సగర చక్రవర్తి కథాప్రారంభము
బాహుకుడు తన శత్రువులు తననోడించి రాజ్యం ఆక్రమించగా తన స్త్రీలతో అడవికి వెళ్ళి వృద్దాప్యం కారణంగా మరణించాడు. అతనిభార్య అతణ్జి అనుసరించే ప్రయత్నంచేసింది. కాని ఆమె గర్భవతి అనే విషయం తెలుసుకొన్న ఔర్వముని ఆ ప్రయత్నానికి అడ్డుపడ్డాడు. కొంతకాలానికి ఆమెకు గర్భం నిండగా ఆమెసవతులు ఈర్ష్యతో ఆమె తినే అన్నంలో విషం కలిపి పెట్టారు. కాని దానిచే గర్భవిచ్చిన్నం కాకుండా ఆ విషంతోపాటు మహానుభావుడైన సగరుడు జన్మించి, గొప్ప యశఃప్రకాశంతో చక్రవర్తి అయ్యాడు.
సగరుడు తండ్రిపగకోసం యుద్దాలుచేసి హైహయ బర్బరాదులను చెండాడాడు. తాళజంఘాదుల్ని చంపాడు. తన శత్రువుల తలలు గొరిగించాడు. వస్త్రహీనులుగా భయంకర రూపాలతో ఉండేటట్లు చేశాడు. సగరుడనే పేరుగల ఆ రాజు సామాన్యుడా? (సామాన్యుడు కాడు).
సూర్యచంద్రుల కాంతులు ప్రసరించునంతటి భూమిని సగరుడు తన భుజబలంతో శత్రురాజులను అణచి పరిపాలించాడు. మేరుపర్వత ధీరుడని, పరాక్రమవంతుడని, శత్రునగరనాశకుడని ఆ సగరుణ్ణి ప్రశంసింపవచ్చు.
ఔర్వముని చెప్పడంవల్ల వేదాత్మకుడు, అమృతుడు, అనంతుడు ఈశుడు అయిన హరినిగూర్చి ఆ సగరుడు అశ్వమేధాలను చేశాడు. ఒక యజ్ఞంలో అశ్వాన్ని వదలగా ఇంద్రుడు దాన్ని తీసుకొనిపోయి నాగలోకంలో కపిలమునికి సమీపంలో కట్టివెళ్ళాడు. అక్కడ గుర్రం కనబడక రాజు తనకుమారులను అన్ని దిక్కులకు వెతకడానికి పంపాడు. వారు భూమిమీది సప్తద్వీపాల్లో వెదకి అశ్వం కనపడకపోవడంతో అంతటితో తిరిగిరాక ప్రాభవంతో భుజబలంతో భూమినంతటిని పొడిచి పొడిచి త్రవ్వారు.
ఈ విధంగా సుమతికొడుకులు నేలను త్రవ్వి, పాతాళలోకంలో ఈశాన్యదిక్కున కపిలమహర్షికి సమీపంలో ఉన్న గుర్రాన్నిచూచి
(సగరుని భార్యల్లో సుమతి ఒకతె.)
“అయ్యారే! తెలుసుకున్నాం, ఆలస్యం దేనికి? వీడే గుర్రాన్ని దొంగిలించాడు. ఈ పాపిని పట్టి చంపండి. పెద్దసాధువైన మునివలె కళ్లుతెరవకుండా, మురికినోరు కదలించకుండా పంతంపట్టాడు” అంటూ ఆ అరవైవేలమంది తమ ఆయుధాలను ఝళిపిస్తూ దగ్గరకు వస్తుండగా
కపిలమహర్షి కళ్లుతెరవగా సగరపుత్రులు తమ శరీరాల్లో అగ్ని పుట్టి, ధైర్యాల్ని కోల్పోయారు. అహంకరించి మూఢులై రాజకుమారులందరూ ఆ నిముషంలోనే బూడిదయ్యారు. సాధువుల్ని, మునులను కష్టపెట్టె గర్విష్ఠులు జీవించగలరా?
