అని తలపోస్తూ, హిరణ్యకశిపుడు నీరుగారిపోని మనోధైర్యం తెచ్చుకున్నాడు. గదను ఎత్తిపట్టుకొని తొట్రుపాటుతో గంభీరమైన మృగరాజును సమీపించే మదగజంలాగా హిరణ్యకశిపుడు నృసింహభగవానునికి ఎదురు నడిచాడు. భగభగమండే దావానలం ముందు మిణుగురుపురుగు లాగా శ్రీనృసింహుని కాంతిముందు హిరణ్యకశిపుడు వెలవెలపోయాడు. ఆ సమయంలో ఆ రక్కసుడు ఇది చేయదగింది, ఇది చేయకూడదన్న విచక్షణను కోల్పోయాడు.
రాజులలో శ్రేష్ఠుడా! ధర్మరాజా! పూర్వకాలాన ప్రళయకాలం చివరలో, బ్రహ్మాండ భాండమంతటా చీకటి ఆవరించి నిరోధకంగా ఉండినది. విష్ణువు, లోకసృష్టి చేయబోతూ దానిని మ్రింగి తాను, సత్త్వగుణ కాంతికి నిలయమై నిలువగా, తామసుల నైపుణ్యం భగ్నమై నశించింది, విష్ణువుఎదుట రాక్షసులు నిలువగలరా? కాంతి ముందు చీకటి ఉండగలదా!
దానవ వీరుడు తన భయంకరమైన గదాదండం గిరగిరా త్రిప్పి నరసింహస్వామిపై విసిరాడు. వెంటనే ఆ స్వామి గరుత్మంతుడు సర్పాన్ని ఒడిసి పట్టినట్లుగా రాక్షసరాజును పట్టుకున్నాడు. దానవేంద్రుడు ఎగిరిపడి ఇటూ అటూ గింజుకుని, కోపంతో, చాకచక్యంతో బలం పుంజుకొని, పట్టు తప్పించుకొన్నాడు. అధైర్యం చెందకుండా గరుత్మంతుని పట్టు తప్పించుకొన్న సర్పరాజులాగా ఎగిరి ఎగిరి పడుతూ చిందులు త్రొక్కుతూ పోరాడ సాగాడు. తన భుజబలం ముందు నరసింహుడు లొంగిపోతాడులే అనుకొని రాక్షసేశ్వరుడు కలత పడకుండా విజ్బంభిస్తూ అతి నిపుణంగా తన పరాక్రమాన్ని ప్రదర్శిస్తున్నాడు. ఆకాశంలో దట్టమైన నల్లని మేఘాలమాటున నక్కి నక్కి చూస్తూ దేవతలు 'వీడు లొంగేటట్లు లేడు, మన జీవితాలకు ముప్పు తప్పేటట్లు లేదు' అని దిగాలుపడి ఆలోచనలు చేస్తున్నారు. ఆ రాక్షసుణ్ణి రహస్యంగా చూస్తూనే ఉన్నారు. హిరణ్యకశిపుడు యుద్ధ విద్యా తంత్రాలు ప్రదర్శిస్తూ చిత్ర విచిత్ర గతులలో కవచధారియై ఖడ్గచాలనం చేస్తూ భూమ్యాకాశాలంతటా తానే పరిభ్రమిస్తున్నాడు. నేర్పుగా దూకుతున్నాడు. రక రకాలుగా తప్పించుకొంటున్నాడు. తారసిల్లుతున్నాడు. భయం పుట్టించే ముఖంతో ఆకాశంలో తిరిగే డేగలాగా ఎగిరిపడుతున్న రాక్షసుని అహంకారాన్ని సహింపక ఆగ్రహించాడు నరసింహస్వామి!
(సాళువడేగ - 'శ్యేన' జాతికి చెందిన డేగ, గ్రద్ద. వీటికి పౌరుషం ఎక్కువ. శత్రుసంహారం చేస్తేగాని వదలిపోదు. యజ్ఞాలలో అగ్నిచయన మనేదొక యజ్ఞం. ఈ యజ్ఞంయొక్క ఆకృతి శ్యేనరూపంతో నిర్మిస్తే శ్యేనచితి అంటారు. చాచిన రెక్కలతో వాడియైన ముక్కుతో పుచ్చముతో ఆకాశంలో ఎగురుతున్నట్లు దీని ఆకృతి కల్పించబడుతుంది. గరుడాకృతిగల యజ్ఞవేదికి 'సుపర్ణచితి' అని అంటారు. ఋగ్వేదంలోని సుపర్ణసూక్తములో దీని వర్ణనమున్నది. మహాభారతయుద్ధ వ్యూహాలలో శ్యేన, గరుడ వ్యూహాలు సుప్రసిద్దాలు.)
