ఓ నారద మహార్షీ! బాలుణ్ణి, కాంతిగల వాడిని, హరిపాద పద్మాలను అనుదినం చింతించేవాడిని, దయాస్వభావం గలవాడిని, సత్పురుషులకు గురువులకు నమస్కరించేవాడిని, స్వచ్చమైన సంపదలు గలవాడిని, సభ్యులందరి పొగడ్తలు పొందేవాడిని, మోహ లతలను త్రెంచుకొన్నవాడైన ప్రహ్లాదుణ్ణి తండ్రి ఎందుకు చంపించే ప్రయత్నం చేశాడు. ఈ విచిత్రం నాకు చెప్పవా! అని ధర్మరాజు ప్రశ్నించాడు.
అని పలికిన ధర్మరాజుతో నారదుడు ఇలా అన్నాడు.
రాక్షసరాజు హిరణ్యకశిపుడు ఒకరోజు తన కుమారుని చూచి ఆలోచించి ఆతృతతో ఈ ప్రహ్లాద కుమారుడు లభించిన రాక్షస రాజ్యపదవిపై ఆశచూపడు. ఎల్లప్పుడు మర్యాద తప్పక బలం లేని వానివలె నిశ్చైతన్యంగా రాక్షసబుద్ధి లేక సభ్యతతో ఉంటాడు. వీడు విద్యాభ్యాసంవల్ల గాని తీక్ష్ణ బుద్ధి కాలేడని అనుకొన్నాడు.
ఓ ప్రియకుమారా! విద్య నేర్వకున్నచో అజ్ఞాని అవుతాడు. విద్య నేర్చినవాడు విచక్షణా జ్ఞానం కలిగి నేర్పరి అవుతాడు. అందుకే అందరు తప్పక చదువుకొని తీరాలి. పెద్దలవద్ద నీకు విద్య నేర్పిస్తాను. బుద్ధిగా చదువుకో.
ఈ విధంగా సుతునితో హిరణ్యకశిపుడు పలికి, రాక్షసలోక పురోహితుడు, మిక్కిలి పూజ్యుడు అయిన శుక్రాచార్యుని కుమారులను, తీవ్రమైన విచారణ చేసే చండ, అమర్క అనేవారు ఇరువురిని పిలిచి, వారిని సత్కరించి ఇలా అన్నాడు.
మా ప్రహ్లాదకుమారుడు అజ్ఞానంతో అంధుడై ఉన్నాడు. దేనికి సమాధానం చెప్పడు. నా ప్రతాప క్రియల వాసన కూడా అతనికి తెలియదు. మీరు మాకు గురుదేవులు. దయగలవారు. మీరు మాకు మనఃపూర్వకమైన బంధువులు, మాన్యులు, మాకు పెద్దలు, మమ్మల్ని మన్నించి ఈ ప్రహ్లాదబాలుడి అనేక గ్రంథాలను చదివించి, రాజనీతిజ్ఞునిగా చేసి మమ్మల్ని రక్షించండి.
ఈ విధంగా హిరణ్యకశిపుడు గురువులతో పలికి ప్రహ్లాదుని వారికి అప్పగించి తీసికొని పొమ్మన్నాడు. చండామర్కులు కూడా ఈ ప్రహ్లాద కుమారునితోపాటు అతని వయస్సే గల మరికొంతమంది రాక్షస పుత్రులను అతనితో పాఠాలను వినేవారిని చేర్చి.
శుక్రాచార్యుని పుత్రులు ప్రహ్లాదుని తీసికొని దానవరాజ ప్రాసాదానికి సమీపంలో ఉన్న భవనంలోనికి ప్రవేశించారు. హిరణ్యకశిపునిపై భక్తి అతిశయించగా ప్రహ్లాదునకు తగిన రాజనీతి శాస్త్రములు చాల చదివించారు. ప్రహ్లాదుడు నిశ్చలమైన విష్ణుభక్తి గలవాడై, గురువులు చెప్పిన శాస్త్రవిద్యలు అన్నింటిని విని చక్కగా అధ్యయనం చేశాడు.
ప్రహ్లాదుని నిశ్చయమైన బుద్ధికి గురువులు చెప్పే శాస్త్రాలన్నీ అసత్యాలని, అవి నిజాలుగా ఆరోపింపబడుతున్నాయని తెలుసు. అయినప్పటికీ వినయ సంపన్నుడు కాబట్టి, ఆ ప్రహ్లాదుడు గురువులు ఎలా చెప్పారో అలాగే చెపుతాడు తప్ప 'అదికాదు ఇదీ' అని గాని 'ఇలా కాదు అలా' అని గాని గురువులను ఆక్షేపించడు.
విద్యనేర్చుకోవడానికి కొడుకును పంపిన కొన్నినాళ్ళకు, హిరణ్యకశిపునికి మనసులో శంక కలిగింది. తనకుమారుని గురువులు ఏ రీతిగా చదివించారో అమాయకుడైన ఈ పసిబాలుడు ఎలా చదివాడో? అనుకొంటూ, అతని విద్యాభ్యాస కృషిని తెలిసికొందామనే ఆలోచన కలిగి ఒకనాడు తన భవనంమధ్యలో ఆసీనుడై.
