Wednesday, August 26, 2026

Banasurudu Eswara Prasadambu Nonduta - బాణాసురుడు ఈశ్వర ప్రసాదంబు నొందుట

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - ఉత్తరభాగం - 
బాణాసురుడు ఈశ్వర ప్రసాదంబు నొందుట

పాపరహితుడవైన పరీక్షిన్మహారాజా! బలికి వందమంది కుమారులు. అందులో మిక్కిలి తీక్ష్ణమైనవాడు, దీర్ఘయశస్సు పొందినవాడు, శివుణ్ణి పూజించినవాడు, శత్రువులు అనే చీకటికి సూర్యుడు, వేయిచేతులను కలిగినవాడు, బలికి ప్రథమసంతానమైనవాడు బాణుడు.

తన పరాక్రమంచేత దేవతలను జయించిన బాణుడు కైలాసానికి వెళ్లి భక్తివశుడూ, ప్రమథగణాలతో కూడినవాడూ, మన్మథుణ్ణి జయించినవాడు, తాండవనాట్యంలో నిపుణుడైనవాడు, భక్తరక్షకుడూ అయిన శివుణ్ణి చూశాడు.

తన మనస్సులో, కూర్మి అధికం కావడంతో భూమిపై సాగిలంబడి నమస్కరించి తాండవనృత్యం చేసే సమయంలో శివుణ్ణి చూచి

బాణుడు తన బాహుశక్తికి తగినట్లుగా వాద్యం వాయిస్తూ త్రిలోకరక్షకుడైన శివుణ్ణి సంతోష పరచి, ఉచితరీతిలో ప్రశంసించి మ్రొక్కి ఈ విధంగా పలికాడు.

సుఖప్రదుడవైన ఈశ్వరా! భక్తుల హృదయాలను వశపర్చుకొన్నవాడా!, దురహంకారులైన రాక్షసులను నాశనం చేసేవాడా! ధవళనీలవర్ణ శరీరంకలవాడా!, వాసుకిని చేతికడియంగా ధరించినవాడా!, పార్వతీహృదయేశ్వరా!, యోగులహృదయ వికాసకారకా!, తాండవనృత్య క్రీడయందు ఆసక్తి కలవాడా!, భక్తులను కాపాడేవాడా! నీకు నమస్కారం.

(శివుడు అర్ధనారీశ్వరుడు - కుడివైపు తెలుపు, ఎడమవైపు నలుపు వర్ణం కలవాడు. శివుడు తెలుపు, పార్వతి నలుపు - కనుక ధవళనీలవర్ణుడు.

అని స్తుతించి

ఓ శివా! నా మనస్సులోని కోరిక నీకు స్పష్టంగా చెబుతాను. నీవూ, పార్వతీదేవీ నా నగరంలో కోటరక్షకులుగా ఉండాలి. నేను ఎల్లప్పుడూ మీ పాదపద్మాలనే ఆశ్రయించి ఉంటాను.

బాణాసురుని ప్రార్ధన మన్నించిన శివుడు - గౌరీదేవి, కుమారస్వామి, గణపతులతో - ఇంకనూ ప్రమథగణాలతో వచ్చి శోణపురద్వారందగ్గర కాపుగా నిలిచాడు. ఆ తరువాత ఒకనాడు ఆ బాణుడు

గర్వియైన బాణాసురుడు కెంపులతో కూడిన తనకిరీటాన్ని శివునిశిరస్సుకు తగిలేటట్లు ఆయనకు నమస్కరించి, ఇలా పొగడాడు.

