Saturday, August 1, 2026

Tripundra Vibhuti Mahima - Durvasudi Katha - The Glory of Tripundra Vibhuti – The Story of Durvasa - త్రిపుండ్ర విభూతి మహిమ - దూర్వాసుడి కథ

త్రిపుండ్ర విభూతి మహిమ - దూర్వాసుడి కథ

నారదా! ఇక్కడొక ఇతిహాసం నీకు చెప్పాలి. ఒకప్పుడు దూర్వాసుడు శరీరంనిండా విభూతి ఆలంకరించుకుని రుద్రాక్షమాలికలు ధరించి పితృలోకానికి వెళ్ళాడు. శివా! శంకరా! సర్వాత్మకా!
జగన్మాతా! జగదంబికా! ఆంటూ పార్వతీపరమేశ్వరుల నామధేయాలను బిగ్గరగా జపిస్తూ వెళ్ళాడు. కవ్యవాలాదులైన పితృదేవతలు గౌరవపురస్పరంగా ఎదురువచ్చి నమస్కరించి తీసుకువెళ్ళి అతిథిమర్యాదలు జరిపి సముచితాసనంమీద కూర్చోబెట్టారు. కుశలప్రశ్నలతో కథలూ కబుర్లతో చాలాసేపు గడిపారు. అంతలోకీ - సమీపంలో ఉన్న కుంభీపాక నరకకూపంనుంచి ఆర్తనాదాలూ హాహాకారాలూ హృదయవిదారకంగా వినిపించాయి. దూర్వాసుడికి మనస్సు కలతపడింది. ఎవరివి ఈ అరుపులు? ఎక్కడినుంచి? ఆని ఆత్రంగా ప్రశ్నించాడు.

మునీశ్వరా! ఇక్కడికి చేరువలోనే సంయమినీపురం(యమలోకం) ఉంది. అక్కడ పాపాత్ములను శిక్షించడానికి యముడున్నాడు. అతని అధీనంలో వేలమంది యమదూతలున్నారు. నల్లగా బలిష్ఠంగా భయంకరంగా ఉంటారు. ఆ యమలోకంలో ఎనభయ్యారు నరకకూపాలు ఉన్నాయి. వాటిలోకెల్లా కుంభీపాకమనే కూపం అత్యంత భయంకరం. మహాపాపుల్ని తెచ్చి అందులో పడద్రోసి యమదూతలు ఘోరంగా శిక్షిస్తారు. ఆ యాతన వర్ణనాతీతం. నూరేళ్ళు వర్ణించినా తరగదు. శివుద్రోహులూ దేవీనిందకులూ విష్ణుద్రోహులూ వేదనిందకులూ సూర్యగణేశాదిదేవ నిందకులూ కామాచారులూ మాతృ పితృ గురు జ్యేష్ఠ భ్రాతృ - పురాణ స్మృతి నిందకులూ ఇంకా ఇలాంటి పాపాలు చేసినవారూ ధర్మం తప్పినవారూ కుంభీపాక కుండంలో పడి యమదూతలు పెట్టే బాధలు భరించలేక కుయ్యో మొర్రోమని దిక్కులు పగిలేలాగా అరిచి రోదిస్తుంటారు. శ్రవణ దారుణమైన ఈ హాహాకారాలు మేము రోజూ వినేవే. వీటిని ఒక్కసారి వింటేచాలు ఎవరికైనా వైరాగ్యం పుడుతుంది - ఆని పితృదేవతలు వివరించారు.

వింటూనే దూర్వాసుడు చటుక్కున లేచాడు. గబగబా నడుచుకుంటూ-అదేమిటో చూద్దామనిపించి ఆ నరకకూపం దగ్గరికి వెళ్ళాడు. గట్టున నిలిచి తలవంచి కూపంలోకి చూశాడు. ఆంతే, హహాకారాలు మాయమయ్యాయి. వహ్వాకారాలు మిన్నుముట్టాయి. ఆ కూపంలో ఉన్నవారు కేరింతలు కొడుతున్నారు. ఆడుతున్నారు. పాడుతున్నారు. పట్టరాని సుఖమేదో అనుభవిస్తున్నట్టు పరస్పరం ఆనందపరచుకుంటున్నారు. మృదంగ వీణా మురజ ఢక్కా దుందుభులు మోగిస్తూ చిందులు తొక్కుతున్నారు. స్వర్గాధికనుఖమంటే ఇదే కాబోలు అనిపించింది. వసంతవల్లీ పుష్పగంధాలూ శుకశారికాపికాలాపాలూ విజృంభించాయి. మునీశ్వరుడు విన్నది వేరు, ఇప్పుడిక్కడ కన్నది వేరు. ఆశ్చర్యంలో మునిగిపోయాడు.

యమదూతలకు ఇందంతా చాలా వింతగా విడ్డూరంగా కనిపించింది. జరగరానిదేదో జరిగిపోయిందని కలవరపడ్డారు. పరుగు పరుగున వెళ్ళి అధినాయకుడు యమధర్మరాజుకి విన్నవించారు. మహారాజా! ఇదేదో విడ్డూరంగా ఉంది. కుంభీపాకంలో మహాపాపులు స్వర్గసౌఖ్యాలు అనుభవిస్తున్నారు. కారణం ఏమిటో అంతుపట్టడంలేదు. ఆశ్చర్యం పట్టలేక నీకు విన్నవించుకుంటున్నాం - అన్నారు.

