ ఉన్నాయి. ఆ రెంటినుండి భక్తియోగంతో బుద్ధిమంతులు దారువును మధించి అగ్నిని బొందినట్లు, నిన్ను గ్రహిస్తారు. నరుని సకలప్రవృత్తికి మూలమైన పంచభూతాలు, తన్మాత్రులు, పంచప్రాణాలు, పంచేంద్రియాలు, మనస్సు, బుద్ది, అహంకారం, చిత్తం నీవే. నీవు కానిది ఏదీ సృష్టిలో లేదు. సగుణ నిర్గుణాలు రెండూ నీవే. సాకారాన్ని అభిమానిస్తూ జననమరణాలు పొందే పండితులు నీ ఆద్యంతాలు తెలుసుకోలేక పరమాత్ముడవైన నిన్ను గ్రహించలేరు. తత్త్వజ్ఞానులైన విద్వాంసులు వేదాధ్యయనం మొదలైన కృత్యాలు మాని ఉపనిషత్తులలో ప్రతిపాద్యుడవైన నిన్ను యోగధ్యానాది సమాధినిష్ఠలతో తెలుసుకొని సేవిస్తారు. అందువల్ల...
(“భక్తి లేక భవదీయ జ్ఞానంబులేదు” అని ప్రహ్లాదుడు భాగవతపురాణ మర్మాన్ని ఒక్కమాటలో సంక్షిప్తంగా వ్యక్తీకరించాడు. భాగవతం 'భక్తి'కి పట్టాభిషేకం చేసిందనడానికి ప్రహ్లాదుడే సాక్షి!
నిత్యం సంతోషంతో వచ్చి, నీ ఆలయ ప్రాంగణాన్ని నొసటితో తాకి నీకు మొక్కకపోతే, నీ స్తోత్రంలోని అక్షరాలు, పలుపర్యాయాలు తన నాల్కతో పల్కనట్టయితే, తన పనుల నన్నింటిని ప్రేమతో నీకు సమర్పించినట్టయితే, నీ పాదధ్యానంతో నిర్మలమనస్కుడై నీ మీది ప్రేమలో పడిపోనిచో, నీ స్తుతులు చెవులార వినకపోతే, నీ సేవకోసం రానట్టయితే, వాడు యోగి అయినా, మహాతత్త్వజ్ఞానియైనా, తపస్సు వ్రతాలు ఆచరించినవాడైనా, వేదాలు చదివినవాడైనా, పరబ్రహ్మను చేరగలడా? చేరలేడని భావం.
('భక్తి' అనే భావన మనస్సులో లేకుండా ఎంతటి గొప్పవారైనా బ్రహ్మైక్యం పొందడం సాధ్యంకాదు. వారు యోగులైనా/తపోవ్రత యోగులైనా, వేదియైనా, మహాతత్త్వవేదియైనా వారికి మోక్షంలేదని ప్రహ్లాదుని నిష్కర్ష.)
కాబట్టి అన్నింటా ఉచితమైన నీ దాస్యభాగ్యాన్ని ప్రసాదించమని నమస్కరించిన ప్రహ్లాదుని స్తుతులకు మెచ్చి నిర్గుణుడైన విష్ణువు క్రోధం మాని ఇలా అన్నాడు.
(ప్రహ్లాదుడు నరసింహస్వామిని 'దాస్యయోగం' ప్రసాదించమని ప్రార్థించాడు. 'దాస్యయోగ' మంటే జీవితాంతం నిత్య కైంకర్యం. 'కైంకర్య భక్తి'. వీరు సామీప్య, సాలోక్యముక్తులనే వైకుంఠంలోను కోరుకొంటారు తప్ప 'సాయుజ్యం' కాదు. శ్రీవైష్ణవులందరూ ఈ విధమైన ముక్తినే కోరుకుంటారు.)
బాలకా! నీ నడత నాకు సంతోషకరం; నీకు శుభమౌగాక! నీవు తలంచిన కోర్కెలన్నీ కృపతో తీర్చగలను. విచారించకు; నేను భయంకరుడనైనా భక్తులకు వరదుడనే. నిజమే. నన్ను చూడటం కష్టమే. అయితే నన్ను చూచిన ప్రాణికోటికి ముక్తి లభిస్తుంది.
(సర్వధర్మాలను వదిలి నన్నే శరణుపొందినవాడిని సర్వపాపాలనుండి విముక్తుణ్ణి చేసి ఉద్ధరిస్తాను - అని గీతలో శ్రీకృష్ణభగవానుడు అభయమిచ్చాడు.)
