Tuesday, August 25, 2026

Srikrishnudu Lokapavada Nivruttikoraku Syamantakamanini Decchuta - శ్రీకృష్ణుడు లోకాపవాద నివృత్తికొఱకు స్యమంతకమణిని దెచ్చుట

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - ఉత్తరభాగం - 
శ్రీకృష్ణుడు లోకాపవాద నివృత్తికొఱకు స్యమంతకమణిని దెచ్చుట

పరీక్షిన్మహారాజా! సత్రాజిత్తు అనే రాజు మొదట శ్రీకృష్ణునికి చెరుపుచేసి, తర్వాత నమ్రత కలవాడై చెలిమిచేసి పుత్రికనూ, స్యమంతకమణినీ అర్పించాడు.

ఆ మాటలు విని రాజు ఈ విధంగా ప్రశ్నించాడు.

శుకమహార్షీ! సత్రాజిత్తు శ్రీకృష్ణునియెడ ఏ తప్పుచేశాడు? పుత్రికనూ స్యమంతకమణినీ తన ఇష్టానుసారంగా ఏ హేతువువల్ల శ్రీకృష్ణునికి సమర్పించాడు? ఇంతకూ ఆ స్యమంతకమణి అతని కెట్లా లభించింది? నాకు సమగ్రంగా ఈ విషయాలు చెప్పుము.

శుకయోగీశ్వరుడు పరీక్షిత్తుతో ఈ విధంగా చెప్పాడు: రాజా! సత్రాజిత్తు అనే రాజు ఒకడున్నాడు. అతడు సూర్యునిభక్తుడు. అతనిసేవలకు మెచ్చుకొని సూర్యభగవానుడు స్యమంతకమణిని ప్రసాదించాడు. ఒకసారి సత్రాజిత్తు ఆ మణిని మెడలో అలంకరించుకొని ద్వారకకు వచ్చాడు. 

అతడు రెండవసూర్యునిలాగా వెలుగులు విరజిమ్ముతున్నాడు. స్యమంతకమణికాంతులకు ద్వారకావాసులకన్నులు మిఱుమిట్లుగొల్పుతున్నవి. వారు సూర్యుడు దివినుండి భువికి దిగివచ్చాడా అని సందేహించారు. వెంటనే వెళ్లి, శ్రీకృష్ణునికి ఈ విధంగా విన్నవించుకొన్నారు.

ఓ నారాయణా! దామోదరా! పద్మాక్షా! చక్రధారీ! సర్వేశ్వరా! గదాధరా! వేదోద్ధారకా! యదుకుమారా! నిత్యశుభకరా! శ్రీకృష్ణా! నీకు నమస్కారం.

దేవాధిదేవా! ఇంద్రాదులు నిన్ను చూడాలని ఉవ్విళ్లూరుతారుగదా! యాదవవంశంలో జన్మించి, నీవు స్వస్వరూపాన్ని మరుగుపరచి, లోకాల్ని కాపాడుతూ ఉన్నావు. ఇటువంటి నిన్ను చూడటానికి సూర్యుడో, బ్రహ్మదేవుడో ఎవడో ఒకడు తన వెలుగులచేత నాలుగు దిక్కులనూ కప్పిపుచ్చుతూ ఇదిగో ఈ దారినే దగ్గరకు వచ్చాడు.

తనతో ఈ విధంగా చెప్పిన ఆ మందబుద్ధుల్ని చూచి శ్రీకృష్ణుడు నవ్వుకొన్నాడు. వారితో వచ్చినవాడు స్యమంతకమణి ధరించిన సత్రాజిత్తు గానీ సూర్యుడు కాదని చెప్పాడు. తర్వాత సత్రాజిత్తు సకలసంపదలు కలిగి, శుభకార్యాలు జరిగే తన గృహానికి వెళ్లాడు. 

స్యమంతకమణిని తన దేవతామందిరంలో(దేవుని ఇంటిలో) బ్రాహ్మణులచేత నెలకొల్పాడు. ఆ మణి ప్రతిరోజూ నూటఅరవై మణుగుల బంగారాన్ని పుట్టిస్తుంది.