యమధర్మరాజు ఉలిక్కిపడి లేచాడు. మహిషం అధిరోహించి చకచకా వచ్చాడు. బయలుదేరబోతూ ఈ వార్తను దేవేంద్రుడికి దూతద్వారా పంపించాడు. ఇంద్రుడు దిక్పాలకులకూ బ్రహ్మదేవుడికీ, బ్రహ్మదేవుడు విష్ణుమూర్తికీ తెలియపరిచారు. అందరూ వెంటవెంటనే బయలుదేరి తమ తమ దివ్య వాహనాలమీద క్షణాలలో అక్కడికి చేరుకున్నారు. కుంభీపాకం చుట్టూ చేరారు. అందులో జీవులు ఆనందపరవశులై కేరింతలు కొట్టడం కళ్ళారా చూశారు. అహో! ఇది నరకకూవం కానేకాదు. పాపాత్ములకోసం నిర్మించిన భోగకూపంలా ఉందని విస్తుపోయారు. కారణం ఏమిటో ఎవరికీ స్ఫురించలేదు. ఇక సృష్టిలో పాపానికి భయపడేదెవడు? అందరూ పాపాలే చేసి ఇక్కడికి వచ్చిపడతారు. అక్కడా సుఖపడతారు. ఇక్కడా సుఖపడతారు. వేదమర్యాదలూ ధర్మమార్గాలూ ధ్వంసమైపోతాయి. ఎమిటి ఈ విపరీతం? తన సంకల్పాన్ని తానే వృధాపరచుకుంటున్నాడా ఆ భగవంతుడు! చాలా ఆశ్చర్యంగా ఉందే! - ఇలా తర్కించుకుంటున్నారు. కొందరు కారణమేమిటో తెలియక ఏమి మాట్లాడటానికీ తోచక తటస్థులై మౌనంగా నిలుచుండిపోయారు.

విష్ణుమూర్తి చతుర్ముఖ దేవేంద్ర యమధర్మరాజులతో చర్చించాడు. కారణం అంతుబట్టలేదు. క్షణంలో ఇంత మార్పు ఎలా జరిగిందో తెలియలేదు. సరే శివుణ్ణి అడుగుదామని మరికొందరు దిక్పాలకులనూ దేవముఖ్యులనూ వెంటబెట్టుకుని కైలాసానికి వెళ్ళాడు.

కోటిమన్మథసుందరాకారుడు. సదా షోడశవర్షీయసుడు. లావణ్య నిధి. నానాలంకారభూషితుడు. పార్వతీదేవిని లాలిస్తూ చంద్రమౌళి దర్శనమిచ్చాడు. హరి విరించి ప్రముఖులు నమస్కరించారు. కాలయాపన చెయ్యకుండా యమలోకపు వింత విన్నవించారు. కారణం తెలియక కొట్టుకుంటున్నాం. నువ్వు సర్వజ్ఞుడివి. కనక హేతువేమిటో చెప్పు - అని విష్ణుమూర్తి అభ్యర్థించాడు.

శివుడి ముఖపద్మం వికసించింది. చతుర్భుజా! ఇందులో వింత ఏముంది? విడ్డూరం ఏముంది? అంతా విభూతి మహిమ. దానికి సాధ్యం కానిదేదీ లేదు. దూర్వాసుడు వచ్చాడుగదా! ఆతడు పరమమాహేశ్వరుడు. కుంభీపాకం గట్టున నిలబడి కిందికి తలవంచి చూశాడుగదా! మరింకేమి! అతడి నుదుటనున్న విభూతి రేణువులు దైవికంగా ఆ కుండంలో పడ్డాయి. అంతే, విభూతి మహిమ నరకకూపం స్వర్గలోకంగా మారిపోయింది. ఇప్పటినుంచీ అది పితృలోకవాసులకు తీర్థమవుతుంది. అందులో స్నానం చేసి పితృదేవతలు సుఖపడతారు. పితృతీర్థంగా విఖ్యాతి వహిస్తుంది. అక్కడ ఆలయం కట్టి మా దంపతుల్ని ప్రతిష్టించండి. పిత్రీశ్వరీ పిత్రీశ్వరులుగా విడిది చేస్తాం. పితృలోకనివాసుల పూజలు అందుకుంటాం. ముల్లోకాలలోనూ ఉన్న తీర్థాలన్నింటిలోకీ ఇది ఉత్తమోత్తమమవుతుంది - అని శంకరుడు స్వయంగా ప్రకటించాడు.

విష్ణుమూర్తీ ఆతడి అనుచరులూ సంతోషించి శివుడికి నమస్కరించి యమలోకానికి తిరిగివచ్చి అక్కడున్న మిగతా దేవతలకందరికీ ఈ విషయం చెప్పారు. అందరూ శిరసులూపి బాగుబాగని కొనియాడారు. విభూతి మహిమ ఇంతటిదా అని ఎంతగానో ప్రశంసించారు. తీర్థం లభించిందని పితృదేవతలు మరింతగా సంబరపడ్డారు. దాని చెంత శివపార్వతుల మూర్తులను ప్రతిష్టించారు. నిత్యమూ పూజలు చేయనారంభించారు. అప్పటిదాకా ఆ కుంభీపాక కూపంలో పడి ఉన్న ప్రాణికోటి అంతా దివ్యవిమానాలు అధిరోహించి కైలాసం చేరుకున్నారు. భద్రగణాలు అనే పేరుతో ఇప్పటికీ అక్కడే హాయిగా నివసిస్తున్నారు.

