వైవస్వత మనువంశ కథనము
ఓ మహారాజా! ఈ మనువువంశాన్నిగురించి చక్కగా వివరించి చెప్పటానికి లక్షసంవత్సరాలైనా సరిపోదు. కాని అంత సమయం తీసుకోకుండా త్వరగా నాకు తెలిసినంతవరకు నీకు వివరిస్తాను. విను.
భగవానుడు ఎక్కువ తక్కువ పొడవులకు అతీతమైనవాడు అంటే రూపరహితుడు. కల్పాంతంలో ఈ సృష్టి అంతా నాశనమైనా విశ్వరూపుడు కావడంచేత తానొక్కడే ఆశ్చర్యకరంగా మిగులుతాడు.
ఓ పరీక్షిన్మహారాజా! కల్పాంతంలో నిల్చిన ఆ దివ్యపురుషునినాభినుండి బంగారుకమలం ఉద్భవించింది. ఆ కమలంలో స్వయంభువై బ్రహ్మ జన్మించాడు. ఆ బ్రహ్మమనసునుండి మరీచి జన్మించాడు. అతనికి కశ్యపుడు, కశ్యపునికి దక్షునికూతురైన అదితికి సూర్యుడు, అతనికీ సంజ్ఞకు మనువైన శ్రాద్ధదేవుడు, ఆ మనువుకు శ్రద్ధకు శుభకీర్తి కలిగిన పదిమందికుమారులు కలిగారు.
శ్రాద్ధదేవుడనే మనువుకు ఇక్ష్వాకుడు, నృగుడు, శర్యాతి, దిష్టుడు, ధృష్టుడు, కరూశకుడు, అరిష్యంతుడు, వృషద్రుడు, నభగుడు, కవి అనే పదిమంది కొడుకులు కలిగారు. వీరు జన్మించటానికి పూర్వం మనువు కొడుకులు లేనివాడై యజ్ఞదేవతలైన మిత్రావరుణులను గూర్చి
మనువు సంతానంకోసం యజ్ఞాన్ని చేస్తుండగా, అతనిభార్య హోతతో 'నాకు యజ్ఞఫలంగా కుమార్తె కలిగేటట్లు యజ్ఞాన్ని చేయి అని పల్కి' భక్తితో క్షీరవ్రతాన్ని చేసింది. ఆమె చెప్పినట్లుగా అధ్వర్యుడు హోతతో 'ఆమెకోరినట్లే చెప్పి వేల్చు' అని అన్నాడు. అతడు హవిస్సును చేబూని 'కూతురు కలుగుగాక' అని సంకల్పం చెప్తూ వేల్చాడు. హోత వ్యతిరేక చేష్టవల్ల 'ఇల' అనే స్త్రీ పుట్టింది. దానిని చూచి మనువు తీవ్రమనస్తాపం పొంది, అయ్యో! పుత్రసంతానం మంచిది కదా కూతురెందుకని అనుకొంటూ వసిష్ఠునిదగ్ధరకు పరుగుతీశాడు.
పైన చెప్పబడినట్లు తన అసంతృప్తిని తనలోనే అణచుకొని, వసిష్ఠునిదగ్గరకు వెళ్ళి ఆయనతో ఇలా మొర పెట్టుకొన్నాడు.
అయ్యా! కొడుకులు కలగాలని నేను ఈ యజ్ఞాన్ని మీ అనుజ్ఞతో చేస్తే ఈ కుమార్తె ఎందుకు కలిగింది? మీ బోటి వారిశక్తికి హద్దు ఉండదుగదా!
“అదీగాక మీరు బ్రహ్మవాదులు. మంత్రవాదులు. పాపం అంటకుండా చూచేవారు. కాని జరిగింది మాత్రం వేరుగా ఉంది” అని అన్నాడు. అపుడు మా ముత్తాతయైన వసిష్ఠుడు అకార్యంవల్ల జరిగినవిషయాన్ని గ్రహించి, మనువుతో ఇలా అన్నాడు.
ఓ రాజా! హోత మోసం చేయడంవల్ల యాగఉద్దేశానికి వ్యతిరేకంగా కూతురు కలిగింది. అయినా నీవు మెచ్చుకొనేటట్లు నీకు కొడుకును ప్రసాదిస్తాను. నా కౌశలాన్ని బలాన్ని చూడు.
(యజమాని చేసే యాగఉద్దేశానికి అనుకూలంగా హోత వషట్కారం చెప్పాలి. తద్విరుద్ధంగా చెప్పడం కల్లతనమే. కాని ఒకసారి పుట్టిన ఆడశిశువును మగవాడుగా మార్చడం అద్భుతమైన విషయమే. దాన్ని సాధించటానికి నేర్పు, శక్తి కావాలి. అదే జరిగితే రాజు మెచ్చుకోకుండా ఎట్లుంటాడు? అలామారిన కొడుకు 'ప్రియాత్మజుడు' కాకుండా ఎట్లుంటాడు? అనే విషయాలు ద్యోతక మవుతాయి.
