Wednesday, March 18, 2026

The Story of Gajendra Moksham - గజేంద్ర మోక్షణ కథా ప్రారంభము

గజేంద్ర మోక్షణ కథా ప్రారంభము

నాల్గవ మనువు కాలంలో జరిగిన విశేషాలను చెబుతాను.

ఓ రాజా! ఉత్తముని తమ్ముడైన తామసుడు నాల్గవ మనువయ్యాడు. అతని కొడుకులైన కేతువు, వృషుడు, నరుడు, ఖ్యాతి మొదలైన పదిమంది మహావీరులు రాజులయ్యారు. సత్యకులు, హరులు, వీరులు మొదలైనవారు దేవతలయ్యారు. త్రిశిఖుడు దేవేంద్రుడయ్యాడు. జ్యోతిర్వ్యోముడు మొదలైనవారు సప్తమహర్షులయ్యారు. హరిమేధునికి, హరిణికి కుమారుడుగా శ్రీమహావిష్ణువు హరి అనే పేరుతో అవతరించాడు. ఆ హరియే మొసలికి చిక్కిన గజేంద్రుణ్ణి విడిపించి ప్రాణభయం పోగొట్టాడు. ఆ ప్రభువు సకలలోకాలకు అధిపతి. దయాసాగరుడాయన - అని శుకమహర్షి చెప్పగా పరీక్షిత్తు ఆ గజరాజు - మొసలి కథను వినగోరి

మొసలి నీటిలో తిరుగుతుంది. ఏనుగు అడవిలో తిరుగుతుంది. ఈ రెండూ ఒక దానిని మరొకటి సమీపించవు. అలాంటి వాటి నడుమ యుద్ధం ఎందుకు జరిగింది? ఏదీ ఒక మహత్తర కారణం లేకుండా వీటి మధ్య పోరు అసంభవం. ఈ పోరును పురుషోత్తముడైన హరి ఏ విధంగా తీర్చాడు? గజరాజు బాధ ఎలా తొలగింది? అందులోనూ ఆ అడవిలో ఆ ఏనుగును పురుషోత్తముడు తప్ప ఎవరు కాపాడగలరు.

ఓ మునీంద్రా! ఈ కథ ఎలా జరిగిందో నాకు తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది. దయతో వినిపించండి. ఆ కథలు నా చెవులకు పెద్ద పండుగ ఉండి మనసును కూడా ఆహ్లాదపరుస్తాయి.

పుణ్యజీవులైన పండితులు ఏ కథలతో మోక్షప్రదాత అయిన శ్రీమహావిష్ణువును వర్ణిస్తారో, ఆ కథలు మోక్షానికి దారి చూపిస్తాయని పండితులు ఎంతో ఆనందంగా వింటారు.

ఇలా ప్రాయోపవేశంలో ఉన్న పరీక్షిత్తు శుకమహర్షిని అడిగాడని సూతుడు సభలో ఉన్నవారికి చెప్పాడు. శుకుడు పరీక్షిత్తుకు గజేంద్రమోక్ష గాథను వినిపించడం ప్రారంభించాడు.

ఓ రాజా! క్షీరసాగరంలో త్రికూటమనే అందమైన పర్వతం విరాజిల్లుతూ ఉంది. అది పదివేల ఆమడల పొడవు, అంతే వెడల్పు కల్గి ఉంటుంది. దానికి బంగారు, వెండి, ఇనుములతో ఏర్పడిన మూడు ఎత్తెన శిఖరాలున్నాయి. ఆ కొండ చరియలలో, శిఖరాల్లో ఉండే రత్నాలవల్ల, గైరికాది ధాతువులవల్ల అన్ని దిక్కులు, భూమి, ఆకాశం చిత్రమైన రంగురంగులుగా ప్రకాశిస్తూ ఉంటాయి. ఆ కొండలో పెద్దపెద్ద చెట్టు, తీగలు, పొదలు, మోగుతూ పారే సెలయేరులు, అలవాటుగా తిరుగాడే దేవతల విమానాలు కనిపిస్తాయి. ఆ కొండ చరియలలో కిన్నరులు విహారాలు చేస్తుంటారు.

