Wednesday, March 18, 2026

Gajendra Prayeing of Surrender - గజేంద్రుడు సర్వాంతర్యామిని రక్ష కోరి ప్రార్థించుట

గజేంద్రుడు సర్వాంతర్యామిని రక్ష కోరి ప్రార్థించుట

ఏ విధంగా ఈ మొసలిని గెలవగలను? ఇకపైన ఏ దేవుని ప్రార్థించేది? ఎవరిని రక్షించమని పిలిచేది? దొడ్డదైన ఈ మొసలి పరాక్రమాన్ని అడ్డగించేవారు ఎవరూ లేరా! అన్ని కార్యాలను సాధించేవారు, పుణ్యాత్ములైన మహానుభావులు ఎవరూ దిక్కులేని ఈ నా మొరను ఆలకించేవారు లేరా! ఉంటే వారికి నమస్కరిస్తాను.

(తాను శక్తిహీనుడనని గుర్తించటమే తరించడానికి మొదటిమెట్టు. శరణాగతికి మూల మీ భావనే.)

ఈ అడవిలో చాలాకాలంగా పెక్కు ఏనుగుల సమూహాలు నన్ను గౌరవిస్తూ వస్తున్నాయి. పది లక్షల కోట్ల ఆడ ఏనుగులకు అధినాథుడుగా ఉన్నాను. నా దాన జలధారలతో ఏపుగా పెరిగిన ఈ మంచి గంధపు చెట్ల నీడల్లో హాయిగా ఉండకుండా ఈ నీరాశ ఎందుకు పుట్టాలి? ఈ మడుగుకే ఎందుకు రావాలి! భయం పుడుతోంది. భగవంతుడా! ఇక నా గతి ఏమవుతుందో?

ఈ జగత్తంతా ఎవనివల్ల పుడుతోందో; ఎవని లోపల అణగి ఉంటుందో; ఎవనిలో లీనమై పోతోందో; ఎవడు పరమాత్ముడో, ఈ విశ్వానికి మూలకారణం ఎవడో, ఎవనికి పుట్టుక, పెరుగుదల, వినాశం, ఉండవో, ఎవడు అన్నీ తానే యై ఉంటాడో, తనంతట తానుగా ఎవడు పుడతాడో, ప్రభువైన ఆ విశ్వనియామకుణ్ణి శరణు కోరుతాను.

ఒకసారి ఈ లోకాలను సృష్టిస్తాడు. ఇంకోసారి తనయందు లీనం చేసుకొంటాడు. అదీ ఇదీ రెండూ తానే. అన్నిటినీ చూస్తూ ఉంటాడు. కాని దేనిచేత మలినపడని శుద్ధసత్వుడాయన. ఆత్మలకు మూలమైన పరమాత్మ స్వరూపం తనది. అతనినే ధ్యానిస్తాను.

ఈ లోకాలు, లోకపాలకులు, లోకాలలో ఉండేవారు అందరూ నశించిన తరువాత కూడా లోకరహితమైన కారుచీకట్లకు ఆవల అఖండతేజోరూపంగా నిత్యం ఎవడు ప్రకాశిస్తూ ఉంటాడో ఆ పరమాత్మను భావించి సేవిస్తాను.

ఏ దేవుడు నటుడిలాగా పెక్కు రూపాలతో నటిస్తాడో, ఋషులు, దేవతలు ఎవనిని స్తుతింపజాలరో, ఎవని ప్రవర్తన ఇతరులకు అగోచరంగా ఉంటుందో, అలాంటి పరమపురుషుని స్తుతిస్తాను.

ప్రపంచంలోని అన్ని బంధాలను వదిలి వేసిన ఋషులు, భగవద్దర్శనం కోరే పుణ్యాత్ములు, సకల ప్రాణుల మేలు కోరే సాధువులు, మంచి మనస్సున్నవారు, సాటిలేని వ్రతాలు ఆచరిస్తూ ఎవనిని అర్చిస్తారో ఆ దివ్య పదస్థానీయుడైన పరమపురుషుడే నాకు దిక్కు అతడే నన్ను కాపాడుగాక!

