Wednesday, March 11, 2026

Chitraketu Engaged in Deep Meditation for Seven days, completely focusing his mind on Lord Sankarshana (Vishnu) and got his blessings - చిత్రకేతుండు తపం బాచరించి భగవత్ప్రసాదంబు నొందుట

చిత్రకేతుండు తపం బాచరించి భగవత్ప్రసాదంబు నొందుట

సుఖదుఃఖాలతో సంబంధం లేకుండా, అన్ని విషయాలలో ఉపేక్ష భావంతో ఉండే పరమాత్మ అయిన ఆ పరమేశ్వర స్వరూపుడ నైన నాకు మీకు సంబంధం ఏమున్నది? మీరు దుఃఖించవలసిన పనిలేదు అని చెప్పి ఆ జీవుడు వెళ్ళిపోయాడు. చిత్రకేతుమహారాజు, అతని బంధువులు మిక్కిలి ఆశ్చర్యపడ్డారు. దుఃఖాన్ని వదలిపెట్టారు. మోహాన్ని దరిచేర నివ్వలేదు. యమునానదీతీరంలో ఆ కుమారునకు ఉత్తరక్రియలు చేశారు. గొప్ప బురదలో కూరుకుపోయిన ఏనుగు బయటపడిన రీతిగా ఇల్లు అనే చీకటినూతినుండి చిత్రకేతుమహారాజు బయటపడ్డాడు. యమునానదికి వెళ్ళాడు. శాస్త్రవిధిగా స్నానంచేసి మౌనం వహించి నారదునకు నమస్కరించాడు. నారదుడు ప్రసన్నుడయ్యాడు. భగవంతుని మంత్రాన్ని విధివిధానంతో చిత్రకేతు మహారాజుకు ఉపదేశం చేశాడు. అంగిరసునితో కలసి నారదుడు బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు.

నారదుడు చెప్పిన రీతిగా చిత్రకేతుడు ఆహారాన్ని విడిచిపెట్టి సమాధి స్థితిలో నారాయణ స్వరూపం అయిన ఆ నారదోపదేశ విద్యను ఆరాధించి ఏడు రాత్రుల చివర ఎదురులేని విద్యాధర పరిపాలనాధికారం పొంది, కాంతులు చిమ్మే రత్నాలతో కూడిన గొప్ప విమానాన్ని పొంది, నారాయణుని దయను పొందినవాడై ముల్లోకాలలో మనోవేగంతో తిరుగుతూ ఉండగా కొన్ని రోజులకొక ప్రాంతంలో

ముత్యాలహారాలతో, గంధంతో సమానమైన తెల్లని దేహం కలవాణ్ణి, అందమైన పీతాంబరం ధరించినవాణ్ణీ, మణులతోకూడిన కిరీటకాంతులు నిండిన శిరస్సులు గలవాణ్ణీ, కడియాలు, భుజకీర్తులు నిండిన చేతులు కలవాణ్ణీ, స్వర్ణమయకాంతులతో కూడిన మొలతాళ్లు కలవాణ్ణి, కదలాడే యజ్ఞోపవీతాలు కలవాణ్ణీ, దయతోకూడిన ముఖపద్మాలు కలవాణ్ణీ, యౌవనకాంతితో విప్పారిన నేత్రాలు కలవాణ్ణి, సిద్ధమండలం సేవించగా పుణ్యప్రసిద్ధితో వెలసిన గొప్ప చరిత్రగలవాణ్ణి, తామరస నేత్రుడైన శ్రీ విష్ణుమూర్తికి పాదపీఠమై ఉన్న మహాత్ముడైన ఆదిశేషుణ్ణి చిత్రకేతుమహారాజు చూశాడు.

చిత్రకేతు మహారాజు ఆ ఆదిశేషుణ్ణి చూచినంతనే, ఆయన పాపాలన్నీ పోయాయి. మనసు ప్రశాంతమయింది. అధికభక్తియుతుడై రాజు శరీరం రోమాంచితంకాగా, ఆనందబాష్పాలతో ఆదిశేషునకు నమస్కారం చేశాడు.

