Wednesday, March 18, 2026

Sri Yaganti Uma Maheswara Temple - యాగంటి - ఉమామహేశ్వర స్వామి దేవాలయం

యాగంటి - ఉమామహేశ్వర స్వామి దేవాలయం

అద్భుతమైన చరిత్రలను కలిగి ఉన్న కొన్ని దేవాలయాలు ఉన్నాయి. కొన్ని నిర్మాణ వైభవంతో అలరారుతుండగా, మరికొన్ని ఆధ్యాత్మిక శోభను కలిగి ఉంటాయి.

కొన్ని వందల సంవత్సరాల తర్వాత కూడా చెక్కుచెదరకుండా ఉంటాయి. అటువంటి ఆలయాలలో ఒకటి యాగంటి శ్రీ ఉమా మహేశ్వర స్వామి శివాలయం. 

ఈ ఆలయాన్ని 15 వ శతాబ్దంలో మొదటి విజయనగర సంగమ రాజులు హరిహర బుక్కరాయలు నిర్మించి పూర్తి చేశారు.

చారిత్రక కథనం: ఆలయ ప్రాంగణంలో ఉన్న ఒక గుహలో తపస్సు చేసిన శ్రీ అగస్త్య మహా మునీశ్వరుడు ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఆలయం నిర్మించాలని తలపెట్టారు. కానీ ప్రతిష్ఠించదలిచిన విగ్రహం కాలి బొటన వ్రేలు గోరు విరగడం వల్ల స్వామి వారిని ప్రతిష్ఠించ లేదు. నిరాశకు లోనైన మునీశ్వరులు శివుని కొరకు తపస్సు చేశారు. పరమేశ్వరుడు ప్రత్యక్షమై స్థలం కైలాసాన్ని పోలి వున్నందున శివున్ని ప్రతిష్ఠించమని చెబుతాడు. అపుడు మునీంద్రుడు ఒకే శిలపై పార్వతీ సమేతుడై ఉమామహేశ్వరుడుగా భక్తులకు దర్శనమివ్వాలని శివుని కోరతాడు.

ఇంకో కథ కూడా ప్రాచూర్యంలో వుంది దాని ప్రకారం : చిట్టెప్ప అనే శివ భక్తుడు శివుని కొరకు తపస్సు చేశాడు. శివుడు ఒక పులిలాగ ఆయనకు కనబడతాడు. అపుడు పరమేశ్వరుడు తనకు పులి రూపంలో ప్రత్యక్షమైనాడని గ్రహించిన చిట్టెప్ప "నేగంటి శివను నే కంటి" అంటూ ఆనందంతో నృత్యం చేశాడు. ఆలయానికి దగ్గరలో చిట్టెప్ప గుహ వుంది.

ఇది ఎంతో ప్రసిద్ధి గల ఆలయం. ఎన్నో గొప్ప రాజవంశాల చేత యాగంటి శ్రీ ఉమామహేశ్వర ఆలయం పోషింపబడి, పునరుద్ధరింపబడినది . యాగంటి క్షేత్రంలో ప్రధాన దేవత శ్రీ ఉమామహేశ్వరుని లింగం. శివుడు, పార్వతి, నంది ఈ  ఆలయంలోని ప్రధాన మూర్తులు. ప్రతి సంవత్సరం శివరాత్రినాడు యిక్కడ ఘనంగా ఉత్సవాలు జరుగుతాయి.

ఇక్కడ నందీశ్వరుని విగ్రహం , ఆలయ ప్రాంగణంలో ఉన్న చిన్న కోనేరు ఎంతో ఆధ్యాత్మిక శోభను కలిగిస్తాయి. ప్రకృతి ఒడిలో పుట్టిన జలధార పర్వత సానువుల్లో సంవత్సరం పొడవునా ప్రవహిస్తూ ఒక చిన్న నంది విగ్రహం నోటి నుంచి ఆలయ ప్రాంగణంలోని కోనేరు లో చేరుతుంది. ఏ కాలంలో నైనా కోనేరు లోని నీరు ఒకే మట్టంలో వుండడం ఇక్కడి విశేషం. ఈ కోనేరులోని నీరు పుష్కరిణికి చేరుతుంది. ఇందులోని నీటికి ఔషధ గుణాలున్నాయని, ఇందులో స్నానమాచరిస్తే సర్వ రోగాలు నయమౌతాయని భక్తుల నమ్మకం. అగస్త్యుడు పుష్కరిణిలో స్నానమాచరించిన తర్వాత శివున్ని ఆరాధించేవారు.

ప్రధాన గోపురం ఐదు అంతస్తులు కలిగి ఉంది. దీన్ని దాటగానే రంగ మంటపం, ముఖ మంటపం, అంతరాళం, ఉన్నాయి. గర్బాలయంలో లింగ రూపంపై ఉమా మహేశ్వరుల రూపాలు కూడా ఉన్నాయి.

యాగంటిలో సహజ సిద్ధంగా ఏర్పడిన కొండగుహలు చూడ ముచ్చటగా ఉంటాయి. ఆలయానికి ఉత్తరాన శ్రీ అగస్త్య మహాముని వారి గుహ, ఆలయ ముఖద్వారానికి ఉత్తరాన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గుహ, పుష్కరిణికి ఉత్తరాన శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి గుహ వున్నాయి.

