Monday, March 16, 2026

Sree Maha Bhagavathamu Part 8 - శ్రీ మహా భాగవతము అష్టమస్కంధము

శ్రీరస్తు - శీమహాభాగవతము - అష్టమస్కంధము


శ్రీమన్నామ! పయోద, శ్యామ! ధరాభృల్లలామ! జగదభిరామా!
రామాజనకామ! మహో, ద్దామ! గుణస్తోమధామ! దశరథరామా!

శ్రీమంతమైన నామం కలవాడా! మేఘంవలే నల్లనైనవాడా! రాజులలో శ్రేష్ఠుడా! జగత్తుకు ప్రియమైనవాడా! స్త్రీలకు మన్మథునివంటివాడా! గొప్ప వైభవం కలవాడా! గుణసమూహాలకు నిలయమైనవాడా! దశరథుని కుమారుడవైన ఓ రామా!

నైమిశారణ్యంలో గుమిగూడిన శౌనకాది మహర్షులు నిరంతర పురాణ శ్రవణాదులచేత ఉన్నతమైన సంపదను పొందిన మానవోత్తములు, పురాణ వ్యాఖ్యానం చేయటంలో నిపుణుడు సూతుడు వారిని చూసి ఇలా అన్నాడు. “మహర్షులారా! ఆ విధంగా పరీక్షిత్తు ప్రాయోపవేశం చేసి శుకమహర్షిని చూచి ఇలా అన్నాడు.

ఓ మునీంద్రా! స్వాయంభువ మనువంశాన్ని గురించి ఆ కాలంలోనే జాతిధర్మాల కట్టుబాట్లను గురించి మనుష్యులు, రాక్షసులు, దేవతలు, ఎల్లప్రజాపతులు పుట్టడాన్ని గురించి విన్నాను.

ఆ పరతత్త్వ రూపుడైన హరి ఏ మనువు కాలంలో జన్మించాడు? ఏయే పనులు చేశాడు? ఆ మనువులు ఎవ్వరు? ఆయన ఏ ఏ కార్యాలు ఎలా చేస్తున్నాడు? ముందు ఏమి చేయబోతాడు? మునుపు ఏమేం చేశాడు? సత్పురుషులైన మహర్షులు హరి వైభవ లీలల్ని గురించి ఏమి చెప్పారు? దయతో ఈ విషయాలన్నీ తెలుపవలసింది.

అని పరీక్షిత్తు కోరగా శుకమహర్షి ఇలా సమాధానం చెప్పాడు.

ఓ రాజా! ఈ శ్వేతవరాహ కల్పంలో పదునాల్గురు మనువులలో ఆరుగురు మనువులు జీవించారు. వారి వారి కాలాలలో లోకంలో జనులు ఎలా పుట్టారో వివరిస్తాను విను.

మహారాజా! మొదటి మనువైన స్వాయంభువునికి ఇద్దరు కూతుళ్ళు పుట్టారు. ఆకూతి, దేవహూతి అని వారి పేర్లు. లోకంలో ధర్మప్రచారం చేయడానికి, జ్ఞానబోధ చేయడానికి శ్రీహరి స్వయంగా వారికి కుమారులుగా పుట్టాడు. ఆకూతికి కపిలునిగా, దేవహూతికి యజ్ఞుడుగా హరి తానే జన్మించాడు. ఈ ఇద్దరిలో కపిలుని వృత్తాంతం మునుపు చెప్పాను. యజ్ఞుని కథ ఇప్పుడు చెబుతాను. శ్రద్ధగా విను.

స్వాయంభువ మనువు పెద్దవాడై కామభోగాలపట్ల విరక్తుడై రాజ్యభారాన్ని వదలిపెట్టి తన భార్య శతరూపతో కలిసి సునందానదీ తీరంలో ఉన్న అడవికేగి ఘోరమైన తపస్సు చేశాడు. ఆ తపోదీక్షలో ఎన్నో నియమాలు పాటించాడు. ఒంటికాలి మీద నిలబడి, మౌనవ్రత దీక్ష పూని పాపప్రక్షాళన గావించుకొని వంద సంవత్సరాలు ఇలా గొప్ప తపస్సును సాగించాడు. ఈ తపస్సు విషయం ప్రపంచమంతటా తెలిసిపోయింది.

ఈ విధంగా తపస్సు చేస్తూ స్వాయంభువ మనువు తన మనస్సులో

ఎవ్వడు ఈ పదార్థ సృష్టిచేత చైతన్యం పొందడో - ఎవని చేష్ట వల్ల ఈ పదార్థజగత్తు సర్వమూ చైతన్యం పొందుతున్నదో, పుడుతున్నదో, ఎవడైతే ఈ సర్వజగత్తూ నిద్రిస్తున్నపుడు తాను మేల్కొని ఉండి ఈ విశ్వం మొత్తాన్ని భావిస్తుంటాడో, తానుగా ఈ ఆత్మకు ఆధారం అవుతున్నాడో, ఎవని వైభవం కొంచెం కూడా కనిపించకుండా, అనుక్షణం కనిపిస్తూ ఉంటుందో, ఎవని చూపునకు ఎదురు లేదో, సృష్టి స్థితి లయము లనే దశలు ఎవ్వని ఉనికిని దాచజాలవో, మహత్త్వ సంజ్ఞ కల్గినందువల్ల ఎవని గురించి ప్రపంచమంతా తెలుసుకోవాలని కుతూహలపడుతుందో, ఎవడు తానే స్వయంగా విశ్వరూపు డనబడుతూ వ్యాపిస్తాడో - అనుకొంటూ