బాలకా! అన్నివిధాల విద్వాంసులు సజ్జనులు, ఎల్లశుభాలకు ఏలికనైన నన్ను తమ కోర్కె లీడేర్చమని అర్థిస్తారు. నీవూ ఏదైనా కోరు; తప్పక ఇస్తాను.
ఆ ప్రకారంగా దేవుడు భక్తునిలోగల కోర్కె తెలిసికొనుటకై, అతనిని వంచిస్తూ పలికాడు. ప్రహ్లాదుడు కామరహితుడు, ఏకాంత భక్తుడు కాబట్టి కోర్కె భక్తికి భంగకరమని భావించి దేవునితో, “పుట్టిన దాదిగా కోర్కె లీడేర్చుకొనుటలో ప్రీతిగల నాకు వరం ఇస్తానని మోసగించు టెందుకు? సంసార బీజానికి ఆదికారణమైన కామాలకు భీతిల్లి ముక్తి గోరి క్షేమార్ధినై నియమవర్తినై నిన్ను ఆశ్రయించాను. కోర్కెలు, వాటి మూలాలయిన ఇంద్రియాలు, మనశ్శరీరాది సర్వవిశేషాలు, బుద్ధి ప్రాణధర్మాలు, సిగ్గు, తలపు, సంపద, సత్యం, తేజస్సు మున్నగునవి నశిస్తాయి. లోకాల్లో సేవకులు ధనకాంక్షతో రాజను సేవిస్తే, వారు స్వప్రయోజనార్థులై వారికి ధనాలు అర్పిస్తారు. ఆ విధంగా వద్దు. నాకు కోర్కె లేదు; నీకూ ప్రయోజనం లేదు; అయినా నృసింహా! నాకు వర మియ్యదలిస్తే కోర్కెలు పెరగని వర మివ్వు. నిష్కాముడయిన నరుడు, నీకు సమానుడౌతాడు. ఓం నృసింహా! ఓం పరమాత్మ! ఓం పురుషోత్తమా!” అని నమస్కరించగా అతనితో దేవుడిట్లన్నాడు.
(ప్రహ్లాదుడు చివరి ఘట్టంలో కూడ భగవంతుడు పెట్టిన పరీక్షలోనెగ్గి 'ఏకాంతి' (విష్ణువునందు అనన్యభక్తి, ఆత్యంతిక, పరమైకాంత భక్తిగలవాడు) కాబట్టి కామం భక్తియోగానికి అంతరాయమని నిశ్చయించి 'కామంబులు వృద్ధిపొందని వరము కృప చేయుము' అని కోరడం పరమైకాంత భక్తికి పరమ చరమోదాహరణ.)
ప్రహ్లాదా! నీవంటి జ్ఞానులు నా నుండి వరాలను ఆశించరు. అయితే, నీవు రాక్షసచక్రవర్తిగా డెబ్భై ఒక్క దివ్యయుగాలు అనగా మన్వంతరం వరకు భోగాలు అనుభవించు; నా (హరి) శోభనబుద్ధితో; అన్నింటా నిండిన నన్ను సకలేశ్వరుని, మనస్సులో నిలిపి నిష్కాముడవై, భగవదర్పణబుద్ధితో పూజలు చేయి. భోగాల అనుభవాలవలన పుణ్యం నశిస్తుంది. వ్రతాలు ఆచరించు; దానివలన పాపాలు నశిస్తాయి.
ఆ మీద, కాలవేగానికి లోనై శరీరపతనం జరిగిన తరువాత, ముల్లోకాల్లో వెలిగే, దేవేంద్రునిచే కీర్తింపబడే, పదిదిక్కుల వ్యాపించిన సత్కీర్తితో పాటుగా బంధాలు తెగి, నన్ను చేరగలవు. ఇంకా విను.
మనుష్యుడు ప్రీతితో నాయీ నృసింహావతార వృత్తాంతాన్ని ఇందలి ఇతర ఆధ్యాత్మికాంశాలను మనస్సు కెక్కించుకొన్నట్లయితే, అతనికి పునర్జన్మ ఉండదు. కర్మబంధాలు అన్నీ దాటి ముక్తికి చేరుకుంటాడు.
(నృసింహావతార కథా తత్త్వాన్ని, సంపూర్ణంగా ఆకళించుకొన్నావాడు సకలకర్మబంధాలనుండి విడుదలను పొందుతాడు.)
అని నృసింహుడు పలుకగా, ప్రహ్లాదుడు ఇలా బదులు చెప్పాడు.
