వజ్రప్రాకారం గడిచివెళ్ళాక వైదూర్యప్రాకారం. ఎత్తు పదియోజనాలు. గోపురద్వారాలు యథాపూర్వంగానే. వైదూర్యభూమి, వైదూర్యమందిరాలు, వైదూర్యవీథులు, వైదూర్యరథ్యలు.
వాపీకూప తటాక స్రవంతుల గట్టులూ ఒడ్డులూ వైదూర్యమయాలు. వాటిలో ఇసుకకూడా వైదూర్యమయమే. వృక్ష వితర్దికలు వైదూర్యనిర్మితాలు. ఈ కక్ష్యలో ఎనిమిదిదిక్కులా అష్టమాతృకల మహాసౌధాలుంటాయి. వీరు ప్రతి బ్రహ్మాండమాతృకల సమష్టిరూపాలు. బ్రాహ్మి - మాహేశ్వరి - కౌమారి - వైష్ణవి - వారాహి - ఇంద్రాణీ - చాముండ - వీరు సప్తమాతృకలు.
ఎనిమిదవ మాతృకపేరు మహాలక్ష్మి, బ్రహ్మరుద్రాది దేవతలకు వీరు సమాకారలు. జగత్కల్యాణకారిణులు. సేనాసమావృతలై పరిచారికాగణ సేవితలై విరాజిల్లుతుంటారు.
ఈ ప్రాకారం నాలుగు ద్వారాలదగ్గరా సాలంకృతాలై మహేశ్వరీవాహనాలు సన్నద్ధంగా ఉంటాయి. కోటి ఏనుగులు, కోటి గుర్రాలు, కోటి పల్లకీలు, హంస - సింహ - మయూర - గరుడ - వృషభాదులూ - వీటిని పూన్చిన రథాలూ కోటికోటిసంఖ్యలో జెండాల రెపరెపలతో ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయి. పార్‌ష్ణిగ్రాహులు సిద్ధం. వివిధ చిహ్నాలతో వాద్యవిశేషాలతో కోటి విమానాలు వేచిఉంటాయి.
షోడశదళ పద్మం
No comments:
Post a Comment