Friday, August 28, 2026

Karaagrhavimuktulagu Rajulu Srikrishnuni Stuthinchuta - కారాగృహవిముక్తులగు రాజులు శ్రీకృష్ణుని స్తుతించుట

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - ఉత్తరభాగం -
కారాగృహవిముక్తులగు రాజులు శ్రీకృష్ణుని స్తుతించుట

అర్జునుడు, శ్రీకృష్ణుడు భీమ సేనుణ్ణి గౌరవంతో కౌగలించుకొని అతని పరాక్రమానికి ఆశ్చర్యపడి ఆనందంతో పొగడారు.

శ్రీకృష్ణుడు దయాసముద్రుడు, భక్తజనులపట్ల వాత్సల్యం కలవాడు కాబట్టి, జరాసంధునికొడుకైన సహదేవుణ్ణి ఆదరించి ఆ రాజ్యానికి అధిపతిగా నూత్నపదవి నిచ్చి స్వయంగా పట్టాభిషేకమహోత్సవం జరిపించాడు.

జరాసంధునిచేత చిక్కి చెఱసాలలలో అధికమైన దుఃఖంతో బాధపడుతూ, శ్రీకృష్ణుని పాదపద్మాలనే స్మరిస్తున్న రాజులను

శ్రీకృష్ణుడు చెఱలోనిరాజులు పంపిన బ్రాహ్మణునిమాటలు తన మనస్సున గుర్తుపెట్టుకొని ఉండడంచేత - ఆ రాజులను వెంటనే విడుదల చేయించాడు. ఆ రాజులంతా చిరకాలంగా చెరసాలలో ఉండటంచే చిక్కిపోయి రక్తమాంసాలు లేక ఎండిపోయారూ, దుమ్ము కొట్టుకుపోయిన దేహం గలవారూ, జుట్టు చిక్కులు పడి జడలు కట్టి ఉండగా, బట్టలు మాసిపోయి సంస్కారహీనమైన స్థితిలో శ్రీకృష్ణునివద్దకు వచ్చారు.

అప్పుడే వికసించిన తామరలవంటి కన్నులుగలవాడూ, సంసారబంధాలను విడిపించేవాడూ, శుభమైన ఆకారంగలవాడును, పుణ్యాత్ముడూ, కంకణాలు, భుజకీర్తులు, బంగారుఅందెలు కలవాడూ, ప్రకాశిస్తున్న వివిధ ఆభరణాలు కలవాడూ, దోషరహితుడూ, గరుడవాహనుడూ, భక్తులకు మేలైన ఉత్సాహాన్ని కలుగజేసేవాడూ, శివునిచే నమస్కరింపబడే వాడు, మేలయిన కిరీటం గలవాడు, ఇంద్రనీలంవంటి దేహంగలవాడు, మేలైన పసుపు పచ్చని పట్టుబట్ట కలవాడు, మొలనూలు దాల్చినవాడు, జగత్తునందంతట విహరించేవాడు, హారాలు వనమాల మున్నగువాటిచే ప్రకాశించేవక్షస్థ్సలం గలవాడూ, శంఖచక్రాదిఆయుధాలుగల హస్తాలుగలవాడు, వక్ష
స్థ్సలంపై శ్రీవత్సమనే గుర్తు గలవాడూ, మంచి నడవడిక గలవాడూ, దేవకీదేవి కుమారుడూ అయిన శ్రీకృష్ణుణ్ణి రాజులు చూచి

ఆ రాజులందరు మిక్కిలి సంతోషించిన మనస్సులు కలవారై అన్ని బంధాలను తొలగించుకొని, తమ తలలు శ్రీకృష్ణుని పాదకమలాలకు తాకేటట్లు సాగిలబడి మ్రొక్కి వినయంతో వంగి, చేతులు జోడించుకొని మంచికరుణగలవాడూ, సజ్జనుల దుఃఖాన్ని పోగొట్టేవాడూ, వివేకవంతుడైనవాడూ, ఆశ్రయించినవారిని పోషించడంలో గొప్పవాడూ, పాపాలను పోగొట్టేవాడూ అయిన ఓ స్వామీ! - అని

కోరిన కోరికలన్నీ తీర్చేవాడూ, పద్మం బొడ్డున కలవాడూ, పాపాలను హరించేవాడూ, సర్వాన్ని సృష్టించేవాడూ,

వేదవేద్యుడు, సేవకుల దుఃఖాలను నశింపజేసేవాడూ, సర్వప్రాణులలో వసించేవాడూ, నశించనివాడూ, మేర లేనివాడూ, శ్రీలక్ష్మీనాథుడూ అయిన నీకు మేము సర్వదా నమస్కరిస్తున్నాము.