ఆ రాక్షస వంశశ్రేష్ఠుడైన హిరణ్యకశిపుడు సంసారసముద్రాన్ని దాటిన వాడిని, కామక్రోధలోభాది అరిషడ్వర్గాలను జయించినవాడిని, విష్ణు పదధ్యానమనే అమృతాన్ని నిరంతరం తాగటమే కఠోరవ్రతంగా గలవాడిని; పాపాలనే వృక్షాలుగల అరణ్యాన్ని ఖండించే గొడ్డలివంటివాడైన ప్రహ్లాద కుమారుని తనవద్దకు రమ్మని పిలిపించాడు.
ఈ విధంగా రాజభటులచేత పిలిపించిన ప్రహ్లాదుడు, తండ్రివద్దకురాగా
ఓ ప్రియపుత్రా! నీవు చేసే ప్రయత్నం ఉత్సాహ, ప్రభు, మంత్రశక్తుల మూడింటితో కలసిఉందా! జ్ఞానసంపన్నుడివైనావా! వేదాలు శాస్త్రాలు చదివావా! ఇలా దగ్గరకు రా. అని నిండైన వాత్సల్యంతో ప్రహ్లాదుని ఒడిలో చేర్చుకొని ఆసక్తితో హిరణ్యకశిపుడు ఇలా అన్నాడు.
(ఏ కార్యం నిర్వహించడానికైనా ఉత్సాహశక్తి, ప్రభుశక్తి, మంత్రశక్తి అనే మూడు శక్తులు అవసరం. మొదట పనిచేయాలనే ఉత్సాహం కావాలి. ఆ ఉత్సాహాన్ని తప్పుదారి పట్టించకుండా తప్పించే ప్రభుశక్తి కావాలి. తరువాత సరైన ఆలోచనా శక్తి కావాలి. ఈ మూడు చక్కగా సమన్వయం చేసుకున్నప్పుడే ప్రయత్నం సఫలం అవుతుంది. ఇక్కడ దానవరాజు ప్రహ్లాదుని 'విద్యాభ్యాస సమయంలో ఈ మూడింటిని పాటిస్తున్నావా?' అని ప్రశ్నిస్తున్నాడు.)
ఓ ప్రహ్లాదకుమారా! తమ తమ పుత్రులతో సంభాషించడం ఆ యా తల్లిదండ్రులకు నిరంతరం సంతోషం నింపుతుంది. అంతేకాదు. వారి సంభాషణలు శ్రమను, తాపాన్ని దుఃఖాన్ని నివారిస్తాయి. తల్లిదండ్రుల చెవులకు తమ పుత్రుల మాటలు వినడమే చెవులకు భూషణాలు ధరించుట వంటిది.
ఓ కుమారా! ఇంతవరకు నీవు చేసిన విద్యాభ్యాస విషయాలలో నీకు మంచిదని తోచిన అంశాన్ని చెప్పు అని ప్రియపుత్రుడైన ప్రహ్లాదుణ్ణి కన్నతండ్రి హిరణ్యకశిపుడు అడిగాడు. అపుడు ప్రహ్లాదుడు ఇలా అన్నాడు.
ఓ రాక్షసరాజా! మానవులందరూ వారి వారి ఇల్లు అనే చీకటి నూతిలో పడిపోకుండా, మీరు, మేము అనే భేదభావంతో అఖండతత్త్వ భావనను విడిచి ప్రవర్తించక ఈ సమస్త ప్రపంచం ఆ పరమాత్మ దివ్యమైన కళావిలాసమే అనే సత్యాన్ని గుర్తించి, విష్ణువులో తమ మనసును చేర్చి అడవులలో ఏకాంతంగా జీవించటం మేలు.
(సంసారం అనే చీకటి బావిలో పడరాదు. అభేద దర్శనం జ్ఞానం అన్న శాస్త్రోక్తిని అనుసరించి భేదదృష్టితో కాకుండా అందరినీ సమబుద్ధితో చూడాలి. ఈ విశ్వమంతా కూడా వాసుదేవుని దివ్యకళాత్మకమే అని భావించాలి.)
ఈ ప్రకారంగా ప్రహ్లాదుడు శత్రువైన విష్ణువును స్తుతించేలా మాట్లాడిన మాటలు విని హిరణ్యకశిపుడు నవ్వుతూ ఇలా అన్నాడు.
ఇతర రాక్షసపుత్రులు గురువులవద్ద చదువువారు ఎలా అడిగితే అలా సమాధానం చెపుతారు. ఇలా ఎదిరించి ఇది అది అది ఇది అని అనరు. నా పుత్రుడైన ప్రహ్లాదునకు శత్రుపక్షం పై అభిమానం కలిగేలా ఎవరు ఏ రీతిగా తల కెక్కేలా గట్టిగా చెప్పారో కదా!
