Wednesday, March 18, 2026

A Powerful Crocodile Attacked and Grabbed Gajendra's Leg - మొసలి గజేంద్రుడుని పళ్ళతో కరిచి పట్టుట

మొసలి గజేంద్రుడుని పళ్ళతో కరిచి పట్టుట

ఇలాగ గజరాజు క్రీడిస్తున సమయంలో ఉన్నట్టుండి భుగభుగమనే చప్పుళ్ళతో పెద్ద పెద్ద బుడగలు పుట్టి ఆకాశానికి ఎగిరే విధంగా ఆ సరస్సులో నుండి ఒక పెద్ద మొసలి పైకెగిసింది.

లోకమంతా భయపడే విధంగా ఫూత్కార శబ్దాలు చేస్తూ ఆ సరస్సులోని ఇతరములైన మొసళ్ళు, చేపలు అదిరిపోయేలా ఒక ఉదుటున అది పైకి లంఘించింది.

తన తోకను ఒకసారి ఝాడించి, ప్రళయ కాలంలోని సుడిగాలి లాంటి ఝంఝను సృష్టించి సరస్సులో సుడిగుండాలు సృష్టిస్తూ పైకి ఎగిరింది.

ఆ అలల తాకిడికి గుట్టమీద ఉన్న చెట్లు వేళ్ళతో సహా నేలపై పడిపోయే విధంగా భయంకరమైన హుంకారం చేస్తూ అది గగుర్పాటు కల్గిస్తూ ఆకసంలోకి లేచి కిందపడుతూ ఒక్క ఉదుటున ఒడుపు తెలిసి ఆ గజరాజును పళ్ళతో కరిచి పట్టింది.

ఆ గజేంద్రుడు వేగంగానే ఆ మొసలి పట్టును తప్పించుకొని తన పొడవైన తొండం పైకెత్తి మొసలిపై ఒక దెబ్బ కొట్టాడు. ఆ దెబ్బతో ఆ మొసలి చచ్చినట్టు నీళ్ళలో పడి వెంటనే తేరుకొని అతివేగంగా ఆ ఏనుగు ముందరి కాళ్ళను పట్టుకొంది.

ఆ గజేంద్రుడు ఎంతో ధైర్యవంతుడు. ఏ మాత్రం భయం లేకుండా తన దంతాల మొనలతో ఆ మొసలి బొరుసుల కింది భాగాలు కదిలిపోయేలా చిట్లిపోయేలా పొడిచాడు; ఆ మొసలి కూడా కాళ్ళను వదలిపెట్టి ఏనుగుతోక మూలాన్ని కరిచింది.

మొసలి ఏనుగును మడుగులోకి లాగింది. ఏనుగు మొసలిని గట్టువైపు ఈడ్చింది. పరస్పరం ద్వేషం పెంచుకొని పోరాడుతుండగా, ఏనుగు కన్నా మొసలి, మొసలి కన్నా ఏనుగు - బలంగా కనిపిస్తున్నాయే అంటూ అతల, కుతల లోకాలలోని వీరులు బెదరిపోయారు.

(అతల-కుతల-సుతల-వితల-తలాతల -రసాతల-పాతాల లోకాలు అధోలోకాలు ఏడు.)

ఈ విధంగా ఆ ఏనుగూ, మొసలీ రెండూ ఒకదానితో ఒకటి విజృంభించిన శరీరాలు కలవై ఒకదాన్ని మరొకటి మించాలని ఢీకొన్నాయి. అన్నిలోకాలూ వీటి పోరాటాన్ని చూచి భయపడిపోయాయి. వాటికి ఒకదాన్ని మరొకటి ఓడించాలన్న పట్టుదల తప్ప మరేమీ లేకపోయింది. ఈ అలజడితో సరస్సులోని నీరంతా కలుషితమైపోయి గొప్ప సంక్షోభం ఏర్పడింది. సింహాన్ని మరో సింహం, కొండను మరో కొండ వెనుదీయకుండా ఎదిరించినట్లు నీళ్ళలో అవి రెండూ పెనుగులాడుతూ, ఒకదాన్ని మరొకటి ఆక్రమిస్తూ పోరాడాయి. ఒకటి లోపలికి లాగితే మరొకటి బయటికి లాగుతూ ఆ కొలనును మలినపరచాయి. మిక్కిలి వేగంతో అటుబడి ఇటుబడి తొట్రుపాటు లేకుండా పోరాడాయి. బుడబుడమని, బుగులు బుగుల్లని శబ్దాలు పుట్టగా నురుగులు గట్టి నీళ్ళు పైకి ఎగిశాయి. ఆ నీటి తుంపరల్ని చప్పరిస్తూ నిరంతరమూ తమ గుహలవంటి నోళ్ళను తెరుస్తూ మూస్తూ వాడివై, మిక్కిలి భీకరములయిన తమ దంతాలతో ఒకటి మరోదాన్ని ముట్టెలతో తాకుతూ తలలు చిన్న చిన్న ముక్కలుగా అయ్యేటట్టు అమరికలు తప్పి నెత్తురు చిప్పిల్లే విధంగా హుమ్మంటూ వాడి పండ్లతో పొడుచుకుంటున్నాయి. ఒకదానిని మరొకటి లాగేటప్పుడు కాళ్ళమొదళ్ళలోని తమ పట్టును వదలకుండా దృఢంగా నిలదొక్కుకున్నాయి. వాటి పరిభ్రమణ వేగానికి సరస్సులోని నీళ్ళు సుళ్ళు తిరిగాయి. ఆ నీటిలోని మొసళ్ళు, తాబేళ్ళు, ఎండ్రకాయలు, చేపలు, కప్పలు మొదలైన నీటి జంతువుల ప్రాణాలు గాలిలో కలిశాయి. బింకంతో మొసలి, ఏనుగూ ఒకదాన్ని మరొకటి అణగదొక్కి చీకాకుపరిచాయి. బలం కోల్పోయి బాగా అలసిపోయాయి. పరస్పరం దెబ్బలు తప్పుకోడానికి అక్కడ దొరికిన నాచును, కప్పచిప్పలను అడ్డంగా పడవేయసాగాయి. రెండింటికీ శరీరాలపైన ఆశ విడిచి గెలిచి తీరాలనే పట్టుదలతో పోరాడాయి. రాత్రింబవళ్ళలాగా ఒకదాని తరువాత మరొకటి పరాక్రమించటం మొదలుపెట్టి, పోరాటమనే ఆటలో పడి నిద్రాహారాలు మాని మొక్కపోని పరాక్రమంతో ఘోరంగా చెలరేగి చాలాకాలం అవి పోరాడుతూ ఉండిపోయాయి.

