Tuesday, March 24, 2026

The Ikshvaku Dynasty - ఇక్ష్వాకు వంశానుక్రమము

ఇక్ష్వాకు వంశానుక్రమము

ఒకరోజు వైవస్వత మనువు తుమ్మగా అతని ముక్కురంధ్రం నుండి గొప్పకీర్తి కలిగిన పుణ్యాత్ముడు ఇక్ష్వాకుడు వైకల్యం లేకుండా పుట్టి సూర్యవంశానికి రాజయ్యాడు.

(మనువుకు పదిమంది సంతానం. ఇక్ష్వాకుడు తొమ్మదవవాడు. ఇంతవరకు ఎనిమిదిమంది వృత్తాంతాలు చెప్పబడ్డాయి.

ఇక్ష్వాకుడికి నూరుమంది కొడుకులు పుట్టారు. వారిలో వికుక్షి నిమి, దండకుడు అనేవారు వరుసగా పెద్దకొడుకులు. వీరు ఆర్యావర్తంలోని హిమాలయానికి, వింధ్యకు మధ్యనున్న కొంతభూమిని పాలించారు. తరువాతి ఇరవై ఐదుమంది తూర్పుభాగాన్ని పాలించారు. మరో ఇరవైఐదుమంది పడమటి భాగాన్ని పాలించారు. ఇంక మిగిలిన నలబైఏడుమంది ఉత్తరదక్షిణభూములకు రాజులయ్యారు. అప్పుడు ఇక్ష్వాకుడు అష్టకాశ్రాద్ధం చేయాలనుకొని పెద్దకొడుకు, కీర్తిమంతుడు అయిన వికుక్షినిచూచి పరిశుద్ధమైన మాంసఖండాన్ని తెమ్మన్నాడు.

తండ్రి ఆనతిని విని వికుక్షి అట్లేనని దట్టమైన అడవులకు వేటకువెళ్లాడు. అక్కడ జంతువుల్ని వేటాడిచంపాడు. శరీరం బాగా అలసిపోయింది. తట్టుకోలేని ఆకలిబాధతో సగమై, ఒక కుందేలును పట్టుకొని తిన్నాడు. తినగా మిగిలిన మాంసఖండాన్ని దోషంలేదనే భావంతో వెంటనే తండ్రికి తెచ్చిఇచ్చాడు.

అపుడు కులగురుడు వసిష్ఠుడు వికుక్షి కుందేలుమాంసం తినడం మనస్సులో గ్రహించాడు. “ఇది ఎంగిలిపడిన మాంసం. పితృకర్మలకు పనికిరాదు. వీడు దుర్బుద్ది కలవాడు” అని అన్నాడు. ఇక్ష్వాకుడు వికుక్షిని రాజ్యంనుండి బయటకు వెడలగొట్లాడు.

గుణవంతుడైన ఇక్ష్వాకుడు కొడుకును వెళ్ళగొట్టి, ఆ వసిష్ఠమహర్షి చెప్పింది ఆచరించి యోగియై, అరణ్యాలకు వెళ్ళి శరీరాన్ని వదలి మోక్షాన్ని పొందాడు.

తండ్రి మోక్షం పొందగా నీతిశాలి వికుక్షి తనను ప్రజలు శశాదుడని పొగడుతుండగా ఈ భూమిని పరిపాలించి విష్ణువును గూర్చి ప్రయత్నపూర్వకంగా యాగాలు చేశాడు. పురంజయుడనే కొడుకును కన్నాడు. అతనిని గూర్చి లోకాలు కకుత్‌స్థుడని, అమరేంద్రవాహనుడని పేర్కొన్నాయి.

(పూర్వపద్యంలో వికుక్షి చేసిన దోషం చెప్పబడింది. కాని వాణ్ణి ప్రజలు కీర్తించారు. అనేకయాగాలు చేశాడు. అంటే ప్రజామోదం పొందాడన్నమాట. దోషం చేసినా దాన్ని సర్దుకున్నాడు. శశాదుడు అనగా కుందేలును తిన్నవాడని అర్థం.)

