ఈ విధంగా ఉపనయనం పూర్తి అయిన తర్వాత మాయాబ్రహ్మచారి ఇతరదేశాలనుండి వచ్చిన కొందరు బ్రాహ్మణులను చూచి ఇలా అడిగినాడు.
దానాలు తీసుకోవటానికి బ్రాహ్మణులు దాతలదగ్గరకు పోతున్నారా? వారు కోరిన సంపదల్ని దాతలు ఇస్తున్నారా? మీరున్నూ అలా సంపదలు తెచ్చుకుంటున్నారా? ఈ విధంగా అర్థులకు అడిగింది ఇచ్చే దానవీరుడు ఎవడో చెప్పండి?
వామనా! దానం చేసేవారూ ఉన్నారు. ధనాన్ని గ్రహించేవారూ ఉన్నారు. బ్రాహ్మణులు తమ కోర్కెలను నెరవేర్చుకుంటున్నారు. కాని, దాతలలో బలిచక్రవర్తికి సమానమైనవాడులేడు. ఆయన శుక్రాచార్యులు చెప్పినట్లు నూరు యజ్ఞాలు చేసినాడు. అతనిని అడిగితే సకలభాగ్యాలూ పొందవచ్చు.
(అధ్వర శతము : నూరుయజ్ఞాలు గురువైన శుక్రాచార్యుని ఆశీస్సులతో చేసినవాడు బలిచక్రవర్తి, నూరుయజ్ఞాలు చేసినవాణ్ణి శతమఖుడు అంటారు. ఇంద్రునికి శతమఖుడని పేరు. బలి ఇంద్రుణ్ణి ఓడించి దేవలోకాన్ని ఆక్రమించడానికి కారణం అతడు 'శతమఖుడు' కావడమే.)
ఈ విధంగా తెలియచెప్పిన బ్రాహ్మణుల మాటలు విని లోకాలకు మెలుచేసేటందుకై లాభపుమాటలు అంగీకరిస్తూ, తల్లిదండ్రుల ఆనతి పొంది ఒక శుభముహూర్తాన వామనుడు బయలుదేరి.
వామనమూర్తి బాగా హీనత్వాన్ని పొందిన ఇంద్రుని రక్షించేటందుకు ఆసక్తికలవాడయినాడు. వెంటనే పేదవానివలె దానం కోసం బలిచక్రవర్తి మందిరానికి వెళ్లడానికి సంకల్పించాడు.
అయ్యయ్యో! లక్ష్మీదేవిని తన వక్షఃస్థలాన కలిగినవాడు విష్ణువు. అయినా ఇంద్రుని కోసం రాక్షసుని (బలిచక్రవర్తిని) బిచ్చమడగటానికి వెళ్ళినాడు. ఇతరులకు మేలుచేయాలన్న బుద్దిగల గొప్పవారికి భూమిమీద యాచించటంకూడా ఒక అలంకారం వంటిదే.
సకలలోకభారాన్నీ వహించే (విష్ణువగు) వామనుడు వెళుతున్నప్పుడు ఆయన బరువును మోయలేక భూమి క్రుంగి పోయింది. (భూమిని మోస్తున్న) ఆదిశేషుడుకూడా వంగిపోయినాడు.
వామనుడు ప్రయాణం చేస్తూ నర్శదానదిని దాటి ఉత్తరతీరాన ప్రవేశించినాడు. ఆ నది శుభాలు కలిగించేది. యముని దండ ఘాతాలను తగులకుండా కవచంలా కాపాడేది. ముక్తికాంత మనసులోని గుట్టును తెలిపేది. తన నీళ్ళతో దోషాలను నివారించేది.
(వామనుడు నర్శదానదిని దాటి ఉత్తరతీరాన ప్రవేశించినాడు. కనుక అదితికశ్యపుల ఆశ్రమం నర్మదకు దక్షిణాన ఉంటుందనుకొనవచ్చు. ప్రాచీనభూగోళశాస్త్రాన్ని పరిశోధించేవారికి ఇదొక ఆధారంగా నిలుస్తుంది.)
మంచితేజస్సుగల వామనుడు బలిచక్రవర్తి యాగశాలను చూచినాడు. అక్కడ దనుజులు అనేక విధాలుగ పెద్దగా ప్రేలాపన చేస్తున్నారు. ఆ యజ్ఞంలో పాల్గొన్న ఉద్దండులైన మునులను చూచి దేవతలూ సిద్దులూ భయపడుతున్నారు. ఆ స్థలానికి ముందువైపు ద్వారంలో ఏనుగులూ, గుర్రాలూ, సైన్యాలూ నిండి ఉన్నాయి. అక్కడి యజ్ఞకుండాల పొగలతో సూర్యుని రథం గుర్రాలు పూర్తిగా కప్పబడిపోతున్నాయి.
అలా వామనుడు బలిచక్రవర్తి చేస్తున్న అశ్వమేధ యజ్ఞవాటికను సమీపిస్తున్న సమయాన
'శివుడో విష్ణువో బ్రహృదేవుడో సూర్యుడో అగ్నిహోత్రుడో మాయావేషంతో వచ్చి ఉంటాడు. కాని, ఈ భూమిమీద బ్రాహ్మణుడెవ్వడూ ఇంత ప్రకాశంగా అందంగా ఉండడు' అంటూ ఆశ్చర్యంతో భ్రాంతిచెంది అక్కడివారు వామనుని చూచి చాటుమాటుగా సంభాషించుకున్నారు.
