Friday, August 28, 2026

Dharmaraju Chesedi Rajasuyamunandu Srikrishnundu Sisupaluni Vadhinchuta - ధర్మరాజు చేసెడి రాజసూయమునందు శ్రీకృష్ణుండు శిశుపాలుని వధించుట

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - ఉత్తరభాగం -
ధర్మరాజు చేసెడి రాజసూయమునందు శ్రీకృష్ణుండు శిశుపాలుని వధించుట


ధర్మరాజు జరాసంధుణ్ణి జయించి భీమార్జునులతో ఇంద్రప్రస్థపురానికి వచ్చిన శ్రీకృష్ణుని గొప్పతనాన్ని పలుతెరగుల ప్రస్తుతించాడు. అటుపిమ్మట ఆ దేవదేవునిఅంగీకారంతో, వేదవిదులూ, బ్రహ్మవేత్తలూ అయిన బ్రాహ్మణులను రాజసూయయాగానికి ఋత్విక్కులుగా (నిర్వాహకులుగా) స్వీకరించాడు.

ధర్మరాజు - వేదవ్యాసుడు, కశ్యపుడు, భరద్వాజుడు, వసిష్ఠుడు, విశ్వామిత్రుడు, గౌతముడు, చ్యవనుడు, జైమిని, ధౌమ్యుడు, పరాశరుడు, వైశంపాయనుడు, పరశురాముడు మొదలుగాగల మహర్షి పుంగవులను, గురువులయిన కృపాచార్య, ద్రోణాచార్యులను, కురువృద్దులయిన భీష్మవిదురులను, పెదతండ్రి ధృతరాష్ట్రుని, ఆయన పుత్రులను, కులపెద్దలు మొదలైన సమస్తబంధువులను, బ్రాహ్మణ, క్షత్రియ వైశ్య జనులలో ప్రముఖులైనవారలను రాజసూయయాగానికి సాదరంగా ఆహ్వానించాడు.

ధర్మరాజుచే ఆహ్వానితులైన ఆ ఋషులు, గురువర్యులు, బంధుజనులు, పురప్రముఖులు మొదలైనవాళ్లంతా ఆనందాతిశయంతో రాజసూయయాగం జరిగే ప్రదేశానికి తరలివచ్చి, అక్కడ జరుగుతున్న కార్యక్రమాలు కుతూహలంతో తిలకిస్తూ ఉన్నారు. ఆ సందర్భంలో ఋత్విజులైన విప్రులు(యుధిష్ఠిరునికి యజ్ఞదీక్షను ఇచ్చేకార్యాన్ని చేపట్టారు)

రాజసూయ యాగం నిమిత్తమై ఉద్దేశించిన ప్రదేశంలో ఋత్విక్కులైన బ్రాహ్మణులు బంగారునాగళ్లతో బాగా దున్ని శుద్ది కావించారు. అనంతరం బంగారు పరికరాలతో విధి విహితంగా ధర్మరాజును యజ్ఞకార్య దీక్షితుణ్ణి కావించారు.

(యజ్ఞదీక్షితునికి నిత్యం నిర్వహింపవలసిన సంధ్యావందనాది కార్యాలతోపాటుగా బ్రహ్మచర్య నియమం, ఆహార నియమం, భూమిపై పరుండటం లాంటి నియమాలు నిర్ధేశింపబడి ఉంటాయి. 'యజమాని' అయిన వ్యక్తి యజ్ఞకార్యనిర్వహణకు సంకేతంగా దీక్షాకంకణాన్ని దీక్షావస్త్రాలను ధరించి ఉండాలి, ఆ యజ్ఞం పరిసమాప్తి అయ్యేంతవరకు అతడు యజ్ఞవాటికను విడిచి వెళ్లకూడదు. 'యజ్ఞం' పవిత్రమయిన కార్యం కాబట్టి, యజ్ఞం చేసేవారూ, చేయించేవారూ నియమనిష్ఠలతో ఉండాలి - అనేది సారాంశం.)

ఈ విధంగా బ్రాహ్మణులు నియమానుసారంగా ఆయా సముచిత కార్యాలను నిర్వహిస్తూ ఉండినారు. ఆ సమయంలో ధర్మరాజు

ధర్మరాజు రాజసూయయాగంలో రాజులందరూ తనకు కానుకలుగా సమర్పించే ధన కనక వస్త్ర వాహనాది వస్తు సమూహాల నన్నింటినీ స్వీకరించే నిమిత్తంగా పెదతండ్రి కొడుకుల్లో పెద్దవాడైన సుయోధనుణ్ణి నియమించాడు

ధర్మరాజు యాగానికి విచ్చేసిన అందరినీ తగినట్లు ఆదరించేందుకు అనువుగా, తనకు ఆప్తులైనవారిని ఈ కింది విధంగా ఆయా ముఖ్య బాధ్యతల్లో నియమించాడు.

యాచకబృందాల కోరికలను తీర్చటానికి కర్ణుణ్ణి, చతుర్విధాలైన ఆహారపదార్థాలను కమ్మగా వండించటానికి భీముణ్ణి, శ్రీకృష్ణుణ్ణి సేవించటానికి అర్జునుణ్ణి, దకిణలు మున్నగువాటికోసం ధనాన్ని తెప్పించటానికి నకులుణ్ణి, దేవ బ్రాహ్మణులను, గురువులను, పెద్దలను అనుగుణంగా అర్చించి గౌరవించటానికి సహదేవుణ్ణి, సమస్త ప్రజానీకాన్ని రుచికరమైన ఆహారపదార్థాలతో సంతోషింపచేయడానికి ద్రౌపదీదేవిని నియమించాడు.