ఓ దేవా! పరమేశ్వరా! దేవేంద్రునిచేత పొగడ్తలందినవాడా! జగన్నాథా! విస్తరించిన చరిత్రకలవాడా! పరిశుద్ధమైనవాడా! హాలాహలాన్ని మింగినవాడా! వాసుకీ మున్నగు నాగరాజులను భుజకీర్తులుగా కలవాడా! చంద్రశేఖరా! భక్తరక్షకా! సర్వలోకాతీత! సద్గుణసమూహా! పార్వతీపతీ! మోక్షప్రదాతా! వెండికొండను గృహంగా కలవాడా! గజచర్మధారీ! రాక్షససంహారకా! శూలపాణీ! లోకనాయకా! ఉత్తమభక్త సమూహాలకు పారిజాతమైనవాడా! మునిజనప్రశంసాపాత్రా!; భక్తులకోరికలను తీర్చేవాడా! శివా! మహామహిమగల నిన్ను పొగడతరమా?(కాదని భావం)

అని ప్రశంసించి

ఓ ఉమాపతీ! నీవు ప్రసాదించిన వేయిచేతుల పరాక్రమాన్ని ఎదిరించి పోరాడగల్గిన వీరుడు ఈ భూమిపై లేడు. ఈ పోరాటనను నేనెలా భరించేది? అని బాణుడు శివునితో అన్నాడు.

దిక్కులు దద్దరిల్లే విధంగా హుంకారం చేస్తూ ధనుష్టంకారం చేసేదీ, చేతుల కదలికవల్ల కలిగే కంకణాల క్రీంకారం గలది, భయంకరమైన భుజదండంలో ప్రకాశించే శ్రేష్ఠమైన ఖడ్గంచేత శత్రురాజుల సమూహాల శిరస్సులను ఖండించేదీ, శరీరాలనుండి భయంకరంగా రక్తధారలు చిమ్మేవిధంగా శూలపుపోట్లు పొడిచేదీ, మదపుటేనుగుల కుంభస్థలాలను బ్రద్దలు చేసే వీరవిజ్బంభణం గలదీ అయిన భీకర సంగ్రామంలో పరాక్రమాన్ని ప్రదర్శించలేని వట్టిచేతుల వలన ఉపయోగమేమున్నది? ఆ కరాలు నావంటి వీరులకు దుఃఖకరాలే గానీ సంతోషకరాలు కావు కాదా స్వామీ!

ఓ పరమేశ్వరా! నా శౌర్యపరాక్రమక్రీడ ఎదిరించడానికి నీవు తక్క నాకు సమానమైన బలం కలవాడు ఈ విశాల భూమండలంలో ఎక్కడా లేడని చెప్పిన బాణుని మూర్ఖత్వానికి శివుడు అసహ్యించుకొని, తనలో కోపసముద్రం ఉప్పాంగుతుండగా వానితో ఇలా అన్నాడు.

మందబుద్ధివైన బాణాసురా! ఎప్పుడు నీ తేరిజెండా అకారణంగా భూమిమీద పడుతుందో అప్పుడు నీ చేతులు తెగునట్లుగా నా అంతవానితో నీకు యుద్ధం కలుగుతుంది.

శివుని మాటలు విన్న బాణుడు కోరిక నెరవేరినవాడై, తన భుజ వినాశానికి కావలసిన పనిలో నిమగ్నుడై చాలాసంతృప్తిని పొంది తన భవనానికి వెళ్లి, భార్యలమనస్సుల్లో ప్రేమను చిగురింపచేస్తూ - హాయిగా వాళ్లతో కాలం గడుపుతూ, ఏ సమయంలో తన రథకేతనం కూలుతుందో అని వేచి ఉన్నాడు.

(దురదృష్టానికి అర్రులు చాచేవాడుంటాడా? అన్నట్లు బాణాసురుని మూ
ర్ఖ మనస్తత్వవ్యక్తీకరణానికి ఉదాహరణంగా చిత్రించబడింది. 'వినాశకాలే విపరీతబుద్ధిః' అని సూక్తి.