వామనుడగు బ్రహ్మచారిరాకకు గుసగుసలాడుకొంటూ, కలత పొందుతూ, ఎక్కువగా తొట్రుపడుతూ సభలో ఉన్న వారంతా కలవరపడినారు.
ఆ సమయంలో బలిచక్రవర్తి సభామంటపాన్ని చేరి, చెవులకు ఇంపుగా సామవేదం పఠించే ఉద్గాతల గానాలు విన్నాడు. మంత్రతంత్రాలను వివరిస్తూ హోమం చేసే హోతలను కలుసుకొన్నాడు. హోమకుండంలో త్రేతాగ్నులను ప్రజ్వలింపచేసే ఋత్విజులను చూచినాడు. యోగ విధులను నేర్పుగా పేర్కొంటున్న సభాపతులను సమీపించినాడు. ఆ సభను బాగా ఆకర్షించాలని కొంతసేపు వామనుడు ఆ సభలో తిరుగాడినాడు. ఇదంతా చేసిన వామనుడైన విష్ణువునకు పుట్టుకే లేదు. ఆయన అదితికొడుకుగా పుట్టినాడు. లక్ష్మికి ఆటపట్టైనవాడు, వామనుడు.
అంతేగాక, భయపడుతూ, వంగుతూ, పడుతూ, తొట్రుపాటుతో జనాలగుంపుల దగ్గరకుపోతూ, హరినామసంకీర్తనం చేస్తూ చాటునకు పోతూ, ఉలికిపడుతూ వామనుడు కొంతసేపు అక్కడ నటించాడు.
వామనుడు కొందరితో చర్చలు చేస్తాడు, కొందరితో వేదానికి సంబంధించిన జటపనసలను చెప్తాడు. కొందరితో ప్రసంగిస్తాడు. కొందరితో వాదిస్తాడు. కొందరితో సరదాగా మాట్లాడుతాడు. కొందరిని చూచి నవ్వుతాడు.
(క్రమ - జటా - ఘనా మొదలైనవి వేదాన్ని పఠించే పద్ధతులు. 'పనస' అంటే యజుర్వేద సంహిత భాగంలో ఉండే ఒక విభాగం పేరు.)
అంతేకాక అందరితోనూ అనేకవిధాలుగా వ్యవహరిస్తూ ఆనందించసాగినాడు.
చిన్ని నడకలు నడుస్తూ, అడుగులు వేసినపుడల్లా భూమి చలించి కుంగిపోతుండగా, తొట్రుపాటుతో కూడిన మాటలు మాట్లాడుతూ వామనుడు బలిచక్రవర్తిని సమీపించినాడు.
ఇతడే దానవచక్రవర్తి! దేవేంద్రుడూ అగ్నీ యముడూ మొదలయిన దిక్పాలకుల గర్వాన్ని తొలగించిన మొనగాడు ఇతడే! అత్యాశలేని నిండైన హృదయం కలవాడు ఇతడే! అనేకవిధాల యజ్ఞాల పుణ్యకార్యాలలో ప్రీతితో దానం చేసేవాడు ఇతడే! దేవతాస్త్రీల మనస్సులను కలవరపెట్టే వెన్నెలవంటి కీర్తకలవాడు ఇతడే! ఇతడే సత్యంతో దయతో ధర్మంతో ప్రకాశించే స్వరూపం కలవాడు.
ఈ విధంగా పలికి కుశపవిత్రంతోనూ అక్షతలతోనూ కుడి చెయ్యి ముందుకు చాపి ఇలా అన్నాడు.
ముల్లోకాలనూ శాసించగలవానికీ, నవ్వుకుంటూ అవలీలగా ఇంద్రుడిని జయించగలవానికీ, గొప్ప ఉన్నత పదములతో మెలిగేవానికీ, మునీంద్రుల పొగడ్తలనుపొందిన శుభకరమైన యాగకార్యాలలో విహరించేవానికీ, దేవతాస్త్రీల మెడలలోని బంగారుమంగళసూత్రాలను తొలగించేవానికీ, సమస్త రాక్షసలోక సార్వభౌమునికీ (నీకు) మంగళం.
ఆ విధంగా ఆశీర్వదించిన వామనుడు కరచరణాలతో మానవాకారాన్ని ధరించిన వేదరాశివలె బలిచక్రవర్తిముందు నిలబడినాడు. వంపులు లేకుండా జడలుగట్టిన జుట్టూ, దండమూ, గొడుగూ, కమండలమూ ధరించి ఉన్నాడు. ఆయన చంకలో భిక్షాపాత్ర వ్రేలాడుతూ ఉంది. అతని ముఖం చంద్రబింబంవలె అందంగా ఉంది. అప్పుడు ఆయన కొన్ని చతురోక్తులచే నటించినాడు. సూర్యుని కిరణాలతో కప్పబడిన ఇతరగ్రహాలు వెలవెలపోయినట్లు ఆ బ్రహ్మచారి ముందు భృగువంశపు బ్రాహ్మణులు మరుగున పడిపోయినారు. వారు లేచి నిలబడి వామనుని క్షేమాన్ని అడిగి మధురవాక్కులతో గౌరవించినారు. బలిచక్రవర్తికూడా ఆయనకు మొక్కి ఆసనంపై కూర్చొన బెట్టినాడు. తన ఇల్లాలగు వింధ్యావళి బంగారుకలశంతో నీళ్ళుపోయగా బలి వడుగు అడుగులను కడిగి తుడిచినాడు.