రాజా!, స్యమంతకమణి పూజింపబడుతుండే రాజ్యంలో వ్యాధులు, గ్రహపీడలు, వివిధవంచకులు, మృత్యువు, క్షామం - వీటివల్ల కల్గే భయం ఉండదు.

శ్రీకృష్ణుడు యాదవరాజయిన ఉగ్రసేనునికి, స్యమంతకమణిని ఇమ్మని సత్రాజిత్తును అడిగాడు. సత్రాజిత్తు ధనాశతో మణిని ఈయకపోతే ఏ కీడు కలుగుతుంది?(కలుగదని అతని భావం) అని అనుకొని శ్రీకృష్ణునితో 'నే నియ్యను పో' అన్నాడు.

తర్వాత

సత్రాజిత్తుతమ్ముడు ప్రసేనుడు. కుతూహలంతో స్యమంతకమణిని మెడలో ధరించి, జంతువుల్ని వేటాడటానికి అడవికి వెళ్లాడు. అక్కడ ఒక సింహం అతణ్ణి చంపి, మణిని ఎత్తుకొని పారిపోయింది. జాంబవంతుడు ఆ సింహాన్ని సంహరించి, దగ్గరకు వెళ్లి, దిగంతాల దాకా వెలుగులు విరజిమ్ముతున్న ఆ స్యమంతకమణిని చూచాడు.

రాజా! జాంబవంతుడు ఆ మణిని తీసుకొనిపోయి సమీపంలో ఉన్న గుహలో ప్రవేశించాడు. దాన్ని తన ప్రియపుత్రునికి ఆటబంతిగా చేశాడు.

(కొన్ని ప్రతులలో “తన కూరిమిసుతకును” అనే పాఠం కనబడుతున్నది; అప్పుడు జాంబవంతుడు తన పుత్రికకు స్యమంతకమణిని ఆటబంతిగా చేశాడని చెప్పాలి. ఇది ఇతరాంధ్రకావ్యాల సాక్ష్యానికి వ్యతిరేకం. ఎర్రాప్రగడ హరివంశంలో” ... తన తనయుడు శిశువు సుకుమారుండను వానిచేతి కాడ మానికంబును నిచ్చి...” అని ఉన్నది. దీనినిబట్టి జాంబవంతుడు తన కుమారునకే స్యమంతకమణిని ఆటబంతిగా చేశాడని స్పష్టమవుతున్నది.

సంస్కృతభాగవతంలో కూడా “సో
పి చక్రే కుమారస్య మణిం క్రీడనకం బిలే” అని ఉన్నది. జాంబవంతుడు బిలంలో మణిని కుమారునకు క్రీడాసాధనంగా చేశాడని దీని కర్థం. కాబట్టి “తన కూరిమి సుతునకు” అనే పాఠాన్ని ఇక్కడ గ్రహించడమైంది.)

తర్వాత సత్రాజిత్తు తన తమ్ముడు ప్రసేనుడు కనపడకపోవటంచేత దుఃఖిస్తూ

“మా తమ్ముడు స్యమంతకమణిని మెడలో ధరించి, అరణ్యంలో సంచరిస్తుండగా ఆ మణికొరకు శ్రీకృష్ణుడు అతణ్ణి పట్టుకొని చంపాడు. అతనికి నీతినీ, న్యాయాన్నీ పాటించే బుద్ధిలేదు” అని సత్రాజిత్తు నిందవేశాడు. ఆ నింద శ్రీకృష్ణుని చెవినిబడింది. అతడు “నే నే తప్పూ చేయలేదు. కానీ నాపై పడిన ఈ అపవాదును పోగొట్టుకోవటం ఎట్లా?”

అని యుక్తియుక్తంగా ఆలోచించి

తనకు సంబంధించిన వారందరూ ప్రసేనుడు వెళ్ళిన దారిని చూపగా శ్రీకృష్ణుడు ఆలోచిస్తూ ప్రయాణించి చివరకు అడవికి వచ్చాడు. అక్కడ భూమిమీద పడిపోయిన ఒక గుర్రాన్నీ, ప్రసేనుణ్ణీ, అతణ్ణి చంపిన సింహాన్నీ, సింహాన్ని చంపి జాంబవంతుడు చేరిన గుహనూ చూచాడు.