ఎవరు పుట్టుక, పాపం, రూపం, కర్మ నామ గుణాలు లేనివాడైనా లోకాలను సృష్టించడానికి, నశింపచేయడానికి ఆత్మ మాయాశక్తితో వీటినన్నింటినీ పొందుతున్నాడో, ఆ సార్వభౌమునికి, అనంతశక్తిమంతునికి, సకలసృష్టి కర్తకు, పుణ్యమూర్తికి, రూపాతీతునికి, చిత్రప్రవర్తన శీలం గలవానికి, సకల సాక్షిభూతునికి, ఆత్మకాంతితో ప్రకాశించే వానికి, ఆత్మమూలునికి, పరతత్త్వానికి, మాటలకు, ఊహలకు, జ్ఞానానికి అందనివానికి, పరిశుద్దునికి, కేవలం సత్త్వగుణంతో సమీపించగలవానికి, ఫలాపేక్ష రహితంగా కర్మను చేసే నేర్పరిని అభినందించే వానికి, నేను నమస్కరిస్తాను.

పరమాత్ముడు శాంతస్వరూపం గలవాడు. మోక్షమార్గ ప్రదాత. మోక్షస్థానానికి (వైకుంఠానికి) అధిపతి. స్వపరభేదం లేనివాడు. దుష్టులకు ఘోరస్వరూపంతో దర్శనమిస్తాడు. అతని తత్త్వం చాలా నిగూఢమైనది. గుణాలద్వారా అతని ధర్మాన్ని గుర్తించగలం (రూపాలద్వారా కాదని అర్ధం) సౌమ్యస్వభావుడాయన. అతని జ్ఞానం అతీతమైనది. అఖిలేంద్రియ వ్యాపారాలను చూస్తాడాయన. అన్నిటినీ గమనిస్తుంటాడు. సర్వజ్ఞు డా ప్రభువు. దయామయుడు. సర్వానికీ మూలమతడే. ఆత్మకు ఆధారమూ అతడే. ఇంద్రియ జ్ఞాపకుడు ఆయనే. దుఃఖాలను ఉపశమింపచేసేవాడూ ఆయనే. నిండుగా మాయ అనే నీడతో పాటు ప్రకాశిస్తుంటాడు. ఏకాంతమూర్తి ఆయన. అతనికన్నా ఉత్కృష్టులు ఎవరూ లేరు. అన్నిటికీ కారణభూతుడతడే. అతని ఉనికికి మాత్రం ఏకారణమూ లేదు. అలాంటి ప్రభువును నన్ను కాపాడుమని నమస్కరిస్తాను.

(విష్ణసహస్రనామంలో ఈ లక్షణాలన్నిటినీ వ్యాసమహర్షి వివరించి ఉన్నాడు. విష్ణునామాలన్నీ గుణవాచకాలే. అంచేత ఆయన 'గుణధర్మి!' ఇంద్రియాలను నియమిస్తాడు - కాబట్టే 'ఉపేంద్రు' డని అంటారు. 'గూఢ' తత్త్వం కాబట్టే భగవద్రహస్యాన్ని 'రాజగుహ్య' యోగమన్నారు. 'నిష్కారణతత్త్వం' - అనగా భగవంతుని ఉనికిని తర్కంతో నిరూపించలేమని అర్ధం. అందుకే 'నామమీయమానా' (తర్కంతో ఊహించలేము) అని అన్నారు. అందుకే వ్యాసభగవానుడు 'నిష్కారణాయాద్భుత కారణాయ' (8-3-15) అని ఆ కారణం కాని కారణం ఒక 'మహాద్భుత' మన్నాడు. భగవంతుడు ఈ అద్భుతానికి వ్యక్తీకృతి.)

యోగీంద్రులు యోగమనే అగ్నిలో తమ కర్మలను కాల్చివేసి, ఇంకాదేనినీ తలుచుకోకుండా ఏకాగ్రతలో బాగా కుదిరిన యోగంచేత ప్రకాశిస్తున్న మనస్సుల్లో ఏ దేవదేవుని సదా చూస్తుంటారో, ఆ పరమపురుషుణ్ణి నేను సేవిస్తాను.