అలా ధర్మపుత్రునియాగం కొనసాగుతూ ఉండగా

అప్పుడు దేవేంద్రుడు మొదలైన దిక్పాలకులూ, బ్రహ్మాది దేవతలూ, కిన్నర సిద్ధ సాధ్య గరుడ చారణాది దేవబ్బందాలూ ధర్మజుడు నిర్వహిస్తూ ఉండిన యజ్ఞాన్ని చూచి, 'పూర్వం ఏ రాజన్యుడు కూడా ఇంత గొప్పగా రాజసూయాన్ని చెయ్యలేదు' - అని ఎంతగానో మెచ్చుకొన్నారు.

అంతేగాక, లక్ష్మీనాథుడైన శ్రీకృష్ణుని పాదపద్మాలను భక్తితో సేవించే అదృష్టంకలవాళ్లకు (ధర్మరాజాదులకు) పొందలేని సంపదలేవీ ఉండవు కదా! - అని బ్రహ్మాదిదేవతలు, దిక్పాలకులు, తదితరదివ్యగణాలూ పెక్కురీతుల ప్రశంసించారు. 

(ధర్మరాజు నిర్వహిస్తున్న రాజసూయయాగంయొక్క అపూర్వవైభవానికి కారణం - ఇందులో చక్కగా ఊహింపబడింది. శ్రీకృష్ణుని యెడల ధర్మరాజుకుగల అచంచలభక్తి అందరికీ తెలిసిందేనని ఇందువల్ల వెల్లడౌతూంది.)

దేవతలతో సమానమైన తేజస్సుగల ఋత్విజులు అగ్నిప్రతిష్ఠ చేసి, రాజసూయయాగం ద్వారా ఆయా హోమద్రవ్యాలను ధర్మతనయునిచేత క్రమంగా వేలిపించి, యజ్ఞాన్ని పరిసమాప్తి కావించారు. ఆ ముగింపురోజున ధర్మరాజు ఆయా ఋత్విజులనూ, పెద్దలయిన సభాసదులనూ సముచితమైన రీతిని పూజించాలని నిశ్చయించాడు.

(దేవతలకు అగ్నిముఖము - అని శాస్త్రప్రమాణం. 'అగ్నిముఖా వై దేవాః[ - అని ఆర్షోక్తి. ఇందువల్లనే యజ్ఞాలలో ఆ యా దేవతలను ఉద్దేశించి మంత్రపూర్వకంగా సమర్పించే హవిస్సులు అగ్నిలోనే హోమంచేయబడుతాయి. ఇక్కడ “అగ్నిముఖంబుగంజేసి” - అనటంలో “అగ్నిదేవుణ్ణి దేవతలకు ముఖంగా ప్రవర్తించేట్టుగా ప్రార్థించి, హోమకుండంలో అగ్నిని వెలిగించి - అనే విశేషమైన భావం ఇమిడివుంది.)

ఈ విధంగా పూజకు ఉపక్రమించే సందర్భంలో ధర్మసూనుడు 'ఇందులో అగ్రపూజకు అర్హులయిన వారెవరో?' - అని సవినయంగా సభను ప్రశ్నించాడు. సభాసదులు తమకు తోచినట్లు తలకొక రీతిగా కొందరను సూచించారు. అప్పుడు బుద్ధిశాలీ, మాటల్లో నేర్పరీ ఐన సహదేవుడు వారీ మాటల్ని వారించి, భగవానుడైన శ్రీకృష్ణుణ్ణి చూపిస్తూ 'ఈ మహానుభావుణ్ణి అగ్రపూజచే ఆనందింపచేస్తే సకలలోకాలూ సంతోషిస్తాయి' - అని చెప్పి అన్నయైన ధర్మరాజుతో ఇలా పల్కినాడు.

యజ్ఞం చేసే కాలం, ఆ యజ్ఞం, అందలి క్రియాకలాపాలు, యజ్ఞంలో ఉచ్చరించేమంత్రాలూ, హోమకుండంలోని అగ్నీ అందులో వేల్వబడే ఆహుతులూ, యజ్ఞాన్ని చేయించే బ్రాహ్మణులూ, యజ్ఞకర్తా, యజ్ఞఫలభోక్తా, ఈ సమస్త జగత్తులూ, వాటిల్ని నడపే దైవమూ, సకల జీవుల సృష్టి స్థితి, లయాలూ, వాటి హేతువులూ, వేళలూ - వీటన్నింటిలోనూ అఖండంగానూ, అద్వితీయంగానూ ప్రకాశిస్తూవున్న తేజస్స్వరూపుడు ఈ శ్రీకృష్ణుడే! (అని తెలియదగింది)

విష్ణు స్వరూపుడూ, ప్రభావశాలీ అయిన ఈ శ్రీకృష్ణుడు కన్నులు మూసుకొంటే చరాచరాలైన ఈ లోకాలన్నీ నశిస్తాయి; కన్నులు విప్పి చూస్తే ఈ లోకాలన్నీ మళ్లీ జన్మించి విస్తరిస్తాయి. ఇంతేగాక, సమస్తయజ్ఞాలకు ఫలాన్ని ప్రసాదించే ఈ మహాత్ముడే ఇందులో అగ్రపూజకు అర్హుడు. మరొకడెవ్వడూ ఇందుకు యోగ్యుడు కాడు.