ఓ ప్రహ్లాద కుమారా! నాకు చాల చిత్రంగా ఉంది. ఈ బుద్ధి నీకు స్వతహాగా కలిగిందా! ఇతరులు ఎవరైనా చెప్పారా! లేదా ఏకాంతంగా ఉన్నప్పుడు గురువులే బోధించారా! నిజానికి ఆ వైకుంఠ వాసుడైన విష్ణుమూర్తి మన రాక్షసులందరికి కీడు చేశాడు. బద్ధవిరోధి. అటువంటి విష్ణువును మరల మరల వర్ణించి చెపుతున్నావు. ఇది నీకు అనవసరం సుమా!
ఓ కుమారా! దేవతలను తరిమికొట్టడమో, దేవతానాయకులను అణగగొట్టడమో, సిద్ధులను వేధించడమో, మునులను బాధించడమో యక్ష కిన్నర, గంధర్వ, విహంగ, నాగ నాయకులను నాశనం చేయడమో చేయాలి తప్ప 'హరి గిరి' అంటూ మోహంతో కండ్లు మూసుకు పోయి మాట్లాడటం నీ కెందుకు?!
తండ్రి మాటలకు ప్రహ్లాదుడు పురోహితులను చూచి ఇలా అన్నాడు. మోహాన్ని విడిచిపెట్టి, పరమాత్మతో తాత్పర్య భావం కలిగిన, జ్ఞానంగల పురుషులకు, ఎవరి దయవలన "ఇతరులు తాము" అనే భేదభావం నశిస్తుందో అటువంటి పరమేశ్వరునికి నమస్కారం చేస్తాను.
(పరమాత్ముని దయగలవారికే, భేదదృప్టిలేని అఖండ చైతన్యజ్ఞానం లభిస్తుంది. సర్వం బ్రహ్మమయంగా గోచరిస్తుంది. అటువంటి దృక్పథం ఏర్పడాలంటే, ముందు మానవులు మోహాన్ని వదిలిపెట్టాలి. పరమాత్మయందు తాదాత్మ్యభావం కలిగి ఉండాలి. అప్పుడే వారికి భేదదృష్టి అనే అవిద్య నశిస్తుంది. సత్యచైతన్య జ్ఞానం కలుగుతుంది. అలా కలగజేసే పరమాత్మకు నమస్కారం అని ప్రహ్లాదుని భావం.)
కొందరు అజ్ఞానులు మేము వేరు, మీరు వేరు, అనే మాయలోపడి, ప్రజ్ఞవల్ల మాత్రమే అందునటువంటి సర్వాత్మకుడైన, పరమాత్మను, తమ మూర్ఖపు తెలివితేటలతో గుర్తించి మాట్లాడలేరు. సర్వభూతాంతరాత్మ అయిన ఆ భగవానుణ్ణి గుర్తించడానికి, వేదవేత్తలైన బ్రహ్మాదులు కూడా మూఢులవుతున్నారు. అటువంటి పరమాత్ముడైన విష్ణువును ఇతరులు దర్శించగలుగుతారా! ఎంతమాత్రం దర్శించలేరు.
ఓ బ్రాహ్మణోత్తమా! ఇనుము అయస్కాంతం వద్ద ఎలా ఆకర్షింపబడి ఉంటుందో ఆ విధంగా దైవయోగంవలన నా చిత్తంకూడా ఆకర్షింపబడుతూ, హృషీకేశుడైన విష్ణుమూర్తి సన్నిధిలో లీనమవుతోంది.
ఓ సుగుణ సంపన్నా! మహానుభావా! వేయిమాట లెందుకు! మందార మకరందంలోని తీపిని అనుభవించే తుమ్మెద ఉమ్మెత్తపూల జోలికిపోదు. స్వచ్చమైన గంగా తరంగాలపై తూగాడే రాజహంస, వాగుల వంకల వైపు పోనే పోదు. లలితంగా ఉండే తీపి మామిడి చిగుళ్ళు తిని గొంతు సవరించే కోయిల, కొండమల్లెల వద్దకు వెళ్ళదు. నిండు చందమామ వెన్నెలలో తిరుగాడే చకోరపక్షి మంచువద్దకు చేరనే చేరదు. పద్మనాభుడైన విష్ణుమూర్తి పదపద్మ ధ్యానమనే అమృతపానంచేత విశేషంగా మదించిన మనస్సు, ఐహిక విషయాలవైపు ఎలా చేరుతుంది చెప్పు. చేరనే చేరదు.
ఈ మాటలు విని రాజసేవకుడైన బ్రాహ్మణుడు ప్రహ్లాదుని ధిక్కరించి ఇలా అన్నాడు.
శత్రువులను గౌరవించి స్వజనులను దూషించే స్వభావంగల ఓ ప్రహ్లాదా! నిండా ఐదేళ్ల వయసు లేదు. చిన్న బాలుడవు; ఇంతైనా లేవు. తర్కవాక్యాలు మాట్లాడుతున్నావు. ఇంతవరకు మేము విద్యాభ్యాస కాలంలో శాస్త్రార్థం ఎలా చెప్పామో అలా చెప్పక రాక్షసరాజు ముందు మాకు తలవంపులు తెచ్చావు.