('దినకరకిరణపిహితంబులైన గ్రహంబుల చందంబునన్' అని పై వచనంలో ఒకచోట చెప్పబడింది. బృహస్పతి, శుక్రుడు, బుధుడు మొదలయిన శుభగ్రహాలు కూడా సూర్యునితో సమాగమంలో ఉన్నపుడు తమ ప్రభావాన్ని పూర్తిగా కోల్పోతాయి. సూర్యకిరణాల ప్రభావం మిగతా గ్రహాల కిరణాలను నిస్తేజం చేస్తుంది. జ్యోతిశ్శాస్త్రంలో దీనిని మౌఢ్యము అంటారు. గురు, శుక్ర గ్రహాలకు సంబంధించి గురుమౌఢ్యం, శుక్రమౌఢ్యం అంటారు. అలాగే వామనుని తేజస్సునకు భృగ్వాదులు తిరోహితులయినారని గ్రహించవచ్చు.)
గంగను శివుడు జటాజూటంలో ధరించినట్టు, బ్రహ్మచారికాళ్ళుకడిగిన ఉదకాన్ని మంగళప్రదమని బలిచక్రవర్తి తన శిరస్సున చల్లుకొన్నాడు.
బలి మళ్లీ వామనునితో ఇలా అన్నాడు, ఓ బ్రహ్మచారీ! నీవెవ్వరి వాడవు? ఎవ్వడవు? నివాసస్థలమేది? నీవిక్కడికి రావడంవల్ల నా వంశం, నా జన్మం సఫలమైనాయి. మిగులధన్యుడనైతిని. ఈ యజ్ఞం పవిత్రమైంది. నా కోరికలు నెరవేరినాయి. అగ్నిహోత్రాలు బాగా వేల్వబడినాయి. ఈ కాలం చాలా మంగళప్రదమైంది.
ఓ బ్రాహ్మణోత్తమా! నీకేమి కావాలి? మేలిమివస్త్రాలా? రూకలా? పండ్లా? అడవిసంపదలా? ఆవులా? గుర్రాలా? రత్నాలా? రథాలా? మంచి భోజనాలా? కన్యలా? ఏనుగులా? బంగారమా? భవనాలా? గ్రామాలా? భూములా? భూభాగమా? ఇవిగాక ఇంకా ఏమైనా కావాలా?
('మాడ' అంటే 'వరాహా'లో సగం. రూకల్లో విశేషం.)
ఇలా ధర్మప్రకారంగా బలిచక్రవర్తి పలికిన పలుకులకు సంతోషించి వామనుడు ఈ విధంగా అన్నాడు.
ఇది నా నివాసస్థానం అని ఏ విధంగా చెప్పగలను? అంతటా ఉంటాను. ఎవరి చిన్నవాడ నని చెప్పగలను? నేను నాయంతవాడనై స్వేచ్చగా నడుచుకుంటాను. ఇలాంటి నడవడిక కలవాడనని ఎలా చెప్పగలను? పూనికతో మూడు పోకడలూ పోగలను. ఇది నేర్చుకున్నాను, అది నేర్చుకున్నాను అని అనడమెందుకు? అన్నీ నేను నేర్చుకున్నాను. ఇతరులెవరూ నాకు సాయం చేయరు కానీ ఇతరులందరకూ నేను సాయం చేస్తుంటాను. నేను ఒంటరివాడను. నాకెవ్వరూ చుట్టాలు లేరు. మునుపు నాకు సిరి (లక్ష్మి) ఉండేది. ఎక్కువగా నేను మంచివారితో ఉంటాను. అదే నా నివాసం.
రాజా! నీ పలుకులు నిజం. మంచి కీర్తిని ఇచ్చేదీ, నీ వంశానికి తగింది, ధర్మంతో కూడింది, మీ కులంలో కనికరం గలవారు ఆత్మబలం కలవారు తప్ప వేరేవారు జన్మించలేదు. యుద్ధంచేయడానికీ, దానం చేయడానికీ మీ వంశంలో భయపడేవారే లేరు. ప్రత్యర్థులకు పరాక్రమంతోను, అర్థులకు దానంతోనూ తృప్తి కలిగిస్తారు. మీ తాతలందరు బలిచక్రవర్తికి విరోచనుడు తండ్రి, ప్రహ్లాదుడు మొదటితాత, హిరణ్యకశిపుడు రెండవతాత, హిరణ్యాక్షుడు మూడవతాత పౌరుషశాలులు. మీ వంశాన ప్రహ్లాదుడు ఆకాశాన చంద్రునిలా ప్రకాశిస్తాడు. మీ వంశం సమృద్ధమైన యశస్సుతో సముద్రంవలె వృద్ధి చెందుతుంది.
