ఓ రాజశ్రేష్ఠ! పరీక్షిన్మహారాజా! రంతిదేవుని కీర్తి గురించి చెప్ప బనిలేదు. అయినా విను. ఆ రాజు దీనులు అందరికి తాను సంపాదించిన ధనాన్ని దానం చేసేశాడు. కడు పేదవాడై కుటుంబంతో సహా ధైర్యం మాత్రం విడువక నలబై ఎనిమిది రోజులు ఆహార పానీయాలు లేక తిరిగాడు. ఒకనాటి ఉదయకాలంలో ఆ రంతిదేవునకు నెయ్యి, పాయసం, నీళ్ళు లభించాయి. తనకున్న పెద్ద కుటుంబ భారభయంతో ఆకలి, దాహం అధికం కాగా ఆ పదార్థాలను చూచి తినడానికి ఉత్సాహపడ్డాడు.
ఆ సమయంలో, ఒక బ్రాహ్మణుడు అతిథిగా వచ్చి ఆహార మడుగగా ప్రియంగా గౌరవించి “హరి సమర్పణం” అంటూ అన్నంలో సగభాగమిచ్చాడు రంతిదేవుడు. అతడు భుజించి వెళ్ళేలోపున ఒక శూద్రుడు భోజనం కోరి వచ్చాడు. తనకు మిగిలిన అన్నంలో ఒక భాగం అతని కీయగా అతడు సంతోషించి వెళ్ళాడు. వాడు వెళ్ళిన వెంటనే కుక్కలగుంపుతో ఒకడురాగా మిగిలిన అన్నాన్ని ఇచ్చి వేశాడు రంతిదేవుడు. వెంటనే చండాలు డొకడు వచ్చి సమీపంలో నిలబడ్డాడు.
ఓ రాజా! నేను హీనుడను, చండాలుడను, నాకు దప్పిక ఎక్కువగా ఉంది. ఒక్క అడుగు ముందుకు వేయలేను. నీకు ఉన్న ఆ నీరు నాకు పోసి నన్ను బతికించు.
చండాలుడు అలా అన్నాడు. అతని దైన్యంతో కూడిన మాటలకు జాలి వహించి రంతిదేవుడిట్లన్నాడు.
ఓ పుల్కసా! నా వద్ద అన్నం లేదు. కొన్ని మధురజలాలు ఉన్నాయి. రా! త్రాగు. జీవులకు కష్టంవస్తే వాళ్ళ ఆపదలు వెంటనే పోగొట్టి వాళ్ళకు సుఖం కలిగించడంకంటె మేలు ఏముంటుంది! నాకంటావా! పురుషోత్తముడే నాకు దిక్కు అని పలికి,
అతికష్టమైన దాహంతో ప్రాణం పోయేస్థితిలో ఉన్న ఈతడు ఏమి బాధపడకుండుగాక. వీని హృదయతాపం, ఆయాసం, బాధ నేనిచ్చే ఈ జలంతో పోవుగాక అనుకుంటూ పరమేశ్వరుని నమ్మినవాడై రంతిదేవుడు దయతో ఆ చండాలుని పాత్రలో మధురమైన నీటిని పోశాడు.
అటుపిమ్మట బ్రహ్మాది దేవతలు సంతసించి, రంతిదేవునకు మేలు చేద్దామని, తమ తమ (మారువేషాలు విడిచి) ఆకారాలతో రాజుముందు నిలబడ్డారు. ఆ రాజు ధైర్యాన్ని పరీక్ష చేయాలనే ఆలోచనతో తాము ధరించిన శూద్ర బ్రాహ్మణాది రూపాలతో కూడిన విష్ణుమాయను తెలిపారు. ఆ రంతిదేవుడు వచ్చిన దేవతలందరికి చేతులు జోడించి
రంతిదేవుడు ధీరుడు, మాయావిధానాన్ని ఎరిగినవాడు. అందుకే ప్రత్యక్షమై వచ్చిన దేవతలను ఇహలోక సౌఖ్యాలు ఏమీ కోరక, నారాయణునిపై భక్తి తన ఎదలో ప్రకాశింపగా మోక్షాన్ని పొందాడు.
ఆ రాజర్షి అయిన రంతిదేవుని సేవించిన వారంతా, అతని యోగ మహిమవల్ల హరిచింతన కలవారై, యోగీశ్వరులై, మహాయోగులు, సిద్ధులు నివసించే గొప్ప పదాన్ని పొందారు.
