Monday, March 16, 2026

Lord Shiva destroyed Tripurasura - త్రిపురాసుర సంహారము

త్రిపురాసుర సంహారము

రాజా! పూర్వం, మాయావి ఐన మయునివల్ల శివునికీర్తికి భంగం కలిగింది. అపుడు విష్ణుదేవుడు ఆ భంగపాటును పోగొట్టి జయావహంగా కీర్తికి వన్నె తెచ్చాడు.

(మయుడు - కశ్యపప్రజాపతికి ధనువుకు పుట్టినవాడు రాక్షసశిల్పి.)

అని నారదమహర్షి పలుకగా ధర్మరాజు ఇలా అన్నాడు.

మయుడు ఏ విధంగా శివుని కీర్తికి హాని చేశాడు? విష్ణుమూర్తి, అపుడు ఏ మార్గాన శివకీర్తిని చక్కదిద్ది, శివశక్తి సహాయకుడయ్యాడు?

అని ధర్మరాజు అడుగగా, నారదుడు ఇలా బదులు పలికాడు.

రాజా! రాక్షసులు, చక్రాయుధం వంటి వాటితో బలవంతులయిన ఇంద్రాది దేవతలతో తలపడి, పిదప ఓడిపోయి క్రోధంతో యుద్ధక్రీడ మాని, మయుని వెనుకకు రక్షణకోసం వెళ్ళారు.

ఇట్లు రాక్షసులు తన వెనుక నిలువగా, మాయావీ, నీతిమాలినవాడూ అయిన మయుడు తన యోగశక్తితో, ఇనుము, వెండి, బంగారాలతో, ఎవ్వరికిని గుర్తించరాని రాక పోకలు, ఊహింపరాని కఠినమైన పైతొడుగులు గలిగిన మూడు పురాలను కట్టించి ఇవ్వగా, రక్కసులందరు వాటిలో చేరి, కోరినట్లు కోరినచోటికి తిరుగుతూ, మునుపటి పగను తలచుకొని, లోకాలన్నిటినీ వాటి పాలకులతోపాటుగా, తమ అతిశయించిన బలంతో శోకాలపాలు చేస్తూండినారు.

లోకపాలకులందరు శోకాలపాలై, దుష్టసేనల పీచమడచటంలో వెనుకాడని, లోకరక్షణభారం వహించడానికి ముందు నడిచే శివుని శరణు వేడారు.

లోకపాలకులందరు ఎల్లలోకాలకు ఏలిక అయిన మహేశ్వరుని జేరి నమస్కరించి, పూజించి, చేతులు జోడించి, ఇలా ప్రార్థించారు.

ఓ పార్వతీ పతీ! త్రిపురవాసులైన రాక్షసులు యుద్దాలలో ఓటమి పాలు గాక, నిరంతరం, మాకు శారీరక మానసిక బాధలు కల్గిస్తున్నారు. ఆ అపరాధులను సంహరించు.

శివా! మేము నీకు దాసులమై ఏ దుఃఖమూ లేక ఇంతకాలం ఉన్నాము. ఇపుడు త్రిపురాసురుల బాహుబలానికి లొంగిపోయి దుర్బలుల మైనాము. మమ్మల్ని కాపాడు.

వారి ప్రార్థనలు విన్న శంకరుడు భక్తవత్సలుడు గావున దేవతలను 'వెఱువకుడు' అని అభయమిచ్చి మహాశక్తితో ధనుస్సును చేతితో గ్రహించి దివ్యమైన బాణమొకటి సంధించి త్రిపురాలపై వేశాడు. దాని నుండి వేలబాణాలు, సూర్యగోళంనుండి కిరణాలవల ఉద్భవించి, భూమిని, ఆకాశాన్ని వాటిలోపలి బయటి ప్రదేశాలు అన్నింటను నిండి, కుప్పలు తెప్పలుగా త్రిపురాలను కప్పివేశాయి. అప్పుడు ఆ బాణాల అగ్నిజ్వాలల గుంపులలో కాలి; ఉసురు బాసిన త్రిపురవాసులైన రాక్షసులను తీసికొని వచ్చి, గొప్ప యోగశక్తిగల మయుడు; సిద్ధరసపు బావిలో వేయగా

రాక్షసులు, ఆ అమృత మహిమతో, గొప్పవైన వజ్రాలతో సమానమైన శరీరాలు గలవారై, భయంకరమైన కిడుగులలోని అగ్నులతో పోలి, పెంపుదల వహించారు.