ఆ త్రికూట పర్వతం నిండా మాదిఫలం, లవంగం, పుల్ల మాదీఫలం, మామిడి, మొగలి, జీడి, అంబాళం, తెల్ల తెగడ, పనస, రేగు, పొగడ, పుబ్బ, మర్రి, కొండమల్లె, మొల్ల, ఎర్ర గోరంట; తుమ్మ, కోవిదారం, ఖర్జూరం, కొబ్బెర, వావిలి, చందనం, వేము, మందారం, నేరేడు, నిమ్మ, పూలగురివెంద, ఇప్ప, తాడి, తక్కోలం, కానుగ, గిరకతాడి, రసాలం, మద్ది, మోరటి, మారేడు, ఉసిరిక, పోక, కడిమి, గన్నేరు, అరటి, వెలగ, ఉమ్మెత్త, కలజువ్వి, దిరిసెన, ఇరుగుడు, అశోకం, మోదుగు, పొన్న సురపొన్న, సంపెంగ, తామెర, మరువం, మంచిమల్లె మొదలైనవి ఉండేవి. నిరంతరం వసంత ఋతువు అక్కడ కొలువు తీరినట్టుగా కొమ్మలు రెమ్మలు చిగుళ్ళతో, మొలకలతో, పూలతో, పండ్లతో అద్భుతంగా కనిపిస్తుండేది. ఆ తోటలలో ముత్యాల చిప్పలతో కూడిన ఇసుకతిన్నెలు కుప్పలుతెప్పలుగా ఉండేవి.

ఆ చెట్ల కొమ్మలమీద చిలుకలు, కోయిలలు గుమిగూడి వాడియైన తమ ముక్కుపుటాలతో పండిన పండ్లను పొడుస్తుండగా, ఆ పండ్ల రంధ్రాలనుండి నిరంతరం ధారగా పళ్ళరసం కాలువలుగా పారుతూ కనిపించేది.

ఆ కొలనులోని నీళ్ళు బంగారు వన్నెతో మిరుమిట్లు గొలుపుతూ ఉండేవి. ఆ నీటిలో బంగారు కాంతి గల తెల్లకలువలు, ఎర్రకలువలు, తామరలు విస్తరించి ఉండేవి. సువాసనను గుబాళిస్తున్న ఆ పూలలోని మకరందాన్ని తనివితీరా నిరంతరం తాగుతూ మదించిన గండు తుమ్మెదలు తమ ప్రియురాండ్రతో విహరిస్తూ కనిపించేవి. వాటి పక్కనే శకుంత పక్షులు, కలహంసలు, కారండవ పక్షులు, నీటికోళ్ళు, చక్రవాకాలు, కొంగలు, కొక్కెరలు, చీకుకొక్కెరలు అందంగా తిరుగాడుతూ కనిపించేవి. ఆ పక్షులు చేసే ధ్వనులు భూమికి ఆకాశానికి మధ్యగల ప్రాంతాన్ని చెవుడు పడేలా చేసేది. ఆ కొండలో చంద్రకాంతమణులు, మరకతాలు, వజ్రాలు, వైడూర్యాలు, నీలాలు, గోమేధికాలు, పుష్యరాగాలు మిక్కిలి మనోహరంగా నిండి ఉండేవి. బంగారు, వెండి శిఖరాలున్న ఆ కొండ చరియల్లో విద్యాధరులు, దేవతలు, సిద్ధులు, చారణులు, గరుడులు, గంధర్వులు, కిన్నరులు, కింపురుషులు తమతమ ప్రియురాండ్లతో కలిసి జంటలు జంటలుగా క్రీడిస్తూ ఉండేవారు. వారు సరస సంభాషణలు చేస్తూ చాలా అందంగా పాడుతూ ఉండగా ఆ ప్రాంతమంతా మంగళప్రదంగా ప్రకాశిస్తూ ఉండేది. ఆ కొండలో మదపుటేనుగులు, గురుపోతులు, గండభేరుండాలు, ఖడ్గమృగాలు, సింహాలు, శరభాలు, పులులు, కుందేళ్ళు, చమరీమృగాలు, ముండ్లపందులు, కోతులు, పెద్దపెద్ద పాములు, అడవి పిల్లులు తిరుగుతుండేవి. ఆ పోరాటాల సంరంభాన్ని చూసి యమభటులు కూడా భయపడి 'శరణు' వేడుతూ ఉండేవారు. 
(ఈ పర్వతంలోని వృక్షాలు, జంతువులు, పక్షులు, పుష్ప ఫలాల వర్ణన దాదాపు అంతా మూలభాగవతంలో ఉన్నదే. అదనంగా ఒక అంశం మూలంలో ఉంది.