పరమాత్ముడు అన్ని ఆగమాలకు వేదాలకూ సముద్రంలాంటివాడు. మోక్షస్వరూపుడాయన. ఉత్తమ గుణాలకు ఆలవాలం. సృష్టి లయాలలో రెండింటా ప్రవర్తించేవాడు ఆయనే (గుణాల విధ్వంసంచేత సృష్టించి, కార్యాలలోని నిరాసక్తత చేత లయింపచేసే తత్త్వమున్న వాడు); దిక్కులేని నాలాంటి జంతువుల పాపాలను పోగొట్టే వాడాయనే. అందరిలోనూ అంతరాత్మగా వెలిగే వాడూ అతడే. అవ్యయుడు, పూజింపదగ్గ భగవద్రూపుడు కూడా ఆయనే. భార్యాపుత్ర పశు ఆలయాలమీద ఆసక్తిలో మునిగిన వారికి ఎప్పుడూ ఆయన లభించడు. అలాంటి ఆ మహానుభావునికి నమస్కారాలు.

అని ఇంకా ఇలా ఆలోచించాడు.

ఎవనిని సేవించడం ద్వారా ధర్మార్థకామాలను విసర్జించి పండితులు తాము కోరిన వరాలను పొందుతారో; ఎవడు తనను సమీపించిన అంకిత భక్తులకు నాశనంలేని శరీరాన్ని ప్రసాదిస్తాడో, బంధ విముక్తులు నిరంతరం పూనుకొని ఎవరిని ధ్యానిస్తూ ఉంటారో, ఆనంద సముద్రంలో మునిగి ఉండే అంతరంగ భక్తులు (స్వామివారి నుండి) ఏమీ ఆశించకుండా ఎవని దివ్యభవ్య చరిత్రను ప్రేమతో గానం చేస్తుంటారో; ఆ మహాదేవుడే ఇన్నింటికీ ఆద్యుడు. కంటికి కాని రానివాడైనా అన్నిటికీ ప్రభువతడే. అధ్యాత్మ యోగంచేత మాత్రమే అతనిని పొందగలం. అతడు పరిపూర్ణుడు. మహోన్నతాత్ముడు. పరబ్రహ్మ స్వరూపుడాయన. అతడే సర్వశ్రేష్టుడు. ఇంద్రియాతీతుడు అతడే. బ్రహ్మాండనాయకుడతడే. స్థూలసూక్ష్మ రూపాలతో వెలిగే ఏకైక తత్త్వం ఆయనే. అతనినే నేను సేవిస్తాను.

ఇంకా ఈ విధంగా భావించడం మొదలు పెట్టాడు.

అగ్ని జ్వాలలను, సూర్యుడు వెలుగులను ప్రసరింపజేసి మరలా శమింపచేసే విధంగా; ఎవరు తన కిరణాలచేత బ్రహ్మాది దేవతలను, జీవ సముదాయాలను, లోకాలను, నానా రూప నామభేదాలతో పుట్టించి తరువాత తానే తగిన విధంగా లయింప చేస్తున్నాడో, మనస్సూ, బుద్ధీ, ఇంద్రియాలూ తానే అయి ఎవడు గుణ ప్రవాహరూపంలో ప్రవర్తిస్తాడో, ఎవడు స్త్రీ నపుంసక భేదాలకూ నరసురజంతు రూపాలకూ గుణ కర్మభావాలకూ అతీతంగా ఉంటూ; ఉన్నదీ - లేనిదీ అయిన రెండింటినీ బయటికి తెలియకుండా ఉంచి - తరువాత అన్నీ అయి ప్రకాశించే అట్టి పరంధాముని నేను ధ్యానిస్తాను.

దీనులను కాపాడటానికి భగవంతుడు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడని అంటారే. ఉత్తమ యోగుల సమీపంలో నిరంతరం ఉంటాడని అంటారే. అన్ని దిశలలోనూ ఉన్నాడంటారే. అలా ఉన్నాడు, ఉన్నాడు - అని చెప్పబడుతున్నవాడు ఉన్నాడో లేడో - అనే సందేహం కలుగుతోంది.

కలిమిలేమి చూడకుండా సాక్షాత్కరించే దేవుడు నేడు నా పాలిట ఉన్నాడా అని సందేహిస్తుండగా సాక్షాత్కరించడా! (నా సందేహం తీరిపోవునట్లు) దుష్టులచేత సాధువులు బాధింపబడుతున్నపుడు వారికి తప్పక అడ్డు పడుతాడే - నాకు రక్షణగా రాకుంటాడా!; నేత్రాలతో మాత్రమే కాక, అంతర్జగత్తులో ఆయననే దర్శించే వారిని కాపాడే ఆ ప్రభువునా కష్టాన్ని చూడకుండా ఉంటాడా! దీనుల మొరలు వింటూ తన్ను తాను మరిచిపోయే ఆ దయాళువు నా మొరను సులువుగా వినకుండా ఉంటాడా! అన్ని రూపాలు అతనివే. ఆయనకు ఆదిమధ్యాంతాలు లేవు. అంతటా ఆయనే వ్యాపించి ఉన్నాడు. భక్తులకు, దిక్కులేని వారికీ ఆయనే దిక్కు నా మొరను వినడా! నా స్థితిని చూడడా! నన్ను రక్షింప తలపడా! నన్ను కాపాడటానికి వేగంగా రాడా! - (తప్పక వస్తాడన్న భావన పెరుగుతోంది)