చిత్రకేతు మహారాజు ఆనందబాష్పాలతో అనంతుణ్ణి అభిషేకించాడు. పట్టరాని ఆనందంతో గద్గదకంఠుడై మాట్లాడలేక మాట్లాడలేక కొంతసేపటికి

చిత్రకేతుమహారాజు మనసును చిక్కబట్టుకొన్నాడు. బాహ్యవిషయాలను మాత్రమే గుర్తిస్తున్న జ్ఞానేంద్రియాలను ఒకచోటకు చేర్చాడు. మనసు మాట ఈ రెండు ఒకటే కాగా వాటిని తత్త్వంలో నిలిపి శాశ్వతాకారుడు, దయ గలవాడు, ప్రశాంత స్వభావుడు, జగద్గురువు అయిన ఆదిశేషుణ్ణి స్తుతింప నారంభించాడు.

ఓ హరీ! అనంతా! నీవు ఎవరిచేతను జయింప శక్యం కానివాడవై ఉండికూడా ఇప్పుడు నీ భక్తులచే జయింపబడినావు. నీ భక్తులు కూడా నీ చేత జయింపబడ్డారు. నిన్ను గూర్చి ఆసక్తితో పూజింపనివారు నిన్ను పొందలేరు కదా!

ఓ పరమాత్మా! ఈ ప్రపంచం సృష్టి స్థితి, లయ అనే కార్యక్రమాలతో నిండి ఉండటం నీ వైభవమే. ఈ ప్రపంచాన్ని సృష్టించేవారు నీ అంశలు పొందిన వారే. ఈ సృష్టి స్థితి, లయ అనే పనులు చేయగలిగే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు నీ సుగుణ సముద్ర తీరాన్ని చూడలేక తెలివిగల వారమనుకొని నీ గురించి చర్చచేసుకొంటూ ఉంటారు.

స్వామీ! నీవు వేదవేత్తవు. ఆది మధ్యాంతాలు నీ వశంలో ఉంచుకున్నవాడవు. పరమాణువు మొదలుకొని పరమోత్కృష్టమైన పదార్థంవరకూ వ్యాపించి ఉన్నావు. నీవు శాశ్వతుడవు.

పృథ్వి, జలం, తేజస్సు, వాయువు, ఆకాశం అనే పంచభూతాలూ; మహత్తూ, అహంకారమూ అనే ఏడున్నూ ఒకదానికంటె ఒకటి పదిరెట్లు పెద్దవిగా కూర్చబడి ఉంటాయి. దీనినే అండకోశం అంటారు. ఇటువంటి బ్రహ్మాండాలు ఎవరిలో ఒక అణువువలె ఉంటాయో అతడు అనంతుడని పిలువబడతాడు.

పశుస్వభావంగల మానవులు కొంతమంది ఒక్కొక్కచోట ఇంద్రియాలను, వాటి కోరికలను తీర్చుకోవాలని తీవ్రమైన ఆలోచనతో పరతత్త్వం అయిన నిన్ను వదిలిపెట్టి, ఐశ్వర్యాన్ని కోరుకొనేవారై మిగిలిన దేవతలను సేవిస్తూ ఉంటారు. నీవు కాక ఇతర దేవతలు ఇచ్చే సంపదలు అశాశ్వతులైన ఆ దేవతలతోపాటే నాశనం పొందుతాయి. నిజానికి ఇంద్రియ విషయాలను కోరుకొనేవారైనా ఇతర దేవతలనుకాక నిన్ను ఆరాధిస్తే, వేయించిన విత్తనం ఎలా మొలకెత్తదో అలా మరో దేహాన్ని ధరించే పునర్జన్మ పొందరు. నీవు నిర్గుణడవే. నీవు జ్డాన విజ్ఞానరూపుడవే. నిన్ను జ్ఞానులు గుణసమేతునిగా భావన చేస్తారు. వేయి మాటలెందుకు? నిన్ను ఏ రకంగా పూజించి సేవించినా మోక్షాన్ని పొందుతారు. సనత్కుమారులు మొదలైనవారు నీవు ఏ విధంగా భాగవత ధర్మాన్ని నిర్ణయించావో ఆ విధంగానే అన్నిటికంటె, అందరికంటె గొప్పవాడవైన నిన్ను మోక్షం పొందాలనే ఆలోచనతో సేవిస్తారు.

