Monday, March 16, 2026

Brahma and other gods (demigods/devas) praying to Narasimha Swamy - బ్రహ్మాది దేవతలు శ్రీనృసింహదేవుని స్తుతించుట

బ్రహ్మాది దేవతలు శ్రీనృసింహదేవుని స్తుతించుట

దేవతాగణాలందరూ, చేతులు తలలపై ఉంచి నమస్కరిస్తూ, భయభక్తులతో సమీపించడానికి వెరుస్తూ, సంసారసాగరాన్ని తరింపజేసే నావయైనవానికి, గోళ్ళుగలవానికి(అవే సంహారకాలు) రాక్షసుడనే ఏనుగు పాలిటి సింహమైన నరసింహునకు తమ భక్తిప్రపత్తులను ప్రదర్శించారు.

అప్పుడు దేవతలందరూ వెర్వేరుగా స్తుతించారు, అందులో బ్రహ్మదేవుడు ఇలా ప్రార్ధించాడు.

అవలీలగా లోకాలు సృష్టించి, పోషించి, నశింపజేసే వానికి, మహాశక్తిమంతునికి, అనంతంగా వెలుగొందేవానికి, ఆశ్చర్యకర పరాక్రమశాలికి, నిత్య నిర్మలకర్మునికి, నేను(బ్రహ్మను) అనుగ్రహార్థినై నమస్కరిస్తున్నాను.

శంకరుడు ఇలా స్తుతించాడు.

దేవశ్రేష్ఠా! మున్ముందు, వేలయుగాల అనంతరం, వాటిని నాశమొందించే సమయాన తప్ప, ఇపుడు కోపానికి అవసరంలేదు, దేవతలను హింసించే ఈ రాక్షసుని సంహరించావు, చాలు, భక్తవత్సలా! వీడు ఆ రాక్షసరాజు తనయుడు ప్రహ్లాదుడు. నిర్మలుడు, పవిత్రుడు, మీదు మిక్కిలి నీకు భక్తుడు, వీనిని రక్షించు.

దేవేంద్రుడు నృసింహదేవుణ్ణి ఇలా కీర్తించాడు.

భయంకర రాక్షససేనలకు భయంకరుడా! శ్రీనృసింహుడా! జీవుల హృదయపద్మాలమధ్య వసించే నీవు ఎరుగనిది గాదు. ఇంతకాలము రాక్షసరాజు పెట్టిన హింసలు సహించి, చిక్కి శల్యమైఉన్న మమ్మందరిని కాపాడితివి. ఆ రాక్షసేశ్వరుణ్ణి సంహరించావు, ఇపుడు యజ్ఞాలలో అర్పించే హవ్యభాగాలు తిరిగి మాకు చేరుతున్నాయి. మేము మనగలుగుతున్నాము. నీ సేవల భాగ్యం మరగిన వారికి మోక్ష సుఖమూ అక్కరకు రాదు, ఇతర సుఖాలు అశాశ్వతాలు, వాటిని కోరి ఫలమేమిటి? కాబట్టి మమ్మల్ని నిరంతరం నీ సేవ చేసికోనియ్యి.

ఋషులు శ్రీనృసింహుణ్ణి ఇలా స్తుతించారు.

స్వామీ! నీ పొట్టలో లీనమైపోయిన లోకాలను మరల పుట్టించి నీవు కాపాడుతుండగా, అవి ఈ రాక్షసుని చేష్టలతో భేదింపబడి కృశించి పోయినవి. ఈ నీతిమాలిన రక్కసుని నృసింహ రూపంతో నేడు సంహరించి, తిరిగి వేదమార్గాన్ని ఉద్ధరించి, ప్రపంచంలో ధర్మసంస్థాపనం చేశావు గదా! మమ్మల్ని ధన్యులను చేశావు.

పితృదేవతలు శ్రీనృసింహస్వామిని ఇలా కీర్తించారు.

నృసింహా! ఈ రాక్షసుడు, మా పిల్లలు తిలోదక సహితంగా మాకు పిండప్రదానం చేస్తే పిండాలు మాకు అందకుండా మహారోషంతో తానే కాజేసేవాడు. వీడు మహాభయంకరుడు, దుర్మార్గుడు. ఇప్పుడు ఇక్కడ వీడు నీ గోళ్ళచే ఖండితుడై పడి ఉన్నాడు. నీకు ప్రశంసలు.