లోకాన్ని సృష్టించి లోకానికి దూరంగా ఉంటూ; అంతరాత్ముడై, లోకం చేత తెలియదగినవాడు, లోకమే తాను అయికూడా లోకాతీతుడుగా ఉండేవాడు; శాశ్వతుడు; పుట్టుక లేకుండా అన్నిటినీ పుట్టించే వాడు; జగదీశ్వరుడు, పురుషోత్తముడు అయిన (శ్రీమన్నారాయణుని) పరమాత్ముని నేను ఆరాధిస్తాను.

ఈ విధంగా అంటూ; ఆ గజేంద్రుడు అక్కడికక్కడే భగవత్సన్నిధిని తన మనస్సులో కల్పించుకొని ఇలా ప్రార్ధించాడు.

భగవంతుడా! ఇక నా దేహంలో ఏ శక్తీ లేదు. ధైర్యం సన్నగిల్లిపోయింది. పంచప్రాణాలు సడలిపోతున్నాయి. మూర్చ వస్తోంది. శరీరం డస్సిపోయింది. బాగా అలసిపోయాను. నీవు తప్ప మరో దిక్కునాకు లేదు. ఈ దీనుని క్షమించి ఆదుకో! దేవాధిదేవా! రావయ్యా! కోరిన వరాలిచ్చే దొరా. రక్షించవయ్యా!, పుణ్యాత్ముడా! నన్ను కాపాడవయ్యా!

ఓ దయాసాగరా! ప్రాణులందరి మాటలూ వింటావంటారు. నీవు ప్రవేశించరాని చోటే లేదంటారు. శరణార్థులు పిలవగానే వెంటనే 'ఇదిగో' అని సమాధానమిస్తావంటారు. అన్నిటిని చూస్తూ ఉంటావట గదా! శాస్త్రాలు చెప్పే ఇవన్నీ నిజమేనా! అనే సందేహం కలుగుతోందయ్యా!

ఓ లక్ష్మీవల్లభా! వరాలిచ్చే దొరా! స్వపరభేదాలు లేనివాడా! అయ్యో! నా బాధ ఏమని చెప్పను! కవులు యోగులు చేసే స్తుతులు అందుకొంటావే. నీవు ఉత్తమ గుణాలు కల్గినవాడివే. శరణుగోరిన వారిని అభిమానిస్తావే! నీ మహిమ చాలా నిర్మలమైనదే. రారాదా! కరుణ చూపరాదా! నన్ను గురించి పట్టించుకోరాదా! శరణు అంటున్నానయ్యా! నన్ను రక్షించవా! (రక్షించుస్వామీ అని ప్రాధేయపడ్డాడు)

ఈ విధంగా ప్రార్థించి ఇంకా ఏ రక్షణా లేనివానికి రక్షణ నిచ్చేటటువంటి భగవంతుడే ఆపదలో ఉన్న నన్ను ఇప్పుడు కాపాడుగాక! అని ఆకాశంవైపు నిక్కిచూస్తూ, నిట్టూర్పులు విడుస్తూ, అంతటా చెవులు అప్పగించి, ఘోరంగా ఆక్రోశిస్తున్న సమయంలో

గజరాజు చేసిన ఈ మొరను బ్రహ్మాది దేవతలందరూ విన్నారు. కాని వారికి విశ్వమంతటా వ్యాపించే లక్షణం లేనందున ఊరికే ఏ సాయమూ చేయలేక ఉండిపోయారు. విశ్వమయుడు, ప్రభువు, సర్వవ్యాపి, సర్వత్ర విజయమే పొందే శ్రీమన్నారాయణుడు ఆ భక్తునికి సాయంగా రాదలిచాడు.