తస్య ద్రోణ్యాం భగవతో వరుణస్య మహాత్మనః
ఉద్యానమృతుమన్నామ ఆక్రీడం సురయోషితామ్‌ ॥


ఆ కొండ లోయలో వరుణదేవుని ఉద్యానవనముంది. ఋతుమత్‌ - అని దానిపేరు. సర్వ ఋతువుల లక్షణాలు నిరంతరంగా కనిపించే దివ్య ఉద్యానవనమది. అందులో దేవతాస్త్రీలు విహరిస్తారని మూలం వివరిస్తోంది.

పురాణాలలోని ప్రకృతి వర్ణన ఈనాటి మనకు చాలా వివరాల్ని అందిస్తుంది. చాలా చెట్లపేర్లు, పూలపేర్తు, జంతుపక్షుల పేర్లు ఈనాడు మనకు పరిచయంలేని కారణంగా ఒకప్పటి ప్రకృతి వైవిధ్యం (బయో - డైవర్సిటి) ఎంత విస్తారమైనదో ఈ వర్ణనద్వారా మనం అర్ధం చేసుకోవచ్చు.)

ఆ త్రికూట పర్వత సమీపంలోని అడవిలో చెంచెతలు, చెంచులు, తిరుగుతూ ఉండేవారు. క్రూరమృగాలయిన అడవి దున్నలు, ఎలుగుబంట్లు, పాములు, ఖడ్గమృగాలు, గురుపోతులు, గండ్రంగులు, చమరీమృగాలు, పావురాలు, అడవికోతులు, శరభమృగాలు, అడవిపందులు మొదలైనవి కొట్లాడుతుండగా ఎక్కడ చూసినా కాకులు, గుడ్లగూబలు సంచరిస్తూ ఉండేవి. అలాంటిది ఆ అడవి.

(మూలంలో ఉద్యానవనంలాగా కనిపించే 'వరుణ' వనాన్ని తరువాతి కథతో అన్వయం బాగా కుదరడానికి ఈ అడవిని పోతనగారు స్వకపోలవర్ణనగా పెంచారు.)

ఆ అడవిలో కొన్ని ఏనుగులు మదించిన తమ దేహాలతో అన్య మృగాలకు కన్నెత్తి చూడ శక్యంగాని విధంగా ఉంటాయి. భయంకరమైన తమ పరాక్రమంలో దిగజాలను కూడా మించిపోతాయి. అలాంటి ఆ ఏనుగుల గుంపు ఒకటి అలా సరదాగా చెర్లాటలు ఆడుకుంటూ తిరగాలని బయలుదేరి, తిరిగి తిరిగి, ఆడి ఆడి, అలసిపోయి దప్పిక చేత నీటిమడుగుల్లో దిగుదామన్న కోరికతో నీటిగాలి వచ్చేవైపు నడక సాగించాయి.

ఆ అడవి ఏనుగులు ఎంత నల్లగా ఉన్నాయంటే పగటిపూటంతా సూర్యుని వెలుతురుకు భయపడి కొండగుహల్లో దాక్కొని ఉండి సాయంకాలం కాగానే సూర్యుని వెలుతురు శక్తి సన్నగిల్లిన సమయం చూసుకొని చీకట్లు గుహల్లో నుండి బయటికి వచ్చాయా అన్నట్టుగా ఉంది.