ఈ ప్రకారంగా రంతిదేవుడు విజ్ఞానయుతమైన భక్తివల్ల మోక్షాన్ని పొందాడు. ఆ తరువాత గర్గునకు శిని, శినికి గార్గ్యుడు జన్మించారు. ఈ గార్గ్యుని నుండి బ్రాహ్మణకులం అయింది. మహావీరునికి ఉరుక్షయుడు, వానికి త్రయ్యారుణి, కవి, పుష్కరారుణి అనే ముగ్గురు జన్మించారు. వారు కూడా బ్రహ్మజ్ఞానం గల బ్రాహ్మణులయ్యారు.
బ్రహ్మక్షత్రునికి సుహోత్రుడు, వానికి హస్తి జన్మించారు. ఈ హస్తి తనపేర హస్తినాపురాన్ని నిర్మించాడు. హస్తికి అజమీఢుడు, ద్విమీఢుడు, పురుమీఢుడు అనే ముగ్గురు జన్మించారు. అందులో అజమీఢుని వంశంలో ప్రియమేధాదులు కొందరు పుట్టి బ్రాహ్మణులయ్యారు. ఆ అజమీఢునికి బృహదిషువు వానికి బృహద్ధనువు, అతనికి బృహత్కాయుడు, వానికి జయద్రధుడు, అతనికి విశ్వజిత్తు, విశ్వజిత్తునికి సేనజిత్తు, వానికి రుచిరాశ్వుడు, దృఢహనువు, కాశ్యుడు, వత్సుడు అనే నలుగురు జన్మించారు. అందులో రుచిరాశ్వునికి ప్రాజ్ఞుడు, వానికి పృథుసేనుడు, పృథుసేనునికి పారుడు, వానికి నీపుడు, ఆ నీపునికి నూర్గురు సుతులు పుట్టారు మరియు
నీప మహారాజు శుకుని కూతురైన సతతి అనే ఆమెను పెండ్లి చేసికొని, చక్కని యోగవిద్యనెరిగి విజ్ఞానంతో వెలుగొందే హృదయం గల బ్రహ్మదత్తుణ్ణి కన్నాడు.
బ్రహ్మదత్తుడు జైగీషవ్యుని ఉపదేశంవల్ల యోగవిద్యను పొంది గోదేవి అనే పేరుగల భార్యవల్ల విష్వక్సేనుడు అనే కుమారుని కన్నాడు. విష్వక్సేనునకు ఉదక్సేనుడు, వానికి భల్లాదుడు జన్మించారు. వీరు బార్హదిషవులనే రాజులైరి. ద్విమీఢునకు యమీనరుడు, వానికి కృతిమంతుడు, వానికి సత్యధృతి, వానికి దృఢనేమి, వానికి సుపార్శ్వకృత్తు, వానికి సుపార్శ్వుడు, వానికి సుమతి, ఆ సుమతికి సన్నతిమంతుడు జనించిరి. సన్నతిమంతుని కొడుకు కృతి అనేవాడు హిరణ్యనాభునివలన యోగమార్గం తెలిసికొని శోకమోహాలు విడిచి తూర్పుదేశంలో సామవేదాన్ని చదివాడు. ఆ కృతికి ఉగ్రాయుధుడు, ఉగ్రాయుధునికి క్షేమ్యుడు, క్షేమ్యునికి సువీరుడు, సువీరునకు పురంజయుడు, పురంజయునకు బహురథుడు జన్మించారు. హస్తి కొడుకైన పురుమీఢునికి సంతతి లేదు. ఆ అజమీఢునికి నళిని అనే భార్యయందు నీలుడు, నీలునికి శాంతి, శాంతికి సుశాంతి, సుశాంతికి పురుజుడు, పురుజునికి అర్కుడు, అర్కునికి భర్మ్యాశ్వుండు, భర్మ్యాశ్వునికి ముద్గల, యవీనర, బృహదిషు, కాంపిల్య, సృంజయులనే వారు ఐదుగురు పుట్టారు.
భర్మ్యాశ్వుడు తన ఐదుగురు కుమారులను చూచి ఐదు రాజ్యభాగాలు పాలింప సమర్ధులు మీరు అనగా వారు పాంచాలురు అని పేరు పొందారు.