యముడూయమదూతలూ ఇక చేసేదిలేక ఆ తీర్థానికి సుదూరంగా మరొక కుంభిపాక కుండం కొత్తగా నిర్మించుకున్నారు. ఇక నేటినుంచీ శైవులెవ్వరూ దీని దరిదాపులకు రాకూడదని గట్టి నిషేధం విధించారు.

ఊర్ధ్వపుండ్ర ధారణ




Bhasma Snanam (Ritual bath with sacred ash) - భస్మస్నానం

శ్రీ దేవీ భాగవతం ఏకాదశ స్కంధము - భస్మస్నానం

ర్ధ్రస్నానం కన్నా భస్మస్నానమే ఉత్తమోత్తమం. ఎందుకంటే ఆర్ధ్రత ఆరిపోతుంది. అదీగాక ఆర్ధ్రస్నానం ప్రకృతిసిద్ధం. ప్రకృతి అంటే బంధనమేనని పెద్దలంటారు. కనక ప్రకృతిబంధ విమోచనంకోసం భస్మస్నానం చెయ్యాలి. సారాంశమేమంటే - ఆగ్నేయస్నానానికి సాటివచ్చేది ఈ ముల్లోకాలలోనూ మరొకటి లేదు. అందుచేతనే సకలదేవతలూ రక్షణకోరి పవిత్రతకోరి మంగళంకోరి ఈ విభూతిని ఆదిపరాశక్తికి ప్రేమతో కానుకగా అందించారు. అంతటి పవిత్రమైన ఈ ఆగ్నేయస్నానం అశీతివాత రోగాలనూ చతుష్టష్టిపిత్తరోగాలనూ సప్తత్రిపంచక శ్లేష్మరోగాలనూ వ్యాఘ్ర చోర దుష్టగ్రహ భయాలనూ తక్షణం తొలగిస్తుంది. సందేహం లేదు. సింహం చేతిలో ఏనుగుల్లాగా ఇవి మడిసిపోతాయి.

శీతలోదకాలతో స్నానంచేసి విభూతిని నెన్నొసట త్రిరేఖలుగా ధరించినవాడు పరబ్రహ్మను చేరుకుంటాడనడంలో సందేహం లేదు. భస్మస్నానంకూడా చేస్తే బ్రహ్మలోకంలో శాశ్వతంగా ఉండిపోతాడు అనడంలో అంతకన్నా సందేహం లేదు. లలాటలిఖితమైన బ్రహ్మరాతలలో పనికి రానివాటినీ హానికరమైనవాటినీ తుడిచివేసే శక్తి త్రిపుండ్రాలకుమాత్రమే ఉంది. ఆ బ్రహ్మకు కూడా లేని శక్తి ఇది. ఏ ఆవయవాన విభూతి పెట్టుకుంటే ఆ అవయవం చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి. గుండెలపై దాలిస్తే మనస్సు చేసే పాపాలు బొడ్డున ధరిస్తే మర్మాంగం చేసిన పాపాలూ అంతరిస్తాయి. కుడియెడమ పార్శ్వభాగాలలో ధరిస్తే పరకాంతాలింగనాది దోషాలు నశిస్తాయి. అందుచేత శరీరంలో ఎక్కడ దాల్చినా శ్రేయస్కరమే. మూడురేఖలుగా ధరిస్తే త్రిమూర్తులనూ ధరించినట్టే. త్రిగుణాలనూ ధరించినట్టే, త్రిలోకాలనూ ధరించినట్టే. ఒళ్ళంతా బూడిద పులుము కున్నవాడు సర్వపాపవిముక్తుడై సరాసరి మోక్షం పొందుతాడు. ఇతడినే ఆత్మనిష్ఠుడంటారు. భస్మదిగ్ధసర్వాంగుడూ భస్మదీప్త త్రిపుండ్రకుడూ భస్మశాయి అయిన పురుషుణ్ణి భస్మనిష్ఠుడు అంటారు. భూత ప్రేత పిశాచోరగాదులూ దుస్సహరోగాలూ భస్మనిష్ఠుణ్ణి చూస్తే పదిఆమడల దూరం పారిపోతాయి.

భాసిస్తుందికనక భసితమనీ, కల్మషాలను భక్షిస్తుంది కనక భస్మమనీ, విభూతిని(ఐశ్వర్యం) కలిగిస్తుంది కనక భూతి అనీ, రక్షిస్తుంది కనక రక్ష అనీ దీనికి పేర్లు ఏర్పడ్డాయి.

