ఓ మునిశ్రేష్ఠా! శుకమహర్షీ! వికుంఠలోకాధిపతి విష్ణుమూర్తి. అన్ని ప్రాణుల పట్ల సమబుద్ధిగలవాడు. స్నేహితుడు, ప్రియుడు, ఆద్యంతరహితుడు, శ్రేష్ఠుడు కదా! అటువంటి విష్ణుమూర్తి ఇంద్రుని కోసం రాక్షసరాజులను ఎందుకు విరోధి లాగా వెదకి చంపాడు? అలా రాక్షసులను చంపడంచేత దేవతలవల్ల తనకు కలిగే లాభం ఏమిటి? అటువంటి లాభం విష్ణువు కున్నదా? మోక్షసామ్రాజ్యాధిపతి, త్రిగుణాతీతుడు అయిన విష్ణుమూర్తికి రాక్షసులవల్ల భయంగాని, రాక్షసులపై పగగాని లేదు కదా! అటువంటి ఘనుడు రాక్షసులను చంపి, దేవతలను కాపాడటం నాకు వింతగా ఉన్నది. నాకు కలిగిన ఈ సందేహాన్ని నీ ప్రజ్ఞతో నాకు తెలిసే విధంగా తీర్చు.
అలా పరీక్షిన్మహారాజు ప్రశ్నించగా శుకమహర్షి ఇలా అన్నాడు.
ఓ పరీక్షిత్తూ! మహారాజా! నీవు వినయంతో తప్పక తెలిసికోవలననే కోరికతో అడిగిన ప్రశ్న నిజంగా వివరించి చెప్పవలసిందే కదా! ఆలోచిస్తే లక్ష్మీదేవిచేత నిరంతరం గౌరవించబడే ఆ మహనీయుని చరిత్ర మహావిచిత్రంగా విడ్డూరంగా ఉంటుంది. ఆ విష్ణువుచరిత అలా ఉండగా; ఆయన దాసులైన భాగవతోత్తముల కథలు విష్ణుపదధ్యాన ప్రధానాలుగా, శోభతో ఐశ్వర్యప్రదాలై మోక్షప్రదాలై మునీశ్వరుల మాటలతో ప్రకాశించేవిగా ఉంటాయి.
శ్రీవిష్ణుదేవుని చరిత్రలు మూడులోకాలలోనూ పవిత్రమైనవి. మానవుల సంసారమనే తీగలను కోసి పారవేయగలిగే కొడవళ్ళవంటివి. మంచి స్నేహితులవలె మేలు కల్గించేవి. మునిజనులనే వనాలకు ఆనందం కలిగించే చైత్రమాసం వంటివి.
(చైత్రం వసంతఋతువులో వచ్చేది కనుక తోటలన్నీ చిగిర్చి సంతోషంగా ఉంటాయి. అట్లే విష్ణుదేవుని చరిత్రలు మునీశ్వరులకు సంతోషాన్ని కలిగిస్తాయని భావం.)
ఓ పరీక్షన్మహారాజా! వ్యాసమహర్షికి నమస్కరించి హరికి సంబంధించిన కథలు చెపుతాను విను. బయటకు వ్యక్తం కాకుండా, గుణరహితుడై, ప్రకృతితో కలవక, జన్మాది సంసారబంధాలలో చిక్కక, ఉండే పరమేశ్వరుడు తన మాయవల్ల పుట్టె సత్త్వరజస్తమోగుణాలను ఆశ్రయించి బాధింపబడేవాడు, బాధించేవాడుగా మారతాడు.