అటుపిమ్మట ముద్గలునుండి బ్రాహ్మణ వంశమై ముద్గల గోత్రంతో విరాజిల్లింది. భర్మ్యాశ్వ పుత్రుడైన ఆ ముద్గలునికి దివోదాసు, అహల్య అను ఇరువురు జన్మించారు. ఈ అహల్యయందు గౌతమునికి శతానందుడు జన్మించాడు. శతానందునికి ధనుర్వేదం బాగా తెలిసిన సత్యధృతి పుట్టాడు. ఆ శరద్వంతుడు ఒకరోజు అడవిలో ఊర్వశిని చూడగా మోహంతో అతనికి వీర్యస్ఖలనం జరిగింది. ఆ రేతస్సు ఒక రెల్లుస్తంభంపై పడి రెండుభాగాలై కవలలుగా జన్మించారు. ఆ సమయంలో
చంచలమైన కోరికతో శంతనుడనే రాజు అడవికి వేటకువెళ్ళి అక్కడ ఉన్న కవల పిల్లలను కృపతో చూచి కృపి, కృపుడు అనే పేర్లు పెట్టి ఇంటికి తెచ్చి పెంచాడు.
ఆ కృపి ద్రోణునకు భార్య అయింది. దివోదాసుకు మిత్రాయువు వానికి చ్యవనుడు అతనికి సుదాసుడు, వానికి సహదేవుడు, వానికి సోమకుడు, వానికి సుజన్మకృత్తు, అతనికి నూర్వురు కొడుకులు కలిగారు. ఈ సుజన్మకృత్తుకు జన్మించిన నూర్గురిలో జంతువనేవాడు పెద్దవాడు. చిట్టచివరివాడు పృషతుడు. పృషతునికి ద్రుపదుడు, ద్రుపదునికి ధృష్టద్యుమ్నుడు మొదలైన కొడుకులు, ద్రౌపది అనే కూతురు కలిగారు. ధృష్టద్యుమ్నునికి ధృష్టకేతువు జన్మించాడు. వీళ్ళు పాంచాల రాజులు. అజమీఢుని కొడుకు ఋక్షుడు. వానికి సంవరణుడు జన్మించాడు. ఆ సంవరణునికి తపతి అని పేరుగల సూర్యకన్యకయందు కురువు జన్మించాడు. అతని పేరుమీద కురుక్షేత్రం అనే పేరు గలిగింది. ఆ కురునికి పరీక్షిత్తు, సుధనువు, జహ్నువు, నిషధుడు అనేవాళ్ళు నలుగురు జన్మించారు. వారిలో పరీక్షిత్తుకు సంతానం కలగలేదు. సుధనువునికి సుహోత్రుడు, వానికి చ్యవనుడు, వానికి కృతి, కృతికి ఉపరిచరవసువు, ఆ వసువునకు బృహద్రథ, కుసుంభ, మత్స్య, ప్రత్యగ్ర, చేదిష మొదలైనవారు పుట్టారు. అందులో బృహద్రధునికి కుశాగ్రుడు, కుశాగ్రునికి ఋషభుడు, అతనికి సత్యహితుడు, సత్యహితునికి పుష్పదంతుడు, పుష్పదంతునికి జహ్నువు అనేవారు జన్మించారు. మరియు
ఆ బృహద్రథునికి మరాక భార్య గర్భంలో రెండు శరీర ఖండాలు జన్మించాయి. ఆ రెండు ఖండాలను తల్లి దూరంగా పారవైచింది. జర అనే రాక్షసకాంత ఆ రెండు ముక్కలను ఒకటిగా కలిపింది. వాడు జరాసంధుడని పిలువబడ్డాడు. అతడు గిరివ్రజపురాన్ని పాలించాడు. ఆ జరాసంధునికి సోమాపి, అతనికి శ్రుతశ్రవుడు జన్మించారు.
