Wednesday, March 18, 2026

The Kurma Avatar Story - కూర్మావతార కథా ప్రారంభము

కూర్మావతార కథా ప్రారంభము

విష్ణుదేవుడు దేవతలపైన ప్రేమ వెల్లడికాగా, ఒక మహాకూర్మరూపాన్ని ధరించాడు. అది లక్షయోజనాల వెడల్పు కల్గి, మిక్కిలి కఠినమైన డిప్ప కల్గినది. సమయం వస్తే బ్రహ్మాండాన్ని అంతా తినివేయగల పెద్ద గుహలాంటి నోరు దానికి ఉంది. సకల చరాచర జీవరాసులన్నింటినీ తనలో ఇముడ్చుకోగల పెద్ద పొట్ట ఉంది. ప్రపంచంమీద మరో ప్రపంచం పడి ఆగినా కదలని పెద్ద పెద్ద కాళ్ళున్నాయి. లోనికీ బయటకీ వచ్చిపోయే పెద్ద మూతి ఉంది. తామరల్లాంటి కన్నుల జంట ఉంది.

(కులపర్వతాలు చాలా పెద్ద ఆకారం కల్గినవి. అందుకే స్వామి లక్ష యోజనాల వెడల్పుగల మరొక ద్వీపమా అన్నట్టు ఆ కొండ కిందికి దూరి దాన్ని మోయడానికి సిద్ధపడ్డాడు. ఇలా సమయాన్ని బట్టి తన స్వరూపాన్ని నిర్ణయించుకోవటమె 'స్వేచ్చ'. స్వామివారి అవతారాలన్నీ ఇలా శత్రుసంహారానికి, భక్తరక్షణకు కావలసిన రూపాన్ని యథేచ్చగా పొందుతాయి.)

తాబేలుగా మారిన శ్రీహరి సముద్రంలోకి తేలికైన ఒక ముత్తెపు చిప్పలాగా ప్రవేశించాడు. అవలీలగా అడుగున ఉన్న మందరపర్వతాన్ని మహాసర్పమైన వాసుకిని ఒకేసారి పైకెత్తాడు. దీన్ని చూసి ఇంద్రాది దేవతలు తలలు ఊపుతూ “బాగు! బాగు! అమ్మ బాబోయి! శ్రీహరీ! నీకే శరణు” అంటూ నమస్కారాలు పెడుతూ జయజయధ్వానాలు చేశారు. ఆ ధ్వనులు భూమిలో, దిక్కులలో, ఆకాశంలో మారుమోగాయి.

ఈ విధంగా, శ్రీహరి చిలికేవారిలో తానూ ఒకడయ్యాడు. సముద్రమనే మజ్జిగ కడవకు కుదురు తానే కవ్వమూ తానే - రాట కట్టేతాడూ కవ్వపు తాడూ తానే. ఆహాహా; శ్రీమహావిష్ణువు లీలలు అతనికే తెలుసు.

సముద్రాన్ని కడవగా, పర్వతాన్ని కవ్వంగా చేసి చిలకడానికి; లక్ష్మిని, అమృతాన్ని సంపాదించడానికి ఒక్క శ్రీమహావిష్ణువు తప్ప మరొక శక్తిమంతుడు ఉన్నాడా!

గొల్లల బ్రతుకు తక్కువైందేమీ కాదు. ఎందుకంటే పాలసముద్రాన్ని గొల్లల లాగానే దేవతలు, హరి చిలికారు. అంచేత దేవతలూ గొల్లలయ్యారు. శ్రీహరి తానూ గొల్ల అయ్యాడు. అమృతాన్ని దేవతలు; లక్షిని శ్రీహరి పొందారు.