నీవు చెప్పిన భాగవతధర్మంలో జ్జానం లేనివాడు ఒక్కడు కూడా లేడు. ఈ భాగవతధర్మంగాక ఇతరమైన కోరికలతో సమంకాని బుద్ధిచేత మిగిలినవారు నేను, నీవు, నాకు, నీకు అనే స్వపరభేదంతో ప్రవర్తించి అధర్మాన్ని ఆచరిస్తూ నశిస్తారు. చైతన్యంగలవి, చైతన్యంలేనివి అయిన ఈ స్థావర జంగమ ప్రాణుల సమూహం విషయంలో నీచే ప్రవచింపబడిన భాగవతధర్మాన్ని అనుసరించే మానవునకు నీ దర్శనంవలన పాపం పోవడంలో విచిత్రం ఏముంది?! ఈ సమయంలో నీ పాదదర్శనంచేత నేను స్వచ్చతను పొందాను. ఏమీ ఎరుగని మూఢుడనైన నాకు గతంలో దయతో నారదుడు భగవద్ధర్మాన్ని తెలియజేశాడు. ఆ నారదుడు చెప్పిన విషయం ఈనాడు నాకు వరదుడవైన నీవలన స్పష్టంగా దర్శనం అయింది. మహాత్మా! మిణుగురు పురుగులకు సూర్యుడు గోచరించనట్లే సామాన్య మానవులకు జగదంతర్యామివైన నీ మహత్త్వం గోచరం కాదు. సృష్టి స్థితిలయాలకు హేతుభూతుడవై భగవంతుడవైన నీకు నమస్కరిస్తున్నాను.

బ్రహ్మ మొదలైన సురశ్రేష్ఠులు ఏ మహాత్ముణ్ణి అనుసరించి భక్తియుక్తులతో ప్రశంసిస్తూ ఉంటారో, ఈ విశాల విశ్వం ఏ భగవానుని శిరస్సుపై ఆవగింజవలె సూక్ష్మ ఆకారాన్ని వహించి ఉంటుందో ఆ సహస్రఫణి అయిన ఆదిశేషుణ్ణి నేను సేవిస్తాను.

విద్యాధరులకు అధిపతి అయిన చిత్రకేతువు ఇలా అనంతుని స్తుతించగా, ఆ ఆదిశేష హరిరూపుడైన అనంతుడు ప్రేమతో ఓ స్వచ్చ మనస్కా! నీ బుద్ధి వైభవాన్ని మెచ్చుకుంటున్నాను అన్నాడు.

ఓ చిత్రకేతూ! నారదుడు, అంగిరసుడు నీకు నా తత్త్వాన్ని తెలియజేశారు. దానివల్ల నీవు నన్ను దర్శించగలిగావు. నాపై భక్తి కలిగింది. నా మార్గంపై నీకు అచంచలమైన విశ్వాసం కలిగింది.

ఈ విశాల విశ్వంలోని సమస్త ప్రాణులూ నా స్వరూపాలే. ఈ విశ్వంలోని అన్ని ప్రాణుల హృదయాలను ఎరిగి నిర్ధేశించువాడనూ, బ్రహ్మమూ, శబ్దబ్రహ్మమూ నేనే. నేను శాశ్వత శరీరాలు ధరిస్తున్నాను. ఆత్మస్వరూపంతో అఖిలలోకాలలో నేను ఉన్నాను. లోకాలన్నీ నాలో ఉన్నాయి. నేను అన్ని లోకాలలో ఉండటం, అన్ని లోకాలూ నాలో ఉండటం అనే ఉభయ క్రియలూ నాలో ఉన్నాయి. ఈ ఉభయ కృత్యాలూ నాకు అనుకూలంగా నడుస్తూ ఉంటాయి. సమస్త ప్రపంచంలో నేను లీనమై ఉంటాను. నిద్రించేవాడు స్వప్నంలో ప్రపంచమంతటినీ దర్శించి మెలకువ వచ్చిన తరువాత తాను ఎక్కడ ఉన్నాడో గ్రహించినట్లు జీవుడు తిరిగి తిరిగి ఒకనాటికి మాయనుండి విడివడి పరమధర్మాన్ని తెలుసుకొంటాడు.

జీవుడు నిదురించేవేెళ నిద్రలో మునిగి ఇంద్రియాలకు అతీతుడై ఉంటాడు. అతనిని గుణాలేవీ స్పృశింపవు. అటువంటి ఇంద్రియాతీతమైన ఆనందస్థితినే బ్రహ్మంగా గుర్తించు. ఆ బ్రహ్మస్వరూపమే నేనుగా తెలుసుకో.

