Tuesday, March 10, 2026

The Story of Vritrasura - వృత్రాసుర వృత్తాంతము

వృత్రాసుర వృత్తాంతము

విశ్వరూపుడు చనిపోయేసరికి అతని తండ్రియైన త్వష్టకు దుఃఖం కలిగింది. ఆ దుఃఖంవల్ల కలిగిన తీవ్రకోపంతో ఆయన మండిపడిపోయాడు. ఇంద్రుణ్ణి చంపడం కోసం ఒక మారణ క్రతువు చేశాడు. ఆ హోమాగ్ని నుండి ఒకడు పుట్టాడు. అతని చూపులు కల్పాంతాగ్ని జ్వాలల్లా ఉన్నాయి. ఆ చూపులతో ముల్లోకాలు క్షోభించిపోయాయి.

(కల్పమంటే బ్రహ్మాదేవుడి కొక పగలు, మానవలోకం లెక్కలను అనుసరించి నాల్గు యుగాలూ వేయి మారులు తిరిగితే అది బ్రహ్మ కొకపగలు. ఆ పగటి చివర ప్రళయం. క్రతువంటే యాగం. ఆయా దేవతల నుద్దేశించి ద్రవ్యత్యాగం. హోమమంటే ఆ ద్రవ్యాలను అగ్నిలో సమర్పించటం.)

ప్రళయకాలంలో జగాలను సంహరించే రుద్రునికంటె అధికమైన ఒడ్డూ పొడుగూ కలవాడవుతూ, నానాటికీ శరీరం బాణపు వేటంతగా పెరుగుతూ, కాలినపర్వతంలా ఉన్న శరీరం సంధ్యాకాలంలోని ఎరుపురంగుతో ఉండగా పుట్టం పెట్టిన రాగిరంగుతో మెరుస్తున్న మీసాలు జుట్టు కొసలు కలిగి మధ్యాహ్నపు సూర్యబింబంలా ఉన్న కన్నుల కొసలతో దిక్కులను వణికిస్తూ, వజ్రాయుధంలా మెరిసే కోరలతో ప్రకాశించే గుహవంటి ముఖంతో

నింగినీ నేలనూ తాకే అంతగా ఎత్తుగా ఉన్నాడు. అతని శిరస్సుపై వ్యాపించిన మంటలవలలో నింగి నున్న గ్రహాలు జారిపడిపోతున్నాయి. శరీరానికి తగలకుండగానే భయం కల్గించేది పదునైనదీ, దిటవైనదీ, సూర్యబింబంలా తీక్ష్ణంగా ఉన్నదీ అయిన శూలాన్ని అనాయాసంగా చేతితో పట్టుకొని మహానందంతో నేలవణికేలా పరవశించి గంతులు వేస్తూ

వృత్రాసురుడు నిరంతరంగా నోరు తెరిచి ఆకాశాన్నిచరుస్తున్నాడు. నాలుక చాపి గ్రహాలను నక్షత్రాలను నాకుతున్నాడు. పెద్దనవ్వులు నవ్వుతూ లోకాలను మింగడానికి ప్రయత్నిస్తున్నాడు. తన భయంకరమయిన కోరలు తిప్పుతూ దిగ్గజాల దంతాలను ముక్కలు చేస్తున్నాడు. త్వష్ట తపోబలంచేత బలం సంపాదించి వృత్రాసురుడు అఖిలలోకాలనూ ఆక్రమించి, ఎవ్వరికీ లొంగకుండా విజృంభిస్తున్నాడు.

దేవతలు ఆ వృత్రుని మీదకు పెద్ద పెద్ద సేనలతో పోయి గొప్ప అస్త్రాలను ప్రయోగించారు. ఆ అస్త్రాలను అన్నింటినీ పట్టుకొని వృత్రుడు మింగివెేసి శౌర్యంతో ఉత్సాహంతో కేకలు పెట్టాడు.

వృత్రాసురుడు దేవతలు ప్రయోగించిన దివ్యాస్త్రాలనన్నింటినీ మింగేసరికి దేవతలు ఆవృత్రాసురుణ్ణి చూడడానికి కూడా భయపడి తమను రక్షించేది ఎవరా అని చింతిస్తూ పారిపోయారు.