కృతయుగం చివర్లో రాక్షసులకు దేవతలకు యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో ఓడిన దేవేంద్రుడు విష్ణువుతో మొరపెట్టుకొన్నాడు. అప్పుడు విష్ణువు ఇంద్రా! పురంజయునిలో నేను ఆవేశిస్తాను. నువ్వు ఎద్దువై అతణ్ణి మోయుమన్నాడు. ఇంద్రుడు ఎద్దుగా మారి తనమూపుపై పురంజయుణ్ణి మోశాడు. విష్ణుతేజస్సు తనలో వ్యాపించగా పురంజయుడు ధనుర్భాణాలను ధరించి ప్రళయకాలాగ్నివలె యుద్దానికి బయలుదేరాడు.

ఆ విధంగా బయలుదేరి రాక్షసవీరుల శరీరాలను ఖండించి, కుత్తుకలను ముక్కలుగా ఖండించి, కొందరిని యముని నగరానికి పంపి, మరికొందరిని నాగలోకానికి తరిమాడు. అంతటితో ఊరుకోక పురంజయుడనే పేరు సార్థకం అయ్యేటట్లు ఆ రాక్షసులనగరాలనుకూడా కూల్చాడు.

ఈ విధంగా శశాదుని కొడుకు రాక్షసులపురాలను జయించిన కారణంచేత పురంజయుడని, ఎద్దురూపంలో ఉన్న దేవేంద్రుడు వాహనం కావటంచేత ఇంద్రవాహనుడని, అతని మూపురంమీద ఎక్కి యుద్ధంచేయటంచేత కకుత్‌స్థుడని మూడుపేర్లతో ప్రఖ్యాతి పొంది, రాక్షసుల ధనాలను ఇంద్రుని కిచ్చాడు. అతని కుమారుడు అనేనసుడు. అతనికొడుకు పృథుడు. అతనికొడుకు విశ్వగంధుడు. విశ్వగంధునికొడుకు చంద్రుడు. చంద్రునికొడుకు యువనాశ్వుడు. అతని కొడుకు శ్రవస్తుండు. ఈతడే శావప్తి అనే పేరుగల నగరాన్ని నిర్మించాడు. శవస్తికొడుకు బృహదశ్వుడు. ఇతనికొడుకు కువలయాశ్వుడు. ఆ రాజశ్రేష్ఠుడు

వీరుడైన కువలయాశ్వుడు బలిష్ఠుడై తన ఇరవైఒక్కవేలమందికొడుకులతో ఉదంకుని ఆనతిమేరకు వెళ్ళి, దేవతల శత్రువైన దుంధుడనేవాణ్ణి చంపాడు.

దుంధుడనే రాక్షసుణ్ణి చంపటంచేత కువలయాశ్వునికి దుంధుమారుడనే పేరు కలిగింది. దుంధుని నోటినుండి వెడలిన కువలయాశ్వుని కొడుకులు బూడిద అయ్యారు. దృఢాశ్వుడు, కపిలాశ్వుడు, భద్రాశ్వుడు అనే ముగ్గురుమాత్రం బ్రతికారు. వారిలో దృ
ఢాశ్వునికి హర్యశ్వుడు, వానికి నికుంభుడు, వానికి బర్హిణాశ్వుడు, వానికి కృతాశ్వుడు, వానికి సేనజిత్తు, వానికి యువనాశ్వుడు పుట్టారు. ఆ యువనాశ్వుడు సంతానంలేక నూర్వురుభార్యలతో భయపడుతూ ఉండినాడు. అప్పుడు కొందరుమునులు దయతలచి సంతానంకోసం అతనితో ఇంద్రయాగం చేయించారు. ఆ యాగంలో

