Wednesday, March 18, 2026

Halahala, Kalakuṭa (most deadly and venomous poison in the universe) Emerged - హాలాహలం జనించుట

హాలాహలం జనించుట

ఆ తరువాత

అంతలోనే, అల్లకల్లోలమైన ఆ సముద్రంలోనుండి హాలాహలమనే విషం కోలాహలమైన అగ్ని జ్వాలలతో బయటపడింది. దాన్ని చూసి భయపడి సురాసురులు వాసుకిని వదలిపెట్టి పారిపోయారు.

అలా పుట్టిన హాలాహలం ప్రళయకాలంలో రుద్రుని నేత్రాగ్నికి నూరు రెట్లు భయంకరంగా ఉంది. కల్పాంతంలో పుట్టే అగ్నికి వెయ్యింతలు తీవ్రంగా; ప్రళయకాల సూర్యాగ్నికి లక్ష రెట్లు అధికంగా తేరిచూడరానిదిగా ఉంది. ప్రళయరాత్రిలో మెరిసే మేఘాల నుండి కురిసే పిడుగుల్లాగా భయంకరంగా ఉంది. భగభగమని పంచభూతాలు ఒక్కసారిగా మండినట్టుంది. భుగభుగ మనే పొగలతో ఛటఛటమనే నిప్పుకణాలతో, ధగధగమనే పెనుమంటతో ఫటఫటమంటూ ఆ మహావిషాగ్ని ఆకాశానికి ఎగిసింది. దిక్కులన్నిటా వ్యాపించింది. పైకి బయళ్ళలోకి ఎగిసి పడింది. మందరపర్వతాన్ని దాటిపోయి సముద్రంలో నాలుగువైపులా అలుముకొని, గట్లను దాటుకొని, దేవదానవులకు తగిలి; కొండగుహలలో చిక్కుపడిపోక ఎత్తయిన కులపర్వత శిఖరాలలో నిప్పులు చెరిగింది. అడవుల్ని తగలబెట్టింది. పొదరిండ్లలోని పూల గుత్తుల్ని బూడిదచేసింది. గ్రామాలను బూడిద చేసింది. నదీనదాలను నాశనంచేసింది. దిగ్గజాల కుంభస్థలాల పైకి సోకింది. సూర్యగోళాన్ని నక్షత్రాలను అణగదొక్కింది. మహర్లోకాన్ని మసిచేసింది. పై లోకాలకు తీగలు సాగిపోయింది. చుట్టుముట్టుకొని కమ్ముకొని బ్రహ్మాండం పేలిపోయేలా విస్తరించింది. పాతాళలోకంలో వేళ్ళు పాకింది.

దాన్ని ఆపడానికి ఎవరికి చేతగాని తీరులో లోకాలలో అన్నింటా తానే అన్నట్టు వ్యాపించింది. జింకలాగా గెంతింది. పాములాగా పాకింది. సింహంలాగా దూకింది. పక్షిలాగా ఎగిరిపోయింది. ఏనుగులాగా కదలకుండా నిలబడింది. లోకాలలో గగ్గోలు పుట్టించింది. ఆ పెనుమంటల వేడిమికి తట్టుకోలేక దేవతలు కొందరు భస్మమయ్యారు. రాక్షసులు కాలి నేలరాలారు. చుక్కలు రాలిపోయాయి. కిన్నర దంపతులు రూపు మాసిపోయారు. గంధర్వుల విమానాలు కాలిపోయాయి. సిద్దుల గుంపులు చెదరిపోయాయి. గ్రహాలు సంకటంలో పడ్డాయి. ఋషుల తాటాకు గుడిసెలు కాలిపోయాయి. నదులు ఇగిరిపోయాయి. సముద్రాలు ఇంకిపోయాయి. అడవులు మాడి మసి అయ్యాయి. పట్టణాలు బావురుమన్నాయి. పురుషులు చొక్కిపోయారు. పుణ్యస్త్రీలు పొగిలి పొగిలి ఏడ్చారు. కొండలు బద్దలయ్యాయి. జీవరాసులన్నీ మాడి బూడిదయ్యాయి. లోకాలన్నీ వేడిమితో వేగిపోయాయి. దిక్కులు కలత పొందాయి. చెట్లు తలకిందులయ్యాయి. నేలలు ముక్కలు చెక్కలయ్యాయి; అకాలంలో ప్రళయం వచ్చి పడ్డట్టు అయింది.