వృత్రాసురుడు ఆయుధాలు, రథాలు మొదలయిన సాధనాలతో బాటుగా సత్పురుషులందరినీ మింగేసరికి దేవేంద్రాదులు ఆశ్చర్యపడి ఏం చెయ్యాలో తెలియక ఆయన తేజస్సుకి భయపడి వాడిపోయిన హృదయాలతో విష్ణువుతో మొరపెట్టుకోవాలని

ఈ వృత్రాసురుడు జయింపశక్యంకానివాడు. మన ఆయుధాలు మింగాడు. వాడికి సాటి యోధుడు కనపడడంలేదు. మన బ్రతుకేది? మనకు గొప్ప ఆపద వచ్చిపడింది. సహాయం చెయ్యడానికి శ్రీహరి తప్ప మరెవ్వరూలేరు. శ్రీహరిని ప్రార్థిద్దాం. మంచివీరులతో కలుద్దాం. గీతాలు పాడుదాం. చూచీ చూడడంతో శ్రీహరి సంకోచించకుండా ఈ వృత్రాసురుడు నశించే ఉపాయం చెప్తాడు. స్వర్గానికి కష్టాలు తప్పుతాయి.

దేవతలు తమలోతాముపై విధంగా ఆలోచిస్తూ దుఃఖపడుతూ; తడబడుతూ; తూలుతూ; అంతటిరాక్షసుణ్ణి చూచిన కన్నులు బెదురుతూ ఉండగా శ్రీహరిని సమీపించారు.

భయార్తులైన దేవతలు శ్రీమహావిష్ణువు దగ్గర మొరపెట్లుకోవడానికి వెళుతున్నారు. ముందుగా పాలసముద్రాన్ని సమీపించారు. పాలసముద్రం పెద్ద పెద్ద కెరటాలమీద పెద్ద పెద్ద నురుగుముద్దలతో తెల్లగా ఉంది. ఆ నురుగుముద్దలు శ్రీహరి కీర్తిలతపూచిన పూలగుత్తుల్లా ఉన్నాయి. పెద్ద పెద్ద సుడులున్నాయి. ఆ సుడులలో గిరగిర దక్షిణావర్త శంఖాలు తిరుగుతున్నాయి. ఆ శంఖాలు విష్ణుసేవవలన విష్ణు భక్తులకు లభించిన పుణ్యఫలాల్లా ఉన్నాయి. పాలసముద్రంలో భయంకరమైన జలచరాలున్నాయి. తమ ఆహారాన్ని మింగడానికి తీవ్రవేగంతో కదులుతున్నాయి. ఆ కదలికలవలన లేచిన కెరటాలు ఒకదానితోఒకటి ఢీ కొంటున్నాయి. అప్పుడు లేచిన నీటితుంపురులు ఆకాశంలో నక్షత్రాల్లామెరుస్తున్నాయి. పాలసముద్రంలో పర్వతాలున్నాయి. పాలకెరటాలు ఆ పర్వతాలమీద ప్రవహిస్తూ ఉన్నాయి. ఆ దృశ్యం శ్రీహరి అంతః పురకాంతలు విహరించడానికి యోగ్యమైన, చక్కగా కడగబడిన, కొత్త సున్నంతో వెల్లవేసిన, మేడలను నిర్మించే పనిలో పాలసముద్రం నిమగ్నమయినట్లుంది. పాలసముద్రంలో పగడాల తీగలమొలకలు ప్రకాశిస్తున్నాయి. అవి శ్రీహరి తన భార్యలపై చూపించిన అనురాగంలా ఉన్నాయి. కెరటాలు మేఘాలను తాకుతున్నాయి. ఆ రెండింటితాకిడివల్ల గొప్ప ఘోష పుడ్తోంది. దానితో భూమ్యాకాశాల మధ్యభాగం నిండిపోతోంది. తెల్లగా ఉన్న పాలసముద్రం భూమినంతా చుట్టుకొని ఉంది. కనుక భూదేవతకు అలంకరించిన తెల్లని పట్టుచీరలా ఉంది. పాలసముద్రం హరిహరాది సకలదేవతలకు అమృతాన్ని అనేక సంపదల్నీ ఇచ్చిన గొప్ప నిధిలా ఉంది. పాలసముద్రపుటొడ్డున దేవతావృక్షాలున్నాయి. అవి వైకుంఠ పురవాసులకోరికలన్నింటినీ తీరుస్తూ ఉన్నాయి. కుబేరుని కోశాగారం పద్మ మహాపద్మ శంఖ మకర కచ్చప ముకుంద కుంద నీల వర అనే పేర్లు గల నవవిధులతో ప్రకాశిస్తోంది. అదే విధంగా పాలసముద్రం పద్మాలతో మహాపద్మాలతో శంఖాలతో మకరాల(మొసళ్ళ)తో కచ్చపాల(తాబేళ్ళ)తో ముకుందాల(ఒకజాతి మాణిక్యాల)తో కుందుని(విష్ణువు)తో నీలాల(ఇంద్రనీలమణులుతో వరాల (శ్రేష్ఠవస్తువుల)తో ప్రకాశిస్తోంది. విష్ణువు పాణిపద్మం సుదర్శనం(చక్రం) యొక్క బ్రమణాలతో ప్రకాశిస్తోంది. అంటే విష్ణువు చేతిలో సుదర్శనచక్రం తిరుగుతూ ఉంటుంది. అదే విధంగా పాలసముద్రంకూడా సుదర్శన(చూడదగిన) ఆవర్తాల(సుడుల)తో ప్రకాశిస్తోంది. కైలాసపర్వతం అమృతకళాస్థానశేఖరుని(శివుని) పదార్పణాలతో (పాదాలు ఉంచడం)తో ప్రకాశిస్తోంది. అదే విధంగా పాలసముద్రంకూడా అమృతానికి, కళలకు(ఓడలకు) స్టానమై శేఖరాలమీద కొండకొనలమీద, పదార్పణల (అడుగులుంచడం= ప్రవహించడం)తో ప్రకాశిస్తోంది. ఇంద్రుని వైభవం కల్పవృక్షం కామధేనువు చింతామణులవలన వృద్ధిపొందినది. అదే విధంగా పాలసముద్రం కల్పవృక్షం, కామధేనువు, చింతామణులు అనే విశేషాలు కలది.