వేగం, పట్టుదల, శక్తి కల్గిన గజేంద్రుడు ఈ భూమి మీద ఎన్నో విధాలుగా మకరంతో పోరాడుతుండగా, ఆకాశంలోని మకర, మీన, కర్కట రాశి సముదాయం ఒక్కసారిగా భీతి పొంది సూర్యమండలంలోకి దూరాయి.

నీటిలోకి మళ్లీమళ్ళీ ఈడుస్తున్న ఆ మొసలిని ఓడించడానికి ఎంతో శ్రమించి ఏనుగుల రాజు గగ్గోలు చేశాడు. వజ్రాయుధంలాంటి తన బలమైన దంతాలతో దాని రొమ్ము పగిలేటట్టుగా పొడిచాడు. ఇంద్రునిభుజం వంటి తన తొండంతో దాని మెడ చుట్టి పట్టి విసిరిపారేశాడు.

ఆ సమయంలో

అలా ఆ మొసలితో పోరాడుతున్న గజరాజును ఒంటరిగా వదలివెళ్ళి పోవడానికి మనసొప్పక ఆడ ఏనుగులు ఆత్రంగా అలాగే చూస్తూ నిలబడిపోయాయి. ఎందుకంటే భార్యాభర్తల అనుబంధం విడదీయరానిది కదా!

అప్పుడు ఏమయిందంటే.

ఇలా పోరాడగా పోరాడగా నీటిలో ఉన్న మొసలికి జీవనాధారం నీరే కాబట్టి దాని బలం, పట్టుదల అంతకంతకూ పెరిగాయి. ఎవరికైనా స్థానబలం గొప్పదికదా! నేలపై తిరిగే గజరాజు యోధుడే అయినా నీటిలో అతని 'శక్తి' చాలలేదు. కృష్ణపక్షంలోని చంద్రకాంతి తరిగి పోయినట్టుగా అతని బలం సన్నగిల్లి అలసిపోయాడు.

ఇక మొసలి విజృంభించింది. సింగంలాగా హుంకరించి దాని కుంభస్థలం మీదికి ఒక్క ఉదుటున ఉరికింది. పాదాలను ఆక్రమించింది. మెడను, వీపును చరిచింది. సులువుగా పైకెగసి దాని తోకపై ఒక దెబ్బకొట్టింది. నలిగిపోయేట్టు ఢీ కొట్టింది. ఎముకలు, దంతాలు విరిగిపోయేలా కొట్టింది. అంతటి ఏనుగునూ నీళ్ళలో ముంచివేసింది. తానూ మునిగింది. నక్కి నక్కి ఒక్కసారిగా ఆ ఏనుగుపైన పడుతోంది.

ఆ మొసలి కనిపించకుండా గుట్టుగా నీటిలో దాగుతూ ఉండి ఏనుగు గట్టుకు వెళ్ళేటప్పుడు అడ్డంగా కనిపిస్తుంది. దానికాళ్ళను పెనవేసుకొని బంధిస్తుంది. ముందుకు పోనీక వెనక్కిరానీక భయంతో కూలిపోయేలా తోకతో కొడుతుంది. లేస్తే ఒళ్ళు ఝాడించి పైకెగురుతుంది; శౌర్యంతో చీలుస్తుంది. పక్కకు వెళ్ళిపోతుంది. వెనక్కి మరలిపోతుంది. మళ్ళీవచ్చి పట్టుకొంటుంది. కోపిస్తూ బాధపెడుతుంది.

