ఓ సుమధుర భాషిణీ! దేవయానీ! సరిగా మన చరిత్రవంటిదే గతంలో జరిగిన వృత్తాంతము ఒకటి ఉన్నది. దానిని పెద్దలు, మునులు విని సంతోషిస్తారు. నీవు కూడా మనసుపెట్టి విని అంగీకరించు.
అది ఎలాంటిదంటే
ఒక అడవిలో ఒక మేకపోతు తిరుగుతూ, కర్మవశాన నూతిలోనికి జారిపడి బాధపడుచున్న ఒక ఆడుమేకను చూచ్చి, దానిని కామించి, తన కొమ్ములతో ఆ ఆడుమేకను గట్టుమీదకు వచ్చేలా చేసింది. ఆ ఆడుమేక ఈ మేకపోతును భర్తగాకోరగా, అటులే అంగీకరించింది. ఆ ఆడుమేకతో తనను ఎన్ని మేకలు కామించి వెంట తిరిగాయో అన్నిటికీ ఈ మేకపోతు భర్తగా ఉంది. కూడియున్న ఆడుమేకలను అన్నివేళలయందు కామక్రీడలలో ముంచి, వాటన్నిటితో బాగాక్రీడించి, ఎంతో ఆనందపడి, మన్మథుడనే విడువని గ్రహం బారిపడి, మనసు మరచిపోయి, మత్తెక్కి దానికి (ఆ మన్మథ భయంకర భూతానికి) చిక్కింది.
మన్మథుని చిగురాకు బాకు దెబ్బలకులోనై, మిక్కిలి మోహంతో ఎడతెగకుండా స్త్రీల పొందునుగోరే మూర్ఖుడికి బుద్ధిచాతుర్యాలు ఎలా ఉంటాయి?
ఆ తరువాత ఆ మేకపోతు తనవెంట ఉన్న ఆడుమేకల సమూహంలో అందంగా ఉన్న ఒక ఆడుమెకపై మనసుపడి, దానితో ఇష్టంగా సంచరిస్తుండగా నూతిలోపడి రక్షింపబడిన ఆడుమేక, తనభర్త తనను ప్రేమగా చూడటంలేదనే విషయం గ్రహించి దైన్యాన్ని పొంది తన మనస్సులో
నేను మాట్లాడించినా, నాతో తిరిగి మాట్లాడటానికి ఇష్టంలేకుండా నా భర్త ఉన్నాడు. క్రొత్తగా దొరికిన ఈ ఆడుమేకను చూచి మిక్కిలి తొందరతో ఆమెనే కలవాలనిచూస్తూ, నిలుచున్నచోట నిలబడలేక తొట్రుపాటు పడుతున్నాడు. నాభర్త నిలువెల్లా మోసం చేయడమే లక్షణంగా కలిగి ఉన్నాడు. అయినా కామికి సత్యనిష్ఠ ఉండదుకదా!
ఇట్లుపలికి, ఆ ఆడుమేక విడిచిపోగా, ఆ మేకపోతు రతిక్రియయందు మిక్కిలి ఆసక్తితో శబ్దంచేస్తూ ఆ ఆడుమేక వెంటబడి దాన్ని అంగీకరింప జేయజాలక ఉంది. శబ్దంచేస్తూ ఆడుమేక కొరకు అల్లాడి పోతున్న ఆ మేకపోతు యజమాని అయిన బ్రాహ్మణుడు కోపంతో ఆ మేకపోతు అందములను రతిక్రియకు వీలుపడకుండేలా త్రెంచివేశాడు. ఆ మేకపోతు క్రిందామీదా పడి వేడుకొనేసరికి యోగవిదుడైన ఆ బ్రాహ్మణుడు పర్యవసానం గుర్తించి ఆ మేకపోతుకు అండాలు తిరిగి అతికించాడు.
ఈ విధంగా మేకపోతు తిరిగి తన వృషణాలను పొంది పటుత్వంతో తన ఆడుమేకతో విషయసుఖాలను పెక్కుకాలం అనుభవించికూడా వాటిపై ఆశవిడవలేక 'ఇకచాలు' అనే తృప్తి పొందలేక పోయాడు.
అని ఈ విధంగా యయాతి దేవయానికి తనసంగతినే కథారూపంలో తెలియజేసి ఇలా అన్నాడు.