బాణునికుమార్తె ఉషాకుమారి తన భవనం పై భాగంలో నిద్రించింది. నిద్రలో తను ముందెన్నడూ విననీ, కననీ అసమాన సౌందర్యవంతుడైన అనిరుద్దునితో సుఖీంచినట్లుగా

స్వప్నం అనుభవించిన ఉషాకన్య మేలుకొంది. ఆమె కండ్లనుండి ఆనందంతో కన్నీరుకారుతున్నది. ఇది స్వప్నం కాక నిజమే నేమో అనే భ్రాంతి కలిగింది. కలలో కన్పించినవాని ఆకారం ముఖంపై కదులుతున్నట్లయింది. గాలిలో ఆ రూపాన్ని కౌగిట్లో గట్టిగా బంధించుకొంటూ

రసవంతాలూ, సౌమ్యాలూ అయిన సంభాషణలు, పైటనూ, జుట్టునూ లాగడం, చెక్కిళ్లను, నుదుటినీ, వడ్డాణాన్నీ చేతుల్నీ, ఎదనీ, చంకల్నీ, పొదివి పట్టుకోవడం - ఇలాంటివన్నీ మన్మథుడు అచ్చుగుద్దినట్లుగా ఉషాకన్య మనస్సుకు గట్టిగా తగిలాయి.

ఆమె చేష్టల్లో, భావంలో ప్రియునిపైగల ప్రేమ వ్యక్తమవుతూంది. హృదయంలో సిగ్గు కలిగి ఆమెశరీరంపై రోమాంచ మేర్పడుతున్నది. ఆమె మనస్సు మదనాగ్నిచే తపింపబడడానికి చిహ్నంగా ఆమె వక్షఃస్థ్సలంపై నున్న ముత్యాలహారాలు కందిపోతున్నవి.

ఆమె మనస్సు ప్రియునిపై లగ్నంకావడంతో మారుమాటలాడలేక పోతున్నది. ఆమెమనస్సులో సిగ్గు, వలపు, భయం కలిగాయి. ఆమెను మంచుక్రమ్మిన పద్మంవలె ఉంది. తొలివలపు భారంచే సంప్రదాయానుసారంగా ధరించవలసిన మేలిముసుగు కూడా ధరించలేకపోయింది.

ఉష విరహబాధను పొందుతున్నపుడు ఆమె చెలికత్తెలు ఆమెను సమీపించారు. అప్పుడు ఉష తన మనస్సులోని వికారాన్ని వారికి తలియకుండా మరుగుపరుస్తూ - అప్పుడు

మాటిమాటికీ వచ్చే నిట్టూర్పుల్ని పుక్కిట్లోనే అణచుకొని నిల్పేసింది. ఎదపై వ్యాపించిన సన్నని చెమట బిందువుల్ని మెల్లగా తుడిచింది. కన్నీటిముంపును రెప్పలచాటున దాచింది. నక్షత్రాలను చూద్దాం రండని పిలిచి, ముఖం ఆకాశం మీదికి ఎత్తి తన నాయకునిపై నుండే ప్రేమను దాచింది.

ఉష ఈ పద్ధతిలో ప్రవర్తిస్తుండే సమయంలో

ఉషకు క్రమంగా బాధ అధికమైంది. కన్నీటిప్రవాహంతో వక్షోజాలు తడుస్తున్నాయి. చెలికత్తెలవైపు చూడలేక, ముఖమెత్తి వారితో మాటాడలేక సిగ్గుపడి ఊరకుండిపోయింది.

బాణాసురుని మంత్రి కుంభాండకుని కుమార్తె చిత్రరేఖ, ఆమె ముఖసౌందర్యం చంద్రుణ్ణి మించింది. బాణుని కుమార్తె ఉషకు ఆమె బహిఃప్రాణం.

చిత్రరేఖ ఉషదగ్గరకు వచ్చి ఆమెను చూచి

ఉష తన ప్రియుణ్ణి బహిఃప్రదేశంలో వెదకుతున్నట్లుగా, ప్రాణనాథునికి దూరమై బాధపడుతున్నట్లు, చేతికి దొరకిన పతిని కోల్పోయిన భ్రాంతిని పొందినట్లు చెలికత్తె గమనించింది.