కొంతమంది కపిల మహర్షి కోపాగ్నిచేత సగరుని కొడుకులు చచ్చారంటారు. కాని ఆ మహర్షి పరమశాంతుడు. ఆనందమయమూంర్తి ఆయన కోపిస్తాడా? ధూళి భూమిమీద పుడుతుంది గాని ఆకాశంలో కాదుగదా! సగరునికొడుకులు తాము చేసుకొన్న దోషంచేత శరీరాల్లో అగ్నిపుట్టి నాశనమయ్యారు కాని, ఏ సాంఖ్యశాస్త్రంచేత జ్ఞానులు సంసారసాగరాన్ని మృత్యుభయాన్ని పోగొట్టుకొంటారో, ఆ శాస్త్రాన్ని రూపకల్పన చేసిన భగవన్మూర్తి సమస్తబోధకుడు ఆయిన, ఆయనకు మిత్రులని, శత్రువులని ఎవ్వరుంటారు? (ఎవ్వరూ ఉండరు).
సగరునికి కేశినియందు అసమంజసుడనే కొడుకు కలిగాడు. సమంజసమైన గుణాలులేక పూర్వజన్మలో ముని శ్రేష్ఠుడై ఉండికూడ సహవాసదోషంచేత పతితుడై సగరునికి పుట్టాడు. కాని పూర్వజన్మ స్మరణచేత వాడు ప్రజలకు, తనవారికి కూడా కష్టం కలిగించే పనులు చేస్తూ తిరుగుతూ ఉండేవాడు.
ఆ అసమంజసుడు క్రమంగా అయోధ్యానగర వీథుల్లో ఆడుకునే చిన్నపిల్లలను సరయూనదిలో పడవేశాడు. నగర ప్రజలు, తండ్రి అయిన సగరుడు అతనిని దూషించారు. వాడు తరువాత గొప్పజ్ఞానం కలిగి తనయోగశక్తితో ఆ పిల్లలను కొద్దిరొజుల తర్వాత నగరానికి తెచ్చాడు. అది చూచి అందరూ ఆశ్చర్యపోయారు.
ఆ అసమంజసునికొడుకు అంశుమంతుడనేవాడు నీతిమంతుడై తాత దగ్గర పనులు నిర్వర్తించేవాడు. అప్పుడు సగరుడు మనుమనితో యాగాశ్వాన్ని వెదికి తీసుకరమ్మని పంపాడు. వాడు తన తండ్రులు వెళ్ళిన మార్గంలోనే వెళ్ళి, వారు తవ్విన పెద్దగొయ్యిలో ప్రవేశించి, అక్కడ బూడిదకుప్పల పక్కన ఉన్న గుర్రాన్నిచూచి, దాని పక్కన ఉన్న కపిలుడనే పేరుగల శ్రీహరికి నమస్కరించి ఇట్లా స్తోత్రం చేశాడు.
బుద్ధిని స్వాధీన పరచుకొని సమాధిస్థితిలో ఉండి కూడా తాననుకొనే శరీరానికి వేరుగా ప్రకాశించే నిన్ను బ్రహ్మకూడా చూడలేడు. ఏ నాటికైనా తెలుసుకోలేడు. ఆ బ్రహ్మయొక్క మనస్సు, అవయవాలు, బుద్ధిలో పుట్టె పెద్దజీవుల్లో కూడ అల్పులమైన మాకు తెలుసుకోవడం సాధ్యమా? తమలోనే నీవుండగా నిన్ను తెలుసుకోలేరు. బాహ్యమైన గుణాలనుమాత్రమే చూస్తారు. ఒక్కొక్కప్పుడు వాటిని కూడ చూడలేక తమస్సు పాలవుతారు. శరీరధారులు గుడ్డీవారై నీ మాయకు లోబడి ఆత్మజ్ఞానాన్ని పొందలేరు. బాహ్యమైన సంబంధాలకు విలువనిస్తారు.
