Wednesday, March 11, 2026

The Story Of Savitru Genealogy - సవితృవంశ ప్రవచనాది కథ

సవితృవంశ ప్రవచనాది కథ

ఓ రాజా! విను. త్వష్టయొక్క వంశం గూర్చి నీకు వివరంగా చెప్పాను. తరువాత సవిత పృశ్ని, సావిత్రి, వ్యాహృతి అనే భార్యలయందు పశు సోమ పంచయజ్ఞాలనబడే అగ్నిహోత్రాలను కన్నాడు. భగుడు సిద్ధిక అనే భార్యయందు మహిమానుభావులైన విభవులను కన్నాడు. వారు మువ్వురు కాక అతడు ఒక పుత్రికను కూడా కన్నాడు. ఆమె పేరు ఆశిష ఆమె సొగసైన కన్నులు కలది. పుణ్యశీలం కలది. సుగుణవతి. మంచి చరిత్ర కలది. అన్ని లోకాలచే పూజలందుకొనేది.

ధాతకు కుహూ, సినీవాలి, రాకా, అనుమతులని నలుగురు భార్యలు. కుహూ అనే ఆమె సాయం అనే పేరుగల పుత్రుణ్ణి కన్నది. సినీవాలి దర్శ అనేవానిని, రాక ప్రాతః అనేవానిని, అనుమతి పూర్ణిమ అనేవానిని కన్నారు. విధాతకు క్రియ అనే ఆమె భార్య. వారు అగ్నిపురీష్యాదులను కన్నారు. వరుణుడు అనేవాడు చర్షిణి అనే భార్యయందు గతంలో బ్రహ్మపుత్రుడైన భృగువును, పుట్టలో పుట్టిన వాల్మీకిని కన్నారు. మిత్రావరుణులు అప్సరఃకాంత ఐన ఊర్వశిపై మరులుగొనడంవల్ల వీర్యపతనమైంది. ఆ వీర్యం ఒక కుంభంలో నిక్షిప్తం చేయబడింది. కుంభసంభవులుగా అగస్త్యుడు వసిష్ఠుడు జన్మించారు. ప్రత్యేకంగా మిత్రునకు రేవతియందు ఉత్సర్గసంభవులై అరిష్టుడు, పిప్పలుడు అనేవారు జన్మించారు. ఇంద్రునకు శచీదేవియందు జయంతుడు, ఋషభుడు, విదుషుడు అని ముగ్గురు జన్మించారు. వామనుడు అయిన ఉరుక్రమ భగవానునకు కీర్తి అనే భార్యయందు బృహత్‌శ్లోకుడు పుట్టాడు. ఆ బృహత్‌శ్లోకునకు సాభగాదులు జన్మించారు. మహానుభావుడైన కశ్యపప్రజాపతికి అదితియందు శ్రీమన్నారాయణుడు ఎలా అవతరించాడో తరువాత వివరిస్తాను. ఇక దితికుమారులైన దైతేయుల వంశక్రమాన్ని చెబుతాను. ఆ దైతేయవంశంలో ఇద్దరు పరమభగవద్భక్తులు ఉన్నారు. దైత్య దానవులచే నమస్కరింపదగినవారు వారిరువురు. వారే ప్రహ్లాదుడు, బలి అనేవారు. దితి కుమారులు ప్రసిద్ధులైన హిరణ్యకశిపు, హిరణ్యాక్షులు. హిరణ్యకశిపుని భార్య జంభాసురుని కుమార్తె అయిన కయాధువు. ఈ కయాధువునకు ప్రహ్లాద, అనుహ్లాద, సంహ్లాద, హ్లాదులనే నలుగురు కుమారులు, సింహిక అనే కన్య జన్మించారు. ఆ సింహికకు రాహువు జన్మించాడు. అమృతపానం చేయబోగా ఆ రాహువు శిరస్సును విష్ణుమూర్తి తన చక్రంచేత ఖండించాడు. సంహ్లాదునకు గతి అనే ఆమె భార్య. వారికి పుట్టినవాడు పంచజనుడు. హ్లాదునకు దమని అనే ఆమెయందు వాతాపి ఇల్వలుడు అని ఇద్దరు జన్మించారు. వారలను అగస్త్యుడు మింగాడు. అనుహ్లాదునకు సూర్మ్య అనే భార్యయందు బాష్కలుడు, మహిషుడు జన్మించారు. ప్రహ్లాదునకు దేవి అనే భార్యయందు విరోచనుడు జన్మించాడు. అతని కుమారుడు బలి. ఆ బలికి అశన అనే ఆమెయందు బాణుడు మొదటివాడుగా నూర్గురు కొడుకులు పుట్టారు. బలియొక్క ప్రభావాన్ని తరువాత చెపుతాను. బలి కుమారుడైన బాణాసురుడు పరమేశ్వరుని ఆరాధించి ప్రమథగణాలలో ముఖ్యుడయ్యాడు. దితి సంతానమైన మరుత్తులు నలుబది తొమ్మిదిమంది. వీరికి సంతానం లేదు. ఈ మరుత్తులు ఇంద్రునితో సమానంగా దైవత్వాన్ని పొందారు అని శుకమహర్షి చెప్పగా విని పరీక్షిత్తు ఇలా అడిగాడు.

మరుత్తులు

శ్రీ మహా భాగవతము

శ్రీ మహా భాగవతము ద్వితీయస్కంధము

శ్రీ మహా భాగవతము తృతీయస్కంధము

శ్రీ మహా భాగవతము చతుర్ధస్కంధము

శ్రీ మహా భాగవతము పంచమస్కంధము

శ్రీ మహా భాగవతము షష్టస్కంధము

పంచాంగం

No comments:

Post a Comment

Sri Trivikrama Swamy Temple – Cherukuru, Bapatla District, Andhra Pradesh - శ్రీ త్రివిక్రమ స్వామి ఆలయం – చేరుకూరు, బాపట్ల జిల్లా, ఆంధ్రప్రదేశ్

శ్రీ త్రివిక్రమ స్వామి ఆలయం – చేరుకూరు,  బాపట్ల జిల్లా,  ఆంధ్రప్రదేశ్ విష్ణుమూర్తి ఐదవ అవతారమైన వామనావతారానికి (త్రివిక్రమ స్వామి) సంబంధించి...