'ఉషా! నా కంటె ఇష్టమైనవారు నీకు ఎవరు ఉన్నారు? నీ కోరిక నాకు చెప్పకపోతే, మీ తండ్రిపై ఒట్టు అనగానే ఆమె సిగ్గుతో కూడిన నవ్వుగలదై చెలితో ఇలా పలికింది (ఆమె నవ్వును సిగ్గు అణిచేస్తుంటే - ఎట్లో తప్పించుకొని నవ్వింది. అంటే ఆమెకు నవ్వుకంటే ఆ సిగ్గే ఎక్కువయింది).

ఉష చిత్రరేఖను చూచి ఈ విధంగా చెప్పింది.

ఓ 
చెలీ! నా స్వప్నంలో పద్మనేత్రుడు, ముత్యాలహారాలు, రత్నకుండలాలూ, చేతి కడియాలూ, ఉంగరాలూ, అందెలూ ధరించినవాడు, బంగారువర్ణం దుస్తులు ధరించినవాడు, కోమల శరీరం కలవాడు, నీలదేహుడు, ఎత్తైన వక్షఃస్థలం కలిగి నవమన్మథుడుగా ఉన్నవాడు కన్పించాడు.

చెలీ చిత్రరేభా! ఆతడు నా మనస్సు సంతోషించేటట్లు నన్ను దగ్గరకు తీసుకొని, గాఢమైన కౌగిట చేర్చుకొన్నాడు. అధరామృతమిచ్చాడు. మన్మథక్రీడలో తేల్చి, మృదువైన మాటలు చెప్పి, దుఃఖ సముద్రంలోకి, త్రోసి వెళ్లిపోయాడు.

ఉషమనస్సు మన్మథవశమై కూడి విరహవేదన కలత పెట్టగా, ఆమె కన్నీరుమున్నీరుగా వగచి, వివర్ణమైన చెందిన ముఖం వంచుకొని మిన్నకుండిపోయింది. ఆమె బాధను చూచి బాగా ఆలోచించిన చిత్రరేఖ ఇలా అంది.

ఉషా! నీవు విచారించడం ఎందుకు? దేవతలు, మానవులు, యక్షులు, కింపురుషులు, నాగులు, కిన్నరులు, ఖేచరులు, కింపురుషులు, సిద్దులు, సాధ్యులు - ఈ జాతులకు ప్రభువులైన పురుషుల్ని చిత్రపటాలలో లిఖించి, చూపుతాను. వారిలో నీ మనస్సును హరించిన ప్రియుణ్ణి గుర్తించగానే అతణ్ణి నీ ఒద్దకు తీసుకొని వస్తాను.

అని చెప్పి ఉషాకన్యను అంగీకరింపజేసింది. మంచువలె కాంతిమంతమైన వస్త్రాన్ని సిద్ధం చేసింది. వజ్రంలాంటి తెల్లని సున్నాన్ని ఆ వస్త్రానికి పూసింది. అయిదు బంగారు, వెండి పాత్రలలో ఐదు రంగుల్ని నింపుకొనింది. ఒక చేతిలో కుంచెను ధరించి, రంగులతో నిండినపాత్రల్ని తీసుకొని ఏకాంతప్రదేశానికి వెళ్లింది.

ముల్లోకాలలో ప్రసిద్ధి చెందినవాళ్ల చిత్రాలు లిఖించింది. వారి పేర్లూ, గోత్రాలూ వ్రాసింది. అలా పూర్తి చేసిన చిత్రపటాన్ని తెచ్చిచూపింది. వీరినిగూర్చి పూర్తిగా చెబుతాను. విను అని చెప్పసాగింది.

ఉషా! సంగీతకోవిదులైన గంధర్వులు, కిన్నరులు, కింపురుషులు - వీరే! నిత్యయౌవనులు, స్వేచ్చావిహరులు, ఆకాశగమనులు అయిన సిద్ధులు, సాధ్యులు, చారణులు - వీరే! నిర్మలమైన సౌఖ్యసంపదల మహిమగల్గిన దేవతలు, మరుత్తులు, యక్షులు, రాక్షసులు - వీరే! కళానిధులై, కామరూపులై ప్రశస్తులైన నాగకుమారులు - వీరే! చూడుము అని ఆమె చూపించగా అందు తన ప్రియుడు కన్పించనందున మిన్నకున్నది. చిత్రరేఖ అప్పుడు భూలోకంలోని రాజుల్ని చూపసాగింది.