రాక్షసేంద్రునకు ఈ ప్రహ్లాదుడు కొడుకు కాదు, శత్రువు. రాక్షసకులం అనే శ్రీగంధపుతోటలో ఈతడు ముళ్ల చెట్టులాగా జన్మించాడు. నిత్యం రాక్షసుల శత్రువైన విష్ణువుని స్తుతిస్తూ ఉంటాడు. దండిస్తే తప్ప, వీడు, చెప్పిన మాట వినడు. వీణ్ణి బంధించి గట్టిగా కొట్టండి.
ఓ రాక్షసరాజా! విను! ఈ బిడ్డను మేము చదివిస్తాం. నీ పాదాలపై ప్రమాణం చేస్తున్నాం. బాగా చదివిస్తాం. ఇంతకు మునుపు కంటె జాగ్రత్తగా అతనిని దండిస్తాం. దయచేసి మాపై ఆగ్రహించవద్దు.
అని పలికి ఆ రాజపుత్రుని అనేక విధాలుగా భయపెట్టి, రాజువద్దనుండి బయటకు తమతో తీసికొని వెళ్ళి ఏకాంతంలో
ఓ రాజా! రాక్షసమార్గం తప్పకుండా నిరంతరం అనేక పర్యాయాలు ప్రహ్లాదునకు ఆ భార్గవసుతుడు ధర్మార్థకామములను గూర్చి బోధింపగా
గురువులు శిష్యుడైన ప్రహాదునకు సామ, దాన, భేద, దండోపాయములను పూర్తిగా తెలియజెప్పి, నీతికోవిదుడయ్యాడని నమ్మి, నిర్ణయించుకొని, ఆ విషయాన్ని ముందుగా ప్రహ్లాదుని తల్లికి తెలియజెప్పి, తల్లిచేత అతనికి అలంకారం చేయించి ఆ ప్రహ్లాదుని చూచి
ఓ ప్రహ్లాదా! మా మాటను విను. మేము చెప్పిన విషయాలు తప్పవద్దు. విస్తారాలైన ధర్మార్థకామాలను గూర్చిన పాఠాలను తప్పవద్దు. మన రాక్షసేంద్రుని ముందు మేము చెప్పిన రాజనీతిని తప్ప, మనకు శత్రువైనవాని నీతులను చెప్పవద్దు. చెడ్డవైన విష్ణుకథా చరిత్రలు వెల్లడించవద్దు.
అని ఈ ప్రకారంగా ప్రహ్లాదుణ్ణి బుజ్జగించి, గురువులు దానవరాజువద్దకు తీసుకొని రాగా!
అడుగుతీసి అడుగువేస్తే విష్ణుచింతన అనే అమృత మాధుర్యంలో మైమరచిపోయేవాడిని, బ్రహ్మాదులుకూడా నేర్వలేని, హరిభక్తి పురుషరూపం దాల్చినవాడిని ఎలా ఉంటుందో రూపుకట్టినవాడిని, తల్లికడుపులో ప్రాణం పోసుకున్నది మొదలు తన చిత్తం విష్ణువు మీదే నిలిపిన వాడిని, ఈ ప్రపంచం అంతా విష్ణమయమే అని తనలో భావించేవాడిని, వినయం, దయ, సద్బుద్ధి, వివేకం, సల్లక్షణాలకు నిలయమైనవాడిని, పండితులచే ప్రశంసలు పొందగల తన శిష్యుడైన ప్రహ్లాదుణ్జి, గురువు సమీపించి హిరణ్యకశిపుని ముందుకు తోసి 'తండ్రికి నమస్కరించు' మని అన్నాడు.
(ప్రహ్లాదుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడే నారదుని ఉపదేశంవల్ల అతనికి విష్ణుభక్తి విశేషంగా పెంపొందింది. పువ్వు పుట్టగానే పరిమళించినట్లు ప్రహ్లాదునిలో వినయ విధేయతాది లక్షణాలు బాల్యంనుండే వికసించాయి.)
ఓ రాక్షసాధీశ్వరా! నీ కుమారుని మేం చక్కగా శిక్షించాం. అతడు ఇతర పక్షాలు మాని నీతికోవిదుడయ్యాడు. నీ బిడ్డ విద్యాబలాన్ని నీవు పరీక్షించి చూచుకోవచ్చు.
అలా మాట్లాడిన, శుక్రాచార్య కుమారుని మాటలు విని, హిరణ్యకశిపుడు తనకు సాష్టాంగనమస్కారం చేసి నిలుచున్న తన కుమారుని దీవించి, తన బాహువును సాచి దగ్గరకు తీసికొని, గాఢంగా కౌగలించుకొని, ఒడిలోనికి తీసికొని, ముంగురులు దువ్వి, గడ్డాన్ని పుణికి, బుగ్గపై ముద్దు పెట్టి, శిరస్సును ఆఘ్రాణించి, అతిశయించిన ప్రేమవల్ల జనించిన ఆనందాశ్రువులతో కుమారుని ముఖారవిందాన్ని తడుపుచూ, మెల్లని తీయని మాటలతో ఇలా అన్నాడు.
