Thursday, August 27, 2026

Srikrishnudu Uddhavuni Yalochana Choppuna Dharmaraju Paliki Bovuta - శ్రీకృష్ణుడు ఉద్ధవుని యాలోచన చొప్పున ధర్మరాజు పాలికి బోవుట

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - ఉత్తరభాగం - 
శ్రీకృష్ణుడు ఉద్ధవుని యాలోచన చొప్పున ధర్మరాజు పాలికి బోవుట

పురుషశ్రేష్ఠుడా! గొప్పతెలివితేటలతో పదిమంది మెచ్చుకొనేవిధంగా మాటల నేర్పు పుష్కలంగా ఉన్న ఉద్ధవా! శ్రేష్ఠులైన పెద్దలు అంగీకరించే విధంగానూ, వాళ్లు మెచ్చుకొనేరీతిలోనూ కార్యం ఎలా నడపాలో దాన్ని చెప్పవయ్యా!

పుణ్యచారిత్రుడవై కొనియాడదగిన నడవడి గలవాడా! ఉద్ధవా! నీవు మాకు రెండు కన్నులవంటివాడివి. కాబట్టి నీవు చెప్పిన పని చేయడానికి సిద్ధంగా ఉన్నాను. చేయవలసిన పని చెప్పు.

ఈ విధంగా సర్వమూ తెలిసిన శ్రీకృష్ణుడు ఏమియు తెలియనివాడిలాగా ఉద్ధవుణ్ణి అడగ్గా ఉద్ధవుడు శ్రీకృష్ణుని మాటలకు ఆనందించి ఆ స్వామి పాదపద్మాలు మనస్సులో నిలుపుమని - పెద్దలందరూ మెచ్చే ఆలోచనను చెబుతాను విను. 

ఓ శ్రీకృష్ణా! నారదమహర్షి చెప్పినట్లు నీ ప్రియభక్తుడైన ధర్మరాజు చేసే రాజసూయయాగాన్ని రక్షించటం ముఖ్యకర్తవ్యం. రాజసూయయాగంలో అన్నిదిక్కుల్నీ జయించదం ప్రధానకార్యంగా ఉంటుంది. కాబట్టి, ఆ దిగ్విజయసందర్భంలోనే జరాసంధుణ్ణి సంహరించి వాని చెరలో నున్న రాజుల్ని విడిపించడం కూడా సమకూడుతుంది. పదివేలయేనుగుల బలమూ; నూరు అక్షౌహిణుల సైన్యమూ గల జరాసంధుణ్ణి జయించడం వాయుపుత్రుడైన మన భీమునికి తప్ప ఇతరులకెవరికీ సాధ్యంకాదు. ఇక ఆ జరాసంధుడు బ్రాహ్మణులు ఏది కోరినప్పటికీ సందేహించకుండా ఇస్తాడు. కాబట్టి, బ్రాహ్మణవేషంతో వెల్లి జరాసంధుణ్ణి యుద్ధమే భిక్షగా వేడినట్లయితే నీ సన్నిధానంలో భీముడు జరాసంధుని సంహరించడమూ; దానివలన చాలా పనులు కలిసిరావడమూ జరుగుతుంది అని ఉద్ధవుడు చెప్పగా, నారదుడు యాదవులు, సభాసదులు అందరూ అతణ్ణి మెచ్చుకొన్నారు. ఆ తర్వాత

మిక్కిలి చలిస్తూ, రంగురంగులతో చిత్రింపబడిందై ప్రకాశిస్తున్న గరుడధ్వజాలూ, దిగ్గజాలు బెదరిపోయేటట్లుగా ఘణఘణధ్వనులతో మ్రోగుతున్న రథచక్రాలకు కట్టిన గంటలును, అందమైనమేఘం, పుష్పకం, వలాహకం, శైబ్యం, సుగ్రీవం అనే ఐదు గుఱ్ఱాలను గల్గి ఉదయకాలసూర్యకాంతివలె ప్రకాశిస్తున్న బంగారురథాన్ని, దారుకుడనే సారథి తీసుకొని రాగా శ్రీకృష్ణుడు ఆ రథాన్ని అధిరోహించి బయలుదేరి వెళుతుండగా - శ్రీకృష్ణుని గౌరవానికి తగినట్లు, శంఖాలు, బూరాలు, తప్పెటలు, పెద్ద ఢక్కలు, డోలులు మున్నగు వాద్యములు ఒక్కుమ్మడి మ్రోగసాగాయి. వాటి ధ్వనులు దిక్కులు పిక్కటిల్లేటట్లు వ్యాపించాయి.

శ్రీకృష్ణుడు ఉగ్రసేనమహారాజుకు, బలరామునికి, పూజ్యులైన పెద్దలకు చెప్పి, వారియనుమతి తీసుకొని బంగారుతేరులు, ఏనుగులు, గుర్రాలు, భటులు మున్నగు చతురంగబలములు కొలువగా

వందిమాగధాదుల స్తుతులు, స్తోత్రపాఠాలధ్వనులు, బ్రాహ్మణుల ఆశీర్వాదవచనాల ధ్వనులు పరస్పరం కలిసి సందడిగా నుండగ మేడల పైభాగాలనుండి స్త్రీలు ముత్యాల తలంబ్రాలు పోయగా

శ్రీకృష్ణుడు వినోదంగా వాహ్యాళికై వెళ్లి, కొత్తపూల పండ్ల బరువుచే వంగిన కొమ్మలు గల కర్పూరపు చెట్లు, మద్దిచెట్టు, తియ్యమామిడి చెట్లుగల తోటలలో విడిదిచేశాడు.