శ్రీకృష్ణుడు తనవెంట వచ్చిన వారినందరినీ గుహవాకిట్లో నిలిపాడు. మహామహిమ కలిగినవాడు కాబట్టి, తెగువతో తానొక్కడే గుహలో ప్రవేశించాడు. దానినిండా చిమ్మచీకట్లు క్రమ్ముకొన్నాయి. నేల చదునుగా లేదు. విరివిగా ఉండి, భయం పుట్టించే ఆ గుహ నడిమికి వెళ్లి అక్కడ ఒక బాలుని కెదురుగా వ్రేలాడగట్టిన స్యమంతకమణిని కృష్ణుడు చూచాడు. అతడు దాన్ని అపహరించాలని నిర్ణయించుకొని

శ్రీకృష్ణుడు మెల్లగా అడుగులు వేస్తూ, ఆ బాలునిదగ్గరకు వచ్చాడు. అతణ్ణి చూచిన దాది గుండెలదిరి, వణకు ఎక్కువై భయంతో అరుపులు పెట్టింది.

దాదిఅరుపు విని, జాంబవంతుడు వచ్చాడు. అతడు శ్రీకృష్ణుణ్ణి చూచి, తన అధిపతి అని గుర్తించలేకపోయాడు. సామాన్య మానవుడు అని అనుకొన్నాడు. అనుకొని శ్రీకృష్ణునితో ఆ గుహలో కయ్యం చేశాడు.

మాంసంకోసం పోరాడే డేగలమాదిరిగా శ్రీకృష్ణజాంబవంతులు ఒకరినొకరు జయించాలనే వాంఛలు కలిగి, ఆయుధాలతో, వృక్షాలతో, చేతుల్తో ఇరవైయెనిమిది రోజులు పోరాడారు.

యుద్ధంలో కత్తులూ, చెట్లూ విరిగి నిరాయుధులయినప్పటికీ, శ్రీకృష్ణజాంబవంతులు శౌర్యాధిక్యంవల్ల వెనుకకు తగ్గలేకపోయారు. వారు పిడుగులవంటి పిడికిటిపోటులే ఆయుధాలుగా యుద్ధం చేయటానికి పూనుకొన్నారు.

శ్రీకృష్ణుడూ, జాంబవంతుడూ అహంకారం అతిశయింపగా, విజయవ్యామోహంతో, ఒకరినాకరు పిడికిళ్లతో పొడుచుకొంటూ అహోరాత్రాలు పోరాడారు. శ్రీకృష్ణుని పిడికిటి గ్రుద్దులకు జాంబవంతుడు బలం కోల్పోయాడు. నిండు అలసట కలిగిన అతని శరీరావయవాలన్నీ నజ్జు నజ్జయ్యాయి. అతడు భయపడి శ్రీకృష్ణునితో ఈ విధంగా అన్నాడు.

దేవా! నీవు ఆదిపురుషుడవనీ; సర్వేశ్వరుడవనీ, విష్ణుమూర్తివనీ, మహామహిముడవనీ నాకు తెలుసు. సమస్త జీవరాశికీ ప్రాణం ప్రతాపం, ధైర్యం, బలం నీవే. ఈ ప్రపంచాన్ని పుట్టించే బ్రహ్మనూ, పోషించే విష్ణువునూ నశింపజేసే మహేశ్చరునీ నీవే సృష్టిస్తావు, పోషిస్తావు, నాశం చేస్తావు. నీవే పరమాత్మవు. నీవే జీవాత్మవు.

(ప్రపంచాన్ని సృష్టించే బ్రహ్మనూ, పోషించే విష్ణువునూ, నాశంచేసే శివుణ్ణీ శ్రీకృష్ణుడే పుట్టించి, పెంచి, నశింపజేస్తాడని జాంబవంతుడు ప్రతిపాదించాడు. అతడు శ్రీకృష్ణుణ్ణి పరబ్రహ్మంగా భావించాడు. 

లోకాలకు సృష్టిస్థితిసంహారాలు గావించే వారు త్రిమూర్తులు. వారిని సృష్టించి, భరించి, నశింపజేసేది పరబ్రహ్మం. అనగా అది ఏకం. సర్వశక్తిమంతం. నిరుపమానం.)