సిద్దులు అనే దేవజాతివారు శ్రీనృసింహుణ్ణి ఇలా కీర్తించారు.

నరసింహా! ఈ రాక్షసుడు, క్రోధంతో మా అణిమాదిసిద్దులు కాజేశాడు. మహాయోద్ధవైన నీవు వాడిని చీల్చావు. నీ దయతో మా సిద్ధులు మళ్ళీ మాకు చేరాయి.

దేవతలైన విద్యాధరులు కూడ నృసింహస్వామివారిని ఇలా స్తుతించారు.

నృసింహా! రాక్షసుని చంపి, అంతర్థానం మొదలయిన మా విద్యలన్నిటిని, (వాడు, అపహరించిన వాటిని,) తిరిగి మాకు సమర్పించావు. నీ మహిమ ఆశ్చర్యకరం. అది సాటిలేనిది. నిజంకూడ.

నాగులందరూ నృసింహస్వామివారిని కీర్తించారు.

శ్రీ నృసింహా! ఈ రాక్షసుడు, మా రత్నరాసులతోపాటు, మా స్త్రీ రత్నాలను అపహరించాడు. వాని హృదయాన్ని నీవు చీల్చావు! మా రత్నాలూ, మా భార్యలు తిరిగి మమ్ముల్ని చేరగా మేము తిరిగి జీవించగలిగాము.

మనువులు నరసింహస్వామివారిని ఇలా స్తుతించారు.

నీతిమాలిన రాక్షసుని సంహరించి, వాడు భ్రష్టపరచిన వర్ణాశ్రమ ధర్మాల వంతెనలను తిరిగి పునర్నిర్మించావు! దేవా! నీ మహిమ నేమని వర్ణించగలం? కేవలం సేవించి జీవించే నీ భృత్యులం.

(వర్ణములు: బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర భేదంతో ఈ దేశాన నరులు నాల్గువిధాలు. దాదాపు ఇప్పటికీ ఇవి కొనసాగుతున్నాయి.

ఆశ్రమములు : బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాసములు ఆశ్రమాలు. జీవన మార్గంలో అవస్థలు నాల్గు. మొదటిది చదువుకోసం, రెండవది సంసారంకోసం, మూడవది సంసారానంతర విశ్రాంతికోసం, నాల్గవది అంతిమజీవనం కోసం.

ప్రజాపతులు నరసింహుణ్ణి ఇలా స్తుతించారు.

జగత్‌క్షేమానికై అవతరించిన నృసింహా! నీవు మమ్మల్ని, ప్రజాసృష్టికోసం సృష్టించావు. అయితే మేము ఇంతకాలం ఈ రాక్షసుని ఆజ్ఞాబద్ధులమై మాపని నిర్వహించక నిలిచి ఉన్నాము. ఇకపై మేము మా కార్యం నిస్సంకోచంగా నిర్వహిస్తాము. ఎందుకంటే నీవు ఈ దుర్జనుని వక్షస్థలాన్ని చీల్చి చంపావుగదా!

గంధర్వులు నృసింహుణ్ణి ఈ విధంగా స్తుతించారు.

రాక్షసుని కొలువులో, మేము రేయుంబగళ్ళు విశ్రాంతి లేక నాట్యం చేశాం. సంగీతం వినిపించాం. అయితే ఆ దుష్టుడు మమ్మెపుడూ దయ దలచలేదు. పైగా హింసించాడు. నీ వల్లనే ఆ దుర్మార్గుడు యముణ్ణి చేరాడు. అలాంటి దురాత్ములకు క్షేమమెక్కడిది?

శ్రీనృసింహుణ్ణి చారణులు ఇలా కీర్తించారు.

ఈశ్వరా! ఈ రాక్షసుడు ప్రజా హృదయాలకు బల్లెం వంటివాడు. దేవేంద్ర శత్రువు. నేడు నీచేత తెగిపడ్డాడు. పుట్టుక అనే రోగానికి మందైన నీ పాదాల జంటను ఆశ్రయించి, జీవిస్తాం.

యక్షులు నరసింహస్వామిని ఈ విధంగా కీర్తించారు.