జీవుడు నిదురించేవేళ కలగంటాడు. ఆ కలలో వివిధ విషయాలను దర్శిస్తాడు. మెలకువ వస్తుంది. మెలకువ వచ్చిన తరువాత కలలో చూచిన విషయం సత్యంకాదని గ్రహిస్తాడు. కలలో దృశ్యాన్ని చూచి, మెలకువ వచ్చిన తరువాత సత్యాన్ని గ్రహించి కలయొక్క సత్యంయొక్క లక్షణాన్ని సమన్వయం చేసుకోగల గొప్పజ్ఞానం ఏదైతే జీవునకు ఉంటుందో ఆ తత్త్వాన్ని 'నేను' అని గ్రహించాలి.

లోకంలో నరజన్మం పరమదుర్లభం. కావాలంటే లభించేది కాదు. అటువంటి ఉత్తమ జన్మమెత్తి కూడా ఆత్మస్వరూపం తెలుసుకోని వాడికి ఏమాత్రం సుఖం లభించదు. మానవులు సుఖప్రాప్తికోసం, దుఃఖనివృత్తికోసం ప్రయత్నిస్తుంటారు. ప్రవృత్తిమార్గాన్నీ నివృత్తి మార్గాన్నీ అవలంబిస్తారు. కాని వారి సంకల్పం కోరికతో కూడినందువల్ల వారికి సుఖం ప్రాప్తించదు. దుఃఖం తొలగిపోదు. కొందరు సుఖంకోసం దాంపత్యధర్మాన్ని ఆశ్రయిస్తారు. దీనిలో కూడా పరస్పరం వియోగం కలిగినప్పుడు విషాదం తప్పదు. అందువల్ల సంసారసంబంధంలో సైతం సుఖదుఃఖాలు ప్రాప్తిస్తూనే ఉంటాయి. నన్ను విస్మరించి దుఃఖకారణమైన ఈ బంధాలలో చిక్కుకున్నవారికి మోక్షం ఎట్లా దక్కుతుంది!

(మానవజన్మ దుర్లభమైంది. మానవుడు విషయలోలుడు కాకుండా ఆత్మతత్త్వాన్ని గ్రహించాలి. ప్రవృత్తిమార్గం నివృత్తిమార్గం అని రెండు మార్గాలున్నాయి. ప్రాపంచిక విషయాలలో కొట్టుమిట్టాడటం ప్రవృత్తిమార్గం. లోకంలో లౌకికంగా ప్రవర్తించకుండా ఉండడం నివృత్తిమార్గం. అంటే లౌకిక విషయాలకు పరాఙ్ముఖంగా ఉండటం, మనసును లోకం వైపునుండి ఆత్మతత్త్వం వైపు మళ్ళించడం. ప్రవృత్తివల్ల దుఃఖం, నివృత్తివల్ల సుఖం కలిగి తీరుతాయి. ఈ సంసారంలో ఉండే జీవికి సుఖదుఃఖాల పరంపర తప్ప, మోక్షం లభించదు. నిజానికి సుఖంగా భావించేది కూడా సుఖంకాదు. అదికూడా దుఃఖమే కాని మానవుడు ఆ దుఃఖాన్ని సుఖభ్రాంతితో చూస్తాడు. అన్ని దుఃఖాలకూ మూలం ఈ సంసారం అని అందరికీ తెలిసికూడా పరమాత్మను మనసులోనైనా ధ్యానించకుండా సంసారదుఃఖ ప్రవాహంలో ఉక్కిరి బిక్కిరి అవుతూ ఈ మానవుడు జీవిస్తూ ఉంటాడు. విషయ పరాఙ్ముఖత్వం అలవాటు చేసుకొంటూ చిత్తం పరబ్రహ్మంపై నిలపటం నిజమైన మోక్షహేతువు.)

మానవులు విజ్ఞానాన్ని అభిమానిస్తారు. అటువంటివారు మిక్కిలి సూక్ష్మమైన ఆత్మమార్గంలో జాగృత్‌, స్వప్న, సుషుప్తి అనే మూడు స్థితులు దాటిన నాల్గవదైన తురీయస్థితిని తెలుసుకొని, ఇహలోక, పరలోక విషయాలచేత, విచక్షణ అనే వివేకం యొక్కబలంచేత నియోగింపబడి జ్ఞాన విజ్ఞాన విషయాలలో ఎవడు సంతృప్తిని పొందుతాడో అటువంటి జీవుడు నాకు భక్తుడవుతాడు. ఈ విధంగా ఎవరు ఉంటారో వారు యోగమార్గనిపుణులై తమయొక్క ఆత్మచేత పరమాత్మను తెలుసుకోగలుగుతారు.