(ఒకవైపు అడవి ఏనుగులు నల్లటి కాంతిని వివరిస్తూ ఈ పద్యం, మనోహరమైన ఉపమానంతో సూర్యుడు 'వృద్దుడు' కావటమనే పలుకుబడిని పరిచయం చేస్తోంది. ఉదయాన సూర్యుడు బాలుడు, మధ్యాహ్నసమయంలో యువకుడు, సాయంకాలాన వృద్దుడు. శత్రువు బలహీనపడటం చూచి వాడి శత్రువు విజృంభిస్తాడు. అది ఈ పద్యంలోని లోకనీతి. కవితాచమత్కృతి.)

పెద్ద ఏనుగులే కావు - గున్నఏనుగులు కూడా పరాక్రమంలో పెద్ద వాటికి ఏమీ తీసిపోవు. వాటి బలసంపత్తి అలాంటిది. కొండలను చూసి కూడా పక్కకు పోవు. ఢీకొంటాయి. సింహాలను చూచి కూడా వెనక్కి తిరగవు. ఎదిరిస్తాయి. పిడుగులు పడినా భయపడవు. లెక్క చేయకుండా ముందుకు సాగిపోతాయి.

ఆ అడవి ఏనుగులు అతిభయంకరంగా విహరించడం ప్రారంభించగానే వాటి ధాటికి భయపడి పులులన్నీ పొదరిండ్లలోకి దూర్తాయి. ఎలుగుబంట్లు గుహల్లోకి చొరబడతాయి. అడవి పందులు గోతుల్లోకి చేరిపోతాయి. జింకలు దిక్కుల కొసలకు పరుగెత్తుతాయి. అడవి దున్నలు నీటిమడుగుల్లో దాక్కుంటాయి. కోతులు కొండల పైని బండల మీదికి ఎగబాకుతాయి. పాములు పుట్టల్లోకి ఒదిగిపోతాయి. నెమళ్ళు ఆకాశంలోకి ఎగిరిపోతాయి. చమరీమృగాలు తమ కుచ్చుతోకలతో ఆ ఏనుగుల అలసట పోయేలా విసరుతాయి.

ఆ మదగజాల నుండి జాలువారుతున్న చెమట సుగంధపరిమళ భరితమైనది. వాటిని త్రాగటం, తుమ్మెదలకు చాలా ఇష్టమైన పని. పడుచు తుమ్మెదల గుంపులు ఆ మదజలాన్ని తనివితీరా మిక్కిలి ఆసక్తితో కడుపుల నిండా తాగి సంతోషంతో తిరుగుతూ జుంజుమ్మని పాటలు పాడుతున్నాయి.

ఒక గండు తుమ్మెద తన ప్రియురాలైన ఆడ తుమ్మెదకు మాటిమాటికి గజ మదజల సుగంధాన్ని ఎందుకు ఇవ్వాలని ఆలోచించి తనను సమీపించిన ఆడు తుమ్మెదకు నిండు మగతనాన్నంతా ఆ మదజలగంధం అందించింది.

(ఆడు తుమ్మెదలు మగ తుమ్మెదల వద్దనున్న గజమదజలంలోని సువాసన చేత ఆకర్షింపబడుతున్నాయని ఇందులోని విశేషం. జంతు పరిశోధనల్లో కూడా ఈ అంశంమీద ప్రస్తావన ఉంది. మహాకవులు తమ దివ్య దర్శనంతో ఇలాంటి శాస్త్రీయరహస్యాన్ని తమ కావ్యాల్లో దాచిపెట్టారు.

నిండుబోటుంతనము - వంటివి అందమైనప పద బంధాలు. 'మగంటిమి' - అన్న మాటకు వివరణ ఇది. పోటు మగడు - వంటి మాటల్లో ఈ అర్ధాన్ని చూడవచ్చు.)

మదగజాల నుండి స్రవించే జలధారల సుగంధాలను ఎంతో ఇష్టంగా ఆస్వాదిస్తూ ఆడ తుమ్మెదల గుంపులు ఆ మత్తులో కదలిక లేకుండా స్తబ్దమై పోయాయి. కాని ఝంకారాన్ని వదలకుండా తిరగసాగాయి.

