Sunday, August 23, 2026

srikrishnudu akruruni hastinaapurambunaku bamputa - శ్రీకృష్ణుడు అక్రూరుని హస్తినాపురంబునకు బంపుట

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము - 
శ్రీకృష్ణుడు అక్రూరుని హస్తినాపురంబునకు బంపుట

అక్రూరా నీవు మాకు బాంధవుడివి. సమయానికి మేలును కూర్చేవాడివి; వరుసకు గమనిస్తే తండ్రివి (పినతండ్రి), దయాసముద్రుడివి; గుణాలపట్ల గుడ్డిగా ప్రవర్తించనివాడివి. మమ్మల్ని కాపాడడానికి అన్నివిధాలా నీవు సమర్థుడవు.

(వృష్టివంశంలో శ్రీకృష్ణుడు జన్మించాడు. అదే వంశానికి చెందిన శ్వఫల్కుని పుత్రుడు అక్రూరుడు. ఈ దృష్టితో బంధువు, జనకసమానుడు అవుతాడు.)

మానవులు తాము తలచిన కోరికలు నెరవేరాలని ఆశిస్తారు. దానికోసం రాతివిగ్రహాలను, పుణ్యతీర్థాలను సేవిస్తారు. అలా పూజించవద్దు అనకూడదు కానీ, భగవంతునిపాదాలను నిత్యం సేవించే మీ వంటి భక్తులను దర్శిస్తేనే చాలు అనుకొన్నవి నెరవేరతాయి. ఆ విగ్రహాలు, తీర్ధాలు మీలాగా అతిసులభంగా కోరికలను నెరవేర్చలేవు.

గొప్ప మనసున్నవాడా! నీవు భాగవతులలో శ్రేష్ఠుడివి. మా ఇష్టాలను నెరవేర్చగల శక్తిమంతుడివి. మా మనవి ఆలకించు. పాండురాజు మరణించగా, కుంతీదేవి తన కొడుకులైన పాండవులతో పాటు, ధృతరాష్రుని ఆజ్ఞ ననుసరించి హస్తినాపురానికి వచ్చి, అక్కడ ఉన్నారట. ఆ ధృతరాష్ట్రుడికి కొడుకైన దుర్యోధను డంటే గుడ్డిప్రేమ. ఆ పుత్రవ్యామోహం కారణంగా పాండవులపట్ల సమభావాన్ని చూపడంలేదు. కాబట్టి

చంద్రవంశంలో పుట్టినవాడా! అక్రూరా! ఆ పాండవులు మనకు బంధువులు. కాబట్టి, వాళ్లకు మేలుచేయాలి. వాళ్లను సంతోష పరచాలి. వాళ్ల దుర్దశలను తొలగింప చేయాలి. కాబట్టి, వాళ్లను చూడడానికి నీవు వెళ్లు.

అని చెప్పాక, శ్రీకృష్ణుడు బలరామ ఉద్ధవులతో కలిసి తన ఇంటికి వెళ్లాడు. అక్రూరుడు హస్తినాపురానికి వెళ్లాడు. అది కౌరవుల రాజధాని. అక్కడ ధృతరాష్ట్రుణ్ణీ, భీష్ముణ్ణీ, విదురుణ్ణీ, బాహ్లికుణ్ణీ, భారద్వాజు
ణ్ణీ, గౌతముణ్ణీ, దుర్యోధనుణ్ణీ, కర్ణుణ్జీ, అశ్వత్థామనూ మొదలైనవాళ్లనూ, కుంతీదేవితోపాటు ఉన్న పాండవులనూ చూచాడు. తక్కిన బంధువులనూ కూడా చూచాడు. 

వాళ్లనుండి తగిన రీతిలో గౌరవమర్యాదలను పొందాడు. వాళ్లవాళ్ల ప్రవర్తనలను గ్రహించాడు. కొన్నాళ్లు అక్కడ ఉన్నాడు. అలా ఉండగా, ఒకరోజు ఏకాంతంలో కుంతీదేవి విదురుడు వింటుండగా, అక్రూరునితో ఇలా అనింది.

అన్నా అక్రూరా! మా తలిదండ్రులు; అక్కచెల్లెళ్లు, అల్లుళ్లూ, మా అన్నదమ్ములు నిన్ను ఈ హస్తినాపురానికి పంపే వేళలో ఏమని చెప్పారు? వాళ్లు మా దుఃఖాల్నిగురించి ఆలోచిస్తున్నారా? సుఖంగా ఉన్నారా? దుర్బుద్దులైన ఈ కౌరవుల మధ్య నేను తోడేళ్లగుంపు నడుమ ఉన్న ఆడుజింకలా ఉన్నాను.

ఈ ధృతరాష్ట్రుని కొడుకైన దుర్యోధనుడున్నాడే - వాడు చాలా క్రూరుడు. నా బిడ్డలతో కొంచెంకూడా సరిగా ఉండడు. నా పిల్లలను పాములతో కరిపింపచేశాడు. తీగలతో బంధించి కుటిలత్వంతో గంగానదిలో తోయించాడు. విషాన్ని కలిపిన అన్నం తినిపించాడు. గాఢనిద్రలో ఒళ్లు మరచి ఉన్నప్పుడు ఆయుధాలతో పొడిపించాడు.

బలరాముడూ, శ్రీ కృష్ణుడూ ఎప్పుడైనా తమలో తాము మాట్లాడుకుని మేనత్త అయిన కుంతిబిడ్డలు పాండవులకు మంచి జరగాలని ఆలోచిస్తారా? ఏడుపులతో, బాధలతో వీళ్లు కృశించిపోతున్నారే అయ్యో! పుండరీకాక్షుడూ, భక్తవత్సలుడూ అయిన శ్రీకృష్ణుడు ఈ భూమండలాన్ని(రాజ్యాన్ని) నా బిడ్డలకు శ్రేష్ఠపద్ధతిలో సమభాగంగా పంపకాలు చేసిస్తాడా?

అని చెప్పి, శ్రీకృష్ణుణ్ణి మనసులో నిలుపుకుని కుంతి నమస్కారం చేసింది. అతణ్ణి స్తుతించింది. 'అంతటా నిండి ఉన్నవాడా! అంతటినీ పాలించేవాడా! తెల్ల తామరరేకులలాంటి కండ్లు గలవాడా! నిన్ను శరణుకోరాను, నన్ను రక్షించు' అని దుఃఖపడింది. అలా ఏడుస్తున్న కుంతిని అక్రూరుడు విదురునితో కలిసి చల్లనిమాటలతో ఓదార్పాడు. అక్కడినుండి సెలవు తీసుకున్నాడు. ఆ తర్వాత బంధువుల, స్నేహితుల మధ్య సుఖంగా కూర్చొని ఉన్న ధృతరాష్ట్రుని దగ్గరకు వెళ్లాడు. అతనితో ఇలా అన్నాడు.

అక్రూరుండు ధృతరాష్ట్రునితో హితోపదేశముగా సంభాషించుట


నిత్య స్తోత్రావళి

నిత్య పారాయణ శ్లోకాలు

స్తోత్రాలు

పంచాంగం

No comments:

Post a Comment

rukmini kalyana katha praarambhamu - రుక్మిణీ కల్యాణ కథా ప్రారంభము

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము -  రుక్మిణీ కల్యాణ కథాప్రారంభము ఓ పరీక్షిన్మహారాజా! మునుపు బ్రహ్మదేవుడు ఆజ్ఞాపించడం వల్ల రైవతుడనే రా...