రాజుతో పైవిధంగా పలికి భగవానుడైన వసిష్ఠమహర్షి కీర్తియందాసక్తితో మనువుకుమార్తె పురుషత్వంకోసం ఏకాగ్రతతో ఆదిపురుషుడైన విష్ణువును స్తుతించగా, ఆ స్వామి మెచ్చుకొని, ఆ మహర్షి కోరిన వరాన్ని ప్రసాదించాడు. ఆ కారణంచేత ఇలా పుత్రిక సుద్యుమ్నుడనే పేరుతో కొడుకై రాజ్యపాలనం చేస్తూవుండగా
(లోకంలో సంతానం భగవన్నిర్ణయం. అసంతృప్తడైన మనువు మహర్షికి తన దుఃఖాన్ని చెప్పుకొన్నాడు. కాని కొడుకును ప్రసాదించమని అడగలేదు. కాని అద్భుతంగా వసిష్ఠుడు కూతురిని కొడుకుగా చేశాడు. కారణం కీర్తితత్పరత అని కవే చెప్పాడు. గహనమైన విషయం సాధించటంవల్ల కలిగే కీర్తియా? లేక లోకకల్యాణకారకమైన కీర్తియా? రెండోది సరైందని భావించాలి.)
సుద్యుమ్నుడనే ఆ రాజు ఒకరోజు కొందరు మంత్రులు వెంటరాగా, మేలుజాతి గుర్రాన్నెక్కి సొగసైన వింటిని, వాడియైన బాణాలను ధరించి, దట్టమైన అరణ్యాల వెంబడి పెద్దమృగాలను వేటాడుతూ మేరుపర్వతసమీపంలోని కుమారవనాన్ని ప్రవేశించాడు. అక్కడ పార్వతీపరమేశ్వరులు ఎప్పుడూ ఏకాంతవిహారం చేస్తుంటారు. ఆ వనంలో ప్రవేశించగానే రాజు స్త్రీ అయ్యాడు. అతని సేవకులుకూడా స్త్రీలుగా మారారు. ఆ రాజుగుర్రంసైతం ఆడుగుర్రంగా మారింది.
ఈ విధంగా ఆ వనప్రవేశంచేత పురుషత్వం కోల్పోయి, స్త్రీలై పరస్పరం ముఖాలు చూచుకొని దుఃఖీంచారు అని చెప్పిన శుకునితో పరీక్షిత్తు ఇలా అన్నాడు.
'రాజు, ఆయన అనుచరులు ఆ వనంలో ప్రవేశించినంతనే స్త్రీలయ్యారని అన్నావు. ఏ కారణంచేత వాళ్లు స్త్రీలయ్యారు? లోకంలో ఇటువంటి దేశాన్ని గూర్చి ఎప్పుడూ వినలేదు. నా కుతూహలం తీరేటట్లు వివరించండి.
ఈ ఆశ్చర్యకరమైన విషయంతో బాటు మరొక విషయంకూడా.
పౌరుషవంతుడైన మానవుడు స్త్రీత్వం కోల్పోయి, మగవాడు కావడం బాగుండవచ్చుగాని; పేరుప్రతిష్ఠలకు భంగం కలిగేట్టుగా పురుషత్వం కోల్పోయి స్త్రీ కావడం బాగుంటుందా?
పై విధంగా ప్రశ్నించిన పరీక్షిత్తుకు శుకమహర్షి ఇట్లన్నాడు.
చీకట్లను పారదోల గలిగిన తేజోవంతులైన కొందరు మునులు పరమేశ్వరుణ్ణి సందర్శించే కోరికతో, ఆ వనంలో ప్రవేశించారు. భర్తతొడలపై కూర్చున్న పార్వతీదేవి వారిని చూచి, సిగ్గుతో వస్త్రం ధరించింది. వారు 'పార్వతీ పరమేశ్వరులు ఏకాంతవిహారంలో ఉన్నారు. ఇది దర్శన సమయం కాదని' నరనారాయణులున్న బదరికావనానికి వెళ్లారు.
పై సన్నివేశకారణంగా పరమాత్ముడైన ఈశ్వరుడు పార్వతీదేవి వినోదాలకోసం ఇట్లా కట్టడిచేశాడు.
'ఈ ప్రదేశంలో ప్రవేశించేవాడు స్త్రీ అగుగాక' అన్న ఆ ఈశ్వరుని మాటచేత సుద్యుమ్నుడు స్త్రీగా మారి, ఆ అడవులలో తిరిగిన చోటే తిరుగుతూ ఉండినాడు.
ఈ విధంగా చెలికత్తెలతో స్త్రీరూపం పొందిన సుద్యుమ్నుడు రాజకుమార్తె హోయలతో స్త్రీ సొందర్యాన్ని వెదజల్లుతూ దైవయోగంచేత చంద్రునికొడుకు మహిమాన్వితుడైన బుధుని ఆశ్రమంలో తిరుగాడుతుండగా
(సుద్యుమ్నుడు ప్రథమంగా స్త్రీ. వసిష్ఠ మహర్షి తపశ్శక్తిచేత పురుషుడు. బుధునిఆశ్రమంలో తిరగడం దైవయోగం. రాచకూతురు చూపులతో స్త్రీభావాల్ని నెరపడం ప్రేరకం. ఇన్ని విషయాలు ఒక్కచోట చేర్చబడ్డాయి.)
పద్మదళనేత్ర అయిన ఆ స్త్రీ చంద్రునికొడుకైన బుధుణ్ణి చూచింది. అపుడే అతను కూడ ఆమెను చూచాడు. సరిగ్గా అదే సమయంలో దొంగవాడైన మన్మథుడు తొందరగా తన చిగురుటాకు కత్తిని తీసి, పరుగెత్తి వారిని కొట్టాడు.