రాజా! తన నోట వెల్వడే అగ్నిజ్వాలలు, భూమ్యాకాశాల వ్యాపించగా, తన కోరలకాంతుల తీక్ష్ణతకు రాక్షసునికళ్ళు చూపు కోల్పోగా, తన జూలుయొక్క వేగాతిశయానికి ఆకాశమేఘాలు ముక్కలై చెదరిపోగా, తనచేతి గోళ్ళకాంతులు, లయకాలపు మేఘాల మెరపులవలె వ్యాప్తిచెందగ, నరసింహుడు, కేసరములు విదిల్చి, గర్జించి, చూచి, కనుబొమలు ముడివేసి, కోపగించి, నాలుక చాచి, ఎగిరి చేతితో రాక్షసుని ఒడుపుగా పట్టుకొన్నాడు.
రాజా! పాము ఎలుకను పట్టినట్లుగా, నరసింహుడు రాక్షసుని అవలీలగా పట్టుకోగా, అతడు ప్రాణభయంతో కలవర పడినాడు.
సజ్జనులైన భక్తకోటి దోషాలు తుడిచేవాడు, ఎగసిపడే వాడి నాల్క గలవాడు, మహావేగవంతుడు అయిన నరసింహునకు రాక్షసుడు లొంగిపోయాడు.
(అంహు; జిహ్వు, రంహు; సింహు అని నాల్గుసార్లు ఉత్వవిశిష్ట 'హ' కారమునకు పునరావృత్తి కల్పించడంచేత నరసింహుని సింహనాదము, హుంకారములు సన్నివేశానికి తగిన భయానకరసానికి పోషకంగా ఉన్నాయి.)
అంతలో, నృసింహుడు, ఆగ్రహోదగ్రుడై, వజ్రకలోరదేహుణ్ణి, నిరంతర ఉత్సాహశీలిని, ఇంద్ర యమ అగ్నులకుకూడా భీకరమైనవాణ్ణి, గొప్పభుజాలతో స్వవంశానికి ప్రతిష్ఠ కల్పించిన రాక్షసుడైన హిరణ్యకశిపుణ్ణి తన తొడలపై చేర్చి, గరుత్మంతుడు పామును చీల్చినట్లుగా చీల్చాడు.
నృసింహ దేవుడు, ప్రకాశిస్తున్న తనగోళ్లతో రాక్షసుని పద్మాకారపు గుండెను చీల్చి రక్తాన్ని భూమిపై కార్పాడు. అతని కఠిన నాడులను త్రెంచి, విశాలవక్షాన్ని భగ్నం చేశాడు. ఆతని మాంసాన్ని ముక్కలుగా నరికాడు. అతని ప్రేవులను తన మెడలో హారాలుగా ధరించాడు. ఆపై తన చేష్టలకు గర్వించాడు.
నృసింహుని వాడిగోళ్ళు, అతివిచిత్రంగా రాక్షసుని రొమ్ము అనే తలుపు పగులగొట్టెటపుడు మంచి గండ్రగొడ్డళ్ళలాగా, ఆతని గుండె అనే తామరను చీల్చేటపుడు గునపాలలాగా, అతని ధమనులగుంపును ఛేదించేటపుడు మంచి కొడవళ్ళలాగా, కడుపులోని ప్రేవులవరుసలను త్రెంచేటపుడు, రంపములలాగా, ఉపకరించాయి. రాక్షసుని ఆయుధాలతో చంపక తనవాడియైన గోళ్ళతో చీల్చిచండాడాడు.(రాక్షసుడు ఆయుధాలతో చావడు మరి! వరప్రభావమది)
ఆ నరకేసరి నఖాలు శరణాగత సాధుజనులకు ప్రాణసఖాలు. అవి రాక్షసనాథుని శరీరాన్ని చీల్చివేశాయి. దేవతల ముఖాలను వికసింపచేశాయి. గొప్పకాంతులతో అగ్నిశిఖలను సైతం జయించాయి.