ఓ మహారాజా! సమస్త లోకాలకు అధీశుడూ, అనంతుడూ, సకల శక్తిమంతుడూ, జ్ఞాన స్వరూపుడూ, లక్ష్మీనాథుడూ అయిన ఈ పురుషోత్తముణ్ణి ఇందు అగ్రపూజద్వారా సంతోషింపజేస్తే అఖిలజగాలూ పరిపూర్ణంగా ఆనందిస్తాయి. కాబట్టి, ఆలస్యం లేకుండా ఆ పూజాకార్యాన్ని పూర్తి గావింపగోరుతున్నాను.

'కావున ఆలసింపక నీవు శ్రీకృష్ణుణ్ణి పూజించు - అని సహదేవుడు ధర్శజునితో చెప్పిన మాటలు వినిన ఆ సభలోని ప్రజలు, రాజులు, ఋషులు మున్నగు వారందరూ మిగుల సంతోషించారు; 'సహదేవునిఅభిప్రాయం సముచితంగా ఉంది' - అన్నారు.

అనంతరం ధర్మరాజు మునీశ్వరుల మనస్సులనే తుమ్మెదలకు పద్మాలవంటివయిన శ్రీకృష్ణునిచరణాలను శ్రద్ధతో కడిగాడు. అట్లు కడిగిన ఆ జలాన్ని భక్తితో

ధర్మనందనుడు తానూ, తనతల్లి కుంతీదేవీ, నలుగురు సోదరులూ, పత్నిఅయిన ద్రౌపదిదేవీ అత్యంతఆసక్తితో, వైభవం విలసిల్లగా శ్రీకృష్ణునిపాదజలాన్ని తమ తమ శిరస్సులమీద చక్కగా చల్లుకొని, ఎంతో గొప్పగా ఆనందించారు.

బంగారు జలతారు కాంతులతో ఒప్పుతూ ఉన్న పట్టువస్త్రాలతోను, ఉదయిస్తున్న సూర్యునికాంతులను మించిన ప్రకాశమానమైన రత్నాలతోను ధర్మరాజు జయశీలుడయిన శ్రీకృష్ణదేవుణ్ణి (ప్రీతిగౌరవాలతో) పూజించాడు.

ఈ విధంగా పురుషోత్తముడైన శ్రీ కృష్ణుణ్ణి భక్తితో పూజించిన ధర్మజుని కండ్లనిండా సంతోషబాష్పాలు పొంగిపొరలినాయి. అందువల్ల ఆయన గోవిందునిమంగళకరమైన సుందరస్వరూపాన్ని స్పష్టంగా చూడలేకపోయాడు. ఇలా పూజించబడి ప్రకాశిస్తున్న పుండరీకాక్షుణ్ణి దర్శించి, అక్కడి సభలోని జనులందరూ శిరస్సులపై దోసిళ్లు చేర్చి స్తుతిస్తూ జయజయ ధ్వానాలు చేశారు. పైనుండి దేవతలు వివిధమంగళవాద్యాలను మోగిస్తూ పూలవానలు కురిపించారు.

అప్పుడు దమఘోషుని కుమారుడైన శిశుపాలుడు శ్రీకృష్ణునికి జరిగిన ఆ పూజావైభవాన్ని చూచి, సహించలేకపోయాడు. అసూయవల్ల కోపంతో ఆసనంనుండి దిగి, నిర్భయంగా రెండుచేతులను పైకి చాపినాడు.

శ్రీకృష్ణుడు వింటూ ఉండగా శిశుపాలుడు సభలోని వారిని తేరిపారజూచి ఇలా అన్నాడు.

కాలంయొక్క ప్రభావం అతిక్రమింప వీలు కానిది! ఇందుచేతనే ఈనాడు ఈ సభయందుగల మహర్షులు, మహారాజులు మొదలుగాగల బుద్దిమంతులైన పెద్దల బుద్ధులు ఒక బాలకుని (సహదేవుని) మాటలు విని నీతిమార్గంనుండి ఎందువల్ల తొలగిపోయాయో కదా!

ఇక్కడి ప్రాజ్ఞులు న్యాయమార్గాన్ని తప్పిన విధం ఏలాగంటే, యోగ్యులను అయోగ్యులను నిర్ణయించగల నేర్పరులు, గొప్ప సత్త్వగుణసంపన్నులు, తపోనియమశీలురు, తేజస్వులు, ఐశ్వర్యయుక్తులు, పరబ్రహ్మ స్వరూపం తెలిసిన జ్ఞానులు, సమస్తలోకపాలకులచే పూజింపబడినవారు, పాపరహితులైన పరమయోగీశ్వరులు- అనేకులు ఈ సభలో ఉన్నారు. వీళ్లలో ఏ ఒక్కరినీ లక్ష్య పెట్టకుండా, ఒక గొల్ల పిల్లవాణ్ణి ఉత్తముణ్ణిగా పూజచేయటానికి వీళ్లంతా ఎలా అంగీకరించినారో? ఇలా చేయటం పవిత్రమైన యజ్ఞపురోడాశాన్ని నక్కకు వేయడం వంటిది!