యాదవవంశశ్రేష్ఠుడవు అయిన - ఓ కృష్ణా! క్రూరుడైన జరాసంధుని నిర్బంధంలో మేము పొందుతున్న దుఃఖతాపాన్ని నీ కరుణావలోకమనే జడివానతో పోగొట్టి నీ పాదాలను ఆశ్రయించిన మమ్మల్ని ఆదరించావు. విచారింపగా మంచివారిని రక్షించుట, చెడ్డవారిని శిక్షించుట నీ పనులుకదా! అన్నారు.

శ్రీకృష్ణా! మా విన్నపం చిత్తగింపవయ్యా! జరాసంధుడు మాకు దగ్గర చుట్టమేగాని పగవాడు కాడు. మేమును రాజ్యలక్ష్మిచేత కన్నుగానక ఉన్నవారం. ఇట్టి మా విషయాలు చెప్పే పని ఏముంది? లోకంలో దుష్టులగువారు నీటి అలలవలెను, దీపజ్వాలవలెను క్షణకాలంలో నశించే సంపదలనే గొప్పగా తలచి, ఆ సంపదలనే నమ్ముకొని పరలోకసాధనకై చేసే కార్యక్రమా లేవీ చేయడానికి ప్రయత్నించక, పరలోకసాధనకు అడ్డుపడే ఆ పరస్పరవిరోధ భావంతో ప్రజలను బాధించే ఆలోచనలతో తిరుగుతూ ఉంటారు.

లక్ష్మీనాథా! త్రైలోక్యశరణ్యా! ఓ శ్రీకృష్ణా! ఈ లోకంలోని జనులు వ్యర్థమైనకోరికలు గలవారై దప్పిగొన్నవాడు ఎండమావుల్లో నీళ్లున్నాయని భ్రమపడి త్రాగవచ్చును అనే ఆశతో ముందుముందుకు పోతున్నట్లు మెలగుతూ ఈ జన్మమనెడి సముద్రం ఆవలి గట్టును చేరలేక నశిస్తుంటారు. కాబట్టి, మరణించి ఈ లోకంలోని సుఖాలను పొందనేరని ఈ కష్టాలను మేము పడలేము. మమ్మల్ని రక్షించు.

భక్తజనులను సంసార సాగరంనుండి దాటించేవాడా! ఉదరంపై తులసి మాలలు వ్రేలాడుతూ ఉండేవాడా! ప్రపంచసృష్టికి హేతువైనవాడా! వేదాంతమార్గాన్ని చక్కగా అలంకరించే నీ అడుగుతామరలు మా మనస్సులలో శుభస్థితిని నిలచి ఉండేటట్లు చేసి, నిత్యము భక్తితో నీ పాదాలను సేవించే ఉపాయం మాకు తెలియజేయవయ్యా!

అంటూ ఈ విధంగా రక్షింపుమని తనను ప్రార్ధించినరాజులను చూచి, భక్తరక్షణశీలుడైన శ్రీకృష్ణుడు దయాంతరంగుడై ఆ రాజులతో ఇలా బదులు పలికాడు.

ఓ రాజులారా! మీరు చెప్పిన మాట నిజము. రాజ్యమదంచేత మంచిచెడ్డలు విచారించక మూఢబుద్దులై, బ్రాహ్మణులను, రాజ్యంలోని ప్రజలను మిక్కిలి బాధించడం చేతనే కదా! వేనుడు, నహషుడు, రావణుడు, కార్తవీర్యార్జునుడు అనేవారు మునుపు నశించారు. కాబట్టి, ధర్మం తప్పక పరిపాలించటంచేత వంశమూ, బలమూ, దీర్ఘాయుస్సూ, గౌరవమూ చెడకుండా ఉంటాయి. ధర్మపాలనమే సర్వాన్నీ రక్షిస్తుందని శ్రీకృష్ణుడు రాజులతో చెప్పాడు.

కావున ఈ శరీరం శాశ్వతము కాదని మీరుమీ మనస్సులలో తెలుసుకొని

ఓ రాజులారా! మీరు ధర్మం, నీత్తి, మర్యాద తప్పకుండా భూప్రజలకు సుఖాలు, సంపదలు, సమకూడేటట్లు కాపాడుతూ, విశేషాలైన యజ్ఞాలు గౌరవంతో నాకు సమర్పణగా చేస్తూ నా పాదపద్మాలను సేవిస్తూ పుణ్యాత్ములై లెస్సగా నడచుకోండి అని శ్రీకృష్ణపురమాత్మ చెప్పాడు.