ఆడుతుమ్మెదలు ఏనుగుల మదజలం ప్రియమైనదని భావించి దానిపై గుంపుగాపోయి ముసరగా, మగ తుమ్మెదలు మదజలంపై అపేక్ష వీడి ఆడుతుమ్మెదలతో ఎల్ల ఉల్లాసాలు పొందాయి.

ఆ సమయంలో 

ఇక గున్న ఏనుగులు కూడా విజృంభించసాగాయి. నీటిగుంటలను వాసన చూస్తూ తొక్కుతూ, పండ్లతో కూడిన చెట్లను రాచుకుంటూ, చిగుళ్ళను గబగబాతింటూ, పులుల్ని ఎనుబోతుల్ని జింకల్ని అటూఇటూ పోనీక నిలువరిస్తూ, నీటిమడుగుల్లోకి చొరబడి నీటిని కలగుండు పెడుతూ; కొండలపైన గుండ్రంగా తిరుగుతూ వినోదిస్తూ చెర్లాడుతున్నాయి.

ఆ మదగజాలు తమ తొండాలతో, మదజలం నిండిన తమ చెక్కిళ్ళతో, కుంభస్థలాలతో కొండల్ని ఢీ కొట్టేవి. ఆ ఘట్టనంతో కొండలు తలకిందులై పడేవి. దిక్కులు ఆ శబ్దానికి బద్దలైపోయేవి. దీన్ని చూసి అన్నిలోకాలూ గడగడలాడేవి.

అలా ఎక్కడ పడితే అక్కడ తిరుగాడుతున్న ఏనుగుల సమూహంలో ఒక్క గజేంద్రుడు కొన్ని ఆడ ఏనుగులు తన వెంట సేవిస్తూ వస్తుండగా దారితప్పి వెనుకబడి ఒంటరివాడయ్యాడు.

ఆ గజరాజు తనకు అన్నివైపులా(ముందు, వెనుక, ఇరుపక్కలా) దప్పికతో అలిసి పోయి వస్తున్న ఏనుగుల గుంపును పట్టించుకోకుండా, భగవంతుని సంకల్పంచేత తెలివికోల్పోయి, ఆ గుంపునుండి వేరుపడి, దారి తప్పిపోయాడు. తాను, తన ఆడ ఏనుగుల గుంపుతో మరోదారిలో ముందుకు సాగిపోయాడు.

బల్లిదుడైన ఆ గజరాజు తన ప్రియురాండ్రకు నీటిగుంటల పక్కన ఉంటే లేత పచ్చికను మచ్చికతో అందిస్తోంది. చిగుళ్ళ గుత్తులను, పూలకొమ్మలను కోసి అందరికీ పంచిపెడుతోంది. మదజలంతో తడిసిన విసనకర్రల వంటి తన చెవులతో వాటి చెమటల్ని పోగొడుతోంది. తన దంతాలతో వాటి మెడలను గోకుచూ భార్యల వెనుకవైపు చేరి మూచూచి, ఋతుసమయాన్ని గుర్తిస్తూ, క్రీడిస్తూ, తొండాన్ని ఆకాశంలోకి చాస్తూ, విశ్రమిస్తూ విలాసంగా ఆడుకొంటున్నది.

ఆ గజరాజు యొక్క కుంభస్థలాల నిండుదనాన్ని చూసి ఓడిపోయిన స్త్రీల స్తనాలు పైటకొంగుచాటున చేరాయి. అతని నడకలు ఠీవికి సరిపోక స్త్రీల నడకలు అందెలను ఆశ్రయించాయి. అతని తొండం యొక్క శోభని చూసి స్త్రీల చిన్న తొడలు ఒడ్డాణాల డాబుసరిని తోడు తెచ్చుకున్నాయి. ఆ గజరాజు దంతాల తెల్లదనానికి సరిపోవటం లేదని స్త్రీల దంతాల ముఖమనే చంద్రుని కాంతిని ముసుగుగా వేసుకున్నాయి. అతడి మనోహరమైన శరీరాన్ని మనసారా చూడగోరి అంజన, అభ్రమువు, కపిల మొదలైన దిగ్గజాల భార్యలందరూ తనవెంట మనసుపడిరాగా అందాల సొగసుగాడు ప్రకాశించాడు.