నీవు గురువులవద్దకు వెళ్లి చాలకాలం అయింది. మీ గురువులు వెదికి వెదికి నీకు ఏ ఏ విషయాలు చెప్పారో, ఏ మార్గంలో ఎంతవరకు చదివించారో, నీ విద్యాసారం తెలిసికోవాలని ఉంది. నీవు నేర్చిన శాస్త్రంలో ఒక్క పద్యాన్ని చెప్పి దానికి, అర్థంతోపాటు తాత్పర్యాన్ని కూడ వివరించవయ్యా!
ఓ ప్రహ్లాదకుమారా! నీతో చదువుకొనే నీ సహాధ్యాయులైన రాక్షసబాలురు నేర్పుతో గ్రంథాలన్నీ పరికించి అన్నీ చక్కగా చెప్పగలరు. నీతిపాఠాల విషయంలో వారు నిన్ను మెచ్చరు కదా! నీవు ఎప్పుడు నీతి పారంగతుడ వవుతావో అని మిక్కిలి కోర్కెతో ఎదురు చూస్తున్నాను. నా కన్నతండ్రివి కదూ! ఏదీ నీ గొప్పదనాన్ని చూపించు.
అలా అనగా కన్నతండ్రికి ప్రియ పుత్రుడైన ప్రహ్లాదుడు ఇలా సమాధానం చెప్పాడు.
తండ్రీ! నన్ను మా గురువులు చక్కగా చదివించారు. ధర్మం, అర్ధం ప్రధానంగాగల శాస్త్రాలను నేను చదివాను. నేను చదివినవి చాల ఉన్నాయి. వేయిమాట లెందుకు! చదువులలో దాగి మర్మాన్ని నేను తెలుసుకున్నాను.
(ఇక్కడ ప్రహ్లాదుని తండ్రి బోధించమన్నది ధర్మార్ధకామాలు మాత్రమే. గురువులు అట్లే చెప్పారు. కాని తండ్రి అడిగినప్పుడు “చదివితి ధర్మార్ధ ముఖ్యశాస్త్రంబులు" అన్నాడు. ఈ మాటల్లో ధర్మం, అర్ధం ముఖ్యమైన శాస్త్రాలు అని అర్థం చెప్పినప్పుడు త్రివర్గంలోని ధర్మ, అర్థాలు మాత్రమే చదువుకున్నాడు అనిపిస్తుంది. అతనికి కామశాస్త్రం పై దృష్టిలేదు. మరొక అర్ధం ధర్మార్థముఖ్య అనేచోట ధర్మంయొక్క అర్ధాన్ని వివరించే అంశాలు చదువుకున్నాడని చెప్పవచ్చు. అప్పుడు అర్ధకామాలు రెండూ ఉండవు. కేవలం ధర్మమే ఉంటుంది. అదికూడా భగవత్పరమైనదిగా ప్రహ్లాదుని భావన. చదువుల రహస్యమంతా పరతత్త్వం బోధించడమేనని ప్రహ్లాదుని భావం.)
ఓ రాక్షస శ్రేష్ఠా! 1) స్నేహం, 2) శ్రవణం, ౩) దాస్యం, 4) వందనం, 5) అర్చనం, 6) సేవ, 7) ఆత్మలో అన్నిటిని గ్రహించునేర్పు 8) సంకీర్తనం 9) నిరంతరభావన అనే ఈ తొమ్మిది భక్తి మార్గాలను మనసా వాచా కర్మణా త్రికరణశుద్ధిగా పాటిస్తూ, సర్వాత్ముడైన విష్ణువును నమ్మి సజ్జనుడై సాధుపురుషుడై ఉండటం సత్యమని, శ్రేయస్కరమని భావిస్తున్నాను.
(శ్లో: శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం పాదసేవనం |
అర్చనం వందనం దాస్యం సఖ్య మాత్మనివేదనం॥
నవవిధ భక్తిమార్గాలు కూడా త్రికరణశుద్ధిగా పాటించాలని 'తనుహృద్భాషలు' గా అని పోతన పేర్కొనడం విశేషం.)
గ్రుడ్దివానికి వెన్నెల విరిసినా తెలియదు. శంఖధ్వానము చెవిటివానికి వినిపించదు, మూగవాడు మంచి గ్రంథాలు చదివినా వాటిభావాలను వ్యక్తం చేయజాలడు. నపుంసకులు అందమైన స్త్రీలను వాంఛిస్తే నిరుపయోగం. కృతఘ్నులతో బంధుత్వం వహించుట పూర్తిగా వ్యర్థం. బూడిదలో హోమద్రవ్యాలు వేయటం నిరుపయోగం. లోభి వానివద్ద ఎంత సంపద ఉన్నా ఉపయోగం లేదు. సూకరానికి సుగంధాల ప్రయోజనం సిద్ధించదు. ఈ విషయాలు అన్నీ ఎలా నిరుపయోగాలో అలాగే విష్ణుమూర్తిపై భక్తిలేని జనుల జీవితాలు కూడా నిరర్ధకాలే.
