ఆలోచించాడు హనుమంతుడు.
ఈ వనం విధ్వంసం చేశాను.
రాక్షసయోధులు కొందరు నేలకూలారు.
ఇంక ఈ దుర్గం కూడా ధ్వంసం చేస్తే నేను వచ్చిన పని పూర్తి అవుతుంది.
అగ్నిహోత్రునికి తృప్తి కలిగేలా రాక్షస భవనాలు దహిస్తాను, అనుకుని ఒక్క అంగలో సేనాపతి ప్రహస్తుని భవనం నలుమూలలా అంటించి, మహాపార్శ్వ, వజ్రదంష్ట్ర, శుక, సారణ, జంబుమాలి, ఇంద్రజిత్తు, రశ్మికేతు, మకరాక్ష, కుంభకర్ణ, కుంభ, నికుంభాది మహావీరుల భవనాలన్నీ అగ్నికి ఆహుతి చేశాడు.
విభీషణ సౌధం ఒక్కటే విడిచిపెట్టాడు.
రావణభవనం ముట్టించి ప్రళయవేళ మేఘపంక్తులు ఉరిమినట్లు గర్జించాడు.
ఆయన నిప్పు ముట్టిస్తుంటే వాయువు తీవ్ర వేగంతో చలిస్తున్నాడు. దానితో అగ్ని మరింతగా మండడం ఆరంభించాడు. లంక అంతా అగ్ని జ్వాలలే. పెటపెట ధ్వనులతో మహాభవనాలు నేల కూలుతున్నాయి. ఆర్తనాదాలతో రాక్షసులు వీధులలో పడ్డారు. పుణ్యక్షయం కాగా భూమికి జారే సిద్ధసౌధాలవలె వున్నాయవి.
పసిపిల్లలకు పాలిస్తూన్న తల్లులు తమ బిడ్డలను గట్టిగా పట్టుకుని వీధులవెంట పరుగులు తీస్తున్నారు. సౌధాగ్రాలమీది స్త్రీలు తమ బట్టల మంటలవేడి భరించలేక క్రిందికి దూకుతున్నారు. వేడికి కరిగి రత్న మాణిక్యాలు ప్రవహిస్తున్నాయి.
క్వచి త్కింశుక సంకాశాః
క్వచిత్ శాల్మలీ సన్నిభాః ।
క్వచిత్ కుంకుమ సంకాశాః
శిఖా వహ్నేశ్చ కాసిరే ॥
ఆ మంటలు
ఒకచోట నిండుగా విరిసిన మోదుగుపూలవలె, మరొకచోట బూరుగు పుష్పాలవలె, ఇంకొకచోట కుంకుమ కాంతితో వున్నాయి.
త్రిపుర దాహదృశ్యం గోచరించింది లంకాదహనవేళ, వాయు ప్రేరితమైన అగ్నిజ్వాలలు వలయాలు తిరుగుతున్నాయి. రాక్షసుల దేహాలే అజ్యధారలుగా అగ్ని మండుతున్నది. మంటలు ఆకాశం అంటుతున్నాయి. మండి మండి ఆరిన భవనాల నుండి ధూమం వల్ల కలువల తోరణంలా వున్నది. లంక అంతా ఆర్తనాదాలతో నిండింది.
వీడు వానరుడు కాడు.
వజ్రపాణియో, త్రిన్రేత్రుడో, యముడో, వరుణుడో, రుద్రుడో, సూర్య, కుబేర, చంద్ర అగ్నులలో ఎవడో ఈ రూపంతో వచ్చి వుండాలి. కాకుంటే సాక్షాత్తూ చతుర్ముఖ ప్రజాపతికి కలిగిన ఆగ్రహం వానర రూపంతో లంకా నాశనానికి దిగి ఉంటుంది. లేకపోతే వైష్టవతేజం అవతరించి వుండాలి అనుకున్నారు రాక్షసులు.
లంక అంతా అంటించి హనుమంతుడు త్రికూటగిరి శిఖరంమీద సింహంలా కూర్చున్నాడు. ఒక్కసారి రాముని స్మరించాడు.
హనుమంతుని ఈ అద్భుత కార్యం తిలకించిన దేవ, గంధర్వ, సిద్ధ, సాధ్య గణాలు హర్షంతో అభినందించాయి.
No comments:
Post a Comment