(భాగవతం విష్ణుపారమ్యాన్ని ప్రకటించే గ్రంథం. అందువల్లనే గజేంద్రుడు మొరవిన్న అతని రక్షణకై ఇతర దేవతలు ముందుకు రాలేదని, విష్ణువు ఒక్కడే ఆ పని చేయగలిగాడని ఇక్కడ చెప్పడమయింది.)

అల వైకుంఠపురంబులో నగరిలో నా మూలసౌధంబు దా
పల మందారవనాంతరామృతసరఃప్రాంతేందుకాంతోపలో
త్పలపర్యంకరమావినోది యగు నాపన్నప్రసన్నుండు వి
హ్వలనాగేంద్రము 'పాహి పాహి' యనంగుయ్యాలించి సంరంభియై. 

ఆ సమయంలో ఎక్కడో వైకుంఠంలో అంతఃపురంలో ప్రధానమైన మేడ ఎడమ పక్కన ఉన్న మందారవనంలోని 'అమృత' సరస్సున్న ప్రాంతంలో చంద్రకాంత శిలల అరుగుపై కలువలతో కూర్చిన పాన్పుమీద లక్ష్మీదేవితో వినోదిస్తున్నవాడై ఉండగా; భయంతో స్వాధీనం తప్పిపోయిన గజేంద్రుడు కాపాడు! కాపాడు! అని మొరపెట్టగానే ఆ 'కుయ్యి' విని, దాన్ని కాపాడటానికి ఉత్సాహంతో, వేగంతో (సంరక్షణ కార్యాన్ని చేపట్టాడు).

గజరాజు ప్రాణాలను కాపాడాలన్న ఉత్సాహంలో శ్రీమహావిష్ణువు లక్ష్మీదేవికి ఒక మాటా చెప్పలేదు. శంఖచక్రాలను ధరించలేదు. సేవకులెవర్నీ పిలవలేదు. వాహనాన్ని సిద్ధం చేయుమనలేదు. చెవిలోని తామర దుద్దులదాకా జారిన జుట్టు ముడిని చక్కదిద్దుకోలేదు; ప్రణయంతో వెళ్లిపోతున్న లక్ష్మీదేవి పైట కొంగును కూడా వదిలిపెట్టలేదు.

(వ్యాస భాగవతంలో గజేంద్రుని మొరవిని భగవంతుడు గరుడుని అధీష్టించి వచ్చునట్టు వర్ణింపబడి ఉండగా, పోతన భగవంతుని భక్తరక్షణతత్పరత్యములు నొక్కివక్కాణించుటకు వాహనాదులన పేక్షింపకనే తనకు తానుగా వచ్చినాడని వర్ణించినాడు.

భక్తులను కాపాడటంలో దీక్ష కల్గిన వాడు, సకల ప్రాణుల హృదయాలనే కమలాలలో నిరంతరం నివసించేవాడు, అయిన శ్రీమహావిష్ణువు గజరాజు విన్నవించిన నానావిధ వినతులను విని, తన ప్రియురాలైన లక్ష్మీదేవితో సరససల్లాపాలు చాలించి, వేగిరపడి, అన్ని దిక్కులూ పరికించి, గజేంద్రుని రక్షించటమే పనిగా నిర్ణయించుకొని తన ఆయుధ సామగ్రిని స్మరించుకొని వస్తున్నప్పుడు

అలా స్వామి బయలుదేరగానే లక్ష్మీదేవి, ఆమె వెంట అంతఃపుర స్త్రీలు, వారి వెంట గరుత్మంతుడు, ఆయన ననుసరించి శంకచక్రాదులగు ఆయుధ సమూహం; నారదమహర్షి సేనాపతి విష్వక్సేనుడు రాగా, వైకుంఠంలోని అందరూ వారివెంట వరుసగా బయలుదేరి వచ్చారు.

ముఖపద్మంయొక్క తేనె బిందువుల సమూహం కారుటచే ఆనందించు తుమ్మెదలు కలిగిన ఆ లక్ష్మీదేవి శ్రీహరియొక్క కరపద్మంచేత లాగబడుతున్న పైటకొంగు కలదై వెళ్తూ

స్వామివారు తాను వెళ్తున్న చోటు ఏదో చెప్పడు. దిక్కులేక అలమటిస్తున్న ఏ స్త్రీల రోదనలు విన్నాడో! రాక్షసులు మళ్ళీ వేదాలను దొంగిలించారో ఏమో!; మళ్ళీ రాక్షసులు అమరావతిపై దండెత్తారో ఏమో! 'హరి ఎక్కడరా చూపండి' అంటూ భక్తులను ఏ దుర్మార్గులు దండిస్తున్నారో!