ఓ తండ్రీ! విష్ణువును పూజించే చేతులే చేతులు. శ్రీనాథుని వర్ణించే నాలుకే నాలుక; దేవరక్షకుని చూచే చూపులే చూపులు. శేషశయనుడైన హరికి మ్రొక్కే శిరస్సే నిజమైన శిరస్సు. విష్ణుని గూర్చి వినే చెవులే చెవులు. మదుసూదనునియందు లగ్నమైన మనస్సే మనస్సు. భగవంతునికి ప్రదక్షిణ చేసే పదములే పదములు. పురుషోత్తముని మీది బుద్ధే నిజమైన బుద్ధి. పరదైవమైన విష్ణువును యోచించే దినమే దినము. చక్రధారిని ప్రకటించే చదువే చదువు. భూదేవి భర్తఅయిన శ్రీహరిని గూర్చి చెప్పేవాడే నిజమైన గురువు. హరిపదాలను ఆశ్రయించు అని చెప్పే తండ్రే నిజమైన తండ్రి.
గ్రుడ్దివానికి వెన్నెల విరిసినా తెలియదు. శంఖధ్వానము చెవిటివానికి వినిపించదు, మూగవాడు మంచి గ్రంథాలు చదివినా వాటిభావాలను వ్యక్తం చేయజాలడు. నపుంసకులు అందమైన స్త్రీలను వాంఛిస్తే నిరుపయోగం. కృతఘ్నులతో బంధుత్వం వహించుట పూర్తిగా వ్యర్థం. బూడిదలో హోమద్రవ్యాలు వేయటం నిరుపయోగం. లోభి వానివద్ద ఎంత సంపద ఉన్నా ఉపయోగం లేదు. సూకరానికి సుగంధాల ప్రయోజనం సిద్ధించదు. ఈ విషయాలు అన్నీ ఎలా నిరుపయోగాలో అలాగే విష్ణుమూర్తిపై భక్తిలేని జనుల జీవితాలు కూడా నిరర్ధకాలే.
ఓ తండ్రీ! విష్ణువును పూజించే చేతులే చేతులు. శ్రీనాథుని వర్ణించే నాలుకే నాలుక; దేవరక్షకుని చూచే చూపులే చూపులు. శేషశయనుడైన హరికి మ్రొక్కే శిరస్సే నిజమైన శిరస్సు. విష్ణుని గూర్చి వినే చెవులే చెవులు. మదుసూదనునియందు లగ్నమైన మనస్సే మనస్సు. భగవంతునికి ప్రదక్షిణ చేసే పదములే పదములు. పురుషోత్తముని మీది బుద్ధే నిజమైన బుద్ధి. పరదైవమైన విష్ణువును యోచించే దినమే దినము. చక్రధారిని ప్రకటించే చదువే చదువు. భూదేవి భర్తఅయిన శ్రీహరిని గూర్చి చెప్పేవాడే నిజమైన గురువు. హరిపదాలను ఆశ్రయించు అని చెప్పే తండ్రే నిజమైన తండ్రి.
పద్మాక్షుడైన విష్ణుమూర్తికి సేవచేయని శరీరం శరీరం కాదు. గాలితో నిండిన తోలు తిత్తిమాత్రమే. వైకుంఠవాసుడైన విష్ణుమూర్తిని స్తోత్రం చేయని నోరు నోరు కాదు. కేవలం ఢమ ఢమ అని ధ్వనించే చర్మపుఢక్క మాత్రమే. హరిని పూజించని చేయి చేయే కాదు. కేవలం చెట్టు కొమ్మతో చేసిన తెడ్డు మాత్రమే. ఇందిరాపతిని చూడని కన్నులు కన్నులా! శరీరమనే కిటికీరంధ్రాలు మాత్రమే. సుదర్శనాయుధుని చింతించని జన్మము జన్మమే కాదు. నీటిపైని కదిలే బుడగ మాత్రమే. విష్ణుభక్తిలేని పండితుడు పండితుడు కాదు. రెండు పాదాలతో నడిచే పశువు మాత్రమే.
(భగవంతుడు మనిషికి కరచరణాది అవయవాలు ప్రసాదించాడు. ఆ కారణంవల్ల మనిషి దేవునిపట్ల కృతజ్ఞుడై ఉండడం ఒక రకమైతే ఆ అవయవాలను విష్ణుసేవకు అర్పితం కావాలని ఇక్కడ ప్రబోధిస్తున్నాడు. కంజాక్ష, వైకుంఠం, హరిపూజనం, కమలేశ, చక్రశబ్దాలు, విశిష్టార్థద్యోతకాలు.)
