Sunday, August 23, 2026

Jarasandhudu Madhurapattanamu Mida Dandettivachi Krishnunito Yuddhamu Cheyuta - జరాసంధుడు మథురాపట్టణము మీద దండెత్తివచ్చి కృష్ణునితో యుద్ధము చేయుట

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము - 
జరాసంధుడు మథురాపట్టణము మీద దండెత్తివచ్చి కృష్ణునితో యుద్ధము చేయుట

వారు తమ జనకునితో 'తండ్రీ! లోకంలోని వారూ, వీరూ రాజులేనా అని యాదవులు మిక్కిలి గర్వించి శౌర్యవంతమైన సైన్యంతో వచ్చి, మథురాపట్టణాన్ని ముట్టడించారు. భార్యలు, పిల్లలు, చుట్టాలు ఆక్రందిస్తుండగా కంసుడు మున్నగు రాజుల్ని వధించారు. ఈ విధంగా మాకు కృష్ణునివల్ల వైధవ్యం సంప్రాప్తించింది.

ఈ మాటలను వినగానే జరాసంధుడు ప్రళయకాలాగ్ని వలె మండిపడ్డాడు. దుఃఖం, కోపం రెండూ ఎక్కువై బాధిస్తుండగా అపుడు ఇలా అన్నాడు.

ఏమీ? కంసుణ్ణి శ్రీకృష్ణుడే యుద్ధంలో చంపాడా? ఔరా! నా బలంగురించి కొంచెంకూడా ఆలోచించలేదే. భూమిలో దాక్కున్నా సరే, ఆకాశానికి ఎగిరినా సరే, మహాసముద్రంలో ప్రవేశించినా సరే నా పరాక్రమమనే భయంకరమైన అగ్నినుండి ఎగసిపడే మంటలు ఈ రోజే యాదవసమూహమనే అడవులను కాల్చేస్తాయి.

బ్రహ్మవిష్ణుమహేశ్వరులు, ఇంద్రుడు మొదలైనవాళ్లు ఎవ్వరు అడ్డుపడినా, ఈ రోజు నా చేతిలో యాదవులు మరణిస్తారు. భూమిలో యాదవులే లేకుండా చేస్తాను.

అని ఇలాగ తన కుమార్తెలకు ఓదార్పు మాటలు చెప్పాడు. యుద్దానికి సిద్ధపడుతున్న మనసులో కోపం మండిపోతుండగా యుద్ధభేరిని మ్రోయించి ముందుకు కదిలాడు.

రాజా! దక్షుడైన జరాసంధుడు ఇరవైమూడుఅక్షౌహిణులసైన్యం తన వెంట నడుస్తుండగా, మిక్కిలి కోపోద్రిక్తుడై మథురానగరం మీదికి దండెత్తాడు.

అలా జరాసంధుడు దండెత్తిన వేళలో మదించి ఏనుగుల, గుఱ్ఱాల, రథాల భటుల కాలితొక్కిడికి దట్టంగా దుమ్ము పైకిలేచి ఆకాశంలో చీకట్లు కమ్ముకొన్నాయి. అందువల్ల సూర్యుని రథాశ్వాలు మెల్లగా నడిచాయి.

ఇలా బయల్దేరి వెళ్లిన జరాసంధుని సేనలు మధురానగరానికి చేరాయి. ఆ నగరంలో పెద్ద ఉద్యానవనాలున్నాయి. అందులో ఎప్పుడూ చిగుళ్లతో, ఆకులతో, మొగ్గలతో, పూలతో, పళ్లతో బరువెక్కి వంగిన పెద్దపెద్ద చెట్లున్నాయి.

ఆ వనాల్లో జలయంత్రాలున్నాయి. అవి చెక్కతో చేసినవి. వాటికి నీటిని పైకి చిమ్మడానికి వీలుగా చిన్నికలశంలాంటి మూతిని అమర్చారు. అందులో నుండి నీరు పైకి ఎగసి చిమ్ముతూ ఉంటుంది. ఆ నీటి ధారల తుంపరలచే కల్పించబడిన వర్షాకాలంలాగా ఉంది.

యమకింకరులవంటి పరాక్రమవంతులైన భటులతో, రథాలతో, గుర్రాలతో, ఏనుగులతో నగరం నిండి ఉంది. తమ కులాలకు తగిన ఆచారాలలోనూ, ధర్మంలోనూ ప్రావీణ్యం కల పౌరులతో ఆ ఊరు వెలిగిపోతూ ఉంది. దేవతలకైనా భేదించడానికి వీలుకానంతటి ఎత్తెన కోటలున్నాయి. ఆ కోట బురుజులమీద(రాళ్లను విసిరే యంత్రాలున్నాయి. ఆ ప్రాకారవలయం భయం కలిగించేదిగా ఉంది. 

అక్కడ శ్రేష్ఠమైన సరస్సులున్నాయి. అందులో జక్కవ (చక్రవాక) పక్షులు, బెగ్గురు పక్షులు, రాజహంసలు కలకలారావాలు చేస్తున్నాయి. ఆ సరస్సుల్లో బాగా విచ్చుకున్న ఎర్రకలువలు, తామరలు ఉన్నాయి. వాటి పరిమళాలతో కూడిన గాలులు వీస్తున్నాయి. వీటితో ఆ ఊరు అందంగా ఉంది. 