ఈ విధంగా అవక్ర పరాక్రమంతో (ఆ మొసలి) తన జాతి మొసళ్ళనన్నిటినీ ఆశ్చర్యచకితుల్ని చేస్తూ మహామాయ అనే పెను చీకటి అల్ప హృదయునియొక్క జ్ఞానదీపాన్ని కప్పివేసిన రీతిగా రానురాను ఉత్సహిస్తూ, కలహ ప్రయత్నాలు చేస్తూ, అనేక విధాలుగా నీటిలో మునగడంలో తేలడంలో సామర్థ్యం కల్గిన ఆ మకరం మిక్కిలి సాహసం

ఆ మొసలి రెండు కాళ్ళను నేలపై దృఢంగా ఆనించింది. ఊపిరి బిగబట్టి పంచేంద్రియాల వ్యామోహాన్ని అణగించింది. బుద్ది అనే తీగకు మారాకు తొడిగి, ఆనంద స్వరూపమైన పరమాత్మ స్థానాన్ని ఆశ్రయించి ఆనందించే పరమయోగి పుంగవుడిలాగా ఆ ఏనుగు పాదాలను కదలకుండా వదలకుండా గట్టిగా పట్టుకొని తన పరాక్రమం చూపింది.

(యోగులు రెండు పాదాలు నేలపై నిలిపి ఉచ్చ్వాసనిశ్వాసాలను నియమించి అయిదు జ్ఞానేంద్రియాల వ్యామోహాన్ని అరికడతారు. తద్వారా బుద్ధికి వికాసం కలిగిస్తారు. అలా దుఃఖరహితమైన బ్రహ్మపదాన్ని ఆశ్రయించి ఆనందిస్తారు. ఈ స్థితిని మకరంతో సమన్వయిస్తూ సాగిన పద్యమిది.)

గజేంద్రుని బాధిస్తున్న మొసలిని చూచి స్వర్గంలో ఉండే ఐరావతమే తెల్లబోయింది. అది దేవేంద్రుని కింద పడదోసి దేవతలు పట్టుకోడానికి రాగా దొరక్కుండా ఆకాశంలో పరుగెత్తింది.

ఆ గజేంద్రుడు ఊహ తలకిందై కలత చెందాడు. బతుకు మరుగులో పడి, మహామోహమనే తీగతో కట్టివేయబడ్డ తన పాదాన్ని విడిపించుకోలేని స్థితిలో సందేహస్థితిలో దీనంగా భయంకరమైన మొసలి యొక్క వాడి కోరలకు చిక్కి కరవబడి గాయమైన కాలిగిట్టలతో, ఇంకా పోరాడుతూనే ఉన్నాడు.

(సంసారంలో ఉన్న జీవుడు జీవనమనే గహన ప్రదేశంలో చిక్కుకుంటాడు. మోహలతాబంధనాన్ని విడిపించుకోలేడు. పలు సంశయాలకు పాత్రమవుతాడు. అట్టివాని దీనదశతో ఇక్కడ గజేంద్రుని దీనావస్థ పోల్చబడింది.)

ఆ గజేంద్రుడు ఆ మొసలితో అలసిపోకుండా, స్రుక్కిపోకుండా, విసుగులేకుండా, పగళ్ళు, సంజలు, రాత్రులు - ఎడ తెరిపిలేకుండా వేయి సంవత్సరాలపాటు పోరు సాగించాడు.

గొప్పబలంతో గజరాజు ఆ మకరరాజుతో పలు సంవత్సరాలు పోరాడి బాగా చితికిపోయాడు. తన బలాన్ని మొసలి బలాన్ని పోల్చి చూచుకొని ఇలా ఆలోచించాడు. ఇంకా దీన్ని గెలవాలన్న అడియాస కూడదు. దీనితో సమంగా పోరాడే శక్తి నాలో లేదు; అనుకొంటూ పూర్వజన్మలో చేసిన పుణ్యకర్మ ఫలమైన దివ్యజ్ఞానం స్ఫురించగా ఈ విధంగా అనుకొన్నాడు.

(భగవంతుడు చరాచర జగత్తుకంతా ప్రభువు. మనుష్యులకే కాక ఆ దేవుడు పశుపక్ష్యాదులకు తన అపారమైన అనుగ్రహం చూపుతాడు. అందువల్లనే క్లిష్టదశలో ఉన్న గజేంద్రునికి పూర్వపుణ్యఫలమైన దివ్యజ్ఞానం సిద్ధించింది. అదే అతనికి తరుణోపాయం అయింది.)



No comments:

Post a Comment

Halahala, Kalakuṭa (most deadly and venomous poison in the universe) Emerged - హాలాహలం జనించుట

హాలాహలం జనించుట ఆ తరువాత అంతలోనే, అల్లకల్లోలమైన ఆ సముద్రంలోనుండి హాలాహలమనే విషం కోలాహలమైన అగ్ని జ్వాలలతో బయటపడింది. దాన్ని చూసి భయపడి సురాస...