పంచమహాభూతాలచేత నిర్మింపబడిన ఈ జగత్తునకు గురువు బ్రహ్మదేవుడు. అతడూ మేమూ ఎల్లవేళలా శ్రీహరిని పూజిస్తున్నాం. అతడు వేదాలచే స్తుతింపబడేవాడూ సర్వం తానైనవాడూ, కోరికలులేనివాడూ, అహంకారంలేనివాడూ, శాంతుడూ, దయాస్వభావుడు. అతణ్ణి విడిచి మరొకరిని సేవించాలనుకునే పంచనాశీలం గల అతి పాప కర్మ బుద్ధి...అంటే కుక్కతోకపట్టుకొని సముద్రం దాటాలనుకోవడమే.

జలప్రళయమందు శ్రీహరి తాను మత్స్యావతారమెత్తి భూమిని నావగాచేసి తన కొమ్మునకు ఆ ఓడను గట్టిగాకట్టి సత్యవ్రతుడనే మనువును ఓడలో ఉంచి రక్షించాడు. ఆ శ్రీహరి మాపాలిటి అదృష్ట దేవత అయి వృత్రాసురునివలన కలిగిన ఆపద నుండి మమ్ము రక్షించుగాక.

జలప్రళయ సమయంలో పెనుగాలులతో పెద్దశబ్దంచేస్తూ, కంపిస్తూ, భయంకరంగా పడిలేచే కెరటాలతో, అదుపుచేయరాక, అంతటా వ్యాపించిన సముద్రజలాల్లో పడిపోయి విలపిస్తున్న బ్రహ్మను తన నాభికమలంలోకి చేర్చి రక్షించినవాడూ ఇంతంతనరానివాడూ అయిన అద్వితీయుడు మమ్ములను దయతో ఆదరించుగాక!

మేముదేవతలం. శ్రీహరి దేవదేవుడు. సర్వలోకాలకూ శరణు ఇవ్వగలిగినవాడు. ఆ శ్రీహరిని శరణుపొంది వృత్రాసురుని వలన మాకు కలిగిన ఆపదలను తొలగించుకొని శుభాలు పొందగలం.