ఓ రాక్షసేశ్వరా! విష్ణుమూర్తి సేవ అనే పెనుగాలి వీచకపోతే ఈ జననమరణాలనే దట్టమైన సంసారమేఘం వీడిపోదు. విష్ణుమూర్తి సేవ అనే ఒక అమృతవర్షం కురియకపోతే తాపత్రయాలతో కూడిన ఈ దావాగ్నులు చల్లారవు. శ్రీహరిపైగల జ్ఞానం అనే బడబాగ్ని లేకపోతే పాపపుజలరాసులు ఇంకిపోవు. పుండరీకాక్షుని గూర్చిన ధ్యానమనే సూర్యకాంతులు లేకుంటే కష్టాలనే గాఢాంధకారం సమసిపోదు. శార్ఙమనే కోదండాన్ని ధరించిన విష్ణుచింతనం అనే కాటుక కనులకు పెట్టుకోకపోతే అపురూపమైన, తరగని, నిర్మలమైన ముక్తి అనే పెన్నిధిని చూడజాలం. ఈ మాటలు నీ కొఱకు నా కొఱకు మాత్రమే కాదు. సాక్షాత్ పద్మగర్భుడైన బ్రహ్మకుకూడా విష్ణుస్మరణ వినా ముక్తికి వేరొక మార్గం లేదు.
(అంజనం - దూరంగా ఉన్న వస్తువును కనుగొనేందుకు కన్నులకు పెట్టుకునే కాటుక.)
ఈ విధంగా జంకు గొంకులేకుండా భయం విడిచి మాట్లాడిన కొడుకు మాటలు చెవులకు ములుకులవలె తాకగా, చెక్కిళ్ళు అదిరిపోగా, కోపంతో పెదవి కరుస్తూ అదిరిపడి గురుపుత్రుని చూచి, శత్రువుకు సంబంధించిన కథలను నా పుత్రునకు నేర్పావని కోపంతో రాక్షసరాజు ఇలా అన్నాడు.
నా కుమారుని నీతిశాస్త్ర పారంగతుని చేస్తానని నీవు తీసికొని వెళ్ళి వానికి అర్హంగాని విరోధిశాస్త్రాలు కుటిల బుద్ధితో నూరిపోసి మోసం చేశావు. నేను నిన్ను భృగువంశంలో గొప్పవాడవని నమ్మినాను. అయ్యయ్యో! నీవు బ్రాహ్మణుని ఆకారంలో ఉన్నావుగాని నిజమైన బ్రాహ్మణుడవు కాదు.
ఓ బ్రాహ్మణా! ఆ యా జనులను బాధించి, రహస్యంగా చేసే చెడ్డపనులు దుర్మార్గపు పనులు చేసేవారిని రోగాలు పట్టి పీడిస్తాయి. అలాగే అధర్మవర్తనులను, కుటిలబుద్దులను పాపాలు చేరి బాధిస్తాయి.
అని పలికిన ఆ రాక్షసరాజునకు, పురోహితుడు ఇలా చెప్పాడు.
ఓ రాక్షసరాజా! మావల్ల ఏ దోషాలు జరగలేదు. మేము విరోధుల కథలు గాథలు చెప్పలేదు. మేమే కాదు. ఇతరులు కూడా చెప్పలేదు. మీ పాదాలపై ఒట్టు సుమా! ఇది మీ కుమారుని సహజమైన బుద్ది విశేషం మాత్రమే. ఎవ్వరు చెప్పినది కాదు. జరిగింది జరిగిపోయింది. నేర్పుతో ఇప్పుడు ప్రతిక్రియ ఏమి చేయాలో ఆలోచించు.
ఓ దైత్యవంశాంబుధి చంద్రమా! చక్కగా విను. మేం నీకు మిత్రులం. పురోహితులమై నీ మేలు కోరేవాళ్లం. తగినవారం. అంతేగాక, నీ కులానికి గురువులైన భృగువంశంలో జన్మించినాము. ఇటువంటి మేం నీ కుమారునికి ఇలా విరోధిశాస్త్రాలు చెపుతామా! అలా చేయడానికి మేం నీకు శత్రువులమా చెప్పు!
ఈ విధంగా గురుపుత్రుడు పలుకగా, ఆ గురుపుత్రుడైన ఆచార్యుని పై ఆగ్రహింపక, ఆ దానవరాజు కొడుకునుచూచి ఇలా అన్నాడు.
ఓ కుమారా! నీకు ఉపాధ్యాయులు బోధించని ఈ విషయాలు నా పుత్రుడవైన నీకు ఎవరివల్ల తెలిశాయి? ఎవరు నీకు ఈ వైరి విషయాలు చెప్పారో, వారెవరో ఇప్పుడు నా ఎదురుగా చెప్పు.
అలా మాట్లాడిన తండ్రి హిరణ్యకశిపునితో, ప్రహ్లాదుడు ఇలా అన్నాడు.