గురువులూ, దేవుడూ లేనివాడు, అలాగే కులగోత్రాలూ లేనివాడు, తల్లిదండ్రులు ఎవరో తెలియనివాడు, నిత్యం నీళ్లలో పొరలాడేవాడు, మొదలు, నడుమ,చివరలు లేని మానహీనుడు, అనేక రూపాలు ధరించి, పెక్కు విధాల ప్రవర్తిల్లేవాడు, వావివరుసలు, సంబంధబాంధవ్యాలు లేనివాడు అయిన ఈతడు మావల్ల ఒక మనిషిగా తయారయ్యాడు. వీళ్ల పూర్వుడైన యదువుకు యయాతిమహారాజు ఇచ్చిన శాపం కారణంగా యదువంశం రాజ్యార్హతను కోల్పోయి ప్రశస్తిలేని దయింది. అందుచేతనే వీళ్లకు బ్రహ్మవర్చస్సు నశించింది. ఇలాంటి ఈ గోపాలకుడు ఈ సభలోని బ్రహ్మర్షులందరికి పూజింప దగినవాడెలా అయినాడు? (కాలేడు)

ఈ కృష్ణుడు పుట్టిననాటినుండీ చోరుడు. అటుపై జారుడు. ఒక మార్గంలోగాక, మూడుదారుల్లో నడిచేవాడు. అటువంటి ఈతడు మిగుల ఉత్తమమైన అగ్రపూజాకార్యానికి అవశ్యంగా ఎలా యోగ్యుడయ్యాడు? - అని ఆ శిశుపాలుడు తీవ్రంగా అమంగళకరమైన మాటలతో (నిందించాడు)

శిశుపాలు డట్లు దూషించినప్పటికిని, నక్క కూతలను వినికూడా లెక్కపెట్టని సింహంవలె శ్రీకృష్ణుడు వాని మాటలను లక్ష్యపెట్టక, ధీరతతో ఉండినాడు. సభలో ఉండిన ఋషులు, రాజులుమాత్రం వాని పరుషవాక్కులకు చాలా బాధ పడినారు.

శిశుపాలుని పరుషవాక్కులను వినలేక సభలోని రాజులు, మునులు చెవులు మూసుకొంటూ, 'శ్రీ కృష్ణా! వీనిని ఏ గతికి చేరుస్తావో' - అని అంటూ ఆ శిశుపాలుణ్ణి నిందిస్తూ - ఆ సభనుండి వెళ్ళిపోయారు. అప్పుడు పాండవులు అంతులేని ఆగ్రహానికి లోనయ్యారు.

(భగవంతుణ్ణి నిందించిన వాడేగాక, ఆ నిందను విన్నవాళ్లుకూడ నరకంలో పడతారు- అనే విశ్వాసాన్ని అనుసరించి సభయందలి మహారాజులు, మహర్షులు చెవులు మూసుకొని సభనుండి వెలుపలికి వెళ్లారు.)

ఆ సమయంలో పాండవులు కేకయ, సృంజయ దేశాల రాజులతోపాటు ఆయుధాలు ధరించి వచ్చి శిశుపాలుణ్ణి హెచ్చరించారు. శిశుపాలుడు ఎవరినీ లెక్కపెట్టక, కత్తి, డాలు ధరించి శ్రీకృష్ణుని ఎదుటికి వచ్చి, వాళ్లనందరినీ నిందింపసాగాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఆగ్రహంతో లేచి, శిశుపాలుణ్ణి తీవ్రంగా చూస్తూ ఎంతో వాడి గల భయంకరమైన సుదర్శనచక్రంతో శిశుపాలుని శిరస్సును ఖండించాడు. ఆ కోలాహలాన్ని విని శిశుపాలుని సైన్యాలు, అతని పక్షంలోని రాజులు తత్తరపాటుతో పారిపోయారు.

మహారాజా! అప్పుడు అక్కడుండిన మునీంద్రులు, రాజులు చూచి ఆశ్చర్యపడుతుండగా శిశుపాలుని శరీరంనుండి ప్రకాశమానమైన ఒక జ్యోతిపైకి వచ్చి శ్రీకృష్ణుని దేహంలో ప్రవేశించింది.

అని పల్కిన శుకయోగీంద్రునితో పరీక్షిన్మహీపతి ఇలా అన్నాడు.

ఓ మునిశ్రేష్ఠ! శ్రీకృష్ణుణ్ణి నిందించిన శిశుపాలుడు మలంతో నిండిన నరకకూపంలో పడిపోవక ఆ భగవానుని దివ్యదేహంలోని ఉదాత్తమనస్కుడై ఏ విధంగా ప్రవేశింపగలిగినాడో సెలవియ్యండి!

అప్పుడు పరీక్షిత్తుయొక్క ప్రశ్నకు సమాధానంగా శుకుడు ఈ కిందివిషయం వెల్లడించాడు.

శిశుపాలుడు గతమూడు జన్మలనుండి వైరబుద్ధితో ఆ శ్రీమహావిష్ణుని రూపాన్నీ గుణాలను (నిందావ్యాజంతో) నిరంతరం ధ్యానించడంలో ఆరితేరి ఉండడంచేత సమస్తపాపాలనుండి విముక్తుడై బ్రహ్మరుద్రాదులకుకూడా అందరాని మోక్షపదవిని పొందాడు.

పిమ్మట ధర్మరాజు ఋత్విక్కులను, సదస్యులను గొప్పగా దక్షిణల నిచ్చి సంతోషింపచేసి, అనేక విధాల పూజించి, అవభృథస్నానం చేయాలనే ఆనందంతో బయలుదేరాడు.