అహంకారం లేకుండా, సర్వజ్ఞానాన్ని ఆపోసనపట్టి, పదార్థశూన్యుడుగా, భావమాత్రుడుగా ఉంటూ సర్వపదార్థ రాశిగా భావించే సంపూర్ణుడైన వాడు, ఎవరి గమనం ఎవరి చేత కూడా ప్రేరేపించబడదో (అంటే స్వయం సిద్ద గమన శైలి ఉన్నవాడని అర్థం), ఎవడు మానవులకు దండనీతిని ప్రసాదించాడో, ఎవని మార్గం అనితర సాధ్యమైనదో, సకల ధర్మ భావనాస్ఫూర్తి ఎవని ధర్మమో, ఆ పరతత్త్వానికి నమస్కరిస్తున్నాను - అని ఈ విధంగా ఉపనిషత్తుల సారాంశాన్ని వచిస్తున్న ఆ మనువును చూసి కరుణపొంది

సమాహితచిత్తుడై తపోనిష్టలో ఉన్న ఆ మనువుకు బాహ్యస్మృతి లేదు. అలాంటి పరిస్థితుల్లో రాక్షసులు ఆయన మీదకు ఉరికారు. నరమాంసభక్షణ రాక్షసుల స్వభావం. వీరిని చూచి ముందు చెప్పినట్లుగా విష్ణువు యజ్ఞుడనే పేరుతో అవతరించి ఉన్నాడు. కాబట్టి ఆ యజ్ఞుడు వారిని తన సుదర్శనచక్రధారలతో సంహరించాడు. దేవతలు ప్రశంసించారు.

ఇలా మొదటి మన్వంతరం పూర్తి అయింది. ఇక రెండో మన్వంతరం గురించి చెబుతాను విను.

అగ్నిదేవుని కుమారుడు స్వారోచిషుడు. అతడే ఈ రెండవ మన్వంతరంలో మనువు. అతనికి ద్యుమంతుడు, సుషేణుడు, రోచిష్మంతుడు మొదలైన కుమారులు కలిగారు. వారిలో రోచనుడు ఆ మన్వంతరంలో ఇంద్రపదవి పొందాడు. మిక్కిలి ప్రభావం కల్గిన తుషితుడు మొదలైన వారు దేవతలయ్యారు. ఊర్జస్తంభుడు మొదలైనవారు సప్తమహర్షులయ్యారు. వేదశిరుడు అనే బ్రాహ్మణునికి తుషిత అనే భార్య ఉంది. వారికి విష్ణుడు 'విభుడు' అనే పేరుతో కుమారుడుగా జన్మించి బ్రహ్మచర్య వ్రతదీక్ష పొంది 'కౌమారక' దశలోనే 88 వేలమంది మహర్షులు తనకు సహాయకులుగా ఉండగా దీర్ఘవ్రతాన్ని నిర్వహించాడు.

(ప్రతి అవతారంలోనూ దుష్టశిక్షణ అన్నది లేదు. ఉదాహరణకు ఈ అవతారంలో తానే దీక్ష వహించి దీర్ఘవ్రతం సాగించాడు విష్ణువు.

సప్తార్చి= ఏడు జ్వాలలు (నాలుకలు) కలవాడు. కాళీ, కరాళీ, మనోజవా, సులోహితా, సుధూమవర్ణా, స్ఫులింగినీ, విశ్వపదా అనేవి ఏడు జ్వాలలు. ఆ జ్వాలలను జిహ్వలుగా చెప్తారు.

ఆ తరువాత.

ఇక మూడో మనువు ప్రియవ్రతుని కుమారుడు ఉత్తముడు. అతని పాలనలో జగత్తు సుఖించింది. పవనుడు, సంజయుడు, యజ్ఞహోత్రుడు మొదలైనవారు అతని కొడుకులు. వసిష్ట మహర్షి కొడుకులు ప్రమథుడు మొదలైనవారు సప్తర్షులయ్యారు. సత్యజిత్తు ఇంద్రుడయ్యాడు. సత్యభద్రుడు మొదలైనవారు దేవతలయ్యారు. ధర్ముడు - సూనృత అనే దంపతులకు శ్రీమహావిష్ణువు 'సత్యసేను' డనే పేరుతో కుమారుడుగా జన్మించాడు. దుష్ట స్వభావులైన యక్ష రక్షోగణాలను దండించి సత్యజిత్తు స్నేహితుడనే పేరు పొందాడు. లోకం సత్యసేనుని పరాక్రమాన్ని కీర్తించింది.










No comments:

Post a Comment

Halahala, Kalakuṭa (most deadly and venomous poison in the universe) Emerged - హాలాహలం జనించుట

హాలాహలం జనించుట ఆ తరువాత అంతలోనే, అల్లకల్లోలమైన ఆ సముద్రంలోనుండి హాలాహలమనే విషం కోలాహలమైన అగ్ని జ్వాలలతో బయటపడింది. దాన్ని చూసి భయపడి సురాస...