ఆ బావిలోని అమృతరస ప్రభావంతో, బ్రదికి, వెలుగులు చిమ్ముతూ ఎదుట నిలిచిన రాక్షసులను చూచి శంకరుడు విచార వదనుడైనాడు; అది చూచి శ్రీహరి కపటవేషధారియై,

శ్రీహరి, తాను పాడియావుగా, బ్రహ్మ దూడగా తన వెంటరాగా, త్రిపురాలలో ప్రవేశించి, అక్కడి బావిలోని అమృతరసం మొత్తం తాగాడు; ఆ ఆవుదూడల అందచందాలు చూస్తూ మైమరచిన రాక్షసులు, దానిని అడ్డగించడం మరచిపోయారు.

ఇలా విష్ణువు మోహనాకారంలో గోవుగా వచ్చి త్రిపురాల మధ్యగల బావిలోని అమృతరసం అంతా తాగేసరికి ఇది తెలుసుకొని గుండెలు బాదుకొని ఆ బావికాపరులను దుఃఖించసాగారు. శోకిస్తున్న వాళ్లను చూచి మహాయోగియైన మయుడు విషయం తెలుసుకొని ఆశ్చర్యపడ్డాడు. ఆ దురదృష్టం గురించి తలచుకొని బాధపడకుండా ఇలా అన్నాడు.

రాక్షసులారా! లోకాలలో, దేవతలైనా, రాక్షసులైనా, మానవులైనా, వారెంత నెర్పరులైనా సరే దైవనిర్ణయాలను తప్పించలేరు; మార్చలేరు. కావున మనకిక్కడ శోకించే అవసరం లేదు.

అనంతరం శ్రీహరి తన శక్తియుక్తులు ధర్మజ్ఞాన విద్యా విశేషాదులను ఉపయోగించి, శివునకు ప్రాధాన్యం కల్పించి, రథ సూత కేత్వాది యుద్దసామగ్రిని సంతరించి అర్పించాడు; వాటిని స్వీకరించి శంకరుడు.

అనంతరం శివుడు, బాణము, ధనుస్సు, కవచం, వాహనం, రథం, సారథి, జెండా, గొడుగు ఈ అన్నిటితో శోభిస్తూ ఒక బాణాన్ని ఆ మూడు పురాలపై వేశాడు. ఆ బాణ జ్వాలల్లో, ఛట ఛట ధ్వని భూమ్యాకాశాలు నిండగా, అవి కాలి బూడిదయ్యాయి.

ప్రవేశింప వీలుగాని త్రిపురాలను శివుడు, కేవలం క్షణకాలాన భస్మం చేసి పడగొట్టగా, వివిధ దేవతాగణం, వారి నాయకులు చూచి సంతసించారు. జయ జయ శబ్దాలతో పూలవానలు కురిపించారు. ప్రజలూ హర్షించారు. బ్రహ్మాదులూ పాగడినారు. అప్పరసలు నర్తించారు; స్వర్గంలోని పెద్దబూరలు భేరులు మోగాయి. ఋషుల వేడుకలు పెరిగి, అందరికి, మేలు జరిగిన త్రిపురాసురవధ లోకాలనన్నింటికి సంతోషకరంగా ముగిసినది. ఆ సమయంలో

పరాత్పరుడైన శంకరుడు గడ్డిపరకలను వలె త్రిపురాలను క్షణకాలంలో బూడిద చేసి, బ్రహ్మాది దేవతలు తనను క్రీర్తిస్తుండగా, తన కైలాసగిరిని చేరుకున్నాడు.

ఈ విధంగా తన మాయలతో భూలోకంలో అతిశయిస్తున్న శ్రీహరి శౌర్యపరాక్రమ పద్ధతులు ఋషులచే నమస్కరింపదగినవై, ఇతర సర్వజనులకు క్షేమాన్ని కలిగిస్తాయి అని పలికిన నారదునితో ధర్మరాజు ఇలా అంటున్నాడు.

నారదుండు ధర్మరాజునకు వర్ణాశ్రమ ధర్మంబులు తెలుపుట

No comments:

Post a Comment

Halahala, Kalakuṭa (most deadly and venomous poison in the universe) Emerged - హాలాహలం జనించుట

హాలాహలం జనించుట ఆ తరువాత అంతలోనే, అల్లకల్లోలమైన ఆ సముద్రంలోనుండి హాలాహలమనే విషం కోలాహలమైన అగ్ని జ్వాలలతో బయటపడింది. దాన్ని చూసి భయపడి సురాస...