ఈ విధంగా మన్మథుని బిగువైన చిగురాకు ఆయుధం తాకిడికి వారిరువురు రతివినోదాలలో మునిగారు. దాని ఫలితంగా వారికి పురూరవుడనే కొడుకు పుట్టాడు. ఈ విధంగా
మనువు కుమారుడైన సుద్యుమ్నుడు మరొకరికి ఆలుకావడంచేత కొడుకును గని, ఆ జీవితానికి విసిగి, దుఃఖంతో చింతిస్తూ గురువైన వసిష్ఠుణ్ణి తలచుకొన్నాడు. అలా తలచుకోగానే ఆ మహర్షి కూడా వచ్చాడు.
వసిష్ఠుడు ఆవిధంగా అక్కడికి వచ్చి సుద్యుమ్నుడు పురుషుడు కావటంకోసం పరమేశ్వరుణ్ణి సేవించగా ఈశ్వరుడు ఆతని శ్రమకు మెచ్చి ఇట్లన్నాడు.
తాను పూర్వం అన్నమాట వ్యర్థం కాకుండా, ఆ ముని సంతోషించేటట్లు శివుడు 'ఈ సుద్యుమ్నుడు ఒక నెలపురుషుడుగాను, మరో నెల స్త్రీ గాను ఉంటాడు. ఈ మార్పులతో జీవిస్తూ, రాజ్యాన్ని పాలిస్తాడు. వెళ్లు అనగా వసిష్ఠుడు సుద్యుమ్నుని దగ్గరకు వచ్చాడు. ఆ విధంగానే సుద్యుమ్నుడు రాజ్యాన్ని పాలిస్తూ
(పూర్వం విష్ణువు ఇచ్చిన వరానికి, ఇప్పుడు తాను(శివుడు) ఇచ్చిన శాపానికి భంగంరాకుండునట్లు సుద్యుమ్నుడు ఒకనెల పురుషుడుగా, మరోనెల స్త్రీగా ఉండునట్టూ, రాజ్యపాలన స్తంభించకుండా ఉండేటట్లు అనుగ్రహించాడు శివుడు.)
ఓ రాజా! గురువుదయవల్ల అతడు ఆ విధంగా స్త్రీత్వం పొంది, మరల పురుషుడవుతూ, ప్రజలు ఆనందిస్తుండగా భుజబలంతో భూమిని పాలించాడు.
ఆ సుద్యుమ్నునికి ఉత్కలుడు, గయుడు, విమలుడు అనే ముగ్గురు కొడుకులు కలిగి ధర్మానురక్తులై ఉత్తరదిక్కులోని భూములకు రాజులయ్యారు. సుద్యుమ్నుడు వృద్దుడయినందువల్ల, పురూరవునికి రాజ్యమిచ్చి, ప్రతిష్ఠానపురాన్ని విడిచి, వానప్రస్థానికి వెళ్ళాడు. ఆ విధంగా
ఈ విధంగా కొడుకు సుద్యుమ్నుడు అరణ్యాలకు పోగా, వైవస్వతమనువు సంతానంకోసం దుఃఖిస్తూ యమునానదీ తీరంలో విష్ణువునుగూర్చి నూరేండ్లు తపస్సు చేశాడు. అపుడు హరి అతనికి ఇక్ష్యాకుడు మొదలైన పదిమందికొడుకులను అనుగ్రహించాడు. వారిలో పృషధ్రుడనేవాడు గురువు ఆజ్ఞమేరకు ధర్మాల్ని పాటిస్తూ ఆవులమందను కాచేవాడు. ఒకరోజు అర్ధరాత్రి దట్టమైన మేఘాలు కమ్ముకొని జడివాన కురవసాగింది. అతడు ఆవులన్నింటిని ఒకచోట చేర్చి, క్రూరమృగాల బారిన పడకుండా జాగ్రత్తగా కనిపెట్టుకొని ఉన్నాడు.
కమ్ముకొన్న చీకట్లో ఒక పెద్దపులి మెల్లగా ఒదిగి ఒదిగి ఉన్నట్లుండి పైకెగిరి ఆకస్మికంగా మందలోని ఒక ఆవును అది భయంతో అరుస్తూ ఉండగా పట్టుకొనింది.
పెద్దపులి గాలి సోకి గుంపుగా ఉన్న ఆవులన్నీ బెదరి లేచి ఒక్కసారిగా అంబా అని అరుస్తూ చెల్లాచెదరుగా పరుగుతీశాయి.
పృషధ్రుడు ఆ చీకట్లో కనబడక కత్తిని చేతపూని పెద్దపులి అనుకొని ఒక పుల్లావు తలను నరికి, తెగలేదనుకొని మళ్లీ తెగవేసి దారిలో ఖడ్గరక్తాన్ని చేతితో తుడుస్తూ, దగ్గరికి చేరి, తల తెగిపడిన ఆవును చూశాడు.