సురథుడనేవాడు జహ్నువు కుమారుడు. సురథుని కుమారుడు విదూరథుడు. వాని కొడుకు సార్వభౌముడు. ఓ రాజా! ఆ సార్వభౌమునికి స్వచ్చమైన ఖ్యాతిగల జయత్సేనుడు అనేవాడు జన్మించాడు. విను,
జయత్సేనునికి రథికుడు, వానికి అయుతాయువు, వానికి క్రోధనుడు, వానికి దేవాతిథి, వానికి ఋక్షుడు, వానికి భీమసేనుడు, వానికి ప్రతీపుడు, ఆ ప్రతీపునికి దేవాపి, శంతనుడు, బాహ్లికుడు అను ముగ్గురు కొడుకులు పుట్టారు. వారిలో
దేవాపి రాజ్యం పరిపాలించడం ఇష్టంలేక విరక్తుడై అడవులకు పోయాడు. పూర్వజన్మలో మహాభిషుడు అనేవాడు ఈ జన్మలో దేవాపి సోదరుడైన శంతనుడై జన్మించాడు. ఈ శంతనుడు రాజ్యాన్ని పరిపాలించాడు. శంతనుడు తన చేతితో ఏ వృద్దుణ్ణి ముట్టుకున్నా ఆ ముసలివాడు నవయౌవనం పొందేవాడు. ఆ శంతనుడు ప్రశాంతంగా రాజ్యాన్ని పాలించే వేళ వజ్రాయుధధారి ఇంద్రుడు పన్నెండేండ్లు ఆ రాజ్యంలో వానలు కురిపించలేదు. వాన పడకపోవడాన్ని గూర్చి శంతనుడు బ్రాహ్మణులను ప్రశ్నించాడు 'అన్న బ్రదికియుండగా తమ్ముడు అగ్నిహోత్రాన్ని భార్యను స్వీకరిస్తే అతణ్ణి పరివేత్త అంటారు. అటువంటి పరివేత్తవు నీవు' అన్నారు బ్రాహ్మణులు.
ఆ కారణంగా విప్రులు 'అన్న ఉండగా తమ్ముడు రాజ్యం స్వీకరించకూడదు. నీవు పరివేత్తవు. నీవు నీ అన్నకు రాజ్యాన్ని ఇస్తే అనావృష్టి దోషం పోతుంది అని చెప్పారు. శంతనుడు అడవికి వెళ్ళాడు. అన్నకు ప్రియమైన మాటలు చెప్పి రాజ్యం స్వీకరించుమన్నాడు. ఈ సంఘటన జరగడానికి ముందే శంతనుని మంత్రులు దేవాపిని రాజ్యార్హత లేనివానిగా చేయాలనే ఆలోచనతో దేవాపి వద్దకు బ్రాహ్మణులను పంపారు. వారు పాషండమత పద్ధతులు దేవాపికి ఉపదేశించారు. దేవాపి వేదాలను నిందించిన కారణంగా పాషండుడు, దైవాన్ని నిందించేవాడు కాబట్టి వానికి రాజ్యార్హత లేదని బ్రాహ్మణులు చెప్పారు. శంతనుడు అడవినుండి రాజ్యానికి తిరిగివచ్చాడు. రాజ్యం స్వీకరించాడు. వానలు కురిశాయి. ఈ విధంగా
ఓ పరీక్షన్మహారాజా! ఆ దేవాపి కలాపపురం నిలయంగా యోగిగా ఉన్నాడు. కలిలో నశించిపోయే చంద్రవంశాన్ని తరువాతి యుగంలో అతడే చక్కగా స్థాపిస్తాడు.
బాహ్లికునికి సోమదత్తుడు, సోమదత్తునికి భూరి, భూరిశ్రవస్సు, శలుడు అనే ముగ్గురు జన్మించారు.
శంతనునకు గంగానదికి వైష్ణవశ్రేష్ఠుడు, భయంకర శత్రునేత్రములనే నల్లకలువలకు భయాన్ని కలిగించే మండువేసవి వంటి భీష్ముడు జన్మించాడు.
పరశురాముణ్ణి ఎదిరించి, జయించడంలో భీష్ముణ్ణి తప్ప మరొకఱిని ఎరుగము. భీష్ముడు గంగానదీసుతుడు. పరాక్రమ సమూహ నాయకుడు. మంచి వివేకంగల ధర్మం ఎరిగినవాడు, స్వచ్చమైన కీర్తి కలవాడు.
శంతనునకు దాశరాజు సుతయైన సత్యవతికి చిత్రాంగద, విచిత్ర వీర్యులనే ఇద్దరు జన్మించారు. వారిలో చిత్రాంగదుడు చిత్రాంగదుడనే గంధర్వుని చేతిలో మరణించాడు. మరియు
సత్యవతి శంతనుణ్ణి వివాహము చేసికోవడానికి పూర్వము పరాశరుడు ఆమెను కలిసి గర్భవతిని చేశాడు. అప్పుడామెకు నిత్యసత్యాలైన వేదాలను విభజింప సమర్థుడు, విష్ణుమూర్తి అంశతో బాదరాయణుడు జన్మించాడు.
పాపరహితుడు, భగవంతుడైన బాదరాయణుడు మిక్కిలి రహస్యమైన భాగవతాన్ని కొడుకునైన నాకు చెప్పాడు. నేను మిగిలిన శిష్యులకు తెలియకుండా రహస్యముగా ఆ భాగవతాన్ని చదువుకొన్నాను.