(సోమకాసురుడు వేదాలను దొంగిలించాడు (మత్స్యావతార కథ,)
భూదేవి మొరపెడితేనే అవతారాలు దాల్చాడు (రామాది అవతారాలు).
ప్రహ్లాదుని హిరణ్యకశిపుడు బెదిరించింది హరిని చూపుమనే! ఇలాంటి గాథలలో పూర్వాపరాలు ఎలా ఉన్నా పోతనగారి లక్ష్మీదేవి శ్రీనివాసుని ఇల్లాలు కాబట్టి ఆమె త్రికాలాలలోని కథల్ని చెప్పుకోవటంలో ఆశ్చర్యం ఏమీలేదు.)

అని పరిపరివిధాలుగా ఆలోచిస్తూ (ఆయన వెంట వెళ్తోంది).

స్వామి పరుగులు తీస్తుండగా ఆయనవెంట వెళ్తూ ఉన్న లక్ష్మీదేవి చెవిపోగులు కదలాడసాగినాయి. భుజాలమీద కొప్పుముడి చిందులాడుతోంది. స్తనయుగ్మం మీద ఉన్న పైటకొంగు జారిపోతూంది. ఒడ్డాణం వదులయిపోయింది. నుదుటిపూత చెరిగిపోయింది. పైటకొంగు మాత్రం ఇంకా తన ప్రియుడి చేతిలోనే ఉండిపోయింది. స్తనభారం చేత నడుము చిక్కిపోయింది. కాని కోటి చంద్రుల కాంతితో ముఖం మాత్రం ప్రకాశిస్తూనే ఉంది.

భర్తను ఎక్కడికి వెళ్తున్నారండీ! అని అడగాలనుకొని మిక్కిలి వేగంగా వెళ్తుంది. కాని ఆయన మారుమాటలాడడని తెలిసినది కాబట్టి నడకను చాలించి ఆలోచనలో పడుతుంది. తొట్రుపాటుతో నెమ్మదిగా ఒక అడుగు ముందుకు వేస్తుంది. అలా నడిచేప్పుడు జడత్వంతో అడుగు ముందుకు మోపదు.

(లక్ష్మీదేవి సౌగసుచేత ఆమె నడక ముందుకు సాగటంలో ఎన్నో ఆటంకాలు వచ్చాయి. అందుకే నెమ్మదిగా వెళ్తోంది) మేఘశ్యాముని వెంట బయలుదేరి వస్తున్న ఆమె సొగసు మేఘం వెంబడే తళుక్కుమనే మెరుపు తీగచందంగా ఉంది. అలా వెళ్తున్నపుడు నొసటి మీద ముంగురుల్ని సవరించుకోగానే ఆమె ముఖపద్మం మీద తుమ్మెదలు ముసురుకొన్నాయి. ఆ తుమ్మెదల్ని తోలుతుండగానే దొండపండు కాంతితో ప్రకాశిస్తున్న ఆమె పెదవుల్ని చిలుకలు సమీపించాయి. ఆ చిలుకల బారినుండి తప్పించుకోగానే చేపలవంటి తన కన్నులకోసం - కండ్లనే చేపలనుకొని ఆకాశగంగలోని పెనుచేపలు ఎగిసిపడ్డాయి. వాటిని తోలి తప్పించుకోగా, తీగవంటి ఆమె శరీరంతో రాసుకుని ధన్యం కావటానికి మెరుపుతీగలు ఆకాశంలో బారులుతీరాయి. ఆ తీగల్ని అతిక్రమించి ముందుకు సాగగా చక్రవాకాలు ఆమె స్తనయుగ్మాన్ని తాకి మిడిసిపడ్డాయి.

రాక్షసుల జీవితాలనే సంపత్తిని నశింపచేసేవాడు; నిరంతరం కరుణతో వర్ధిల్లేవాడు పరమయోగి జనహృదయాలనే వనంలో ఉండేవాడు; భక్తుల గొప్పదనాన్ని శోభిల్లజేసేవాడు, కొత్త పెండ్లికూతురగు లక్ష్మీదేవికి సేవలు చేసేవాడు, జయశీలుడు, తేజోమయుడు అయిన శ్రీమహావిష్ణువు ఆకాశమార్గంలో వస్తుండగా దేవతలు చూశారు.