రుద్రుణ్ణి స్మరిస్తే పాపాలు నశించినట్టే త్రిపుండ్రాలను చూస్తే చాలు భూత ప్రేత పిశాచాలు పలాయనం చిత్తగిస్తాయి. ఆంతరిస్తాయి. అకృత్యాలు వెయ్యి చేసినా భస్మస్నానం చేస్తే అవన్నీ అగ్నిలో అడవిలా మాడిపోతాయి. కనీసం ప్రాణావసానదశలో అగ్నిస్నానం చేసినా పాపాలు తొలగి పుణ్యలోకాలు చేరుకుంటాడు. నిత్యమూ చేసేవాడు జితక్రోధుడై జితేంద్రియుడై శివసన్నిధికి వెడతాడు. అతడికింక పునర్జన్మ ఉండదు. పున్నమినాడు భస్మోద్దూళితశరీరుడై శంకరార్చన చేసినా చూసినా ముక్తీ పాపవిముక్తీ తప్పవు. ఆయుర్దాయం కావాలన్నా విద్య కావలన్నా కడకు మోక్షమే కావాలన్నా భస్మధారణమొక్కటే శరణ్యం.

కేవలజలస్నానం శరీరం పైని ఉండే మలినాన్ని ప్రక్షాళన చేస్తుంది. విభూతిస్నానమో బాహ్యాభ్య న్తరమలినాలను తొలగిస్తుంది. అంతశ్శుద్ధీ బహిశ్శు
ద్ధీ రెండూ సిద్ధిస్తాయి. కనక జలస్నానం చెయ్యకపోయినా ఫరవాలేదుగానీ భస్మస్నానం చేసితీరాలి. ఇది లేనిదే పవిత్రత లేదు. కాబట్టి వైదికకర్మలకన్నింటికీ ముందు విధిగా ఇది చేసితీరాలి. మలమూత్ర విసర్జనలు చేసినప్పుడు శౌచవిధులన్నీ నిర్వర్తించాక భస్మస్నానం చేస్తేనే పరిపూర్ణశౌచం లభిస్తుంది. అపానవాయువు విడిచినప్పుడూ ఆవులించినప్పుడూ దగ్గినప్పుడూ తుమ్మినప్పుడూ శ్లేష్మాన్ని ఉమ్మినప్పుడు శుద్దికోసం భస్మస్నానం చెయ్యాలి.

నారదా! భస్మస్నానమాహాత్మ్యం గురించి ఇప్పటికి ఒకవంతు మాత్రమే చెప్పాను. ఇంకా చాలా ఉంది. విను. బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులకు ఉపనయనం ఉంది కనక వీరినే ద్విజులు అంటారు.
ద్విజులందరూ తప్పకుండా శ్రౌతపద్దతిలో విభూతి త్రిపుండ్రధారణ చెయ్యాలి. ఇది లేకుండా. గాయత్రీమంత్రాన్ని ఉపదేశించడానికిగానీ స్వీకరించడానికిగానీ వీలులేదు. అధికారం లేదు. కనక మరిచిపోకుండా విభూతిపెట్టుకునే గాయత్రీజపం చెయ్యాలి. విభూతి రేఖలే ద్విజత్వానికి చిహ్నాలు. రత్నాలూ మణులూ అలంకరించుకోవడంమీద ఎంత ప్రీతి సహజంగా ఉంటుందో, విభూతిని పెట్టుకోవడం మీదకూడా అంత ఆదరమూ అంత సహజంగానూ ఉండాలి. నొసట విభూతిలేకుండా ఏది తిన్నానరకానికి పోతారు. ఇక శూన్య లలాటంతో శివపూజ చేసినా వ్యర్థం. అతడు శివద్వేషితో సమానం. నరకానికి పోవడం ఖాయం. విభూతి పెట్టుకోకుండా శివుడికి బంగారు తులాభారం చేసినా నిష్ఫలం. నరకం తప్పదు. విభూతి లేని సంధ్యావందనం యజ్ఞోపవీతమే లేని సంధ్యావందనంతో సమానం. నిరర్ధకం. యజ్ఞోపవీతం పోతే ప్రత్యామ్నాయాలున్నాయి. జపాలూ ఉపవాసాలూ ఏవో ప్రాయశ్సిత్తాలున్నాయి. కానీ విభూతి ధారణను మరిచిపోతే ఏ ప్రత్యామ్నాయమూ లేదు. ఏ ప్రాయశ్చిత్తమూ లేదు. సరాసరి నరకలోకానికి పోవడమే.

అందుచేత ద్విజుడు తప్పనిసరిగా శ్రౌతభస్మను సంపాదించి పెట్టుకోవాలి. అది దొరక్కపోతే స్మార్తమూ అదీ దొరకకపోతే లౌకికమూ - ఏదో ఒక భస్మం ధరించితీరాలి. అది పవిత్ర భస్మమైతే చాలు. కుడిచేతి మధ్యాంగుళిత్రయంతో (బొటనవేలూ చిటికెనవేలూ కాక) నుదుట కనీసం ఆరంగుళాల పొడవు ఉండేట్టు ఈ కంటి కొసనుంచి ఆ కంటి కొసదాకా ఉండేట్టు త్రిరేఖలుగా విభూతి పెట్టుకోవాలి. వీటిలో ఆనామికను(చిటికెనవేలుకి ప్రక్కనున్నది) అకారమనీ, మధ్యమాంగుళిని (నడిమివేలు) ఉకారమనీ, తర్జనిని(చూపుడువేలు) మకారమనీ అంటారు. ఈ మూడింటి సంయోజనతో ఏర్పడిన త్రిపుండ్రం త్రిగుణాత్మకం, ప్రణవాత్మకం, (అ + ఉ + మ్‌ = ఓమ్‌). అట్టడుగు అనామికారేఖ బ్రహ్మతత్త్వం. కనక రజోగుణం. నట్టనడిమి మధ్యమాంగుళీరేఖ విష్ణుతత్వం. కనక సత్వగుణం. తుట్టతుది తర్జనీరేఖ శివతత్త్వం. కనక తమోగుణం. ఇలా త్రిపుండ్రం త్రిగుణాత్మకం, త్రిమూర్తి స్వరూపం.