అట్లు నడచుకొనిన మీరు మోక్షాన్ని పొందడమేగాక నా పాదాలయందు భక్తిగల్గినవారౌతారు అని చెప్పి శ్రీకృష్ణుడు ఆ రాజులందరికీ శుభప్రదమైన మంగళస్నానాలు చేయించి వారికి వివిధాలైన రత్నాభరణాలు, మెత్తని వస్త్రాలు, పూలదండలు, చందనాది మైపూతలు ఇప్పించి అలంకరింపచేసి మంచి భోజనతాంబూలాదులను ఇచ్చి మిక్కిలి తృప్తి పరచి వారివారికి తగినట్లు రథాలు, గుర్రాలు, ఏనుగులు వాహనాలుగా ఏర్పాటుచేసి, గౌరవించి వారివారిరాజ్యాలకు పాలకులుగా పంపాడు.

ఈ విధంగా రాజులు శ్రీకృష్ణునిచే చెరసాలలనుండి విడువబడి మిక్కిలి ఆనందంతో, మంచి సంపదలు కలుగగా వారివారి నగరాలకు వెళ్లారు.

శ్రీకృష్ణుని కల్యాణ గుణాలు సదా కీర్తిస్తూ ఎంతో స్వచ్చమైన మనస్సుగలవారై తల్లిదండ్రులు, బంధువులు, తనయులు, భార్యలు, సేవకులు ఆనందింప పద్మదళాక్షుడగు శ్రీకృష్ణుణ్ణి 

శ్రీకృష్ణుని బహువిధాలుగా స్తుతిస్తూ తమ తమ దేశాలకు వెళ్లి

ఆ రాజులు పద్మదళనేత్రుడైన శ్రీకృష్ణుడు తమకు బోధించిన ధర్మమార్గాల్లో క్రమంతప్పక నడచుకొంటూ తమ మేలైన పరిపాలనవిధానాలు ప్రకాశించగా భూమిని ఏలుతూ సుఖాలు అనుభవించసాగారు.

ఈ విధంగా శ్రీకృష్ణుడు జరాసంధుణ్ణి చంపి, ఆయనచే చెరలో పెట్టబడిన రాజులను చెరనుండి విడిపించి, భీమార్జునులు తాను జరాసంధునికొడుకైన సహదేవుడు చేసిన మర్యాదలు స్వీకరించి, అతణ్ణి రాజ్యంలో నిలిపి, అందుండి బయలుదేరి కొన్నిప్రయాణాలు చేసి, ఇంద్రప్రస్థపురానికి వచ్చి, ఆ పురద్వారంలో నిలిచి, తమ విజయగాథను తెలియపరిచేతీరులో శంఖనాదం చేయగా ఆ పట్టణంలోని జనులు జరాసంధుడు మరణించాడని సంతోషించారు. ఆ మహాధ్వని శత్రువులకు భయం కలిగేటట్టు, బంధుజనులకు ఆనందాన్ని కలిగించేటట్లు ఉంది. శ్రీకృష్ణుడు భీమార్జునులతో నగరంలోకి వచ్చి, ధర్మరాజుకు నమస్కరించి - తాము వెళ్లిన విధానం, జరాసంధుణ్ణి చంపిన పద్ధతీ, చెరసాలలోని రాజులందరను విడిపించిన విశేషాల్ని సవివరంగా తెలియజేశాడు. ఆ విషయాలు విని ధర్మరాజు శ్రీకృష్ణుని మహిమకు, తమ విషయంలో అతనికి గల భక్తి, స్నేహం, దయ మొదలైన గుణాలకు ఎంతో ఆనందిస్తూ శ్రీకృష్ణుణ్ణి చూచి ఇలా చెప్పాడు.

'ఓ శ్రీకృష్ణా! నీ అంశతో బుట్టిన వారైన రాజులు నీ ఆజ్ఞను శిరసావహించి ఎల్ల లోకాలు ఏలుటకు సమర్దులై ఉన్నారు. అట్టి నీవు ఒక రాజు చెప్పిన పని చేయటం నీ మాయ కాక నిజమా? ఏక స్వరూపుడవు, అద్వితీయుడవు, నాశం లేనివాడవు అయిన నీ ప్రకాశానికి ఎప్పటికైన హాని ఉందా? లేదు. జ్ఞాన స్వరూపుడవు, పుండరీకాక్షుడవు, వేదాలచే తెలియబడేవాడవు, లోక రక్షకుడవు అయిన నీ అడుగులను నమ్మి కొలిచే వారికి తాను, ఇతరుడు అనే భేదబుద్ధి ఉంటుందా! (ఉండదు?)

ధర్మరాజు చేసెడి రాజసూయమునందు శ్రీకృష్ణుండు శిశుపాలుని వధించుట







No comments:

Post a Comment

Sri Krishnudu Danthavaktruni Vadhinchuta - శ్రీ కృష్ణుడు దంతవక్త్రుని వధించుట

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - ఉత్తరభాగం -  శ్రీ కృష్ణుడు దంతవక్త్రుని వధించుట ఈ ప్రకారంగా శ్రీకృష్ణుడు కపటియైన సాల్వుణ్ణీ, ఆతనిసౌభకవిమానాన్నీ...