రాజుభార్యకు, పుత్రలాభంకోసం బ్రాహ్మణులు నీటిని మంత్రించి, నియమంగా ఆ నీరున్నకలశాన్ని దాచి నిద్రపోయారు. ఆ రాత్రి రాజు దప్పికతో విధిలేక యాగశాలను ప్రవేశించి, ఆ నీటిని త్రాగాడు. అపుడు బ్రాహ్మణులు మేల్కొని నీళ్లు ఏమైనాయి? ఎవరు త్రాగారు? అని రాజు త్రాగిన విషయాన్ని గ్రహించారు. ఆశ్చర్యపోయి “ఈశ్వరాజ్ఞను ఎవడు దాటగలడు? ఇప్పుడేం చేయాలి? ఆ భగవంతుడికి నమస్మారం” అంటూ

ఆ బ్రాహ్మణులు విచారిస్తుండగా కొంత సేపటికి యువనాశ్వునిపొట్టచీల్చుకొని చక్రవర్తి లక్షణాలతో ఒక కొడుకు పుట్టాడు. తల్లిలేని కారణంచేత పొట్టనిండక ఏడుస్తున్న ఆ శిశువుదగ్గరికి ఇంద్రుడు వచ్చి తన వ్రేలును వాడినోటిలో ఉంచాడు. అట్లా త్రాగినందున ఆ బాలునికి మాంధాత అనే పేరుపెట్టి వెళ్ళాడు. ఈ విధంగా

(మాం = నన్ను, ధాతా = త్రాగగలడు అని ఇంద్రుడు - అన్నాడు. శిశువు అట్లే చేశాడు. ఆ శిశువుకు మాంధాత అని పేరయ్యింది.)

పొట్టపగిలి ముద్దుకొడుకు పుట్టినా తండ్రి చావలేదు. దేవతల, బ్రాహ్మణుల దయ అలా ఉంటుంది కదా! అధికమైన దైవబలం కలిగినవాడు జీవిస్తాడేకాని చెడిపోతాడా? చెడిపోడు.

ఈ విధంగా బతికిన యువనాశ్వుడు కొంతకాలానికి తపస్సుచేసి సిద్ధిపొందాడు. ఆ తరువాత

ఆ బాలుడు పడమటి దిక్కున పుట్టె బాలచంద్రునివలె దినదిన ప్రవర్ధమానుడై, నిండు యౌవనం పొంది, రావణాది రాక్షసులను, శత్రురాజులను దండించాడు. అతణ్ణి దేవేంద్రుడు త్రసదస్యుడు అని పొగిడాడు. అతడు యజ్ఞవస్తువులు, యజమాని, మంత్రాలు, ఋత్విక్కులు, యజ్ఞకాలాలు అన్నీ విష్ణుమయంగా భావించి, గొప్పగా దక్షిణలనిచ్చి యజ్ఞాలు చేశాడు.

ఆ మాంధాత శ్రీహరిదయతో శత్రువులను శిక్షిస్తూ, చంద్రసూర్యులు సంచరించే చోటులన్నింటిని సిరిసంపదలతో తులతూగేటట్లు పరిపాలించాడు.

పిమ్మట ఆ మాంధాతకు శతబిందుని కూతురైన బిందుమతివల్ల పురుకుత్సుడు, అంబరీషుడు, ముచుకుందుడు అనే ముగ్గురుకొడుకులు, ఏభైమందికూతుళ్లు కలిగి పెరుగుచుండగా

మహానుభావుడైన సౌభరి అనే ముని యమునానదినీటిలో తపస్సుచేస్తూ, భార్యాపుత్రులతో కలిసి సంసారసుఖాన్ని అనుభవిస్తున్న చేపలరాజును చూశాడు. సంసార మందలి కోరికతో మాంధాతను ఆయన పుత్రికలలో ఒక కన్యను తన కిమ్మని అడిగాడు. ఆ రాజు స్వయంవరంలో కన్యనిస్తాను గ్రహించమన్నాడు, వయసులో ఉండే కన్య నాలాంటి ముసలివాణ్ణి ఎందుకు ఇష్టపడుతుంది. ముసలితనంతో వణుకుతున్నాను. జుట్టు నెరిసింది. ఒంట్లో కాంతిగాని, బిగువుగాని లేదు. కన్యను లోబరచుకొనే ఉపాయమేది? అని అనుకున్నాడు.