ఆ విచిత్రవీర్యునికి కాశిరాజు కుమార్తెలు అంబిక, అంబాలిక అనే వాళ్ళను భీష్ముడు బలవంతంగా తీసికొనివచ్చి వివాహం చేశాడు. వారిపట్ల ఆసక్తికల్గి కామాకులచిత్తుడై, మత్తుడై చాలాకాలం అనేకవిధాలైన క్రీడలతో విహరిస్తూ చివరకు విచిత్రవీర్యుడు అమితమైన క్షయరోగ పీడితుడై మరణించాడు. పిమ్మట
ఓ రాజా! 'విచిత్ర వీర్యుని భార్యలవల్ల కుమారా! నీవు సుతులను కనుమ'ని తల్లి సత్యవతి ఆజ్ఞాపించగా, బాదరాయణుడు ధృతరాహ్ష్రుడు, పాండురాజు, విదురుడు అనేవాళ్ళను క్రమంగా కన్నాడు.
వాళ్ళలో ధృతరాష్షునికి గాంధారియందు దుర్యోధనుడు మొదలగు, కొడుకులు నూర్గురు, దుశ్శల అనే కన్య జన్మించారు. మృగశాప భయంవల్ల పాండురాజు భార్యను కూడడానికి భీతుడై ఉన్నాడు. ఆ పాండురాజుకు కుంతీదేవియందు యముడు, వాయువు, ఇంద్రుడు అనువారి ప్రసాదంగా ధర్మరాజ భీమార్జునులు, మాద్రియందు అశ్వినీ దేవతల దయవల్ల నకుల సహదేవులు, మొత్తం ఐదుగురు కలిగారు. ఈ అయిదుగురికి ద్రుపదరాజ సుతయైన ద్రౌపదియందు క్రమంగా; ప్రతివింధ్యుడు, శ్రుతసేనుడు, శ్రుతకీర్తి శతానీకుడు, శ్రుతకర్ముడనే ఐదుగురు జన్మించారు. ధర్మరాజుకు పౌరవతి అనే ఆమెయందు దేవకుడు, భీముడికి హిడింబయందు ఘటోత్కచుడు, కాళి అనే ఆమెయందు సర్వగతుడు, సహదేవుడికి విజయ అనే ఆమెయందు సుహోత్రుడు, నకులుడికి రేణుమతి అనే భార్యయందు నిరమిత్రుడు, అర్జునునికి ఉలూపి అనే నాగకన్యయందు ఇరావంతుడు, మణలూరుపతి సుత చిత్రాంగదయందు బభ్రువాహనుడు, సుభద్ర అనే భార్యయందు శౌర్యం, ధైర్యం, తేజస్సు అనే విభవాలతో రాజులందరిలో కీర్తిగన్న అభిమన్యుడు జన్మించారు. అందులో బభ్రువాహనుడు అర్జునుని ఆజ్ఞతో మాతామహుని గోత్రానికి వంశకర్త అయ్యాడు.
సర్వజనపూజ్యా! నీ తండ్రి అభిమన్యుడు రాజులందరిలో శ్రేష్ఠుడు, తన బాణపరంపరతో శత్రు రాజులను చీల్చి చెండాడినవాడు, అతని తోడి యుద్ధంలో కురుసైన్యం భయంతో వణికింది. సేనా నాయకులందరి చూపులతో ఆదరించబడినవాడు. ఆదరణీయమైన గొప్ప కీర్తి కలవాడు. కురువంశకర్తయై ఒప్పాడు.
ఉత్తరాభిమన్యులకు పరీక్షిత్తువైన నీవు జన్మించావు.
ఓ భూపతీ! ద్రోణపుత్రుడు అశ్వత్ధామయొక్క బాణపువేడికి నీ ప్రాణాలు పోగా నీ శైశవవేళ విష్ణువు తన దయాదృష్టివీక్షణం అనే రక్షణ కవచం ఏర్పాటు చేయగా నీవు బతికావు కదా!
జనమేజయ, శ్రుతసేన, భీమసేన, ఉగ్రసేనులు అనే నల్గురు నీ కుమారులు. వీళ్ళలో
పరీక్షిత్తువైన నీవు తక్షక సర్పంవల్ల చనిపోయావని తెలిసికొని, ఆ కోపాన్ని మనసులో పెట్టుకొని సమస్త సర్పలోకం భస్మం అయ్యేలా నీ సుతుడు జనమేజయుడు సర్పయాగాన్ని చేస్తాడు.