మహాత్మా! రామావతారంలో నీవు బాణాగ్నిచే సముద్రాన్ని ఇంకించి కట్ట కట్టావు. ప్రతాపకాంతులచే రాక్షసుల గర్వాంధకారాన్ని పారదోలావు. ఏనుగు పద్మాలను తెగత్రెంచినట్లుగా రావణునితలలను ఖండించావు. 

శాశ్వతంగా లంకారాజ్యానికి విభీషణుణ్ణి పట్టంగట్టావు. కరుణించి నన్ను నీదాసునిగా చేశావు. నీవు అపారమయిన దయ కలవాడివి. నేను పొరపాటున తప్పు చేశాను. దాన్ని మరచి, మన్నించుము.

ఈ రీతిగా ఉత్తమభక్తుడైన జాంబవంతుడు స్తుతించాడు. శ్రీకృష్ణుడు బాధను నివారించటానికి అతని శరీరాన్ని నిమిరి మంద్ర కంఠస్వరంతో ఈ విధంగా అన్నాడు.

భల్లూకరాజా! ఈ స్యమంతకమణి మాచేతికి చిక్కిందని అజ్ఞానులు మాకు నింద అంటగట్టారు. మేము ఆ నిందను తొలగించుకొనటానికి నీ నివాసమయిన గుహకు వచ్చాము.

శ్రీకృష్ణుడు చెప్పిన మాటలు విని జాంబవంతుడు సంతోషించాడు. అతడు స్యమంతకమణినీ, కన్యారత్నమయిన తన పుత్రికను జాంబవతినీ, శ్రీ కృష్ణునికి కానుకగా ఇచ్చాడు.

ఇది జరగటానికి ముందు ద్వారకనుండి శ్రీకృష్ణునివెంట వచ్చినవారు పన్నెండురోజులు గుహవాకిట్లో ఎదురుచూచారు. శ్రీకృష్ణుడు ఎన్నాళ్లకూ రాకపోయేసరికి వారు విసిగి, దుఃఖించి ద్వారకకు వెళ్లిపోయారు. అక్కడ దేవకీ, వసుదేవుడూ, రుక్మిణీ, మిత్రులూ, చుట్టపక్కాలూ; దాయాదులూ శ్రీకృష్ణుడు గుహలో ప్రవేశించి చిక్కుకొనిపోయా డని విచారించి

ఎవ్వరు చొరరాని ఈ గుహనుండి బయటబడి శ్రీకృష్ణుడు ఈ వేళ ద్వారకాపురి చేరాలని కోరి, పౌరులు జట్టులు కట్టి, క్షేమకర మార్గానికి చేర్చేదీ, శివుణ్ణి సంతోషపెట్టేదీ అయిన దుర్గాదేవిని పూజించారు.

ఆందోళన పడుచున్న మనస్సుతో, దుఃఖంతో ద్వారకానివాసులు పార్వతిని సేవించారు. ఆ దేవి వారితో "శ్రీకృష్ణుడు కన్యామణి అయిన జాంబవతితో, స్యమంతకమణితో సంతోషిస్తూ తిరిగి వస్తాడు” అని పలికింది.

తన ప్రయత్నం ఫలించి, శత్రువులు భయపడుతూండగా శ్రీకృష్ణుడు స్యమంతకమణితో, జాంబవతి అనే కన్యామణితో ద్వారకకు వచ్చాడు.

స్యమంతకమణితో, జాంబవతితో కూడి వచ్చిన శ్రీకృష్ణుణ్ణి చూచి ద్వారకావాసులు - మృతిచెందినవాడు బతికి వచ్చినట్లుగా భావించి, వేడుకలతో, వినోదాలతో పరమానందం పొందారు.

శ్రీకృష్ణుడు పరాక్రమంచేత జాంబవతిని స్వీకరించాడు. తర్వాత సత్రాజిత్తును కొలువుకూటానికి రప్పించి, జరిగిన కథంతా చెప్పి అతనికి స్యమంతకమణి నిచ్చాడు. సత్రాజిత్తు సిగ్గుతో మణిని తీసుకొని చేసిన తప్పునకు బాధపడ్డాడు. బలవంతుడైన శ్రీకృష్ణునితోడి వైరానికి భయపడ్డాడు. అతడు ఇంటికి వెళ్లి

శ్రీకృష్ణుడు పాపాత్ముల పాపాలను పరిహరించే సామర్థ్యం కలిగినవాడు. అటువంటి వానిమీద తప్పుచేశా డని నిందవేసే పాపిష్ఠుని పాపానికి హద్దు ఉంటుందా? (అపారమైన ఆ పాపం పోనేపోదు అని అర్థం.)