ఇలా స్తుతిస్తున్న దేవతల భక్తవత్సలుడైన శ్రీహరి సంతుష్టుడై సాక్షాత్కరించాడు. ఆ సమయంలో

దేవతలు కనుల విందుగా కరవు తీరేవిధంగా శ్రీహరిని దర్శించుకున్నారు. ఆ శ్రీహరి శంఖచక్రగదలను ధరించాడు. శ్రీవత్సలాంఛనసౌందర్యంతో, కౌస్తుభం అనే మణి అందంతో ప్రకాశిస్తున్నాడు. మాణిక్యాలు పొదిగిన కిరీటం ధరించాడు. దివ్యాలంకారాలు ధరించాడు. కేశపాశానికి అలంకారాలున్నాయి. చెవులకు కుండలాలున్నాయి. వక్షఃస్థలం పైన లక్ష్మి ఉంది. ఆయన సేవకులందరూ ఆయన వలెనే ఉన్నారు. పలుచనైన పచ్చని వస్త్రం ధరించాడు. ఆయన కన్నులు తెల్లతామరపూవులవలె ఉన్నాయి. నవ్వు అమృతద్రవంలా ఉంది.

సేవకులరూపం శ్రీహరి రూపం ఒకే విధంగా ఉన్నా శ్రీవత్సం కౌస్తుభం లక్ష్మి ఈయనే శ్రీహరి అని శ్రీహరిని గుర్తించే విధంగా చేస్తున్నాయి. ఆయన కన్నులు తామరపూలు ఏవి ఏవో తెలిసికోడానికి వీలులేకపోయినా కన్నులలో పొంగే కరుణ ఇవి శ్రీహరి నయనాలు అని గుర్తింప చేస్తోంది. శ్రీహరితో కాపురంచేసే లక్ష్మివలన సకలలోకాల భాగ్యాలకూ మూలభూతమయిన భాగ్యం ఇదే అని తెలుస్తోంది. అన్నిటినీ సృష్టించే బ్రహ్మను సృష్టించిన నాభికమలాన్ని చూస్తే ఈ శ్రీహరి తేజస్సే మూడు మూర్తుల తేజస్సులకూ మూలమైన తేజస్సు అని తెలుస్తోంది. శ్రీహరి పాదాలనుండి పుట్టి అన్నిటినీ పవిత్రం చేసే గంగను చూస్తే శ్రీహరియే అఖండ పుణ్యం అని తెలుస్తోంది; అటువంటి శ్రీవత్సకౌస్తుభాదులతో ఇంతని చెప్పవీలుకాని; పుట్టుకలేని, వ్యక్తంకాని; నాశంలేని; అన్నిటినీ సంతోషింపచేసే శ్రీహరి ప్రకాశించాడు.

ఈ విధంగా జగత్తులను మోహింపచేసే సౌందర్యంకల శ్రీహరియొక్క దయాపూర్ణమయిన చూపులు ప్రసరించేసరికి దేవతలకు మహానందం కలిగింది. వారందరూ శ్రీహరికి సాష్టాంగ దండప్రణామాలు చేసి దోసిలి నుదుటచేర్చి నమస్కరించి ఈ విధంగా అన్నారు.

ఓ ఆదిపురుషుడా! దుర్లభాలైన స్వర్గాది ఫలాలను పుట్టించే సామర్థ్యంకల నీకు నమస్కారం.

యోగీశ్వరుల స్తుతులందుకొనే నీకు నమస్కారం. శార్‌ఙ్గమనే విల్లుకల నీకు, కుండలములచేత అలంకరింపబడిన నీకు; భయంకరమైన యుద్దాలు చేసే నీకు, గజరాజును రక్షించిన నీకు; రాక్షసులను సంహరించే నీకు; పూర్ణచంద్రబింబం వంటి ముఖం కల నీకు; భయంకరమైన తేజస్సుకల నీకు; పుణ్యకర్మలే ప్రధానంగా కల నీకు; వైకుంఠమే స్థానంగాకల నీకు; ఆశ్రితులను రక్షించడంలో శ్రద్ధకల నీకు; ఆదిశేషుడే శయ్యయైన నీకు దండం.

ఓ శ్రీహరీ! యుద్ధంలో దేవతలు వృత్రునికి వశమైపోయారు. ఆకాశసంచారులు చెల్లాచెదరైపోయారు. సాధ్యులు కృశించిపోయారు. పన్నగులు; యక్షులు వృత్రునిచేతిలో ఓడిపోయారు. మిగిలిన వారినైనా ఆపదలనుండి గట్టెక్కించు.