తల నరుకబడిన ఆవును చూచి దుఃఖీతుడైన పృషధ్రుని కులగురువు వసిష్ఠుడు చూచి కోపంతో ఈ నేరంచేత నీవు రాచరికానికి దూరమై శూద్రుడవవుతావు అని శపించాడు. అతడు కూడ చేతులు జోడించి గురుదయతో, అనుమతితో
సర్వాత్మకుడైన హరియందును, ఇతరునియందును భక్తితాత్పర్యాలను ప్రదర్శించాడు. ఊర్ధ్వరేతస్కుడై, ప్రాణులకు ఇష్టుడై, ఇంద్రియప్రవృత్తికి దూరుడై, విషయసాంగత్యంమాని, ప్రశాంతుడై దేనినీ స్వీకరించక, తానై దేనినీ కోరక, లభించినదానితో బ్రతుకుతూ, ఆత్మావలోకనంతో కృతార్థుడై మందునివలె, గ్రుడ్డివలె, చెవిటివలె నేల నాలుగు చెరగుల తిరిగి చివరకు అడవులకు వెళ్ళి కార్చిచ్చులో పడి పరబ్రహ్మంలో లీనమయ్యడు.
(పులిగా భావించి గోహత్య చెయ్యడంతోను, వసిష్ఠుని శాపంవల్ల వైరాగ్యం చెందిన పృషద్రుడు నిర్లిప్తుడై జీవిస్తూ, చివరకు శాపఫలం పొందకుండానే మోక్షం పొందడం అనేది చాల విశేషం. ఎలాంటి కర్మపరిపాకాలనైనా సాధనలవల్ల పోగొట్టుకోవచ్చు.)
మనువుకొడుకుల్లో చివరివాడైన కవి ఇంటినీ, రాజ్యాన్నీ వదలి చుట్టాలతో అడవికి పోయి, భగవంతుడైన హరిని పవిత్రమైన మనసుతో ధ్యానించి మోక్షాన్ని పొందాడు.
కరూశుడనే మనువు కొడుకువల్ల కారూశులనే రాజులు కలిగారు. వారు ధర్మప్రియులు, బ్రాహ్మణప్రియులై ఉత్తర దిక్కులోని భూములకు రక్షకులైనారు. దృష్టునివల్ల ధార్‌ష్టమనే వంశం కలిగి బ్రహ్మజ్ఞానసంపన్నతతో భూతలంలో ప్రసిద్ధి పొందింది. నృగుని వంశంలో సుమతి, అతనికి భూతజ్యోతి, అతనికి వసువు, అతనికి ప్రతీతుడు, అతనికి ఓఘవంతుడు కలిగారు. ఓఘవంతుని కుమార్తె ఓఘవతిని సుదర్శనుడు వివాహమాడాడు. నరిష్యంతుడనే మనువు కొడుక్కి చిత్రసేనుడు, ఆ రాజుకు దక్షుడు, ఆ పుణ్యాత్మునికి మీఢ్వాంసుడు, ఆ సజ్జనునికి శర్వుడు, ఆ మహాత్మునికి ఇంద్రసేనుడు, ఆ రాజుకు వీతిహోత్రుడు, ఆ బుద్ధిమంతునికి సత్యవ్రతుడు, ఆ మహానుభావునికి ఉరుశ్రవుడు, ఆ వీరునికి దేవదత్తుడు, ఆ పండితునికి అగ్నివేశుడు జన్మించారు. అగ్నివేశుడు కానీనుడనే ప్రసిద్ధితో జాతకర్ణుడనే మహర్షిగా వెలిశాడు. అతని పేరు మీద 'ఆగ్నివేశ్యాయన' మనే బ్రాహ్మణవంశం ఏర్పడింది.
(ఈ వచనంలో కరూశుడు, ధృష్టుడు, నృగుడు, నరిష్యంతుడు అనే మనువుకుమారుల వంశాలు చెప్పబడ్డాయి. నరిష్యంతునివంశంలో జన్మించిన ప్రతి ఒక్కరికి విశేషణం చెప్పబడింది. అంటే ఆ వంశం అన్ని ఉత్తమగుణాలతో విరాజిల్లిందనుకోవాలి.)
ఓ రాజశ్రేష్ఠుడా! నరిష్యంతుని వంశాన్ని గూర్చి నీకు చెప్పాను. ఇప్పుడు దిష్టుని వంశాన్ని గురించి స్పష్టంగా చెప్తాను. గ్రహించు.
దిష్టుని కొడుకు నాభాగుడనేవాడు కర్మవశాత్తు వైశ్యత్వాన్ని పొందాడు. ఆ నాభాగునికి హలంధనుడు కలిగాడు. అతనికి వత్సప్రీతి. అతనికి ప్రాంశువు, అతనికి ప్రమితి, అతనికి ఖమిత్రుడు, అతనికి చాక్షుషుడు, అతడికి వివింశతి, అతనికి రంభుడు, అతనికి ధర్మాత్ముడైన ఖనినేత్రుడు, అతనికి కరంధనుడు, అతనికి అవిక్షిత్తు, అతనికి మరుత్తుడు జన్మించారు. ఆ మరుత్తుడు చక్రవర్తి అయ్యాడు. అతడి చరిత్ర విను.
