శ్రీకృష్ణుండు రజకుని జంపి వాయకసుదాము లొసంగు పూజల నంగీకరించి మేలొసంగుట
ఓ రజకకులశిరోమణీ! మేము మీ రాజుగారినగరానికి అతిథులమై అరుదెంచాము. మా మందలో మాకు ధరించడానికి మంచిగుడ్డలు లేవు. నీ మూటలో ఉతికిన అందమైనబట్టలు ఉన్నాయి. మేము రాజుగారికి మేనల్లుళ్ళం. ఆ వస్త్రాలు మాకు ఇవ్వు. నీకు మేలు కలుగుతుంది.
శ్రీకృష్ణుడు అలా అడిగిన మీదట ఆ చాకలి కోపంతో ఇలా అన్నాడు.
ఏమిరా బాలా! ప్రభువుగారివస్త్రాలు మీ కివ్వమంటారా? ఇది న్యాయమా? మీరు ఆ వస్త్రాలు ధరించడానికి అర్హులా? పాలు, నెయ్యి, పెరుగు మెక్కి తలకొవ్వి ఇలా కూశారు. కాకపోతే గొల్లలైన మీకు ఇలాంటి మాటలు నోటికెలా వస్తాయి? అయ్యో! కంస మహారాజుగారి ఆగ్రహానికి గురియై నీవు ప్రాణాలు పోగొట్టుకుంటావు సుమా!
ఓ గొల్లపిల్లవాడా! మా రాజుగారిసొమ్ము అంటుకోవడానికి ఏ రాజులైనా భయపడతారు. నీకింత వేళాకోళంగా ఉందా? రాజులకు రాజైన కంసునిరాజ్యంలో నీకింత రాజసమా? తొలగిదూరంగా పో!
చాకలివాని మాటలు విని శ్రీకృష్ణుడు కోపించి
ధీరుడైన శ్రీకృష్ణుడు - బీరంతో రెచ్చినవాడూ, పొగరుబోతూ, తెలివిమాలినవాడూ అయిన ఆ చాకివాణ్ణి భయంకరమైన తన ముంజేతితో తల ఊడిపడేటట్లు కొట్టాడు. దీన్ని చూచి పురవాసులగుండెలు పగిలిపోయాయి.
ఇలా నేల గూలిన చాకలిని చూచి వానిమనుషులు బట్టలు అక్కడ వదలి భయంతో పరుగెత్తిపోయారు. అంతట బలరాముడూ, శ్రీకృష్ణుడూ తమకు కావలసిన వస్త్రాలు కట్టుకొని కొన్నిటిని గోపకులకిచ్చి ముందుకు సాగాగా
ఆ సమయంలో ఒక నేత పనివాడు ఆ దారిలో వస్తున్న వసుదేవునికుమారులైన రామకృష్ణులను చూచి, వారు మెచ్చుకొనేటట్లు పలురంగులు కలిగి మిక్కిలి మెత్తనివైన వస్త్రాల్ని నగల్ని పరమ సంతోషంతో ఇచ్చాడు
శూరులైన రామకృష్ణులు వాటిని దయతో స్వీకరించి, అలంకరించుకొని సింగారించబడిన దిగ్గజాల గున్నలమాదిరి ప్రకాశించారు. అంతట మాధవుడు ఆ చేనేత పనివాని పరిచర్యకు పరమసంతుష్టుడై అతనికి ఐశ్వర్యాదులను అనుగ్రహించి, దేహావసానంలో సారూప్యమనే ముక్తిని ప్రసాదించాడు.
అనంతరం రామకృష్ణులు పూలదండలుకట్టే సుదాముని ఇంటికి వెళ్ళారు. అతడు వీరిని చూచిన వెంటనే లేచి నమస్కరించాడు. చక్కగా అర్ఘ్యం, పాద్యం మొదలైన పూజావిధులతో సత్కరించాడు రామకృష్ణులకు, వారివెంటవచ్చిన వారికీ తాంబూలాలు, పూలు, గంధాలు ఇచ్చి ఈ రీతిగా అన్నాడు.
ప్రపంచానికి ఆదికారణమూర్తులై ధరణీచక్రాన్ని రక్షించడంకోసం ఇట్లా అవతరించిన మహానుభావులు మీరు. మీ రాకవల్ల నా వంశం పవిత్రమయింది. నా తపస్సు ఫలించింది. నా యిల్లు సిరిసంపదలతో నిండింది. నా కోరికలు ఈడేరాయి. నేను ఏ ప్రకారం నడుచుకోవాలి? ఏ పనులు చెయ్యాలి? నేను మీ సేవకుణ్ణి, సెలవియ్యండి.