త్రిపుండ్ర విభూతి మహిమ - దూర్వాసుడి కథ




Bhasmadharana Mahima - The Glory of Wearing Sacred Ash - భస్మధారణ మహిమ

శ్రీ దేవీ భాగవతం ఏకాదశ స్కంధము - భస్మధారణ మహిమ

నారదా! ఈ భస్మధారణ మాహాత్మ్యం ఎంత చెప్పినా తరగదు. ఇంకా ఉంది. విను. ఇప్పటికి జాబితాలోకెక్కిన పాతకాలేకాక ఇంకా మహాపాపాలు ఏమైనా ఉంటే అవ్వికూడా నశిస్తాయి భస్మోద్దూళన భస్మధారణలతో అనడం ముమ్మాటికీ సత్యం. ఇది యతీశ్వరులకు జ్ఞానాన్నీ, వానప్రస్థులకు విరక్తినీ, గృహస్థులకు ధర్మవృద్ధినీ, బ్రహ్మచారులకు స్వాధ్యాయశక్తినీ, శూద్రులకు పుణ్యాన్నీ, ఇతరులకు పాపక్షయాన్నీ అపారంగా కలిగిస్తుంది. సర్వభూతరక్షణకోసం విభూతిని ధరించాలనీ ఉద్దూళన చేసుకోవాలని వేదం చెబుతోంది. ఇది యజ్ఞంతో అన్నివిధాలా సరిసమానమంటోంది. మాహేశ్వరులకు ఇది చిహ్నం, సర్వులకూ విజ్ఞానప్రదం అని పేర్కొంటోంది. బ్రహ్మవిష్ణుమహేశ్వరులూ వారి అంశావతారాలూ ఇంద్రాది దేవతలూ వరుణాది దిక్పాలకులూ సరస్వతీ లక్ష్మీపార్వతులూ వారి అంశదేవీమూర్తులూ శచీప్రముఖ సకలదేవ కాంతలూ యక్ష రాక్షస గంధర్వ సిద్ధ సాధ్య విద్యాధరాది సమస్తజాతులవారూ మునులూ ఋషులూ యోగులూ తపస్వులూ చతుర్వర్ణాలవారూ సంకరజాతులవారూ అపభ్రంశులూ - వారూ వీరూ అని తేడా లేకుండా అందరూ భస్మోద్దూళన భస్మధారణలు చేసినవారే. చేస్తున్నవారే. చెయ్యవలసినవారే. శిష్టులు అంటే వీరే. ఇంకెవరూ కారు. ఒక్కమాటలో దీని మాహాత్మ్యం చెప్పాలంటే శివలింగంలాగా చింతామణిలాగా పంచాక్షరీ మంత్రంలాగా ఈ విభూతి అనేది మోక్షలక్ష్మిని వశీకరించుకునే దివ్యౌషధం.

విభూతిని ధరించివస్తే మూర్ఖుడా పండితుడా అనే ప్రశ్న లేదు. అతడికి భోజనం పెట్టాలి. అతడు భుజిస్తే పార్వతీపరమేశ్వరులు వచ్చి భుజించినట్టే