వినాశానికే వినాశమైన ఓ శ్రీహరీ! సమూలంగా నశించిపోయిన రాక్షసులకు తిరిగి ఊపిరిపోసి, మాకు కష్టాలు కలిగిస్తూ, తుది మొదలు తెలియనంతగా మహాకాయుడైపోయిన ఆ రాక్షసుణ్ణి అంతంచెయ్యి.

అందరికి దిక్కైనమాకు ఇపుడు కాలు ఊనుకోవడానికి కూడా చోటు లేదు. మా దీనదశచూచి మాకు శరణు అనుగ్రహించు. దిక్కులేనివారికి నీవే దిక్కు.

ఓ పద్మనాభా! నీ భక్తులు కానివారు గతిలేనివారే. ఇహపరాలలో సుఖించాలనుకొనేవారికి నిన్ను శరణుపొందటమే కర్తవ్యం.

ఓ శ్రీహరీ! వృత్రుడు మా తేజస్సుల్నీ మా ఆయుధాల్నీ మ్రింగి, ముల్లోకాల్నీ మింగడానికి చూస్తున్నాడు. భీకరాకారం గల వాడి మదం అణచి; మా ఆపద తొలగించు.

ఓ పరమపురుషా! దుఃఖనాశకా! పరమేశా! భక్తవరదా! కృష్ణా! పుట్టుకలేనివాడా! పద్మాలవంటి కన్నులు కలవాడా! నిన్ను శరణుపొందుతున్నాం. మా భయాన్ని పోగొట్టి రక్షింపుము.

భగవంతుడవైన నారాయణా! వాసుదేవా! ఆదిపురుషా! గొప్పమహిమకలవాడా! పరమమంగళ స్వరూపా! గొప్పశుభాలనిచ్చేవాడా! పరమహంసపరివ్రాజకులు, గొప్పదైన ఆత్మనిష్ఠకలవారు. ఆత్మనిష్ఠయందలి ఏకాగ్రతచేత వారి అంతఃకరణాలు పరిశుద్దాలవుతాయి. వాటిలో సర్వసంగ పరిత్యాగుల ధర్మాలైన పరమశాంతి; ఇంద్రియ నిగ్రహం మొదలయినవి ప్రకాశిస్తాయి. వాటి ప్రభావంచేత చిత్తం అనే మోక్షద్వారానికున్న అజ్ఞానపు తలుపులు తెరుచుకొంటాయి. అక్కడ ఆత్మకాంతి మాత్రమే ఉంటుంది. ఆ కాంతిలో ఆత్మగోచరిస్తుంది. ఆత్మానందం అనుభవానికి వస్తుంది. ఆత్మానందానుభూతిరూపుడవే నీవు. ఆత్మలోభాసించే శరీరాదుల ఉత్పత్తి స్థితిలయాలకు కారణం నీవే. నీవు సామాన్య జీవునివలె లోకంలో త్రిగుణకార్యాలయిన శరీరాదులయందు ఆత్మభావం కలవాడవై; పరాధీనుడవై పుణ్యపాపాలను చేసి వాటి ఫలాలైన సుఖదుఃఖాలను అనుభవిస్తావు. షడ్గుణైశ్వర్య సంపన్నుడవైన నీవు ఆత్మయందే క్రీడించేవాడవు అయినా అపరిమిత గుణాలకు ఆశ్రయమై ఉన్నావు. ఈశ్వరుడవైన నీమాహాత్యం ఊహింపశక్యంకానిది. తెలిసికొనశక్యం కానిది. కొత్త కొత్త వికల్పాలు, వితర్కాలు, విచారాలు మొదలయిన ప్రమాణాభాసలతో కూడి జటిలమైన కుతర్కాలలోపడి కర్మశప్రజ్ఞలుకల విద్వాంసులు మొండి పట్టుదలతో వాదించుకొంటూ ఉంటారు. ఆ వివాదాలలో ఉన్నావని లేవని వాదనలు చోటుచేసుకుంటాయి. మాయామయుడవైన నీవు ఆ వాదనలకు అందేవాడవు కాదు. నీవు సమవిషమరూపాలలో ప్రవర్తిస్తూ ఉంటావు. తాడునందు పాము అని భ్రాంతి కలిగినట్లు నీయందు ప్రపంచభ్రమ కలుగుతోంది. నీవు సమస్త జగత్తునకూ కారణం. సర్వప్రాణులకూ అంతరాత్మవు నీవు. అందువలన అనేకగుణాలు కలిగినట్లు కన్పిస్తావు.