ఓ రాజకుమారీ! వీరు - మాళవ, కొంకణ, ద్రవిడ, మత్స్య, పుళింద, కళింగ, భోజ, నేపాల, విదేహ, పాండ్య, కురు, బర్బర, సింధు, యుగంధర, ఆంధ్ర, బంగాళ, కరూశ, టేంకణ, త్రిగర్త, సుధేష్ట, మరాట, లాట, పాంచాల, నిషాద, ఘూర్జరక, సాళ్వదేశప్రభువులు చూడుము.

ఓ రాజకుమారీ! సింహపరాక్రముడూ, చంద్రుడు, హంసలు, పాలసంద్రం, మంచిగంధం - వీటివలె స్వచ్చమైన కీర్తిగలవాడు, బలగర్వితులైన శత్రురాజులనెడి చీకటిని కూల్చే సూర్యునివలె మహాతేజోవంతుడు, బృహదశ్వుని కొడుకు, మగధదేశాధీశ్వరుడూ అయిన, జరాసంధుడు - ఇతడు. చూడుము.

ఓ ఉషా! సమస్త రాజులందరిచేత పొగడ్తలందినవాడు, భుజబలసంపన్నుడు, భయంకరయుద్దాల్లో నేర్పరి, మూడలోకాల్లో ప్రఖ్యాతచరిత్ర కలవాడు, స్వచ్చమైన కాంతిమంతమైన అలంకారాలు కలవాడు, విదర్భప్రభువైన భీష్మకునివైన కుమారుడు రుక్కి అనే ఇతణ్ణి చూడమ్మా!

జింక కన్నులవంటి తళుకు బెళుకులుగల కన్నులున్న ఓ ఉషా! ఈయన శత్రు సైన్యాన్ని రణరంగంలో చెండాడేవాడు. శత్రురాజుల చతురంగబలాన్ని తన పరాక్రమంతో జయించిన మహాయశస్వి - కాళింగుడు సుప్రసిద్దుడు. అట్టి వీరాగ్రేసరుణ్ణి చూడమ్మా!

ఈశ్వరుణ్ణి మెప్పించి మహాశక్తిమంతమైన శూలాన్ని పొందినవాడు, ప్రపంచంలోని రాజుల్లో మిక్కిలి పరాక్రమవంతుడు, యుద్దొత్సాహుడు, భూదేవిమనుమడు అయిన ప్రాగ్జ్యోతిషపురప్రభువయిన భగదత్తుణ్ణి చూడవమ్మా! పద్మముఖీ!

శ్రీమన్నారాయణుడు ధరించే ఖడ్గం, చక్రం, శంఖం, గద మున్నగు చిహ్నాలు తానూ ధరించి, వాసుదేవుడనే పేరుగల శ్రీకృష్ణుణ్ణి ఎల్లపుడు ద్వేషించేవాడు, కాశీరాజుకు స్నేహితుడు అగు ఈ పౌండ్రక వాసుదేవుడు అనే కుతూహలంతో చూడమ్మా! చంద్రముఖీ!

బ్రాహ్మణుల సేవ; సత్యవ్రతం, సత్ప్రవర్తన, బాహుగర్వం, బుద్ది, విజయాటోపం, ధనుర్విద్యా నైపుణ్యం కలిగి, చంద్రవంశ ప్రదీపకులైన ధర్మరాజును, భీముణ్ణి, అర్జునుణ్ణి, నకుల సహదేవుళ్లను చక్కగా చూడు - రాజకుమారి!

కమలాక్ష! తన పరాక్రమంతో శత్రురాజులను అణచివేసి కప్పాలు తీసుకొనేవాడు; మహాప్రతాపసంపన్నుడూ, రారాజు అనే కీర్తిని పొందినవాడు అయిన, తన సోదరులతో కూడిన దుర్యోధనుణ్ణి జూడు.