(వామనుని చతురసంభాషణం ఈ పద్యంలో దాగి ఉంది. మాటకు కట్టుబడి ఉండటం, వంశప్రతిష్ట అనే రెండు అభిమానాలతో బలిచక్రవర్తి ముందరికాళ్లకు బంధంవేసే ప్రయత్నం ఈ మాటల్లో ఉంది.)
మునుపు నీ మూడవ తాతయైన హిరణ్యాక్షుడు విశ్వాన్ని జయించి గదాదండాన్ని ధరించి భూలోకమంతటా తిరిగినాడు. ఎక్కడా శత్రువు కనిపించలేదు. చివరకు ఆయనను శ్రీహరి వరాహరూపంలో పరిమార్చినాడు. ఆ సంగతిని హిరణ్యాక్షుని తమ్ముడైన హిరణ్యకశిపుడు విన్నాడు, విష్ణువు శౌర్యానికి ఆశ్చర్యపడినాడు. విష్ణువు విజయాన్ని బలాన్నీ తూలనాడినాడు. వెంటనే విష్ణువు నగరమైన వైకుంఠంపైకి దండెత్తినాడు.
(ప్రత్యర్థులైన హిరణ్యాక్ష హిరణ్యకశిపుల పరాక్రమాన్ని సుదీర్ఘంగా పొగడి విష్ణు పరాక్రమాన్ని తేల్చి చెప్పడం సందర్భోచిత వాక్యరచనలోని సొగసు.)
శూలపాణియై యమునివలె వస్తున్న హిరణ్యకశిపుని చూచి విష్ణువు సమయాసమయాలను గుర్తించి మాయచేయాలని మనస్సులో ఇలా ఆలోచించినాడు.
(విష్ణువును 'మాయావి' అని పిలవడం దైత్యుల కలవాటు. మాయగుణశీలుడు అనటం 'విష్టమాయి'కు చెందినది.)
ఈ హిరణ్యకశిపుని ఎదుర్కొని పోరాడి గెలిచేటందుకు శక్యంకాదు. అలాకాకుండా నేను ఎక్కడికైనా వెళ్లిపోతే లోకంలోని ప్రాణులపైకి మృత్యుదేవతవలె వెంటబడతాడు. ఆ విషయం తెలుసుకున్న హరి సూక్ష్మమైన రూపంతో ముక్కురంధ్రంద్వారా హిరణ్యకశిపుని గుండెలో ప్రవేశించినాడు.
ఆ తర్వాత హిరణ్యకశిపుడు వైకుంఠం చొచ్చి ఆయన కోసం వెదకినాడు. కానీ శత్రువు కనిపించలేదు. విష్ణువు కోసం ఆ రాక్షసుడు కోపంతో ఆకాశాన్నీ భూలోకాన్నీ స్వర్గాన్నీ గాలించినాడు. దిక్కులనూ, భూగర్భాలనూ, సముద్రాలనూ, పట్టణాలనూ, అడవులనూ అన్వేషించినాడు. లోకంలో ఎక్కడా శ్రీహరి జాడ చిక్కలేదు. చివరకు వెతకటం చాలించి తనలో ఇలా అనుకున్నాడు.
నా పగవాడు చచ్చి ఉంటాడు. అలా కాకుంటే కనపడకుండా ఉంటాడా? చచ్చిన విరోధిపై పగబూనటం మంచిది కాదని అధికారబలంతో తన పగను విడిచిపెట్టాడు.
బాధకు లోనయిన బ్రాహ్మణులవలె ఇంద్రాదులు మీతండ్రిని వేడగా ఆయన వారికి తన ప్రాణాన్ని (ఆయువును) ఇచ్చినాడు. ఈ ప్రపంచాన నీవుకూడా సామాన్యుడవుకావు.
(బలితండ్రి విరోచనుడు. ఆయన దేవతలకు ఆయువు దానం చేసిన కథను మాయావటువు జ్ఞాపకం చేస్తున్నాడు.)
నీవు మూడులోకాలను పాలించినావు. ఇంద్రాది దేవతలను వెడలగొట్టినావు, దానమివ్వటంలో మీ పూర్వులను పోలినావు. రాక్షసులను కాపాడటంలో సమర్థుడ వైనావు.
రాజ్యమున్నందుకు పూజింపదగినవారికీ, యాచకులకూ బ్రాహ్మణులకూ ధనాదికాన్ని పంచి మంచివాడుగ బ్రతకాలి. అలాకానప్పుడు వాని బతుకూ, ధనం, ఇల్లూ విడువదగినవే.
దాతలను లెక్కించేటప్పుడు ముల్లోకాలలోనూ గొప్పవాడ వని నిన్నే ముందుగా ఎన్నిక చేస్తారు. ఇన్ని దినాలనుండి ఎన్నడుకూడా నిన్ను పెట్టుమని పీడించిన వాడనుకాను.
రాక్షసరాజా! నాకు నీవు దానంచేయాలని కుతూహలపడుతున్నావు. నేను ఒంటిగాడను. నాకు సొమ్ములు, భూములు అవసరంలేదు. ఒకటి, రెండు (మూడు) అడుగులనేల మాత్రం ఇవ్వు. దానితో తృప్తిచెంది బ్రహ్మానందం పొందుతాను.