అతిశయించిన కీర్తిచే చంద్రుణ్ణి అపహరించేవారూ, మగువల పాలిటి మన్మథులూ అయిన ఆ బలరామకృష్ణులకు సుదాముడు మిక్కిలి పరిమళంతో కూడిన పూలమాలలు సమర్పించాడు.
బలరామశ్రీకృష్ణులు సుదాముడిచ్చిన పూలమాలలతో అలంకరించుకొని, 'ఏమికావాలో కోరుకో. నీవు కోరినవరం ఇస్తాము' అని దయతో పలుకగా సుదాముడు శ్రీకృష్ణునితో ఇట్లన్నాడు.
తపస్వులకు కల్పవృక్షం వంటివాడా! కృష్ణా! కమలములవంటి నీ పాదాలపరిచర్యనూ, నీ పాదాలు పూజించే భక్తులతో చెలిమినీ, సకలప్రాణులమీద అత్యంతమైన, అపరిమితమైన దయనూ నాకు ప్రసాదించండి.
(భగవత్ప్రార్థనా పరమైన భాగవత పద్యాలలో "ఎవ్వనిచే జనించు", “నీ పాదకమలసేవయు” బహుళవ్యాప్తిలోఉన్న ఆణిముత్యాలు. అసాధువులైనవారు భౌతిక సంపదలు కోరుతారు. సుదాముడు మహాత్ముల కోవలోనివాడు గనుక స్వామి పదసేవనే కోరుకున్నాడు.)
ఇలా వేడుకొన్నవన్నీ అనుగ్రహించి, ఇంకా శ్రీకృష్ణుడు సుదాముడికి బలం, ఆయుస్సు, తేజం, యశస్సు, సిరిసంపదలు కరుణించి, వానిఇంటినుండి బలరామసహితుడై బయలుదేరి రాజవీధిలో సాగిపోయాడు.
కమలములవంటి కన్నులుగల శ్రీకృష్ణుడు పలురకాల మైపూతలుంచిన పాత్ర పట్టుకొని వస్తున్న కుబ్జను చూచాడు. దానిముఖకాంతిముందు పద్మం తలవంచుకుంటుంది.
కుబ్జను చూచి శ్రీకృష్ణుడు ఇట్లన్నాడు
ఓ పద్మాక్షీ! నీవు ఎవ్వరిదానవు? ఈ కలపములు ఎవరికోసం తీసుక వెళుతున్నావు? నీ పేరేమిటి? ఈ మైపూతలన్నీ మాకివ్వు. అలా ఇస్తే నీవు చక్కగా ప్రకాశిస్తావు.
శ్రీకృష్ణుణ్ణి మాటలకు కుబ్జ ఇలా బదులాడింది.
ఓ సుందరాంగుడా! నీవు బలే అందగాడివిలే. పరిహాసవచనాలతో నన్ను వేధించకు. లోకంలో అందరికీ అందాలు ఎక్కడినుండి వస్తాయి? నన్ను త్రివక్ర అంటారు. నేను కంసుడిదాసిని. అచ్చమైన మైపూతలు చేయడమే నా నేర్చిన విద్య. నన్ను రాజు మిక్కిలి మెచ్చుకుంటాడు. మీరు ఈ చందనాదివిలేపనాలు పూసుకొనండి.
ఇలా పలికి పడుచువారైన ఆ బలరామకృష్ణుల నెమ్మేనులు, నవ్వులు, చూపులు, పలుకులు తనమనస్సును కరగించగా ఆ కుబ్జ ప్రేమతో వారికి మైపూతలు ఇచ్చింది.
ఈ విధంగా కుబ్జ ఇచ్చిన విలేపనాలు అన్నింటినీ వెన్నుడు తన ఒంటినిండా పూసుకొని ఆమెపట్ల ప్రసన్నుడయినాడు. మువ్వంపులుగల ఆమె దేహాన్ని చక్కనొత్త దలచాడు. కుబ్జమీగాళ్ళమీద తన అడుగులుంచి అదిమిపట్టినాడు. తనచేతి రెండు బొటన వ్రేళ్ళను దాసి గడ్డం క్రిందపెట్టి ఒడలు చక్కగా సాగునట్లు పైకెత్తినాడు. అంతలో అది వంపులు దీరి మన్మథుని సమ్మోహనాస్త్రంవలె పొలుపారింది. పిరుదులు, చనుగవ, సాంపునింపగా కుబ్జ చక్కని చుక్కై కమలాక్షుడివైపు కాంక్షతో చూచింది.