మృదంగం, శంఖం, గోముఖం, డిండిమం, పణము మంగళవాద్యాల ధ్వనులు మిన్నంటుతుండగా, కవులు సూతులు, మాగధులు, గాయకులు, వందులు, వైతాళికుల - పొగడ్తలు అడుగడుగన వినిపిస్తూ ఉండగా, వేణువీణా మురజాది వాద్యాల శబ్దాల కనుగుణంగా నట్టువకత్తెలు నాట్యాలు చేస్తుండగా, అందమైన పతాకలుగల రథాలను, ఏనుగులను, గుర్రాలను ఎక్కి ధర్మజుని తమ్ములు, మిత్రులు, పురోహితులు హారకేయూర కిరీటాది ఆభరణాలను చక్కగా అలంకరించుకొని వైభవంతో ధర్మజుని వెంట కదలినారు.

అంతేగాక, యదు, కాంభోజ, కురు, కేకయ, కోసల దేశాధిపతులైన రాజులు చతురంగబలాలతో వెంట నడువగా, ఋత్విక్కులు, సదస్యులు వేద పారాయణం కావిస్తూ ముందు వెళ్లుతుండగా, సువర్ణ మాలికలు, దివ్య మణిహారాలు దేదీప్య మానంగా కంఠంలో ప్రకాశిస్తూవుండగా, వేగంగల గుర్రాలను పూన్చిన రథాన్ని పత్నీసహితుడై అధిరోహించి, అమిత వైభవంతో ధర్మరాజు ప్రయాణం సాగించినాడు.

ఆవేళ వారవనితల బృందాలు బంగారుకొండ సానువుల్లోని నెమళ్లవలె వాళ్లజుట్టుముడులు వీపులపై నాట్యంచేస్తుండగా, కదలుతున్న చెవికమ్మలందలి మంచిముత్యాలకాంతులు అద్దాలవంటిచెక్కిళ్లపై ప్రతిబింబిస్తుండగా స్థిరమైన మెరుపు తీగలవంటి వాళ్ల కడగంటి చూపులు వెలుగులను వెదజల్లుతుండగా, మంచుపొరచాటునుండి పైకెగయడానికి యత్నించే గుండ్రని జక్కవపిట్టలవలె వాళ్ల చన్నులు తెల్లని రవికలనుండి పైకి ఉబుకుతూవుండగా, స్తనభారంచేత చలిస్తున్న నడుములు గలవారై, ఒడ్డాణాలు నడుమున మెరుస్తుండగా, పైటలు జీరాడుతుండగా, హస్తకంకణాల, కాలి అందెల ధ్వనులు ఇంపుగా నినదిస్తుండగా తమతమ పరివారాలతో కలిసి ముందుకు సాగారు.

ధర్మనందనుని పరివారంలోని మందగమనలైన ఆ వారవనితలు చిరునగవులు తొణికిసలాడే తమ ముఖపద్మాలపై తుమ్మెదలవంటి ముంగురులు చలిస్తుండగా ఆనందంతో ప్రక్కనున్న తమవారిపై చిమ్మనగ్రోవులతో పన్నీరు చిమ్ముతూ కస్తూరి, కుంకుమ లేపనాలను వారిముఖాలమీద పూస్తూ, పూల చెండ్లను విసరుతూ, వరసైనవారితో పరిహాసాలాడుతూ వసంతకేళి జరుపసాగారు.

దేవకాంతలవంటి రాజపత్నులు చెలికత్తెలు వెనువెంట సేవిస్తూ నడువగా, బంగారుపల్లకీల నెక్కివస్తూ తమ సరసాలకు యోగ్యురాండ్రైన రాజకాంతల చెలికత్తెల పైకి తమ చెలికత్తెలను పురికొల్పి వసంతాలు చల్లిస్తూ, చమత్కార సంభాషణలతో చిరునవ్వులు చిందిస్తూ పయనం సాగించారు. ఈ రీతిగా గొప్ప సామ్రాజ్యవైభవంతో ధర్మరాజు గంగానదికి వెళ్లి, ధర్మపత్నీసమేతంగా పవిత్ర అవభృథస్నానం చేశాడు.

నిర్మలచరిత్రుడవైన పరీక్షిద్రాజేంద్రా! ధర్మరాజు సతీసమేతుడై అవభృథస్నానంచేసిన ఆ సమయంలో దేవతలు భేరులు మొదలైన మంగళవాద్యాలను మోగించి, పూలవాన కురిపించారు. మహర్షులు, దేవతలు, పితృదేవతలు ధర్మరాజుయొక్క ఆ యజ్ఞ అవభృథకార్యాన్ని ప్రశంసించారు.

మానవులు ఎంతటిపాపాత్ములయినా ఏ స్నానం చేసి, సకలపాపాలనుండి విముక్తులౌతుంటారో, అట్టి ప్రభావంగల ఆ అవభృథస్నానాన్ని అక్కడ చేరిన జనులందరూ ఆసక్తితో ఆచరించారు.

ధర్మరాజు కొత్తవైన పట్టువస్త్రాలను, పరిమళభరితమైన పూలమాలలను ధరించి, అనేక రత్నమయఆభరణాలను అలంకరించుకొని మహావైభవంతో ప్రకాశించాడు.

