మహీకృతా పర్వతరాజి పూర్ణా
శైలాః కృతా వృక్షవితాన పూర్ణాః
వృక్షాః కృతాః పుష్పవితాన పూర్ణాః
పుష్పం కృతం కేసరపత్ర పూర్ధమ్॥
సువర్ణ, వైడూర్యకాంతు లీనే రావణుని భవనం మెరుపులతో, రంగు రంగుల పక్షులతో అలరారే ప్రావృట్కాల మేఘమండలంలా ఉంది. వాటిలో ఆయుధశాలలు. ధనురాగారాలు, శంఖశ్రేణులు.
విశాలములూ మనోహరములూ అయిన గిరిశిఖరాలమీద చంద్రశాలలూ, దోషరహితాలూ, రాక్షస, దేవతాపూజార్హాలూ, సువర్ణ శోభితాలూ, మయశిల్పి నిర్మితాలూ అయిన గృహరాజాలు గోచరించాయి.
మహామేఘంలా ఉన్న సువిశాల భవనంలో రాక్షసేంద్రుని ప్రధాన సేనాబలం ఉన్నది. దానికి సాటివచ్చే భవనం మరొకటి లేదు. భూమికి దిగిన స్వర్గంలా ఉంది. రత్నశోభ లీనుతున్నది.
కేసరాలు నిండిన పూలతో మునిగిన వృక్షాలతో అలరారే గిరిశిఖరంలా ఉంది. ఆ భవనంలో నారీరత్నాలు మేఘాలలో మెరుపులవలె ఉన్నారు. ఆకాశంలో విహరించే పుణ్యపురుషుల విమానంలా ఉంది. రాజహంసలే వాహనాలుగా ఉన్నట్లుంది.
అది పుష్పకం.
రంగు రంగుల శిలలతో శోభించే పర్వత శిఖరంవలె రత్నఖచితమై, గ్రహపరివేష్టిత చంద్రమండల సదృశమై, విచిత్ర మేఘాలయమై గోచరించింది.
అ ప్రాంతపు భూప్రదేశం పర్వత సమూహంతో, పర్వతాలు తరు సముదాయంతో, తరువులు పూలగుత్తులతో, పూలు పరాగ సముదాయంతో ఉన్నాయి.
సౌధాలు సుధాధవళములు.
సరోవరాలు, పద్మసంభరితాలు. పద్మాలు కేసరపూర్ణాలు. చిత్ర చిత్రంగా ఉన్నాయి.
భవనాలన్నిటికంటె ఉన్నతంగా రత్నద్యుతులతో అలరారుతున్నది పుష్పకవిమానం.
కొన్ని పక్షలు వైడూర్యమణిమయాలు. మరికొన్ని రజితఖచితాలు. ప్రవాళ, స్వర్ణ నిర్మితాలు కొన్ని. సర్వమూ స్వర్ణమయం. సర్పాలు, జాత్యశ్వాలు అన్నీ చక్కగా చెక్కివుంచారు.
పగడాలతో, బంగారుతో పూవులు చెక్కిన రెక్కలు కొన్నింటికి, వయారంగా వంగిన రెక్కలతో కొన్ని, మదనుని సమక్షంలో ఉన్న పక్షులవలె ఉన్నాయన్నీ. కేసరాలు వీడని కలువలు పట్టిన తొండాలతో గజరాజులు. పద్మహస్తయైన లక్ష్మీదేవి స్వరూపం. వసంతకాలంలో వికసించిన తరు శోభతో నిండిన పర్యతరాజులా వున్నదది.
రావణుని పూజలతో, రక్షణతో అలరారే లంకానగరంలో తిరిగి తిరిగి సీత జాడ దొరకక విచారిస్తున్నాడు హనుమంతుడు.
సుగుణ సంపదతో రాముని ప్రియురాలయిన జానకిదేవిని అన్వేషిస్తూ పరి పరి విధాల అలోచనలు సాగిస్తూ సాగుతున్నాడు ధీమంతుడయిన హనుమంతుడు.
రావణ భవన మధ్యంలో రత్న శోభితమూ సువర్ణగవాక్ష సంభరితమూ, గగన సంచారయోగ్యమూ అప్రతిమానమూ అయిన పుష్పకాన్ని చూస్తున్నాడు.
ఏకాగ్రమయిన తపోదీక్షతో కాని దాన్ని నిర్మించలేరు అది మన మనస్సుని ఊహననుసరించి సాగిపోగలశక్తి కలది. వాయువేగంతో ప్రయాణం చేయగలదు.
త్రైలోక్యవర్తనులూ, మహాత్ములూ, శ్రీ యశో విరాజితులూ అయిన దేవతల భవనంలా కనిపిస్తున్నది.
శరత్కాలచంద్రునివలె ఉన్నది. దర్శన మాత్రంచేత మనస్సుకి ఆహ్లాదం కలిగిస్తుంది. చిన్న చిన్న శిఖరాలతో నిండిన గిరిశిఖరంలా వుంది.
మాంచి తిండిపుష్ఠీ, తీవ్రగమనమూ, విశాలనేత్రాలూ కల గగన చారులయిన రాక్షసులు దాన్ని పరిరక్షిస్తున్నారు.
వసంతసుమశోభతో, వాసంతాధిక మనోహరంగా ఉన్నదది
అంతఃపురం
శరత్కాలచంద్రునివలె ఉన్నది. దర్శన మాత్రంచేత మనస్సుకి ఆహ్లాదం కలిగిస్తుంది. చిన్న చిన్న శిఖరాలతో నిండిన గిరిశిఖరంలా వుంది.
మాంచి తిండిపుష్ఠీ, తీవ్రగమనమూ, విశాలనేత్రాలూ కల గగన చారులయిన రాక్షసులు దాన్ని పరిరక్షిస్తున్నారు.
వసంతసుమశోభతో, వాసంతాధిక మనోహరంగా ఉన్నదది
అంతఃపురం
No comments:
Post a Comment