ఓ బ్రాహ్మణుడా! నీవన్న మాటలన్నీ నిజం. సత్యమైన విషయాలు పెద్దలు సమ్మతిస్తారు. అడుగదలచినావు కానీ కొంచెపుకోరికను కోరినావు. అయ్యో! దాత గొప్పతనపు తీరును తలచవద్దా!
భూభాగాన్ని కోరినావా? ఏనుగులను కోరినావా? గుర్రాలను కోరినావా? యువతులను కోరినావా? పసిబాలుడవు. నీకు అడగడం తెలియదు. ఇంతటి రాక్షసచక్రవర్తిని ఇంత చిన్న కోరికకోరినావు. అల్పమైనదానిని ఎలా ఇస్తాడు?
బలిచక్రవర్తి ఆ మాటనగా చిరునవ్వుతో శ్రీహరి బలితో ఇలా అన్నాడు.
నాకు గొడుగో, జందెమో, కుండికయో, ముంజిత్రాటిమొలతాడో, దండమో అవసరం. అంతేకాని బ్రహ్మచారిని అయిన నాకు ఏనుగులు, స్త్రీలు, గుర్రాలు ఎందుకు? కాదనక నేను కోరిన మూడడుగుల నేల ఇస్తే అదే నా పాలిటికి బ్రహ్మాండం (చాల గొప్పదానం).
అంతేగాక, ఆశించక, దుఃఖపడక, దొరికింది కొంచెమైనా దానినే పదివేలుగా భావిస్తూ తృప్తిపొందనివానికి ఏడు దీవులను ఇచ్చినాకూడా బాగుపడడు. (తృప్తిపడడు).
(సప్తద్వీపాలు= జంబూ, ప్లక్ష, కుశ, శాక, శాల్మల, క్రౌంచ, పుష్కరములు.
ఓ మహారాజా! ఆశ అనే తాడు చాలా పొడవయినది. దానికి అంతులేదు. పూర్వం వేనుని కుమారుడు పృథుచక్రవర్తి, గయుడు మొదలయిన రాజులు సముద్రాలదాకా వ్యాపించిన సామ్రాజ్యాన్ని సంపాదించి పాలించినారు. వారుకూడా కష్టపడినారు కానీ అర్ధకామాన్ని వదలలేదు. వారి ఆశలు నెరవేరనూ లేదు.
తృప్తి కలిగినవాడు మూడులోకాలలోను గౌరవింపబడుతాడు. సంతోషం కలవానికి ఎప్పుడూ సుఖం కలుగుతుంది. సంతోషం లేకపోవటమే సంసారంలో చిక్కుకోవడానికి కారణం. ఆనందంచే ముక్తికాంత లభిస్తుంది. ఏ పూటకు ఆపూట దొరకిన దానితో తృప్తిని పొందితే తేజస్సు పెరుగుతుంది. సంతోషం లేకపోతే నీళ్లవల్ల నిప్పు నశించినట్లు తేజస్సు తగ్గిపోతుంది. నీవు రాజువని నేను అన్నీ కోరటం న్యాయం కాదు. నాకు తగినట్లుగా నేనడిగిన మూడడుగుల చోటే కాదనకుండా ఇవ్వు. అదే చాలు, అంతే చాలు.
అలా పలికిన వామనునికి మూడుడుగుల నేలను దానం చేయటానికి బలిచక్రవర్తి జలకలశం తీసుకొన్నాడు. అంతలో రాక్షసరాజ్యనిర్మాణధుర్యుడైన శుక్రాచార్యుడు దానశీలుడైన దానవ చక్రవర్తితో ఇట్లా అన్నాడు.
ఓ రాక్షసరాజా! ఇతడు బ్రాహ్మణుడు కాదు. దేవతలపనిని నెరవేర్చేందుకు కశ్యపునికొడుకుగా అదితిగర్భంలో పుట్టినవాడు. తెలియక ఈతని కోరికను తీరుస్తానని చెప్పినావు. రాక్షసులకు హాని సంభవిస్తుంది. నీ ధనం, తేజం, స్థానం, ఐశ్వర్యం అన్నీకూడా ఈ వామనుడు మోసంతో తీసుకొని ఇంద్రునికి ఇస్తాడు. విశ్వరూపాన్ని ధరించి ప్రపంచాలన్నింటినీ మూడడుగులతో ఆక్రమించుకొంటాడు. సకలభాగ్యాలను హరికి సమర్పించి దీనునివలె నీవు ఎట్లా బ్రతుకుతావు?
ఈయన ఒక అడుగుతో భూలోకాన్నీ ఇంకొక అడుగుతో స్వర్గలోకాన్నీ తొక్కి (ఆక్రమించి) విశ్వరూపంతో దిక్కులూ ఆకాశమూ తానై సహింపశక్యం కాకుండా ఉన్నపుడు నీ వెక్కడికి పోతావో చెప్పు.
ఇస్తానని చెప్పి ఇవ్వకపోతే వచ్చే నరకాన్ని త్రోసిపుచ్చడానికి నీవు సమర్థుడవుకావు. ఏ దానం చేయటంవల్ల హాని సంభవిస్తుందో అలాంటి దానం దానమే కాదని జ్ఞానులంటారు. దానం, యజ్ఞం, తపస్సు, కర్మం మొదలైనవాటిని భాగ్యవంతుడై ఉన్నపుడే చేయటానికి ఆలోచించాలి. తనకున్న ధనమంతా ఐదుభాగాలుగా చేసి ధర్మానికీ, అర్ధానికీ, కామానికీ, కీర్తికీ, ఆశ్రితులకూ సమానంగా ఇచ్చేవాడు ఇహపర లోకాలలో సంతోషంగా ఉంటాడు. తనకుమాలిన ధర్మం పనికిరాదు.