ఆ మహావిషాగ్నికి అడ్డంపోయి, నిలువరించి దాని బారినుండి జగత్తును కాపాడే మహనీయులెవరూ లేకపోయారు. ఆలుబిడ్డలనే తేడా లేకుండా అందరూ చచ్చిపోయారు.

అప్పుడు బ్రహ్మాది దేవతలంతా కైలాసానికి వెళ్ళారు. ఆ మహేశుని మందిరం ముందు చేరారు. ద్వారపాలకులు అడ్డగించగా తొలగండని చెప్పిలోనికి వెళ్ళారు. దుఃఖంలో ఉన్న భక్తుల్ని ఆదుకోవడంలో వేగిరపడే ఆ లీలా మహిమాన్వితమైన పరమేశ్వరునితో “స్వామీ! శరణు! శరణు! మా మొఱ విను. మనస్సులో మామీద కృప గల్గి మా మనవిని చేకొనవయ్యా! దయతో చూడవయ్యా!” అంటూ ఆయన్ని చూశారు.

దయామయుడైన శివుడు ఆ సమయంలో పార్వతీ దేవితో కైలాసంలో ప్రమథగణాలతో కూడిన నిండు సభలో ఉన్నాడు. అయినా దేవతలు దీనులుగా రావడాన్ని గ్రహించి స్వామి వారికి వెంటనే దర్శనం ఇచ్చాడు.

అపుడు ప్రజాపతులు శివునికి సాష్టాంగపడి స్తుతులతో ఇలా ప్రార్థించారు.

ఓ భూతాత్మా! భూతేశా! భూతభావన రూపా! దేవా! మహాదేవా! దేవవంద్యా! నీకు నమస్కారం. ఈ లోకాలకు అన్నింటికి ప్రభువు నీవే. బంధ మోక్షాలు రెండూ నీ వల్లనే కలుగుతాయి. ఆర్హులకు శరణు గోరదగ్గ తండ్రివి నీవే. బుద్ధిమంతులు నీపై ఆసక్తితో పూజిస్తారు. సకల జగత్తును సృష్టించి - పోషించి - నశింపచేస్తావు. నీవే బ్రహ్మ - విష్ణు శివులన్న పేర్లతో వ్యాపించి ఉన్నావు. అతి రహస్యమైన బ్రహ్మతత్తం నీవే. నీవు సదసత్తులకు అతీతమైన వాడివి. నీవు శక్తిమంతుడివి. శబ్ద బ్రహ్మవు నీవే. జగదంతరాత్మ నీవే. సకల జగత్తుకు ప్రాణాధారం నీవే.

పరమేశ్వరా! అన్ని లోకాలూ నీలోనే పుడతాయి. నీలోనే నివసిస్తాయి. నీలోనే నశిస్తాయి. నీ ఉదరం సకల భూతరాశికీ నివాసం.

పరమేశా! నీ ముఖమే అగ్ని. జీవాత్మ పరమాత్మల కలయికే నీ ఆత్మ. కాలమే నీగతి. భూమే నీ (పాదం); వాయువే నీ శ్వాస; వరుణుడే నీ నాలుక; దిక్కులే చెవులు; స్వర్గమే నాభీ. సూర్యుడే నీ దృష్టి. నీరే నీ వీర్యం. సముద్రాలే నీ గర్భం. ఆకాశమే శిరస్సు. ఓషధులే వెండ్రుకలు. పర్వతాలే ఎముకలు, చంద్రుడే మనస్సు. వేదాలే నీ ధాతువులు. ధర్మశాస్త్రమే నీ హృదయం. ఉపనిషత్తులే నీ ఐదు ముఖాలు. నీ రూపం పరతత్త్వం. స్వయంజ్యోతివి నీవు. సకలానికీ మూలం నీవే.