(దిగ్గజాలు ఎనిమిది - 1) ఐరావతం 2) పుండరీకం 3) వామనం 4) కుముదం 5) అంజనం 6)పుష్పదంతం 7)సార్వభౌమం 8) సుప్రతీకం. వారి భార్యల పేర్లు 1) అభ్రమువు 2) కపిల ౩) పింగళ 4) అనుపమ 5) తామ్రపర్ణి 6) శుభదంతి 7) అంగన 8) అంజనావతి.)

ఇంకా ఆ గజరాజు ఎన్నో అడవులలో ఇలా విహరించి విహరించి ఆ మత్తులో పడి దారితప్పి దప్పికతో అతని మనస్సు స్వాధీనం తప్పి పోగా ఆడ ఏనుగులతో పాటు తాను కూడా ఎటుబడితే అటు నీటి ఆదరువు కోసం చూస్తూ ప్రయాణం సాగించాడు.

గజరాజు ఆ సమీపంలోనే ఒక నీటిమడుగు చూశాడు. అందులో అప్పుడే విచ్చుకున్న తామరలు - కలువలు ఉన్నాయి. వాటిలో తుమ్మెదలు ఆడుతున్నాయి. తాబేళ్ళు, చేపలు, మొసళ్ళు భయంకరంగా నీటిని ఎగజిమ్ముతూ తిరుగుతున్నాయి. హంసలు, కొంగలు, చక్రవాకాలు అందులో బాగా తిరుగుతున్నాయి. ఆ మడుగు గట్టున మర్రి, తాడి, మామిడి, మద్ది చెట్లతోపాటు పూలతీగలు, పొదరిండ్లు ఉన్నాయి. అలాంటి మనోహరమైన సరస్సును చూశాడు.

(సాధారణంగా కమలాలు వికసించే సమయంలో కలువలు ముడుచుకొంటాయి. అందుకే కమలాలకు మిత్రునిగా సూర్యుని, కలువల మిత్రుడుగా చంద్రుని చెబుతారు.

ఇక్కడ పోతనగారు అప్పుడు విచ్చుకొంటున్న కమలాలు, కలువలు - రెండూ ఆ సరస్సులో ఉన్నాయని చెబుతున్నారు. అది క్షీరసాగరంలోని త్రికూటపర్వత సానువుల్లోని అడవిలో ఒక మడుగు. కాబట్టి ఈ విశేషవర్ణన ఆ దివ్యభూమికి సంబంధించినదే.

గజ లక్షణం ఏమిటంటే చెట్లు, పూల తీగలు, పొదరిండ్లు - వీటిని చూడగానే రెచ్చిపోవటం. అందుకే దప్పికతోపాటు తమ విహారానికి అనుకూలంగా ఉన్న ఆ మడుగును గజరాజు చూసి అదే తమకు తగిన చోటని భావించాడు. అందుకే ఈ వర్ణన.)

ఇతరులెవరూ కనిపించడం లేదు. మనుష్యజంతుసంచారమేదీ లేని చోటని అర్థం.

మదించిన ఆ ఏనుగుల శరీరాలకు పద్మ గంధంతో కూడిన చల్లని పిల్లగాలులు హాయిని కూర్చాయి. తామర తూండ్లు తింటూ మధురశబ్దాలు చేసే ఆ మడుగులోని రాయంచల గొంతుకలు వాటి చెవులకు విందు గూర్చాయి. విరిసిన తామరల, కలువల వాసనలు ముక్కులకు తృప్తిని కలిగించాయి. నిర్మలమైన అలలతోడి నీటితుంపరలు గుహలవంటి ఆ ఏనుగుల నోళ్ళలో పడి దప్పికను తీరుస్తున్నాయి. ముల్లోకాలలోను ఇలాంటి సరస్సు లేదన్నట్టుగా శోభిస్తున్న ఆ సరస్సు వాటి నేత్రాలకు విందు సమకూరుస్తూంది. ఆ మడుగును సమీపించగానే ఏనుగులన్నీ తమ ఇంద్రియ వ్యాపారాలను మరచిపోయాయి. మడుగులోకి ఒక్కసారిగా దిగబడ్డాయి.