ఓ రాజా! ఆ మరుత్తుని యాగానికి అంగిరసునికొడుకు మహాయోగియైన సంవర్తుడు నిర్వహణ వహించాడు. దానిని పరివేష్టించినవారు మరుత్తులు. విశ్వేదేవతలు సదస్యులు. అతడు అధికదక్షిణలతో బ్రాహ్మణ సమూహాన్ని తృప్తిపరచాడు. దేవేంద్రుడు సోమపానంచేత తృప్తుడై, యాగద్రవ్యాల్ని సువర్ణమయం చేశాడు. ఈ విధంగా ఆ మరుత్తుడు చేసినట్లు ధైర్యం, త్యాగం, తెగింపు కలిగి యాగం చేసినవారిని సర్వలోకాల్లో ఎక్కడా చూడము.
యజ్ఞకార్యం చేత ప్రసిద్ధి పొందిన ఆ మరుత్తుకు దముడనేవాడు, అతనికి రాజవర్ధనుడు. అతనికి సుధృతి, అతనికి సౌదృతేయుడు, అతనికి కేవలుడు, అతనికి బంధుమంతుడు, అతనికి వేదవంతుడు, అతనికి బంధుడు, అతనికి తృణబిందుడు అనే వాళ్లు కలిగారు. అపుడు
అప్పరస స్త్రీయైన అలంబుస తృణబిందుణ్ణి చూచి ఇష్టపడి చివరకు మన్మథ బాణాలమంటలచేత మోహావేశంతో సమీపించి అతణ్ణి పొందింది.
ఆ దంపతులకు ఇలబిల అనే కూతురు పుట్టింది. ఆమెను విశ్రవసుడు భార్యగా పొందగా, ఐలబిలుడనే పేరుగల కుబేరుడు పుట్టాడు. అంతేగాక ఆ తృణబిందునికి విశాలుడు, శూన్యబంధుడు, ధూమకేతుడనబడే ముగ్గురుకొడుకులు కలిగారు. వీరిలో విశాలుడు వంశాభివృద్ధికరుడై వైశాలి అనే నగరాన్ని నిర్మించాడు. ఈయనకు హేమచంద్రుడు, అతనికి ధూమ్రాక్షుడు, అతనికి సహదేవుడు, ఆ బలశాలికి కృశాశ్వుడు, అతనికి సోమదత్తుడు జన్మించారు. ఆ సోమదత్తుడు
దేవేంద్రుడు ప్రశంసించేటట్లు ఆ సోమదత్తుడు అశ్వమేధయాగం చేసి సద్గతికి వెళ్లాడు. అతని కొడుకు సుమతికి జనమేజయుడనే కొడుకు కలిగాడు.
పై చెప్పబడిన వారంతా వైశాలురు అనే పేరుతో ప్రసిద్ధిపొంది, తృణబిందుని కీర్తిని వ్యాపింపజేసి రాజ్యపాలన చేశారు మరియు
బ్రహ్మతత్పరుడైన మనువుకు శర్యాతి అనే రాజు జన్మించాడు. అతడు అంగిరసుని యజ్ఞంలో రెండవనాడు చేయవలసిన కర్మకాండను ఏర్పరచాడు. అతని కుమార్తె సుకన్య ఒకరోజు తండ్రితోపాటు అరణ్యానికి వెళ్ళింది. అక్కడ చ్యవనమహర్షి ఆశ్రమానికి వెళ్ళి చెలికత్తెలతో పూలూపండ్లు కోయటానికి తిరుగుతూ ఒక పుట్టలో వెలుగుతున్నరెండుజ్యోతులను చూచి, దైవఘటన చేత చాపల్యంతో తెలివి తక్కువగా వాటిని మిణుగురుపురుగుల జంట అనుకొని పదునైన ముల్లుతో గుచ్చింది.
(తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే! తెలియక అగ్గిని తాకితే కాలకమానదు.)
ఓ రాజా! పుట్టలో ఉన్న ఆ జ్యోతుల్ని ముల్గుతో గుచ్చగా ఆ పుట్టరంధ్రాలనుండి రక్తం కారింది. ఆ వెంటనే అక్కడనున్న రాజభటులందరికి మలమూత్రాలు స్తంభించిపోయాయి.
ఆ రాజభటుల్ని చూచి రాజర్షియైన శర్యాతి వారిస్థితికి ఆశ్చర్యపడి 'మీరు ఈ ఆశ్రమంలో ఏదో అపరాధం చేసి ఉంటారు. కాబట్టి ఈ స్తంభనం కలిగింది. అని అంటుండగా కుమార్తె తండ్రితో ఇట్లా అంది.
తండ్రీ! ఈ పుట్ట దగ్గర ఆడుకుంటూ ఇందులోని రెండు వెలుగుల్ని చూచి ముల్లుతో పొడవగా నెత్తురు కారింది. ఎందుకు జరిగిందో తెలుసుకో.
(సుకన్య తానుచేసిన పనిని దాచుకోలేదు. తండ్రితో తెలిపింది. తప్పిదానికి దండన అనుభవించడానికి సిద్ధపడినట్లు తెలుస్తూ ఉంది.)
అని కుమార్తె చెప్పగా శర్యాతి భయపడి ఆమెను వెంటబెట్టుకొని పుట్టదగ్గరకు వచ్చి అందులో తపస్సు చేస్తున్న చ్యవనుని చూచి, తన నేర్పరితనంతో అతనిని ప్రసన్నునిగా చేసుకొని, ఆ మునిఅభిప్రాయం తెలిసి తనకుమార్తె నిచ్చి వివాహం చేసి ఎట్లో తుదకు ప్రమాదం తప్పించుకొని మునివద్ద సెలవు తీసుకొని తన నగరానికి వెళ్ళాడు. తరువాత
పిమ్మట ఆ సుకన్యక మిక్కిలికోపిష్ఠుడైన భర్త చ్యవనుని చేరి, మెచ్చుకొనేటట్లు పనులు చేస్తూ కొన్నేండ్లు కాపురం చేసింది.