నీవు అదేవిధంగా నా యందు భక్తిశ్రద్ధలు గలవాడవై విజ్ఞానసంపదతో కూడిన మాటలచేత నన్ను స్తోత్రంచేసి ముక్తి పొందావు. విషయప్రపంచంనుండి బయటపడ్డావు అని ఆదిశేషుడైన అనంతపరమాత్మ విద్యాధరులందరికి ప్రభువైన చిత్రకేతుమహారాజుతో చెప్పి అదృశ్యంఅయిపోయాడు. ఏ దిక్కులో స్వామీ, సర్వాత్మకుడూ అయిన అనంతపరమాత్మ అదృశ్యం అయ్యాడో ఆ దిక్కునకు విద్యాధరరాజు చిత్రకేతువు నమస్కారం చేశాడు. ఆకాశమార్గంలో సంచరిస్తూ ఆ చిత్రకేతువు లక్షల దివ్యసంవత్సరాలు ఎదురులేని ఇంద్రియబలంతో ఎంతోమంది పరమయోగిపుంగవులు, దివ్యమునీంద్రుల, సిద్ధులు, చారణులు, గంధర్వులు స్తుతించే ద్రోణాది పర్వతాలను, రమ్యప్రదేశాలను, మనసులో అనుకున్నంత మాత్రంచేత ఆ సంకల్పాన్ని సిద్ధింపచేసే ప్రదేశాలను చూచి ఆనందిస్తూ, శ్రీమన్నారాయణుడు తనకు అనుగ్రహించిన దివ్యవిమానంలో సంచరిస్తూ

చిత్రకేతుమహారాజు కృష్ణార్పణబుద్ధితో బాగా గానంచేయగల యక్ష కిన్నర కాంతలచేత విష్ణుమూర్తికి సంబంధించిన గొప్పవైన నాటకరీతులనూ, గుణవిశేషాలను నృత్యాలుగా ఆడిస్తాడు. పద్మపత్ర నేత్రుడైన విష్ణువుయొక్క బిరుదులతో కూడిన ప్రఖ్యాతమైన గీతాలను పాడిస్తాడు. నిరంతరం వారి నోట గోవిందుని అనంత నామావళులను పలికిస్తాడు.

చిత్రకేతు మహారాజు అన్నివేళలా విష్ణుప్రీతిగా ఈ క్రింది పనులు చేస్తూ చేయిస్తూ ఉంటాడు. అవి, వైష్ణవజ్ఞానం తనలో నిలుపుకుంటాడు. భగవద్భక్తుల కైంకర్యం కోరుకుంటాడు. పద్మాక్షుడైన హరిని తులసీమాలాదులతో అలంకరిస్తాడు. విష్ణుకథామహాత్యాన్ని భాషిస్తూ ఉంటాడు. విష్ణుమూర్తి గుణసమూహాన్ని ఎలుగెత్తి పలుకుతాడు. పరతత్త్వాన్ని గుర్తించి దాన్ని వృద్ధి చేసుకొంటాడు. శ్రీకృష్ణసేవకులను సేవిస్తూ ఉంటాడు. పరమాత్మకు పూజాదికాలు సంతోషంతో సమర్పిస్తాడు. వైకుంఠప్రభువుయొక్క లీలలూ, రూపమూ, ప్రవర్తనా, గుణాలూ, నామాలూ వీటితోకూడిన దివ్యప్రబంధాలను సంగీత శాస్త్రానుసారంగా తాను పాడుతూ, ఇతర భక్తులచేత పాడిస్తూ ఉంటాడు.

No comments:

Post a Comment

The Story Of Savitru Genealogy - సవితృవంశ ప్రవచనాది కథ

సవితృవంశ ప్రవచనాది కథ ఓ రాజా! విను. త్వష్టయొక్క వంశం గూర్చి నీకు వివరంగా చెప్పాను. తరువాత సవిత పృశ్ని, సావిత్రి, వ్యాహృతి అనే భార్యలయందు పశు...