ఇలా చూచి.

గజరాజు ఆపదను తొలగించడానికి పరుగున వెళ్తున్న స్వామివారిని, పరివారాన్ని చూచిన దేవతలు: “అదిగదిగో! మహావిష్ణువు వచ్చాడు. పక్కలోనే లక్ష్మీదేవి కూడా - చూశారా! అదే శంఖధ్వని. అల్లదిగో సుదర్శన చక్రం. అదిగో గరుత్మంతుడు కూడా వస్తున్నాడు” అంటూ ఆకాశంలోనే 'నమోనారాయణాయ' అన్న స్తోత్రం పఠిస్తూ ఆ వేడుకను చూశారు.

(నారాయణాయ = నారాయణునికి; నమః= నమస్మారం; “ఓం నమోనారాయణాయి - అన్నది అష్టాక్షరీ మంత్రం. విష్ణుభక్తులకు తారక మంత్రమిదే.)

గజేంద్రుని కాపాడాలన్న తొందరలో ఉన్న స్వామివారు దేవతల నమస్కారాలను స్వీకరించలేదు. మనోవేగంతో ముందుకు సాగిపోయి సమీపంలోనే కరి మకరులు పోరుతున్న ఆ సరస్సును చూశారు. దానిలో శింశుమార చక్రంలో లాగా గొప్ప మొసళ్ళు, ఎండ్రకాయలు, చేపల జంటలు ఉన్నాయి. కుబేరుని కచ్చపమనే ధనాగారంలో లాగా శ్రేష్టమైన తాబేళ్ళు ఉండినాయి. అదృష్టవంతుడి భాగ్యం లాగా అనురాగమనే నీరుంది. వైకుంఠంలో లాగానే శంఖాలు, చక్రాలు, కమలాలు ఉన్నాయి. సంసారచక్రంలో లాగానే సుఖదుఃఖాలవంటి ద్వంద్వాలనే బురద నిండి ఉంది. ఆ సరస్సును చూశాడు.

(శింశుమారచక్రం: జ్యోతిశ్చక్రానికి సంబంధించిన ఖగోళవిశేషం. మొసలి, ఎండ్రకాయ, చేపల జంటల్లాగా నక్షత్రాలు కనిపించే ఒక విచిత్రసన్నివేశం. దీన్ని 'జ్యోతిర్మండలం' అని అంటారు. దీన్ని ఉపాసించటం ఉంది.

తాబేలు: కుబేరుని ధనాగారానికి 'కచ్చప' మని పేరు. అందుకే తాబేలును, చేపను (మత్స్య), మకరాన్ని ధనం కోరేవారు అర్చించే సంప్రదాయం ఉంది.

వైకుంఠంతో పోలికలు: కమల (లక్ష్మి), శంఖం (స్వామివారి పాంచజన్యం), చక్రం (సుదర్శనం) - సరస్సులో శంఖాలు, చక్రవాకాలు, పద్మాలు.

సంసారచక్రం: చక్రనేమి క్రమంలో పునర్జన్మం, మరణం - ఇలా సాగిపోయే ఈ గమనంలో సుఖదుఃఖాలు, మానావమానాలు - ఎడతెగని ద్వంద్వాలు - వీటిలోనే మనిషి తగులుకొంటాడు - అందుకే 'పంక' (బురద) మని అనటం. పంకశబ్దం పాపాన్ని కూడా బోధిస్తుంది.)

దయాసముద్రుడైన శ్రీహరి మొసలిని చంపడానికి సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు. అది దేవతల్ని కాపాడేటటువంటి చక్రం. భూవలయాన్ని తన వేగంతో కంపింపచేయగల శక్తి కలిగినది. దాని అంచుల నుండి పుట్టె అగ్ని కణాలతో ఆకాశంలోని చుక్కల్ని పరాభవించునది. బ్రహ్మాండభాండాల వెలుగుల నడుమ ఎదురులేని సంచారం కలది.

(అంబరశుక్రము - పాలపుంత - నక్షత్రమండలకాంతి అనికూడా అంటారు.)

ఈ విధంగా చక్రాన్ని ప్రయోగించగా.