జనమేజయుడు సర్వభూమండలాన్ని జయించి, కావషేయుడు పురోహితుడుగా ఉండగా, అశ్వమేధయాగం చేస్తాడు. ఆ జనమేజయునికి శతానీకుడు జన్మిస్తాడు అతడు యాజ్ఞవల్క్యుని వద్ద వేదాలు, కృపాచార్యునివద్ద ధనుర్వేదం, శౌనకుని వద్ద ఆత్మజ్ఞానం పొందుతాడు; ఆ శతానీకునికి సహస్రానీకుడు, వానికి అశ్వమేధజుడు, వానికి ఆసీమకృష్ణుడు, వానికి నిచకుడు జన్మిస్తారు. ఈ నిచకుడు హస్తినాపురం నదిలో మునిగిపోగా కౌశాంబినగరంలో నివసిస్తాడు. ఆ నిచకునికి ఉప్తుడు వానికి చిత్రరథుడు, వానికి శుచిరథుడు, వానికి సృష్టిమంతుడు, వానికి సుషేణుడు, వానికి సుపీతుడు, వానికి నృచక్షుస్సు, వానికి సుఖానిలుడు, వానికి పరిప్లవుడు, వానికి మేధావి, వానికి సునయుడు, వానికి నృపంజయుడు, వానికి దూర్వుడు వానికి నిమి, వానికి బృహద్రథుడు, వానికి సుధాంశుడు, వానికి శతానీకుడు, వానికి దుర్దమనుడు, వానికి విహీనరుడు, వానికి దండపాణి, వానికి మితుడు, వానికి క్షేమకుడు, వానికి బ్రహ్మక్షత్రుడు జన్మిస్తారు. ఈ బ్రహ్మక్షత్రుడు సంతతి లేనివాడౌతాడు. ఐనా ఇతడు దేవతలచే, ఋషులచే కలియుగంలో కీర్తింపబడతాడు.
ఓ భగవద్విషయ విచారా! ధీరా! సుగుణాలంకారా! పరీక్షిన్నరేంద్రా! ప్రపంచంలో ఇకపై పుట్టె మగధాధీశ్వరులైన సకల రాజులు వేదాంత విదులు అయిన వారిని గూర్చి చెబుతాను.
జరాసంధ పుత్రుడైన సహదేవునికి మార్జాలి, అతనికి శ్రుతశ్రవస్సు, వానికి అయుతాయువు, అతనికి నిరమిత్రుడు, వానికి సునక్షత్రుడు, వానికి బృహత్సేనుడు, అతనికి కర్మజిత్తు, వానికి శ్రుతంజయుడు, వానికి విప్రుడు, వానికి శుచి, అతనికి క్షేముడు, వానికి సువ్రతుడు, అతనికి ధర్మనేత్రుడు, వానికి శ్రుతుడు, అతనికి దృఢసేనుడు, వానికి సుమతి, అతనికి సుబలుడు, వానికి సునీతుడు, అతనికి సత్యజిత్తు, వానికి విశ్వజిత్తు, విశ్వజిత్తునకు పురంజయుడు జన్మిస్తారు అని చెప్పి మళ్లీ ఇలా అన్నాడు.
ఓ రాజేంద్రా! మగధదేశపు రాజులు జరాసంధుడు మొదలైనవారు గొప్ప కీర్తిగల రాజులు. కానీ వీరు కలియుగంలో వేయేండ్లలోపు కాలంలోనే జనించి మరణిస్తారు (మగధ వంశం వేయియేండ్లకు మించి నిలువదు).