ఆ ఊళ్లో మదించిన ఏనుగులున్నాయి. వాటినుంచి మదజలం స్రవించి నేల బురదతో నిండిపోయింది. ఓడించబడిన ఎందరో రాజులు ధరించిన ఆభరణాల, మణుల పొడిరాలి, ఆ బురద పూడిపోతూ ఉంది. పాపరహితులైన యాదవ శ్రేష్ఠులు అక్కడి పండిత జనానికి మేరుపర్వతాన్ని, కల్పవృక్షాన్నీ, కామధేనువునూ ఇచ్చారు. ఈ కానుకల సమ్మర్దంతో వారి ఇండ్లు వెలుగుతున్నాయి. (అంటే యాదవ శ్రేష్ఠులు ఇచ్చిన కానుకలు అంత విలువైనవని అర్ధం).

అక్కడి పతాకాలపై వింజామర, నెమలి, ధనుస్సు మొదలైన గుర్తులున్నాయి. అవి గాలికి పరపలాడుతూ ఆ శబ్దంతో ఆకాశాన్ని నింపుతున్నాయి. అక్కడ గొప్పభవనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఆ భవనాల, మేడల గవాక్షాల రంధ్రాల్లో నుండి పొగలు బయటకు వెళ్తున్నాయి. 

అవి పచ్చకప్పురపు ధూపాలు. వాటిని చూసి నెమళ్లు మబ్బులని భ్రమించి, పింఛం విప్పి ఆనందంతో నర్తిస్తున్నాయి. వీటితో ఆ ఊరు సొగసుగా ఉంది.

ఆ ఊళ్లోని దేవాలయాల్లో మంగళ వాద్యాలు ఎడతెగక మ్రోగుతుంటాయి. అవి సముద్రంలో చెలరేగుతున్న అలల శబ్దాలను తిరస్కరిస్తుంటాయి. గోపవనితల ప్రాణనాథులయొక్క బాహుబలంచేత ఆ ఊరు రక్షించబడుతూ ఉంది. శత్రువులు కన్నెత్తి కూడా చూడడానికి వీలు లేనంతటి ప్రతాపం ఉన్న మథురానగరం - అది. 

ఆ నగరాన్ని చేరి ఎగసిపడిన మహాసముద్రంవలె, జరాసంధుడు ముట్టడించాడు. అన్ని వైపులా విడిది చేశాడు. సమయజ్ఞుడైన శ్రీకృష్ణుడు అతని సైన్యసమూహాన్ని చూచి, తన మనసులో ఇలా అనుకున్నాడు.

జరాసంధుడు ఇరవైమూడు అక్షౌహిణుల సైన్యంతో ఊరిని చుట్టుముట్టాడు. అతనిపట్ల సామదానభేదాలు సాగవు. ఇక అతనికి దండమే తప్పనిసరి. దానితో వాణ్ణి జయించి భూదేవికి బరువు తగ్గిస్తాను.

నేను భూలోకంలో అవతరించడంకూడా నాలుగుదిక్కులచివర్లదాకా ఉన్న భూభారాన్ని తగ్గించడానికే కదా! అందుచేత, ఈ క్షణంనుండి భూమిబరువును తగ్గించే ప్రయత్నాలను ఆరంభిస్తాను. (అంటే - దుష్టశిక్షణం, శిష్టరక్షణం చేస్తానని భావం)

ఈ మగధరాజైన జరాసంధుణ్ణి ఇప్పుడు చంపకూడదు. వదిలివేయాలి. వాడు మళ్లీ మళ్లీ సైన్యాన్ని సమకూర్చుకుని దాడి చేయడానికి వస్తాడు. అలా వచ్చిన వాళ్లను వధిస్తూ ఇలా భూభారాన్ని తగ్గించి, చివరకు వీణ్ణికూడా చంపేయాలి.

అని ఇలా శ్రీకృష్ణుడు ఆలోచిస్తూ ఉండిన ఆ సమయంలో ఆకాశం నుండి గొప్పవెలుగుతో కూడిన రెండురథాలు వాళ్లవద్దకు వచ్చాయి. అవి కవచాలతోనూ, సారథులతోను, రకరకాల బాణాలు, ధనుస్సులతోను, చక్రంవంటి ఆయుధాలతోను ఉన్నాయి. మనసులోని కోరికలను చిగురింప చేసేవిగా ఉన్న ఆ దివ్యరథాలు దైవయోగంచేత బలరామకృష్ణులను చేరాయి. వాటిల్నిచూచి శ్రీకృష్ణుడు బలరామునితో ఇలా అన్నాడు.

బలరామా! చూశావా! ఆకాశంనుంచి గొప్ప వెలుగుతో రథాలు, ఆయుధాలు వచ్చాయి. వీటిని తీసుకో. దేవతలు తల ఊపుతూ మెచ్చుకునేరీతిలో రాజసమూహాలను చంపు. ఏమీ వెనకాడకు. భూభారాన్ని తగ్గించు. దీనివల్ల నీ అవతారానికి ప్రయోజనం కలుగుతుంది. వెంటనే లే. యుద్దానికి బయలుదేరు.

ఈ విధంగా చెప్పి శ్రీకృష్ణుడు ఏం చేశాడంటే

అపుడు బలరామకృష్ణులు తీక్షణమైన స్వభావంతో ఉన్నారు. బలమైన కవచాల్సీ ధనుస్సుల్నీ, బాణాల్నీ, రథాల్నీ, అనుచరుల్నీ కల్గిఉన్నారు. శత్రుబలాన్ని తొలగించగల దిట్టలు బలరామకృష్ణులు, ఎదుటి పక్షానికి భయాన్ని కలిగిస్తూ మదపుటేనుగులతోను, గుర్రాలతోను యుద్దానికి వెళ్లారు.