పువ్వులాంటి శరీరం గల కన్య యౌవనవంతుణ్ణి, సౌందర్యవంతుణ్ణి, ధనవంతుణ్ణి కోరుకుంటే కోరుకోవచ్చుగాని, ఎదురుగా నున్న ముసలిమునినైన నన్ను ఎందుకు కోరుకుంటుంది?

అని యోచించి సౌభరి తన తపశ్శక్తితో ముసలితనాన్ని విడిచి లతవయస్సు యువకుడై చక్కగా అలంకరించుకొని మాంధాత దగ్గరకు వచ్చాడు. అపుడారాజు అంతఃపుర రక్షకుల నాజ్ఞాపించగా వారు ఆ మునిని రాజకుమార్తెలున్న చోటికి తీసుకువెళ్లి చూపించారు. చూపగా

మన్మథుడు మోహావేశాన్ని కల్గించగా, ఆ కన్యలందరు ఆ మునీశ్వరుని చూచి “కొమ్మలారా! వీడు నలకూబరుడో, మన్మథుడో, జయంతుడో పొరబాటున ఇక్కడికి వచ్చాడు. ఆలస్యమెందుకు” అంటూ మేము మేము అని సంచలిత మనస్కులై అందరు వరించారు.

ఈ విధంగా ఆ రాజకన్యలనందరిని పెళ్ళాడి, సౌభరి తన తపోమహిమతో అనేక లీలావినోదాలు సృష్టించి సుందర భవనాల్లోనూ, కేళీపర్వతాల్లోనూ, కలువలు వికసించిన సరస్సుల్లో, కోకిలల, చిలుకల, తుమ్మెదల మనోజ్ఞ నాదాలతో సుందరమైన ఉద్యానవనాలలో, మణులు పొదిగిన తిన్నెలపైనా, గొప్పశయ్యలపైనా, కొండగుహల్లో శృంగారవతులైన స్త్రీలు తన ఆజ్ఞలు పాటిస్తుండగా, అందమైన ప్రదేశాలలో వస్త్రమాల్యానులేపనాదులను కల్పించి, ఇష్టభోజనాలతో పూటపూటకు ఒక ఆశ్చర్యకరమైన అందంతో ఆ రాజకుమార్తెలను సంతృప్తిపరచాడు.

అధికమైన నేతిధారలచేత తృప్తిపొందని అగ్నివలె, మునీశ్వరుడు పలువురు రాచకన్యలకు ఒకడే భర్తగా అయిఉండి కూడా తృప్తి పొందలేకపోయాడు.

పైవిధంగా మునీశ్వరుడు ఉద్యానవనంలో ఆ రాజకుమార్తెలతో అనేకవిధాల విహారాలతో, అనురాగాలతో, రాకపోకలతో కొన్నిరోజులు గడిపాడు.

పిమ్మట కొంతకాలానికి మంధాతృమహారాజు ముని ఏమయ్యాడో? కుమార్తెలు ఎన్నికష్టాలు పడుతున్నారో? అని ఆలోచించి, వెదుకుతూవచ్చి ఒక గొప్ప నగరంలో మణులు పొదిగిన భవంతిలో చక్రవర్తివలె విహరిస్తున్న తాపసరాజును చూచి సంతసించి, ఆశ్చర్యపడి ఆ మునిచేత గౌరవాలు పొంది, మెల్లగా కుమార్తెలను చేరి ఇలా అన్నాడు.

నా బిడ్డలారా! మీ భర్త అన్యోన్యంగా ఉంటున్నాడా? బాగా ఆదరిస్తున్నాడా? అని అడిగాడు - మాంధాత. ఆరాచ కుమార్తెలు అందరూ తండ్రీ! నా తోడే నా తోడే అంటూ బాగా ఆదరిస్తున్నాడన్నారు.

('తోడు' శబ్దానికి 'అన' అనే అర్థముంది. నాన్నా! నేను నిజమే చెబుతున్నాను. ఇది నా ఆన (నా సాక్షి) అని ఆ రాజు మాంధాతతో బిడ్డలందరూ చెప్పారు.)