అంతేకాక ఈ విషయంలో పెక్కు విధాలుగా ప్రసిద్ధమైన ఒక ఋగ్వేదసూక్తి ఉంది. దానిని చెపుతాను శ్రద్ధగా విను.
ఓ రాజా! ఏది ఇస్తే సర్వమూ నష్టమవుతుందో ఆ దానం ఇవ్వరాదు. ఇస్తానని మాట ఇచ్చినా సరే, దానివల్ల అసత్యదోషం అంటదు. ఎందుకంటే దేహం అనే చెట్టుకు అసత్యమే మూలం. అటువంటి దేహ వృక్షానికి సత్యం, పూలు పండ్లుగా ఉంటాయి. అసత్యం అనే మూలం బాగుంటే దేహం అనే వృక్షం చెడదు. మొదలు చెడితే చెట్టుకూడా చెడుతుంది. పూలూపండ్లూ చెడుతాయి. పండ్లూ, పూలూ లేకపోయినా మొదలు బాగా ఉంటే చెట్టుబాగా ఎదుగుతుంది. కాబట్టి మొదటికి చేటుకలుగకుండ, లోటురాకుండ, పదుగురిలో పలుచన కాకుండ దానం చేసేదాత చెడడు. అందువల్ల సత్యం కోసం నీవు ఇతనికి దానమిస్తే నీకు మిగిలేది ఇక ఏమీ ఉండదు.
(శుక్రాచార్యుడు దానవ గురువు. కనుక, దానవకుల క్షేమాన్ని కోరినవాడుగా అసత్యమాడుమని ధర్మపన్నాలను చెప్పినాడు. పై పద్యంలోని శుక్రుని భావాలు వేదతత్త్వానికి వక్రభాష్యం. ఆత్మ అంటే దేహమని అర్థం. అది నిలపాలంటే అసత్యం పలకాలని శుక్రనీతి.)
అన్ని విషయాలలో ఇది వర్తించదు. సమస్తమూ ఉన్నా అడిగిన వస్తువు లేదని అబద్ధం చెప్పరాదు. ఆ విధంగా చెప్పేవాడు నీచుడు, పిరికివాడు. వాడు ప్రాణమున్న శవం. వాని బ్రతుకు వ్యర్థం.
దీనిలో ఇంకో విశేషముంది. వివరిస్తాను.
రాజా! ఆడవాళ్ల విషయంలోను, పెళ్లిళ్ల విషయంలోను, ప్రాణ ధన మానాలకు హాని వాటిల్లినప్పుడూ, భయపడిన గోవులనూ, బ్రాహ్మణులనూ ఆదుకొనేటప్పుడు అబద్ధం ఆడవచ్చు, పాపం రాదు.
ఉత్తమదాతా! కులాన్ని రాజ్యాన్ని పరాక్రమాన్ని నిలుపుకో. ఈ వామనుడు ప్రపంచాన్నంతా భరించేవాడు. కొంచెంతో పోయేవాడుకాదు. త్రివిక్రముడై బ్రహ్మాండాన్నంతా ఆక్రమిస్తాడు. ఇతనిని ఒక్కడుకూడా అడ్డగించలేడు. నా మాటవిని ఈ దానం చేయవద్దు. ఈ బ్రహ్మచారిని పంపించివేయి.
ఈ విధంగా శుక్రాచార్యుడు మేలుకోరి చెప్పగా క్షణకాలం కన్నులుమూసి ఆలోచించి యశస్వి అయిన బలిచక్రవర్తి ఇలా అన్నాడు.
ఓ మహానుభావా! నీవు నిజం చెప్పినావు. గృహస్థధర్మం ఇదే. ధనం, కోరిక, కీర్తి, జీవనోపాధి, వీటిలో ఏది కోరినా కూడా ఇస్తానని చెప్పినాను. ద్రవ్యలోభంతో యాచకునికి లేదని చెప్పి తిప్పిపంపలేను. ఇచ్చినమాట తప్పటంకంటె పాపంలేదు. పూర్వం భూదేవి 'ఎలాంటి చెడ్డపని చేసినవానినైనా మోస్తాను, కానీ ఆడిన మాటను తప్పిన వానిని మాత్రం మోయలేను అని బ్రహ్మతో చెప్పిందికదా! రణంలో వెనుకంజవేయక ప్రాణాలు విడువటం, మాటకు కట్టుబడి సత్యంతో బ్రతకటమూ మానధనులకు మేలైన మార్గాలు.
వ్యవసాయదారునికి మంచిపొలం, మంచి విత్తనాలు, ఒకేచోట దొరికినట్లుగా దాతకు తగిన ధనమూ, దానిని దానంగా గ్రహించే యోగ్యుడూ సమకూరటం అనే భాగ్యం ఉంటుందా?