ఇలాగ యుద్దానికి తగిన ఏర్పాట్లతో నగరం నుండి బలరామకృష్ణులు బయలుదేరి

శ్రీకృష్ణుడు పాంచజన్యమనే తన శంఖాన్ని పూరించాడు. అది గంభీరమూ, కర్కశమూ అయిన ధ్వనితో ఉంది. దాన్ని విని శత్రువులు తల్లడిల్లిపోయేలా ఉంది. బ్రహ్మాండంలోని జీవుల ప్రాణం కకావికలై పోయేలా ఉంది. ఆ ధ్వని ధన్యమైందిగా ఉంది. దేవతలు, ఋషులు భక్తితో గౌరవించేదిగా ఉంది. భక్తులైన రాజులు సంతోషించేలాగా ఉంది. (శ్రేష్ఠులైన భక్తులు ఆనందించేలా ఉంది). దుష్టచరిత కలిగిన శత్రుసైన్యం భయపడిపోయేలాగా ఉంది.

గంభీరమైన ఆ శంఖధ్వని ఏనుగులను కూడా బెదరగొడుతూ ఉంది. అంత దుర్భరమైన ధ్వనిని విని యుద్ధంలోని జరాసంధుని సైన్యం కళ్లు కనిపించక అటూ ఇటూ తిరుగుతున్నాయి.

ఆ సమయంలో మగధదేశానికి చెందిన జరాసంధుడు శ్రీకృష్ణుడితో ఇలా అన్నాడు.

పసులకాపరీ! బెదిరించి తరమడానికి ఇవేమీ ఆవులమందలు కావు - ఇవి మదించిన ఏనుగుల గుంపులు. చెవియొగ్గి వినడానికి దూడల అరుపులు కావు - ఇవి శ్రేష్ఠమైన గుర్రాల సకిలింతలు. కాలితో తంతే విరిగిపోయే పాతబండ్లు కావు; ఇవి పర్వతంలాంటి రధాలు. ముచ్చట్లాడుకోడానికి ఇది గొల్లలగుంపు కాదు; యమునితో సాటిరాగల శత్రు సమూహం. ఆర్పేయడానికి ఇదేమీ కార్చిచ్చు కాదు. బాణాలనుంచి కురిసే అగ్ని మురిసిపోవడానికి ఇది బృందావనం కాదు - సైన్యమిది. నాట్యం చేయడానికి ఇది యమునానది కాదు. భయంకరమైన యుద్ధభూమి; నీకెందుకయ్యా ఈ యుద్ధం? వెనక్కి వెళ్లిపో.

ఓయీ పసులకాపరీ! ఆడదాన్ని చంపడమో, కొంగను చంపడమో, చెట్లను పడగొట్టడమో, గాడిదను చంపడమో, పామును తరమడమో, గాలిని బంధించడమో, కొండను చేతపట్టుకోడమో కాదు. ప్రళయకాలంలో చెలరేగిపోతున్న ఆర్పలేని, భరించలేని అగ్నివంటి బాణాల దెబ్బలను తట్టుకొని బతికి ఉండగలవా?

పద్మాలవంటి కన్నులు గల బాలకృష్ణా! ఇవి గోపస్త్రీల వీణావాదన ధ్వనులు కావు - చెవుడును కల్గించే అల్లెత్రాటి ఝంకారాలు సుమా! ఇవి గోపవనితలు నీపైన చల్లే నీటి తుంపరలు కావు - నిన్ను ముక్కలుగా చేసే బాణవర్షాలు. ఇవి గోపికల వాలుచూపులు కావు - నిన్ను నరకే పదునైన కత్తిదెబ్బలు. 

ఇవి గోపకాంతల మెత్తని పద్మాలవంటి చేతులు కావు - నీ పొగరును దించే పిడికిలి పోట్లు. ఇది మీ చిన్నదైన రేపల్లె అనుకున్నావా? కాదు. ఇది మగధరాజుకు చెందిన సైన్యమనే మహాసముద్రం. ఇందులో భయంకరులైన రాజులు అనే మొసళ్లున్నాయి. ఈ సముద్రం ఉప్పొంగి ద్వీపంలాంటి నిన్ను ముంచివేస్తుంది.

అలా జరాసంధుడు మాట్లాడగా, దానికి శ్రీకృష్ణుడు ఇలా జవాబిచ్చాడు.

మగధరాజా! వట్టి ప్రగల్భాలెందుకు? మునుపు నీవు కొందరు రాజులను గెలిచావని కొందరంటారు. ఆ మాత్రం చాలునా? శౌర్యం నిరూపించుకోవాలి. వట్టి బీరాలు పలకడం వీరుల పద్ధతికాదు. ఇలా మాట్లాడితే సరిపోయిందా? ఎందుకు వదరుతావు. నీవే కాదు. ప్రళయకాలంలోని భయంకరమైన అగ్నినైనా సరే హరించి సంపదలను పొందుతాను.

రాజా! నీవు నన్ను గోవులను కాచుకునే వాడనన్నావు. దీనివల్ల ఏం తక్కువయింది? యుద్ధం చేసినపిదప పసులకాపరికి, భూపాలునికి చేతల్లో ఉండే తేడా తెలుస్తుంది.