ఈ గుహలో అగస్త్య మహాముని తపస్సు చేసినట్లు చెబుతారు. ఈ గుహలోకి వెళ్ళడానికి మెట్లు ఉంటాయి. అవి 120 నిటారు మెట్లు. ఈ గుహలో 
పడమర వైపు ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన శివలింగం, ఆదిశేషుని ఆకారాలు  కనిపిస్తాయి. ఇక్కడి నుండి పలు పుణ్య క్షేత్రాలకు సొరంగ మార్గాలు వున్నట్లు చెబుతారు.

శ్రీ వెంకటేశ్వర స్వామి వారి విగ్రహం తోలిచే సమయంలో కాలి బొటనవేలు గోరు విరిగింది. ఈ విధమైన అసంపూర్ణ విగ్రహం పూజలనందు కొనకూడదు. అందువల్ల ఈ విగ్రహాన్ని ఈ గుహలోనే  అగస్త్య మహర్షి ప్రతిష్ఠించాడు. ఈ విగ్రహం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం నిర్మాణానికి ముందే ప్రతిష్టింపబడింది. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారు తన కాల ఙ్ఞానంలో ఈ స్థలం తిరుపతికి ప్రత్యామ్నాయంగా మారుతుందని రాశారని చెబుతారు. ఈ గుహలోకి వెళ్ళడానికి మెట్ల మార్గం ఉంది. 

ఈ గుహలోనే పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారు కాల ఙ్ఞానం రాశారని భక్తులు నమ్ముతారు. దీనిని శంకరగుహ, రోకళ్ళగుహ అనికూడా అంటారు. ఈ గుహలోకి వంగి వెళ్ళవలసి వస్తుంది. ఈ గుహలో నుండి బనగానపల్లె పట్టణానికి సమీపంలో ఉన్న రవ్వల కొండ గుహలకు దారి వున్నట్లు చెబుతారు. ప్రస్తుతం ఆ దారి మూసి వేయబడి వుంది.

ఇక్కడి ముఖ మంటపంలో స్వయంభువుగా వెలసిన బసవన్న విగ్రహంలో జీవకళ ఉట్టిపడుతూ ఉంటుంది. దానిని చూడగానే లేచి రంకె వేయడానికి సిద్ధంగా ఉందేమోనని అనిపిస్తుంది. ఈ బసవన్న ప్రతి 20 సంవత్సరాలకి ఒక అంగుళం చొప్పున పెరుగుతుందని పురావస్తు శాఖ కూడా నిర్ధారణ చేయడంతో మరింత మహిన్వితమైనదిగా వెలుగొందుతోంది. కలియుగాంతంలో యాగంటి బసవన్న లేచి రంకె వేస్తాడని శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి గారి కాలజ్ఞానం లో ప్రస్తావించబడి ఉంది. యుగాంతంతో ముడిపడి ఉన్న ప్రత్యేకత యాగంటి బసవన్నకు ఉంది.

యాగంటిలో కాకి కనిపించకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇందుకు సంబంధించిన కథ ఒకటి ప్రచారంలో ఉంది. పూర్వం ఈ ప్రాంతాన్ని దర్శించిన అగస్త్య మహర్షి ఇక్కడ వెంకటేశ్వరస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని తలంచాడు. విగ్రహాన్ని మలిచే సమయంలో కాలి బొటనవేలు గోరు విరిగిందట. తన సంకల్పంలో లోపమేమో అనే సందేహం తలెత్తడంతో శివుని గురించి తపస్సు చేశాడు. ఆ సమయంలో కాకులు ఆయన తపస్సుకు భంగం కలిగించడంతో, అవి ఆ ప్రాంతంలో సంచరించకుండా శపించాడని కథనం. అందువల్లనే ఇక్కడ కాకులు కన్పించవని చెబుతుంటారు.

నెగంటి అనేది ఈ ఊరి అసలు పేరు, అంటే 'నేను చూశాను' అని అర్థం, సమయం గడిచేకొద్దీ స్థానికులు యాగంటి అని పిలవడం ప్రారంభించారు.

భక్తులకు యాగంటిలో వసతి సౌకర్యాలు వున్నాయి. అంతే కాకా బనగానపల్లి లో కూడా వసతి సోకార్యాలు అందుబాటులో ఉంటాయి.

ఈ క్షేత్రానికి రోడ్డు మార్గం ద్వారా మాత్రమే చేరుకోగలము. యాగంటి క్షేత్రం బనగానపల్లె ప్యాపిలి మార్గంలో మండల కేంద్రమైన బనగానపల్లె పట్టణానికి పడమర దిక్కున సుమారు 14కి.మీ.ల దూరంలో ఉంది. కర్నూలుకు దాదాపు 100కి.మీ.ల దూరంలో ఉంటుంది. కర్నూలు, బనగానపల్లి, నంద్యాల నుండి యాగంటి క్షేత్రానికి బస్సు సౌకర్యం ఉంది. చారిత్రక స్థలమైన బెలుం గుహలుకు సుమారు 45కి.మీ.ల (1.5గంటల ప్రయాణం) దూరంలో ఉంది.


నిత్య స్తోత్రావళి

పంచాంగం

No comments:

Post a Comment

Halahala, Kalakuṭa (most deadly and venomous poison in the universe) Emerged - హాలాహలం జనించుట

హాలాహలం జనించుట ఆ తరువాత అంతలోనే, అల్లకల్లోలమైన ఆ సముద్రంలోనుండి హాలాహలమనే విషం కోలాహలమైన అగ్ని జ్వాలలతో బయటపడింది. దాన్ని చూసి భయపడి సురాస...