సాగి సాగి హనుమంతుడు
ఏనుగు దంతాలతో, పదారు వన్నెల బంగారు కాంతితో, స్ఫటిక, వెడూర్య, రత్నాలతో అలంకృతమయిన శయ్యను చూశాడు. ఒకవంక చంద్రకాంతితో తెల్లని గొడుగు. మరొక వంక సూర్యకాంతితో, అశోక పుష్పమాలలతో అలరారే ఆసనం. శయ్యమీద అజిన చర్మం.
అగరు ధూపాలు, సుగంధ ధూమ వాసనలు. తెల్లని వింజామరలతో అందగత్తెలు.
ఆ శయ్యమీద మేఘసన్నిభుడైన మహావీరుని చూశాడు, పొడుగాటి బాహువులు, భుజాలకు తాకుతూ వెలుగులీనే కర్ణకుండలాలు, చీనాంబరం, శరీరమంతా మంచిగంధపుపూత. సంధ్యాకాలంలో ఎరుపెక్కిన ఆకాశం మీద మెరుపు కాంతుల మేఘంలా వున్నాడు.
లతా, తరుశోభితమయిన మందరగిరిలా ఉన్నాడు. హాయిగా మధుపానం చేసి, మదవతీ పరిరంభసుఖం అనుభవించి విశ్రాంతి తీసుకున్నట్టు ఉన్నాడు.
కొంచెం దగ్గరగా వెళ్ళాడు హనుమంతుడు.
బుస కొడుతున్న కోడెత్రాచులా వున్నాడు.
ఆ ఆకారం చూసి కొద్దిగా జంకి వెనుకడుగు వేసి, మరొక వేదిక మీదకు నడిచి చూశాడు.
మత్తేభం అధివసించిన ప్రస్రవణగిరిలా ఉంది, రావణుడు నిద్రిస్తున్న అ శయ్య.
ఇంద్ర ధనుస్సులా వున్నాయి వాని బాహువులు.
దేవేంద్రుని ఐరావత దంతపు దెబ్బలు తిన్న ఆ బాహువులు, వజ్రాయుధాన్ని ఢీకొని గట్టి బొప్పికట్టి వున్నాయి. విష్ణుచక్రపు రాపిడికూడా అనుభవించాయి.
చక్కగా, బలిసి, మంచి కణుపులతో, సర్వలక్షణలక్షితములై అలరారుతున్న గోళ్ళతో, వ్రేళ్ళతో ఆ బాహువులు అయిదు పడగలపాములా ఉన్నాయి. వాటికి మంచిగంధపు పూతలున్నాయి. మందరగిరిమీద తీవ్ర క్రోధంతో నిద్రిస్తూన్న మహాసర్పాలవలె వున్నాయి.
అంతటా సురపాన్న సౌరభం, పాగడపూల పరివుళం. మధుర మదిరాగంధం - అది అంతా ఆ రావణుని నిశ్వాసవాయువే.
మణి, రత్నకాంతులీనే కిరీటం, రత్నకాంతులినే కుండలాలు.
రక్త చందనాల కృతం, మణిహార భూషితం అయిన విశాల వక్షస్థ్సలం పసుపురంగు పంచె. తెల్లని ఉత్తరీయం.
చూస్తున్నాడు హనుమంతుడు.
గంగానది ఒడ్డున విశ్రమించే ఎనుగులా వున్నాడు. మినుముల రాశిలా ఉన్నాడు. నలువంకలా వెలిగే దీపకాంతులలో మెరుపుల మధ్య మేఘంలా ఉన్నాడు.
ఆ రాక్షసేంద్రుని పాదసమీపంలో కొందరు భార్యలు. వారు చంద్రవదనలు, పుష్పమాలాలంకృతలు, నాట్య సంగీత కౌశలంగల వనితలు కొందరు ఆయన కటి ప్రాంతంలోనూ, భుజసీమ దగ్గరావున్నారు. వారందరితో గృహం తారాశోభితమయిన ఆకాశంవలె ఉన్నది.
అలసి, అలసి నిద్రిస్తున్నారు దొరికిన చోట, కొందరు.
ఒకతె నాట్యభంగిమలోనే నిద్ర సాగిస్తున్నది.
నదిలో తరంగాలతో కదలిపోయి నావ చాటున చేరిన కమలం వలె, ఒక కమలముఖి వీణను కౌగలించుకుని ఉంది,
పసిపాపను చంకలో ఉంచుకున్నట్టు మృదంగాన్ని పట్టుకుని మరొక మదవతి.
చిరకాలానికి తిరిగి వచ్చిన ప్రియుని గాఢంగా ఆలింగనం చేసుకున్నట్టు ఒక మదిరాక్షి భేరీవాద్యాన్ని చుట్టుకుని పడుకుంది.
ఏకాంతంలో ప్రియుని ఆలింగనంతో పరవశిస్తున్నట్టు ఒక కాంతామణి చేతిలోని వేణువునే గుండెలకు హత్తుకుంది.
మరొకతె మద్దెల నానుకుని నిద్రించింది.
భుజముల మధ్య మృదంగం ఉంచుకుని ఒకతె. కొంచెం వయసు వచ్చిన కొడుకుని దగ్గరగా తీసుకున్నట్టుంది, భేరీ వాద్యాలింగనంతో, ఒకతె;
వసంతవేళ నీటితో తడిపిన పూలమాలలా ఉన్న దొక పూబోణి పగలకొట్టిన కుండనీటిలో తడిసి.
సువర్ణ కలశాల వంటి వక్షోజాలను బిగించుకుని నిద్రించే ప్రొఢ ఒకతె-
ఒక చంద్రానన మరొక సుశ్రోణిని కౌగలించుకుని పరవశంతో నిద్రిస్తున్నది.
కామ తీవ్రతగల కామినీజనం తమ ప్రియులను ఉత్తుంగ కుచాలతో కుమ్ముతున్నట్టు పెద్ద పెద్ద భేరీవాద్యాలను ఆలింగనం చేసుకున్నారు.
ఆ రమణీయ రమణీగణంలో అందరికంటె విశిష్టంగా, అత్యంత సౌందర్యంతో, మణి రత్న ముక్తాహారాలతో అంతఃపురానికే అలంకారంగా, సువర్ణకాంతి దేహంతో నిద్రించే రమణిని చూసి జానకీదేవి ఈమెయే అనుకున్నాడు.
అనుకున్న క్షణంలో ఆయన కపిప్రకృతి విజృంభించింది.
తోక నేలకు కొట్టాడు.
తోకను ముద్దుపెట్టుకున్నాడు.
గంతులు వేశాడు, గానం చేశాడు, సంతోషంగా నవ్వుతూ స్తంభాల మీద దూకడం ఆరంభించాడు.
పానశాల
No comments:
Post a Comment