భస్మధారిని అనుసరించినా స్తుతించినా శ్రద్ధగా సేవించినా పాపాలు తొలగిపోతాయి. పూజనీయుడవుతాడు. త్రిపుండ్రధారికి భిక్షవే స్తే సర్వవేదాలూ చదివినంత, సకలసత్కర్మలూ అనుష్ఠించినంత పుణ్యం వస్తుంది. నిత్యమూ శిరస్సున విభూతిని ధరించేవాడు అడవుల్లో ఉన్నా అరణ్యాల్లో ఉన్నా అది కాశీక్షేత్రమే. భస్మధారిలో మిగతా యోగ్యతలు పరిశీలనీయాలు కానేకాదు. అవగుణాలు ఎన్ని ఉన్నా పరిగణనీయాలు కానేకాదు. శివసంతతితో సమానుడు. పూజనీయుడు. ఒకవేళ దుశ్శీలుడయ్యుండి ఎదుటివారిని మోసగించడంకోసమనే విభూతి పెట్టుకున్నా ఒళ్ళంతా పులుముకున్నా అతడు ధన్యుడే. పావనుడే. నూరు యజ్ఞాలు చేసినవారు వెళ్ళే లోకాలకు తానూ వెడతాడు. అనుకోకుండా విభూతి వొంటికి తగిలినా క్రీడావినోదంగా ధరించినా భయపడి పెట్టుకున్నా అతడు శివుడితో సమానుడే. పూజనీయుడే. విభూతిధారణ ఏ కారణంగా ఎవరు ఎలా చేసినా ముగ్గురమ్మలకూ ముగ్గురయ్యలకూ తృప్తినీ ఆనందాన్నీ కలిగిస్తుంది. దాన యజ్ఞ తప స్తీర్థయాత్రలకు అందని పుణ్యం విభూతిధారణతో వచ్చి వాడిలో పడుతుంది. నిజం. అవి అందించే పుణ్యాలు ఈ పుణ్యంలో పదహారవవంతుకికూడా సాటిరావు. తన చిహ్నాలను ధరించిన ప్రజలను రాజుగారు ఎలా తనవాళ్ళని గుర్తిస్తాడో అలా శివుడు త్రిపుండ్రధారులను తనవాళ్ళుగా భావిస్తాడు. నిర్మలహృదయంతో విభూతిని ధరిస్తే సాక్షాత్తూ రుద్రుణ్ణి వశీకరించుకొన్నట్టే. మిగతా ఆచారాలూ అనుష్ఠానాలూ ఏమీ లేకపోయినా సరే నెన్నొసట విభూతితో అడ్డబొట్టు ఉంటేచాలు అతడు ముక్తిని పొందడం తథ్యం. కులమూ గోత్రమూ వ్రతమూ జ్ఞానమూ ఇత్యాదులతో పనీలేదు, పరీక్షా లేదు. నారదా! శివమంత్రంకన్నా గొప్ప మంత్రం లేదు. శివుడికన్నా గొప్ప దైవం లేడు. శివార్చనకన్నా గొప్ప పుణ్యం లేదు. విభూతి కన్నా గొప్ప తీర్థం లేదు. రుద్రవేత్రాగ్నికన్నా గొప్ప తీర్థం ఈ విభూతి. సర్వదుఃఖవిధ్వంసకం. సర్వపాప విమోచకం. విభూతిధారి - ఎవడైనా ఆగుగాక - ఎక్కడ ఉంటే అక్కడ సర్వభూతగణ - సర్వతీర్థగణ పరివృతులై పార్వతీపరమేశ్వరులుంటారు. పంచాక్షరీ శివమంత్ర పరిపూతమైన ఈ విభూతిని, శివుడుకోరి అలంకరించుకునే ఈ భస్మాన్ని నెన్నుదుట త్రిపుండ్రాలుగా ధరిస్తే చాలు - అక్కడ బ్రహ్మదేవుడు రాసిన చెడురాతలన్నీ చెరిగిపోతాయి.

నారదా! విభూతిని సర్వాంగాలకూ ఆలదుకొన్నవాడికి ధనం దానం చేస్తే ఆ దాత చేసుకున్న పాపాలన్నీ నశించిపోతాయి. శ్రుతులూ స్మృతులూ అఖిలపురాణాలూ విభూతి మహిమను ఎంతగానో కొనియాడుతున్నాయి. అంచేత ఆందరూ దీన్ని అలంకరించుకోవడం శ్రేయస్కరం. తెల్లని విభూతిని నుదట పెండెకట్టులుగా పెట్టుకుని మూడుపూటలా సంధ్యవార్చిన విప్రుడు శివలోకంలో శాశ్వతంగా నివసిస్తాడు. యోగీశ్వరుడు ఆపాదతలమస్తకంగా త్రిసంధ్యల్లోనూ భస్మస్నానం చేస్తే చాలు అతడికి యోగసిద్ది కల్గుతుంది. ఇది జలస్నానంకన్నా ఎన్నోరెట్లు గొప్పది. గృహస్థులకు వంశవర్ధకం. సర్వతీర్థాలలోనూ క్రుంకులాడిన పుణ్యఫలం ఒక భస్మస్నానంతో లభిస్తుంది. మహాపాతకాలూ ఉపపాతకాలూ అన్నీ మండుతున్న అగ్నిలో ఎండుకట్టెల్లాగా దహించుకుపోతాయి. భస్మస్నానానికి సాటివచ్చే స్నానమే లేదు. ఇలాగని శివుడే సాక్షాత్తుగా ప్రశంసించి తానూ స్వయంగా నిత్యమూ భస్మస్నానాన్ని చేస్తున్నాడు. అప్పటినుంచీ బ్రహ్మాదిదేవతలూ ఋషి ముని గణాలూ సకలసత్కర్మాచరణలకూ ఆరంభంలో పనిబూని భస్మస్నానం చేస్తున్నారు. అందుచేత ఈ ఆగ్నేయమైన భస్మస్నానాన్ని చేసినవారందరూ ఈ శరీరాలతోనే రుద్రులుగా పరిగణింపబడుతున్నారు. భస్మస్నాతులనూ భస్మధారులనూ సందర్శించినవారు సైతం దేవాసురమునీంద్రులచేత వంద్యులవుతున్నారు. దర్శించి గౌరవసూచకంగా లేచి నిలబడినవారికి దేవేంద్రుడంతటివాడు సాష్టాంగపడతాడు. భస్మధారులకు అభక్ష్యభక్షణాది దోషాలు ఏమీ అంటవు. అన్నీ హాయిగా ఆరగించవచ్చు. జలస్నానం చేసినా భస్మస్నానం కూడా చేస్తేనే బ్రహ్మచారులూ గృహస్థులూ వానప్రస్థులూ సర్వపాపవినిర్ముక్తులవుతారు. సద్గతి(ముక్తి) పొందుతారు. యతీశ్వరులకు ఈ ఆగ్నేయభస్మస్నానం మరీ విశేషంగా ఫలప్రదమవుతుంది.