అని శ్రీ కృష్ణుడు పలుకగా, జరాసంధుడు మిక్కిలి కోపంతో ఇలా అన్నాడు.

కృష్ణా! నీవు చిన్నపిల్లవాడవు. నాతో యుద్ధం చేయడానికి మీ అన్న బలరాముడిని పంపించు. నీతో యుద్ధం చేశాననుకో! పసులకాపరి అయిన పిల్లవాడితో మహోన్నతుడైన మహారాజు యుద్ధం చేశాడు - అని లోకం అనుకుంటుంది. ఆ మాట తలచుకుంటేనే సిగ్గవుతూంది. మహిమాన్వితమైన బాణాలున్న నన్ను నీవు గెలువలేవు. అందువల్ల నీవు తొలగి వెళ్లిపో.

జరాసంధుడు ఆ విధంగా పల్కగా; శ్రీకృష్ణుడు హేళనగా నవ్వుతూ ఇలా అన్నాడు.

మగధదేశీయుడా! జరాసంధుడా! శౌర్యప్రతాపాలు ఉండేవాళ్లు ఇలా పొగడుకుంటారా? మగతనాన్ని చూపుతారు కదా! నీకు నిజంగా పారుషమనేది ఉంటే ఈ ప్రగల్భాలు పలుకకుండా యుద్ధంలో మెఱిపించు సరిపోతుంది.

ఇలా కృష్ణుడు అన్నాక, కోపంతో జరాసంధుడు

గాలి చిన్నచిన్న మొబ్బులతో సూర్యుణ్ణీ అగ్నినీ కప్పే విధంగా - జరాసంధుడు బలరామకృష్ణులను చుట్టుముట్టాడు. వాళ్లిద్దరూ భూమిని కాపాడడానికి అవతరించినవాళ్లు, దుష్టులైన శత్రురాజులను నిరాకరించే వాళ్లు, దేవతలకే ఆభరణాల్లాంటి వాళ్లు, నిలకడగా ఉండే విజయం కలిగినవాళ్లు - అలాంటి బలరామ కృష్ణులను జరాసంధుడు చుట్టుముట్టాడు.

గుర్రాల సకిలింతలు, ఏనుగుల ఘీంకారాలు, రథచక్రాల ధ్వనులు, వింటినారి శబ్దాలు, అంతకంతకూ పెరుగుతున్న గద, చక్ర, అస్త్రాల శబ్దాలు; జయ జయ నినాదాల ఘోషలు, భేరీశబ్దాలు, తప్పెట్లు మొదలైన వాద్యాల శబ్దాలు భయంపుట్టించే రీతిలో విజృంభించి, పైకి ఎగశాయి. అవి బ్రహ్మాండాన్ని బ్రద్దలు గొట్టే రీతిలో ప్రతిధ్వనించాయి.

ఆ సమయంలో ఇంకా - జరాసంధ శ్రీకృష్ణుల సైన్యం ఒకదానినొకటి ఎదుర్కొన్నాయి. రౌద్రంతో రగిలిపోతున్నాయి. అవి రెండూ ప్రళయకాలంలోని సముద్రాలవలె, నింగికి ఉప్పాంగిపోయి, పోరాడసాగాయి.

అక్కడి యోధులు పరాక్రమవంతులు. మహారణ్యాలనుండి వెలువడి మదమెక్కిన మహాగజాలవలె రేగిపోతున్నారు. ఉత్సాహంతో మీదికి ఎగసి దూకే సింహాలలాగా పోరాడుతున్నారు. మునుపెప్పుడూ చూడని శరభాల మాదిరిగా పోరాడారు. 

భయం కలిగించే గండభేరుండ పక్షులా ఇవి అనిపించేలా తమతమ సైన్యానికి చేరి రకరకాలుగా పది, నూరు, వేయి మంది గుంపులై పోరుతున్నారు. వాళ్లు కులపర్వతాల గుహలలో నిండే విధంగా సింహనాదం చేస్తున్నారు, అరుస్తున్నారు, అట్టహాసాలు చేస్తున్నారు.

తెరపి లేకుండా శత్రువీరులను వెతికి పట్టుకుంటూ, పటహ, కాహళ, భేరీ, శంఖాలవంటి యుద్ధవాద్యాల ఘోషకు పొంగిపోతున్నారు. గర్వంతో ఉబ్బిపోతున్నారు. గదలతో కొట్టి చంపుతున్నారు. బాణాలను వేస్తున్నారు. రాతిగదలతో ఒత్తుకొంటున్నారు. రోకళ్లతో మొత్తుకొంటున్నారు. ఈటెలతో గుచ్చి ఎత్తుతున్నారు. కత్తులతో ముక్కలు చేస్తున్నారు.

చక్రాలతో తునకలు చేస్తున్నారు. శస్త్రాలతో తఱిగిపోస్తున్నారు. విచిత్రమైన రీతుల్లో సంచరిస్తున్నారు. శత్రువుల ఆయుధాలను అట్లాగే తిప్పి కొడుతున్నారు. చురకత్తులతో పొడుస్తున్నారు. రకరకాలుగా విజ్బంభీంచి సైనిక వీరులు వీరత్వం చూపుతున్నారు. 

రథచక్రాల శబ్దాలు ఆకాశాన్నంటాయి. రవంత ఎడమివ్వకుండా వచ్చే రథచక్రాల కిందపడి శత్రువీరులు నలిగిపోయారు. రకరకాల ఆయుధాల ప్రయోగాలవల్ల శత్రువులను చీల్చిపడేశారు. ఏనుగులు శత్రువుల బాణవర్షాలకు చెదరడం లేదు. దుర్భరమైన వర్షం కురుస్తున్నప్పటికీ చెదరని కొండలు ఎలా నిలబడతాయో, ఆ విధంగా - బాణవర్షాలకు నిలకడగా నిలిచాయి - అవి. 