పరమాత్మ త్రిగుణాలు అంటనివాడు. సత్త్వరజస్తమోగుణాలు అనే ఈ త్రిగుణాలు ప్రకృతి గుణాలు. ఆ గుణాలకు ఒక్కొక్కకాలంలో హానీ వృద్ధీ కలుగుతూ ఉంటాయి. ఆ పరమాత్మ వృద్ధి క్షయాలు పొందే ఈ త్రిగుణాలలోని సత్త్వగుణంతో దేవ ఋషులను, రజోగుణంతో అసురులను, తమోగుణంతో రాక్షసులను యక్షులను సృష్టించి విభాగించాడు. ఒకే సూర్యుడు పెక్కుచోట్ల వేరు వేరు సూర్యులుగా కనబడికూడా ఒక్కడే అయినట్లు, పరమాత్మ ప్రపంచగతుడై విభిన్నంగా కన్పడినా భిన్నుడు కాదు. తత్త్వం తెలిసిన జ్ఞానులు తమలో ఆత్మస్వరూపంగా ఉన్న ఈశ్వరుణ్ణి ఆ విధంగా తెలిసికొంటారు. జీవాత్మకంటె ఇతరుడై సర్వమయుడైన పరమాత్మ తన మాయతో విశ్వాన్ని సృష్టించాలని రజోగుణాన్ని క్రీడించడం కోసం సత్త్వగుణాన్ని, నిద్రించడంకోసం తమోగుణాన్ని కల్పించి నిత్యగమనశీలమైన కాలాన్ని సృష్టించాడు. ఆ కాలంలో సర్వదర్శనుడైన పరమాత్మ కాలం అనే పేరుతో సత్త్వగుణంతో దేవతలకు వృద్ధిని, రజస్తమోగుణాలతో రాక్షసులకు హాని కలిగిస్తూ ఉంటాడు.
ఓ పరీక్షిన్మహారాజా! ఈ విషయం అంతా యశస్సు(ఖ్యాతి)గల ధర్మరాజునకు రాజసూయ యాగసమయంలో నారదుడు వివరించి చెప్పాడు. నేను చెప్పే ఆ విషయాలను శ్రద్ధగా నీ చెవులు పవిత్రమయ్యేలా విను.
పూర్వం ధర్మరాజు చేసిన రాజసూయయాగంలో మూర్ఖుడైన శిశుపాలుడు శ్రీకృష్ణుని నిందించాడు. అప్పుడు శ్రీకృష్ణుడు పదునైన ఎదురులేని చక్రంతో శిశుపాలుని శిరస్సు ఖండించగా, ఆ శిశుపాలుని శరీరంనుండి ఒక కాంతిరూపం వచ్చి శ్రీకృష్ణునిలో లీనం అవడంచూచి, ఆశ్చర్యపడుతూ ధర్మరాజు సభలోనున్న నారదునితో ఇలా అన్నాడు.
ఎటువంటి పండితులకైనా ఏకాంత భక్తిపరులకైనా చేరడానికి వీలులేని శ్రీకృష్ణతత్త్వంలో శత్రువై ఉండికూడా శిశుపాలుడు, నేడు ఎలా లీనమయ్యాడు? ఓ మునివరా! నారదా! తెలియజెప్పు.
(ఏకాంతులు : దశవిధ వైష్ణవులలో ఏకాంతులు మొట్టమొదటివారు. రామాయణంలో రామునిపట్ల సీత, హనుమ, భరత, లక్ష్మణ, శత్రుఘ్నులు, విభీషణ, సుగ్రీవులు, మహాభారతంలో విదుర, భీష్మ, కుంతి, ధర్మరాజాదులు, భాగవతంలో ప్రహ్లాదనారదాది పరమభాగవతులు; వీరిది అనన్య భక్తి. ఆత్యంతిక భక్తి. అహేతుక భక్తి. కైవల్యంకంటే కైంకర్యమే చేయాలనే భక్తి. ప్రతి ఫలాపేక్షలేని కేవలభక్తి కైంకర్యపరులు. ప్రహ్లాదుడు మొట్టమొదటి ఏకాంత భక్తుడు. మోక్షానికంటే కైంకర్యానికే ప్రాధాన్యమిచ్చేవారు - ఏకాంతులు.)
పూర్వం వేనుడనే రాజు విష్ణుమూర్తిని దూషించి, బ్రాహ్మణుల ఆగ్రహానికి గురై చీకటిలో కలిసి చరిత్ర హీనుడయ్యాడు కదా!. కాని మదం నిండిన ఈ శిశుపాలుడు చిన్ననాటినుండి శ్రీకృష్ణుని చరిత్రలు వినసహించనివాడు, కృష్ణభక్తి భావన పూననివాడుగా ఉండికూడా ఏ పుణ్య విశేషంచేత శ్రీకృష్ణపరమాత్మలో లీనమయ్యాడో కదా!