భస్మస్నానం




Bhasmoddulanam - Smearing with sacred ash - భస్మోద్దూళనం

శ్రీ దేవీ భాగవతం ఏకాదశ స్కంధము - భస్మోద్దూళనం

కపిలగోవు పేడను నేలమీద పడకముందే పట్టుకోవాలి. ఒకవేళ నేలమీద పడిపోతే కడికి పైపేడనూ కిందపేడనూ వదిలేసి మధ్యలోది స్వీకరించాలి. అది దుర్గంధంతో ఉన్నా పుర్రుగా ఉన్నా మరీ గట్టిగా ఉన్నా పనికిరాదు. పట్టినపేడను ఇంటికి తెచ్చి చిట్టో పాట్టో కలిపి ముద్దలు చేసి ఎండబెట్టాలి. ఇదంతా ఆయా మంత్రాలతోనే చెయ్యాలి. హోమం చేసేటప్పుడూ భస్మం తీసేటప్పుడూ నియత మంత్రాలు పఠించాలి. నియమాలు శ్రద్ధగా పాటించాలి. కడిగి శుద్ధి చేసి తడిఆర్చిన గట్టిపాత్రలోకి కచికలు తీసి పరిశుభ్రవస్త్రం కప్పాలి. సమంత్రకంగా పరిమళద్రవ్యాలు కలపాలి. మంత్రయుక్తంగా పరిశుభ్రస్థలంలో భద్రపరచుకోవాలి. వెండి బంగారు కర్ర మట్టిపాత్రలు ఏవైనా పనికివస్తాయి. అందంగా శుభ్రంగా దృఢంగా ఉంటే చాలు. ధనవంతులైతే బంగారు పొత్రల్లోనే ఉంచుకోవచ్చు.

ప్రయాణాలకు వెళ్ళేటప్పుడు విభూతిని స్వయంగా తీసుకువెళ్ళాలి. అనుచరులతోనైనా తెప్పించుకోవచ్చు. కానీ అశుచి చేతికి భస్మపాత్రను ఇవ్వకూడదు. అశుచి స్థలంలో ఉంచకూడదు. శరీరంలో నీచాంగాలకు తాకించకూడదు. పాత్రను విసరడం ఎగరవెయ్యడం దాటడం - ఇలాంటివి చెయ్యకూడదు. భక్తిశ్రద్ధలతో సమంత్రకంగా విభూతిని తయారుచేసుకోవాలి, రక్షించుకోవాలి, ధరించుకోవాలి. ఇది స్మృతులు చెప్పిన విభూతిధారణ విధానం. యథాతథంగా ఆచరించినవాడు శివుడితో సమానమవుతాడు.

శైవులు శివాలయాలలో సిద్ధం చేసుకున్న విభూతిని వైదికులు అడిగి తెచ్చుకోవచ్చు. భస్మాన్నేకాదు ఇచ్చిన వారినీ గౌరవించి పూజించాలి. తాంత్రికులు తంత్రమార్గంలో విభూతిని తయారుచేసుకొంటారు. ఒక వేళ ఎప్పుడైనా ఎక్కడైనా వాళ్ళు దాన్ని ఇవ్వజూపితే వైదికులు స్వీకరించకూడదు.

కానీ శూద్ర కాపాలిక పాషండాదులు ఇస్తే తీసుకోవచ్చు, ధరించవచ్చు. విభూతిని ఏనాడూ ఎవ్వరూ ఎట్టిపరిస్థితుల్గొనూ తిరస్కరించకూడదు. కించపరచకూడదు. అసలు అటువంటి ఊహలే రాకూడదు. కించపరిచినా విభూతిధారణను విడిచిపుచ్చినా పతితుడవుతాడు. త్రిపుండ్రధారణమూ దేహావగుంఠనమూ భక్తిశ్రద్దలతో మంత్రపూర్వకంగా రోజూ ముప్పొద్దులా చేసుకోవాలి. లేకపోతే మోక్షం లేదు. కోటిజన్మలెత్తినా భవబంధ విమోచనం కలగదు. విభూతి ధరించనివాడి జన్మ నిష్ఫలం. మరుసటి జన్మలో పందిగా పుడతాడు. త్రిపుండ్రాలంకరణ లేని మానవ శరీరం శ్మశానసదృశం. పుణ్యాత్ములు వాడిని చూడనేకూడదు. విభూతి లేని ఫాలమూ, శివాలయం లేని గ్రామమూ, ఈశ్వరార్చన లేని జన్మమూ, శివాశ్రయం కాని చదువూ(విద్య) పరమనింద్యాలు.