(ఈ ఉపాఖ్యానానికి 'బస్తోపాఖ్యానము' అనిపేరు. బస్తము అనే శబ్దానికి ఛాగము, మేకపోతు అని అర్ధం. వివేకంగల యయాతి సంసార సుఖాల తృష్ణతీరని స్థితి గమనించి తన భార్య దేవయానితో చెప్పుచున్న విషయం ఇది. ఇందులో యయాతి మహారాజు మేకపోతు, దేవయాని కర్మవశాన నూతిలోపడిన ఆడుమేక, దానిని గట్టుకు చేర్చిన మేకపోతు యయాతి. ఆడుమేక దేవయాని కోరుకోగా మేకపోతు యయాతి వివాహం చేసికొన్నాడు. వెంటబడిన ఆడుమేకలు శర్మిష్ఠ ఆమెను ప్రేమతో చూచిన విషయాన్ని గమనించి దేవయాని కోపంపొందితే ఆమెను అనునయించే ప్రయత్నం యయాతి చేయగా శుక్రాచార్యుడు అతనికి యౌవనంలేకుండా ముదిమిని పొందుమని శపించడమే యజమాని ఛాగముయొక్క వృషణాలు తెగగొట్టడం. శాపాంతం చెప్పడమే యోగవిదుడైన బ్రాహ్మణుడు తిరిగి అండాలను అతికించడం. యయాతి విషయవాంఛల తుది చూడలేకపోవడమే ఈ బస్తోపాఖ్యానంలోని మేకపోతు మాటలు. బస్త్యతే హింస్యత ఇతిబస్తః బస్త అర్దనే. హింసింపబడునది అని 'బస్త' శబ్దానికి వ్యుత్పత్తి.)
ఓ భామినీ! దేవయానీ! దట్టమై జయించడానికి వీలులేని, సిగ్గుతో కూడిన నీక్రీగంటి చూపులనే బాణాల దెబ్బలకు ఎంతో బలమైన నా మనసు ముక్కలై దాని నైపుణ్యాన్ని కోలుపోయింది. చాలాబలం కలిగిన ఈ మన్మథుని బారినుండి నేనెలా తప్పించుకొని ఓర్చుకోగలను? చెరలో బడిన స్త్రీవలె నా పాపపు తృష్ణ అధికమై మిక్కిలి దుఃఖిస్తోంది. అయ్యో!
ఈ కోర్కెల దాహం ప్రాణాలు అల్లాడుతూ ఉన్నా చలించడంలేదు. శరీరావయవాలు వణకిపోతూ ఉన్నా కదలడంలేదు. శరీరానికి ఉన్న పొంకాలు వీడిపోయినా ఇది విడువడం లేదు ఈ తృష్ణకు సంతృప్తిలేదు. దీనిని (ఈ తృష్ణను) తుంచివేయాలి.
వికసించిన పద్మమువంటి ముఖం కలదానా! వేయి సంవత్సరాలుగా నిన్ను కూడి ఉన్నాను అయినా కామసుఖాల పట్ల ఆసక్తి తగ్గడంలేదు. కొంచెమైనా బడలిక కలగడంలేదు. ఈ తృష్ణ కొనసాగుతూ పెరుగుతూనే ఉంది.
దంతాలు ఊడినా, కేశాలు తెల్లబడినా శరీరం ముడతలుబడినా ఈ విధంగా ముసలితనం లక్షణాలు వచ్చినా బతకాలనే కాంక్ష ఇంద్రియ సుఖాలపట్లకోరిక ఈ రెండూ మాత్రం విడువలేదు.
ఓ పద్మాక్షీ! ఆశ అనే తీగకు అంతంలేదు. చూద్దామన్నా ఆశకు తుద కన్పట్టదు. తత్త్వజ్ఞానం గలవాళ్ళు మాత్రం ఆశకు అంతాన్ని చూడగలిగితే సంతోషంతో సంసారాన్ని తుదిముట్టగలరు (సార్ధకంగా జీవించగలరు).
భూషణాలు, బంగారం, పశువులు, ఏనుగులు, గుర్రాలు, స్త్రీలు, పసిడి, వస్త్రాలు, ధాన్యం మొదలైనవి ఎన్ని ఉన్నప్పటికీ, ఆశ అనే పాశాన్ని ఖండించలేవు, సరికదా ఎన్ని ఉన్నా ఏదో ఒకలోటు కన్పిస్తూనే ఉంటుంది.
కామసుఖాలు ఎన్నిమార్లు మానవుడు అనుభవించినా కోరిక మాత్రం అణగారదు. అగ్నిహోత్రుడు నేతిధారపోస్తే అణగుతాడా? అణగడు కదా!
ఓ తామరసాక్షి! అక్క తల్లి, చెల్లెలు తన కొమరిత ఉన్న పాన్పుపై కలసి మనం కూర్చుండరాదు కారణం ఏమంటే పరమయోగికైనా ఇంద్రియాల సమూహం అధికమైన కష్టాన్ని కలుగజేస్తుంది.