మితి తెలీకుండా మాట్లాడి నేను ఎందుకు శ్రీకృష్ణునిమీద అసత్యమయిన నిందారోపణం చేశాను? నేను పాపిని. ధనాశాపరుణ్ణి. దుష్టహృదయుణ్ణి. దురహంకారిని. దుర్బుద్ధిని. ఈ అకార్యానికి కారణమయిన ఈ శరీరంవల్ల ఇంకేమి ప్రయోజనం? ఏ విధంగా ఈ పాపంనుండి విముక్తి పొందుతాను? ఏ విధంగా శ్రీకృష్ణుడు సంతుష్టుడై దయతో నన్ను రక్షిస్తాడు?

స్యమంతకమణినీ, కూతురునూ ఇచ్చి శ్రీకృష్ణుని పాదాలు పట్టుకొంటే నేను బతికి బట్టకట్టవచ్చు. అతడు కూడా సంతోషిస్తాడు. ఇదే ఉత్తమోపాయం. ఇది నిజం. ఇంకొకవిధంగా లక్ష్యం సిద్ధింపదు.

సత్రాజిత్తు ఇంటిలో ఏకాంతంగా ఉండి, స్వబుద్ధితో బహుముఖంగా ఆలోచించి, తాను చేసిన నిర్ణయం సందర్బోచితమయిన నీతి అని నిశ్చయించుకొన్నాడు. తర్వాత - భక్తుల ఆపదలను తొలగించేవాడూ, స్త్రీల హృదయాల్ని దోచుకొనేవాడూ, రాక్షసరాజుల్ని మట్టుపెట్టేవాడూ అయిన శ్రీకృష్ణునికి స్యమంతకమణినీ, సత్యభామనూ సమర్పించాడు.

పద్మనేత్రుడూ, మహాకీర్తి సంపన్నుడూ, నాశరహితుడూ అయిన శ్రీకృష్ణుడు రాజు లనేకులు కొనియాడే సద్గుణాలూ, సత్ప్రవర్తనమూ అనే లక్షణాలతో ప్రకాశించేదీ, పాతివ్రత్యం మొదలైన వానియందు కోరిక కలదీ, చంద్రుణ్ణి మించిన ముఖం కలదీ అయిన సత్యభామను వివాహమాడాడు.

సూర్యుడు స్యమంతకమణిని నీకు ఇచ్చాడు. మాకూ చాలామణులు ఉన్నాయి. కన్యారత్నమయిన సత్యభామ ఒకతే మాకు చాలు - అని చెప్పి, శ్రీకృష్ణుడు సత్రాజిత్తుకు తిరిగి మణిని ఇచ్చాడు.

కుంతీదేవితో కూడా పాండవులు వారణావతంలో లక్కయింటిలో కాలిపోయారని శ్రీకృష్ణుడు విన్నాడు. అతడు అన్ని విషయాలూ తెలిసినవాడే అయినప్పటికీ బలరామునితో కలసి హస్తినాపురానికి వచ్చాడు. అక్కడ కృపుడు, విదురుడు, గాంధారి, భీష్ముడు, ద్రోణుడు మొదలయిన వారినీ చూచి, వారి శోకాన్ని పోగొట్టేమాటలు పలుకుతూ ఉన్నాడు. అప్పుడు

శతధన్వుడు సత్రాజిత్తుని జంపి మణి నపహరించుట





No comments:

Post a Comment

Srikrishnudu Indraprastha Purambuna Karugudenchuta - శ్రీకృష్ణుడు ఇంద్రప్రస్థ పురంబున కరుగుదెంచుట

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - ఉత్తరభాగం -  శ్రీకృష్ణుడు ఇంద్రప్రస్థ పురంబున కరుగుదెంచుట ఒకనాడు శ్రీకృష్ణుడు పాండవులను చూడాలని నిశ్చయించి, సాత...