నీ మహిమ అపారమైన అమృతసముద్రం. భాగవతులు ఆ సముద్రంలోని ఒక చుక్కరుచిచూచి అఖండానందాన్ని అనుభవిస్తారు. ఆ ఆనందపారవశ్యంవలన కన్నవాటివలనా విన్నవాటివలనా కలిగే కించిత్తు సుఖాన్ని లెక్కచెయ్యరు. నీ పాదసేవను విడిచిపెట్టరు.

ముల్లోకాలలో నిండి ఉండే మహానుభావా! మూడడుగులతో ముల్లోకాలను ఆక్రమించినవాడా! ముక్కంటీ! నీ మహిమ ముల్లోకాల మనస్సును హరించేది. దనుజాదులు నీ విభూతిభేదాలే. వారి అంత్యకాలం ఆసన్నమయిందని తెలిసి నీ మాయాబలంతో దేవతగానో, మనుష్యునిగానో, జంతువుగానో, జలచరంగానో ఇంకా అలాంటి రూపాలతో అవతరించి వారిని తగినవిధంగా శిక్షిస్తావు.

ఓ భక్తవత్సలా! నీ ముఖపద్మంనుండి వెలువడే తియ్యని వచనామృత తరంగాలతో నీ దాసులమైన మా హృదయతాపాన్ని ఉపశమింపచెయ్యి. ఈ జగత్తుయొక్క సృష్టి స్థితిలయాలకు కారణమయిన మూలప్రకృతి(మాయ)నీకు అధీనమై ఉంటుంది. సృష్టిలోని సమస్తప్రాణులకు లోపల ప్రత్యగాత్మగా బయట పరమాత్మగా వెలుగొందేది నీవే. ఆ పరమాత్మ స్వరూపమే అయిన మూలప్రకృతి రూపాలయిన దేశం కాలం, దేహం, అవస్థలు. వీటికి మూలకారణమయిన దాని అనుభవంకలిగి అన్ని అనుభవాలకూ అన్ని విషయాలకూ సాక్షివై పరబ్రహ్మస్వరూపుడవైన నీకు మేమేమని మనవి చేసుకోగలం.

సమస్తవిశ్వానికీ ఆశయం నీవు. అనేక దుఃఖాలతో కూడి ఉండే సంసారపుతాపాన్ని ఉపశమింపచేసే నీ చరణ పద్మాల్ని మేము ఆశ్రయిస్తున్నాం. అని స్తుతించి ఈ విధంగా అన్నారు.

ఓ జగత్రభూ! యుద్ధం ఆరంభంకాగానే క్రమంగా వృత్రాసురుడు మా పరాక్రమాన్ని మా ఆయుర్దాయాన్ని మా ఆయుధాల్ని కబళించివేశాడు. ఇంక మాకు విజయం ఎక్కడ?

చాలా అందంగానూ నేర్పుగానూ భక్తితోనూ దేవతలు చేసిన స్తుతివిని శ్రీహరి అమృతంలాంటి మాటలతో గంభీరంగా ఈ విధంగా అన్నాడు.

నన్ను స్తుతించేందు కుపయోగించిన మీ జ్ఞానానికి నేను సంతోషించాను. సంతృప్తి చెందాను. నామీద కలిగిన భక్తి ఎప్పుడూ వ్యర్థంకాదు.

నారాయణ దేవుడు తనను కలసి వృత్రహింసలబారినుండి తమకు విముక్తి కల్పింపమని వేడుకొన్న ఇంద్రాది దేవతలతో అన్నమాటలివి.

“నేను లెస్సగా ప్రీతి చెందితే నానుండి నా భక్తులు సర్వమూ పొందగలరు. నానుండి వారు పొందరానిది ఏదీ ఉండదు. అదీగాక నన్ను పొందడమే తనకు గొప్పలాభంగా కలిగినవాడు ఇతర వరాలు యాచించడు. లోకంలోని వస్తుస్వరూప స్వభావాలు సంపూర్ణంగా గుర్తెరిగినవాడు విషయసుఖాలనుండి విరక్తుడౌతాడు. వైరాగ్యంతో సంసార జీవనానికి దూరంగా నిలుస్తాడు. అందువల్ల మీకు మేలు కలుగుతుంది. దధీచి అనే పేరుగల ఋషి ఉన్నాడు. ఆయన శరీరం నా శక్తితో కూడి, మిక్కిలి ప్రభావవంతమై ఉంది. అతణ్ణి యాచించి ఆ శరీరాన్ని పొందండి. అతడు గొప్ప దానశీలి.