ఓ కమలముఖీ! ముక్తినికోరేవాడు మూర్ఖత్వానికి విత్తనం కాకుండా, తొట్రుపాటుతో చెడిపోకుండా, స్త్రీలతో విడువలేని స్నేహాన్ని సాన్నిహిత్యాల్ని వదలిపెట్టాలి.
అందువల్ల ఈనాటినుండి తృష్ణను వదిలి; విషయసుఖాలువీడి; అహంకారం విడిచి, మృగాలతో కలిసి అడవులలో తిరుగుతాను. పరబ్రహ్మలో నా చిత్తాన్ని చేరుస్తాను. బ్రహ్మనిష్ఠ మానవులందరికి ఆశను పోగొడుతుంది. అందుచేత నేను బ్రహ్మనిష్ఠలో మున్గి, ఆహారాన్ని నిద్ర మొదలైన వానిని పరిహరిస్తాను. ఆత్మజ్ఞానం గలిగి, సంసారం అంటే నాశనం పొందేది అని తెలిసికొన్నవాడే పండితుడు అని గ్రహించి ఆ విధంగానే మాట్లాడి, పూరునివద్ద తీసికొన్న యౌవనాన్ని అతనికిచ్చి తన ముసలితనాన్ని తాను స్వీకరించి, లోభంలేనివాడై తన భుజపరాక్రమాలచే పాలింపబడుతున్న భూమిని విభజించి, ద్రుహ్యునకు తూర్పు, యదువునకు దక్షిణం, తుర్వసునకు పడమట, అనువునకు ఉత్తరదిక్కులందుగల భూములను చక్కగా రక్షించండని ఇచ్చి, నాలుగు చెరగుల నేలను పాలించుమని పెద్దకొడుకులను ఆజ్ఞాపించి యయాతి పూరునకు సమస్త భూమండలాన్ని పరిపాలించుమని పట్టం గట్టాడు.
ఈ విధంగా పూరునికి రాజ్యంఇచ్చి చాల వత్సరాలుగా అనుభవిస్తూ వచ్చిన ఇంద్రియ సుఖాలను విడిచిపెట్టి. యయాతి తనకున్న అధికమైన అనుభవజ్ఞానంతో అరిషడ్వర్గాలను విడిచిపెట్టి, రెక్కలు వచ్చిన పక్షి తనగూటిని విడిచిపెట్టి ఎగిరిపోయే విధంగా తాను సంసార విముక్తుడై
పరమదయాళుడైన విష్ణుమూర్తి దయవల్ల యయాతి క్రూరములైన ఇంద్రియసుఖాలను గెలిచాడు. హరిదయ లేకుండా ఊరకే ఇంద్రియ నిగ్రహం గలవా డెవడుంటాడు?!
మరియు యయాతిభూపాలుడు అన్ని బంధాలను తెగగొట్టి, సత్త్పరజస్తమో గుణాలనే త్రిగుణాలనుదాటి, స్వచ్చమైన, ముఖ్యమైన వాసుదేవుడనే పేరుతో పిలువబడే పరబ్రహ్మంలో సహజంగా భాగవతులు పొందే పరమపదాన్ని పొంది వాసుదేవపరబ్రహ్మంలో లీనమయ్యాడు.
దేవయాని తనభర్త యయాతి పలికిన పలుకులు తేలికగా తీసికోక తన హృదయంలో నిలుపుకొని, చలివేంద్రంలో బాటసారులు చల్లదనానికై చేరి వారివారి మార్గాలవెంబడి పోయే జనులవలె, ఈ సంసారంలో కర్మబంధాలతో భార్యపిల్లలు మగడు అనే బంధాలతో కూడి ఉంటారు. అంతే తప్ప ఈ భార్యాది సంబంధాలు శాశ్వతంకాదు. ఇదంతా పరమేశ్వర మాయావిలాసం. ఈ సంసారాన్ని ఈ బంధాలను విడిచిపెట్టాలి. అదే న్యాయం అనే తెలివికలిగి నిద్రమేల్కొన్నవాడు ఎటువంటి నేర్పుతో ప్రవర్తించి (స్వప్నం నిజంకాదు అని గ్రహిస్తాడో అలా) హరిపదాలపై ధ్యానం నిలిపి ముక్తి పొందింది.
ఈ ప్రకారంగా పరీక్షిన్మహారాజునకు యయాతి చరిత్ర చెప్పి భగవంతుడు, అన్ని జీవులలో ఉండేవాడు, శాంతుడు, వేదమయుడు అయిన పరబ్రహ్మకు నమస్కరిస్తాను అని శుకమహర్షి పలికి ఇలా అన్నాడు.
No comments:
Post a Comment