శ్రీహరి ప్రయోగించిన చక్రాయుధం అత్యంతవేగంతో సరస్సులోకి చొచ్చుకుపోయి అప్పుడే వికసిస్తున్న పద్మాలను కౌగిలించుకోవడానికి వచ్చిన సూర్యబింబంలాగా భాసించింది. నీటిని కలచివేసి 'గుభుల్లు గుభుల్లు' మనే ధ్వనులు పుట్టించింది. ఆ దుర్మార్గమైన మొసలి ఉండే చోటును సమీపించింది.

చక్రాయుధం రివ్వున పోయి అతిభయంకరంగా మొసలి తలను నరికి దాన్ని చంపివేసింది. దాని దేహం మేరు పర్వతంలా మెరిసిపోతోంది. అది అడవి ఏనుగులకు సైతం భయాన్ని పుట్టించే పరాక్రమం కలిగినది. కామ క్రోధాలతో నిండినది. గజరాజు రక్తధారలతో తడిపినడి. అంతులేని ఉత్సాహంతో అలసట లేకుండా గెలుపుపై మనస్సు నిలుపుకొని పోరాడుతూనే ఉంది. అలాంటి మొసలిని చక్రం చంపివేసింది.

ఇలా ఒక రెప్పపాటులో ఆ చక్రం ఆ మొసలి తలను నరికివేసింది. ఆ సమయంలో

ఇలా మొసలిని చక్రం చంపడాన్ని చూచి జగత్తులోని మొసళ్ళన్నీ భీతి పొందాయి. దిక్కున్న చోటుకుపోయాయి. సూర్యునిచాటులో రాశిచక్రంలోని మొసలి; కుబేరుని సన్నిధిలో మరోమొసలి (మకరనిధి) ఆదికూర్మం చెంత సముద్రంలోని మొసళ్ళు దాక్కున్నాయి.

ఆ మొసలిపట్టు నుండి విడువడిన గజరాజు ఉత్సాహంతో కాళ్ళు కదిలించాడు. కారుచీకటి నుండి వెలువడిన చంద్రుడిలాగా, సంసార బంధాలనుండి విముక్తి పొందిన సంసారిలాగా (విరక్తునిలాగా) కనిపించాడు. ఆదరంతో ఆడ దిగ్గజాలు తమ తొండాలతో అమృతజలంతో గజరాజును అభిషేకించాయి. ఆ జలాలలో స్నానంచేసి గజేంద్రుడు అలసట తీర్చుకొని నిజ సౌందర్యంతో ప్రకాశించాడు.

అంత శ్రీహరి విజయ సూచకంగా పాంచజన్యమనే తన శంఖాన్ని పూరించాడు. ఆ శంఖం దయాగుణానికి సముద్రం లాంటి ఔదార్యం కల్గింది. తన అద్భుతమైన ధ్వనిచేత పంచభూతాల ప్రకృష్ట చైతన్యాన్ని కదిలించి పారవేయగల్గింది. మిక్కిలి శుభ్రమైన తన తెల్లదనం చేత ఇంద్రాది దేవతలకు కూడా వెరపు పుట్టించగల్గింది. దీన జనుల కష్టాలను దూరం చేస్తుంది. శత్రు సైన్యాన్ని (రాక్షసుల్ని) పారదోలుతుంది.

పాంచజన్యం మ్రోగగానే దేవతల నగారాలు మ్రోగాయి. పద్మాల సువాసనలు నిండిన గాలులు వీచాయి. పూలవాన జల్లులు కురిశాయి. దేవతా స్త్రీలు (అచ్చర లేమలు) నృత్యం చేశారు. జీవ, జయ అనే ధ్వానాలు అన్ని దిక్కులా ప్రతిఫలించాయి. సముద్రుడు తన తరంగాలతో ఆకాశగంగ ముఖపద్మాన్ని ముద్దాడి ఒప్పానాడు (ఉప్పాంగాడు).



No comments:

Post a Comment

Halahala, Kalakuṭa (most deadly and venomous poison in the universe) Emerged - హాలాహలం జనించుట

హాలాహలం జనించుట ఆ తరువాత అంతలోనే, అల్లకల్లోలమైన ఆ సముద్రంలోనుండి హాలాహలమనే విషం కోలాహలమైన అగ్ని జ్వాలలతో బయటపడింది. దాన్ని చూసి భయపడి సురాస...