పిమ్మట కొంతకాలానికి లౌకికబంధాలకు చిక్కిన సౌభరి ఏకాంతంలో తనకు తానే విచారించుకొని చేపల జంట పొత్తును చూడ్దంచేత తాను సంసారబంధంలో చిక్కుకోవడం తెలుసుకొని, పశ్చాత్తాపంతో ఇట్లా అనుకున్నాడు.

ఉపవాసాలతో శుష్కించడమో, ఇంద్రియ సుఖాలతోడి పొత్తు వదలి వేయడమో, తపస్సులో గడపడమో, శ్రీహరిధ్యానంలో ఉండడమో చేయక ఎందుకు ఈ మాటలాడి ఈ స్థితి తెచ్చుకొన్నాను. నా తపస్సంతా నశించింది. కపటమైన స్త్రీ కౌగిళ్లు మోక్షాన్ని కల్గిస్తాయా? (కల్గించవు).

నేనొక మునినట, తత్త్వం తెలిసినవాడనట, మోక్షం తప్ప ఇతరసుఖాల జోలికి వెళ్ళనట, ఏభైమంది భార్యలట, మేడల్లో నివాసమట, ఐదువేలమంది కొడుకులట. దీని కంతటికి కారణం చేపలరాజు సౌఖ్యం చూడడ మట. నవ్విపోతారుగాని పెద్దవారు మెచ్చుకొంటారా? (మెచ్చుకోరు)

తపస్సు చేసేవాడు, తత్త్వవేత్త అయినవాడు, మోక్షాన్ని కోరేవాడు ఏకాంతం కోరుకుంటాడు. కపటముని మాత్రం సంసారంలో తగుల్కొంటాడు.

అని దుఃఖించి తన్ను తాను నిందించుకొని, తన చేతను విమర్శించుకుంటూ ఇహపరాలను సాధించాలని నిశ్చయించి, సంసారాన్ని వదలి, భార్యలతో వానప్రస్థధర్మాన్ని స్వీకరించి, అడవులకు వెళ్ళి తపస్సుచేసి శరీరాన్ని వదలి అగ్నితో పరమాత్మను చేరుకున్నాడు. తరువాత

అగ్ని దేవుణ్ణి జ్వాలలు విడిచి పెట్టక అనుసరించినట్లు సౌభరిభార్యలుకూడా అతణ్ణి అనుసరించి, అతను పొందిన స్థితినే పొందారు.

మాంధాతకొడుకుల్లో అంబరీషుణ్ణి తాత యువనాశ్వుడు అతనిని కుమారునిగా స్వీకరించాడు. ఆ అంబరీషునికి యౌవనాశ్వుడు, అతనికి హారితుడు పుట్టారు. ఆ కారణంచేత అంబరీష, యౌవనాశ్వ, హారితులు మాంధాతృ గోత్రానికి ముఖ్యపురుషులైనారు. మాంధాత రెండవకొడుకు పురుకుత్సుడు. నాగకుమారులు అతణ్ణి పాతాళానికి తీసుకొనిపోయి, తమ చెల్లెలు నర్మద నిచ్చి వివాహం చేశారు. అక్కడ ఎందరో గంధర్వనాథుల్ని చంపి, తాను నాగలోకం వెళ్లి సంచరించిన విషయం స్మరించిన వాళ్లకు పాముల వల్ల భయం లేకుండా వరం పొంది, తిరిగివచ్చాడు. పురుకుత్సునికి త్రసదస్యుడు, అతనికి అనరణ్యుడు, అతనికి హర్యశ్వుడు, అతనికి అరుణుడు, అతనికి త్రిబంధనుడు, అతనికి సత్యవ్రతుడు జన్మించారు. ఆ సత్యవత్రుడే త్రిశంకుడని ప్రసిద్ది పొందాడు. ఆ త్రిశంకుడు