గంగానదీలో అవభృథస్నానం కావించిన తరువాత ధర్మరాజు మరల ఇంద్రప్రస్థనగరానికి వచ్చి

ప్రకాశిస్తున్న సూర్యుణ్ణి బోలిన పరాక్రమశాలి, నిర్మలకీర్తికి నిలయుడు, సజ్జనులచే నిత్యం కొనియాడబడుతూ ఉండేవాడు అయిన పాండవజ్యేష్ఠుడు (ధర్మరాజు) రాజసూయ యాగాన్ని నిర్వహింపజేసిన ఋత్విజులను, సదస్యులను, బ్రాహ్మణోత్తములను, బంధువులను, మిత్రులను రాజులను అందరినీ సముచితంగా పూజించి, వారలకు ఒక్కొక్కరికి వరుసగా పట్టువస్త్రాలు, మణిమయాలయిన బంగారుఆభరణాలు మొదలైన అమూల్యవస్తువులను బహుమానంగా ఇచ్చాడు.

ఆ ప్రకారంగా ఇంద్రప్రస్థరాజధానియందలి స్త్రీపురుషులు అందరూ శ్రీకృష్ణదేవునియందు భక్తి తాత్పర్యాలు గలవారై, దైవీ తేజస్సుతో ప్రకాశిస్తూ, రత్నాభరణాలను, గంధమాల్యాదులను ధరించి పరమానందభరితులై ఉన్నారు.

మహారాజైన ధర్మజుడు నిర్వహిస్తూ ఉన్న రాజసూయయజ్ఞాన్ని చూడాలని భక్తితత్పరులై ఏతెంచిన దేవతలు, మునులు, బ్రాహ్మణులు, రాజులు, వైశ్యులు, శూద్రులు ధర్మరాజుచే సముచితంగా సన్మానింపబడినవారైనారు. అలా సమ్మానింపబడినవారందరూ పరమసంతోషిత హృదయులై వినయంతో మహారాజువద్ద సైలవుగైకొని వెళ్లిపోయారు.

(మహారాజు ఎడల ఆనాటి ప్రజలకుగల భక్తి ప్రపత్తులు ఇక్కడ చక్కగా వెల్లడవుతున్నాయి.)

శ్రీకృష్ణదేవుని పాదపద్మాల్ని ఆరాధించే ధర్మరాజు నిర్వహించిన రాజసూయ యాగవైభవాన్ని ప్రశంసిస్తూ, యజ్ఞానికి విచ్చేసినవాళ్లందరూ తమతమ నివాసభూములకు వెళ్లారు. ఆ సమయంలో ధర్మజుడు శ్రీకృష్ణుణ్ణి సాగనంపేందుకు ఇష్టపడక, ఇంకా కొన్నాళ్లు ఉండమని ప్రార్థించాడు.

ధర్మనందనుని ప్రార్ధనను మన్నించి శ్రీకృష్ణుడు తనవెంట వచ్చిన యాదవుల నందరినీ కుశస్థలీనగరానికి (ద్వారకకు) పంపించాడు. తానుమాత్రం కొంతమంది పరిజనులతో పాండవాగ్రజునికి ప్రియంగా ఇంద్రప్రస్థంలో ఉండినాడు - అని చెప్పి, శుకయోగీంద్రుడు పరీక్షిత్తుతో మళ్లీ ఇలా అన్నాడు.

శ్రీకృష్ణదేవుని భక్తాగ్రగణ్యుడైన ధర్మజుడు రాజసూయాన్ని నిర్వహించాలనే కాంక్ష అనే సముద్రాన్ని ఆ దేవదేవుడనే ఓడద్వారా దాటి, మానసిక చింతను అధిగమించి, ఘనమైన సంతోషంతో ప్రకాశించాడు. పద్మనాభుని దాసులకు సాధింపజాలని మహాకార్యాలు ఉండవుకదా!

రాజసూయం నిర్వహించిన ధర్మరాజు నెమ్మదిగా, సంతోషంగా ఉండిన ఆ సందర్భంలో

పరీక్షిద్రాజేంద్రా! కల్మషమైన మనస్సుగలవాడు, కులదూషకుడు - అయిన దుర్యోధనుడు తప్ప, తక్కిన సమస్త ప్రజలు శ్రేష్ఠమైన ఆ రాజసూయయజ్ఞంయొక్క వైభవానికి ఎంతో ఆనందించారు.

అని చెప్పగా, వినిన పరీక్షిత్తు శుకమహర్షితో మళ్లీ ఇలా అన్నాడు.

ప్రశస్తమైన చరిత్రగల మునీంద్రా! సమస్త జనులకు సంతోషాన్ని కలిగించిన ధర్మజుని రాజసూయయాగం దుర్యోధనునికి మాత్రం ఏ కారణంచేత సహింపరానిదైంది? ఈ విషయం నాకు వివరించండి!

అని ప్రశ్నించిన పరీక్షిన్మహారాజుతో శుకమహర్షి ఇలా అన్నాడు. 'దుర్యోధనుడు ఎల్లవేళల పాండవులకు అనేక అపకారాలు చేస్తూ ఉండినప్పటికీ శ్రీకృష్ణదేవుని దయావిశేషంచేత లభించిన రాజ్యలక్ష్మీమాహాత్యంచేత ధర్మరాజు నిత్యమూ విరాజిల్లుతున్నాడు. ఆయనకు లభించిన రాజ్యలక్ష్మీవైభవం ఎటువంటిదంటే - అది దేవ, దానవ, మానవ పరిపాలకుల రాజ్యలక్ష్మీ విభవాలను మించిన శోభావిశేషం గలిగి ప్రకాశిస్తూ ఉండేది.

