Monday, March 23, 2026

Sree Maha Bhagavathamu Part 9 - శ్రీ మహా భాగవతము నవమస్కంధము

శ్రీరస్తు శీమహాభాగవతము నవమస్కంధము

శ్రీరాజిత! మునిపూజిత!, వారిధిగర్వాతిరేకవారణబాణా!
సూరిత్రాణ! మహోజ్జ్వల, సారయశస్సాంద్ర! రామచంద్రనరేంద్రా!


శ్రీరామచంద్రుడనే ఓ రాజా! సీతా సంయుతుడవై మునులచేత పూజింపబడేవాడా! సేతుబంధనానికి పూర్వం సముద్రాతిశయగర్వాన్ని నివారించిన బాణాలు కలవాడా! పండితుల్ని రక్షించినవాడా! మిక్కిలి ప్రకాశమానమైన, నిండైన కీర్తి కలవాడా!

(ఈ స్కంధంలో సూర్యవంశక్షత్రియుల చరిత్రలున్నాయి. సూర్యవంశంలో ప్రసిద్ధుడైన శ్రీరామచంద్రుని చరిత్రం కూడా ఉంది. ఆ శ్రీరాముని గుణగణాలను ఈ పద్యం సూచనప్రాయంగా తెలియజేస్తూ ఉంది.)

నైమిశారణ్యంలో భాగవతశ్రవణం చేయాలన్న కోరికతో చేరిన మునులు ఉన్నతగుణవంతులు. వారిని చూచి సర్వపురాణాలనూ విశదీకరించడంలో నిపుణుడైన సూతుడు ఇలా అన్నాడు.

ఆ రీతిగా ప్రాయోపవేశం చేసి ముక్తిమార్గం చూపుమని అడిగిన పరీక్షిన్మహారాజు నుద్దేశించి యోగివర్యుడైన శుకుడు ఈ విధంగా చెప్పాడు.

ఓ శుకమహార్షీ! మీరు చెప్పగా ఇంతకు మునుపు ఆరుగురు మనువులయొక్క వృత్తాంతాలు విన్నాను. ఆయా మన్వంతరాల్లో శ్రీ మహావిష్ణువు లీలల్ని తెలుసుకొన్నాను. ద్రవిళదేశాధిపతి అయిన సత్యవ్రతుడనే రాజు పూర్వసృష్టి అంతంలో విష్ణువును సేవించి జ్డానియై వైవస్వతుడనే పేరుతో సూర్యునికి జన్మించి మనువయ్యాడు. అతనికి ఇక్ష్వాకుడు మొదలుకొని పదమంది కొడుకులు ఉన్నారంటారుగదా! నా యందు దయతో ఆ వంశం ఏ విధంగా నడిచింది?, ఆ వంశస్థుల్లో చనిన, చనుతున్న, చనెడు వారిని అనగా ఆ వంశం యొక్క భూత, వర్తమాన. భవిష్యత్‌ స్థితిని గూర్చి చెప్పండి.

(1. మనువుల పుట్టుకను గూర్చి పూర్వస్కంధంలో వివరంగా చెప్పబడింది. (8-1-6). ఈ కల్పంలో ఆరుగురు మనువుల యొక్క వృత్తాంతాలు వివరింపబడ్డాయి. ప్రస్తుత కథా సందర్భం ఏడవమనువు వైవస్వతుని కాలానికి సంబంధించింది. పోయిన కల్పాంతంలో జరిగిన మీనావతారాంశమిది. ఆ సత్యవ్రతుడే వైవస్వతునిగా ఏడవ మనువైనాడు. ఇతనికి సంబంధించిన వృత్తాంతం ఈ నవమస్కంధప్రారంభంలో చెప్పబడింది.

2. సత్యవ్రతుడు పూర్వజన్మలో ద్రవిళదేశాధిపతి. ఈ కల్పంలో వివస్వంతుడు అనబడే సూర్యునికి శ్రాద్ధదేవుడిగా జన్మించి, శ్రీహరి కృపావశంచేత ఏడవ మనువైనాడు. ఇక్కడనుండి సూర్యవంశపు రాజుల ప్రస్థానం ప్రారంభమవుతుంది.)

ఓ మహార్షీ! సూర్యవంశంలో జన్మించిన రాజుల కీర్తిప్రతిష్టలు నేడు చెవులార వినాలని కుతూహలం కలుగుతోంది. వరుసగా వాటిని గూర్చి వివరించండి. ఈ లోకంలో పుణ్యాత్ముల కీర్తిని గూర్చి వినడం పుణ్యదాయకమే కదా!

మనువుల వర్తనాలు, సూర్యవంశరాజుల చరిత్ర విపులంగా చెప్పుమని పరీక్షిన్మహారాజు కోరగా, పరాశరమహర్షి మనుమడైన శుకయోగీంద్రుడు ఇలా అన్నాడు.






No comments:

Post a Comment

History of Emperor Sagara - సగర చక్రవర్తి కథాప్రారంభము

సగర చక్రవర్తి కథాప్రారంభము బాహుకుడు తన శత్రువులు తననోడించి రాజ్యం ఆక్రమించగా తన స్త్రీలతో అడవికి వెళ్ళి వృద్దాప్యం కారణంగా మరణించాడు. అతనిభా...