విభూతిని నిందిస్తున్నాడంటే శివుణ్ణి నిందిస్తున్నట్లే, ధరిస్తున్నాడంటే శివుణ్ణి ధరిస్తున్నట్లే. వస్తు సామగ్రి ఎంత పుష్కలంగా ఉన్నా సాధనసంపత్తి ఎంత అధికంగా ఉన్నా విభూతిలేని శివార్చన (అగ్ని లేని పర్వతంలా?) శోభించదుగాక శోభించదు. ఉద్దూళన త్రిపుండ్రధారణలు శ్రద్ధగా ఆచరించనివారికి పూర్వజన్మ సంచితపుణ్యాలన్నీ నశిస్తాయి. స్మార్తులు వేదోచితాచారాలను పాటిస్తూ వేదమంత్రాలతోనే త్రిపుండ్రధారణ చెయ్యాలి. లేనినాడు అనర్ధదాయకమవుతుంది. విభూతి పెట్టుకోనివాడు ఏ మంచిపని చేసినా అది చెయ్యనట్టే, ఏ పవిత్ర విషయం విన్నా అది విననట్టే, ఏ గొప్పవిద్య నేర్చినా అది నేర్వనట్టే. ఆతడి వేదాలూ యజ్ఞాలూ దానాలూ తపస్సులూ వ్రతాలూ పూజలూ ఉపవాసాలూ అన్నీ వృధా వృధా - భస్మధారణ చెయ్యకుండా ముక్తి కావాలని కోరుకోవడం విషం తాగినా బ్రతకాలనుకోవడం.

అసలు, సృష్టికర్త నొసలును సృష్టించడమే త్రిపుండ్రధారణకోసం. అందుకే అడ్డంగా విశాలంగా సృష్టించాడు. లేకపోతే గుండ్రంగానే సృష్టించి ఉండేవాడు. అదీగాక సహజసిద్ధంగానే నొసట అడ్డగీతలు ఉంటాయి. ఆవంకన నిత్యమూ జ్ఞాపకం చేస్తున్నాడు. అయినా విభూతి పెట్టుకోకపోతే పరమమూర్ఖులు గాక మరేమిటి!

నొసట తిర్యగ్రేఖలుగా విభూతి పెట్టుకోని విప్రుడు చేసే ధ్యానం ధ్యానమే కాదు, జ్ఞానం జ్ఞానమే కాదు, మోక్షం మోక్షమేకాదు, తపస్సు తపస్సేకాదు. వేదాధ్యయనానికి శూద్రుడు అధికారి కానట్టే త్రిపుండ్రధారణలేని విప్రుడు శివార్చనకు పనికిరాడు.

తూర్పుదిక్కుకి అభిముఖంగా నిలిచి కాళ్ళూ చేతులూ కడుక్కుని ఆచమించి ప్రాణాయామంచేసి సంకల్పం చెప్పుకుని భస్మస్నానం చెయ్యాలి. అగ్నిహోత్రంనుంచి పరిశుభ్రమైన విభూతిని తీసుకువి ఈశాన మంత్రంతో నెత్తిమీద జల్లుకోవాలి. పురుషమంత్రంతో నొసట దిద్దుకోవాలి. అఘోరమంత్రంతో హృదయం మీదా వామ మంత్రంతో గుహ్యప్రదేశంలోనూ సద్యోజాతమంత్రంతో కాళ్ళమీదా ప్రణవోచ్చారణతో సర్వాంగాలకూ అలంకరించుకోవాలి. అటుపైని ఉద్దూళనం చేసుకోవాలి. దీన్ని ఆగ్నేయక భస్మస్నానమంటారు. ఏ వైదికకర్మను ఆచరించాలన్నా ప్రారంభంలో ఇది చెయ్యాలి. తరవాత మళ్ళీ కాళ్ళూచేతులూ కడుక్కుని యథావిధిగా ఆచమించి లలాట హృదయ కంఠ ప్రదేశాలలో పంచబ్రహ్మమంత్రాలతో త్రిపుండ్రాలు ధరించాలి. అప్పటికి. కర్మానుష్ఠానానికి కావలసిన పవిత్రత సిద్దిస్తుంది. సత్కర్మలు ఫలిస్తాయి. లేకపోతే ఫలించవు. సత్య శౌచ జప హోమ తీర్థ దేవపూజాదులన్నీ వ్యర్థమే అవుతాయి. రుద్రాక్షలూ త్రిపుండ్రాలూ ధరించిన విప్రుడు దురిత - రోగ - దుర్భిక్ష - తస్కరభయాదుల్ని తొలగించగలుగుతాడు. అపునర్భవంగా బ్రహ్మత్వం పొందుతాడు. పంక్తి పావనుడు అవుతాడు. దేవవిప్ర పూజ్యుడవుతాడు. శ్రాద్ధ - యజ్ఞ - జప - హోమ - వైశ్వదేవ - సురార్చనల్లో విభూతిని ధరించినవాడు పూతాత్ముడు  మృత్యుంజయుడు.

భస్మధారణ మహిమ




Tripundra Vibhuti Mahima - Durvasudi Katha - The Glory of Tripundra Vibhuti – The Story of Durvasa - త్రిపుండ్ర విభూతి మహిమ - దూర్వాసుడి కథ

త్రిపుండ్ర విభూతి మహిమ - దూర్వాసుడి కథ నారదా! ఇక్కడొక ఇతిహాసం నీకు చెప్పాలి. ఒకప్పుడు దూర్వాసుడు శరీరంనిండా విభూతి ఆలంకరించుకుని రుద్రాక్షమా...