తనకు చేకూరిన ప్రసిద్ధమైన, అనంతమైన సంపదలతోను గొప్పకీర్తితోను ధర్మరాజు అంతఃపురంలో తన రత్నాలంకారాల కాంతులు అంతటా ప్రకాశిస్తూ ఉండగా, మనోజ్ఞమైన ఆకారంగలవాడై, శ్రీకృష్ణదేవుణ్ణి మిగుల కుతూహలంతో, ఆసక్తితో సేవిస్తూ అధికమైన ఆనందంతో ఉన్నాడు.

దుర్యోధనుడొకనాడు మయసభా భవనంలో శ్రీకృష్ణునిపదునారువేలమంది పత్నులతో కలసిమెలసియున్న ద్రౌపదిని చూచాడు. ఆ పదహారువేలమంది పత్నులు ప్రాణంగల మాణిక్యపు బొమ్మలవలె, దివినుండి భువికి దిగివచ్చిన చంద్రోఖలవలె, శృంగారరసస్వరూపిణులైన మోహినీదేవతలవలె భాసిస్తూ ఉన్నారు. ద్రౌపది వారినడుమ మెరుపుతీగవలె ప్రకాశిస్తూ ఉంది. అలా వెలుగొందుతూ ఉన్న ద్రుపదనందన యొక్క వైభవాన్సీ, రాజసూయయజ్ఞంయొక్క మహోత్సవాన్ని కన్నారా కాంచిన సుయోధనుడు మనస్సులో ఎంతో కలతపడి, పరితాపమనే అగ్నిలో తపించిపోసాగినాడు.

ద్రౌాపదీదేవి అంతఃపురంలో విలసిల్లుతూవున్న పదహారువేలమంది శ్రీకృష్ణుని పత్నులు అష్టమినాటిచంద్రునిపోలిన అందమైన ఫాలభాగాలుగలవారై, ఇంద్రనీలమణుల కాంతులను పరిహసించే ముంగురులతో ప్రకాశిస్తూ ఉన్నారు. వారి కనుబొమలు మన్మథునిధనుస్సును తిరస్కరించేవిగా ఉండగా, కన్నులు కర్ణాంతవిశాలాలై కాటుకతో తళతళమెఱుస్తూ ఉన్నాయి. విరజాజిమొగ్గలవంటి పలువరుసలు గల వారిచిరునగవు వెన్నెలలు, కర్ణాభరణాల్లోని మణులకాంతులు విశాలమైనవాళ్ల చెక్కిళ్లలో కమనీయంగా కలిసిమెలసి ప్రతిఫలిస్తూ ఉన్నాయి.

ముత్యాలహారాలకు సైతం సందీయకుండా మిసమిసలాడుతున్న ఉన్నత వక్షోజాలతో, అరచేతిలో ఇమిడిపోతాయేమో అనిపించే సన్నని నెన్నడుములతో; చిఱుగంటల ఇంపైన సవ్వడులుగల బంగారు ఒడ్డాణాలు, మొలనూళ్లు గల కటిప్రదేశాలతో, చెంగలువపూరేకులవంటి లేలేత పాణిపాదతలాలతో, ఘల్లుఘల్లున మధురంగా ప్రతిధ్వనిస్తూవున్న కాలి అందెలతో, అంతటా కాంతులీనుతున్న భుజకీర్తులు, కంకణాలు, ఉంగరములు అలంకరించుకొన్న కరకమలాలతో, నలుదెసల అపూర్వ పరిమళాలను వెదజల్లుతూవున్న కస్తూరి, శ్రీగంధం, పచ్చకప్పురం మొదలైన ద్రవ్యాలతో తయారుచేసిన మైపూతలతో అపూర్వంగా ప్రకాశిస్తూ ఉన్నారు. వారు ప్రాణంతో ఉండే మాణిక్యాలబొమ్మల్లాగా, దివినుండి భువికి దిగివచ్చిన చంద్రరేఖవలె, శృంగారసం మూర్తీభవించిన మోహినీదేవతల్లాగా విరాజిల్లుతూండే మహాసౌందర్యవతులైన శ్రీకృష్ణుని పదునారువేల భార్యలమధ్య మెరపుతీగలాగా ప్రకాశిస్తూన్న ద్రౌపదీదేవి సౌభాగ్యాన్నీ రాజసూయయాగ మహావైభవాన్నీ చూచి, దుర్యోధనుడు అసూయతో లోలోపల బాధపడసాగాడు. ఇలా ఉండగా ఒకనాడు ధర్మరాజు నిర్మలమైన ఆ సభాభవనానికి వచ్చి

ఒకనాడు ధర్మరాజు మయుడు నిర్మించియిచ్చిన సభాభవనంలోని సింహాసనంమీద ఆసీనుడై కొలువు దీరాడు. కాడుకులు, తమ్ముళ్లు, పురోహితులు, బంధువులు, మంత్రులు, సేవకులు ఆయన్ను సేవిస్తున్నారు. వందిమాగధుల స్తోత్రపాఠాలు సంతోషాన్ని కలిగిస్తున్నాయి. చేతి కడియాలు కమనీయంగా ధ్వనిస్తూ ఉండగా యువతీలలామలు వింజామరలను వీస్తున్నారు. వివిధ దేవతాబ్బందాలచేత సేవింపబడుతున్న దేవేంద్రునివలె విరాజిల్లుతూ ఉన్న ధర్మనందనుణ్ణి తిలకించి సంతోషిస్తూ శ్రీకృష్ణుడు ఆ సభలో అలరారుతున్నాడు. ఆ సమయంలో కోపం, అసూయ, దురభిమానం - ఈ దుర్గుణాలే ధనంగా గలవాడైన దుర్యోధనుడు ఆ సభకు వచ్చాడు.