అలా ఉండి, యమదండాలవంటి తమ తొండాలను సాచి, రథాల నొగలచివరలను అవలీలగా పట్టి, కిందపడేసి ముక్కలుగా విరుస్తున్నాయి. గిరగిరా తిప్పి పడేస్తున్నాయి. వీరభటులను బంతులవలె విసిరి పడేస్తున్నాయి. దంతాలతో కుమ్ముతున్నాయి. గుర్రాలను చీల్చివేస్తున్నాయి. 

తమకు తోచినట్లు విచ్చలవిడిగా తిరుగుతున్నాయి. ఇక గుర్రాల సంగతి చూస్తే - అవి ఇంద్రుడి వజ్రాయుధపు అంచుల దెబ్బలనుంచి తప్పించుకున్న రెక్కలున్న కొండలవలె - కవచాలతో ఉన్నాయి. భయంకరంగా సకిలిస్తున్నాయి.

మనసుకు ఎంతవేగం ఉందో అంత వేగంతో అవి పరుగులెత్తగలవిగా ఉన్నాయి. రౌతులు వాటిని ఉసికొలిసి, ఉరుకెత్తిస్తున్నారు. వాటి డెక్కల దెబ్బలకు దుమ్ము తెరలతెరలుగా లేస్తూ ఉంది. ఆ ధూళిపటలంతో చీకట్లు వ్యాపిస్తున్నాయి.

ఆ చీకట్లను తమకత్తుల వెలుగుతో నివారిస్తూ రౌతులు దూకుతున్నారు. శత్రువుల వ్యూహాలను తిప్పికొడుతున్నారు. రకరకాల పద్ధతులతో శత్రులను ఎదుర్కొంటున్నారు. ఇలా సమరం భీకరంగా ఉంది. అక్కడ

శ్రీకృష్ణునివైపున రథాలు విరిగిపోయాయి. గుర్రాలు తెగిపడ్డాయి. ఏనుగులు నేలకూలాయి. పదాతిదళం కుప్ప కూలింది. రక్తం ప్రవాహంగా పారింది. తలలు తెగిపడ్డాయి. శరీరాలు కూలిపోయాయి. ఆభరణాలు పొడిపొడి అయిపోయాయి.

రాజా! యాదవసైన్యం భయపడిపోయింది. వీరులంతా కుప్పకూలిపోయారు. గుర్రాలు, ఏనుగులు చచ్చిపడ్డాయి. రథాలు ముక్కలై పోయాయి. గెలుపు అనేదే లేకుండా యాదవసైన్యం చెల్లాచెదరైపోయింది.

'అటు బలరాముడు మహాయోధులలో మొదటివాడు. ఇటు శ్రీకృష్ణుడేమో లోకోత్తరమైన భుజబలసంపద ఉన్నవాడు. ఇలాంటి ఇద్దరు మహావీరులను ఈ రోజు జరాసంధుడు ఎదుర్కొని నిలబడడం, వాళ్ల సైన్యాలను తరిమికొట్టడం ఆశ్చర్యంగా ఉంది' అనుకొంటూ నగరంలోని స్త్రీలు మేడలమీదనుండి చూస్తూ ఎంతగానో దుఃఖించారు.

ఇలాగ తన సైన్యం భయంతో పరిగెత్తి పోవడాన్ని శ్రీకృష్ణుడు గమనించాడు. యుద్ధం చేయాలని విజ్బంభించాడు. దిగజాల తొండాలలాంటి తన చేతులను చాచాడు. బ్రహ్మాండభాండం బ్రద్దలయ్యేలా పాంచజన్య శంఖాన్ని పూరించాడు. అది దట్టమైన పిడుగుల మ్రోతలాగా ఉంది. 

అతడు ధరించిన నెమలిపింఛం రంగులీనుతున్న హరివిల్లులా ఉంది. అతడి హస్తలాఘవం, ధనుస్సును పట్టి బాణాలను ఎపుడు కూరుస్తున్నాడో, ఎపుడు నారి లాగుతున్నాడో, ఎపుడు బాణాలను వదులుతున్నాడో తెలియరాకుండా జరిగిపోతూంది.

సూర్యుడిచుట్టూ ఒక వలయం ఉండి, తేరిపారచూడడానికి వీలుకానట్లుగా, అతనిధనుస్సు మెరిసిపోతూ ఉంది. దిక్కుల చివర్లలో ఉండే ఏనుగుల చెవులకు భయం కలిగిస్తూ అతని అల్లె  త్రాళ్లు గర్జిస్తున్నాయి. రథాలకు కట్టిన గుర్రాల గిట్టల తాకిడికి ధూళి ఆకాశానికి రేగుతూ ఉంది. 

ఆ ధూలి కమ్మి చీకటి ఏర్పడుతూ ఉంది. శ్రీకృష్ణునియుద్ధకళానైపుణ్యానికి నారదుడు మురిసిపోయాడు. నిలబడి, నిక్కి చేతులెత్తి నాట్యం చేశాడు. అలా చేస్తున్న హస్తవిన్యాసం నెమళ్లు చేస్తున్న తాండవ నృత్యంలా ఉంది. 