కాముకురాలైన కుబ్జహృదయం మదనుడి బాణసమూహంతో చెదరిపోయింది. ఆమె మన్మథాకారా! నా యింటికి దయచెయ్యి అంటూ పద్మనాభునిపయిపంచె చెంగుపట్టుకొని లాగింది.
ఆ కాముకురాలు అలా లాగగా కృష్ణుడు బలభద్రుణ్ణి జూచి, నవ్వుతూ ఆమెతో ఇలా అన్నాడు. ఓ చంద్రముఖీ! నా వచ్చిన పని సాధించిన తర్వాత నీ గృహానికి వస్తాను. నేడు కోపించకు.
ఇలా అంటూ ఆమెను సాగనంపి కృష్ణుడు అంగడి వీధిలో వెళ్ళి వెళ్ళీ పురప్రజలిచ్చిన తమ్ములములూ, పూలదండలూ, చందనాలూ ఇంకా పలువిధాలైన కానుకలు స్వీకరిస్తూ ధనుశ్శాలకు వెళ్ళాడు. అక్కడ
ఇంద్రధనుస్సువలె మిక్కిలి గొప్పదైై, మేటి వీరులచే రక్షింపబడుతున్న దుర్భరమైన ఆ వింటిని అతడు వీక్షించాడు. రక్షకులు వద్దని అంటుండగా పక్కున నవ్వి ఉత్సాహవంతుడైనాడు.
ధైర్యానికి సాగరం వంటివాడైన శ్రీకృష్ణుడు తనచుట్టాలు మెచ్చగా ఎడమచేతితో అలవోకగా ధనుస్సును పైకెత్తాడు. తీగవంటి అల్లెత్రాటిని కొద్దిగా లాగి తగిలించి నారిని మొరయిస్తూ మదపుటేనుగు చెరకు గడను తునిమే రీతిగా జనులు చూస్తుండగా వింటిని రెండుగా విరిచి వేశాడు.
పరీక్షిన్మహారాజా! విల్లు విరిగినప్పుడు పుట్టిన చప్పుడు చెవులకు భీతి గొల్పుతూ, దిగంతరాలను పూరిస్తూ భోజభూపాలుడైన కంసుడి ధైర్యాన్ని భేదించింది.
“ఔరా! ఈ బాలు డేమాత్రం సందేహించక శౌర్యంతో ఇపుడు రాజుగారిధనుస్సు ఖండించాడు. ఇది సహించరాని సాహసకార్యం. ఇతణ్ణి పౌరుషంతో పట్టాలి” అంటూ చాపరక్షకులు కోపోద్రేకంతో వెంటనే లేచి మీదికి వచ్చారు. అంతట రామకృష్ణులు ఇద్దరూ ఆ వింటితుంటలు చేతపుచ్చుకొని వారిని పట్టి కొట్టి మట్టు పెట్టారు.
ఈ విధంగా బలరామకృష్ణులు మథురాపురంలో విహారంచేసి అక్కడినుంచి బయలుదేరి తమ విడుదులకు వెళ్ళిపోయారు. పిమ్మట
శ్రీ మహా భాగవతము
శ్రీ మహా భాగవతము ద్వితీయస్కంధము
శ్రీ మహా భాగవతము తృతీయస్కంధము
శ్రీ మహా భాగవతము చతుర్ధస్కంధము
శ్రీ మహా భాగవతము పంచమస్కంధము
శ్రీ మహా భాగవతము షష్టస్కంధము
శ్రీ మహా భాగవతము సప్తమస్కంధము
శ్రీ మహా భాగవతము అష్టమస్కంధము
శ్రీ మహా భాగవతము నవమస్కంధము
శ్రీ మహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము
శ్రీ మహా భాగవతము ద్వితీయస్కంధము
శ్రీ మహా భాగవతము తృతీయస్కంధము
శ్రీ మహా భాగవతము చతుర్ధస్కంధము
శ్రీ మహా భాగవతము పంచమస్కంధము
శ్రీ మహా భాగవతము షష్టస్కంధము
శ్రీ మహా భాగవతము సప్తమస్కంధము
శ్రీ మహా భాగవతము అష్టమస్కంధము
శ్రీ మహా భాగవతము నవమస్కంధము
శ్రీ మహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము
నిత్య స్తోత్రావళి
నిత్య పారాయణ శ్లోకాలు
స్తోత్రాలు
పంచాంగం
No comments:
Post a Comment