(సుకన్యది చాల విచిత్రపరిస్థితి. తాను తెలియక అపరాధం చేసింది. తండ్రిఆజ్ఞచే చ్యవనుణ్ణి భర్తగా పొందింది. భర్త మహాకోపిష్ఠి అతడు మెచ్చేటట్లు పనులు చేయడం చాలా కష్టం. తాను రాజకుమార్తె. కాని ఆమె అతని మెప్పును పొందింది అనటంలో ఆమె వ్యక్తిత్వ ఉదాత్తతను కవి ఆవిష్కరించాడు.)
అట్లుండగా ఆ ఆశ్రమానికి దేవతా వైద్యులయిన అశ్వినీ దేవతలు వచ్చారు. వారిని గౌరవించి చ్యవనుడు తన ముసలి తనాన్ని చూపించి ఇట్లన్నాడు. మీకు యజ్ఞభాగంగా లేని సోమపానాన్ని నేను కల్పించి ఇస్తాను. సోమపానసమయంలో పానపాత్రను మీకు అందిస్తాను. ప్రత్యుపకారంగా నా ముసలితనాన్ని పోగొట్టండి అని ఇంకా ఇలా అన్నాడు.
దేవేంద్ర వైద్యులారా! అందమైన ప్రాయంతో, జవరాండ్రను కరగించే శరీర సౌందర్యాన్ని శుభకరంగా నాకు అనుగ్రహించండి మిమ్మల్ని దీవిస్తాను.
అలా అన్న చ్యవనునితో అశ్వినీదేవతలు సంతోషించి సిద్ధులచేత నిర్మింపబడిన ఈ మడుగులో మునుగుమని చెప్పి
ముసలి ముని అయిన చ్యవనుణ్ణి అశ్వినీదేవతలు పూనికతో ఎత్తుకొని పోయి, ఆ మడుగులో మునిగి లేచారు. స్త్రీ జనాన్ని ఆకర్షించే సౌందర్యవంతులు, అదృష్టవంతులుగా మారారు. తామరపూల హారాలతో, బంగారు చెవిపోగులతో, మంచి బట్టలతో, సూర్యునివలె కాంతిగలిగి ఒకే విధంగా ఉన్న ఆ ముగ్గురినీ చూచి అమాయకురాలైన సుకన్య వారిలో తన భర్తను కనిపెట్టలేకపోయింది. పతివ్రత అయిన ఆమె తన భర్తను తెలుసుకోవాలని 'ఓ పుణ్యాత్ములారా! నా భర్తను చూపించండి' అంటూ అశ్వినీదేవతలకు మొక్కింది.
అశ్వినీదేవతలు పతివ్రతయైన సుకన్యక సత్యశీలానికి మెచ్చి, యౌవనరూపంతో ఉన్న చ్యవనుని చూపించి, ఆ దంపతుల వద్ద సెలవు తీసుకొని విమానమెక్కి దేవతల నగరమైన అమరావతికి వెళ్ళారు. పిమ్మట
శర్యాతి యాగం చేయటానికి, కూతుర్నీ అల్లుణ్ణీ ఆహ్వానించి తీసుకెళ్ళే ఉద్దేశంతో చ్యవనమహర్షి ఆశ్రమానికి వచ్చాడు. తన కుమార్తె ప్రక్కన సూర్యతేజస్సుతో ప్రకాశించే పురుషుణ్ణి చూచి తనలో 'వీడెవడో ఈమె భర్తకాదు, ఆశ్చర్యం!' అనుకొని కూతురిమాట, ఆమె చేసే గౌరవాలు ఇష్టపడక, ఆశీర్వదించటానికి అసహ్యపడి ఇట్లన్నాడు. చ్యవనమహర్షి గొప్పవాడు, మునిజనాల్లో శ్రేష్ఠుడు, లోకంచేత కీర్తింపబడేవాడు, ఎక్కడకు వెళ్ళాడు? ఆయన ఎలా మోసగించబడ్దాడు? నీ పక్కనున్న వీడెవడు?
అమ్మాయీ! నీకీపని న్యాయమేనా? ధర్మమేనా? శీలవంతుల లక్షణమేనా? సత్కులంలో పుట్టి గర్వించి సంతోషం కోసం జగత్తుచే పూజింపబడేవాడు, పుణ్యాత్ముడు, తపస్వి, సాధ్విమనసుకు నచ్చేవాడు అయిన భర్తను వదలి, విటుణ్ణి పొందడం న్యాయమా? అభిమానం పాటించనక్కరలేదా? తండ్రిని, భర్తను నరకానికి తోసేశావు కదా!
అమ్మాయీ! మగడు ప్రాయపువాడైతే కొంతవరకైనా భార్యను కాపాడుకోగలడు. ముసలిముని ప్రయత్నపూర్వకంగానైనా భార్యను అదుపులో ఉంచగలడా? ఎక్కడైనా పడుచు పిల్లను ముసలివానికి కట్టబెట్ట కూడదు.
