Thursday, August 27, 2026

Nrugamaharaju Charitramu - నృగమహారాజు చరిత్రము

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - ఉత్తరభాగం - నృగమహారాజు చరిత్రము

శ్రీకృష్ణుని కుమారులగు ప్రద్యుమ్నుడు, సాంబుడు, సారణుడు, చారుభానుడు మొదలగు యాదవకుమారులు ఉద్యానవనానికి వచ్చారు. అక్కడ వారు యథేచ్చగా సంచరించారు. దాహం వేయడంతో నీటికోసం వెదికారు. వారికి నీళ్ళులేని బావి కన్పించింది. అందులో కొండవలె ఉన్న ఒక తొండను చూచి, దాన్ని బయటకు తీయడానికి ప్రయత్నించారు.

వారు పరుగున వెళ్ళి, పెద్దతాళ్ళను తెచ్చి బిగించికట్టారు. ఆ తొండను బయటకుతీసే ప్రయత్నం చేశారు. తీయలేక, ఆ విషయం శ్రీకృష్ణునికి చెప్పగా

యదుకుమారులు చెప్పిన మాటలువిని కృష్ణుడాశ్చర్యంతో నీరులేని నూతిలోనికి చూచి, అందున్న తొండను ఎడమచేతితో పైకి తీయగా అది బంగారువర్ణంతో కూడిన శరీరంతో పురుషుడై నిలవగా

కృష్ణునికి జరిగిన విషయమంతా తెలిసినా, అక్కడున్న ప్రజలకు, తన సంతానానికి ఆ విషయం తెలిసేందుకు ఆ పురుషునిచేతనే చెప్పించాలని అతనితో ఇలా అన్నాడు.

సువివేకచరిత్రా! రత్నభూషణాలచే ప్రకాశిస్తూ, సాటిలేనికీర్తితో ప్రకాశించే మంచి రూపంగల నీకు ఊసరవెల్లిరూపం ఏవిధంగా కలిగిందో చెప్పు. వినడానికి ఈ వింత సంగతిని వివరించు.

ఇలా అడగ్గా శ్రీకృష్ణుని పాదపద్మాలకు తన కిరీటంలోని మణులు తగిలేటట్లుగా నుదుటిపై రెండుచేతులు అన్చి, సంతోషంగా వినయంతో నమస్కరించి, ఇలా అంటున్నాడు.

ఓ కృష్ణా! నీవు విశ్వవేద్యుడిస్తే ప్రపంచంలో స్పష్టంగా నీకు తెలియంది ఏది అయిన ఉందా? అయినప్పటికీ నానుండే వినడం మీకు ప్రీతిని కలిగిస్తే శ్రద్ధతో వినుము. నా కథ చెబుతాను అన్నాడు.

నేను ఇక్ష్వాకుడనేరాజుయొక్క కుమారుణ్ణి. బీదవారు వేడినంతనే రక్షించేవాడిని. రాజులు సేవించి గౌరవిస్తూంటే సమస్త భూవలయాన్ని పాలించే సమర్థత కలవాణ్ణి. నావద్ద సంపద ఎల్లప్పుడూ ఉండేది. ప్రకాశవంతమైన కీర్తి అంతటా వ్యాపించి ఉండేవాణ్ణి.

కృష్ణా! మాటలచేత తనను తాను పొగడుకోవడం పాపమంటారు. అది అలా ఉండనీ. నక్షత్రసమూహాన్ని ఇసుక రేణువుల్ని మంచుబిందువుల్ని లెక్కించడం సాధ్యమవుతుంది - కానీ, నేను బ్రాహ్మణసమూహానికి ఇచ్చిన గోవుల్ని లెక్కించడం బ్రహ్మదేవునికి కూడా శక్యం కాదు. ఏమని చెప్పేది?

కృష్ణా! గొప్ప తపస్సు, వ్రతం, వేదపఠనాలు చేసే సంసారులై విధింపబడిన కర్మలు ఆచరించే బీదబ్రాహ్మణులకు బంగారు కొమ్ములు, గిట్టలు కలిగి, తొలిఈత దూడలుగల పాడి ఆవుల్ని దక్షిణతో కలిపి నా సంపదకు తగినట్లుగా ఇస్తూ ఉంటాను.

న్యాయంగా సంపాదించిన ధనంతో - గోవులు, భూమి, బంగారు, రత్నాలు, గృహాలు, రథాలు, గజాలు, కన్యాదానం, విద్యాదానం, వస్త్ర, రజత, శయ్యధనాది దానాలనేకం చేశాను. నూతులు, చెరువులు నిర్మించాను. నివేశ స్థలాలను దానం చేశాను. ఈ రీతిగా చేస్తుండగా ఒకరోజు

(1. దేవ, పితృ, మనుష్య, భూత, బ్రహ్మ యజ్ఞాలను పంచయజ్ఞాలంటారు.
2. సప్తసంతానాలు : 1. తటాకం, 2. నిధి, 3. అగ్రహారం, 4. దేవాలయం, 5. వనం, 6. కావ్యం, 7. సంతానం.)