యయాతి కొడుకు అనువు. ఆ అనువునకు సభానరుడు, చక్షువు, పరోక్షుడు అనేవారు ముగ్గురు జన్మించారు. అందులో సభానరునకు కాలనాథుడు, వానికి సంజయుడు, వానికి పురంజయుడు, అతనికి జనమేజయుడు, వానికి మహాశాలుడు, వానికి మహామనసుడు, ఆ మహామనసునకు ఉశీనరుడు, తితిక్షువు అనే ఇద్దరు కుమారులు జన్మించారు. వారిలో మొదటివాడైన ఉశీనరునికి శిబి, వనుడు, క్రిమి, దర్పుడు అనే నలుగురు జన్మించారు. ఆ నలుగురిలో శిబికి వృషదర్ప, సువీర, మద్ర, కేకయులు అనేవారు నలుగురు కలిగారు. ఇక రెండవవాడైన తితిక్షునకు రుశద్రథుడు, వానికి హేముడు, వానికి సుతపుడు, ఆతనికి బలి అనేవాడు పుట్టారు. ఈ బలికి సంబంధించిన క్షేత్రంలో దీర్ఘతముడు అనేవానివల్ల అంగ, వంగ, కళింగ, సింహ, పుండ్ర, ఆంధ్రులనే పేర్లుగల ఆరుగురు కుమారులు ఉదయించారు. వాళ్ళు తూర్పుదేశాలకు రాజులై, పాలించే రాజ్యాలకు తమ తమ పేర్లే పెట్టారు. సువీరునికి (శిబియొక్క రెండవకొడుకు) సత్యరథుడు, అతనికి దివిరథుడు, వానికి ధర్మరథుడు, ఆ ధర్మరథునికి చిత్రరథుడు జన్మించారు. ఆ చిత్రరథుడే రోమపాదుడు అని ప్రసిద్ధి పొందాడు.
(బలిపత్నియందు దీర్ఘతమునికి ఆరుగురు పుత్రులు కలిగారు. అందులో 'ఆంధ్ర'ఒకడు. ఆంధ్రుడు పాలించిన దేశం ఆంధ్రదేశం అని పై వచనంలోని సమాచారం తెలియజేస్తుంది.)
రోమపాదుడు సంతతిలేదని విచారిస్తున్నవేళ అతని చెలికాడైన దశరథుడు తన సుతయైన శాంతను అతనికి (పెంపుడు) కూతురుగా ఇచ్చాడు.
రోమపాదుడు శాంతను తన కుమార్తెగా స్వీకరించి పెంచుతున్నాడు. ఆ రోమపాదుని రాజ్యంలో కొంతకాలం వర్షం కురవలేదు. దానికి రోమపాదుడు చాల చింతించాడు. ఋశ్యశృంగుడనే విభాండక మహర్షి కుమారుడున్నాడని అతడు తన రాజ్యానికి వస్తే వర్షాలు కురుస్తాయని పెద్దలు, చెప్పగా విన్నాడు రోమపాదుడు.
రాజు రోమపాదుడు తపశ్శక్తి సంపన్నుడైన ఋశ్యశృంగుణ్ణి తీసికొని రావడానికి విస్తార స్తనభారంతో కంపించే, సన్నని నడుముగల వేశ్యకాంతలను పంపాడు.
ఆ వేశ్యకాంతలు వెళ్తూ, ఓ కాంతలారా! విభాండకుని సుతుడు ఋశ్యశృంగుడు లేడిగర్భం నుండి బయటకు వచ్చినది మొదలు నేటివరకు ఆడువారిని చూచి ఎరుగడు. అడవిలో ఎవ్వరితో సంబంధం లేకుండా ఇంద్రియజ్ఞానాన్ని ఎరుగని ఈ బ్రహ్మచారిని మన్మథక్రీడలో మునిగి తేలేలా చేయాలి.
అలా మాట్లాడుకుంటూ, ఆ వారకాంతలు నాట్యాలు చేస్తూ, వీనులవిందుగా పాడుతూ, చూపులనే వాడిబాణాలను వదులుతూ, దగ్గరకు వెళ్ళడానికి భయపడుతూ ఋశ్యశృంగుని కలత పెట్టుటకు బెరుకుగా చేరారు.
అప్పుడా వారకాంతలను చూచి, ముగ్ధత్వం గల తపస్వి ఋశ్యశృంగుడు వారకాంతలకు తుమ్మెదల సమూహంలా ఉండే నల్లని కురుల సమూహాన్ని ఒక రకమైన జటలు అని, బంగారు జరీతో చక్కగా ప్రకాశించే వస్త్రాలు ఒక విధమైన జింక తోలుబట్టలు అని, రత్నహారాలు గొప్ప రుద్రాక్షమాలలని, గంధం, కస్తూరి మైపూతలు, ఒక తీరైన విభూతి పూతలని, వారు పాడే పాటలు స్వరయుక్త వేద మంత్రజాతులని, వారు వాయించే వీణలు మునులు ధరించే దండాలు అయి ఉంటాయని, ఆడువారి ఆకృతులు ఎన్నడూ చూడని ముని వారిని తాపసులని భావించి వారిని సమీపించి నమస్కరించాడు.