పూర్వం అతడు అశ్వినీదేవతలకు అశ్వశిరోనామమనే విద్యను ఉపదేశింపగా, వారు జీవన్ముక్తులయ్యారు. దేవశిల్పి అయిన త్వష్టకు కుమారుడైన విశ్వరూపునకు నారాయణాత్మకమైన కవచాన్ని కూడా ఆ దధీచి ఇచ్చాడు. కాబట్టి అశ్వినీ దేవతలు ప్రార్థిస్తే, తప్పకుండా తన శరీరాన్ని దానం చేస్తాడు. అతని ఎముకలతో విశ్వకర్మ నూరుఅంచులుగల ఆయుధాన్ని నిర్మించి ఇస్తాడు. అది నా శక్తితో కూడినదై, వృత్రాసురుని శిరస్సును ఖండించడానికి సమర్థమై ఉంటుంది. ఆ పిదప మీరు మరల మీ మీ తేజోవిశేషాలతో వెలుగుతూ పూర్వ వైభవాన్ని పొందగలరు.

లోకంలో నా భక్తవరేణ్యులు ఎవరికైనా అజేయులుగా నిలుస్తారు. మీకు మేలు కలుగుతుంది" అంటూ దేవుడు అదృశ్యుడైనాడు. తరువాత, దేవతలు దధీచిమహర్షిని దర్శించారు. అపుడు ఇంద్రుడు దధీచితో ఇలా అన్నాడు.

ప్రాణిలోకం శరీరం పొందిన వెంటనే సుఖంకోసం ఆరాటపడుతుంది. అది లోకనైజం. జీవి తన దేహాన్ని జీవితాంతాన తప్ప మరెప్పుడూ విడువడు - విడువలేడు; కాని, ఓ దధీచీ! దేహవంతుడా! మేము దేవతలం. మా దేహాలకోసం - ప్రాణాలకోసం- సుఖాలకోసం నీ దేహాన్ని యాచిస్తున్నాము. ఇయ్యవయ్యా మహాత్మా!

ఏ లోకాలలోనూ, ఎవ్వరుగాని, ఎప్పుడుగాని కోరని ఒక కొత్త కోరికను, నేడు మా ఆపదల నుండి రక్షించుకోవడం కారణంగా కోరడానికై నీ దగ్గరకు వచ్చా. దైవనిర్ణయంకాక ఇది మేము కల్పించుకొన్నది కాదు. మేము చేసే ఈ యాచన దాతను తొక్కివేసేది. ఇలాంటి యాచన లోకాలలో ఎవరైనా తమను తాము అసహ్యించుకోకుండా చేయగలరా? చేయలేరు.

తెలివితేటలు ఎన్ని ఉన్నా ఎవరైనా అడుక్కోవడం హీనమైన పని అని తెలిసికూడా, అడగగూడని దాన్ని అడిగితే, అలాంటివారు యాచకులలో హీనులుగా చూడబడరా!

మహాత్మా! దధీచీ! లోకంలో యాచకులెవరైనా యాచన సమయాన ఇంగితజ్ఞానం కలిగి అడుగరాని వాటినిగాక అడుగదగినవాటినే యాచిస్తారు. మేము మాత్రం అడుగరానిదగు మీ శరీర సర్వస్వాన్ని అడిగాము. అర్థులకు జాలి, దయ ఉండవు గదా!

దేవతల పల్కులు విన్న దధీచి తన దేహం దేవకార్యం కోసం ఉపయోగపడనున్నదని తెలిసి లోపల ఆనందించాడు. కానీ, ఆ ఆనందపు గుర్తులు కనిపించకుండా నవ్వుతూ, ఓ దేవతలారా! మీరేనాడయినా మీ మనస్సులలో జీవులకు గలిగే అపమృత్యుభయాన్ని గూర్చి దయతోనయినా ఆలోచించారా? అంటూ ప్రేమతోనే భావపూర్ణ వాక్యాలతో ప్రసంగించాడు.