(తాను ఎదుటివారితో సుఖంగా యుద్ధంచేయగలవాడు గనుక 'సుయోధనుడు' అలాగే అతికష్టంతోనే ఎదుటివాళ్లు తనతో యుద్ధంచేయడానికి శక్యమైనవాడు గనుక 'దుర్యోధనుడు'. ఈ రీతిగా కురురాజుకు ఈ రెండుపేర్లు సాభిప్రాయంగా ఏర్పడ్డాయి.)

స్వర్ణమయాలైన మణిభూషణాలు ధరించి, రాజసం ఉట్టిపడే తేజస్సుతో దుర్యోధనుడు తమ్ములు, రాజులు ఇరువైపుల తనను సేవిస్తూ రాగా, ముందుభాగంలో

దుర్యోధనుడు ఆ విధంగా మహావైభవంతో ధర్మరాజు కొలువు దీరియున్న మయసభా భవనంలోనికి విచ్చేశాడు. ఆ సభాభవనం అంతటా దానవశిల్పాచార్యుడైన మయుని మాయాశక్తిచేత భ్రమింపజేస్తూంది.

ఆ విధంగా సభకేతెంచిన సుయోధనుడు నీళ్లు లేని స్థలంలో నీళ్లున్నవని భ్రమపడి, కట్టుకొన్న వస్త్రాలు పైకి లాగుకొన్నాడు. అలాగే, నీళ్లున్నచోట నీళ్లు లేవనుకొని మామూలుగా వెళ్ళినందువల్ల వస్త్రాలు తడిసిపోయి, తడబడి ఆ నీటిపట్టులో చతికిలపడ్డాడు.

ఆ విధంగా భ్రాంతికి గుఱియైన దుర్యోధనుణ్ణి చూచి భీముడు నవ్వాడు. ధర్మరాజు సైగచేసి వారిస్తున్నా లెక్క చేయక అక్కడున్న రాజులు, స్త్రీలూ

దుర్యోధనుడు మయసభాభవనంలో తనకు జరిగిన అవమానానికి సిగ్గుతో తలవంచుకొని, కోపంతోతన నగరానికి వెళ్లాడు. అప్పుడు బుద్ధిమంతులైన సభ్యుల వేళాకోళంతో కూడిన సందడిధ్వని వినిపించింది. అందుచేత ధర్మరాజు చింతతో చిన్నబోయాడు. ఆ సమయంలో శ్రీకృష్ణుడు భూభారాన్ని నివారించటానికి అవతరించినవాడు కావడంచేత ఆ పరిహాసకులను నివారించక మౌనం వహించాడు.

పరీక్షిన్మహారాజా! ఆ తరువాత శ్రీకృష్ణదేవుడు ధర్మనందనుణ్ణి వీడ్కొని, సతీసుతహితబంధుసమూహసమేతంగా సంతోషంతో ద్వారకాపురికి వెళ్లాడు.

జరాసంధునిచెరలో ఉన్న ఇరవైవేల ఎనిమిదివందలమంది రాజులను బంధవిముక్తులను కావించడం; శిశుపాలుణ్ణి సంహరించడం, ధర్మనందనుని రాజసూయ యజ్ఞాన్ని సంరక్షించటం - ఈ ఘనకార్యాలను ఉదారబుద్ధితో చేసిన శ్రీకృష్ణదేవుని పవిత్ర చరిత్రలోని విజయ గాథలను అభినివేశంతో చదివేవాళ్లు సకలసౌభాగ్యాల్నీ, బహుపుత్రసంతతిని, మంచి తెలివితేటల్ని స్వచ్చమైన కీర్తిని, తుదకు విష్ణుసాయుజ్యాన్ని(మోక్షాన్ని) పొందుతారు.

శ్రీకృష్ణుని కథలను పఠిస్తే కలిగే సత్‌ఫలితాలను గూర్చి చెప్పిన అనంతరం, శుకయోగీశ్వరుడు పరీక్షిత్తును చూచి, 'ఆ అవతారపురుషుడు కావించిన అద్భుతకార్యాలను వినిపిస్తాను; ఆసక్తితో ఆలకించమని - అన్నాడు.

సాల్వుండు శివప్రసాదంబున సౌభకవిమానంబు వడసి ద్వారకాపురిపై దండెత్తుట







No comments:

Post a Comment

Sri Krishnudu Danthavaktruni Vadhinchuta - శ్రీ కృష్ణుడు దంతవక్త్రుని వధించుట

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - ఉత్తరభాగం -  శ్రీ కృష్ణుడు దంతవక్త్రుని వధించుట ఈ ప్రకారంగా శ్రీకృష్ణుడు కపటియైన సాల్వుణ్ణీ, ఆతనిసౌభకవిమానాన్నీ...