కేవలం నరుడూ కేవలం మృగమూగాని నరసింహ స్వరూపంతో హరి, పగలూ రాత్రీగాని సంజవేళ, లోపలా బయటా గాని సభాద్వారాన, ఆకాశాన భూమి పైగాక తొడలమధ్య, ప్రాణం ఉన్నవో లేనివో తెలియని గోళ్ళతో, ముల్లోకాలలోని జనుల హృదయాలకు బాణంగా గుచ్చుకుంటూ, వారిని హింసిస్తున్న హిరణ్యకశిపుని నృసింహుడు వధించాడు. వధ పిదప అతడు మహాభయంకరంగా కనిపిస్తున్నాడు. జ్వాలలతో ఎగసిపడే అగ్నిహోత్రునివలె భీతిగొల్పుతూ, పొడుచుకొని వచ్చి, వికారంగా కనిపించే కోరలతో, పామువంటి నాలుకతో, కేసరాలనంటిన రాక్షస రక్తంతో, మెడలో మాలికలుగా ధరించిన రాక్షసుని ప్రేగులతో, ఏనుగు కుంభస్థలం చీల్చి, వచ్చే సింహంవలె, రాక్షసుని గుండెతామరను త్రుంచి, ఆ రక్తంతో తడిసిన జూలుతో, సంజ వెలుగులో మెరిసే చంద్రరేఖల వల గోళ్లు అబ్బురపరచగా, నిలిచిఉన్నాడు. ఆ స్థితిలో ఆ దేవుని ఎట్టయెదుట ఆయుధహస్తులై యుద్దానికి సిద్ధమై కనిపిస్తున్న వేలకొలది రాక్షసులను ఒక్కడినికూడా మిగల్చకుండా చంపాడు.
నృసింహుడు రాక్షసవీరుల సంహారం తరువాత, చూపరులకు భయంకరుడై సింహాసనంపై అధిష్టించాడు. అపుడు అతని వైపు చూడడానికి ఎవరూ సాహసించలేకున్నారు. అతని క్రోధం చల్లారలేదు. ముఖం భీషణంగా ఉంది.
ఓ రాజా! ఆ స్థితిలో, అక్కడగల దేవతలు, చారణులు, విద్యాధరులు, గంధర్వులు, నాగులు, యక్షులు, సిద్ధులు వీరిలో ఏ ఒక్కరూ నృసింహుని సమీపించడానికి సాహసించ లేదు. అందరూ భయభ్రాంతు లయినారు.
ఓ రాజా! ఆ సమయంలో దేవవనితలు సంతోషంతో నృసింహదేవుని జూచి, మహోత్సాహంతో ఆయనపై పూలవానలు కురిపించారు. ఆనందంతో ఉత్సవాలు జరుపుకున్నారు.
ఇంకా ఆ సమయంలో ఆకసంలో పెక్కు దేవతల విమానాలు, గంధర్వుల పాటలు, అప్సరసల నృత్యాలు, ఢక్క దుందుభి, తప్పెట, మద్దెల మొదలయినవాని ధ్వనులు వ్యక్తమైనాయి. హరికి పార్శ్వచరులు సునందుడు, కుముదుడు మొదలైనవారు, శంకరుని, బ్రహ్మను, దేవేంద్రుని ముందుపెట్టుకుని దేవతలు, కిన్నరలు, కింపురుషులు, నాగులు, సిద్దులు, సాధ్యులు, గరుడులు, గంధర్వులు, చారణులు, విద్యాధరులు మొదలయినవారితో పాటుగా ప్రజాపతులు నృసింహస్వామి దర్శన కుతూహలంతో వచ్చిచేరి.
(వైకుంఠ ద్వారపాలకులు : జయుడు, విజయుడు(తూర్పు ద్వారపాలకులు). భలుడు, ప్రభలుడు (దక్షణ ద్వారపాలకులు). నందుడు, సునందుడు(పశ్చిమ ద్వారపాలకులు). కుముదుడు, కుముదాక్షుడు(ఉత్తర ద్వారపాలకులు).
ఇక్కడ తూర్పు ద్వారపాలకులైన జయవిజయులు శాపగ్రస్తులై హిరణ్యాక్ష హిరణ్యకశిపులుగా జన్మించారు.
ప్రజాపతులు : భృగువు, పులస్త్యుడు, పులహుడు, అంగీరసుడు, అత్రి, క్రతువు, దక్షుడు, వశిష్ఠుడు.)
No comments:
Post a Comment