ఈ విధంగా నమస్కరించిన ఋశ్యశృంగుణ్ణి చూస్తూ నవ్వుతూ దగ్గరకు వచ్చి
వారకాంతలు ఋశ్యశృంగుణ్ణి చూచి క్షేమమా! అంటూ చేతులతో తాకి తమ కఠిన స్తనాలు తగిలేట్లు గట్టిగా కౌగలించుకొన్నారు. చాలకాలం నుండి తపోనియతితో అలసిపోయావు కదా అంటూ మొగాన్ని కంఠాన్ని నాభిని సవరించారు. ఇవి కొత్తరకం దీవెనలు అంటూ చెవులదగ్గర నాలుకలతో చప్పుళ్ళు చేశారు. మా తోటలోని మంచి పళ్ళు ఇవి తినుమంటూ ఎన్నో తినుబండారాలను ప్రేమతో ఇచ్చారు. ఈ జింక చర్మం కొత్తది, నునుపుగా ఉంటుంది, మంచిది అంటూ కౌపీనాన్ని తీసివైచి మంచి మృదువైన వస్త్రాన్ని ఇచ్చి ఆ ఋశ్యశృంగమునిని ఆసక్తికి లోనుజేసి మా కుటీరానికి వెళదాము రా అంటూ అతనిని తమవెంట తీసికొనిపోయారు.
ఈ విధంగా ఋశ్యశృంగుడు కాంతల క్రీగంటి చూపులనే త్రాళ్ళచే బంధించబడి, వాళ్ళ వెంబడి రోమపాదుని రాజ్యానికి వచ్చాడు. ఆ రోమపాదుడు తన ప్రియపుత్రి శాంతను ఇచ్చి పెండ్లి చేసి తన రాజ్యంలో ఉంచుకున్నాడు. ఆ మునీశ్వరుడు రాజ్యానికి రాగానే వర్షం పడని దోషం తొలగిపోయి వర్షం కురిసింది. అంతట
ఋశ్యశృంగుడు దశరథునకు బిడ్డలు లేని విషయం తెలిసికొని, ఇంద్రుని గూర్చి యజ్ఞంచేసి సుతులను ఇప్పించాడు. ఈ విధంగా ఋశ్యశృంగుని వల్లనే దశరథునకు సంతానం కలిగింది.
ఆ రోమపాదుడికి చతురంగుడు ఆ చతురంగునికి పృథులాక్షుడు, ఆ పృథులాక్షునికి బృహద్రథుడు, బృహత్కర్ముడు, బృహద్భానుడు అనేవారు ముగ్గురు జన్మించారు. అందులో బృహద్రథ్రునికి బృహన్మనస్సు, వానికి జయద్రథుడు అతనికి విజయుడు, ఆ విజయునికి సంభూతి అనే భార్యవల్ల ధృతి, ఆ ధృతికి ధృతవ్రతుడు, ధృతవ్రతునికి సత్యకర్ముడు, సత్యకర్మునికి అతిరథుడు జన్మించారు.
చిన్నవయస్సులో కుంతి సూర్యుని కోరి అతనిని పొందింది. వారికి బిడ్డ జన్మించగా కుంతి ఆ బిడ్డను పెట్టెలో పెట్టి గంగనీటిలో విడిచిపెట్టింది, అతిరథుడు ఆ పెట్టెను చూచి ఆ బిడ్డకు కర్ణుడు అని పేరుపెట్టి కొడుకుగా ప్రేమ చూపాడు.
ఈ విధంగా అతిరథుడికి కన్యాపుత్రుడైన కర్ణుడు కొడుకయ్యాడు. ఆ యయాతి కొడుకైన ద్రుహ్యునకు బభ్రుసేతువు, అతనికి ఆరబ్ధుడు, వానికి గాంధారుడు, అతనికి ఘర్ముడు, వానికి ఘృతుడు, అతనికి దుర్మదుడు, వానికి ప్రచేతస్సు జన్మించారు. ఈ ప్రచేతస్సు అనేవానికి నూర్గురు సుతులు కలిగారు. వాళ్ళు మ్లేచ్చ దేశాలకు అధిపతులై ఉత్తర దిక్కుగా వెళ్ళిపోయారు. యయాతి కొడుకైన తుర్వసునికి వహ్ని వానికి భర్గుడు, వానికి భానుమంతుడు, వానికి త్రిసానువు అతనికి కరంధముడు, ఆ కరంధమునకు మంచి హృదయం గల మరుత్తు జన్మించారు. ఈ మరుత్తుకు యయాతి శాపంవల్ల సంతతి కలుగలేదు. విను.
No comments:
Post a Comment