ఈ విధంగా విష్ణువు సహాయంతో సముద్ర మథనం ప్రారంభించిన దేవతలు రాక్షసులు కవచాలు ధరించారు. దట్టీలు కట్టుకొన్నారు. బట్టల్ని పిరిచుట్లు చుట్టుకున్నారు. చేతులు చేతులు చరుచుకున్నారు. భుజాలు భుజాలూ రాసుకున్నారు - “లేవండి. లేవండి. రండి. చిలకటం మొదలు పెట్టండి” అంటూ హెచ్చరికలు చేసారు. వేగంగా పెరుగు చిలికే గొల్లపల్లె గోపాలకుల్లాగా సముద్రం నడుమ కవ్వంగా ఉండే మందర పర్వతానికి తాడైన పాము తలా తోకా పట్టుకొని మధింపసాగారు. వారి పెద్ద పెద్ద కేకలతో బ్రహ్మాండం నిండిపోయింది. గుబగుబమని శబ్దిస్తూ కవ్వపు కొండ గిరగిరమని తిరుగుతుండగా; దాని వేగానికి 'భుగభుగ' మనే శబ్దాలు ఆకాశం నిండాయి. లెక్కకు మిక్కిలిగా ఉన్న చుక్కలతో ప్రతిఫలిస్తూ ఆ పాలమీగడ తేటలోని కాంతి నిండిన తుంపరల పరంపరలు పైకి ఎగిరాయి. తమ చేతుల్లో గట్టిగా పట్టుకొని క్రమక్రమంగా లాగుతున్న తిరుగుతున్న ఆ వాసుకి పడగలలో నుండి పుట్టిన భయంకరమైన విషాగ్ని కీలలవల్ల వారికి దాహం వేసింది. అయినా పట్టు వదలకుండా వారు మథనం కొనసాగించారు. సముద్రతీరంలోని కొండమల్లెపూల గుత్తులనుండి వెదజల్లబడుతున్న స్వచ్చమైన మకరందాల గుబాళింపును మోసుకువస్తున్న పిల్లగాలులు వారి దేహాలపై పట్టిన చెమటల్ని తాకగానే ఆ చెమటలు ఇగిరిపోయాయి. ఒకరినొకరు పరిహసించుకొంటూ, గొప్పలు చెప్పుకొంటూ, భళిభళీ అని మెచ్చుకుంటూ, ఇలాకాదు అలా అని అంటూ; అసూయాగ్రస్తులై ఒకరిమీద ఒకరు స్పర్ధతో సముద్రంలో అటూ ఇటూ ఊగుతున్న మందరపర్వతం యొక్క భ్రమణం వల్ల పుట్టిన ఘుంఘుం అనే శబ్దమూ; ఆ వాసుకి నోటినుండి బయట పడుతున్న భయంకరమైన బుసబుసలు; పెద్దదైన ఆ పర్వతాన్ని సముద్రంలో ఉంచి చిలకటం వల్ల గుంపులు గుంపులుగా ఒదిగిపోతూ, పైకి ఎగరడానికి వీలుకాక భయపడిన తాబేళ్ళు, ఎండ్రకాయలు, పాములు, మొసళ్ళు, పెద్దచేపలు, తిమింగలాలు, హంసలు, చక్రవాకాలు, కొంగలు, కప్పలు, బెగ్గురుపక్షులు చేస్తున్న ఆర్తనాదాలూ, కలిసి మూడింతలుకాగా; సురాసురవీరులు చేస్తున్న అట్టహాసాలు, గర్జనలు, పెడబొబ్బలు నాల్గింతలు కాగా, పది దిక్కుల గోడలు మొత్తినట్లు పేట్లురేగి రాలిపోయాయి. ఒకడిని మించి మరొకడు వేగంగా చిలుకుతూ అసూయతో పౌరుషాలు పలుకుతున్నారు. అమృతం కోసం ఉబలాట పడసాగారు. కొత్త వస్తువుల పుట్టుక కోసం ఎదురుచూస్తున్నారు. 'ఇంకా ఎంతసేపు చిలుకుదాం' అని శ్రీహరిని అడిగారు. ఎడతెగని ఆశతో పట్టినపట్టు వదలకుండా మథింపసాగారు.

ఆ క్షీరసాగరంలో అలా నిరంతరం గిరగిరమంటూ ఆ పర్వతం తిరగగా తిరగగా ఆ శబ్దం బ్రహ్మాండ భాండమంతా నిండిపోయింది. బ్రహ్మాదేవుడి చెవులు కూడా గింగురుమన్నాయి. ఇంక ఏం చెప్పాలి?

ఆ సమయంలో ఆ సముద్రం మధ్యలో

సర్పరాజు తోక తల పట్టుకొని దేవతలు రాక్షసులు చోట్లు మారుతూ తొందర తొందరగా లాగుతూండగా మంధరపర్వతం సముద్రంలో ఎడమనుండి కుడికి తరువాత కుడినుండి ఎడమకు తిరుగసాగింది.

అలా ఆ పర్వతాన్ని ఉంచి సముద్రాన్ని చిలకగా అందులో ఉన్న పక్షులు, తాబేళ్ళు, మొసళ్లు, పాములు సుళ్ళుపడి చీకాకు పడ్డాయి. తొట్రుపడ్డాయి. గట్లపై పడ్డాయి. ఎగిరి బయటపడ్డాయి. పొర్లిపడుతున్నాయి.

ఓ రాజా! అలా దేవతలు, రాక్షసులు తమ తమ చేతుల్లో తిప్పడం వల్ల తిరుగుతున్న ఆ మందరపర్వతం పుట్టించిన రాపిడివల్ల ఆ కూర్మరాజు వీపు దురద ఏమాత్రం తగ్గలేదు.

హాలాహలం జనించుట

No comments:

Post a Comment

Halahala, Kalakuṭa (most deadly and venomous poison in the universe) Emerged - హాలాహలం జనించుట

హాలాహలం జనించుట ఆ తరువాత అంతలోనే, అల్లకల్లోలమైన ఆ సముద్రంలోనుండి హాలాహలమనే విషం కోలాహలమైన అగ్ని జ్వాలలతో బయటపడింది. దాన్ని చూసి భయపడి సురాస...