అని విన్నపం చేస్తూ గుర్రాన్ని విడిచిపెట్టమని అడగక, తండ్రులు నాశనమైన విషయాన్ని ప్రస్తావించక, నమస్కరించి నిలబడ్డ అంశుమంతునితో అపారమైన కరుణతో కపిలముని ఇట్లా అన్నాడు.
బుద్ధిమంతుడైన బాలకా! ఈ గుర్రాన్ని మీ తాత దగ్గరకు తీసుకపో. అవివేకులైన మీ తండ్రులు బూడిద అయినారు. ఈ బూడిదకుప్పమీద గంగ ప్రవహిస్తే వారికి మేలు జరుగుతుంది.
(గంగాజలాన్ని గూర్చి అంశుమంతుడు ప్రస్తావించలేదు. కపిలభగవానుడే సెలవిచ్చాడు. అసలు ఈ కథ పరమార్ధమే అది. ఇంద్రుడు యాగాశ్వాన్ని దొంగలించడం, కపిలమహర్షి దగ్గర కట్టివేయడం ఎందుకు? ఇది కూడా ఆ పరమార్ధమే. దేవనది భూలోకానికి రావడం ఆ పరమార్థమే.)
అని ఆ ముని చెప్పగా ఆయనకు నమస్కరించి అంశుమంతుడు గుర్రాన్ని తెచ్చి సగరునికిచ్చాడు. అతడు ఆ గుర్రంతో యాగాన్ని పూర్తిచేసి, మనుమనికి రాజ్యమిచ్చి బంధాలనుండి విముక్తుడై ఔర్వుడు చెప్పిన దారిలో మోక్షానికి వెళ్ళాడు.
తండ్రులు బూడిద అయిన ప్రదేశానికి దేవనదిని తెస్తానని అరణ్యానికి వెళ్ళి తపస్సు చేయలేక, మనోదుఃఖంతో అంశుమంతుడు మరణించాడు.
అతనికొడుకు దిలీపుడు భూమి మీదికి గంగను తేవడానికి తపస్సు చేశాడు కాని తేలేక గతించాడు.
దిలీపునిపుత్రుడైన భగీరథుడు గొప్పతపస్సుచేసి, అమృతమయకటాక్షాలు కలది, గొప్పఅలలతో కూడింది, ముఖపద్మంపై ఆసక్తిగల తుమ్మెదలు కలది. శివజటాజూటం రంగస్థలంగా కలది అయిన గంగను దర్శించాడు.
గంగను చూచి భగీరథుడు నమస్కరించగా గంగ దయతో వరం కోరుకొమ్మనింది. అందుకు ఆ రాజకుమారుడు ఇట్లన్నాడు.
తల్లీ! మా వారిబూడిద రాసులను నీ నీటిలో కలుపుకో. నీ నీటి స్పర్శచేత మావాళ్లకు స్వర్గం సిద్ధిస్తుంది. ఇది నిజం.
వికసించిన హృదయం కలదానివి, పుణ్యాత్మురాలివి, అలల సంపదచే రెల్లు, మల్లెపూలల శోభను జయించిన దానివి. ఉత్తముల పాలిట శ్రేష్ఠమైన కల్పవృక్షానివి అయిన ఓ గంగామాతా! నిన్ను మనసులో నిండుగా భజిస్తాను.
(ఫుల్లాంతరంగ అనడంవల్ల ఆమె విశాలహృదయం, 'సుధీకల్పలతామతల్లి అనడంవల్ల మంచివారి పాలిట కల్పవృక్షానివనే సూచనతో తను కోరిన వరమీయవలసిందని భగీరథుడర్థించినట్లయ్యింది.)
అని స్తుతిస్తున్న భగీరథునితో లోకపావని గంగామాత ఇలా పలికింది.