అనఘా! నేను ముందుగా ఆ గోవును కశ్యపుడనే బ్రాహ్మణునికి నిర్మలమైన మనస్సుతో దానం చేశాను. కానీ, ఆ గోవు మందనుండి తప్పిపోయి నామందలో ప్రవేశించింది. 

అది తెలియక నేను ఆ గోవును నేను ఒక బ్రాహ్మణ శ్రేష్ఠునికి దానమిచ్చాను. అతడు ఆవును తీసుకొని వెళుతున్నాడు. పూర్వం ధారాపూర్వకంగా దానంపట్టిన బ్రాహ్మణుడు

మనస్సులో కోపం కలుగగా ఆ బ్రాహ్మణుడు వేగంగా, పంచెపట్టు వదలితే బిగించుకొంటూ, ఈ ఆవు నాది, దీన్ని దొంగిలించి రాజమార్గంగుండా కొనిపోతున్నావు. నీలాంటివారు ఉన్నారా?

అంటే ఆ బ్రాహ్మణుడు నేను ప్రభువునుండి దానంగా గ్రహించి, ఈ ఆవును తీసుకొనిపోతున్నానని పలికాడు. పూర్వం నేను దానంగా స్వీకరించిన ఆవు 'ఇదే' అని పలికాడు మొదటి బ్రాహ్మణుడు. వారికి అక్కడనే పెద్ద కలహమయింది.

బ్రాహ్మణులిద్దరూ తమలోతాము కలహించుకొని తగవు తీర్చండని నా దగ్గరకు వచ్చారు. పూర్వం ఆవును దానంగా గ్రహించిన బ్రాహ్మణుడు నాతో ఇట్లన్నాడు.

'ఓ రాజా! జనులు అధర్మప్రవర్తనకు పాల్పడకుండా ఆజ్ఞాపించేవాడివైన నీవు ఏ ధర్మమని భావించి ఈ ఆవును మరియొక బ్రాహ్మణునికి దానం చేశావు? పూర్వం నాకు దానం చేసిన ఆవు దారి తప్పి గుంపులో నుంచి వచ్చి, నీ మందలో కలిసింది. 
నీవు దానినే వేరొకరికి దానం చేశావు. దాతవు, చోరుడవు కూడ అయ్యావు అన్నాడు.

బ్రాహ్మణుని మాటలు వినగానే రాజుయొక్కమనస్సు కలతపడింది. “ఇది నాకు తెలియకుండ జరిగిన తప్పు” అని ఆ బ్రాహ్మణునితో చెప్పి “దానికి బదులు నీకు ఒకలక్ష గోధనం ఇస్తాను తీసుకో” అన్నాను.

ఆ బ్రాహ్మణుని మంచిమాటలతో బుజ్జగిస్తూ ఇలా చెప్పాను. నేను నరకబాధ పొందలేను. నన్ను రక్షింపుము - అని చెప్తూ

ఎంతగా కోరినప్పటికీ పట్టుదల వీడకుండా, నీవు పూర్వమిచ్చిన ఆవును తప్ప, దానికి బదులుగా నీ రాజ్యం అంతటినీ ఇచ్చినప్పటికీ గ్రహింపనని పలుకుతూ, అచ్చట ఉండకుండా వెళ్ళిపోయాడు.

రెండవబ్రాహ్మణుణ్ణి కూడా నేను ఆ విధంగానే ప్రార్ధించాను. ఆయనకూడా అంగీకరించలేదు. ఎన్నుకొన్న పదివేల ఆవుల్ని ఇచ్చినా కూడా నేను అంగీకరించను. ఆ ఆవే కావాలన్నాడు. కాలంకడచింది. మరణించాడు. యమభటులు నన్ను తీసుకొని వెళ్ళి యముని ఎదుట నిలబెట్టారు. అతడు నన్ను ఉద్దేశించి ఇలా పలికాడు.

రాజా! ఇక్ష్వాకు వంశాన్ని పవిత్రం చేసినవాడా! నీవు చేసిన దానాలూ, యజ్ఞాలూ పుణ్యకార్యాలూ స్వర్ణ, మర్త్య పాతాళలోకాల్లో ప్రసిద్దాలై పేరుపొందాయి. ముందుగా పాపానికి పొందవలసిన ఫలాన్ని పొంది, తర్వాత పుణ్యకర్మల ఫలితాన్ని పొందాలి అనడం బ్రహ్మ ఆజ్ఞ! దాన్ని కాదనగలమా?