శుక్రాచార్యా! రాజులులేరా? రాజ్యాలు లేవా? వారు అతిశయమయిన గర్వాన్ని పొందలేదా? అలాంటివారు ఎక్కడ ఉన్నారు?, వారు సంపదను మూటకట్టుకొని పోయినారా? భూమిమీద వారి పేరైనా ఉందా? శిబిచక్రవర్తి మొదలయినవారు కీర్తికోసం యాచకుల కోర్కెలను తీర్చలేదా? అలాంటి వారిని ఇప్పుడు కూడా జనులు మరచిపోలేదుకదా?
మహాత్మా! ఎడతెగని యజ్ఞాలు చేయటంచేత, తపస్సులు చేయటంచేతకూడా చూచేందుకు వీలుకాని గొప్పవాడయిన విష్ణువు ఆకృతియందు చిన్నవాడై నన్ను యాచిస్తున్నాడు. కనుక ఆయన కోరిన దానిని ఇవ్వటంకంటె నావంటి వానికి ఇంకేం కావాలి?
విష్ణవంతటివాడు చెయ్యిచాచి అడుగుతున్నాడు. ఆ చెయ్యి ఎంతోగొప్పది. మొదట లక్ష్మీదేవి కొప్పుపైన, శరీరం పైనా, భుజంపై ఉండే పైటపైన, పదపద్మాలపైన, చెక్కిళ్లపైన, పాలిండ్లపైన సరికొత్త గౌరవాన్ని పొందే ఆ చెయ్యి కిందుగా ఉండటం, నా చేయి మీదుగా ఉండటం మంచిదికాదా? ఈ రాజ్యం గీజ్యం శాశ్వతమా? శరీరం స్థిరంగా ఉంటుందా?
ఓ ధీమణీ! నరకమైనా, చెర అయినా భూమి అంతా నశించినా, దుర్మరణం సంభవించినా? వంశనాశనమైనా, జరుగవలసింది జరుగుతుంది, జరుగనీ! భయంలేదు. అభ్యాగతుడు శివుడైనా, విష్ణువైనా, బ్రహ్మదేవుడైనా, ఎవరైనా సరే! ఏమైనా సరే! వేయిమాటలెందుకు? నా నాలుకకు ఇవ్వననే మాట రాదు.
స్వచ్చమైనచరిత్రకలవాడా! అన్నమాట ప్రకారం ఆలస్యం చేయక ఇస్తానని చెప్పిన దానమిస్తే శ్రీహరి ఎందుకు బంధిస్తాడు? ఇది ఎక్కడిమాట! ఒకవేళ బంధించినా తనంత తానే కరుణించి విడిచిపెడతాడు. వదలిపెట్టకున్నా సరే!
మేరుపర్వతం తలకిందులైనా, సముద్రం ఇంకి పోయినా, భూమి పొడియైపోయినా, నక్షత్రమార్గం గతి తప్పినా తప్పకుండా ఈ దానాన్ని ఇస్తాను.
పూజ్యుడా! ఈ వామనుడు ఎప్పుడూ ఇతరులను వేడడట. సాయంలేనివాడట. తలిదండ్రులూ అన్నదమ్ములూ లేనివాడట. అన్ని విద్యల మూలాన్ని తెలుసుకున్న నేర్పరియట. నా ముందు చేతులొగ్గి నిలువగా ఈ ముద్దు బాలుని పొమ్మనేందుకు బుద్ధిపుట్టటంలేదు.
(ఇది వామనుని సామాన్య సాధారణ పరిస్థితిగా కనిపించినాకూడా నిదానించి పరికిస్తే ఇది పరమాత్ముని లక్షణాలను చెప్పిన పద్యం.)
పై రీతిగా పలికిన బలిచక్రవర్తి సత్యమార్గం నుంచి చలించలేదు. ఆ మార్గంనుండి ఆయనను మార్చడానికి వీలుకాదు. అతని మనస్సు దృఢమైంది. కీర్తి నిర్మలమైంది. ఆయన దానం అడిగేవారికి సమీపబంధువు. అతడు వామనునికి దానమిచ్చే కుతూహలంతో తహతహలాడటం చూచి అతనిపై శుక్రాచార్యుడు కోపపడినాడు. 'నా ఆనతిని మీరినావు. కనుక త్వరలో పదభ్రష్టుడవైపోతావు' అని శపించినాడు. గురువు శాపానికి గురిఅయికూడా బలిచక్రవర్తి బాధపడలేదు. ఆయన అసత్యమార్గాన్ని అవలంబించలేదు.
బాగా బతికినా, బాగా కష్టాలకు గురైనా, బీదతనం వచ్చినా, ప్రాణానికీ ధనానికీ చేటు వచ్చినా, చివరకు చావే సంభవించినాకూడా మానధనులు మాట తప్పలేరు.
బలిచక్రవర్తిభార్య వింధ్యావళి పెనిమిటి చేసిన సంజ్ఞను తెలిసికొని బ్రహ్మచారిపాదాలు కడుగుటకు బంగారు కలశంతో నీళ్లు తెచ్చింది.
అపుడు వామనునితో బలిచక్రవర్తి ఇలా అన్నాడు.
బాలకశ్రేష్ఠుడా! రమ్ము! లెమ్ము! నీ కోరికను లేదనకుండా ఇస్తాను. నీ పాదాలు కడుగనిమ్ము ఇక ఆలస్యం చేయటం ఎందుకు?