లోకనాయకా! స్వర్గలోక ప్రధానుడా! ఇరవైనాలుగు తత్త్వాలను శాసించేవాడా! మేము నీ భటులం. మాకు ఎక్కడా భంగమూ భ్రంశమూ లేవు. ఇట్టి మాపై అధిరోహించి ఈ రాక్షసుడు ఏ సంకోచమూ లేక నాల్గుదిక్కుల సంచారం చేసేవాడు. మమ్ముల్ని తన వాహనాలుగా వాడుకొన్నాడు. అటువంటి దుష్టుని నీవు కడతేర్చి మాకు ముక్తి గలిగించావు. మాకు ఆపద ముగిసింది.

దేవతాజాతికి చెందిన కింపురుషులు నరసింహస్వామిని ఇలా కీర్తించారు.

పురుషోత్తమ! అధీశా! మేము కింపురుషులం, అల్పులం, నిన్ను స్తుతించే శక్తి మాకు చాలదు. శిష్టజనుల హృదయాలు గాయపరచే దుష్టుడైన రక్కసుని తెగటార్చితివి. లోకం జీవించింది.

వైతాళికులు ఇలా కీర్తించారు.

దుఃఖార్తులను బ్రోచేవాడా! లోకనాయకా! ముల్లోకాలకు శత్రువైన రాక్షసుడు నశించాడు, ఇకపై నిర్భయంగా, సభలలో, యజ్ఞశాలల్లో నీ శుభనామసంకీర్తనం చేస్తూ లోకసంచారం చేయగలం.

కిన్నరులు అనే దేవజాతివారు నరసింహస్వామిని ఇలా ప్రస్తుతించారు.

హరీ! ఈ ధూర్తుడు ధర్మాధర్మ విచారం చేయడు. మాచే అల్పక్రియలు చేయించాడు. దురాత్ముడు, దుష్కర్ముడూ అయిన వీనిని హతమార్చావు. ఎంతో సంతోషంగలవారమై నీ సేవలో తరిస్తాము స్వామీ!

విష్ణుసేవకులు నరసింహస్వామిని ఇలా సన్నుతించారు.

దేవా! బ్రాహ్మణ శాపవచనంవల్ల క్రూర రాక్షసుడైన వీడిని వధించటం, వీడికి కీడు చేసినట్లు గాదు. నీవు వీడిపై దయనే చూపావు, నిన్ను చేరుకోవాలంటే భక్తిమార్గం కంటె, వైరమార్గం వాంఛనీయం. ఎందుకంటె, భక్తితోకంటె, వైరంతో నిన్ను త్వరగా అందుకోవచ్చు. నీ స్వరూపం ఈ అవతారంలో నరుని సింహపు ఆకారాల కలయికతో, ఎంతో ఆశ్చర్యకరంగా ఉంది. అందరూ ఆపదనుండి విముక్తులయ్యారు.

ఈ విధంగా బ్రహ్మమొదలు సాధ్యులవరకు, దేవతలలోని ఎల్లతెగలవారూ వివిధంగా వినుతించినా, ఆ నృసింహదేవుని క్రోధం చల్లార లేదు. వీరందరూ ఆ దేవుని సమీపించడానికీ వెరచి దూరంగా నిలిచారు. అపుడు వారందరు హరి ఇల్లాలైన లక్ష్మిని పిలిచి ఇలా ప్రార్థించారు.

సింహంయొక్క నడుంవంటి నడుం గలదానా! ఓ లక్ష్మీ! నీవు హరికి పట్టపురాణివి, ఆయన సేవలో నేర్పుగలదానవు. ఆయననే అనుసరించేదానివి. ఆయనకు ప్రియమైన ఇల్లాలివి. కావున, నీవు నరసింహుని సమీపించి, క్రోధాన్ని తగ్గించాలి. అమ్మా! అలా చెయ్యడం నీకు మాత్రమే సాధ్యం అవుతుంది.

ఆ మాటలకు అంగీకరించిన లక్ష్మీదేవి ఉత్సాహంతో ఆ దేవుని సమీపించినదై

ఇతని మోము ప్రళయకాలంలోని సూర్యగోళంవలె ఉన్నదిగాని, నిండు చందురుని పోలేది గాదు. ఇతని చూపు అగ్ని జ్వాలల గుంపు వేడిని తలపిస్తుందే గాని, కరుణతో వెలిగిపోవడం లేదు. ఇతనిలో వీరరౌద్రరసతీవ్రత ఉంది గాని కృపారసం కనిపించదు. ఈతని ముఖాన భయంకర దంష్ట్రల వెలుగులున్నాయి గాని, చిరునగవులతో పద్మంవలె ఈ మోము వెలగడం లేదు.