ఈ విధంగా రాజులందరిని చూపుతూ, యదువంశంలో జన్మించిన శూరసేనుడు, వసుదేవుడు, ఉద్ధవుడు మొదలగువారిని చూపింది. ఇంకా

రాక్షస రాజకుమారి! శరత్కాలమందలి మేఘంవలె, పచ్చకర్పూరంవలె, చంద్రునివలె, వెన్నెలవలె, చందనంవలె, శోభిస్తున్న ఈతడు బలరాముడు. ఉత్తమనాయకుడు, మదించిన శత్రురాజులనే కాననానికి అగ్నిదేవునివంటివాడు. ప్రలంబరాక్షసుణ్ణి సంహరించినవాడు, హలాయుధుడు. ఇతణ్ణి చూడవమ్మా! ఉషాకన్యా!

రాక్షసరాజకుమారీ! కంటికి ఇంపైన శరీరసౌందర్యంగలవాడు, పద్మపత్రాలవంటి విశాలనేత్రాలు గలవాడు, పవిత్రమైన నడవడిక కలవాడు, ఎల్లప్పుడూ సత్యమే సంకల్పంగా గలవాడు, రాక్షసులను సంహరించడంలో ఉగ్రస్వరూపుడు, శివునిచే నమస్కరింపబడేవాడు, ఆదిశేషునిపై పవ్వళించినవాడు, వక్షఃస్థ్స
లంలో కౌస్తుభమణిని ధరించినవాడు, గంభీరమైన కంఠస్వరంతోపాటు గంభీరంగా, మధురంగా మాట్లాడేవాడు, ఆశ్రితుల్ని రక్షించేవాడు, నల్లని మేఘంవంటి శరీరకాంతి గలవాడు, దుష్టశిక్షణ చేసినవాడు, పీతాంబరమనే పచ్చని పట్టువస్త్రాన్ని ధరించినవాడు, పాపాలనే రోగాలకు ఔషధమిచ్చే వైద్యుడు(భవరోగ వైద్యుడు), ఉపనిషత్తులచే తెలియదగినవాడు, దివ్యులైన మునులచే కీర్తింపబడినవాడు, తన పాదస్పర్శచే ఈ భూమిని పవిత్రీకరించినవాడు, నిత్య జయశీలుడు, సద్గుణాలచే అలంకరింపబడినవాడు అయిన ఈ శ్రీకృష్ణుణ్ణి చూడవమ్మా ఉషాకుమారీ!

కోమలీ! ఈయన రుక్మిణీసుతుడయిన ప్రద్యుమ్నుడు. తన వింటినారి నుంచి విడువబడిన పుష్పబాణాల తాకిడిచే బ్రహ్మాదిదేవతలను చలింపజేయగల్గిన మన్మథుని అవతారమే ఈ ప్రద్యుమ్నుడు. చూడవమ్మా చూడు!

ఈ విధంగా బలరామకృష్ణ ప్రద్యుమ్నుల్ని చూపగా

స్త్రీలలో శ్రేష్ఠురాలైన ఉషాకుమారి కృష్ణుని కుమారుడైన ప్రద్యుమ్నుణ్ణి సాలోచనగా చూచి, వెంటనే తనను వరించి, ప్రేమించి వెళ్లిన సుగుణవంతుడు ఇతడేనని మనస్సులో సందేహించి, ఆ తర్వాత పద్మపత్రనేత్రుడైన, అపర మన్మథాకారుడైన అనిరుద్దు డనే పేరుకలవాణ్ణి కనులు విప్పిచూచి సంతాపంతో ఇలా అన్నది.

చిత్రరేఖా! నా మానధనం అంతటినీ దొంగిలించిన వీనిస్వరూపాన్ని చిత్రించి చూపావు. పుణ్యస్వరూపిణివైన నిన్ను ప్రశంసించే నేర్పు నాకుందా? నీ చరిత్రలు నాకు కొత్తకాదు. ఈ వీరునికులాన్ని, పరాక్రమాన్ని నాకు తెల్పుము.