పద్మాక్ష! పూర్వం నీవు నా తండ్రికి సోదరుడైన హిరణ్యాక్షుని వరాహావతారంతో వధించావు. ఆ కోపంతో మా తండ్రి సర్వేశ్వరుడవైన నిన్ను గ్రహించలేక నీకు విరోధిగా మారి; నీ భక్తుడినైన నాకు అపకారం చేశాడు. అయినా అతడు నేడు నీ శాంత దృష్టిచే నిర్మలుడైనాడు. కనుక నాతండ్రి సకలపాపాలనుండి విముక్తుడై శుద్దాత్ముడయ్యేట్లుగా నాకు వరమిమ్ము. భక్తుల ముఖపద్మాలకు భాస్కరుని వంటివాడా! వారి పాపాల తీగలకు గొప్పకొడవలి వంటివాడా! మంగళకరమైన శరీరంగలవాడా! దేవా! నీకు నమస్కారములు.
అని ప్రహ్లాదుడు పలుకగా, భక్తవత్సలుడైన నృసింహస్వామి ఇలా అన్నాడు.
రాక్షస శ్రేష్ఠా! నీవు నాకు నిజమైన భక్తుడవు; అట్టి నిన్ను గన్న నీ తండ్రి, ఇరువదొక్కతరాల తన పూర్వులందరితో పాటుగా పవిత్రుడై శుభమార్గాన ప్రవర్తిస్తాడు. అంతేకాదు; జ్ఞానదీప్తులతో తమ పూర్వజన్మల పాపాల చీకట్లు పారద్రోలిన నా భక్తులు నడిచే దేశాలలోని చెడ్డవాళ్లైనా మంచివాళ్లే అవుతారు! ఇది సత్యం.
సచ్చరిత్రా! ప్రహ్లాదా! సృష్టిలోని పెద్ద చిన్న ప్రాణులన్నింటా ఎవరు కోర్కెలు మాని నీవలె నన్ను కొలుస్తారో, వారు నాకు భక్తులు. నా భక్తులకు ఆదర్శంగా నీవు నిలిచావు. ఇకపై, వేదోక్తంగా, నాపై మనసుపెట్టి, నీ తండ్రికి అపరకర్మలు భక్తిశ్రద్ధలతో నిర్వహించు. అతడు; యుద్ధంలో నా శరీరస్పర్శకారణంగా శుద్ధశరీరుడై నూతన మహిమతో అతని పాపాలన్నీ నశించి, పుణ్యలోకాలకు చేరుకుంటాడు.
ఈ విధంగా నృసింహుడు ఆజ్ఞాపించగా ప్రహ్లాదుడు తన తండ్రికి అపరకర్మలుచేసి, అనంతరం బ్రాహ్మణోత్తములచేత రాజ్యానికి పట్టాభిషిక్తుడైనాడు; అపుడు దయా పరిపూర్ణుడయిన నృసింహస్వామిని, ప్రముఖదేవతా పరివృతుండైన బ్రహ్మ సమీపించి ఇలా అన్నాడు.
నృసింహదేవా! వీడు ఈ రక్కసుడు నానుండి వరం గ్రహించి, నాచే సృష్టింపబడిన వారెవరిచేతను మృత్యుభయం లేనివాడై మదోన్మత్తుడై, ఎల్లధర్మాలు చెడగొట్టి నేటికి నీచేత నిహతుడైనాడు, లోకాలకు అన్నింటికీ నేడు శుభం చేకూరింది. ఈ బాలుడు మహాభాగవత శిరోమణి. ఇతడిని మృత్యుభయం నుండి విముక్తుని చేసి బ్రతికించావు! వరమూ ఒసగినావు. దేవా! ఈ నృసింహావతార కథను మననం చేసేవారు యముని పాలిట పడరు; వారికి మృత్యుభయమూ కలుగదు.
బ్రహ్మ మాటలకు నృసింహుడు ఇలా బదులు పలికాడు.
బ్రహ్మదేవా! ఇకమీద ఎప్పుడూ రాక్షసులకు ఇటువంటి వరాలు ఇయ్యబోకు; పాపాత్ములకు వరముల దానమంటే, పాములకు అమృతదానం వంటిదే సుమా!