కానరాని కటిక చీకటిలోపడి, ఇల్లే వ్రతంగా భావిస్తూ, ఇంద్రియసుఖాలకు లోబడి, జనన మరణ చక్రంలో అక్కడే తిరుగులాడుచున్న వారికి, హరికి సంబంధించిన జ్ఞానం లభించదు. అటువంటివారికి ఏమిచ్చి చెబుదామన్నాా అడవులలోకి వెళ్లినా హరికి సంబంధించిన భక్తిజ్ఞానాలు సిద్ధించవు. ఎవరు చెప్పినా, తమకు కావాలని కోరుకున్నా ఏదో ఒకటి బహుమానంగా ఇచ్చి చెబుదామన్నాా అడవులలోకి దూరినా 'హరిని పూజించాలి, హరిని కీర్తించాలి' అనే జ్ఞానం తొందరగా ప్రాప్తించదు.
ఓ దానవరాజా! గుడ్డివానిని ఊతగా గొని మరొక గుడ్డివాడు విశేషవస్తువులను చూడలేడు గదా! అలాగే కర్మాచరణమే ప్రధానంగా ఉండేవారు, కర్మలకు కట్టుబడేవారు, విష్ణువును దర్శించలేరు. మరికొంతమంది ఉన్నారు, వారు కర్మలను చేయక, ఒకవేళ చేసినా, నిష్కామ కర్మచేస్తూ లేదా కర్మఫలాన్ని పరమాత్మకే సమర్పిస్తారు. వారికి ఈ శక్తి నిష్కాములైన విష్ణుభక్తుల పాదధూలిని తమ శిరస్సుపై ధరించి కర్మసంబంధం లేనివారు కావడంవల్ల వచ్చింది. వారు మాత్రమే విష్ణువును కాంచగలరు, ఇతరులు కానలేరు.
(కేవల కర్మబద్ధుల సాంగత్యంకంటే నిష్కాములైన విష్ణుభక్తుల సాంగత్యం వల్ల విష్ణుదర్శనం లభిస్తుంది.)
ఓ రాక్షసరాజా! వేయి మాటలు, వేయి గాథలు త్రవ్వవలసిన పనిలేదు. అన్ని శాస్త్రాలు శోధించి చెప్పుచున్న విషయం ఇది. ఈ సంసారం అనే సముద్రం చాల విస్తారమైనది. లోతనైది. ఘోరమైనది. ఈ సముద్రంలో సుతులు సతులు పెద్ద పెద్ద చేపలు భయంకరమైన కోర్కులు, మదం, క్రోధం, ఎత్తుగా ఎగిరే అలలు. ఇటువంటి సంసార సముద్రాన్ని కేవలం విష్ణుమూర్తికి సంబంధించిన జ్ఞానమనే నావతో మాత్రమే దాటగలం తప్ప సామాన్యమైన జ్ఞానంతో దుష్టపు ఆలోచనలతో దాటలేం సుమా!
('మాధవ శేముషీ తరణి సాంగత్యంబునన్ గాక' - అనే వాక్యం కీలకమైంది. 170వ సీసపద్యంలోని “విష్ణుభక్తిలేని విబుధుండు” అనే మాటను తాకుతున్నది.)
అలా మాట్లాడిన కొడుకును ధిక్కరించి, ప్రేమను చూపక, రాక్షసరాజు ప్రహ్లాదుని తన ఒడినుండి క్రిందకు తోసివేశాడు. పట్టలేని కోపం వచ్చింది. ఆ కోపంవల్ల అతని వేడిచూపులు ఆకాశంలో మంటలు రేపాయి. మంత్రులతో ఇలా అన్నాడు.
విష్ణుమూర్తి సూకర రూపాన్ని ధరించివచ్చి తన పిన తండ్రిని చంపాడు గదా. ఆ విషయం తెలిసిన వీడు మనసులో విష్ణువుపై క్రోధం వహించి అతనిని ద్వేషించి, వదలి వేయాలి గదా! అలా చేయకుండా ఆ హరికి బంటుగా భక్తుడై, నా శత్రువు పక్షాన మాట్లాడుతున్నాడు. అలా మాట్లాడటానికి భయపడటం లేదు. అరె! నా ప్రాణవాయువులకు బాధకలిగిస్తున్నాడు. నావంటి తండ్రితో వైరం వహిస్తున్నాడు. ఇలా తండ్రికి ద్రోహం తలపెట్టే కొడుకును ఈ సమస్త భూమండలంలో ఎక్కడైనా చూచారా!
అంటూ, రాక్షసవీరులను చూచి హిరణ్యకశిపుడు ఇలా అన్నాడు.
హిరణ్యకశిపుండు ప్రహ్లాదుని వివిధోపాయంబుల హింసించుట
శ్రీ మహా భాగవతము
శ్రీ మహా భాగవతము ద్వితీయస్కంధము
శ్రీ మహా భాగవతము తృతీయస్కంధము
శ్రీ మహా భాగవతము చతుర్ధస్కంధము
శ్రీ మహా భాగవతము పంచమస్కంధము
శ్రీ మహా భాగవతము షష్టస్కంధము
శ్రీ మహా భాగవతము సప్తమస్కంధము
పంచాంగం
No comments:
Post a Comment