చిత్రరేఖ రాజకుమారి అయిన ఉషతో ఇలా చెప్పింది. ఈ బాలుడు యాదవ వంశమనే అమృత సముద్రానికి చంద్రునివంటివాడు. శ్రీకృష్ణునియొక్క మనుమడు గొప్పనడవడిక కలవాడు. మిక్కిలి అందగాడు, సింహ శరీరుడు. ఈయన పేరు అనిరుద్ధుడు.

అని చెప్పి నేను మిక్కిలి వేగంతో వెళ్లి ఆ కుమారుణ్ణి తీసుకొనివస్తాను. అందాకా నీవు విచారించకు మనిపల్కి ఆ క్షణమే ఆకాశయానంలో వెళ్లి ఎదుట

ఎల్లప్పుడూ శుభాలతో నిండిందీ, తనను చూచినంతనే సంసారదుఃఖాల్ని తొలగించేదీ, ముక్తిసాధనమైందీ, పుణ్యతేజస్సును కలిగించేదీ అయిన శ్రీకృష్ణుని ద్వారకానగరాన్ని చిత్రరేఖ కళ్లారా చూచింది.

ద్వారకానగరాన్ని చూచి, దాని సుందరత్వానికి చాలా సంతోషించింది. రాత్రి సమయంలో ద్వారకలో ప్రవేశించింది. అక్కడ స్త్రీల పాదాలకుగల మణులు పొదిగిన అందెలయొక్క రుణరుణధ్వనులతో ప్రతిధ్వనించే మణిగోపురాలున్నాయి. ఆ నగరంలోని మేడపైనున్న చంద్రకాంతశిలాభవనంలో హంసతూలికాతల్పం పై రతిసుఖశ్రమవల్ల నిద్రిస్తున్న అనిరుద్దుణ్ణి తన యోగవిద్యావిశేషంతో గ్రహించి, ఉషాసుందరీ భవనానికి చేర్చి, అందు ఆమెశయ్యపై పరుండబెట్టి చిత్రరేఖ ఇలా అంది.

ఉషా! మేరుపర్వతంతో సమానమైన ధైర్యవంతుడు, పరాక్రమవంతుడు, నవమన్మథుడు, సముద్రునివలె గంభీరమైనవాడు, శత్రువీరుల్ని సంహరించేవాడు, అయిన నీపతి అనిరుద్ధకుమారుణ్ణి చూడు.

చెలిపలుకులకు ఉష మనస్సులో ప్రేమకలిగింది. శరీరంలో పులకాంకురాలు కలిగాయి. సంతోషంవల్ల కళ్లనుండి నీరు కారసాగింది. ముఖంలో కాంతి అతిశయిస్తుండగా

ఉషమనస్సుకు సంతోషం కాగా చిత్రరేఖను చూచి ఈ విధంగా పలికింది.

ఓ చిత్రరేఖా! నీ స్నేహమనే సూర్యకాంతిచే నా మన్మథతాపం అనే చీకటి నశించింది. నీ సఖిత్వం అనే ఓడను ఆధారం చేసుకొని మిక్కిలి ఎడబాటు అనే సముద్రాన్ని దాటాను. నీ సంబంధం అనే అమృతవర్షంచేతనే మన్మథతాపాన్ని ఆర్పినాను. నీ స్నేహమనే అంజనంవల్ల నా ప్రియుడు అనే నిధిని కనుగొన్నాను. ఆకారాన్ని చూచిన వెంటనే చిత్రాన్ని చిత్రింపకలవారుగానీ, ఔనని అంగీకరించిన వెంటనే తీసుకొనివచ్చేవారు కానీ ఎవరైనా ఉందురా? నీటిలో దారిని ఏర్పరచడం, నీకుతప్ప ఆ స్వర్గమర్త్యపాతాళలోకాలలో ఎవ్వరికైనా సాధ్యమౌతుందా?