ఆ విధంగా ఆజ్ఞాపించి, బ్రహ్మాది దేవతల పూజలు స్వీకరించి, దేవుడు నృసింహుడు మాయమయ్యాడు; ప్రహ్లాదుడు శంకరునికి, బ్రహ్మదేవునికి, ప్రజాపతులకు, ఇతర దేవతలకు వరుసగా నమస్కరించాడు. అపుడు బ్రహ్మ శుక్రాచార్యుడు మొదలయిన మునులతో కలసి యావద్రాక్షస రాజ్యానికి ప్రహ్లాదుణ్ణి పట్టాభిషిక్తుని జేసి, అతనిచే పూజలందుకొని, అతనిని దీవించాడు. ఆ తరువాత శంకరాది సర్వదేవతలు పలువిధాల ప్రహ్లాదుని దీవించి, బ్రహ్మను ముందుంచుకొని తమ తమ స్థానాలయిన లోకాలకు మరలి వెళ్ళారు. ఈ విధంగా విష్ణువు, తన పార్శ్వచరులిద్దరు, సనకసనందనుల శాపవశాన, మొదటి జన్మలో హిరణ్యాక్ష హిరణ్యకశిపులనే రాక్షసులుగా జన్మించగా, వారిని వరాహ నరసింహ అవతారాలు ఎత్తి సంహరించాడు; రెండవ జన్మలో వారు, రావణ కుంభకర్ణులనే దైత్యులుగా జన్మించగా, శ్రీరాముడై వారిని వధించాడు; మూడోజన్మలో శిశుపాల దంతవక్త్రులను పేరులతో జన్మించగా, వారిని శ్రీకృష్ణుడై చంపాడు. ఇట్లా మూడు జన్మలలో గట్టి ద్వేషానుబంధంతో, నిరంతరం శ్రీహరి ధ్యానమగ్నులై వారు పాప విముక్తులై తిరిగి హరిని చేరారు అని వివరించి నారదుడు ఇంకా ఇలా అన్నాడు.
(హిరణ్యాక్ష హిరణ్యకశిపులు, రావణకుంభకర్ణులు, శిశుపాలదంతవక్త్రులు వీరందరూ 'వైరభక్తి'కి ప్రకృష్టోదాహరణులు. “గాఢవైరానుబంధంబున నిరంత సంభావిత ధ్యానులై” ఆ విష్ణుమూర్తి చేతనే 'నిఖిలకల్మష విముక్తు'లైనారు.)
రాజా! ఈ సుందరమైన నృసింహ వృత్తాంతాన్ని రాక్షస సంహారాన్ని, మహాభాగవతశిరోమణి అయిన ప్రహ్లాదుని చరిత్రను, ఎవ్వడైనా, నిర్మల మనస్కుడై విన్నా చదివినా, అతడు భయంలేని లోకానికి చేరగలడు.
రాజశ్రేష్ఠా! బ్రహ్మాది దేవతలు గూడ తమ మనస్సులలో తర్కించి- 'ఇది యిట్టిది' అని మాటలలో చెప్పజాలని పరబ్రహ్మస్వరూపమే శ్రీకృష్ణుడు. అతడు నీ యింట నీకు స్నేహితుడుగా, మేనమరిదిగా, మంత్రాంగం నెరపే అమాత్యుడుగా, మనఃప్రియుడుగా, మహాప్రయోజన సంధాతగా మెలగటం నీ అదృష్ట విశేషం!
Subscribe to:
Post Comments (Atom)
Halahala, Kalakuṭa (most deadly and venomous poison in the universe) Emerged - హాలాహలం జనించుట
హాలాహలం జనించుట ఆ తరువాత అంతలోనే, అల్లకల్లోలమైన ఆ సముద్రంలోనుండి హాలాహలమనే విషం కోలాహలమైన అగ్ని జ్వాలలతో బయటపడింది. దాన్ని చూసి భయపడి సురాస...
-
సూర్య ద్వాదశ నామాలు ధ్యేయః సదా సవితృమండలమధ్యవర్తీ నారాయణః సరసిజాసన సన్నివిష్టః । కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటీ హారీ హిరణ్మయవపుః ధృతశంఖచక్రః ...
-
ఆదిత్యహృదయం తతో యుద్ధపరిశ్రాంతం సమరే చింతయా స్థితమ్ | రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితమ్ || 01 || దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతో ...
-
నిత్య పారాయణ శ్లోకాలు స్తోత్రాలు నవ గ్రహ స్తోత్రం సుబ్రహ్మణ్యాష్టకం ఆదిత్యహృదయం కనకధారా స్త్రొత్రమ్ దుర్గాసప్తశ్లోకీ శ్రీ సరస్వతీ కవచం తోటకా...
No comments:
Post a Comment