అందమైన రథచక్రాల ధ్వనికి భయపడి. వీరులు ఏనుగుల కుంభస్థలాల మీదికి ఒరిగిపోతున్నారు. అదెలా ఉందంటే, నెమళ్ల అరుపులకు ఉలికి పడిన కాముకులు యువతుల కుచకుంభాల మీదికి వాలిపోతున్నట్లుంది.

ఎందరెందరో రాజులు మరణించారు. వాళ్లరక్తం తాగడానికి పిశాచాలు గుంపులు కట్టాయి. 'వాన, వాన' అని కేరింతలు కొడుతూ చాతకపక్షులు వాననీటిని తాగినట్లు పిశాచాలు రక్తం తాగుతున్నాయి. తిరుగులేని యుద్దాన్ని ప్రేరేపించిన బలరాముడు వానరాకకు కారణమైన చల్లగాలి అయ్యాడు. 

ప్రళయకాలం చివరలో కురిసే నీలిమబ్బులవంటి వన్నెతో వెలిగే శ్రీకృష్ణుడు శత్రువుల చతురంగబలాల దేహాలు అనే పొలాలమీద లెక్కలేనన్ని దివ్యశరాల వర్షాన్ని కురిపించాడు. ఆ సమయంలో తెరిపిలేకుండా కురుస్తున్న శస్త్రాస్త్రాలు ఒక దానికొకటి తగిలి నిప్పురవ్వలు ఎగురుతున్నాయి. 

అవి వానాకాలంలో ఎగిరే మిణుగురుపురుగులవలె ఉన్నాయి. బాణాల దెబ్బకు వీరుల కిరీటాలలోని పద్మరాగమణులు ముక్కలై పడుతున్నాయి. ఎర్రని ఆ మణుల శకలాలు ఆరుద్ర పురుగులవలె ఉన్నాయి. పదునైన బాణాలు ఏనుగుల కుంభస్థలాలను చీల్చేస్తున్నాయి. ఆ కుంభ స్థలాలనుంచి రాలుతున్న ముత్యాలు వడగళ్లవలె ఉన్నాయి. 

అర్ధచంద్రాకారపు బాణాల తాకిడికి కాళ్లు తెగిన వీరులు 'కృష్ణా, కృష్ణా ఆగు' అని అరుస్తూ కుప్ప కూలిపోతున్నారు. వారు రైతుచేతిలోని గండ్రగొడ్డలితో నరికితే కూలిపోతున్న పెద్దమానులవలె ఉన్నారు. పదునైన బల్లెముల దెబ్బకు నోరు అనే గుహలనుంచి రాలిపడుతున్న దంతాలు, జాజిపూల గుత్తులవలె ఉన్నాయి. 

ఏనుగులపై వాడి బాణాలు కురిసి కొత్త కొత్త గాయాలవుతున్నాయి. వాటి నుంచి రక్తం ప్రవహిస్తూ ఉంది. ఆ దెబ్బలకు తిరుగజాలక కుప్పకూలి ప్రాణాలు వదలుతున్నాయి. అవి సెలయేళ్లతో ఉండే పెద్ద కొండలవలె కనిపిస్తున్నాయి. వీరుల చేతులు తెగి నేలమీదపడ్డాయి. 

ఆ చేతులు పాములవలె ఉన్నాయి. ఆ చేతులతో పాటు పడిన కంఠాభరణాలు పాముపడగలతో ఉన్న మొగలిపూలవలె ఉన్నాయి. ప్రళయకాలంలో సముద్రం చేసే కల్లోలశబ్దంవలె యుద్ధభేరీస్వనాలు మోగుతున్నాయి. అవి అతిదారుణమైన కప్పల బెకబెకలవలె ఉన్నాయి. 

భయంకరమైన బాణాలతో నరకబడ్డ చతురంగ బలాల మెదడు బురదగా ఉంది. రక్తం కాలువలు కట్టి ప్రవహించింది. ఆ ప్రవాహంలో పొడవైన చేతులు పాములవలె ఉన్నాయి. కపాలాలు తాబేళ్లవలె ఉన్నాయి. తలవెంట్రుకలు నాచువలె ఉన్నాయి. అరచేతులు చేపలవలె ఉన్నాయి. 

గుర్రాలు మొసళ్లవలె ఉన్నాయి. ఏనుగులు ద్వీపాలవలె ఉన్నాయి. తెల్లగొడుగులు నురుగుల్లా కనిపిస్తున్నాయి. వింజామరలు రాజహంసలవలె ఉన్నాయి. ఆభరణాలపొడి ఇసుకతిన్నైలవలె ఉంది. అప్పుడు ఇలా జరిగింది.

బలరాముడు నీలమైన వస్త్రాన్ని ధరించాడు. అది కైలాసపర్వతాన్ని ఆవరించుకున్న నీలిమేఘంవలె ఆయన నడుముపై అందంగా ఉంది. ఆయనచేతులు చిగురాకులవలె ఉన్నాయి. ఆ చేతులకు బంగారు కంకణాలు ఉన్నాయి. దానిపై రత్నాలు పొదుగ బడ్డాయి.

ఆ బంగారు వన్నె రత్నాల వెలుగు దిక్కుల చివర్లకు వ్యాపిస్తున్నాయి. పద్మంలాంటి ఆయన ముఖంపై చిరునవ్వు కదలాడుతూ ఉంది. కోపంతో చెలరేగి బరువైన, బలమైన ఇనుప రోకలితో అతివేగంగా శత్రువుల ప్రాణాలను హరించాడు.