ఆ సమయంలో శ్రీకృష్ణుని అంతఃపురంలో

విరిసి పూదేనెలతో, పరిమళంతో అలరారుతున్న మందారపుష్పాలను కొప్పులో తురుముకొని, కస్తూరి, పచ్చకర్పూరం మొదలైన పరిమళద్రవ్వాలు కలిపి తయారుచేసిన చందనపు మైపూతను పూసుకొని, బంగారు కుండలాలు, ధ్వనిస్తున్న కంకణాలు, అందెలు మొదలైన ఆభరణాలు ధరించి, ముత్యాలు అంచులందు కుట్టిన మెత్తని దివ్యాలంకారాలైన చీరలు కట్టుకొని, అరచందమామను బోలిన నొసటియందు కస్తూరితిలకాలను దిద్దుకొని, చంద్రుణ్ణిబోలిన ముఖబింబాలు గల ఆ అంతఃపురకాంతలు - వస్త్రభూషణ మాల్య అనులేపనాలనే నాల్గువిధాలైన అలంకారాలతో ఒప్పినవారైనారు.

కృష్ణునివద్దకు పోవాలనే తహతహతో అంతఃపురాంగనలు తగు పల్లకీలనెక్కి ద్వారపాలకులు చేత బెత్తాలు పట్టుకొని దారికి అడ్డంగా ఉంటూ చూడవచ్చిన పురజనుల్ని దూరంగా తొలగజేస్తూ ఉండగా పుత్రులతో సహా వస్తూ ఉండగా కృష్ణుని దగ్గరకు రాసాగారు.

మన్మథుడు ముథికి పోవునట్లు కడిగిన పూలబాణాలను వెక్కిరించేలా సుతిమెత్తవైన, తళతళలాడుతున్న శరీరాలు గల వేశ్యల సమూహం, పరిచారికల గుంపు తమ సంపద ప్రకటమగునట్లుగా

గుఱ్ఱాలను, కంచరగాడిదలను, ఏనుగులను ఎక్కి వేశ్యలు, దాసీజనాలు బయలుదేరగా, వివిధాలైన ఆయుధాలను ధరించి, నమ్మకమైన భటులు వెంటరాగా అంతఃపురస్త్రీలు శ్రీకృష్ణుని వద్దకు వచ్చారు.

అంతట అంతఃపురాంగనలు రాగా

అంతట శ్రీకృష్ణుడు నారదమహర్షిని సన్మానించి వీడ్కొల్పగా అతడును తన మనఃకమలంలో శ్రీకృష్ణుణ్ణి తలచుకొని నమస్కరిస్తూ ఆలస్యం చేయకుండా దేవలోకానికి వెళ్తాడు.

జరాసంధునిచెరలో ఉన్న రాజోత్తములచే పంపబడిన దూతకూడా శ్రీకృష్ణునిచే భయపడవలసినపనిలేదనే నమ్మకమైన మాటను గ్రహించి, ఆ రాజుల వద్దకు వెల్లి శ్రీకృష్ణుడిచ్చిన అభయాన్ని గూర్చి చెప్పి ఆ రాజుల హృదయాలకు సంతోషం కలిగించాడు.

అంతట శ్రీకృష్ణుడు తన భార్యలు, కొడుకులు, బంధువులు, మిత్రులు వెంటరాగా ప్రయాణమై పోతూ ఉండగా

చాపలు, వస్త్రాలు, రత్నకంబళ్లు, డేరాలు మొదలైనవి గల్గిన కుటీరాలు, మిక్కిలి ఉన్నతాలైన వింజామరల యొక్క ధ్వజాలూ, ధ్వజాలకు కట్టిన వస్త్రాలు, కిరీటాలు, తెల్లగొడుగులు, తళతళలాడే కత్తుల కాంతులు సూర్యకాంతిని అణచి వేస్తూ ఉండగా, వాద్యాల ధ్వనులు - తిమింగలాలు మొదలైన పెద్ద పెద్ద చేపలతో ఎగిసిపడుతున్న చప్పుళ్లూ, అలల సవ్వడులూ కలిసి సముద్రం రణగొణధ్వనులతో విస్తరించగా

శ్రీకృష్ణుడు చతురంగబలాలు తనను కొలిచిరాగా ఏరులు, ఉద్యానవనాలు, దుర్గప్రదేశాలు, కొలంకులు, పల్లెపట్టులు; పట్టణాలు; కిరాతకులు నివసించే అడవులు, పశువుల కొట్టాలు దాటి వెళ్లాడు.

ఈ విధంగ ప్రయాణం చేస్తూ శ్రీకృష్ణుడు ఆనర్తక సౌవీర మరుదేశాలు దాటి, ఇందుమతి, దృషద్వతి, సరస్వతి అనే నదులను దాటి, మత్స్య దేశం మీదుగా ఇంద్రప్రస్థనగరం పొలిమేరల్లోని తోటలో దిగగా


పాండవులు శ్రీకృష్ణు నెదుర్కొని తోడ్కొనిపోవుట







No comments:

Post a Comment

Hayagriva Jayanthi - హయగ్రీవ జయంతి

హయగ్రీవ జయంతి శ్రీమహావిష్ణువు హయగ్రీవ అవతారం దాల్చిన సందర్భాన్ని పురస్కరించుకొని ఆయనకు కృతజ్ఞతగా జరుపుకునే విశేషమైన పండుగ హయగ్రీవ జయంతి. శ్ర...