ఆ ఏనుగుల గుంపు తొండాలలో నీళ్ళు బాగా నింపుకొని, సరదాగా చెక్కిళ్ళ పైన చల్లుకొని, గళగళమని శబ్దాలు మెండుగా జేస్తూ, తమ పెద్ద కడుపులు నిండేలా బాగా నీళ్ళు తాగాయి.

ఆ సమయంలో.

ఇంకా ఆ గజరాజు తన తొండంలోని నీళ్ళు బాగా పీల్చినాడు. మునిగాళ్ళపైన నిక్కి నుంచుని వేగంగా కదిలించి నీటిని పైకి ఆకాశంలోకి చిమ్మినాడు. ఆ మోతతో నీటిలో నుండి పైకి ఎగిరిన నల్ల మొసళ్ళు, మొసళ్ళు, చేపలు ఆకాశంలో తిరిగేటువంటి మీన కర్మాటకములను పట్టుకోబోతున్నాయి. ఈ దృశ్యాన్ని చూచి దేవతలు ఆశ్చర్య చకితులయ్యారు.

ఇంకా ఆ గజరాజు అడ్డు లేకుండా విహరించసాగాడు.

ఆ పద్మాల సరస్సులో అడ్డు లేకుండా విహరిస్తున్న గజరాజు పైన ఆడ ఏనుగులు తమ తొండాలతో నీళ్ళు చల్లాయి. ఆ నీటి బిందువులతో తడిసిన అతడు సెలయేళ్ళతో కూడిన నీలాద్రిలాగా ప్రకాశించాడు.

ఆడ ఏనుగులు అతని శరీరం నిండా పద్మాలు అలంకరించాయి. వాటితో గజరాజు వేయికన్నులున్న దేవేంద్రుడిలాగా విలసిల్లినాడు.

గున్న ఏనుగులు ఇంకా అతనిపై కలువ పుప్పొడి చల్లగా అతను బంగారు కొండలాగా వెలిగిపోయాడు.

మళ్ళీ ఆ ఆడ ఏనుగులు కలువతూండ్లతో తమ నాథుని అలంకరించారు. దానితో సర్పాలను ధరించిన శివుడిలాగా గజరాజు కొత్త శోభను సంతరించుకొన్నాడు. అతనిపై ముత్యాలచిప్పలను భార్యలు విసరగా వాటితో మెరుపు తీగలలోని మేఘాలను మించి పోయి గజేంద్రుడు కొత్త కాంతులు చిమ్మాడు (నల్లటి శరీరం ఏనుగుది - కనుక మేఘం; ముత్యాలచిప్పలు మెరుపు తీగలు)

గజరాజు చేసిన ఆ విశేషమైన సంచారాల వల్ల ఆ సరస్సు అందచందాలు మాసిపోయి ఒక కొత్త సొగసును సంతరించుకొంది. గడుసువాడైన విటునితో రతిక్రీడలో కౌగిళ్ళలో పడి నలిగిపోయి కంపిస్తున్న కుసుమ సుకుమారిలాగా ఒప్పింది. మదించిన తుమ్మెదలు చెదిరిన ముంగురుల్లాగా; శుష్కించి పోయిన పద్మాలు ముఖంలాగాా తమ స్థానాల నుండి జారిపోయిన చక్రవాకాలు స్తనాల్లాగా  నలిగిన ఇసుక తిన్నెలు అలసి సొలసిన పిఱుదుల్లాగా నీరసపడిపోయి కనిపించాయి.

ఇలాగ గజరాజు క్రీడిస్తున సమయంలో

మొసలి గజేంద్రుడుని పళ్ళతో కరిచి పట్టుట

No comments:

Post a Comment

Halahala, Kalakuṭa (most deadly and venomous poison in the universe) Emerged - హాలాహలం జనించుట

హాలాహలం జనించుట ఆ తరువాత అంతలోనే, అల్లకల్లోలమైన ఆ సముద్రంలోనుండి హాలాహలమనే విషం కోలాహలమైన అగ్ని జ్వాలలతో బయటపడింది. దాన్ని చూసి భయపడి సురాస...