ప్రళయకాలంలోని యముడివలె బలరాముడి కన్నుల్లో నిప్పురవ్వలు ఎగసిపడుతున్నాయి. అతని చేతిలో నాగలి ఉంది. అది ఆయుధం, దానిపై బంగారుతోనూ, రత్నాలతోనూ వలయాలు చుట్టబడి ఉన్నాయి. అవి వెలిగిపోతున్నాయి. అలాంటి హలాయుధంతో శత్రువుల తలలను, వక్షాలను కొట్టి చీల్చేస్తున్నాడు. 
ముక్కలు ముక్కలుగా చేస్తున్నాడు.

దీన్ని చూచి జరాసంధుడి సైన్యం వశం తప్పి చెదరిపోతున్నది. అంత బలంతో బలరాముడు దేవతల భయాన్ని పోగొడుతున్నాడు. మూడులోకాలనూ చలింపచేయగల ఆ హలాయుధుడి బలం ముందు జరాసంధుని సైన్యం తలదించి, చెదరిపోయింది.

బలరాముడు కోపంతో చెలరేగిపోయాడు. ఆయనరూపం భయంకరంగా ఉంది. శత్రువులు మూర్చపోయేలా ఉంది. ఆయన ఒక చేత్తో నాగలికర్రను పట్టి చాచి, రాజోత్తముల మెడలకు తగిలించి, వాళ్ల నగలు రాలిపడేటట్టుగా, వస్త్రాలు చెదిరేటట్లుగా దగ్గరికి లాగాడు. విజృంభించి రక్తం ఎర్రగలి పారునట్లుగా రోకలితో వాళ్లను మొత్తాడు. వాళ్ల భూషణాలు, వస్త్రాలు చెదరిపోయాయి.

బలరాముడు ఏనుగుల కుంభస్థలాలను చీల్చాడు. అందులోని ముత్యాలు బయటపడ్డాయి. రైతు నాగటి చాలులో చల్లినవిత్తనాల వరుసవలె, యుద్ధమనే పొలంలో ఆ ముత్యాలు అందంగా గోచరించాయి.

బలరాముడు నాగలిని గిరగిరా తిప్పుతూ శత్రుసైన్యాన్ని సమీపించాడు; సైన్యం బెదరి పక్కకు పోయింది, ఆశ్చర్యపడుతూంది, అతని ప్రతాపానికి సేన ఒదిగిపోతూ ఉంది, అణగిపోతూ ఉంది, దాక్కుంటూ ఉంది, రూపహీనమైపోతూ ఉంది, మరణిస్తూ ఉంది, పొర్లుతూ ఉంది, వెనక్కిమరలిపోతూ ఉంది, పారిపోతూ ఉంది.

సూర్యుడు తీక్షణమైన కిరణాలతో అన్ని దిశలనడిమిభాగాన్ని కప్పేసినట్లుగా, శ్రీకృష్ణుడుకూడా శత్రువులకు భయంకరుడై, తీవ్రశక్తిగల తన తీక్షణబాణాలతో అన్నిదిశలనడిమిభాగాన్ని నింపేశాడు.

శ్రీకృష్ణుడు అలా విజృంభించడంతో, పొడవైనబాణాలు గుచ్చుకుని ఒక్కసారిగా పదిమంది, ఐదుమంది కుప్పగా కూలుతున్నారు. కొంతమంది తలలు తెగి నేలమీద పడుతున్నారు. అలాంటివారు మునుపు తాము చూచినవాళ్లను గాయపరచి కూలిపోతున్నారు. 

కాళ్లు తెగి పడుతున్నారు. చేతులతో పోరాడి, అవి కూడా తెగిపోగా, మరణిస్తున్నారు. గాయాలనుండి రక్తం చిమ్ముతూ ఉండగా కొంతమంది సెలయేళ్లతో కూడిన కొండలవలె ఉన్నారు. 

అన్నదమ్ములు, కొడుకులు, స్నేహితులు, బంధువులు పరువెత్తి పోతున్నారు. కొందరు అడ్డం వచ్చి చచ్చిపోతున్నారు. గుర్రాలు, ఏనుగులువంటి వాహనాలు కుప్పకూలగా, కొందరు వెంటనే వేరే వాహనాలెక్కి ఎదిరించి మరణిస్తున్నారు.

ఇంతేకాకుండా ఇంకా

కొంతమంది శరీరాలు తెగి నేలమీదపడినా పొగరుగా వదరుతున్నారు; 'కృష్ణా, ఈ శరీరాలను విడిచి చచ్చినంత మాత్రాన మాకు నష్టమేముంది? గెలుపు నీకు దక్కదు; మేము దేవతలమై నిన్ను వైకుంఠంలో ఓడిస్తాము - అంటూ పలుకుతున్నారు.

ఈ విధంగా

పరీక్షిన్మహారాజా! ఏమని చెప్పగలను? ప్రళయకాలంలో సముద్రం లెక్కించడానికి వీలుకానంతగా ఎలా పొంగుతుందో, అలా జరాసంధుడి సైన్యం కమ్ముకుంది. అది భయంకరంగా ఉంది. 
బలరామకృష్ణులు ఇద్దరే విజృంభించిన వీరత్వంతో ఆ సైన్యం యొక్క అంతుచూశారు.