పరమపతివ్రతాలలామ అయిన ఆ సుకన్యక చిరునవ్వు చెక్కిళ్లపై తొణికిసలాడుతుండగా తండ్రితో ఇలా అంది.
'ఓ తండ్రీ! ఇతడు నీ అల్లుడైన భార్గవుడేకాని విటుడు కాదు. సంతోషంతో నీవు కూడ ఈయనతో చుట్టరికాన్ని పాటించుము' అని తండ్రికి జరిగినదంతా చెప్పింది.
శర్వాతి సంతోషంతో కూతురిని చేరదీసి ఆదరంతో 'సౌభాగ్యవతివి కమ్మ'ని దీవించాడు. అప్పుడు చ్యవనుడు భార్యతో పాటు వెళ్ళి 'మామకు యాగం చేయించి, ఒక పాత్రలో సోమరసాన్ని పోసి' తన తపశ్శక్తితో అశ్వినీ దేవతలకిచ్చాడు. దాన్ని చూచి
(1. మాంగల్యం 2. పసుపు కుంకుమ 3. గాజులు 4. చెవ్వాకు 5. మెట్టెలు. ఈ అయిదు వస్తువులు ముత్తైదువ మాత్రమే ధరిస్తుంది. అందుకనే ఆమెను అయిదువ అంటారు.)
దేవేంద్రుడు కోపంతో మునిపైకి వజ్రాయుధమెత్తగా ఆశ్చర్యకరంగా ముని దాన్ని అతని భుజం మీదే కదలకుండా నిలబెట్టాడు.
ఈ విధంగా అశ్వనీ దేవతలు దేవతావైద్యులైకూడా సోమభాగం లేనివారైనా, చ్యవన మహర్షి ప్రభావంవల్ల యజ్ఞభాగం పొందగలిగి వెళ్ళారు. శర్యాతికి ఉత్తానబర్హి, ఆనర్హుడు, భూరిషేణుడు అనే ముగ్గురు కొడుకులు కలిగారు. వారిలో
వారిలో ఆనర్హుడికి రైవతుడు పుట్టాడు. అతడు సముద్రంలో కుశస్థలి అనే పట్టణాన్ని నిర్మించి, ఆనర్తము మొదలైన దేశాలను పెంపుతో పాలించాడు. అతడు కకుద్మివంటి శ్రేష్ఠులైన వందమంది కొడుకుల్ని కన్నాడు. కీర్తిమంతుడైన రైవతుడు తన కుమార్తె రేవతిని బ్రహ్మకు చూపించి తగిన వరుణ్ణి అడగాలనుకొని బ్రహ్మలోకానికి వెళ్ళాడు. అప్పుడు బ్రహ్మకొలువులో గంధర్వులు కిన్నరులు ఆడుతూ పాడుతూ ఉండడంవల్ల దర్శించే సమయంకోసం ఒక్కక్షణంపాటు నిలబడ్డాడు.
అంతట దర్శించే సమయం కలుగగా, బ్రహ్మకు నమస్కరించి రైవతుడు రేవతిని చూపించి ఇట్లా అన్నాడు.
అమాయకురాలు, అందకత్తె, ప్రాయంలో ఉన్న ఈ మంచి మనస్సున్న అమ్మాయికి భర్తఎవడో? సెలవివ్వండి అన్నాడు రైవతుడు. బ్రహ్మ మనోదృష్టితో పరికించి పక పక నవ్వి ఇలా అన్నాడు.
'ఓ రాజా! ఈమె కోసం మనసులో భావించిన వాళ్ళందరూ కాలంతోపాటు చెల్లిపోయారు. ఇప్పుడు వాళ్ళకొడుకులు, మనుమలు ఎవ్వరూ లేరు; గతించారు. భూమిమీద వాళ్ల గోత్రాలపేర్లు కూడ వినబడవు. నీవు వచ్చిన ఈ లోపలే ఇరవై ఏడు పర్యాయాలు నాలుగుయుగాలు వరుసగా గడచిపోయాయి. కాబట్టి నీవిపుడే భూలోకానికి వెళ్లు. దేవదేవుడు సర్వభూతాత్మకుడు అయిన నారాయణుడు భూభారాన్ని పోగొట్టడానికి తన అంశతో బలరాముడుగా అవతరించాడు. నీవు ఈ కన్యారత్నాన్ని ఆయన కివ్వు' అని అన్నాడు.
(బ్రహ్మలోకంలో ఒక్క క్షణకాలం - భూలోకంలో ఇరవైఏడు మహాయుగాలు గడచిన దానితో సమానం)
ఇట్లా ఆనతియ్యగా బ్రహ్మకు రైవతుడు నమస్కరించి భూలోకానికి వచ్చాడు. ఆయన తనసోదరులు, స్వజనులులేని తన నగరానికి వచ్చాడు. బలదేవుని చూచి రేవతీకన్యను అయనకిచ్చి పెళ్ళిచేసి నారాయణుని ఆశ్రమముండే బదరికావనానికి నియమబద్ధమైన తపస్సు చేయటం కోసం వెళ్ళాడు.
ఓ రాజా! నభగుడనే మనువుకు బుద్ధిమంతుడైన నాభాగుడు జన్మించాడు. అతని సోదరులు యజమానులుగా జీవించడంకోసం నాభాగుని ఆస్తిని పంచుకొన్నారు.
