వామనమూర్త్యావిర్భావఘట్టము
మట్టమధ్యాహ్నం - గ్రహాలు, నక్షత్రం, చంద్రుడు శుభప్రదమైన చోట ఉండగా అభిజిల్లగ్నాన భాద్రపద మాసం శుక్ల పక్ష ద్వాదశిని వ్రతశీల పతివ్రత అగు అదితికి వామనుడై హరి జన్మించినాడు.
(పగలు పదునాలుగు గడియలమీద రెండు గడియల కాలంతో కూడిన లగ్నం అభిజిత్ లగ్నం.)
వామనుడు పుట్టినపుడు ఆయనకు నాలుగు చేతులూ ఆ చేతులలో శంఖమూ, చక్రమూ, గదా, పద్మమూ ఉన్నాయి. కపిలవర్ణంగల వస్త్రమూ, మకరకుండలాలతో మెరిసే చెక్కిళ్ళు, రొమ్ముపై శ్రీవత్సమూ, కమలాలవంటి కన్నులూ కలిగి ఉన్నాడు. తుమ్మెదలు మూగిన అందమైన వనమాల మెడలో కదలుతున్నది. రత్నాలుకూర్చిన బంగారు ఒడ్డాణం, బాహుపురులూ, కిరీటమూ, హారాలూ, కాలి అందెలూ కాంతులు వెదజల్లుతున్నాయి. కమనీయమైన కంఠభాగాన కౌస్తుభమణి మెరుస్తున్నది. ఆయన రూపం అందరి మనసులనూ ఆకర్షిస్తున్నది.
వామనుడు పుట్టగానే యక్షులు, గరుడులు, దేవతలు, సిద్దులు, నాగపతులు దుఃఖాన్ని వదలినారు. సాధ్యులూ, చారణులూ, ఋషులునూ, ఋత్విజులూ, విద్యాధరులూ సంతోషించినారు. సూర్యచంద్రులు కాంతులు విరజిమ్మినారు. కింపురుషులూ, గంధర్వులూ, కిన్నరులూ పాటలతో వాద్యాలు మోగిస్తూ ఆకాశంలో నాట్యాలు చేసినారు.
దిశల చీకటి పోయింది. సప్తసముద్రాలూ చాలా నిర్మలంగా అయినాయి. భూమి బ్రాహ్మణులచేత, ఆకాశం దేవతలచేత సేవించబడింది.
దేవతలు గుంపుగా పూలవానలను కురిపించినారు. పూలతేనియలు తుంపరలుగా రేగినవి. పుప్పొడిబురదచే భూభాగమంతా ఎక్కువగా కప్పబడింది.
'ఈ మహానుభావుడు ఇంతకాలం నా కడుపులో ఎలా ఉన్నాడా' అని అదితి ఆశ్చర్యపడింది. కశ్యపుడు ఆనందంతో కూడిన జయజయ శబ్దాలతో స్వామిని సంస్తుతించినాడు.
ఆ తర్వాత వామనుడు ఆయుధాలూ అలంకారాలూ కలిగిన తన దివ్యరూపాన్ని వదలి కపటవటునిగా మారురూపాన్ని ధరించినాడు. పొట్టిపిల్లవాడై వడుగు చేయదగిన వయసు కలవాడైనాడు. మారురూపం పొందిన ఆ కొడుకును చూచి అదితి ఆనందంతో పరవశించింది.
“ననుగన్న తండ్రీ! నా పాలి దేవుడా! నా తపములపంటా! నా కొడుకా! నా వడుగుపాపా! నా వంశాన్ని ప్రకాశింపచేసేవాడా! నా సంపదలకుప్పా! రావయ్యా!” అంటూ అదితి వామనుని పిలిచింది.
నాన్నా! దగ్గరకు రా! అని అదితి వామనుని పిలిచింది. బిడ్డ చేరువకు రాగానే ఆమె చనుబాలు జాలువారినవి. అక్కున చేర్చుకుంది. అతని చిన్నారి మొగాన్ని తడిమింది. కన్నులారా చూచింది.
'ఈ అదితికి లక్ష్మీ పార్వతులే సమానమైనవారు. ఇతరులు సరికారు' అంటూ పుణ్యాంగనలు బాలెంతరాలుకు పదిరోజులు పురుడు జరిపినారు.
ఆ తర్వాత వామనునికి వడుగు చేయటానికై కశ్యపప్రజాపతిని ముందుంచుకొని మునీంద్రులు తగిన కార్యకలాపాలు చేసినారు. వామనునికి సూర్యుడు గాయత్రీ మంత్రాన్ని ఉపదేశించినాడు. బృహస్పతి జన్నిదాన్నీ, కశ్యపుడు ముంజదర్భల మొలతాడునూ, అదితి కౌపీనాన్నీ, భూదేవి నల్లనిజింకచర్మాన్నీ, చంద్రుడు దండాన్నీ, ఆకాశం గొడుగునూ, బ్రహ్మ కమండలాన్నీ, సరస్వతీదేవి జపమాలికనూ; సప్తర్షులు పవిత్రమైన దర్భలనూ ఇచ్చినారు.
పరీక్షిన్మహారాజా! కుబేరుడు వామనునికి భిక్షాపాత్రను ఇచ్చినాడు. పార్వతీదేవి 'అక్షయం' అంటూ ఆ వటునికి పూర్ణభిక్షను పెట్టింది.
పరిశుద్దులయిన బ్రహ్మర్షులచే పూజించబడినవాడై మంత్రాలను చదువుతూ ప్రశస్తమయిన అగ్నిహోత్రాన పూర్వాచారాన్ని అనుసరించి వటుడు హోమం చేసినాడు.
Subscribe to:
Post Comments (Atom)
Previous life of Sankhachudu - శంఖచూడుడి పూర్వజన్మ
శ్రీ దేవీ భాగవతం నవమ స్కంధము - శంఖచూడుడి పూర్వజన్మ పద్మసంభవా! శంఖచూడుడు దానవేంద్రుడే కావచ్చు. దేవతలనందరినీ పారద్రోలి ఉండవచ్చు. కానీ అతడి వృ...
-
సూర్య ద్వాదశ నామాలు ధ్యేయః సదా సవితృమండలమధ్యవర్తీ నారాయణః సరసిజాసన సన్నివిష్టః । కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటీ హారీ హిరణ్మయవపుః ధృతశంఖచక్రః ...
-
నిత్య పారాయణ శ్లోకాలు స్తోత్రాలు నవ గ్రహ స్తోత్రం సుబ్రహ్మణ్యాష్టకం ఆదిత్యహృదయం కనకధారా స్త్రొత్రమ్ దుర్గాసప్తశ్లోకీ శ్రీ సరస్వతీ కవచం తోటకా...
-
ఆదిత్యహృదయం తతో యుద్ధపరిశ్రాంతం సమరే చింతయా స్థితమ్ | రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితమ్ || 01 || దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతో ...
No comments:
Post a Comment