ఆకాశమార్గం నుండి వచ్చి భూమిమీద పడే నా వేగాన్ని నిలుప కలిగిన సామర్థ్యం ఎవరికుంది? ఆ వేగంతో నేను భూమిని చీల్చుకొని పాతాళానికి వెళతాను. నేను వస్తే మానవులు నాయందు స్నానంచేసి కడిగేసుకొన్నవారు ఆ పాపాలను నాకు అంటగడతారు. ఆ పాపాలను నేనెక్కడ వదిలించుకోను.
ఆ కారణంచేత ఆలోచిస్తున్నానన్న లోకమాతతో రాజశ్రేష్ఠుడైన భగీరథు డిట్లన్నాడు.
ఓ దివ్యగంగా! పరతత్త్వం తెలిసినవారు, ప్రశాంత మనస్కులు, తపోనిష్ఠ కలవారు, గౌరవార్హులు, మహనీయులు అయిన మానవులు వచ్చి, నీ నీటిలో మునకలు వేసే సమయంలో విశ్వానికి ప్రభువు, సమస్తపాపహరుడు అయిన ఆ శ్రీహరి వారిహృదయాల్లో నిండి ఉంటాడు కదా! వారిపాపాలు నిన్నాలా అంటుకుంటాయి? (అంటుకోవు).
ఓ తల్లీ! తనలో అనేకమైన లోకాలుండడం, తాను ఆ లోకాల్లో ఉండడం దారాల్లో వస్త్రముండే రీతిగా విశ్వమయుడైన పరమేశ్వరుడు కాక నీ నీటి వేగాన్ని అడ్డుకునే నేర్పు ఎవరికుంది? నిన్ను భరించడానికి శివుణ్ణి ప్రార్థిస్తాను.
అని తెలిపి గంగాదేవి దగ్గర సెలవు తీసుకొని భగీరథుడు వెంటనే శివుణ్ణి గురించి తపస్సు చేశాడు.
అపుడు భక్తవత్సలుడైన పరమశివుడు ఆ భగీరథుని ప్రయత్నానికి మెచ్చుకొని, విష్ణుపాదాలను స్పృశించడంవల్ల పవిత్రమైన జలంతో ఆకాశంనుండి భూమి మీదికి అవతరించే గంగను తన శిరస్సుపై ధరించాడు.
(లోకంలో భగీరథప్రయత్నం అనేమాట వ్యాప్తివెనుక ఉన్న ఆ భగీరథుని శ్రమను గ్రహించాలి.)
శ్రీ పరమేశ్వర జటానిర్గత గంగా ప్రవాహ మహిమాభివర్ణనము
Subscribe to:
Post Comments (Atom)
History of Emperor Sagara - సగర చక్రవర్తి కథాప్రారంభము
సగర చక్రవర్తి కథాప్రారంభము బాహుకుడు తన శత్రువులు తననోడించి రాజ్యం ఆక్రమించగా తన స్త్రీలతో అడవికి వెళ్ళి వృద్దాప్యం కారణంగా మరణించాడు. అతనిభా...
-
సూర్య ద్వాదశ నామాలు ధ్యేయః సదా సవితృమండలమధ్యవర్తీ నారాయణః సరసిజాసన సన్నివిష్టః । కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటీ హారీ హిరణ్మయవపుః ధృతశంఖచక్రః ...
-
ఆదిత్యహృదయం తతో యుద్ధపరిశ్రాంతం సమరే చింతయా స్థితమ్ | రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితమ్ || 01 || దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతో ...
-
నిత్య పారాయణ శ్లోకాలు స్తోత్రాలు నవ గ్రహ స్తోత్రం సుబ్రహ్మణ్యాష్టకం ఆదిత్యహృదయం కనకధారా స్త్రొత్రమ్ దుర్గాసప్తశ్లోకీ శ్రీ సరస్వతీ కవచం తోటకా...
No comments:
Post a Comment