యముడు ఆ రాజును భూమిపైకి తోయించాడు. భూమిపై పడేటప్పటికి ఊసరవెల్లి రూపం కలిగింది. ఆనాటినుండి నేటివరకు ఈ దురవస్థను అనుభవిస్తున్నాను. జీవి పుణ్యపాపఫలాల్ని అనుభవించక తప్పదు. నీ దర్శనఫలితంగా సర్వపాప ఫలాల్నీ పోగొట్టుకొన్నాను - అని కృష్ణుడికి పదే పదే ప్రణామాలు ఆచరించి ఇట్లని పలికాడు.

కృష్ణా! వాసుదేవా! కేశవా! పరమాత్మా! అప్రమేయా! వరదా! హరీ! ముకుందా నిన్ను చూడగలిగాను. నీ దయకు పాత్రుడనయ్యాను. సర్వసాఖ్యపదవుల్ని పొందగలిగాను.

ఓ కృష్ణా! నీ అనుగ్రహం నాలో ఎల్లపుడు ఉండేటట్లుగా అనుగ్రహించు - అని కృష్ణుని పాదారవిందాలకు నమస్కరిస్తూ సెలవు తీసుకొని, దివ్యవిమానం ఎక్కి స్వర్గానికి వెళ్లాడు. అక్కడున్న రాజులకు ధర్మబోధం చేస్తూ కృష్ణుడిలా అన్నాడు.

రాజకులాలను దహించేందుకు బ్రాహ్మణులధనం(నిప్పు) అగ్నికణం. రాజకులాల సంపద అనే సముద్రాన్ని ఇంకింపచేసేందుకు బ్రాహ్మణక్షేత్రం బడబాగ్ని. రాజులసంపద అనే కొండల్ని కూల్చేందుకు బ్రాహ్మణులధనం, వజ్రాయుధం. రాజులకీర్తి వెన్నెలను మాపేందుకు బ్రాహ్మణధనం పొద్దుపొడుపు. బ్రాహ్మణులసొమ్ముకంటే విషమే మేలు. విషానికైనా చికిత్స ఉంది కానీ బ్రాహ్మణుల సొమ్ముకు చికిత్స లేదు. కాబట్టి, బ్రాహ్మణులసొమ్మును రాజులు గ్రహించరాదు.

అజ్ఞానంతోనైనా బ్రాహ్మణుని సొమ్ము దొంగిలించరాదు. నిప్పును తెలియక తాకినా శరీరం బాధపడేటట్లు, అది కాల్చకుండా ఉంటుందా?

ఇతరులవల్ల తన ధనాన్ని పోగొట్టుకొని రాజుకు చెప్పినా రాజుపట్టించుకోక పోతే ఆ బ్రాహ్మణుడు ఏడ్చినపుడు ఎన్ని మట్టికణాలు కన్నీటితో తడుస్తాయో అన్ని వేలసంవత్సరాలు ఆ రాజ్యాన్ని పాలించే రాజు కుంభీపాకనరకం అనుభవిస్తాడు. 

అంతేకాదు - అట్టి రాజువంశంలోని పూర్వులు పదితరాలవారూ, తరువాతి పదితరాలవారూ నరకం అనుభవిస్తారు. రాజు అరవైవేలసంవత్సరాలు ఘోరనరకం అనుభవిస్తాడు. బ్రాహ్మణుడు ఎంతటి తప్పుచేసినా, కొట్టినా, తిట్టినా, ప్రభువు మాత్రం వినయపూర్వకంగా ఉండాలి. 

నేనుకూడా బ్రాహ్మణులకు వినయపూర్వకంగా నమస్కరిస్తాను. అట్లు చేయనివారిని విరుద్ధమైన చెడువర్తనం కలవారిని వెదకి శిక్షిస్తాను. కాబట్టి, మీరు బ్రాహ్మణులపట్ల మిక్కిలి భక్తి గలిగి ప్రవర్తించండి - అని శ్రీకృష్ణుడు ఆజ్ఞాపించి, యాదవసమూహం సేవిస్తుండగా, సర్వరక్షకుడు ఆ స్వామి నిజనివాసానికి వెళ్లాడని శుకమహర్షి చెప్పాడు.

ఈ కథను చదివినవారూ, విన్నవారూ పాపాలను పోగొట్టుకొని, ఈ లోకంలో సుఖాన్నీ పిదప కైవల్యాన్నీ కూడా సులభంగా పొందుతారు.

బలరాముడు సుహృద్బంధుజన దర్శనార్ధమై వ్రేపల్లెకు బోవుట







No comments:

Post a Comment

Krishnudu Poundrakavasudevunimida Dandethipoyi Vaanim Jamputa - కృష్ణుడు పౌండ్రకవాసుదేవునిమీద దండెత్తిపోయి వానిం జంపుట

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - ఉత్తరభాగం -  కృష్ణుడు పౌండ్రకవాసుదేవునిమీద దండెత్తిపోయి వానిం జంపుట పౌండ్రక వాసుదేవుడు బలంవల్ల కలిగిన పొగరుతో ప...