గురుశాపంవల్ల చండాలుడైన అతడు మహానుభావుడైన విశ్వామిత్రుణ్ణి ఆశ్రయించి, అతని ప్రభావంచేత స్వర్గానికి వెళ్ళాడు. దేవతలు అతణ్ణి ఒప్పుకోక తోసివేశారు. అతడు తలకిందుగా దీనుడై రావడం చూచి, విశ్వామిత్రుడు తన గొప్పతనంతో ఆకసంలో నిలిపాడు. నేటికీ ఆ త్రిశంకుడు అక్కడే ఉన్నాడు. అతనికొడుకు హరిశ్చంద్రుడు. విశ్వామిత్రుడితని వద్దకు వచ్చి యాగం నెపంతో అతని సంపదను హరించి, అతణ్ణి కులహీనునికి సేవకుడుగా చేశాడు. కాని హరిశ్చంద్రుడు అసత్యం పలుకక కష్టాల పాలయ్యాడు.

ఆ విధంగా విశ్వామిత్రుడు హరిశ్చంద్రుణ్ణి బాధపెట్టడం విని, వసిష్ఠుడు విశ్వామిత్రుని గద్దవు కమ్మని శపించాడు. విశ్వామిత్రుడు వసిష్ఠుణ్ణి కొంగవు కమ్మని శపించాడు. పక్షిరూపాలు పొందినా ఆ ఇద్దరూ శత్రువులై పోరాడారు. ఆ తరువాత హరిశ్చంద్రుడు కొడుకులు లేక నారదుని ఉపదేశంతో వరుణుణ్ణి  భక్తితో ఉపాసించాడు. వరుణుడు ప్రత్యక్షం కాగా హరిశ్చంద్రు డతనికి నమస్కరించి ఇలా అన్నాడు.

ఓ వరుణదేవా! నాకు మంచి వీరుడైన కొడుకునిస్తే అతణ్లి యాగపశువుగా మార్చి, నీవు సంతోషించేటట్లు హోమం చేస్తాను. కాబట్టి కొరత లేకుండా కొడుకు నిమ్ము.

అని అడిగిన హరిశ్చంద్రునికి కొడుకు కలుగుగాక అని వరమిచ్చి వరుణుడు వెళ్ళాడు. ఆ వరుణుని అనుగ్రహంచేత హరిశ్చంద్రునికి రోహితుడనే కొడుకు కలిగాడు. అపుడు వరుణుడు హరిశ్చంద్రుని కుమారుణ్ణి గురించి

వరుణుడు హరిశ్చంద్రుని వాగ్దానం ప్రకారం పురిటి లోపల వచ్చి కొడుకును బలి ఇవ్వుమనగా పురుడు దాటితేగాని కుదరదు అన్నాడు. పండ్లు రావడానికి ముందువచ్చి అడుగగా పండ్లు లేకపోవడంచేత బలికి అనర్హుడన్నాడు. పండ్లు వచ్చాక అడుగగా పడిపండ్లు రాలేదు కాబట్టి అనర్హుడన్నాడు. పాలపండ్లు పోయి మళ్లీ పళ్లు వచ్చాక అడుగగా యుద్దాలకు ఉపయోగపడితేనే అర్హత కలుగుతుందన్నాడు. ఈ విధంగా రాజు కొడుకుమీద ప్రేమచేత కాలక్షేపం చేశాడు. తండ్రి మనసులోని భావం తెలిసి కొడుకు ఇల్లు విడిచి అరణ్యాలకు వెళ్ళాడు.

ఇట్లా రోహితుడు ఇల్లువిడిచి అడవికిపోయి ధనుర్భాణాల్ని ధరించి తిరుగుతూ ఉన్నాడు. అక్కడ వరుణుని కారణంచేత హరిశ్చంద్రుడు మహోదరవ్యాధితో బాధింపబడుతున్నాడని తెలిసి, నగరానికి వచ్చే ప్రయత్నం చేశాడు. అది తెలుసుకొని ఇంద్రుడు ముసలితపసిగా వచ్చి ఇట్లా అన్నాడు.