శిశుపాలుడు ఎల్లప్పుడూ హరిని సాధిస్తాను. హరిని మింగుతాను; హరి ప్రాణం తీస్తాను. నేను శ్రీకృష్ణుని శత్రువును అంటూ ఎంతో కోపంతో సంచరించేవాడు. అటువంటి శిశుపాలుని నోట పురుగులు పడలేదు. నోరు పడిపోలేదు. అతని మరణానంతరం శరీరం కాలిపోయి నరకాన్నీ పొందలేదు. అతడు ఏ విధంగా జగదీశ్వరుడైన శ్రీకృష్ణునిలో ప్రవేశించాడో
(ఎప్పుడూ వైరభావంతో హరిని స్మరించడంవల్ల శిశుపాలుడు మరణానంతరం శ్రీకృష్ణునిలో ప్రవేశించాడు. ఇదే వైరభక్తి అంటారు.)
అంతేకాకుండా, దంతవక్త్రుడు, శిశుపాలుడు ఎల్లపుడు శ్రీకృష్ణుని నిందిస్తూ ఉంటారు. సమస్తజనులు చూస్తూ ఉండగా ఈ రోజు ఈ శిశుపాలునకు విష్ణుసాయుజ్యం కలగడానికి కారణం ఏమిటి? నాకు వివరించు. గాలికి కదలాడే దీపం మాదిరిగా నా హృదయం చలిస్తోంది, అని పలికిన ధర్మరాజుతో నారదుడు ఇలా అన్నాడు.
దూషణం, భూషణం, తిరస్కరణం అనేవి శరీరానికి గాని పరమాత్మకు లేవు. శరీరంపై ఉండే అభిమానంవల్ల దండించడం, కఠినంగా మాట్లాడటం హింసగా తోస్తుంది. ఆ రీతిగా నేను నాది అనే భేదభావం, జీవులకు శరీరంవల్ల కలుగుతుంది. ఆ అభిమానం లేకుండా మమకార భావాన్ని విడిచి వధించినా కూడా అది వధకాదు ఈపని నా వల్లనే జరిగింది; ఈ పని జరగడానికి నేనే కారణం; నేను లేకుంటే ఈ పని జరిగి ఉండేది కాదు అనే కర్తృత్వ లక్షణం లేనివానికి హింస కూడా అంటదు. అన్ని జీవులలో ఉండే పరమాత్మకు ఎవరిపై ద్వేషం కాని ప్రేమ కాని ఉండవు. కాబట్టి
అఖిలాత్ముడైనవానిని శ్రీహరిని కోపంతో, స్నేహంతో, కామంతో, బంధుత్వంతో, భయంతో ఏ విధంగా తలచినా చేరవచ్చు. ఏ విధంగా శ్రీహరిని స్మరించినా అతడు స్మరించినవాడిని పరునిగా చూడడు.
శ్రీ విష్ణుమూర్తిని వైరభావంతో చేరినట్లుగా నిరంతరం భక్తిభావంతో సేవించినా చేరలేమేమో అని నా మనస్సు కనిపిస్తుంది.
కీటకాన్ని తీసికొనివచ్చిన తుమ్మెద దానిచుట్టూ తిరుగుతుండగా, దాని ధ్వనిని విని విని భ్రాంతితో భయంతో ఆ పురుగు భ్రమరరూపాన్ని పొందుతూ ఉన్నట్లే భయభ్రాంతులు పొందినవారు వైరం గలవారు స్వామిని వేగంగా పొందుతారు.
(తుమ్మెద కారణంగా కీటకం కూడా తుమ్మెద గుణాన్ని పొందుతుందని భావించాలి.)
పురుగు, భ్రమరంగా మారిన విధంగా
ఓ మహారాజా! విష్ణుమూర్తిని (శ్రీకృష్ణుని) అధికమైన కామభావనతో గోపికలు, భయంతో కంసుడు, ద్వేషభావంతో శిశుపాలుడు మొదలైన రాజులు, బంధుత్వంతో యాదవులు, ప్రేమతో మీరు (ధర్మరాజాదులు), భక్తితో మేము (నారదాది మహర్షులము) కనులారా చూడగలిగాము. కాబట్టి, ఏ విధంగానైనా నిరంతర స్మరణవల్ల విష్ణువును చేరవచ్చునని తెలుసోంది.
No comments:
Post a Comment