కఠినతరమైన గోళ్ళుగల నృసింహరూపం తప్ప మగువలకు సులభంగా లొంగే ఆకారం గాదు, పూర్వమెపుడూ నేను విష్ణువు విషయంలో విన్నదీ గాదు కన్నదీ కాదు ఈ స్వరూపం, భయంకరమైనది.

లక్ష్మీదేవి మొదట మాట్లాడటానికి ఉత్సహిస్తుంది. ఆపై తాను పలకరిస్తే కోపగిస్తాడు అనుకుంటుంది. బదులు పలకడేమో అని అనుమానిస్తుంది. అతనియెడ ఆమెకు చనువుతో పాటు భయమూ పుష్కలంగా ఉంది. కాగా ఏమీ చేయక నిలిచి ఉన్నది.

(ఎల్లప్పుడూ శ్రీహరిని వీడని లక్ష్మీదేవికూడా ఉగ్రాకారంతో ఉన్న నరహరిని చేరేందుకు జంకింది. అంటే దీనినిబట్టి అప్పటి నృసింహుని ఉగ్రరూపాన్ని ఊహించవచ్చు.)

పద్మజ అయిన లక్ష్మీదేవి నరసింహుని రూపాన్ని చూచి, సందేహించింది. ఆ స్వామి శాంతించిన తర్వాతనే దగ్గరికి వెళ్లాలని అనుకొంటుండగా, బ్రహ్మదేవుడు, నరసింహుని క్రోధాన్ని తగ్గించటానికి ఇతరులకు సాధ్యం కాదు అని తలుస్తూ ప్రహ్లాదుని దగ్గరికి వెళ్లి ఇలా పలికాడు.

నాయనా! హరి, నీ తండ్రి మూలంగానే, తన భీకరాకారంతో తీవ్రతను ఇంకా వదలడంలేదు. నీవు మెల్లగా అతనిని చేరి చల్లబరిచి మాపై దయజూపు.

బ్రహ్మాదేవుని మాటను స్వీకరించిన ప్రహ్లాదుడు చేతులు జోడించి, అలాగే చేస్తాను అంటూ, మెల్లగా, అధిక వినయ విధేయతలతో పాటుగా తెలివితేటలును గలగలిపి నృసింహదేవుని సన్నిధికి వెళ్ళి, సాష్టాంగ నమస్కారం చేయగా, ఆ దేవుడు, ఆ బాలుని జూచి;

నరసింహమూర్తి మనస్సులో కరుణారసం ఉప్పొంగింది. బాలుణ్ణి దగ్గరకు పిలిచాడు. మిక్కిలి వాత్సల్యంతో అతన్ని చూస్తూ కాలసర్పభూతాన్ని తొలగించేది, నిత్యమూ శుభాలు కలిగించేది అయిన తన హస్తంతో ప్రహ్లాదుని శిరస్సును ఆప్యాయంగా నిమిరాడు.

ఈ విధంగా తన తలనంటిన హరి చేయివల్ల భయము తొలగి, పులకించిపోయి, ఉప్పాంగి పొరలే ఆనందబాష్పాలతో, గద్గదస్వరంతో, వినయ వివేక విభూషితుడైన ప్రహ్లాదుడు, ఏకాగ్రచిత్తుడై, భక్తికి లొంగి, చేతులు జోడించి నృసింహ భగవానుణ్ణి ఈ విధంగా స్తుతించాడు.

ప్రహ్లాదుండు నరసింహ మూర్తిని స్తుతించుట

No comments:

Post a Comment

Halahala, Kalakuṭa (most deadly and venomous poison in the universe) Emerged - హాలాహలం జనించుట

హాలాహలం జనించుట ఆ తరువాత అంతలోనే, అల్లకల్లోలమైన ఆ సముద్రంలోనుండి హాలాహలమనే విషం కోలాహలమైన అగ్ని జ్వాలలతో బయటపడింది. దాన్ని చూసి భయపడి సురాస...