బ్రహ్మచారియైన నాభాగుడు తనసోదరులను తండ్రిఆస్తిలో భాగమడిగాడు. వారు తండ్రి చెప్పేపద్ధతిలో ఇస్తామన్నారు. నాభాగుడు తండ్రి దగ్గరకు వెళ్ళి సంపదను భాగాలు చేయమన్నాడు. అపుడు తండ్రి “ఇక్కడ దగ్గరలో అంగిరసులు సత్త్రయాగం చేస్తున్నారు. వారు గొప్పజ్ఞానులే అయినా ఆరవరోజు యాగంలో చేయవలసిన కర్మకాండ మనసుకు రాక మూఢులవుతారు. అపుడు నీవు వారిదగ్గరకువెళ్ళి వైశ్యదేవసూక్తాలను రెండింటిని చెప్తే కవి అని అందరూ అంటారు. యాగం పూర్తియై వారు స్వర్గానికి వెళ్తూ యాగంలో మిగిలిన సంపదనంతా నీకిస్తారు” అని చెప్పాడు. నాభాగుడు తండ్రి దగ్గర సెలవు తీసుకొని ఆయన చెప్పినట్లు చేశాడు. అంగిరసులు యాగంలో మిగిలిన ధనాన్ని నాభాగునికిచ్చి స్వర్గానికి వెళ్ళారు. అపుడు
అంగిరసులిచ్చే బంగారం నాభాగునికి శుభప్రదంగా చేరే సమయంలో, పొడగరి, నల్లనివాడు అయిన ఒకడు రాజును ఆపి ముందు నిలబడి దాన్ని తీసుకొన్నాడు.
నాభాగుడు వాణ్ణి చూచి మునులు ఇవ్వడంవల్ల అది తనకు చెందవలసిన ధనమని చెప్పాడు. అప్పుడు ఆ మహాపురుషుడు “మీ తండ్రి చెప్పిన రీతిగా చేయడమే తగి ఉంటుంది” అన్నాడు. నాభాగుడు తండ్రిని అడగ్గా అతడు “పూర్వం ఋషులు యజ్ఞశాలలో మిగిలినధనం శివునకే చెందుతుందని తీర్మానించారు. కాబట్టి ఈ ధనానికి ఆ దేవుడే అర్హుడు. అని చెప్పాడు. అప్పుడు నాభాగుడు రుద్రునికి నమస్కరించి ఓ దేవా! ఈ ధనం నీకే చెందుతుందని మా తండ్రి చెప్పాడు. నేను దోషం చేశాను. మన్నించండి అన్నాడు. ఆ దేవుడు తండ్రితీర్పునకు, కొడుకునిజాయితికి మెచ్చుకొని నీవు నిజమే పలికావు. కాబట్టి యాగంలో మిగిలిన ద్రవ్యం నీకే ఇస్తున్నాను అని నాభాగునికి ఆత్మదర్శనాన్ని సనాతన బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశించి అంతర్ధానం చెందాడు.
లోకంలో నాభాగుని కథను ఉదయం సాయంత్రం వేళలలో చిత్తశుద్ధితో స్మరించినంతనే నరుడు పండితుడవుతాడు, మంత్రజ్ఞుడవుతాడు. మోక్షాన్ని పొందుతాడు.
అట్టి నాభాగునికి అంబరీషుడు జన్మించాడు. ఆతనిపట్ల లోకంలో ఎదురులేని బ్రాహ్మణశాపం వ్యర్థమైపోయింది. అని శుకుడు చెప్పగా “ఏ కారణంచేత జవదాటరాని బ్రాహ్మణదండన అతణ్ణి ఏమీ చేయలేక పోయింది?” అని రాజు అడిగాడు. అప్పుడు శుకుడు రాజుతో ఇలా అన్నాడు.
(నాభాగుని ఉదాత్త వృత్తాంతం చెప్పడం వెనుక ఉన్న కారణం మహాభక్త శిఖామణియైన అంబరీషుని భక్తితత్త్వానికి వేదిక నిర్మించటమే.)
Subscribe to:
Post Comments (Atom)
History of Emperor Sagara - సగర చక్రవర్తి కథాప్రారంభము
సగర చక్రవర్తి కథాప్రారంభము బాహుకుడు తన శత్రువులు తననోడించి రాజ్యం ఆక్రమించగా తన స్త్రీలతో అడవికి వెళ్ళి వృద్దాప్యం కారణంగా మరణించాడు. అతనిభా...
-
సూర్య ద్వాదశ నామాలు ధ్యేయః సదా సవితృమండలమధ్యవర్తీ నారాయణః సరసిజాసన సన్నివిష్టః । కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటీ హారీ హిరణ్మయవపుః ధృతశంఖచక్రః ...
-
ఆదిత్యహృదయం తతో యుద్ధపరిశ్రాంతం సమరే చింతయా స్థితమ్ | రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితమ్ || 01 || దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతో ...
-
నిత్య పారాయణ శ్లోకాలు స్తోత్రాలు నవ గ్రహ స్తోత్రం సుబ్రహ్మణ్యాష్టకం ఆదిత్యహృదయం కనకధారా స్త్రొత్రమ్ దుర్గాసప్తశ్లోకీ శ్రీ సరస్వతీ కవచం తోటకా...
No comments:
Post a Comment