అని చిత్రరేఖను ప్రశంసించి, ఆమెను ఆమెభవనానికి వెళ్లవలసిందిగా చెప్పిపంపింది. తరువాత ఇతరులెవరూ ప్రవేశింపలేని భవనంలో అనిరుద్ధుడు మేల్కొని ఉషను చూచాడు. అప్పుడు

అందమైన, సుకుమారమైన సెజ్జపై బిగికౌగిలింతలు, సరసపు మాటలు, భావాలు, కళలూ - వీటియందలి నేర్పు తగినట్లుగా, మదనకళాతంత్రజ్ఞుడైన అనిరుద్ధుడు ఉషాకన్యతో శృంగారలీలావిలాసాలను అనుభవించాడు.

ఈ విధంగా మనస్సును హరించే ఆభరణాలు, పూలదండలు, మైపూతలు, షడ్రసోపేతభోజనాలు, కర్పూరతాంబూలాలు, ఆటలు, పాటలు, అగరుధూపాలు, మణిదీపాలు, వీణావాదనలు మున్నగువానితో సూర్యోదయాస్తమానాలు తెలియనంతగా ఒక్కటై కాలం హాయిగా గడిపారు.

(ఉపభోగములు : 1. అనుభవం 2. ఆస్వాదించుట 3. తినుట 4 వినియోగించుట 5. సంభోగం 6.విషయసుఖం.)

ఈ విధంగా కాలం మిక్కిలి వేగంగా గడుస్తుండగా ఉషాకన్యకు గర్భమేర్చడి చిహ్నాలు స్పష్టంగా కన్పించాయి.

రాణివాసపు కావలివారు ఉషాబాలలో కన్పించే గర్భచిహ్నాలు చూశారు. భయపడ్డారు. ఈ రాజకుమార్తెకు గర్భం ఏ విధంగా కలిగింది అనుకొంటూ బాధపడ్డారు.

ఏ విధంగా జరిగిందో అని తమలో తాము గుసగుసలాడుకొంటూ, ఈ విషయాన్ని తప్పక ప్రభువగు బాణాసురునికి చెప్పాలి అనుకొని, ప్రభువగు బాణాసురుని వద్దకుపోయి సవినయంగా నమస్కరించి

రాక్షసప్రభువైన బాణునితో కావలికాచే భటులు ప్రభూ! మేము కన్యాంతఃపురాన్ని ఎంతో రహస్యంగా, జాగ్రత్తగా కనిపెట్టి పరిశీలిస్తూ ఉంటాము. సురారీ! అందు పోతుటీగలకైనను ప్రవేశించడం కష్టం కాగా ఇక కొత్త మగవారి విషయం చెప్పడానికి వీలులేదు.

జాగ్రత్తగా కాపలాకాస్తున్నా ఏ కనుకట్టోకాని మాకెవ్వరికీ తెలియకుండ, మీ కుమార్తె గర్భవతి అయింది అనేమాటలు విన్నబాణుడు కోపోద్రిక్తుడై

ఆ సమయంలో రాక్షసశ్రేష్ఠుడైన బాణాసురుడు కోపంతో భయంకరుడై చెక్కిళ్లు అదరుతుండగా, కనుబొమలు ముడివడుచుండగా కండ్లనుండి నిప్పురవ్వలు రగులుతుండగా జూలు లాగిన సింహంవలె దాటుతూ ఖడ్గాన్ని ధరించి, ఉష భవనంలోకి మహావేశంతో ప్రవేశించి.

బాణాసురుడు అనిరుద్ధుని నాగపాశబద్దుని జేయుట







No comments:

Post a Comment

Naraduni Valana Vruthanthamunu Vini Krishnudu Banasurunipai Dandetthuta - నారదుని వలన వృత్తాంతమును విని కృష్ణుడు బాణాసురునిపై దండెత్తుట

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - ఉత్తరభాగం -  నారదుని వలన వృత్తాంతమును విని కృష్ణుడు బాణాసురునిపై దండెత్తుట శరత్కాలమేఘం పాదరసంవంటి స్వచ్చమైన శరీ...