లోకాలను పుట్టించడం, వాటిఉనికిని కాపాడడం, నాశం చేయడం అనే పనులను శ్రీమహావిష్ణువు అవలీలగా చేయగలడు. అలాంటి మహాశక్తిమంతుడికి శత్రువులను చంపడం పెద్ద విషయమా? అయినా, ఆయన మనిషిగా పుట్టినందువల్ల కావ్యాల్లో అలా ప్రశంసలు పొందినాడు.

ఆ సమయంలో ఇలా జరిగింది.

పాపాలు చేసేవాళ్లు అల్లలాడి పోతుండగా బలరాముడు వేగంగా చేతులను తిప్పుతూ భయం కలిగిస్తూ విజృంభిస్తున్నాడు. శత్రువుల రథాలనూ, ధనువులనూ, గుర్రాలనూ, నాగలి దెబ్బలతో కుప్ప కూలుస్తున్నాడు. ఒక మహాసింహాన్ని మరో మహాసింహం మెళకువతో బలసమృద్ధితో పట్టుకున్నట్లుగా, పొగరెక్కి కన్నూమిన్నూ కానని జరాసంధుణ్ణి బలరాముడు పట్టుకున్నాడు.

ఈ విధంగా పట్టుకుని

భయం కలిగించేటంతటి బలమున్న బలరాముని శౌర్యానికి శత్రువులు చెల్లాచెదరై భయపడి పారిపోయారు. బలరాముడు జరాసంధుణ్జి ఎత్తిపొడుపు మాటలతో కిందపడవెేసి లాగి, భయంకరమైన పిడికిటిపోటు పొడిచాడు. ఆ దెబ్బకు వాడిప్రాణం కంఠంలో నిలిచింది. 

భూభారాన్ని తగ్గించాలనే ఆసక్తి ఉన్నవాడు, తర్వాత జరగాల్సిన పనుల గురించి ఆలోచించినవాడు అయిన శ్రీకృష్ణుడు ఇపుడే ఈ జరాసంధుణ్జి చంపరాదు. వీడితో ఇంకా కొంతపని ఉంది అనుకొని వాణ్ణి చంపే ప్రయత్నాన్ని మాన్పించి ఇలా అన్నాడు.

రాజా! జరాసంధా! దీనికి నీవేమీ ఏడువవలసిన అవసరం లేదు. వెళ్లు. నీ సైన్యసమూహాన్ని తీసుకుని రా! నీ మనసులో దిగులు తీరిన తరువాత రా! వచ్చి, శత్రువులను శిక్షించు. అలా కాని పక్షంలో భూమిపైనా, స్వర్గంలోనూ తిరిగే జనమంతా మెచ్చుకునేలాగా నీ ప్రతాపాన్ని చూపించి, నీ తలపగిలి మెదడులోని మాంసఖండాలను పిశాచాలు తినేలా నీ శరీరాన్ని వదిలిపెట్టు. అది చేయదగిన పని.

అలా నవ్వుతూ జరాసంధుణ్ణి శ్రీకృష్ణుడు విడిచి పుచ్చాడు. జరాసంధుడికి చెప్పరాని తడబాటు, విసుగు, సిగ్గు మనసులో అల్లుకున్నాయి. ముఖం చూపలేక పోయాడు. కోపమూ, వంచనా రెండూ పెనవేసుకొన్నాయి. తపస్సు చేసైనా సరే వీళ్లను జయిస్తాననుకొన్నాడు.

పారిపోతున్న రాజులను కలుసుకుని అతడు వెనుతిరిగి పోయాడు. ఆ సమయంలో దేవతలు బలరామకృష్ణులమీద పూలవాన కురిపించారు. మధురానగరంలోని పౌరులు, వందిమాగధులు వారిని కీర్తించారు.

వీణ, వేణువు, మద్దెల, శంఖం, దుందుభి వంటి వాద్యాల సందడిని వింటూ, కస్తూరి కలిపిన నీళ్లతో శుభ్రంచేసిన వందల కొద్దీ వీథులుకలది, రకరకాలచిత్రమైనజండాలతో అలంకరింపబడింది, బంగారుతోనూ, రత్నాలతోనూ నిండిన జయస్తంభాలకు తోరణాలు కట్టబడింది, వేదనాదాలతో ధ్వనించేది, జనసమ్మర్దముండే గోపురద్వారం కలది అయిన మథురానగరంలో బలరామకృష్ణులు ప్రవేశించారు.

'శత్రువులు వెల్లువలాగా ఉబికి వస్తుంటే, ఆ శత్రువీరులనందరినీ జయించి, నగరానికి తిరిగి వస్తున్నారు. మహా బలవంతులైన ఆ బలరామకృష్ణులను చూద్దాం రండి అని ఆ పురస్త్రీలు ఎత్తెన మేడల నెక్కి ఆ ఇద్దరిమీద చిగురాకులను, పువ్వులను, పేలాలు, సేసలను చల్లినారు.

కాల యవనుండు శ్రీకృష్ణుని మీద దండెత్తి మథురాపురమును ముట్టడి వేయుట


నిత్య స్తోత్రావళి

నిత్య పారాయణ శ్లోకాలు

స్తోత్రాలు

పంచాంగం

No comments:

Post a Comment

rukmini kalyana katha praarambhamu - రుక్మిణీ కల్యాణ కథా ప్రారంభము

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము -  రుక్మిణీ కల్యాణ కథాప్రారంభము ఓ పరీక్షిన్మహారాజా! మునుపు బ్రహ్మదేవుడు ఆజ్ఞాపించడం వల్ల రైవతుడనే రా...