(వరుణుడు జలదేవత. జలదేవతకు అపచారం చేసినకారణంగా జలతత్వం - అధికమై మహోదరవ్వ్యాధి పట్టి పీడించింది.)

ఓ రాజకుమారా! పుణ్యక్షేత్రాలను దర్శించు. పుణ్యతీర్థాల్లో మునుగు, పుణ్యాత్ములను కలుసుకో, పుణ్యకథలు విను. నీకు ఉపయోగముంటుంది.

అని ఇంద్రుడీ విధంగా రోహితుణ్ణి మరలించాడు. అతడు ఒక సంవత్సరం అడవిలో తిరిగి ఇంటిముఖం పట్టాడు. ఇంద్రుడు మళ్లీ వచ్చి అతణ్ణి నివారించాడు.

ఈ విధంగా దేవేంద్రుడు ఆ బాలుణ్ణి ఐదేండ్లు నివారించాడు. ఆఱవ ఏడు ఆ కుమారుడు అడవినుండి ఇంటికి వస్తూ అజీగర్తుని నడిమికొడుకు, మంచినడవడిక గలవాడు అయిన శునశ్శేఫుణ్ణి తీసుకవచ్చి తండ్రికి అప్పగించాడు. ఆ రాజు నరమేధం చేసి వరుణాది దేవతలను సంతృప్తి పరచాడు. ఆ యాగానికి హోత కౌశికుడు, అధ్వర్యుడు భృగువు, ఋత్విక్కు జమదగ్ని సామవేదగానం చేసినవాడు వసిష్ఠుడు. ఈ యాగానికి సంతోషించి దేవేంద్రు డా రాజుకు బంగారు రథం ఇచ్చాడు.

ఆ శునశ్శేఫుని గొప్పతనం తర్వాత చెప్తాను. భార్యతోకూడిన హరిశ్చంద్రుడు పాటించిన సత్యనిష్ఠకు మెచ్చిన విశ్వామిత్రుడు అతనికి తత్త్వజ్ఞానాన్ని బోధించాడు. అపుడాతడు మనసు అన్నమయం కాబట్టి అన్నరూపియైన భూమిని తెలుసుకొని దాన్ని జలంలో కలిపాడు. జలాన్ని తేజస్సులో లీనం చేశాడు. తేజస్సును వాయువులో కలిపాడు. వాయువును ఆకాశంలో కలిపాడు. ఆకాశాన్ని తామసాహంకారంలో కలిసేలా చేశాడు. అహంకారత్రయాన్ని మహత్తత్త్వంలో వీలీనమయ్యేలా చేశాడు. లోకసృష్టికి సంకల్పరూపమైన మహత్తత్త్వంలో విషయాహంకారాన్ని తొలగించాడు. అది పోగానే పరమాత్మను తెలుసుకున్నాడు. ఆ జ్ఞానంవల్ల సంసారకారణమైన ప్రకృతిని భస్మం చేసి, అజ్ఞానాన్ని మోక్షసుఖ పారవశ్యంతో తొలగించి, అన్ని బంధాలనుండి విముక్తుడైన ఆ హరిశ్చంద్రుడు అవాఙ్మానస గోచరంబైన ఆత్మస్వరూపంతో కలిసి ప్రకాశించాడు. అతని కొడుకు రోహితునికి హరితుడు, అతనికి చంపుడు పుట్టారు. చంపుడు తన పేరుమీద చంపానగరాన్ని నిర్మించాడు. అతడికి సుదేవుడు, అతనికి విజయుడు, అతనికి రుచికుడు, అతనికి వృకుడు, అతనికి బాహుకుడు పుట్టారు. వారిలో బాహుకుడు

No comments:

Post a Comment

Sri Chandi - శ్రీ చండీ

శ్రీ చండీ అష్టోత్తర శతనామావళిః కాత్యాయని లక్ష్మీ దేవి సరస్వతి దేవి దుర్గా దేవి శ్రీ రాజరాజేశ్వరీ తులసీ లలితా దేవి గాయత్రీ దేవి అన్నపూర్ణా దే...