(శివుడికి ఐదు ముఖాలు. 1. సద్యోజాతముఖం, 2. తత్పురుష ముఖం, 3. వామదేవ ముఖం, 4.అఘోర ముఖం, 5. ఈశాన ముఖం)

ఓ మహాదేవా! కొందరు నీ వున్నావంటారు. కొందరు లేవంటారు. కొందరు నీవు నిర్గుణుడివంటారు. మరికొంతమంది నీ వున్నావో లేవో అని సందేహపడుతుంటారు.

('కలడో లేడో' అని గజేంద్రుడు పడ్డ సందేహం విష్ణువు విషయంలోనే కాదు - శివుడి విషయంలోనూ అంతే.)

దేవాధిదేవా! దీనరక్షకా! పురాణపురుషా! చంద్రచూడా! సర్వరూపా! ఆలోచిస్తే ప్రాణం, ఇంద్రియాలు, ద్రవ్యగుణాలు అన్నీ నీ స్వభావంలోనే ఉన్నాయి. కాలమూ, యజ్ఞమూ నీవే, సత్యమూ, ధర్మమూ, ఓంకారమూ, మోక్షమూ నీవే అన్నింటికీ ఆధారం నీవే. నీవే వేద రూపుడివి. సత్త్వరజస్తమో గుణాలు నీకు నేత్రాలు. నుదుటి కంటి మంటతో యమాదులనే అవలీలగా కాల్చిన నీకు; మన్మథుడు కాని, త్రిపురాసురులు కాని, కాలకూటం కాని ఒక లెక్కలోనివి కావు. ఇవేవీ నీకు హాని కల్గజేయవు.

ఓ ఫాలనేత్రా! త్రిమూర్తులకూ, త్రిలోకాలకూ, త్రికాలాలకూ మూలం నీవే. మొదట భేదాలతో కనిపించి తుదకు అభిన్నంగా ఏకమాత్రంగా ప్రకాశించే పరబ్రహ్మతత్త్వం నీవే.

ఓ స్వామీ! సదసద్రూపమైన ఈ సకల చరాచరజగత్తు నీలోనే ఉంది. బ్రహ్మాదులు కూడా నిన్ను స్తుతించడానికి భయపడి పెదవులు విప్పరు. అలాంటప్పుడు మేము నిన్ను పట్టుబట్టి స్తుతించడానికి ఎంతటి వాళ్ళం?

పరమేశ్వరా! దేవతలు, రాక్షసులు తమ బాహుబలంతో పాలసముద్రాన్ని చిలుకగా అందులో నుండి హాలాహలమనే విషం పుట్టి ప్రపంచాన్నంతా కోలాహలం చేసోంది. దాన్ని ఎవరూ ఆపలేకుండా ఉన్నారు. నీవు దయతో దాన్ని అవలీలగా పరిగ్రహించి ప్రాణికోటిని కాపాడవా ప్రభూ!

పరమేశ్వరా! లోకుల కష్టాల్ని తొలగించడానికి, ఐశ్వర్యాన్ని విజయాన్ని ప్రసాదించడానికి, క్రూరుల్ని నాశనం చేయడానికి చక్కగా నీవే తగినవాడిని.

నీకన్నా మాకు ఇంకోటి తెలియదు. నీకన్నా గొప్పగా లోకాల్ని రక్షించగలవారూ ఎవరూ లేరు. లోకాలన్నిటికీ ప్రభువు నీవే. ఇతరులెవరున్నారు? ఇలా స్తుతిస్తున్న దేవతల్ని చూసి, సకలభూత సమవర్తి అయిన శివుడు తన సతితో ఇలా అన్నాడు.

శివుండు దేవప్రార్థితుండై హాలాహలమును బానము సేయుట

No comments:

Post a Comment

Halahala, Kalakuṭa (most deadly and venomous poison in the universe) Emerged - హాలాహలం జనించుట

హాలాహలం జనించుట ఆ తరువాత అంతలోనే, అల్లకల్లోలమైన ఆ సముద్రంలోనుండి హాలాహలమనే విషం కోలాహలమైన అగ్ని జ్వాలలతో బయటపడింది. దాన్ని చూసి భయపడి సురాస...