బ్రతుకుమీద ప్రీతితో జీవించాలని కోరుకునేవారికి దేహమే గదా ప్రీతిపాత్రం. బ్రతుకు దేహంమీదే గదా కొనసాగేది. అటువంటి దేహాన్ని స్వయంగా నారాయణుడు వచ్చి యాచించినా ఇచ్చేవారు ఉంటారా! ఉండరు.

అంతే కాక, లోకాన ఎక్కడైనా డబ్బునో కాక, ఒక ప్రయోజనాన్నో యాచించేవారు ఉంటారుగాని దాతను తన దేహాన్నే ఇమ్మని కోరే యాచకుడు ఉంటాడా? దాతలయినా అర్థుల కోర్కెలు తీర్చేవారు ఉంటారుగాని, తమ దేహాలను వస్తువులవలె అర్థికి అర్పించేవారు ఉంటారా? ఒకవేళ దాత తన శరీరాన్ని ఇచ్చినా, యాచకుడు అతనిని చంపగలడా? అంతటితో ఆగక ఆ శరీరంలోని ఎముకలను ఏరుకొని పంచుకొనే బీచ్చగాండ్రు లోకంలో ఉన్నారా? అయినా లోకాలను రక్షించే దేవతలు స్వయంగా హింసకు తలపడటం ఎట్లా సంభవించింది? ప్రాణం తమకు ఎంత ప్రియమో ఎదుటివారికీ అంతే ప్రియమని అనుకోవద్దా?

దధీచి మాటలకు దేవతలు ఇలా అన్నారు "మహర్షీ! మీవంటివారు ప్రాణులన్నింటియెడ దయాగుణం కలిగి ఉంటారు. పవిత్రమైన వర్తనం మీది. మీరు సత్కీర్తిని కోరుకుంటారు. గొప్ప బుద్ధిగలవారు. అటువంటి మీకు ఈయరాని వస్తువంటూ ఒకటి ఉండదు.

యాచకుడు అడుగరానిదానినైనా అడుగుతాడు. ఇచ్చే దాత యాచకునితో వాద ప్రతివాదాలకు దిగడు. యాచకుడు ప్రాణమడిగినా ఇచ్చేస్తాడే గాని, దాత దాచుకోడు.

దేవతలు స్వార్థ దృష్టితప్ప ఎదుటివారి కష్టాన్ని పట్టించుకోకుండా ఋషిశరీరాన్ని యాచిస్తే, ఋషి లోకస్వభావం ఎరిగినవాడై ఉండికూడా చిరునవ్వుతో ఒకింతసేపు వారితో యాచనను గూర్చి యాచకుని గూర్చి వాదించి చర్చించి, తరువాత 'ఎపుడైనా వదలక తప్పని ఈ దేహాన్ని దేవకార్యంకోసం త్యజించడం నాకు సమ్మతమే. ప్రాణం పోయిన పిదప కాకులు కుక్కలు నక్కలు - వంటివాటి పాలుగాకుండ, కష్టాలకు దైన్యాలకు పాత్రమైన ఈ దేహం ఒక మహాప్రయోజనంకోసం త్యజించడం మేలేగదా' అంటూ, తన ఆత్మను పరమాత్మలో నిలిపి, యోగశక్తితో తన శరీరాన్ని వదలివేశాడు. వెంటనే విశ్వకర్మ ఆ శరీరంలోని ఎముకలతో 'వజ్రము' అనే నూరంచుల ఆయుధాన్ని నిర్మించి ఇంద్రునకీయడంతో, అతడు వజ్రాయుధధారియై, దైవదత్తమైన తేజంతో వృద్ధి పొందింపబడినవాడై, ఐరావతమెక్కి దేవజాతులు - గరుడ గంధర్వ కిన్నర కింపురుషాది సైన్యబలాలతో కూడి, మునులు పొగడగా, ముల్లోకాలకు ఆనందం కలిగిస్తూ, వృత్రాసురుని మీదికి దండెత్తి వెళ్లాడు. అప్పుడు

దేవ వృత్రాసుర సంగ్రామము

No comments:

Post a Comment

The Story Of Savitru Genealogy - సవితృవంశ ప్రవచనాది కథ

సవితృవంశ ప్రవచనాది కథ ఓ రాజా! విను. త్వష్టయొక్క వంశం గూర్చి నీకు వివరంగా చెప్పాను. తరువాత సవిత పృశ్ని, సావిత్రి, వ్యాహృతి అనే భార్యలయందు పశు...