బలిచక్రవర్తి తన రెండు చేతులతోనూ కడగడానికి అనుకూలంగా వామనుడు తన పాదాన్ని చాచినాడు. ఆ పాదం మునులచే, దేవతలచే ప్రార్ధించబడునది, సంపద నిచ్చునది, లక్ష్మీదేవి నొసటి కస్తూరి బురదతో కూడినది, పద్మంవలె పరిమళాన్ని వెదజల్లేది, రత్నాల అందెగా చేయబడిన వేదాలుకలది.
దేవలోకాన్ని కాపాడేదీ, నిత్యం సంపత్తును కలుగచేసేదీ, సర్వోపనిషత్తులకూ భూషణమైనదీ, భవబంధాలను పోగొట్టేదీ అయిన హరిచరణాన్ని బలిచక్రవర్తి కడిగినాడు.
ఈ విధంగా వామనుని కుడిఎడమ పాదాలను బలిచక్రవర్తి కడిగినాడు. పవిత్రమైన ఆ జలాలను నెత్తిపై చల్లుకొన్నాడు. ఆచమించినాడు. దేశమూ కాలమూ మొదలయినవాటిని లెక్కించినాడు (సంకల్పం చెప్పినాడన్నమాట).
'విష్ణుస్వరూపుడవూ, ప్రకటమయిన వ్రతం కలవాడవూ, వేదప్రామాణ్యం తెలిసినవాడవూ, బ్రాహ్మణుడవూ అయిన నీకు మూడడుగుల భూమిని ఇస్తున్నాను అంటూ బ్రహ్మచారి అయిన వామనుని చేయి సాచి పూజించి 'పరబ్రహ్మ ప్రీతికై ఇస్తున్నాను' అని ప్రపంచమంతా ఆశ్చర్యం చెందేటట్లుగా ధారవోసినాడు.
నీటిధార పడకుండా శుక్రాచార్యుడు కలశం రంధ్రానికి అడ్డుపడి ఆపినాడు. ఆ సంగతి తెలిసిన వామనుడు దర్భకొనతో పొడిచినాడు. దానివల్ల శుక్రునికి దర్భకొన కంటిలోగుచ్చుకొంది. శుక్రుడు ఒక కన్నువాడైనాడు.
బలిచక్రవర్తి (దానమిస్తున్నట్లు తెలిపే ) పవిత్రోదకాన్ని ధారపోసి నాడు. ఆ నీటి బిందువులకు వామనుడు తన చెయ్యిని ఒడ్డినాడు. ఆ చెయ్యి రాక్షసుల తలలను ఖండించినట్టిది. లక్ష్మీదేవిని ఆకర్షించటంలో మెలైనది. రమాదేవి శిరోజాలచే సేవించబడినది. నిర్మలమైన శ్రీదేవి కుచాగ్రాలమీద ఉంచబడినది.
బలిచక్రవర్తి అందించిన దానధారను వామనుడు గ్రహించినాడు. ఆ జలధార మునీశ్వరుల దాననియమాల సంకల్పాలకు ఆధారమైనది. రాక్షసస్త్రీలను కన్నీటిపాలు చేసేది. రాక్షసరాజు బలిని నిరాధారునిగ మార్చేది.
విష్ణువును, కాలాన్ని దేశాన్ని శుక్రాచార్యుని మాటలను, నాశనమును ఎరిగికూడా బలిచక్రవర్తి ఆ దానం యోగ్యమైనదిగా భావించి ఇచ్చినాడు. భూమిమీద ఆతనికన్న మరొకదాత ఉంటాడా? (లేడు)
పరీక్షిన్మహారాజా! సకల భూతాలకూ విష్ణువు అధిపతి. ఆయనకు బలిచక్రవర్తి దానం చేయగానే దిక్కుల ధ్వనులతో, పంచభూతాలూ బళి బళి అని పొగడినాయి.
భూమిని దానమిచ్చినవానికీ, దానిని ప్రీతితో పుచ్చు కొన్నవానికీ పాపాలు నశిస్తాయి. వారు సంతోషంగా నూరేండ్లు స్వర్గంలో విహరిస్తారు.
'అందువల్ల ఏ దానమూ భూదానానికి సమానంకాదు. భూదానం ఇచ్చిన నీకు రెండులోకాలలోనూ కీర్తి, పుణ్యం కలుగుతుంది.' అని పలికి మాయావటుడు మళ్లీ ఇలా అన్నాడు.
నేనెందుకు దీనిని అడిగినానని నీ మనస్సులో విచారింపక దానమివ్వు, సత్యం పెంపొందేవిధంగా దీనిని అడిగినాను. ఈ మూడడుగులు ఇస్తే మాకు మూడులోకాలు ఇచ్చినట్లే.
అలా పలికిన వామనుని మాటలకు బలిచక్రవర్తి చాలా సంతోషించి
'పుట్టిన తర్వాత నేర్చెనో పుట్టకముందే నేర్చెనో కానీ, ఈ చిట్టి పొట్టి పాపని పొట్టనిండ మాయలే' అంటూ నవ్వి బలి భూమిని దానమిచ్చినాడు.
No comments:
Post a Comment